ఏమి రాజకీయాల్రా బాబూ : చైనాపై అమెరికా పెద్దన్న ధ్వజం – విశ్వగురువు నరేంద్రమోడీ లొంగుబాటు !!

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు బెదిరించి లొంగదీసుకోవాలన్న ఎత్తుగడ. మరోవైపు జనం ముందు శత్రువు అంటూనే చైనా సంతుష్టీకరణ.ఎందుకిలా జరుగుతోంది ? ” ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నరేంద్రమోడీ ఆపివేయగలిగారు. అమెరికా, రష్యా అధినేతలను సైతం శాసించగలిగిన పలుకుబడి కలిగిన విశ్వగురువుగా ఎదిగారు, ప్రపంచ నేతల్లో పలుకుబడి ఎక్కువ కలిగిన నేతగా ఉన్నారు.” మోడీ గురించి ఇలాంటి ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. జనం కూడా నిజమే కదా అని వింటున్నారు, మేము సైతం తక్కువ తిన్నామా అన్నట్లుగా వాటిని ఇతరులకు ఉచితంగా పంచుతున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి కష్టం లేకుండానే పట్టాలు పొందుతున్నారు.ఇక తాజా విషయానికి వస్తే చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్‌ వాహనాలు,కంప్యూటర్‌ చిప్స్‌, వైద్య ఉత్పత్తులపై అమెరికా సర్కార్‌ వందశాతం వరకు దిగుమతి సుంకాన్ని విధించి వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తున్నాం కాసుకోండి అంటూ ఒక సవాల్‌ విసిరింది. మరి అదే అమెరికా మెడలు వంచారని, దారిలోకి తెచ్చుకున్నారని చెబుతున్న నరేంద్రమోడీ ఏం చేశారు ? ఇప్పటి వరకు మనదేశం విదేశీ విద్యుత్‌ వాహనాలపై రకాన్ని బట్టి 70 నుంచి 100శాతం వరకు విధిస్తున్న దిగుమతి సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు. అయితే చైనా కంపెనీలతో సహా ఎవరైనా 50 కోట్ల డాలర్ల మేరకు ఆ వాహనరంగంలో మనదేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఉత్పత్తి ప్రారంభించేంత వరకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ఎనిమిది నుంచి 40వేల వరకు వాహనాలను ప్రతి కంపెనీ నేరుగా దిగుమతులు చేసుకోవచ్చు. వాహనాల తయారీలో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న విడిభాగాల వినియోగం ప్రస్తుతం 30 నుంచి 40శాతం వరకు ఉందని, నూతన విధానం వలన మరింత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతుండగా రానున్న రోజుల్లో చైనా వాహనాలతో భారత మార్కెట్‌ నిండిపోతుందని ఆ రంగ నిపుణులు హెచ్చరిక, ఆందోళన వెల్లడించారు. అమెరికా మెడలే వంచగలిగిన నరేంద్రమోడీ చైనా విషయంలో ఇప్పుడున్న పన్నును కొనసాగించకుండా ఇలా ఎందుకు లొంగిపోయినట్లు ? అమెరికా పెద్దన్న బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తుంటే, విశ్వగురువు తనకు నచ్చని మాట సంతుష్టీకరణకు ఎందుకు పూనుకున్నట్లు ?


నవంబరు నెలలో జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌కు ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ చుక్కలు చూపిస్తున్నాడు.చైనా నుంచి దిగుమతులు అంటే అమెరికన్లకు ఉపాధి తగ్గటమే. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో విద్యుత్‌ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఉన్నాయి గనుక అక్కడి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనదేశంలో పదేండ్లలో మోడీ అలాంటి కార్ల తయారీని ప్రోత్సహించటం, పరిశోధనా, అభివృద్ధి రంగాలను పట్టించుకోలేదు. ఈ కారణంగా మనదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం, దిగుమతులకు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చాయి. ఎన్నికలలో వాటి నుంచి నిధులు కావాలి గనుక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే వాటిని సంతుష్టీకరించేందుకు విద్యుత్‌ వాహనాల దిగుమతి, తయారీ విధానంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో అంతకు ముందే బిజెపికి గణనీయమొత్తాలను సమర్పించుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు తరువాత బహుశా టెంపోలలో నోట్లను రవాణా చేసి ఉంటాయి. దిగుమతుల కారణంగా ఉపాధి తగ్గినా లేక నిరుద్యోగం ప్రాప్తించినా అమెరికా సమాజం సహించదు. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు, మతం, కులం, ప్రాంతం, విద్వేషం, తప్పుడు సమాచారం తదితర అనేక మత్తుమందులను ప్రయోగిస్తూ అసలు సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించటంలో ఎవరు అధికారంలో ఉన్నా సర్వసాధారణమైంది. జనం కూడా అలవాటు పడ్డారు.గుళ్లు, మసీదు, చర్చీలు ఇతర ప్రార్ధనామందిరాలకు వెళ్లి రోజంతా వేడుకోవటానికి కానుకల సమర్పణ, కొబ్బరి కాయలు కొట్టేందుకు సిద్దపడుతున్నారు గానీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటానికి ఆసక్తి చూపటం లేదు.


అమెరికా పెంచిన పన్నులను రద్దు చేయాలని లేదా తాము కూడా ప్రతిచర్య తీసుకుంటామని చైనా స్పందించింది.చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలు,అల్యూమినియం, సెమీకండక్టర్లు,బ్యాటరీలు, కొన్ని రకాల ఖనిజాలు, సోలార్‌ సెల్స్‌,క్రేన్ల వంటి వాటి మీద దిగుమతి పన్ను పెంపు కారణంగా కనీసం 1,800కోట్ల డాలర్ల మేర అమెరికా వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆ కారణంగా దిగుమతులు నిలిపివేస్తే ప్రత్యామ్నాయం చూపే పరిస్థితిలో అమెరికా లేదు. వాటినే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తే భారం ఇంకా పెరుగుతుంది. గత ఏడాది చైనా నుంచి 427 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను దిగుమతి చేసుకున్న అమెరికా 148బి.డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేసింది.గతంలో చైనా కూడా ప్రతిచర్యల్లో భాగంగా పన్నులు పెంచింది. చైనా వస్తువుల మీద ఆధారపడకుండా స్వంతంగా తయారు చేసుకోవాలని, తద్వారా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని, తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలనే సంకల్పం చెప్పుకున్న అమెరికా, ఐరోపా దేశాల సరసన మనదేశం కూడా ఉంది.
అనేక దేశాలతో మనదేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టిఏ) చేసుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి పరస్పరం లబ్ది పొందేందుకు వీటిని చేసుకుంటున్నారు. విదేశాలు తిరిగి మనవస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచానని, దానితో పాటు పలుకుబడి కూడా పెరిగిందని నరేంద్రమోడీ పదే పదే చెబుతారు. కానీ గత ఐదు సంవత్సరాల వివరాలను చూసినపుడు ఎగుమతుల అంశంలో మన పలుకుబడి పప్పులు ఉడకలేదు. 2019-2024 ఆర్థిక సంవత్సరాలలో ఎఫ్‌టిఏలు ఉన్న దేశాలకు మనం ఎగుమతి చేసిన వస్తువుల విలువ 107.2 నుంచి 122.72 బిలియన్‌ డాలర్లకు(14.48శాతం) పెరిగితే, దిగుమతులు 136.2 నుంచి 187.92 బిలియన్‌ డాలర్లకు ( 37.97శాతం) పెరిగినట్లు జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడించింది. ఎగుమతులపై మోడీ ప్రచార బండారాన్ని బయట పెట్టింది. మొత్తంగా చూసుకున్నపుడు ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో 1.8శాతంతో మనదేశం 17వదిగా ఉండగా దిగుమతుల్లో 2.8శాతం వాటాతో ఎనిమిదవ స్థానంలో ఉంది. అంతా బాగుంది అని చెప్పిన 2023-24లో మన వస్తు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 3.11శాతం తగ్గి 437.1బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేయటం తగ్గటంతో గతేడాది 5.4శాతం తగ్గి 677.2బి.డాలర్లుగా ఉన్నాయి.


ట్రంప్‌ మాదిరి చైనా పట్ల కఠినంగా ఉండాలని జో బైడెన్‌ కూడా జనానికి కనిపించేందుకు తాజా చర్యకు పూనుకున్నాడు. గతనెలలో రాయిటర్స్‌ జరిపిన ఒక సర్వేలో ట్రంప్‌ కంటే బైడెన్‌ ఏడుపాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అయితే 2020లో చైనాతో ట్రంప్‌ కుదుర్చుకున్న ఒప్పందంతో ఎలాంటి ఫలితమూ రాలేదు. పరస్పరం సహకారం పెంచుకోవాలని చెబుతూనే దిగుమతి పన్నుల పెంపుదలకు సాకుగా తాము అవసరాలకు మించి హరిత ఉత్పత్తులు చేస్తున్నామని లేనిపోని మాటలు చెబుతున్నదని చైనా విమర్శించింది. ఇది రక్షణాత్మక చర్యలకు పూనుకొనేందుకు చేస్తున్న ప్రచారమని, తనను తాను దెబ్బతీసుకోవటమేనని, గతంలో వచ్చిన అవగాహనకు భిన్నమని, రెండు దేశాల మార్గంలో గుంతలు తవ్వవద్దని హితవు చెప్పింది. బైడెన్‌ ఎన్నికల కోసం రాజకీయంగా తీసుకున్న చర్య తప్ప తమ మీద పెద్దగా ప్రభావం పడదని కూడా వ్యాఖ్యానించింది.2023 నుంచి ఈ ఏడాది మార్చినెల వరకు అమెరికా సమాచారాన్ని చూస్తే జర్మనీ నుంచి 689 కోట్ల డాలర్లు, దక్షిణ కొరియా నుంచి 622 కోట్ల డాలర్ల విలువగల విద్యుత్‌ బాటరీల వాహనాలను కొనుగోలు చేసిన అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 38 కోట్ల డాలర్ల విలువగలవే అని ఒక పత్రిక పేర్కొన్నది. బైడెన్‌ నిర్ణయం ప్రకారం విద్యుత్‌ వాహనాలపై పన్ను 25 నుంచి 102.5శాతానికి పెరిగింది. బాటరీలు, వాటి విడి భాగాలపై 7.5శాతం నుంచి 50శాతం వరకు పెంచారు.నౌకల నుంచి సరకులను తీరానికి చేర్చే క్రేన్లపై ఇప్పటి వరకు పన్నులేదు, వాటి మీద 25శాతం, సిరంజ్‌లు, సూదులపై 50శాతం, రక్షణకు ఉపయోగించే వైద్య కిట్లపై 25శాతం విధించారు. రానున్న సంవత్సరాల్లో ఈ పన్నులు ఇంకా పెరుగుతాయి.ఈ పెరుగుదల అంతా అమెరికా వినియోగదారుల మీదనే భారం మోపుతుంది.చైనా అనుచిత వ్యాపారాన్ని అడ్డుకొనేందుకే ఈ చర్యలని అమెరికా సమర్ధించుకుంటున్నది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే సాకుతో దేశీయంగా తయారైన వాహనాల కొనుగోలుదార్లకు అమెరికా ప్రభుత్వం ఏడున్నరవేల డాలర్లు రాయితీ ఇస్తుంది. అయితే ఇటీవల అలాంటి వాహనాల్లో చైనా విడిభాగాలు ఏవైనా ఉంటే ఆ రాయితీ వర్తించదని ప్రకటించారు.


మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో అమెరికా మొదటి స్థానంలోకి వచ్చింది. దాంతో మీడియాలో కొందరు ఇంకేముంది చైనాతో మనకు పనేముంది, సరఫరా గొలుసు నుంచి బయటపడ్డాం అన్నట్లుగా సంబరాన్ని ప్రకటించారు. కానీ తిరిగి చైనా మొదటి స్థానానికి వచ్చినట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఇదంతా సరిహద్దు వివాదంలో చైనా సంగతి తేలుస్తాం, బుద్దిచెబుతాం అనే పటాటోపం మధ్యనే జరిగింది.2023-24 సంవత్సరంలో రెండు దేశాల వాణిజ్యం 11,840 కోట్లు కాగా అమెరికాతో 11,380 కోట్ల డాలర్లు ఉంది.కౌంటర్‌పాయింట్‌ అధ్యయనం ప్రకారం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకం(పిఎల్‌ఐ) పధకం ఉన్నప్పటికీ మనదేశంలో చైనా బ్రాండు ఫోన్లు గణనీయమార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.ఈ పధకం వలన ఆపిల్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు లబ్దిపొందినప్పటికీ మార్కెట్లో వాటి వాటా దానికి తగినట్లుగా పెరగలేదని హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. ఇతర బ్రాండ్లతో ఉత్పత్తి కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, ఎగుమతులు తప్ప భారతీయ బ్రాండ్లకు రూపకల్పన, అభివృద్ధి జరగలేదు.ఫార్మారంగంలో కొన్నింటిని పిఎల్‌ఐ కారణంగా మనదేశంలోనే తయారు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మన పరిశ్రమలు చైనా మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దిగుమతుల నిరోధానికి ఈ పధక చికిత్స పనిచేయలేదు. గతేడాది మనదేశం చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల్లో చైనా నుంచి 43.9శాతం ఉన్నాయి. కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు దుడ్డులా ఎదగాలి అంటే కుదరదన్న సామెత తెలిసిందే. గడచిన పది సంవత్సరాల్లో అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పెరిగింది తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలన్న జ్ఞానం పాలకులకు రాలేదు.గతమెంతో ఘనం అనే పిచ్చిలోనే కొట్టుకుంటున్నారు. జనాన్ని ముంచుతున్నారు. జిడిపిలో మనకంటే చైనా ఐదు రెట్లు పెద్దది. మనం 0.75శాతం పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే అక్కడ 3.5శాతం ఉంది. దీని అర్ధం మనకంటే చైనాలో 25రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రొఫెసర్‌ అరుణకుమార్‌ వ్యాఖ్యానించారు.మన విశ్వవిద్యాలయాల్లో రాజకీయ, అధికార జోక్యం ఎక్కువగా ఉంది తప్ప పరిశోధన వాతావరణాన్ని సృష్టించలేదన్నారు. ఏవైనా నిధులు ఉంటే గోమూత్రం, పేడలో బంగారం, ఇతరంగా ఏమున్నాయో పరిశోధనలు చేయిస్తున్నారు.చైనా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకం పెంపు పర్యవసానాలు మనదేశం మీద ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. చైనా ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా మనదగ్గరకు వచ్చిపడతాయని, మన ఎగుమతి అవకాశాలు పెరగవన్నది ఒక అభిప్రాయం. అమెరికా, ఐరోపా యూనియన్‌ దిగుమతి పన్నులు పెంచటం, దిగుమతులను తగ్గిస్తున్న కారణంగా చైనా తన వాహనాలకు భారత్‌ ఇతర దేశాల మీద ఆధారపడుతుందని కొందరి అంచనా. ఈ అంశాలను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ చైనా నుంచి పెట్టుబడులు, దిగుమతులను పెంచేందుకు వీలుగా దిగుమతి పన్ను ఎందుకు తగ్గించారన్నది వారి ప్రశ్న. కార్పొరేట్ల లాభాల కోసం సంతుష్టీకరణ తప్ప మరొకటి కనిపించటం లేదు.

అమెరికా విద్యార్థి ఉద్యమం : నాటి వియత్నాం, నేటి పాలస్తీనాకు తేడా ఏమిటి !!

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయెల్‌ మిలిటరీ రాఫా, తదితర ప్రాంతాల్లో మారణకాండను తీవ్రం చేస్తోంది. చివరకు ఐరాస తరఫున పనిచేస్తున్న సహాయసిబ్బందిని కూడా వదలటం లేదు.సోమవారం జరిపిన దాడుల్లో ఐరాస తరఫున పనిచేస్తున్న వారిలో మనదేశానికి చెందిన వ్యక్తి మరణించాడు. రాఫాలోని ఐరోపా ఆసుపత్రికి ఒక వాహనంలో ఇతరులతో కలసి వెళుతుండగా ఇజ్రాయెల్‌ మిలిటరీ జరిపిన దాడిలో అతడు మరణించగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 35వేల మందికి పైగా మరణించారు. వారిలో 70శాతంపైగా పిల్లలు, మహిళలు ఉన్నారు.పాలస్తీనియన్ల ఊచకోత గురించి అణుమాత్రమైనా పట్టని అమెరికా, ఇతర పశ్చిమదేశాలు యూదు వ్యతిరేకత పెరుగుతోందని మాత్రం గుండెలు బాదుకుంటున్నాయి. ఆ సాకుతో ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. కొద్ది వారాల క్రితం అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలోనే ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు కెనడా, ఐరోపా ముఖ్యంగా బ్రిటన్‌కు విస్తరించింది.అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తమను గుర్తించి వీసాలను రద్దు చేసినా, అమెరికా నుంచి వెనక్కు తిప్పిపంపినా నష్టపోతామనే భయమే దీనికి కారణంగా ఉన్నట్లు కొందరు చెప్పారు.రఫా మీద దాడులను అంగీకరించేది లేదన్నది అమెరికా ఉత్తుత్తి బెదిరింపు మాత్రమే అని తేలిపోయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు ఆ నగరం పరిసరాలలో ఉన్న 14 లక్షల మంది జనాభాలో సగం మంది దాడులను తప్పించుకొనేందుకు ఇతర ప్రాంతాలకు పారిపోయారు.


ప్రతి మతంలోనూ దురహంకారులు ఉంటారు. దానికి యూదు అతీతం కాదు.ఐరోపాలో ముందుకు తెచ్చిన యూదు వ్యతిరేకత వారిని అష్టకష్టాలపాలు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు తీసింది. ఆ దుర్మార్గాన్ని యావత్‌ ప్రపంచం ఖండించింది. కానీ ఇప్పుడు అదే మత ప్రాతిపదికన ఏర్పడిన ఇజ్రాయెల్‌ పాలకుల అరబ్‌ లేదా ముస్లిం వ్యతిరేకతను అనేక పశ్చిమదేశాలు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి.పాలస్తీనా సాగిస్తున్న మారణకాండకు మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించి మానవహక్కులను కాపాడాలని కోరుతున్నారే తప్ప యూదు వ్యతిరేకతను ముందుకు తీసుకురాలేదు. ఇజ్రాయెల్‌ పాలకులు యూదు దురహంకారులు తప్ప అక్కడ ఉన్న సామాన్య పౌరులందరూ అలాంటి వారే అనటం లేదు. ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనా ఏర్పడకుండా అడ్డుకుంటున్నది అక్కడి పాలకులు, యూదు ఉన్మాదం తలకెక్కించిన మిలిటరీ, వారిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పశ్చిమదేశాలు తప్ప పౌరులు కాదు. పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, తూర్పుజెరూసలెం ప్రాంతాలలోని పౌరులపై దశాబ్దాల తరబడి సాగిస్తున్న దమనకాండ గురించి తన పౌరులకు బోధ చేసేందుకు ఎన్నడూ ఒక చట్టం చేయని అమెరికా పార్లమెంటు దిగువసభ ఇటీవల ” యూదు వ్యతిరేక జాగృతి బిల్లు ” తెచ్చింది. దానికి 91 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా 320 మంది మద్దతు తెలిపారు.యూదు వ్యతిరేకత అమెరికాలో ఉన్న యూదు విద్యార్థుల మీద ప్రభావం చూపుతుందని చట్టం ప్రకటించింది. దాన్ని సెనెట్‌ కూడా ఆమోదిస్తే అధ్యక్షుడి ఆమోదంతో చట్టంగా మారుతుంది. ఒకసారి అది ఉనికిలోకి వస్తే వివాదాస్పద యూదు వ్యతిరేక నిర్వచనాలతో విద్యార్థులు, ఇజ్రాయెల్‌ దమనకాండపై గళమెత్తే ఇతరులను అణచివేసే అవకాశం ఉంది. ఈ బిల్లును సెనెట్‌ ఆమోదించకూడదని అనేక మంది కోరుతున్నారు. విద్యార్థులు చేస్తున్నది మరొక యుద్ధ వ్యతిరేక ఉద్యమం కాగా దాన్ని యూదు వ్యతిరేకమైనదిగా పశ్చిమదేశాల మీడియా చిత్రించటం పాలకవర్గాల కనుసన్నలలో నడవటం తప్ప మరొకటి కాదు.


గతంలో వియత్నాంపై జరిపిన దురాక్రమణ, హత్యాకాండ, అత్యాచారాలకు నిరసనగా 1968లో అమెరికా యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. చివరకు బతుకుజీవుడా అంటూ అమెరికన్లు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. అక్కడ కనీసం 30లక్షల మంది అమాయక పౌరులను అమెరికన్లు హతమార్చారు. గతంలో వియత్నాంలో మాదిరి ఇప్పుడు 2024లో గాజాలో జరుగుతున్న మారణకాండలో అమెరికా ప్రత్యక్ష భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అమెరికా యువతలో పెరిగిన చైతన్యానికి ఒక నిదర్శనం. గతంలో మాదిరి జరుగుతున్నవాటిని మూసి పెట్టటం ఇప్పుడు సాధ్యం కాదు. అమెరికాలో జరుగుతున్నదాని గురించి ఒక విశ్లేషకుడు ఒక సినిమా కథతో పోల్చాడు. మోర్ఫస్‌ అనే చిత్రంలో ఒక వ్యక్తి తన వద్దకు వచ్చిన ఆశ్రితుడికి ఎరుపు, నీల వర్ణపు రంగుల మాత్రలు ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమంటాడు.ఎరుపు రంగుదాన్ని సేవించిన వారికి తమ చుట్టూ జరుగుతున్న భయంకర అంశాలన్నీ కనిపిస్తాయి. అదే నీలి రంగు మాత్ర వేసుకుంటే నిజంగా జరుగుతున్నదాన్ని మరిపింపచేస్తుంది. ఆ సినిమాలో ఆశ్రితుడు ఎర్ర రంగు మాత్ర తీసుకున్నట్లుగా ఇప్పుడు అమెరికా సమాజంలోని నవతరం కూడా అదే మాదిరి పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న అకృత్యాలను చూస్తున్నారని, వ్యతిరేకంగా స్పందిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ఒక్క ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటమే కాదు తమ ప్రభుత్వం అనేక చోట్ల ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో జరుపుతున్న దారుణాలను కూడా ఇప్పుడు విద్యార్థులు స్పష్టంగా చూస్తున్నారు.


అమెరికా జరుపుతున్న దారుణాలను ప్రపంచం చూస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో అమెరికన్లు వాటిని ఏ మేరకు గమనించారన్న చర్చ ఒకటి ఉంది. ఏదైనా శృతిమించితే వారు కూడా స్పందిస్తారని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. పాలస్తీనా విముక్తి కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులని అమెరికా ఎప్పటి నుంచో చిత్రిస్తున్నది.ప్రతి దేశంలో సామ్రాజ్యవాదం, నిరంకుశపాలకులు చేసింది అదే. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా సాగిస్తున్న చర్యలతో నిజానికి ఉగ్రవాదం పెరిగింది తప్ప తగ్గలేదు. అనేక మందిని ఉగ్రవాదులుగా మార్చిందంటే అతిశయోక్తి కాదు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయం జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం వివిధ దేశాలలో అమెరికా కారణంగా 45లక్షల మంది మరణించారు.వారిలో అమెరికా మిలిటరీ ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల మందిని చంపివేసింది.కనీసం 3.8కోట్ల మంది తమ నెలవులు తప్పారు. ఎమెన్‌ అంతర్యుద్ధంలో అమెరికా మద్దతు, పధకం ప్రకారం జోక్యం చేసుకున్న సౌదీ అరేబియా కారణంగా దశాబ్ది కాలంలో 2.33లక్షల మంది మరణించారు.ఐరాస కార్యాలయం 2020లో చెప్పినదాని ప్రకారం వారిలో ఆహారం, ఆరోగ్యసేవలు, మౌలిక సదుపాయాల లేమి వంటి పరోక్ష కారణాలతో మరణించిన వారు 1.31లక్షల మంది ఉన్నారు. ఇటీవలి ప్రపంచ పరిణామాల్లో సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎమెన్‌లో జోక్యానికి స్వస్తిపలికింది. సద్దాం హుస్సేన్ను తమ పలుకుబడికిందకు తెచ్చుకొనేందుకు ఇరాక్‌పై అమెరికా అమలు జరిపిన ఆంక్షల కారణంగా ఐదు లక్షల మంది పిల్లలు మరణించారని అంచనా. ఇంకా ఇలాంటి అనేక దారుణాల్లో తమ నేతల, దేశ పాత్ర గురించి విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో గుడారాల్లో తిష్టవేసి నిరసన తెలుపుతున్న విద్యార్థులు అరచేతిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేస్తున్నారు.


అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనటమే కాదు, అనేక దేశాల పాలకులను ప్రోత్సహించి లక్షలాది మంది మరణాలకు బాధ్యురాలైంది.ప్రస్తుత బంగ్లాదేశ్‌ 1971కి ముందు పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు పాక్‌ మిలిటరీ ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌ పేరుతో జరిపిన మారణకాండలో మూడు లక్షల మంది మరణించగా కోటి మంది తమ ప్రాంతాల నుంచి పారిపోవాల్సివచ్చింది.దానికి అమెరికా పూర్తి మద్దతు ఇచ్చింది.మనదేశం జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని ఓడించి బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడింది. అంతకు కొద్ది సంవత్సరాల ముందు ఇండోనేషియాలో కమ్యూనిస్టులను అణచివేసేందుకు మిలిటరీ నియంత సుహార్తోను గద్దెమీద కూర్చోబెట్టి కనీసం పదిలక్షల మందిని ఊచకోత కోయించటంలో సిఐఏ ప్రధాన పాత్ర పోషించింది. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా మిత్రపక్ష దేశాల మీద యుద్దం ప్రకటించిన హిట్లర్‌ వంటి వారిని తప్ప ప్రపంచంలో నియంతగా పేరు మోసిన ప్రతివాడినీ అమెరికా బలపరిచింది.హిట్లర్‌కు సైతం ఆయుధాలు అమ్మి తొలి రోజుల్లో మద్దతు ఇచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంతో బ్రిటన్‌ ప్రపంచాధిపత్యం అంతరించి అమెరికా రంగంలోకి వచ్చింది.అప్పటి నుంచి సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలతో సాగించిన ప్రచ్చన్న యుద్ధంలో తాము విజేతలం అని ప్రకటించుకొనే వరకు అంటే 1949 నుంచి 1989వరకు వివిధ దేశాలలో పాలకులను మార్చేందుకు అమెరికా 72 ప్రయత్నాలు చేయగా 29 సందర్భాలలో అమెరికా కుట్రలో భాగస్వాములైన వారు జయప్రదమయ్యారు. కూల్చిన వాటిలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆరు ఉన్నాయని బోస్టన్‌ కాలేజీ రాజకీయ శాస్త్ర అధ్యాపకురాలు లిండ్సే ఓ రూర్‌కే పేర్కొన్నారు. ఒక వలసవాదిగా అమెరికా దుర్మార్గం చిన్నదేమీ కాదు. ఆసియాలోని ఫిలిప్పైన్స్‌ను ఆక్రమించకొని అక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే రెండు నుంచి ఆరులక్షల మందిని జాత్యహంకారం, ఇతర కారణాలతో అమెరికన్‌ పాలకులు హత్య చేశారని అంచనా.


1968లో వియత్నాంలో దురాక్రమణ, మారణకాండలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన ఆందోళనకు, ఇప్పుడు గాజాలో జరుపుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి విద్యార్థిలోకం గళమెత్తటానికి గల పోలికలు చర్చలోకి వచ్చాయి. అప్పుడూ ఇప్పుడూ ఆందోళన కాలేజీ ప్రాంగణాల్లోనే ప్రారంభమైంది.నాడూ నేడు పోలీసులను పిలిపించి అణచివేతకు పాల్పడ్డారు.నవతరం-పాతవారి మధ్య కొన్ని సైద్దాంతిక విబేధాలు గతంలోనూ వర్తమానంలోనూ ఉన్నాయి. నిజానికి ఇవి పెద్ద అంశాలు కావు. ఫ్రెంచి వలస ప్రాంతంగా ఉన్న ఇండోచైనాను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఆక్రమించింది. అది ఓడిన తరువాత తిరిగి ఫ్రాన్సు ఆక్రమించిన వియత్నాంలో విముక్తి పోరాటం కారణంగా 1954లో స్వాతంత్య్రం వచ్చింది. ఉత్తర, దక్షిణ వియత్నాంలుగా దాన్ని విభజించారు. ఫ్రెంచి పాలకులు తప్పుకున్న తరువాత దక్షిణ వియత్నాం కేంద్రంగా అమెరికా రంగంలోకి వచ్చి ఉత్తర వియత్నాంను ఆక్రమించేందుకు, దక్షిణ వియత్నాంలో విముక్తి పోరాటాన్ని అణచేందుకు చూసింది. స్వతంత్ర పాలస్తీనాను రెండవ ప్రపంచ యుద్దం తరువాత రెండుగా చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ వెంటనే పాలస్తీనా ప్రాంతాలను పశ్చిమదేశాల మద్దతుతో అది అక్రమించి ఇప్పటి వరకు పాలస్తీనా స్వతంత్రదేశం ఏర్పడకుండా అడ్డుకుంటున్నది. నాడు వియత్నాంలో 5.36లక్షల మంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు.నేడు ఇజ్రాయెల్‌లో కొద్ది మంది ఉన్నప్పటికీ వారు దాడులలో భాగస్వాములు కావటం లేదు. వియత్నాంలో దాదాపు అరవై వేల మంది అమెరికా సైనికులు మరణించారు, మూడు లక్షలకు పైగా గాయపడ్డారు. తమ సైనికుల ప్రాణనష్టం సాధారణ అమెరికన్లను కలచివేసింది. పాలస్తీనాలో ఒక్క అమెరికనూ చావలేదు, గాయపడలేదు. అయినప్పటికీ మానవత్వానికి ముప్పు తెచ్చిన కారణంగా విద్యార్థులు వీధుల్లోకి రావటం చైతన్యానికి నిదర్శనం.రాఫాలో దాడులను అడ్డుకోవటంలో విఫలమైన తమ ప్రభుత్వం మీద విద్యార్థులు మరింతగా వీధుల్లోకి వస్తారా , ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

దొంగ డబ్బు కేసు : కేరళ బిజెపి నేతలను కాపాడుతున్న ఇడి !!

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేేరళ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌, ఇతర బిజెపి నేతల ప్రమేయంపై ఆరోపణలు ఉన్న హవాలా కేసులో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు వినోద్‌ మాథ్యూ విల్సన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ద్వారా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున దాన్ని అనుమతించవద్దని ఇడి న్యాయవాదులు కోర్టును కోరింది. ఆమ్‌ ఆద్మీనేత కోరికపై తీర్పును రిజర్వుచేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దోపిడీ, దొంగతనం వంటి ఆరోపణలతో ఈ కేసులో దాఖలైన ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌ను ఇడి కోర్టుకు సమర్పించింది. 2021లో తాము జరిపిన ప్రాధమిక దర్యాప్తు గురించి కూడా కోర్టుకు తెలిపింది.ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టును 2023లో తెరిచి దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నది. ఇప్పటికే తాము అనేక మందిని ప్రశ్నించి వారు చెప్పిన అంశాలను నమోదు చేశామని, డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అన్న అంశాలను దర్యాప్తు చేస్తున్నామని, సమగ్రంగా దర్యాప్తు జరిపి తరువాత నివేదిక సమర్పిస్తామని చెప్పింది. రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నింటి మీద తాము దర్యాప్తు జరపలేమని ఇడి వాదించింది. పిటీషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించిన అంశాలలో హవాలా మార్గం ద్వారా 2021 ఎన్నికల కోసం బిజెపికి సంబంధించిన వారు డబ్బుతెచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారని, కానీ దీని గురించి ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నదని, మూడు సంవత్సరాల తరువాత కూడా ఎలాంటి చర్యలు లేవని హవాలా గొలుసు గురించి ఉపా చట్టం కింద ఇడి మరియు ఎన్‌ఐఏ దర్యాప్తు జరపాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కోరింది.


వాద ప్రతివాదనల సందర్భంగా విచారణ జరిపిన విచారణ బెంచ్‌లోని న్యాయమూర్తి గోపీనాధ్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర్ర పోలీసు లేదా సిబిఐ వంటి సంస్థలు ఒక నేరంపై ఎఫ్‌ఐఆర్‌ సమర్పించిన తరువాత ఇడి పాత్ర ఏమిటని ప్రశ్నించారు.” సిబిఐ లేదా మరేదైనా కావచ్చు వాటి ఎఫ్‌ఐఆర్‌లను పక్కన పెట్టి దర్యాప్తు జరిపేందుకు వాటి మీద ఉన్న సంస్థ ఇడి కాదు. వారి పని రెండు అంశాలకే పరిమితం ఒకటి విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం(ఫెమా) రెండవది మనీలాండరింగ్‌ నిరోధ చట్టం(పిఎంఎల్‌ఏ). ఒక కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో అది గానీ ఇది గానీ ఉందా అన్నది, ఉంటే వాటిని ఉపయోగించటం తప్ప ఒక దర్యాప్తు సంస్థ మాదిరి దర్యాప్తు చేయటానికి ఇడి దర్యాప్తు సంస్థ కాదు.పిఎంఎల్‌ఏ కింద ఆస్తులను స్వాధీనం చేసుకోవటం లేదా పోయిన వాటిని స్వాధీనం చేసుకోవటానికి మించి సదరు చట్టంలో ఇంకా ఏమైనా ఉందా అన్నది కోర్టుకు చెప్పండి. మీరు ఉన్న దర్యాప్తు సంస్థలకు అతీతమైన ఉన్నత దర్యాప్తు సంస్థకాదు అని న్యాయమూర్తి అన్నారు.


కేరళ అసెంబ్లీ 2021ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. దాంతో పక్కనే ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి పెద్దలు కోరినంత నల్లధనాన్ని పంపారు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు మూడున్నర కోట్లుగా తేలింది ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో చెప్పనవసరం లేదు. దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో బిజెపిలో రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది అప్పుడు జరిగిన చర్చ. ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయనున్నట్లు అప్పుడు రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు.


ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నించారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు బుకాయించారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా పని చేసినట్లు ఆరోపణ. అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని తేలింది. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు.
ఈ కేసులో ఇడి వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ఇడి అరెస్టు చేసిన నిందితులు చెప్పిన అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి కేజరీవాల్‌, కల్వకుంట్ల కవిత తదితరులను అరెస్టు చేసి బెయిలు రాకుండా అడ్డుపడుతున్నది. అదే ఒక రాష్ట్ర పోలీసుశాఖ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నది. పట్టుబడిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అన్న అంశం తేల్చటానికి మూడు సంవత్సరాలు దాటినా ఇంకా దర్యాప్తు జరుపుతూనే ఉన్నామని చెప్పటం అసమర్ధత లేదా ఆ కేసులో ప్రమేయం ఉన్న బిజెపి నేతలు, వారికి నిధులు ఇచ్చిన వారిని రక్షించేందుకు వీలైనంత వరకు కాలయాపన చేయటం తప్ప మరొకటి కాదు. ఇడి కొందరి పట్ల దయగల దేవత, మరికొందరి పట్ల వేధించే దయ్యం మాదిరిగా మారిందన్నది ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాధమిక ఆధారాలు, డబ్బు రవాణా చేసిన వారి వివరాలు ఉన్నప్పటికీ ఇంత చిన్న కేసును కూడా సంవత్సరాల తరబడి పరిష్కరించలేని దుస్థితిలో ఇడి ఉందా ?


బిజెపికి అనుకూలంగా ఇడి, ఐటి పని చేయటంలో భాగంగానే త్రిసూర్‌లో తమ పార్టీ బాంకు ఖాతాలను స్థంభింపచేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విమర్శించారు. సిపిఎం ఎన్నికల పనిని దెబ్బతీసేందుకే ఇలా చేశారని అన్నారు. పార్టీకి దేశవ్యాపితంగా ఒకే పాన్‌ నంబరు ఉందని, ఆదాయపన్ను సంబంధిత వివరాలను ఆ శాఖకు సమర్పించినప్పటికీ అక్రమంగా ఐటిశాఖ తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ఖాతాను నిలిపివేసిందన్నారు.తమ ఖాతాలున్న బాంకు సిబ్బంది వేరే పాన్‌ నంబరు నమోదు చేసినకారణంగా అనవసర చర్చ ఎందుకని తాము మౌనంగా ఉన్నామని, తమ సిబ్బంది చేసిన తప్పిదాన్ని అంగీకరిస్తూ సదరు బాంకు తమకు ఒక లేఖ కూడా రాసిందని గోవిందన్‌ చెప్పారు. బాంకు తప్పిదం వెల్లడైన తరువాత కూడా తమ ఖాతాల స్థంభన కొనసాగించటం వేధింపు గాక ఏమిటని ప్రశ్నించారు. తప్పుడు పాన్‌ నంబరును ఆధారం చేసుకొని త్రిసూర్‌ జిల్లా పార్టీ కార్యదర్శిని విచారణ పేరుతో వేధించారని, పాన్‌ నంబరు గురించి వివరించినా పట్టించుకోలేదన్నారు.ఈ విచారణను మీడియా పెద్దఎత్తున సిపిఎంకు వ్యతిరేక ప్రచారానికి వాడుకుందని అన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటన చేయటాన్ని కాంగ్రెస్‌, బిజెపి నేతలు వివాదాస్పదం కావించారు. పర్యటన వివరాలను రహస్యంగా ఉంచారని, అందుకయ్యే ఖర్చును ఎవరు భరించాలో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. మిగతా రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా బిజెపిని మంచిచేసుకొనేందుకే విదేశాలకు వెళుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పర్యటన పూర్తిగా కుటుంబపరమైందని, ఖర్చంతా వారే భరిస్తారని సిపిఎ స్పష్టం చేసింది.

ఎమితిని సెపితివి కపితము : కడప, విశాఖ ఉక్కు మాటెత్తకుండా కూరగాయలు, అరటి పండ్ల కబుర్లు, రాహుల్‌పై అసత్యాలు చెప్పిన నరేంద్రమోడీ !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి, దానితో చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేనలు తబ్బిబ్బులౌతున్నాయి. పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా తిరిగి వైసిపి గెలుస్తుందా ? మూడు పార్టీల కూటమి గెలుస్తుందా అన్నది తప్ప ఎవరు గెలిచినా కొత్తగా రాష్ట్రానికి, జనానికి ఒరిగేదేమీ లేదని మోడీ మాటలతో తేలిపోయింది. చిత్రం ఏమిటంటే తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి సంవత్సరాల తరబడి బిజెపి నేతలు ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది, అనుమతులు మంజూరు చేసింది మీరు, ఆరోపణలను ఎందుకు ఒక కమిషన్‌తో విచారించటం లేదని ప్రశ్నిస్తే కేంద్రం అవసరమైన సమాచారం అంతా సేకరిస్తున్నది త్వరలో చర్య ఏమిటో మీరే చూస్తారంటూ కబుర్లు చెప్పేవారు. చేసిందేమీ లేదు. ఐదు సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి పాలకుల మీద రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే జుమ్లా (అవసరానికి తగినట్లుగా మాట్లాడటం) తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు పోలవరంను ఏటిఎంగా వాడుకున్నట్లుగానే కాళేశ్వరాన్ని బిఆర్‌ఎస్‌ నేతలు వాడుకున్నారని కూడా మోడీ చెప్పారు. కాళేశ్వరానికి కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పోలవరం కేంద్ర ప్రాజెక్టు. దాన్నుంచి పిండుకున్నారని విమర్శించిన మోడీ ఐదేండ్లు చేసిదేమీ లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో వైసిపి పాలకుల మీద చర్య తీసుకుంటామంటే జనానికి చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు.


బిజెపి నుంచి ఆంధ్రప్రదేశ్‌ పౌరులు ఆశిస్తున్నదీ, తెలుగుదేశం, జనసేన ఆశలు కల్పించిందీ విభజన హామీల అమలు గురించి తప్ప వట్టిస్తరి మంచినీళ్ల గురించి కాదు.కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తారా లేదా విశాఖలో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తారా, అది సక్రమంగా పని చేయాలంటే అవసరమైన ఇనుప ఖనిజ గనులను కేటాయిస్తారా లేదా ఏం చెబుతారోనని ఎదురు చూస్తుంటే అవేమీ తనకు సంబంధం లేనట్లుగా రాజంపేట ఎన్నికల సభలో కూరగాయల శీతల గిడ్డంగులు,పులివెందులలో అరటి పరిశ్రమ గురించి మాట్లాడారు. పోనీ వాటినైనా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులతో ఏర్పాటు చేస్తామన్నారా అంటే అదీ లేదు.ఆంధ్రప్రదేశ్‌ పౌరులను మరీ అమాయకులుగా భావించినట్లు కనిపిస్తోంది.పదేండ్ల క్రితం ఏర్పాటు చేయాల్సిన విశాఖ రైల్వే జోన్‌కు ఇంతవరకు అతీగతి లేదు, దాని గురించి చెప్పకుండా మీకు బుల్లెట్‌ రైలు వద్దా అని ప్రశ్నించారు.వద్దని ఎవరు చెప్పారు. రద్దు చేసిన పాసింజరు రైళ్లను పూర్తిగా పునరుద్దరించలేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తవాటిని వేయటం లేదు గానీ సామాన్యులు భరించలేని టిక్కెట్‌ ధరలతో నడిచే బుల్లెట్‌ రైలు వద్దా అంటున్నారు. తక్కువ ఛార్జీలతో నడిచే రైళ్లకు బదులు రాబోయే రోజుల్లో ప్రైవేటు వారికి గిట్టుబాటుగా ఉండేందుకు గాను రద్దీ మార్గాల్లో సాధారణ సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు బదులు వందేభారత్‌లను ప్రవేశపెడుతున్నారు.వాటిని కూడా ప్రవేశపెట్టండి కలిగిన వారు ఎక్కుతారు. కానీ మధ్యతరగతి, దిగువ ఆదాయవర్గాల అవసరాలకు అనుగుణంగా ఇతర రైళ్లను ఎందుకు వేయరు.


మూడు పార్టీలు ఒక కూటమిగా పోటీ చేస్తున్నప్పటికీ తెలుగుదేశం-జనసేన పార్టీలు మాత్రమే ఉమ్మడి మానిఫెస్టోను విడుదల చేశాయి. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌తో కలసి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఆవిష్కరించేందుకు బిజెపి నేత సిద్దార్దనాధ్‌ తిరస్కరించిన వీడియోలను జనమంతా చూశారు. తమ కేంద్ర మానిఫెస్టో తెలుగు కాపీని మాత్రమే బిజెపి విడుదల చేసింది. బహిరంగ సభల్లో వెనుకబడిన తరగతుల జాబితాలో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పటం తప్ప ఎక్కడ బిజెపికి ఆగ్రహం వస్తుందో అన్న భయంతో తమ మానిఫెస్టోలో దాన్ని పెట్టలేదు. పోలవరం ప్రాజెక్టు కిందనిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం సంగతి తేల్చటం లేదు. ప్రాజెక్టు నిర్మిస్తున్న కేంద్రం ఇచ్చేదీ, రాష్ట్రమే భరించేదీ ఇంతవరకు తేల్చలేదు.ఇచ్చేందుకు కేంద్రం మొరాయిస్తున్నది.తన పర్యటనలో నరేంద్రమోడీ దాని గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ కేంద్రాన్నైనా మరొకరినైనా తాట వలుస్తాం, తోలు తీస్తాం అని సినిమా డైలాగులు చెప్పిన పవన్‌ కల్యాణ్‌ పోలవరం నిర్వాసితులకు చెల్లించేందుకు అవసరమైన వేల కోట్ల రూపాయలను సెస్‌ రూపంలో, విరాళాలు వసూలు చేసి చెల్లిస్తామని ప్రకటించటం గమనించాల్సిన అంశం. ఇలా ఇంతవరకు ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా ? తెలుగుదేశం-జనసేన మానిఫెస్టో అమలుకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి తెస్తారని అడిగితే ముందు అధికారమివ్వండి తరువాత చంద్రబాబు నాయుడు తన అనుభవంతో చక్రం తిప్పి కేంద్రం నుంచి సాధిస్తారు, రాష్ట్రంలో వనరుల వృద్ధికి అల్లా ఉద్దీన్‌ అద్బుత దీపం ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో అలాంటి దాఖలాలు లేవు కదా అంటే ఈ సారి చూడండి అంటున్నారు. తెలంగాణాలో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని అప్పులు చేస్తే తప్ప రోజు గడవని స్థితిలో ఉంది. తెలంగాణా కంటే వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ఎక్కువ అప్పులు చేసిందని చెబుతున్న తెలుగుదేశం పార్టీకి నిజంగానే అధికారం దక్కితే ఎలా నెట్టుకొస్తుందన్నది ప్రశ్న.


తెలంగాణాలో నరేంద్రమోడీ కొత్త సంగతి చెప్పారు. ఏదైనా పార్టీతో ఒప్పందం చేసుకుంటే అంబానీ-అదానీలు టెంపోల ద్వారా నోట్ల కట్టలను వారికి పంపుతారట. ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ నోట అంబానీ-అదానీ మాటలు రావటం లేదని, వారితో కాంగ్రెస్‌ ఒప్పందం కుదుర్చుకుందా ? టెంపోలలో నోట్లు వారికి చేరాయా అని ప్రధానికరీంనగర్‌ జిల్లా వేములవాడ ఎన్నికల సభలో ప్రశ్నించారు.” ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి వీరు అంబానీ-అదానీలను దుర్భాషలాడటం మానుకున్నారు. నేను తెలంగాణా గడ్డ నుంచి అడగదలుచుకున్నాను.అంబానీ-అదానీల నుంచి ఎంత సొమ్ము తీసుకున్నారో రాకుమారుడిని వెల్లడించమనండి. టెంపోల కొద్దీ నోట్లు కాంగ్రెస్‌కు చేరాయా ? తెల్లవారేసరికి అంబానీ-అదానీలను దూషించటం ఆగిపోయింది కనుక ఏ ఒప్పందం కుదిరింది. మీరు వారిని ఐదేండ్లుగా దూషించటాన్ని ఆకస్మికంగా ఆపివేశారంటే ఏదో నీచం జరిగింది( జరూర్‌ దాల్‌ మే కుచ్‌ కాలా హై(పప్పులో కంపు కొట్టేది ఏదో పడింది) ” అని మోడీ అన్నారు. రాహుల్‌ గాంధీ వెంటనే దానికి తగిన జవాబు ఇచ్చారు.” నమస్కారం మోడీ గారూ, మీరు భయపడుతున్నారు.సాధారణంగా మీరు తలుపులు మూసుకొని రహస్యంగా అంబానీ-అదానీల గురించి మాట్లాడతారు.తొలిసారిగా మీరు వారి గురించి బహిరంగంగా మాట్లాడారు.వారు టెంపోలలో డబ్బు ఇస్తారని మీకు తెలుసు, అది మీ వ్యక్తిగత అనుభవమా ? సాధ్యమైనంత త్వరలో దీని గురించి ఒక విచారణ జరపండి ” అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన రోజు నుంచి దేశంలో అనేక చోట్ల తనిఖీలు జరుపుతూ భారీ మొత్తాలలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. మరి టెంపోలలో తరలిస్తున్న సొమ్ము పట్టుకున్నట్లుగానీ, అవి అంబానీ, అదానీలవని ఎక్కడా వార్తలు రాలేదు. వారి కంపెనీలన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలలోనే ఎక్కువగా ఉన్నాయి. నరేంద్రమోడీ ఆరోపించినట్లుగా నిజంగానే ఎన్నికల ప్రకటన తేదీ నుంచి రాహుల్‌ గాంధీ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలను విమర్శించలేదా ? అది పచ్చి అవాస్తవమని హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక వాస్తవ నిర్ధారణ వార్త వెల్లడించింది. తొలిదశ ఓటింగ్‌ (ఏప్రిల్‌ 19) నుంచి తమ బృందం రాహుల్‌ గాంధీ,కాంగ్రెస్‌ యూట్యూబ్‌ ఉపన్యాసాలను పరిశీలించగా అనేక సందర్భాలలో విమర్శించినట్లు ఉందని మే తొమ్మిదవ తేదీన ప్రచురించిన వార్తలో వివరాలను ఇచ్చింది. ఇదీ విశ్వగురువు బండారం.


నిజానికి ఇది ఎదురుదాడి తప్ప మరొకటి కాదు. అదానీ కంపెనీల అక్రమాలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక అనేక ఆరోపణలు చేసింది. సూట్‌ కేసు కంపెనీల గురించి చెప్పింది. ఆ నివేదికలోని అంశాల మీద పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని, అదానీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదనైనా మీ నోటితో చెప్పండని ప్రతిపక్షాలు కోరితే అంగీకరించలేదు. అసలు పార్లమెంటులో లేదా వెలుపల అదానీ పేరే మోడీ ఉచ్చరించలేదు. దీని వెనుక ఏదైనా ఒప్పందం, టెంపోల కొద్దీ నోట్లు అందాయా ? ఎందుకంటే అంబానీ, అదానీ ఇతర బడా కార్పొరేట్ల కంపెనీల పేర్లు ఎక్కడా ఎన్నికల బాండ్ల జాబితాలో పెద్దగా కనిపించలేదు. రాజకీయ పార్టీలకు అవి విరాళాలు ఇవ్వలేదంటే నమ్మే అమాయకులు ఎవరైనా ఉన్నారా ? అంబానీలు, అదానీలు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రాపకంతో మరింత ధనవంతులౌతున్నారని కాంగ్రెస్‌, వామపక్షాలు, మరికొన్ని పార్టీలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు ఎవరైనా వ్యాపార, పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై పరస్పరం లబ్దిపొందే నిర్ణయాలు తీసుకొని మాకది-మీకిది అని పంచుకోవటం బహిరంగ రహస్యం.చట్టబద్దంగా జరుగుతున్న అవినీతి. వేములవాడ సభలో నరేంద్రమోడీ చలోక్తి విసిరారని కొందరు భాష్యం చెబుతున్నారు.అదానీ కంపెనీల అక్రమాల గురించి మోడీ మాట్లాడకపోవటాన్ని ప్రతిపక్షాలు జోక్‌గా విమర్శించలేదు,సీరియస్‌గానే చెప్పాయి.


రెండింజన్ల పాలన పుణ్యమా అని మధ్యప్రదేశ్‌ ఎంతో వెనుకబడింది. దానికి అనుగుణంగానే అక్కడి జనంలో వెనుకబాటుతనం కూడా ఎక్కువేకావచ్చు. నరేంద్రమోడీ మంచి మాటకారి, జనాన్ని బుట్టలో వేయటంలో దిట్ట అనటంలో సందేహం లేదు. కానీ ఏం చెబితే దాన్ని గుడ్డిగా నమ్ముతారా ? లేకపోతే విశ్వగురువు అంతధైర్యంగా మాట్లాడగలరా ? అది జన అమాయకత్వమా ? నేతల దిగజారుడా ? మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ నాలుగు వందల సీట్లు ఎందుకు కావాలంటున్నానంటే అని చెబుతూ క్రికెట్‌ జట్టులో ఎక్కువ మంది ముస్లింలను కాంగ్రెస్‌ చేర్చకుండా ఉండేందుకు అని చెప్పారని మేనెల ఏడవ తేదీన ది వైర్‌ పోర్టల్‌ నివేదించింది. నాలుగు వందల సీట్లు కావాలని బిజెపి అడగటం రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లు తొలగించేందుకు అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే నరేంద్రమోడీ ముస్లిం విద్వేష అజండాను ఎంచుకున్నారు.” కాంగ్రెస్‌ ఉద్దేశ్యం ఏమంటే క్రీడల్లో మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వటం. దీని అర్ధం ఏమిటి ? మత ప్రాతిపదికన క్రికెట్‌ టీములో ఎవరు ఉండాలో లేదో అది నిర్ణయిస్తుందన్నమాట. నేను కాంగ్రెస్‌ను ఈ రోజు అడుగుతున్నాను.ఇలా వారు కోరుకోబట్టే, ఇందుకే 1947లో స్వాతంత్య్రం వచ్చినపుడు భారతమాతను మూడు ముక్కలు చేశారు. వారు 1947లో దేశం మొత్తాన్ని పాకిస్తాన్‌గా మార్చాలనుకున్నారు, తరువాత భారత ఆనవాళ్లు చెరిపివేయాలనుకున్నారు.నేను ఈ రోజు స్పష్టంగా చెబుతున్నా. కాంగ్రెస్‌ వారందరూ, వారిని అభిమానించేవారు జాగ్రత్తగా వినాలి…. మోడీ బతికి ఉన్నంత కాలం నకిలీ లేదా తప్పుడు లౌకికవాదం పేరుతో భారత గుర్తింపును చెరిపేందుకు ప్రయత్నిస్తే అతను అనుమతించడు ” అని మోడీ చెప్పారు.


దశాబ్దాలుగా ఉన్న బాబరీ మసీదు తాళాలను తీయించింది రాజీవ్‌ గాంధీ అన్నది తెలిసిందే. కాంగ్రెస్‌ అధికారానికి వస్తే రామాలయం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఆలయానికి కాంగ్రెస్‌ తాళం వేస్తుందని, జమ్మూ-కాశ్మీరుకు ఆర్టికల్‌ 370 తిరిగి తీసుకువస్తుందని దాన్ని నివారించాలన్నా, రిజర్వేషన్లను కాంగ్రెస్‌ తస్కరించకుండా, వాటిని ముస్లింలకు అప్పగించకుండా ఉండాలన్నా, పది సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లను పొడిగించాలన్నా తనకు నాలుగు వందల సీట్లు అవసరం అని కూడా నరేంద్రమోడీ చెప్పారు. ఇది భారతీయ తర్కమా, అడ్డగోలు మాటలా ? అధికారంలో కాంగ్రెస్‌ ఉండి తనకు నాలుగు వందల సీట్లు కావాలని కోరితే పైన చెప్పినవన్నీ జరగకుండా ఉండాలంటే తమకు అధికారం ఇవ్వాలనో, అంత భారీ మెజారిటీ ఇవ్వకూడదనో జనానికి చెబితే అర్ధం వుంది. ఆ సంఖ్య కోరుతున్న తమ మీద వస్తున్న విమర్శలను కాంగ్రెస్‌కు ఆపాదించి జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప ఇది మరొకటి కాదు.జనం మరీ అంత అమాయకంగా ఉన్నారా ?

పాలస్తీనియన్లపై మారణకాండ : ఆపితే నెతన్యాహు, కొనసాగిస్తే జో బైడెన్‌ పతనం !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ మారణకాండ బుధవారం నాటికి 215వ రోజుకు చేరుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చలు సాగుతున్నాయి.తమకు అంగీకారమే అని హమస్‌ చెప్పింది.ఎటూ తేల్చకపోగా రఫా నగరం మీద సైనిక చర్యకు ముందుకు పోవాలని ఇజ్రాయెల్‌ యుద్ధ మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది.మరొకవైపు చర్చలకు తమ ప్రతినిధులను పంపుతామని చెబుతూనే సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారే వరకు వైమానిక దాడులు జరుపుతూ రాఫా-ఈజిప్డు సరిహద్దు ద్వారం దగ్గర పాలస్తీనా వైపు ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ చర్యను చర్చల మధ్యవర్తి కతార్‌ ఖండించింది. దాడులు కొనసాగుతున్నాయి. గాజాలోని పౌరులకు ఐరాస అందిస్తున్న సహాయాన్ని కూడా అడ్డుకుంటున్నాయి.దాడుల్లో అనేక మంది మరణించారు. మధ్యవర్తులు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను హమస్‌ ఆమోదించినప్పటికీ తమకు అంగీకారం కాదని, తమ డిమాండ్లకు చాలా దూరంగా ఉందని నెతన్యాహు కార్యాలయం చెప్పింది. మంగళవారం నాటికి గాజాలో 34,789 మందిని ఇజ్రాయెల్‌ చంపివేసినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన వారు 78,204 మంది. రాఫాను ఖాళీ చేయాలని పౌరులను ఇజ్రాయెల్‌ ఆదేశించింది. ఇతర దేశాలకు ప్రత్యేకించి పక్కనే ఉన్న ఈజిప్టుకు వెళ్లకుండా దిగ్బంధనం గావించింది.ఇది రాసిన సమయానికి ఏం జరగనుందో తెలియని స్థితి.జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒకటి స్పష్టం.ఏదో ఒక ఒప్పందం చేసుకొని హమస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించాలని నెతన్యాహు మీద రోజు రోజుకూ వత్తిడి పెరుగుతోంది.మరోవైపు హమస్‌ను తుడిచిపెట్టకుండా వెనుదిరిగితే మీ సంగతి చూస్తామనే దురహంకారులు.మారణకాండకు మద్దతు ఇవ్వటాన్ని ఏమాత్రం సహించం అంటున్న విద్యార్థులపై జో బైడెన్‌ సర్కార్‌ కాల్పులకూ పాల్పడింది. గాజా దక్షిణ ప్రాంతంలోని రాఫా నగరం మీద దాడులకు దిగితే అక్కడ ఉన్న పిల్లలు పెద్ద సంఖ్యలో మరణించే అవకాశం ఉన్నందున హమస్‌ ఒక అడుగు వెనక్కు తగ్గేందుకు నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మారణకాండను కొనసాగించకపోతే నెతన్యాహు, ముందుకు పోతే ఎన్నికల్లో జో బైడెన్‌ పతనం ఖాయంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. మారణకాండను అంతర్జాతీయ న్యాయ స్థానం కూడా అడ్డుకోలేకపోయింది. తన ఆదేశాన్ని ధిక్కరించిన ఇజ్రాయెల్‌ను ఏమీ చేయలేని అశక్తురాలిగా మారింది.పాలస్తీనా పౌరులకు సంఘీభావం తెలుపుతున్న విద్యార్థులు యూదు వ్యతిరేకులంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిందించి మరింతగా రెచ్చగొట్టారు.


మంగళవారం తెల్లవారు ఝామున ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో అనేక మంది మరణించినట్లు వార్తలు. వైమానిక దళం జరిపినదాడుల్లో అనేక భవనాలు నేలమట్టం కాగా అనేక మంది శిధిలాల్లో చిక్కుకు పోయారు. ఎందరు గాయపడింది, మరణించిందీ ఇంకా స్పష్టం కాలేదు. తమ ఆసుపత్రికి పదకొండు మృతదేహాలు వచ్చినట్లు రాఫాలోని కువాయిట్‌ ఆసుపత్రి వెల్లడించింది. హమస్‌ వద్ద ఉన్న తమ బందీలను విడిపించే వరకు దాడులు కొనసాగిస్తూనే ఉంటామని మరోవైపు చర్చలకు తమ ప్రతినిధి బృందాన్ని పంపుతామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరవైలక్షల మందికి పైగా పాలస్తీనియన్లు గాజాలో వున్నారు. వారి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇజ్రాయెల్‌ మిలిటరీ తరలిస్తున్నది.ఈ క్రమంలో 64చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రాఫా నగరం, పరిసరాల్లో లక్షల మంది తలదాచుకుంటున్నారు. హమస్‌ సాయుధులు జనంలో కలసిపోయినందున వారిని పట్టుకోవాలంటే పెద్ద ఎత్తున దాడులు చేయకతప్పదని ఇజ్రాయెల్‌ చెబుతున్నది. అసలు ఆ సాకుతోనే ఏడు నెలలుగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.రాఫా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించటం ఏ మాత్రం సహించరాదని ఐరాస ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఈ దాడులను వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా కబుర్లు చెబుతున్నది. బందీల విడుదలకు తాత్కాలిక కాల్పుల విరమణ అని ఇజ్రాయెల్‌ చెబుతుండగా పూర్తిగా గాజా నుంచి వైదొలగాని హమస్‌ పట్టుబట్టటంతో ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న చర్చలు నిలిచిపోయాయి. సంప్రదింపుల ప్రక్రియ వెంటిలేటర్‌ మీద ఉంది, అందుకే ఒక మధ్యవర్తిగా ఉన్న కతార్‌తో చర్చలు జరిపేందుకు సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బరన్స్‌ వెళ్లినట్లు ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొన్నది. మూడు దశల్లో ఒప్పందం అమలు జరుగుతుందని, తన వద్ద బందీలుగా ఉన్న 132 మందిలో 33 మందిని 42 రోజుల వ్యవధిలో విడుదలు చేస్తుందని దీనికి ఇరు పక్షాలూ అంగీకరించినప్పటికీ తదుపరి రెండు దశల గురించి వివాదం ఏర్పడిందని తొలుత వార్తలు వచ్చాయి. కొత్త ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్లు సోమవారం హమస్‌ ప్రతినిధి ఈజిప్టు, కతార్‌ మంత్రులకు ఫోన్‌ ద్వారా తెలిపినట్లు వార్తలు. ఇజ్రాయెల్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా రాఫా ప్రాంతం నుంచి పాలస్తీనియన్లు వెళ్లిపోవాలని విమానాల నుంచి వెదజల్లిన కరపత్రాల్లో ఆదేశించటమేగాక, రాత్రి నుంచి దాడులను కూడా ప్రారంభించింది. ఒప్పందం కుదిరినా కుదరకున్నా దాడులు చేసి తీరుతామని నెతన్యాహు చెబుతున్నాడు.


కైరో చర్చలు సఫలమౌతాయని, తక్షణ, శాశ్వత కాల్పుల విరణమకు దారితీస్తాయని కతార్‌ విదేశాంగశాఖ ప్రతినిధి మహమ్మద్‌ అల్‌ అన్సారీ చెప్పారు.వ్యవధి కోసం హమస్‌ నాటకమాడుతున్నదని, దాడులను నిలిపివేసేందుకు, చర్చల వైఫల్య నెపం తమపై నెట్టేందుకు చూస్తున్నదని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్నది.రాఫా ఇప్పుడు బాలల నగరంగా మారిందని, దాడులు జరిగితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం ఉంటుందని యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసిందని, రక్షణ కోసం పిల్లలు ఎక్కడకు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారని సంస్థ డైరెక్టర్‌ కాథరీన్‌ రసెల్‌ చెప్పారు. ఇప్పటికే అక్కడి పిల్లలు భౌతికంగా, మానసికంగా ఎంతో బలహీనపడ్డారని, పిల్లలతో పాటు మొత్తం జనాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు ముందు నగరం, పరిసరాల జనాభా రెండున్నరలక్షలు కాగా ప్రస్తుతం అక్కడ పన్నెండు లక్షల మంది తలదాచుకుంటున్నారని, వారిలో దాదాపు ఆరులక్షల మంది పిల్లలే ఉంటారని చెబుతున్నారు.హమస్‌ ఒక మెట్టు దిగిరావటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. దాడుల ప్రభావం పెద్దల మీద కంటే పిల్లల మీద ఎక్కువగా ఉంటుందని యూనిసెఫ్‌ హెచ్చరించింది. రాఫా మీద దాడి అంటే ఏదో విహారయాత్ర అని భావిస్తే పొరపాటు తమ వారిని రక్షించేందుకు పూర్తి సన్నద్దంగా ఉన్నామని హమస్‌ ప్రకటించింది. దాడులకు పాల్పడవద్దని సౌదీ అరేబియా విదేశాంగశాఖ ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.


తమ నేత జో బైడెన్‌కు గాజా మరో వియత్నాంగా మారుతున్నదని, అయితే డోనాల్డ్‌ ట్రంప్‌ను వెనక్కు కొట్టేందుకు తాను బైడెన్‌కు మద్దతు ఇస్తున్నట్లు డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ ప్రకటించాడు.గాజాలో మారణకాండను ఖండిస్తూ అమెరికా విద్యార్ళులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగటంతో ఎన్నికలలో పోటీ చేస్తున్న అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరకాటంలో పడ్డాడు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పూనుకోవటంతో పాటు ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ మీద వత్తిడి తెస్తున్నట్లు నాటకం ప్రారంభించాడు.రాఫాపై దాడులను వ్యతిరేకిస్తున్నట్లు బైడెన్‌ స్పష్టం చేసినట్లు జాతీయ భద్రతా మీడియా సలహాదారు జాన్‌ కిర్బీ చెప్పాడు. అర్ధగంటపాటు నెతన్యాహు-జో బైడెన్‌ ప్రైవేటుగా నిర్మాణాత్మకంగా మాట్లాడుకున్నారని అన్నాడు. నెతన్యాహుతో మాట్లాడిన తరువాత జో బైడెన్‌ వైట్‌హౌస్‌లో జోర్డాన్‌ రాజు రెండవ అబ్దుల్లాకు అనధికారిక మధ్యాహ్న విందు ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్‌ గనుక రాఫాపై దాడులకు దిగితే పెద్ద ఎత్తున మారణకాండ జరిగే అవకాశముందని అబ్దుల్లా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఏడు నెలల దాడుల తరువాత గాజాలో తీవ్రమైన కరవు పరిస్థితి ఏర్పడిందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమ అధిపతి సిండీ మెకెయిన్‌ చెప్పాడు.తన మీద ప్రపంచ నేతలెవరూ ఏమాత్రం వత్తిడి తేలేరని, ఏ అంతర్జాతీయ సంస్థా ఇజ్రాయెల్‌ తనను తాను కాపాడుకోవటాన్ని అడ్డుకోజాలదని నెతన్యాహు ఆదివారం నాడు చెప్పాడు.


కొలంబియా విశ్వవిద్యాలయాన్ని అదుపులోకి తీసుకున్న న్యూయార్క్‌ పోలీసుల్లో ఒకడు విద్యార్థుల మీద కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. వారి వెనుక బయటి శక్తుల హస్తం ఉందనే సాకుతో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది.దీనికి కార్పొరేట్‌ మీడియా మరింతగా ఆజ్యం పోస్తున్నది.ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా రెచ్చగొడుతుంటే అంత ఎక్కువగా విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. గుడారాలను పీకివేస్తే వెంటనే కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. దొంగే దొంగని అరచినట్లుగా విద్యార్థుల నిరసనలను తప్పుదారి పట్టించేందుకు ఇజ్రాయెల్‌ అనుకూలురను రెచ్చగొట్టి పోటీ ప్రదర్శనలను చేయించటం, ఆ ముసుగులో పౌరదుస్తుల్లో ఉన్న పోలీసులు, బయటివారిని రప్పిస్తున్నట్లు అనేక చోట్ల స్పష్టమైంది.వారు విద్యా ప్రాంగణాల్లో ప్రవేశించి దాడులు చేస్తున్నారు. యూదు వ్యతిరేక నినాదాలు చేస్తూ విద్యార్ధుల ఆందోళనను తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. ఇలాంటి వారి చర్యలను చూపి మీడియా దాడులకు దిగుతున్నది. మీడియాకు జరుగుతున్నదేమిటో తెలిసినప్పటికీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది కనుక దాని ప్రాపకం కోసం కట్టుకథలు రాస్తున్నది పిట్టకతలు చెబుతున్నది. పార్లమెంటు సభ్యుల కమిటీల పేరుతో విద్యా సంస్థల చాన్సలర్లు, అధ్యక్షులు, ఇతర అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి ఆందోళనను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలేమిటని అడ్డదిడ్డంగా ప్రశ్నిస్తున్నారు. గట్టిగా వ్యవహరించకపోతే రాజీనామా చేసి ఇంటికి పోండని వత్తిడి తెస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయకపోతే తాము ఇచ్చిన విరాళాలను స్థంభింప చేస్తామని బెదిరించేందుకు దాతలను రంగంలోకి దించారు. నిజానికి వీరంతా బయటివారు తప్ప ఆందోళన చేస్తున్న వారు లేదా వారికి మద్దతు ఇస్తున్నవారు కాదు. ఇలాంటి వారిని చూసి ఆందోళనలకు దూరంగా ఉన్నవారు తొలి రోజుల్లో పొరపాటు పడిన అనేక మంది ఇప్పుడు తోటి విద్యార్థులతో చేతులు కలుపుతున్నారు. మహిమగల దుస్తులు వేసుకున్నానంటూ దిగంబరంగా వీధుల్లోకి వచ్చిన రాజును చూసి నిజం చెబితే రాజుగారి దెబ్బలకు గురికావాల్సి వస్తుందని ప్రతి వారూ రాజుగారి దుస్తులు బహుబాగున్నాయని పొగుడుతుంటే భయమంటే ఏమిటో తెలియని ఒక పిల్లవాడు రాజుగారి గురించి నిజం చెప్పినట్లుగా విద్యార్థులు ఆందోళన ద్వారా అనేక మంది కళ్లు తెరిపిస్తున్నారు. దిగంబర అమెరికా పాలకుల నైజాన్ని బయటపెడుతున్నారు.ఉన్మాద పులిని ఎక్కిన ఇజ్రాయెల్‌ నెతన్యాహు ఇప్పుడు వెనక్కు తగ్గితే రాజకీయంగా పతనమే, గాజాలో మారణకాండ ఇంకా కొనసాగితే దాన్ని నిస్సిగ్గుగా బలపరిస్తే ఎన్నికల్లో జో బైడెన్‌కు ఓటమి తప్పదంటున్నారు.

కమ్యూనిస్టులు కంపెనీలను రానివ్వరా ? నరేంద్రమోడీ, చంద్రబాబు, జగన్‌ అభివృద్ధి బండారమేమిటి ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


చరిత్రలో నరేంద్రమోడీ పాలనలో జరిగినంత అభివృద్ధి మరే ప్రధాని, పార్టీ పాలనలోనూ జరగలేదంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా వార్తల కంటే గ్యారంటీ అంటూ నరేంద్రమోడీ దర్శనమిస్తున్నారు. ఎన్నికల బాండ్ల రూపంలో పోగేసుకున్న సొమ్మా మజాకా ! ప్రచారాన్ని గుడ్డిగా నమ్మటం లేదా నమ్మకపోవటం తెలిసిందే.ఏం జరుగుతోంది, వాస్తవాలేమిటి అని నిర్ధారించుకొనే ఓపిక లేదా తీరిక అందరికీ ఉండదు.ఒకదాన్ని నిర్ధారించుకొనే లోపల వంద వచ్చిపడుతున్నకాలమిది.దేశంలో కొత్త కంపెనీల ఏర్పాటు, పాతవాటి మూత తదితర అంశాల గురించి ప్రతినెల కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంసిఏ) ఒక నివేదిక విడుదల చేస్తుంది. 2024 మార్చినెల నివేదిక ప్రకారం దేశంలో 26,63,016 కంపెనీలు నమోదు కాగా వాటిలో 16,91,495 కంపెనీలు (64శాతం) పని చేస్తున్నాయి. మూతపడినవి 9,31,644 లేదా 34.98శాతం ఉన్నాయి. మిగిలినవి కూడా ఇతర ప్రక్రియల్లో ఉన్నాయి. 2014 ఏప్రిల్‌ 28వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త ప్రకారం 2014 మార్చి ఆఖరు నాటికి 13,94,819 కంపెనీలుండగా వాటిలో 9,52,433 లేదా 68శాతం పని చేశాయి. మిగిలినవన్నీ మూత లేదా ఆ దారిలో ఉన్నవే. 2015 మార్చి నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 14,59,278కి గాను పని చేస్తున్నవి 10,22,011 లేదా 70శాతంగా ఉన్నాయి. నరేంద్రమోడీ తొలి ఐదు సంవత్సరాల్లోచూస్తే మొత్తం కంపెనీలు 18,73,044 కాగా పని చేస్తున్నవి 11,56,374 లేదా 61.73శాతం ఉన్నాయి. 2012-13, 2013-14 సంవత్సరాలలో ఇప్పటితో పోల్చితే దిగజారుడు చాలా ఎక్కువగా ఉందని 2020జనవరి 25న ఇటి నౌ ఇంటర్వ్యూలో నీతి అయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా చెప్పారు. దీని ప్రకారం చూస్తే యుపిఏ పదేండ్ల పాలన చివరి రెండు సంవత్సరాలు దిగజారుడు ఎక్కువగా ఉన్నపుడే 68శాతం కంపెలు పని చేయగా తన పాలనలో అస్తవ్యస్థతను సరిదిద్ది గాడిలో పెట్టానని చెప్పుకున్న నరేంద్రమోడీ పదవ ఏడాది పాలనలో 63.5శాతానికి తగ్గాయి. 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1,85,312 కంపెనీలు నమోదు వాటి మూలధనం రు.30,927 కోట్లుగా ఉంది. అదే యుపిఏ పాలన చివరి సంవత్సరంలో 98,473 కంపెనీలు నమోదు కాగా వాటి మూల ధనం 39వేల కోట్ల రూపాయలు.పదేండ్ల పాలన అంతకు ముందు పది సంవత్సరాల స్థితిని చూస్తే మోడీ ఏలుబడిలో దిగజారినట్లా వెలిగిపోతున్నట్లా ?


కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రతినెలా విడుదల చేస్తున్న బులిటెన్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని సంస్థలు నమోదవుతున్నాయన్నది దానిలో ఉంటుంది. మధ్య,చిన్న,సన్నకారు పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)ల వివరాలు అందులో ఉండవు. కంపెనీల చట్టం కింద నమోదైనవే ఉంటాయి.కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచారం మేరకు కొన్ని రాష్ట్రాల తీరు తెన్నులను చూద్దాం. మూడు సంవత్సరాలలో మార్చి 31వరకు ఉన్న కంపెనీల పరిస్థితి, మొత్తం అంటే కంపెనీల చట్టం కింద నమోదైనవి. మన చట్టాలలో కంపనీల మూత గురించి చాలా గందరగోళం ఉంది. అందువలన పని చేస్తున్న వాటినే పరిగణనలోకి తీసుకుంటే మిగిలినవాటిలో మూతపడినవి, పని చేయనివి తదితరాలు ఉంటాయని గమనించాలి.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ×××× పని చేస్తున్నవి××× శాతం
2015 ×× దేశం ×××14,59,278××× 10,22,011 ××× 70
2019 ×× దేశం ×××18,73,044××× 11,56,374 ××× 61.73
2024 ×× దేశం ×××26,63,016××× 16,91,495 ××× 63.5

దేశంలో 2014-15 నాటికి ఉన్న కంపెనీలలో పారిశ్రామిక రంగంలో 21, వ్యవసాయ రంగంలో మూడు శాతం, సేవారంగంలో 76శాతం ఉన్నాయి. సేవారంగంలో ఐటి, వాణిజ్యం,గనులు, విద్యుత్‌ ఉత్పత్తి వంటి ఉన్నాయి. కాగా పదేండ్ల తరువాత చూస్తే గతేడాది నమోదైన వాటిలో 71శాతం సేవారంగం, 23 పరిశ్రమలు, ఆరుశాతం వ్యవసాయరంగంలో ఉన్నాయి.ఇది ఇటీవలి సంవత్సరాల ధోరణులకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. ఈ కారణంగానే మన ఎగుమతుల్లో సేవారంగం తప్ప పారిశ్రామిక వస్తువులు పెరగటం లేదు, జిడిపిలో ఈ రంగం వాటా గిడసబారిపోయింది. గతేడాది నమోదైన కంపెనీలను చూస్తే 17.6శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. పదేండ్ల క్రితం కూడా అదే స్థానంలో ఉంది.తొలిసారి ప్రధాని అయినపుడు నరేంద్రమోడీ విదేశాలు, విమానాల్లోనే ఎక్కువ కాలం గడిపారనే పేరు తెచ్చుకున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనా కాలంలో విదేశాల్లో పోయిన పరువు పునరుద్దరణతో పాటు భారీ మొత్తంలో విదేశీ నిధులు తెచ్చి చైనాతో పోటీ పడి మరీ ఎగుమతులు చేసేందుకు అని చెప్పారు.2015 మార్చి నాటికి దేశంలో 3,314 విదేశీ కంపెనీలు ఉండగా మోడీ తొలి ఏడాది కొత్తగా నమోదైనవి 157 ఉన్నాయి.2024 అవి 5,164కు పెరగ్గా పని చేస్తున్నవి 3,288 లేదా 64శాతం మాత్రమే. 2023 ఆగస్టు చివరి నాటికి చైనా ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం అక్కడ నమోదైన విదేశీ కంపెనీల సంఖ్య 11లక్షల 50వేలు, వాటిలో ఉన్న విదేశీ పెట్టుబడుల మొత్తం 1,950 బిలియన్‌ డాలర్లు.కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ 2021 నవంబరు 29న పార్లమెంటుకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2016 ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి సమాచారం వెల్లడించేనాటికి దేశంలో 7,17,059 కొత్త కంపెనీలు నమోదు కాగా 5,00,506 కంపెనీలు మూత పడ్డాయి.దీనికి పెద్ద నోట్ల రద్దు, కరోనా కారణమని చెప్పారు.2017-18లో 2,36,262, మరుసటి ఏడాది 1,43,233 కంపెనీలు మూత పడ్డాయి. దీనికి పెద్ద నోట్ల రద్దు, ఇతర కారణాలు తప్ప కరోనా కాదు.ఈ సంవత్సరాల్లో నమోదైనవాటికంటే మూతపడినవే ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి గురించి తెలుగుదేశం, వైసిపి మధ్య పెద్ద రచ్చ నడుస్తున్నది, మేం రాష్ట్రాన్ని పరిశ్రమలు, సేవారంగ సంస్థలతో ముందుకు ఉరికించామంటే మేమే అని చెప్పుకుంటున్నాయి.తమ పాలనలో సులభతర వాణిజ్య సూచికల్లో ఎంతో ముందున్నామని, లక్షల కోట్ల రూపాయల మేరకు వివిధ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని రెండు పార్టీల నేతలూ హడావుడి చేశారు. గత పదేండ్లలో జరిగిందేమిటో చూద్దాం.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015××ఆంధ్రప్రదేశ్‌ ×× 21,205 ××× 13,395 ××× 63.16
2019××ఆంధ్రప్రదేశ్‌ ×× 30,530 ××× 19,331 ××× 63.31
2024××ఆంధ్రప్రదేశ్‌ ×× 46,625 ××× 30,029 ××× 64.40
ఆమేరకు చూసినపుడు రాష్ట్రం విడిపోయిన తరువాత కంపెనీల నమోదు పెరిగినప్పటికీ పని చేస్తున్నవాటి శాతాలలో పెద్ద తేడా లేదు. అందువలన మేము ప్రోత్సాహమిచ్చాం, ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలను ఆదుకున్నాం అని చెప్పే కబుర్లలో పసలేదు. చంద్రబాబు నాయుడి ఐదేండ్ల పాలనలో వచ్చినవి 9,325 కాగా మూతపడినవాటి జాబితాలో చేరినవి 5,934 ఉన్నాయి. ఇక వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో కొత్తగా నమోదైనవి 16,596 కాగా మూతపడినవి 10,698 ఉన్నాయి.
ప్రపంచం, దేశంలోని వివిధ రాష్ట్రాల ధోరణులను చూసినపుడు ఎక్కడ రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయో అక్కడ, భూమి, విద్యుత్‌, నిపుణులైన పనివారి లభ్యత మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు ముందుగా ఎక్కడైతే కంపెనీలు వస్తాయో అక్కడే పెరుగుదల ఉంటుంది.దానికి ఉదాహరణ తెలంగాణా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తరువాత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015××తెలంగాణా ×× 77,040 ××× 51,743 ××× 67.16
2019××తెలంగాణా ××1,05,072××× 62,123 ××× 59.12
2024××తెలంగాణా ××1,57,064××× 98,440 ××× 62.67
ఈ వివరాలను చూసినపుడు నరేంద్రమోడీ చేసిన పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చి చేష్ట దెబ్బ దేశం మొత్తం మీద పడినట్లే తెలంగాణా కంపెనీల మీద కూడా పడింది. పదేండ్లకు ముందున్న స్థితికి చేరుకోలేదన్నది స్పష్టం.పదేండ్లలో కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో 21,205 నుంచి 46,625 అంటే 25,420 పెరిగితే తెలంగాణాలో 80,024 ఉన్నాయి. రాష్ట్ర విభజన ఆందోళన సందర్భంగా తెలంగాణాలో నేతలు కొందరు ఆంధ్ర ప్రదేశ్‌ పెట్టుబడిదార్లు దోపిడీ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దానికి పోటీగా తమ ప్రాంతాలను విస్మరించి తమ పెట్టుబడులన్నింటినీ తెలంగణాలో పెట్టామని ఆంధ్ర ప్రాంతం వారు వాపోయారు. లాభం వస్తేనే వ్యాపార వరదన పోతాడన్న లోకోక్తి తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర భక్తులైన పెట్టుబడిదార్లు గత పదేండ్లలో అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కంపెనీలు పెట్టిన దాఖలాలు లేవని అంకెలే వెల్లడిస్తున్నాయి.తమ పెట్టుబడులు నిలిపివేసినంత మాత్రాన తెలంగాణాకు కంపెనీలు రావని భ్రమించిన వారు గణాంకాలను చూసి ఏమంటారు ?


ఏడాది×× రాష్ట్రం×× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015×× కేరళ ×× 37,905 ××× 24,835 ××× 65.52
2019×× కేరళ ×× 51,809 ××× 32,440 ××× 62.61
2024×× కేరళ ×× 81,177 ××× 54,460 ××× 67.08
కమ్యూనిస్టులతో పెద్ద తలనొప్పి కార్మికులు, ఉద్యోగులు వేతనాలు పెంచాలంటారు తప్ప రాష్ట్రం, దేశ అభివృద్ధి గురించి పట్టదు, పెట్టుబడిదార్లను బెదిరిస్తారు అనే ప్రచారం తెలిసిందే. తనను తాను స్వయంగా సిఇఓ అని పిలుచుకున్న చంద్రబాబు లేదా విజయవంతమైన వ్యాపార, పారిశ్రామికవేత్త అని పేరు పడిన జగన్‌మోహనరెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన కంపెనీల కంటే పోరాటాలకు చిరునామాగా ఉన్న సిపిఎం నాయకత్వంలోని కేరళలో గత పది సంవత్సరాలలో అదనంగా నమోదైన కంపెనీలు 43,272. మరి దీనికి విమర్శకులు ఏ సమాధానం చెబుతారు ? రెండవది అక్కడి కంపెనీల పని తీరు దేశ సగటుతో, రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉందా లేదా ? మధ్యప్రదేశ్‌లో 2003 నుంచి మధ్యలో ఒక ఏడాది కాంగ్రెస్‌ మినహా ఇప్పటి వరకూ బిజెపి పాలన కొనసాగుతోంది. 2015లో అక్కడ నమోదైన కంపెనీలు 29,782 కాగా 2024నాటికి 60,700కు అంటే 30,918 మాత్రమే పెరిగాయి. అక్కడేమీ కమ్యూనిస్టుల ప్రభావం లేదు, రెండింజన్ల పాలన ఎందుకు కంపెనీలు రాలేదు ? ఇక దేశానికి గుజరాత్‌ను నమూనా ప్రకటించి ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ గురించి తెలిసిందే. అక్కడ 2015లో పని చేస్తున్న కంపెనీలు 64.72శాతం కాగా 2019లో 61.32, 2024లో శాతం 65.5 చొప్పున ఉన్నాయి. గుజరాత్‌ నమూనా అంత గొప్పగా లేదని, ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ప్రత్యేకంగా చేసిందేమీ లేదని గణాంకాలు వెల్లడించటం లేదా ?

అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పు చేసినట్లు : బిజెపిలో పెరుగుతున్న వారసత్వం ! తుస్సుమన్న నరేంద్ర మోడీ అస్త్రం !!

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఆరునెలల్లో వారు వీరవుతారు అన్న సామెత తెలిసిందే, అంతేనా అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు అనే లోకోక్తి కూడా తెలిసిందే.లోక్‌సభ ఎన్నికలలో ప్రకటిస్తున్న అభ్యర్థులను చూసిన తరువాత బిజెపి ఈ సామెతలను రుజువు చేస్తున్నదని వేరే చెప్పనవసరం లేదు. కాంగ్రెస్‌ దశాబ్దాల కాలంలో వారసత్వ రాజకీయాలకు అలవాటు పడితే బిజెపి ఒక దశాబ్దిలోనే ఎంతో వేగంగా కాంగ్రెస్‌ను అధిగమించుతోందా అనిపిస్తోంది.మహిళా రెజలర్లను వేధించిన తమ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ మీద బేటీ బచావో-బేటీ పఢావో (ఆడపిల్లల్ని రక్షించండి-ఆడపిల్లల్ని చదివించండి) అనే నినాదమిచ్చిన బిజెపి ఎలాంటి చర్య తీసుకోలేదు. తిరిగి అతగాడిని నిలిపితే పరువుపోతుందని భయపడి కొడుకు కరణ్‌కు సీటు ఇచ్చింది. ఎందుకు అంటే కైసర్‌గంజ్‌ నియోజకవర్గం, పరిసరాలలో బ్రిజ్‌ భూషణ్‌ కుటుంబాన్ని ఎదిరించి బిజెపిలో మరొకరు పోటీకి ముందుకు వచ్చే అవకాశం లేదు.భార్య గతంలో జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు. ఒక కొడుకు ఇప్పుడు ఎంఎల్‌ఏ.బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న ”యోధుడు ”,రౌడీ, గూండా చట్టాల కింద అనేక కేసులు, కండబలంతో పెద్ద ఎత్తున సంపదలను కూడబెట్టుకున్న నేపధ్యంలో బిజెపి ఆ కుటుంబాన్ని వదులుకుంటుందా ! మహిళల వలువలను వలిస్తేనేం ” దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ విలువలను ” కాపాడేందుకు ఇలాంటి జనాలు కావాలి కదా !బ్రిజ్‌ భూషణ్‌ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు కుమారుడు నామినేషన్‌ వేసే సందర్భంగా ఏడు వందల కార్లు, పదివేల మందితో ప్రదర్శన చేయించినట్లు, ఆ సందర్భంగా తాను కనిపిస్తే రచ్చ అవుతుందని వాటికి దూరంగా తెరవెనుక ఉండి నడిపించినట్లు వార్తలు వచ్చాయి.


దేశంలో ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడరు. రాజకీయాలను శాసించే కుటుంబాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒకసారి అధికారం, దానితో ఎలా సంపాదించుకోవచ్చో అనుభవంలోకి వచ్చిన తరువాత ఎంత సేపూ అధికార యావ, వారసులను రంగంలోకి తేవటం తెలిసిందే. దీనికి ఎన్‌డిఏ, ఇండియా కూటమిలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ అతీతం కాదు. ఏడున్నర దశాబ్దాల తరువాత కుటుంబ రాజకీయాలు సాధారణ స్థితికి వచ్చాయి, జనం కూడా ఆమోదం తెలుపుతున్నారు. ఎందుకు అనే ప్రశ్న వేయకుండా అసలు ప్రశ్నించటమే తప్పు అనేట్లు, గొర్రెదాటు వైఖరిని జనాల బుర్రలోకి ఎక్కించటంలో మతం, పురాణాలు, కులం, ప్రాంతాలు, అవకాశవాద రాజకీయాలు ఇలా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా ఎవరి పాత్రను అవి పోషించాయి. జరిగిందాంట్లో తమ తప్పేమీ లేదని సమర్ధించుకుంటాయి. స్వాతంత్య్ర ఉద్యమ నేపధ్యం ఉంది గనుక కాంగ్రెస్‌లో మోతీలాల్‌ నెహ్రూ, కుమారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ, కుమార్తె ఇందిరా గాంధీ, కుమారుడు రాజీవ్‌ గాంధీ, కుమారుడు, కుమార్తె రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను చూపి వారసత్వ రాజకీయాలు అంటూ విమర్శించేందుకు బిజెపికి మంచి అవకాశం దొరికింది. ఆ పార్టీ లేదా దాని పూర్వీకులకు దేశభక్తి, స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన పూర్వ చరిత్ర లేదు.జనసంఘం స్థాపకులలో ఒకరు విజయరాజె సింధియా, తరువాత అది పేరు మార్చుకొన్న బిజెపిలో ఆమె కుమార్తె రాజస్తాన్‌ మాజీ సిఎం వసుంధర రాజే ఇటీవల మరోసారి ఆ పదవికి పోటీ పడ్డారు. ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌(ఎంపీ), ఇప్పుడు నాలుగవసారి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం స్థాపకుడు ఎన్‌టి రామారావు, కుమార్తె పురందరేశ ్వరి, కుమారులు హరికృష్ట, బాలకృష్ట, అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు, కుమారుడు లోకేష్‌.ఈ కుటుంబానికి చెందిన వారు అన్నతెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగుదేశం,కాంగ్రెస్‌, వైసిపి, బిజెపిలో చేరారు. బాలకృష్ణ మరొక అల్లుడు శ్రీ భరత్‌ విశాఖ లోక్‌సభ తెదే అభ్యర్ధి, గతంలో భరత్‌ తాత ఎంవివిఎస్‌ మూర్తి తెలుగుదేశం ఎంపీగా చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంతానం జగన్‌మోహనరెడ్డి, వైఎస్‌ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియ సూలే బారామతి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తుండగా ఎన్‌సిపి నుంచి ఫిరాయించి బిజెపితో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర ఇప్పుడు అక్కడ బిజెపి కూటమి తరఫున పోటీలో ఉన్నారు. ఇలా వివిధ రాష్ట్రాలలో కుటుంబాల నేపధ్య ప్రాతినిధ్యం పెరుగుతోంది.ఎక్కడైనా సీటు రాకపోతే, ఉన్న పార్టీలో గెలిచే అవకాశాలు లేకున్నా వేరే పార్టీలో చేరిపోతున్నారు.చత్రపతి శివాజీ వారసులమని చెప్పుకుంటూ తమను గెలిపించాలని కొల్లాపూర్‌లో ఒకరు కాంగ్రెస్‌ తరఫున మరొకరు బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. జనాన్ని మోసం చేయటం గాకపోతే శివాజీ వారసత్వానికి ఈ ఎన్నికలకు సంబంధం ఏమిటి ?


కాశ్మీరును స్వతంత్ర దేశంగా ఉంచాలని నాటి రాజు హరిసింగ్‌ చూస్తే దానికి వ్యతిరేకంగా భారత్‌లో విలీనం కోసం ఉద్యమించిన నేత షేక్‌ అబ్దుల్లా, కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ ఫరూక్‌ అబ్దుల్లా. నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ నేతలుగా ఉన్నారు. ఆ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి తరువాత దాన్నుంచి విడివడి కాంగ్రెస్‌, జనతాదళ్‌లో పని చేసి స్వంత పార్టీ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీని ఏర్పాచేసిన ముప్తీ మహమ్మద్‌ సయీద్‌ రెండుసార్లు సిఎంగా పని చేశారు. ఆయన కుమార్తె మెహబూబా ముప్తి ముఖ్యమంత్రి పదవి కోసం బిజెపితో చేతులు కలిపారు.ఈ రెండు పార్టీల నేతల కుటుంబ సభ్యులు, బంధువులు అనేక మంది ముఖ్యమైన పదవులను అనుభవించారు. కర్ణాటకలో అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న జెడిఎస్‌ నేత కుమారస్వామి గురించి తెలిసిందే. సిఎం పదవి కోసం బిజెపి, కాంగ్రెస్‌ రెండింటితో చేతులు కలిపారు. తండ్రి దేవెగౌడ జెడిఎస్‌కు జాతీయ నేత,ఒక కుమారుడు కుమారస్వామి, మరోకుమారుడు రేవన్న ఎంఎల్‌ఏ, ఇప్పుడు అత్యాచారం, కిడ్నాప్‌ కేసులో అరెస్టయ్యారు. రేవన్న కుమారుడు ప్రజ్వల్‌ ఎంపీ,మహిళలపై అత్యాచార వీడియోలు, కేసుల కారణంగా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు. ఈ పెద్దమనిషిని గెలిపించాలని నరేంద్రమోడీ కర్ణాటకలో ప్రచారం తెలిసిందే. కర్ణాటకలో యెడియూరప్ప కుటుంబ రాజకీయాలు, పదవి కోసం అవకాశం వాదం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లో సమాజవాదీ, ఆర్‌జెడి నేతలు, హర్యానాలో దేవీలాల్‌, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌ కుటుంబ సభ్యుల పదవుల గురించి తెలిసిందే.


ఇక బిజెపి వారసత్వ రాజకీయాల గురించి చూస్తే లోక్‌సభ, రాజ్యసభల్లో ఉన్న 388 మంది ఎంపీల్లో 45 మంది కుటుంబ నేపధ్యం ఉన్నవారే. బిజెపి ఇటీవలి సంవత్సరాలలోనే వివిధ రాష్ట్రాలలో అధికారానికి వచ్చింది కనుక రాజకీయ వారసులు పుట్టుకు వచ్చారు. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతారు. అసలు బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌లో రాజరిక లక్షణాలు ఉంటాయి. ఒకసారి ఆ సంస్థకు అధిపతిగా నియమితులైన వారు జీవితాంతం కొనసాగుతారు. దానికి ఎన్నికలు ఉండవు. తాజా ఎన్నికల్లో ఏప్రిల్‌ పదవ తేదీనాటికి ప్రకటించిన అభ్యర్ధుల జాబితా ప్రకారం 250 మంది కాంగ్రెస్‌ వారిలో 65 అంటే ప్రతి నలుగురిలో ఒకరు, 424 బిజెపి జాబితాలో 87, ప్రతి ఐదుగురిలో ఒకరు రాజకీయ కుటుంబాల వారసులే ఉన్నారని హిందూస్తాన్‌ టైమ్స్‌ విశ్లేషించింది. కేవలం ఒక పార్టీలో ఉంటూ వారసత్వంగా పదవుల్లోకి రావటాన్నే వారసత్వం అనటానికి లేదు. వీరంతా కేవలం బిజెపి నేతల రాజకీయ వారసులే కాదు, వివిధ పార్టీలో పదవులు అనుభవించిన వారి వారసులు కూడా ఉన్నారు. ఉదాహరణకు బిజెపి అభ్యర్ధిగా ఉన్న మాజీ సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఆయన తండ్రి అమరనాధరెడ్డి కాంగ్రెస్‌లో పదవులు అనుభవించిన వారే. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు నీరజ్‌ మరొకరు. మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి కుమారులు, మనవలు డొల్లుపుచ్చకాయల్లా ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఒక మనవడు సిద్దార్దనాద్‌ సింగ్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ బిజెపి ఎన్నికల పర్యవేక్షకుడిగా ఉన్నారు. తండ్రి అమిత్‌ షా కేంద్ర మంత్రిగా ఉన్న కారణం తప్ప అసలు క్రికెట్‌ ఆడకుండానే బిసిసిఐ కార్యదర్శిగా జరు షా ఎన్నికకాలేదా అని ఆమ్‌ ఆద్మీ నేత సంజరు సింగ్‌ ప్రశ్నించారు. దేశంలో కుటుంబవారసత్వ రాజకీయాలంటే నెహ్రూ కుటుంబాన్నే ముందు చెబుతారు.ఇప్పుడు అనేక కుటుంబాలు రంగంలోకి వచ్చాయి.ఐదు సంవత్సరాల క్రితం ప్రింట్‌ అనే పత్రిక అలాంటి 34 కుటుంబాలను గుర్తించింది.ఇరవై రాష్ట్రాలలో వీరు ఉన్నట్లు పేర్కొన్నది. కనీసం ముగ్గురు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో వున్నవారిని పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటాయి.


కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకమని, తమ నేత తమ కుటుంబ సభ్యులను ఎవరినైనా రాజకీయాల్లోకి తీసుకు వచ్చారా చూడండని బిజెపి నేతలు అడ్డుసవాళ్లు విసురుతారు.దేశం కోసం-ధర్మం కోసం కట్టుకున్న భార్యను భారతీయ సంప్రదాయం ప్రకారం వదలి పెట్టకూడదు.రాజ్యాంగం ప్రకారం విడాకులు ఇవ్వకుండా, పట్టించుకోకుండా భార్యను వదలి పెట్టటం చట్ట విరుద్దం.నరేంద్రమోడీకి తనదంటూ కుటుంబం లేకపోవచ్చు గానీ, కుటుంబవారసులను రంగంలోకి తెస్తుంటే ఎందుకు అనుమతిస్తున్నట్లు ? అభ్యర్ధుల జాబితాల్లో నేర చరిత్ర ఉన్నవారు, కోటీశ్వరులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. అలాంటి వారు లేకపోతే నరేంద్రమోడీ ఉండరు అన్నది దిగమింగలేని నిజం కనుక. గతంలో బిజెపి నేతలు ఇతర పార్టీల వారినే కుటుంబ వారసత్వం, రాజకీయాల గురించి వేలెత్తి చూపేవారు. ఇప్పుడు బిజెపిలోనే అది ప్రారంభమైంది. కర్ణాటకలో ఎడియూరప్ప తన కుమారుడిని రానున్న రోజుల్లో సిఎం చేసేందుకు చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీకి దిగి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కెఎస్‌ ఈశ్వరప్ప ధ్వజమెత్తారు. ఏ హిందూత్వ పేరుతో బిజెపి రాజకీయం చేస్తున్నదో దాన్నే ముందుకు తెచ్చి పార్టీలో హిందూత్వకోసం పని చేస్తున్న నేతలను ఎడియూరప్ప పక్కన పెడుతున్నారని కూడా విమర్శించారు. బిజెపిలో ఇది ఆరంభం మాత్రమే !

క్రైస్తవ సంతుష్టీకరణ-బెదిరింపు : అద్భుతం ! అనితర సాధ్యం !! బిజెపి ఇలాంటి పనులు కూడా చేస్తుందా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


నాగాలాండ్‌ ! ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. జనాభా ఇరవైలక్షలకు పైబడి. భాషలెన్నో తెలుసా 17, అక్షరాలా పదిహేడు. ఆంగ్లం అధికార భాష, అత్యధికులు గిరిజనులే, 2011 జనాభా లెక్కల ప్రకారం 87.92 శాతం మంది క్రైస్తవులు,8.75శాతం హిందువులు. ఇప్పుడు ఈ చిన్న రాష్ట్రం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే….తమ పూర్వీకుడు, జనసంఫ్‌ు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన శ్యామ ప్రసాద ముఖర్జీ జూన్‌ 23న 70వ వర్ధంతిని పురస్కరించుకొని మే 11న రాష్ట్రంలోని చర్చ్‌లను శుభ్రపరచాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బెంజమిన్‌ యప్తోమి తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.దీని మీద మీ మహత్తర సేవలను వేరే చోట ఉపయోగించాలని నాగాలాండ్‌ బాప్టిస్టు చర్చి కౌన్సిల్‌ సున్నితంగా తిరస్కరించింది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(ఎన్‌డిపిపి) అనే ప్రాంతీయ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి ఉంది. నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన తరువాత క్రైస్తవుల మీద అసాధారణ రీతిలో హింసాకాండ జరుగుతోందని అందువలన బిజెపి అలాంటి మార్గదర్శకాలను జారీ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చర్చి కౌన్సిల్‌ సలహా ఇచ్చింది. రాజకీయ పార్టీలు మతపరమైన అంశాలను తీసుకోరాదని హెచ్చరించింది. నాగాలాండ్‌ క్రిస్టియన్‌ రివైవల్‌ చర్చి కౌన్సిల్‌((ఎన్‌సిఆర్‌సిసి) విడిగా ఒక ప్రకటన చేస్తూ స్వార్ధ ప్రయోజనాలకు పవిత్ర స్థలాలను రాజకీయం చేయవద్దని కోరింది. మన సమాజంలో మౌలిక విలువలైన సహనం,గౌరవం, మత స్వేచ్చలను కాపాడాలని పేర్కొన్నది. నాగాలాండ్‌లో చర్చ్‌లను ఊడ్చే కార్యక్రమం బదులు దేశమంతటా వేధింపులకు గురవుతున్న క్రైస్తవుల రక్షణ గురించి కేంద్రీకరించాలని కౌన్సిల్‌ అధ్యక్షుడు రెవరెండ్‌ ఎన్‌ పాఫినో వ్యాఖ్యానించారు.దేశంలో ఇతర ప్రాంతాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే నాగాలాండ్‌లో చర్చ్‌లను శుభ్రపరచటం ఏమిటని ప్రశ్నించారు.మొత్తం మీద బిజెపి సంతుష్టీకరణ యత్నం వికటించింది. అది బుద్ది తక్కువ నిర్ణయమని ఆ పార్టీ ఎంఎల్‌ఏ ఇమ్‌కాంగ్‌ ఇంచెన్‌ బహిరంగంగానే వర్ణించారు.అలాంటి నిర్ణయం తీసుకొనే ముందు చర్చి అధికారులతో చర్చించి ఉండాల్సిందన్నారు.ముందస్తు అనుమతి లేకుండా ఇతరుల ప్రాంగణాల్లోకి వెళ్లాలనటం అక్రమ ప్రవేశం కిందకు వస్తుందని విమర్శించారు.చర్చ్‌లన్నీ శుభ్రంగా ఉంటాయి, అయినా ఒక రాజకీయ పార్టీ అలాంటి నిర్ణయాలు చేయకూడదన్నారు. తమ ప్రయత్నాన్ని అపార్ధం చేసుకున్నారని, అయితే తమ పార్టీ ఇచ్చిన పిలుపులో చర్చ్‌లని కాకుండా ప్రార్ధనా స్థలాలను శుభ్రం చేయాలని రాసి ఉండాల్సిందని బిజెపి ప్రతినిధి థామస్‌ మాV్‌ా వివరణ ఇచ్చుకున్నారు. ఏ మతాన్ని కించపరచాలని తాము భావించటం లేదన్నారు. ఇంతకూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జారీ చేసిన మార్గదర్శకాలలో కేవలం చర్చ్‌ ప్రాంగణాలను ఊడ్చటమేనా లేక స్నానాల గదులు, మరుగుదొడ్లను కూడా శుభ్రపరచాలని ఉందా ? చర్చ్‌లను ఊడ్చాలనటం మణిపూర్‌లో చర్చ్‌ల మీద, క్రైస్తవులుగా ఉన్న గిరిజనుల మీద జరిపిన దాడుల నివారణలో విఫలమైన బిజెపి ప్రభుత్వ పాపపరిహారార్ధం తీసుకున్న సంతుష్టీకరణ కార్యక్రమమా ?

అధికారం, ఓట్ల కోసం ఇతర పార్టీలు మైనారిటీలసు సంతుష్టీకరిస్తున్నాయని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి ఒక వైపు ముస్లింల మీద విద్వేషాన్ని వెళ్లగక్కుతూ మరోవైపు వారి మీద క్రైస్తవులను ఉసిగొల్పుతూ సంతుష్టీకరించేందుకు చూస్తున్నది. ప్రధాని మోడీ స్వయంగా చర్చ్‌కు వెళ్లటమే గాక కేరళలో, ఇతర మరికొన్ని చోట్ల బిజెపి పడుతున్న పాట్లు తెలిసిందే. మొత్తంగా చూసినపుడు దాడులతో బెదిరింపులు ఒక వైపు సంతుష్టీకరణ మరోవైపు కనిపిస్తున్నది. బిజెపి నేత సినీ హీరో సురేష్‌ గోపి తన కుమార్తె వివాహం శ్రీ కృష్ణ దేవాలయంలో చేయబోయే రెండు రోజుల ముందు త్రిసూర్‌లోని ఒక చర్చికి భార్య, కుమార్తెతో సహా వెళ్లి వర్జిన్‌ మేరీకి ఐదు సావరిన్ల బంగారు కిరీటాన్ని సమర్పించుకున్నారు. ఇదంతా తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లకోసమే చేశారనే విమర్శలు వచ్చాయి.తాము తప్ప ఇతర పార్టీలు మైనారిటీల సంతుష్టీకరణకు చూస్తున్నాయని ఆరోపించే ఆ పార్టీ హిందువుల సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. క్రైస్తవులు ఆంగ్లేయులు, వారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని ఆరు సంవత్సరాల క్రితం ముంబై ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ బిజెపి ఎంపీ గోపాల్‌ షెట్టి ఆరోపించారు.2019 ఎన్నికలకు ముందు అది వివాదాస్పదం కావటంతో తాను రాజీనామా చేస్తానని సదరు ఎంపీ ముందుకు వచ్చారు. దీని గురించి శివసేన పత్రిక సామ్నా ధ్వజమెత్తింది.ఒడిషాలో ఆస్ట్రేలియన్‌ మిషనరీ గ్రాహమ్‌ స్టెయిన్ను చంపినపుడు అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జెబి పట్నాయక్‌తో కాంగ్రెస్‌ రాజీనామా చేయించింది.వాటికన్‌ చర్చి నుంచి వత్తిడి రావటం, సోనియా గాంధీ క్రైస్తవురాలు కావటం వల్లనే అలా జరిగిందని హిందూత్వ నేతలు విమర్శించారు. ఇప్పుడు ఏమైంది ? సోనియా గాంధీ అధికారంలో లేరు, వాటికన్‌ నుంచి వత్తిడి వచ్చే అవకాశమూ లేదు, గోపాల్‌ షెట్టిని ఒక నేరస్తుడిగా ఎందుకు చూస్తున్నారని, ఇదంతా రాజకీయం,2019 ఎన్నికలకు ముందు క్రైస్తవులను సంతుష్టీకరించే ప్రయోగమే అని శివసేన పత్రిక ధ్వజమెత్తింది. పాల్ఘర్‌ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంలో ఓట్ల కోసం ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ ముంబై వాసైలోని చర్చ్‌లు, మిషనరీల చుట్టూ ప్రదక్షిణలు చేశారని,క్రైస్తవ సమాజ దేశభక్తిని ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని శివసేన పేర్కొన్నది.


చర్చ్‌లు, క్రైస్తవులపై పెరుగుతున్న దాడులకు భయపడిన లేదా లొంగిపోయిన కొందరు క్రైస్తవ మతాధికారులు ” ముందు రక్షణకు ప్రాధాన్యత ” అనే పేరుతో బిజెపితో చేతులు కలిపేందుకు పూనుకున్నారు.దానిలో భాగంగానే గతేడాది ఢిల్లీలో క్రిస్‌మస్‌ విందు ఏర్పాటు దానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు.దానికి అనేక మంది మతాధికారులతో పాటు కేరళలో రుణ, బంగారం వ్యాపారంలో దిట్టలుగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల దాడుల నుంచి తమ విద్యాసంస్థలు, వ్యాపారాల రక్షణకే వారంతా బిజెపికి అనుకూలంగా మారేందుకు సిద్దపడినట్లు వేరే చెప్పనవసరం లేదు. వివిధ పార్టీలలో ఉన్న వాణిజ్య, పారిశ్రామికవేత్తలను తనవైపు తిప్పుకొనేందుకు ఐటి,సిబిఐ, ఇడిలను ప్రయోగిస్తున్న బిజెపి క్రైస్తవ మతాధిపతులు, వారి ప్రభావంలో ఉన్న సామాన్యుల ఓట్ల కోసం మతాధికారుల మీద కూడా ఆ సంస్థలను ప్రయోగించి దారికి తెచ్చుకుంటున్నది. రకరకాల పేర్లతో ఉన్న సంఘపరివార్‌ సంస్థలు, క్రైస్తవ, ఇస్లామిక్‌ సంస్థలకు విదేశాల నుంచి నిధులు అందుతున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ, ఇస్లామిక్‌ సంస్థలకు అందే నిధులను ఏదో ఒకసాకుతో నిలిపివేయించి నిర్వాహకులను దారికి తెచ్చుకొనేందుకు చూస్తున్నారు. ఇడి, ఐటి దాడులకు గురైన కేరళలోని బిలీవర్స్‌ ఈస్టరన్‌ చర్చి స్థాపకుడు ఇవాంజలిస్ట్‌ కెపి యోహనన్‌ కేరళ పత్తానం తిట్ట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ నేత, మాజీ సిఎం ఏకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోనికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. వందమంది పాస్టర్లు, ఇతర చర్చినేతలను తిరువళ్ల పట్టణంలో ఒక చోట సమావేశపరిచి మరీ ఈ పని చేశారు. ఒక చర్చి ఒక రాజకీయ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించటం ఇదే ప్రధమం అని అనిల్‌ ఒక ప్రకటనలో సంతోషం వెలిబుచ్చారు. ఈ చర్చికి అనుబంధంగా ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థలు విదేశాల నుంచి నిధులు పొందుతున్నట్లు ఆరోపించి 2017లో నిధులు పొందకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తరువాత దాని కొనసాగింపుగా చర్చి సంస్థలు, వ్యక్తుల మీద 2020,2022లో ఐటి, ఇడి దాడులు జరిగాయి.విదేశాల నుంచి 2015-16లో రు.2,397 కోట్ల నిధులను పొంది దాన ధర్మాల కోసం వినియోగించాల్సిన వాటిలో వెయ్యి కోట్లు రియలెస్టేట్‌ పెట్టుబడులుగా పెట్టినట్లు వార్తలు వచ్చాయి.కెపి యోహనన్‌ ప్రమేయం ఉన్న గోస్పెల్‌ ఫర్‌ ఆసియా అనే సంస్థ మీద అమెరికాలో నిధుల దుర్వినియోగం కేసు నమోదు కాగా రు.261 కోట్లు చెల్లించి పరిష్కారం చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ పూర్వరంగంలో సదరు చర్చి బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది.


దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా కేరళలో 18శాతం క్రైస్తవులు ఉన్నారు.ఆర్థికంగా కూడా బలమైన తరగతి.2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నియోజకవర్గంలో బిజెపి నేత ఓ రాజగోపాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శశి ధరూర్‌పై పదిహేనువేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అక్కడి లాటిన్‌ చర్చి నేతలే తన ఓటమికి కారణమని రాజగోపాల్‌ వాపోయారు. దాంతో క్రైస్తవుల ఓట్లు లేకుండా ముందుకు పోలేమని గ్రహించిన బిజెపి 2019లో చర్చిల చుట్టూ తిరిగినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.శబరిమల దేవాలయంలో మహిళల ప్రవేశాన్ని పెద్ద వివాదంగా మార్చినపుడే బిజెపికి కేరళలో హిందువుల మద్దతు లేదని దానికి వచ్చిన 14.88శాతం ఓట్లు వెల్లడించాయి. తరువాత బిజెపి ఒక సర్వే నిర్వహించి క్రైస్తవ ఓటర్లను ప్రభావితం చేయగలవారెవరు, ఎవరు ఏ సంస్థలను నడుపుతున్నారు, వాటి మంచి చెడ్డలేమిటి అన్న జాబితాను రూపొందించుకొని వారిని తమవైపు తిప్పుకొనేందుకు ఏ అవకాశం దొరుకుతుందా అని బిజెపి చూస్తోంది. ఆక్రమంలో యోహనన్‌ బిజెపి వలకు చిక్కారు. కేరళలో సిరో-మలబార్‌ చర్చి ఒకటి.దానిలో తలెత్తిన వివాదంలో ఒక వర్గం బిజెపికి దగ్గరైంది. అవాస్తవాలు, ముస్లింల పట్ల విద్వేషంతో కూడిన కేరళ స్టోరీ అనే సినిమాను ఎన్నికల ముందు ప్రదర్శించి వారు తమ భక్తిని ప్రదర్శించుకున్నారు. అదే చర్చిలో మరికొందరు అంతే తీవ్రంగా బిజెపిని వ్యతిరేకిస్తున్నారు. బిజెపిని సమర్ధిస్తున్న వారిని ”క్రిసంఘీ” (క్రిస్టియన్‌ + సంఘపరివార్‌) అని పిలుస్తున్నారు. చర్చి నేతలతో సంద్రింపులు జరిపామని తిరువనంతపురం, త్రిసూర్‌,పత్తానంతిట్ట,అట్టింగల్‌ నియోజకవర్గాలలో క్రైస్తవుల మద్దతు కోరినట్లు బిజెపి నేతలు చెప్పినట్లు ఇండియా టుడే పేర్కొన్నది.సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ వికె సక్సేనా కేరళలోని చర్చి అధికారులను కలసి మద్దతును కోరారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అని కాంగ్రెస్‌ విమర్శించింది.తిరువనంతపురం సమీపంలోని విఝినం అదానీ రేవు నిర్మాణాన్ని చర్చి తరఫున వ్యతిరేకించినందుకు బిజెపి సర్కార్‌ తమ బాంకు ఖాతాలను స్థంభింప చేసిందని ఏప్రిల్‌ 21న తిరువనంతపురం లాటిన్‌ చర్చి ఆర్చిబిషప్‌ థామస్‌ జె నెట్టో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వికె సక్సేనాను కలిసేందుకు నెట్టో తిరస్కరించారు.సిరో మలంకర, బాసిలోస్‌ మార్తమ్మ మాథ్యూస్‌, కాథలిక్స్‌ ఆఫ్‌ ఈస్ట్‌, మలంకర చర్చినేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రయత్నాలు బిజెపికి ఎంతమేరకు ఉపయోగపడతాయో చూడాల్సి ఉంది. మొత్తం మీద బిజెపి క్రైస్తవ సంతుష్టీకరణ కొత్త పుంతలు తొక్కుతున్నది.

మేకతోలు కప్పుకున్న పులులు : రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు ఏం మాట్లాడారు ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింలకు రిజర్వేషన్లను అడ్డుకుంటానని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మాయని మచ్చగా ఉన్న అంటరాని తనం నిర్మూలన గురించి, దానికి కారణమైన సనాతన ధర్మం, మనువాదం గురించి మోడీ నోటి వెంట ఒక్క మాటా ఇంతవరకు రాకపోగా సనాతన ధర్మాన్ని కాపాడతామని వీర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. సబ్‌కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అన్న నోటితోనే ఒక సామాజిక తరగతికి రిజర్వేషన్లను అడ్డుకుంటానని ప్రతిజ్ఞ చేశారు నరేంద్రమోడీ. అనేక అంశాలలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులతో సమంగా ముస్లింలు ఉన్నారని అనేక నివేదికలు స్పష్టం చేశాయి. కేవలం మతాన్ని చూపి వారిని సామాజిక న్యాయానికి దూరం చేయటం సమంజసమా ? తమకు నాలుగు వందలకు పైగా స్థానాలను ఇవ్వాలని బిజెపి చెప్పటం వెనుక రాజ్యాంగమార్పు, రిజర్వేషన్ల ఎత్తివేతకే అనే అనేక మంది భావిస్తున్నారు. దాని సెగ తగిలిన కారణంగానే ఒక వైపు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వం అని చెబుతూనే ఇతరుల రిజర్వేషన్లు రద్దు చేయం అని బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు పదే పదే నమ్మబలుకుతున్నారు. తమతో చేతులు కలిపిన తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుపుతానంటూ ప్రచారం చేస్తున్నారు. ఓట్ల కోసం బిజెపి సమర్ధిస్తున్నది. రిజర్వేషన్ల గురించి ఎవరేం మాట్లాడారో చూద్దాం.
బీహార్‌లో మరోమారు బిజెపి చంకనెక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకున్న నితీష్‌ కుమార్‌ గతంలో చెప్పిందేమిటి ?(2015 సెప్టెంబరు 23, ఇండియా డాట్‌కామ్‌, ఇండో ఆసియన్‌ న్యూస్‌ సర్వీసు) దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి రిజర్వేషన్లను తొలగించాలని కోరుకుంటున్నది. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని చెప్పటం వారి వ్యూహంలో భాగం.ఇది ప్రమాదకరం, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగం బిజెపి. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ఇప్పుడున్న రిజర్వేషన్‌ విధానం సరైంది కాదని ఇటీవల అన్నారని కూడా నితీష్‌ కుమార్‌ చెప్పారు. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని జెడి(యు) సీనియర్‌ నేత ఉపేంద్ర కుష్వాహ (పిటిఐ వార్త, 2022 అక్టోబరు 16, బిజినెస్‌ స్టాండర్డ్‌) చెప్పారు. రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా బోధనా సిబ్బంది నియామకానికి యుజిసి జారీ చేసిన మార్గదర్శక సూత్రాలే దానికి నిదర్శనం అన్నారు.ఈ విధానం కింద నియమించిన 40 మందిలో ఒక్కరు కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వారు లేరన్నారు.దొడ్డిదారిన ఆర్‌ఎస్‌ఎస్‌ అభిమానులను ప్రవేశపెట్టే కుట్ర ఉందన్నారు.ఇప్పుడు ఆ పార్టీ బిజెపి చంకనెక్కిన సంగతి తెలిసిందే. జెడియు నేతలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్నపుడు అలాంటి మాటలుగాక మరోవిధంగా ఎలా మాట్లాడతారని కొందరు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు అదే నేతలు మాట మార్చి రిజర్వేషన్లు కొనసాగుతాయని ఇప్పుడు చెబుతున్నారు, వాటినెందుకు నమ్మాలి ?


బిజెపి నేతలు ఉత్సవిగ్రహాలు. దాని మూల విరాట్టులు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు గతంలో ఏం చెప్పారు ?కాషాయ దళాలు చెబుతున్న మాటల మీద రోజు రోజుకూ అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి ? ఇతర పార్టీల ప్రచారం వల్లనా లేక వారు చెప్పిన మాటలే అందుకు దోహదం చేస్తున్నాయా ? ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త, సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ వైద్య జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ(2017 జనవరి 20, ఏఎన్‌ఐ వార్త, బిజినెస్‌ స్టాండర్డ్‌, ఎన్‌డిటివి) ఉద్యోగాలు, విద్యా సంస్థలలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు త్వరలో పోవాలి. అందరికీ సమాన అవకాశాలు కావాలి తప్ప భారత్‌లో రిజర్వేషన్లు అవసరం లేదని, అవి వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తాయని చెప్పారు. సమాజంలో ఘర్షణ సృష్టిస్తాయని అందువలన వాటి మీద పునరాలోచన చేయాలన్నారు. కావాల్సింది అందరికీ సమాన అవకాశాలు తప్ప రిజర్వేషన్లు కాదు, సామాజికంగా అవకాశాలు రాని వారిని రిజర్వేషన్లు రక్షిస్తాయి కానీ అందరికీ సమాన అవకాశాలు పొందాలి, అది జరిగేంత వరకు తమ పట్ల వ్యత్యాసం చూపుతున్నారని, వేరు చేయబడ్డామనే భావం కలిగే ముప్పు ఉంది అన్నారు. ఇలా మాట్లాడటంపై విమర్శలు తలెత్తటంతో వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వివరణ ఇచ్చుకున్నారు. బాధ్యతల్లో పని చేశారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ తమ పత్రికలు ఆర్గనైజర్‌, పాంచజన్యలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్‌ విధానంపై ” సామాజిక సమీక్ష ” జరపాలని చెప్పారు. దాని మీద వివాదం తలెత్తటంతో అబ్బే అలాంటిదేమీ లేదు నూటికి నూరు శాతం రిజర్వేషన్లను గౌరవిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రకటన చేసింది.( ఇండియా టుడే, 2015 సెప్టెంబరు 23) తమ నేత భారత సమాజంలోని బలహీన వర్గాలందరికీ రిజర్వేషన్ల ఫలితాలు అందేలా ఆలోచించాలని కోరినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య ఒక ప్రకటన జారీ చేశారు.” వాటి మీద రాజకీయాలు చేయకుండా రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నట్లుగా రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తి ఉండేది కాదు, ప్రారంభం నుంచి వాటిని రాజకీయం చేశారు ” అని మోహన్‌ భగవత్‌ చెప్పారు.రిజర్వేషన్‌ విధానాన్ని రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోకుండా ఎవరికి అవసరం, ఎంతకాలం కొనసాగించాలి అనే దాన్ని పరిశీలించేందుకు పౌర సమాజ ప్రతినిధులతో రాజకీయరహిత కమిటీని ఏర్పాటు చేయాలని, వారు నిర్ణయించాలని కూడా భగవత్‌ చెప్పారు. దీనదయాల్‌ ఉపాధ్యాయ ప్రవచించిన సంపూర్ణ భావజాలానికి అనుగుణ్యంగానే భగవత్‌ మాట్లాడినట్లు ఆర్గనైజర్‌ పత్రిక సంపాదకుడు ప్రఫుల్ల కేల్కర్‌ సమర్ధించారు. ఇలా మాట్లాడటం అడ్డుపడటం, ఎస్‌సి, ఎస్‌టి,వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను బలహీనపరిచే యత్నమే అని జెడియు ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి అన్నారు. సంఘపరివార్‌ నేతలు తమ మనసులోని భావాలను బయట పెట్టటం, దాని మీద స్పందనలు ఎలా వస్తాయో చూడటం, బిజెపికి నష్టం కలిగించేవిగా ఉంటే వాటి మీద వివరణ ఇవ్వటం ఒక ఎత్తుగడ తప్ప చిత్తశుద్ధి కాదు.


కులం అనేది ప్రస్తుతం ఏమాత్రం సంబంధం లేనిదిగా మారినందున ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో దళితులు, గిరిజనులు, ఓబిసిలకు ఇచ్చిన రిజర్వేషన్లను వెంటనే ఎత్తివేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఎంజి వైద్య (మన్మోహన్‌ వైద్య తండ్రి) చెప్పారు.(2015 ఆగస్టు 31 హిందూ పత్రిక) గుజరాత్‌లో పటేల్‌ సామాజిక తరగతి రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న నేపధ్యంలో హిందూ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ఇప్పుడు ఏ ఒక్క కులం కూడా వెనుకబడి లేనందున కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని,మహా అయితే ఎస్‌సి,ఎస్‌టిలకు రిజర్వేషన్లు కొనసాగించవచ్చనీ అవి కూడా కేవలం పది సంవత్సరాలు మాత్రమే ఉండాలని, తరువాత పూర్తిగా రద్దు చేయాలని వైద్య చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక అగ్రనేత ఇలా మాట్లాడితే ఆ సంస్థ అధిపతి మోహన్‌ భగవత్‌ ఒక సందర్భంలో ఇలా అన్నారు.”వారిని(దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలవారి) రెండువేల సంవత్సరాల పాటు జంతువుల మాదిరి పరిగణించారు. అంత దీర్ఘకాలం వారు బాధలకు గురైనందున వారి లబ్దికోసం మరో రెండు వందల సంవత్సరాల పాటు ఇబ్బంది పడేందుకు జనాలు (ఇతర కులాలు) సిద్దపడాలి. అది అంతగా నేడు పైకి కనిపించకపోవచ్చు, కానీ సమాజంలో వారు ఇప్పటికీ వివక్షకు గురువుతున్నారు. ఇది కేవలం ఆర్థిక,రాజకీయ హక్కుల ప్రశ్న కాదు, ఇది సామాజిక సమానత్వ ప్రశ్న ” 2023 సెప్టెంబరు మొదటి వారంలో నాగపూర్‌లో అగర్వాల్‌ సామాజిక తరగతి విద్యార్ధుల కోసం నిర్వహిస్తున్న ఒక హాస్టల్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోహన్‌ భగవత్‌ ప్రసంగించారు.(సెప్టెంబరు ఆరవ తేదీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇతర అనేక పత్రికలు ఈ ఉపన్యాస వార్తలు ఇచ్చాయి)


ఓబిసి రిజర్వేషన్ల గురించి ఈ సందర్భంగా క్లుప్తంగా చెప్పుకోవటం అవసరం.మండల్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను సమీక్షించాలని కోరిన వారు కొందరైతే కాషాయ దళాలు వాటిని పరోక్షంగా వ్యతిరేకించాయి. అందుకే ఆ రోజుల్లో మండల్‌కు పోటీగా కమండల్‌ అని పత్రికల్లో వర్ణన వచ్చింది.రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి నుంచి ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.తరువాత బిసిలకూ వాటిని వర్తింప చేయాలన్న డిమాండ్‌కు ముందుకు వచ్చింది. జనతా పార్టీ ప్రధానిగా మొరార్జీ దేశారు ఉన్న సమయంలో బీహార్‌ మాజీ సిఎం బిందేశ్వరీ ప్రసాద్‌ మండల్‌ నాయకత్వంలో ఒక కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీ తిరిగి అధికారానికి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులను సమర్పించారు. ఆమె దాన్ని పక్కన పడేశారు.తరువాత రాజీవ్‌ గాంధీ కూడా దాన్ని పట్టించుకోలేదు.విపి సింగ్‌ ప్రధాన మంత్రి అయిన తరువాత దుమ్ముదులిపి నివేదికను బయటకు తీశారు.రిజర్వేషన్ల వ్యతిరేకులు పెద్ద ఎత్తున రంగంలోకి వచ్చినప్పటికీ అమల్లోకి వచ్చింది. మండల్‌కు పోటీ బిజెపి కమండల్‌ అజెండాతో రామ జన్మభూమి వివాదాన్ని ముందుకు తెచ్చిందనే విమర్శలు ఆరోజుల్లో వెలువడ్డాయి. రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఉండటంతో అనేక మంది తమను ఓబిసి జాబితాలో చేర్చాలనే డిమాండ్లతో ముందుకు వచ్చారు.వారిని సంతుష్టీకరించేందుకు రిజర్వేషన్లపై సమీక్ష జరగాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చెప్పారు.తరువాత ఇబిసి కోటాను ముందుకు తెచ్చారు.


రిజర్వేషన్లు రాజ్యాంగబద్దమే అయినప్పటికీ అవిశాశ్వతంగా ఉండాలని పేర్కొనలేదు. కనుకనే పది సంవత్సరాలకు ఒకసారి వాటి లక్ష్యం నెరవేరని కారణంగా పొడిగించుకుంటూ వస్తున్నారు. అనేక మంది తమకూ వర్తింప చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.సమాజంలో ఆర్ధిక, విద్యా రంగాలలో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ కూడా ఉంది.మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ముస్లింలను బిసిలుగా పరిగణించి రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటికే ఉన్న వారికి అన్యాయం జరుగుతుందంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏమిటీ విడ్డూరం అనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఇప్పుడు కల్పిస్తున్న రాజ్యాంగబద్ద రిజర్వేషన్లలో మత ప్రాతిపదిక లేదా ? మతాన్ని ఎవరైనా మార్చుకోవచ్చు, కులానికి అలాంటి అవకాశం లేదు. షెడ్యూలు కులాలు, తరగతులకు చెందిన వారు సిక్కు, బౌద్ద మతాల్లోకి మారితే వారిని దళితులుగానే భావిస్తూ రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నారు. క్రైస్తవమతాన్ని స్వీకరిస్తే వారు బిసి రిజర్వేషన్లు పొందవచ్చు.అదే ఇస్లాంను స్వీకరిస్తే మతం మారినందున అసలు రిజర్వేషన్లే వర్తించవు.ఎందుకు అంటే ఇస్లాంలో కులం లేదు గనుక వివక్ష ఉండదు అన్నారు. సిక్కు, బౌద్దంలో కూడా కుల పట్టింపులేనప్పటికీ ఎందుకు వర్తింప చేస్తున్నారన్నదే ప్రశ్న. ఈ అంశంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నది. ఇస్లాంలో కులం లేకున్నా వెనుకబాటు తనం ఉంది కదా ? ఆ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు ? ఓబిసి రిజర్వేషన్లు కల్పించినపుడు అది వర్తించని కులాల వారు తమ అవకాశాలను లాగివేశారని వ్యతిరేకించారు. ఇప్పుడు ముస్లింలను బిసిలుగా పరిగణించి రిజర్వేషన్లు కల్పిస్తే మీ వాటా తగ్గిపోతుందంటూ వెనుకబడిన తరగతుల వారిని రెచ్చగొడుతున్నారు.నాడూ నేడూ దాని వెనుక ఉంది అసలు మొత్తంగా రిజర్వేషన్లను వ్యతిరేకించేవారి రాజకీయమే.


ఒక వైపు సామాజిక వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లను సమర్ధిస్తామని చెబుతున్న కాషాయ దళాలు ప్రపంచంలో ఏ నాకరిక సమాజంలోనూ లేని అంటరాన్ని తనాన్ని రుద్దిన సనాతనధర్మం, మనుస్మృతిని కాపాడాలని చెప్పటమే కాదు, తామే వాటి అసలైన పరిరక్షకులమని చెప్పుకొనేందుకు సిగ్గుపడటం లేదు. రాజ్యాంగం కంటే మనుస్మృతి గొప్పదని చెప్పిన పెద్దలు. 1949 నవంబరు 30వ తేదీ ఆర్గనైజర్‌ పత్రిక సంపాదకీయంలో వెలిబుచ్చిన అభిప్రాయమే ఇప్పటికీ వారిలో ఉంది.” కానీ మన రాజ్యాంగంలో పురాతన భారత్‌లో అపూర్వమైన రాజ్యాంగ వృద్ది గురించిన ప్రస్తావనే లేదు. స్పార్టా లైకుర్‌గుస్‌ లేదా పర్షియా సోలోన్‌ కంటే ఎంతో ముందుగానే మనుస్మృతి లిఖితమైంది.ఈ రోజుకూ మనుస్మృతిలో మను రాసిన చట్టాలు ప్రపంచ వ్యాపితంగా ఆరాధించాలన్న ప్రేరేపణ ఇస్తాయి.వాటికి విధేయులై ఉండాలని, అనుగుణంగా నడుచుకోవాలనే భావాలను వ్యక్తం చేయిస్తాయి. కానీ మన రాజ్యాంగ పండితులకు దానిలో ఏమీ కనిపించలేదు.” ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా పని చేసిన ఎంఎస్‌ గోల్వాల్కర్‌ ” హిందూ దేశం ఎందుకు ” అనే పుస్తకంలో ఇలా రాశారు.” ఒక వ్యక్తి ఎలాంటి అవగాహన లేకుండా తన ఇంటిలోని పిల్లలు, దొంగలకు సమాన హక్కులు, సంపదలను అందరికీ పంచినట్లుగా దురదృష్టం కొద్దీ మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఇచ్చారు. ” మేకలను మింగటానికి వెళితే భయపడే అవకాశం ఉన్నందున ఒక పులి మేకతోలు కప్పుకున్నదట. అదే మాదిరి ఇలాంటి భావజాలానికి కట్టుబడి ఉంటామని నిత్యం ప్రమాణాలు, పారాయణాలు చేస్తున్న వారే బిజెపి నేతలు. అందుకే వారు నాలుగువందల సీట్లు కావాలంటే తమ అజెండాను అమలు జరిపేందుకు చూస్తున్నారనే అనుమానాలు జనాల్లో పెరుగుతున్నాయి. బిజెపి, కాషాయదళం నిత్యం అంబేద్కర్‌ భజన చేస్తున్న సంగతి తెలిసిందే. నరేంద్రమోడీ ఆ గుంపు వ్యక్తే. అంబేద్కర్‌ 1927 డిసెంబరు 25న బహిరంగంగా మనుస్మృతిని దగ్దం చేశారు.కుల అణచివేతను మనుస్మృతి వ్యవస్థీకృతం కావించింది. సమాజంలోని ఒక తరగతి అత్యధికులుగా ఉన్న వారి అణచివేత, దోపిడీని అది సమర్ధించింది. అగ్రకులం అని పిలిచే జనాలు అత్యధికులుగా ఉన్నవారి మీద వివక్ష చూపటాన్ని అది సమర్ధించింది అని అంబేద్కర్‌ చెప్పారు. అలాంటి మనువాదులే నేడు సనాతనం పేరుతో తిరిగి దాన్ని పునరుద్దరించాలని చూస్తున్నారు. తన బొందిలో ప్రాణం ఉండగా దాన్ని జరగనివ్వను అనే మాట నరేంద్రమోడీ నోట రాదేం. అణచివేత, వివక్ష, దోపిడీని సమర్ధిస్తున్నట్లా ?

గాజా మారణకాండకు నిరసన : అమెరికా నుంచి ఐరోపా వరకు విద్యార్థుల ఆందోళనలు !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు వ్యతిరేకంగా అనేక చోట్ల ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో వెల్లడైన విద్యార్థుల నిరసన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దాని ప్రభావం ఇతర దేశాల మీద కూడ పడుతుండటంతో మొగ్గలోనే తుంచి వేయాలన్నట్లుగా అణచివేసేందుకు దమనకాండ జరుపుతున్నారు.తొలుత ఆందోళన ప్రారంభమైన కొలంబియా విశ్వవిద్యాలయంలో మంగళవారం నాడు న్యూయార్క్‌ పోలీసులు ప్రవేశించి పెద్ద సంఖ్యలో అరెస్టులతో పాటు ప్రధాన భవనాన్ని ఆక్రమించిన విద్యార్ధులను బలవంతంగా తొలగించారు.జనాన్ని తప్పుదారి పట్టించేందుకు వక్రీకరణలతో ప్రచారం చేస్తున్నారు.విద్యార్థులకు ద్రవ్య పెట్టుబడిదారు జార్జి సోరోస్‌, ఇతరులు నిధులు అందచేస్తున్నారు. అది యూదు వ్యతిరేక ఆందోళన, బయటి వారు చేరారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులు విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో గుడారాలు వేసుకొని నిరసన తెలుపుతున్నారు.వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జార్జి సోరోస్‌ కుటుంబానికి చెందిన సంస్థలు, రాక్‌ఫెల్లర్‌ సోదరుల నిధి, బ్యాంకర్‌ ఫెలిస్‌ గెల్‌మాన్‌ తదితరులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నారన్నది ఆరోపణ. ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలో పాల్గ్గొన్నవారి మీద కూడా ఇలాంటి నిందలే వేశారు. రైతులైన వారు ఖరీదైన కార్లలో ఎలా వచ్చారు అని ప్రచారం చేసినట్లుగానే అమెరికా విద్యార్థులకు అవసరమైన గుడారాలు, అక్కడ ఉంటూ తింటున్న పీజాలు, బర్గర్లకు డబ్బు ఎక్కడిది, ఆందోళనలో ఉన్నవారందరూ కలిగిన ఉన్నత కుటుంబాలకు చెందినవారు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు.పాలస్తీనియన్ల హక్కుల కోసం పని చేసే వారిలో నెలకు 2,880 నుంచి 7,800 డాలర్ల వరకు స్టైఫండ్‌ పొందుతున్నవారు ఉన్నారని, విదేశీ నిధులు వస్తున్నాయని, విశ్వవిద్యాలయాల పరిసరాల్లో తిష్టవేసి వేరే పనిపాటలు లేకుండా ఆందోళనలను రెచ్చగొట్టేందుకు మాత్రమే పని చేసే వారున్నారని ఇలా ఎన్నో ప్రచారాలు.


విద్యార్థులు, వారికి మద్దతు ఇస్తున్న అకడమీషియన్లు ముందుకు తెస్తున్న డిమాండ్లేమిటి ? మొత్తంగా చూసినపుడు గాజా మీద ఇజ్రాయెల్‌ మారణకాండను తక్షణమే నిలిపివేయాలన్నది ప్రాధమిక అంశం. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న లేదా ప్రస్తుత దాడులతో లబ్దిపొందుతున్న ఆయుధ సంస్థలలో ఉన్న వందల కోట్ల డాలర్ల పెట్టుబడులను విశ్వవిద్యాలయాలు ఉపసంహరించాలి. కొలంబియా, హార్వర్డ్‌ వంటి విశ్వవిద్యాలయాలు భారీ మొత్తాలలో ఇలాంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాలను సిబ్బందికి వేతనాలు, స్కాలర్‌షిప్పులు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో ఉన్న అకడమిక్‌ సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలి. గాజాలో దాడుల నిలిపివేతతో సహా మానవహక్కుల పరిరక్షణ ఉద్యమాలకు విశ్వవిద్యాలయాలు మద్దతు ఇవ్వాలి.పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న విద్యార్ధులపై దమనకాండ నిలిపివేయాలి.విశ్వవిద్యాలయాల పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ కొత్తదేమీ కాదు. గతంలో దక్షిణాఫ్రికాలో జాత్యహంకార పాలకులతో, ప్రభుత్వాలతో సంబంధాలున్న సంస్థల నుంచి 155 విశ్వవిద్యాలయాలు పెట్టుబడులను వెనక్కు తీసుకున్నాయి, సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. అంతే కాదు అమెరికాలో ప్రైవేటు జైళ్ల నిర్వహణ కంపెనీలు, పర్యావరణానికి హానిచేసే చమురు కంపెనీలలో పెట్టుబడులను కొన్ని విద్యాసంస్థలు వెనక్కు తీసుకున్నాయి. ఇక ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను సమర్ధించేవారు దానితో సంబంధాలున్న సంస్థల నుంచి పెట్టుబడులను వెనక్కు తీసుకోవటం చట్టవిరుద్దం, ఇజ్రాయెల్‌ నాశనాన్ని కోరుకోవటమే అని వాదిస్తున్నారు.


విద్యార్థుల ఆందోళన ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు, ఐరోపాకూ విస్తరించాయి.లండన్‌ విశ్వవిద్యాలయ కాలేజీ విద్యార్థులు ప్రదర్శన చేశారు. గాజా మారణకాండ నిలిపివేయాలని, ఇజ్రాయెల్‌ నేరాలకు నిధులు ఇవ్వరాదంటూ బ్రిటన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఫ్రెంచి రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత పో యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల విద్యార్థుల ప్రదర్శనకు పోటీగా ఇజ్రాయెల్‌ అనుకూలురు రావటంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. పాలస్తీనా అనుకూలురు కాంపస్‌లోని భవనాన్ని ఆక్రమించి జెండాలను ఎగురవేశారు. విశ్వవిద్యాలయ పాలకవర్గం ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండించాలని డిమాండ్‌ చేశారు. అన్ని విశ్వవిద్యాలయాలకూ ఆందోళన విస్తరించనున్నదని చెప్పారు. టర్కీ, ఆస్ట్రేలియాలో కూడా నిరసన వెల్లడైంది.కెనడాలోని మాంట్రియల్‌,కాంకోర్డియా విశ్వవిద్యాలయాల విద్యార్ధులు కూడా ఆందోళనకు దిగారు. పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ మెక్‌గిల్‌ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్ధులు 5,964(మొత్తంలో 80 శాతం) మంది ఆమోదించిన విధానాన్ని విశ్వవిద్యాలయం గౌరవించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా ప్రారంభించారు.ఇజ్రాయెల్‌ కంపెనీలలో ఉన్న పెట్టుబడులను వెనక్కు తీసుకోవాలని, సంబంధాలను తెంచుకోవాలని కూడా ఆమోదించిన విధానంలో ఉందని వారు గుర్తు చేశారు. విద్యార్ధుల అభిప్రాయసేకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌పై విచారణ ముగిసేవరకు పాలస్తీనాకు అనుకూలంగా ఎలాంటి వివాదాస్పద విధానాన్ని ఆమోదించకూడదని విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘాన్ని క్విబెక్‌ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.దీన్ని అవకాశంగా తీసుకొని విశ్వవిద్యాలయం విద్యార్థులను బెదిరిస్తున్నది.ఇజ్రాయెల్‌కు యుద్ద విమానాలను సరఫరా చేసిన లాక్‌హీడ్‌ మార్టిన్‌,సాఫ్రాన్‌ అనే ఒక ఫ్రెంచి కంపెనీలో రెండు కోట్ల డాలర్లకు పైగా ఉన్న మెక్‌ గిల్‌ విశ్వవిద్యాలయ పెట్టుబడులను వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఓటింగ్‌ను గౌరవించేంతవరకు ధర్నా కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.లండన్‌లో వివిధ తరగతులకు చెందిన వారు రెండు లక్షల మంది ప్రదర్శన చేశారు. పాలస్తీనాకు సంఘీభావంగా జరుగుతున్నవాటిలో ఇది పన్నెండవది. ప్రతి ప్రదర్శనలో కొత్తవారు చేరుతున్నారని నిర్వాహకులు వెల్లడించారు. అమెరికాలో విద్యార్థులు వీధుల్లోకి రావటం తమనెంతో ఉత్తేజపరిచిందని చెప్పారు.


అమెరికా విశ్వవిద్యాలయాల్లో యూదు వ్యతిరేక ప్రచారం జరుగుతున్నదని ఆరోపించిన అధికార యంత్రాంగం ఆ సాకుతో విద్యార్థులను అణచేందుకు పూనుకుంది.పలు చోట్ల వందలాది మందిని అరెస్టు చేసింది, అనుమతి లేకుండా ప్రాంగణాలలో ప్రవేశించారంటూ తప్పుడు కేసులు బనాయించారు.గుడారాలను తొలగించి ధ్వంసం చేశారు.ఈ చర్యలకు నిరసగా బోస్టన్‌ తదితర చోట్ల అనేక మంది విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేశారు. తమ కాలేజీతో సంబంధం లేని వారు విద్యార్థుల్లో చొరబడి యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టారని, యూదులను చంపాలని ప్రేరేపించారని దీన్ని సహించేది లేదంటూ కాలేజీ యాజమాన్యం ప్రకటన చేసింది. అలాంటి దేమీ లేదని విద్యార్ధులు ఖండించారు. ఇజ్రాయెల్‌ అనుకూల ప్రదర్శకులే రెచ్చగొడుతూ మాట్లాడారని పేర్కొన్నారు.మసాచుసెట్స్‌ సాంకేతిక సంస్థ కూడా అలాంటి ఆరోపణలే చేసింది. తొలుత కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరసన ప్రారంభించారు. తరువాత దేశమంతటా వ్యాపించింది. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పట్టాల ప్రదాన కార్యక్రమాన్ని అడ్డుకుంది. సినీదర్శకుడు జాన్‌ ఎం చు ప్రధానవక్తగా చేయాల్సిన ప్రసంగాన్ని రద్దు చేశారు. పాలస్తీనియన్లకు బహిరంగంగా మద్దతు తెలపటమే అతను చేసిన తప్పిదం.


ఇజ్రాయెల్‌ దురాగతాలకు వ్యతిరేకత వెల్లడిస్తున్న విద్యార్థుల నిరసనలను అణచివేస్తున్న తీరు అమెరికా చెప్పే మానవహక్కులు, భావ ప్రకటనా స్వేచ్చ, ప్రజాస్వామ్య కబుర్ల వంచను వెల్లడిస్తున్నది. విద్యార్ధుల మీదనే కాదు కొన్ని చోట్ల రోడ్ల మీద ఉన్న ఇతర పౌరులను కూడా అమెరికా పోలీసులు వదల్లేదు. అట్లాంటా ఎమోరీ విశ్వవిద్యాలయంలో టాసర్‌(విద్యుత్‌) తుపాకులు, భాష్పవాయు ప్రయోగం కూడా చేశారు. విద్యార్దులపై దమనకాండకు పాల్పడవద్దంటూ అడ్డుకొనేందుకు చూసిన ప్రొఫెసర్‌ కరోలిన్‌ ఫోలిన్ను పోలీసులు నెట్టివేశారు. దాంతో ఆమె తలకు గాయమైంది. కొన్ని చోట్ల రబ్బరు బుల్లెట్లను కాల్చారు, ఆశ్వికదళాన్ని మోహరించారు. మరికొన్ని చోట్ల విద్యా సంస్థల పరిసర భవనాలపై తుపాకులతో కాపాలా ఉన్న భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. పలు చోట్ల మిలిటరీ దుస్తులతో ఉన్న దళాల కవాతు జరిపి భయపెట్టాలని చూశారు. టెక్సాస్‌ విశ్వవిద్యాలయాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో తాము తరగతులను నిర్వహించేది లేదని, ఇతర విద్యా సంబంధ పని కూడా చేసేది లేదని అక్కడి సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నేషనల్‌ గార్డులను(మన సిఆర్‌పిఎఫ్‌ మాదిరి) రంగంలోకి దించాలని సెనెట్‌ సభ్యుడు జోష్‌ హాలే డిమాండ్‌ చేశాడు. నిజానికి అదే చేసి ఉంటే నిరసనలు మరింత తీవ్రంగా ఉండేవి. గాజాలో రోజురోజుకూ దమనకాండ పెరగటం దానికి అమెరికా మద్దతు ఇవ్వటంతో జనంలో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమే విద్యార్థుల కార్యాచరణ అన్నది స్పష్టం. రెండు దశాబ్దాలకు పైగా విదేశాంగశాఖలో అరబిక్‌ భాష ప్రతినిధిగా పనిచేసిన హలా హారిట్‌ గాజాపై అమెరికా విధానానికి నిరసనగా రాజీనామా చేశాడు. ఇదే సమస్యపై గతంలో మరో ఇద్దరు అధికారులు రాజీనామా చేశారు. ఒక వైపు ఎన్నికలు, మరోవైపు ఇజ్రాయెల్‌కు మద్దతుగా మరింతగా ముందుకు వెళితే నిరసనలు హింసాత్మకంగా మారితే తన పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో జో బైడెన్‌ ఉన్నట్లుగా చెబుతున్నారు. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ గౌల్డ్‌ ప్లాజా భవనాన్ని ఆక్రమించి ధర్నాకు దిగిన వారు ఖాళీ చేయకపోతే శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చేసిన బెదిరింపులను ఖాతరు చేయలేదు. ఇలా అనేక చోట్ల జరిగింది. గాజా పౌరులు ఎదుర్కొంటున్న ముప్పుకంటే తామెదుర్కొంటున్నది చాలా స్వల్పమని విద్యార్ధులు బదులు చెబుతున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో నిరసన తెలుపుతున్న విద్యార్ధులకు మద్దతుగా వెయ్యి మంది బోధనా సిబ్బంది విశ్వవిద్యాలయ అధ్యక్షుడికి ఒక లేఖ రాశారు. సమాజంలో ఆర్థిక పరమైన అంశాలతో జరిగే ఆందోళనలకు విద్యార్ధులు మినహాయింపు కాదు. గత కొద్ది రోజులుగా అమెరికా, ఐరోపాల్లో జరుగుతున్న ఆందోళనల వెనుక ఆర్థిక డిమాండ్లు లేవు. గాజాలో మారణకాండ సాగిస్తున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌, దానికి సంపూర్ణ వత్తాసు పలుకుతున్న తమ పాలక వర్గాలకు వ్యతిరేకంగా చైతన్యయుతంగా సాగిస్తున్న ఉద్యమం ఇది. గతంలో వియత్నాంలో అమెరికా సాగించిన దురాక్రమణ మీద పెద్ద ఎత్తున విద్యార్ధులు వెల్లడించిన తరువాత ఒక అంతర్జాతీయ సమస్య మీద మరోసారి ఈ పరిణామం సంభవించింది. ఇది కేవలం ఇజ్రాయెల్‌ తీరునే కాదు దానికి మద్దతుగా ఉన్న అమెరికా మధ్యప్రాచ్య వైఖరిని కూడా వ్యతిరేకించటమే.

.హొ