Tags
Anti communist, Anti Trump, capitalism or socialism, communism, Donald trump, Joe McCarthy', Kamala Harris, Leftist Zohran Mamdani, Socialism
ఎం కోటేశ్వరరావు
అమెరికాలో ఉన్న మీడియా, కొంత మంది ప్రముఖ వ్యాఖ్యాతలు తెలిసిగానీ తెలియకగానీ, వ్యతిరేక భావంతో, వక్రీకరించి సోషలిజం, కమ్యూనిజాల గురించి తెగ ప్రచారం చేస్తున్నారు. యువత వామపక్ష భావాలవైపు మళ్లకుండా ఉండాలంటే ఇదే దారి అని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ” ట్రంప్ సోషలిస్టా ? మీడియా అలా ఆలోచిస్తున్నది ” అనే శీర్షికతో ట్రిల్ అనే మాగజైన్ సెప్టెంబరు 26న ఒక విశ్లేషణ రాసింది. దాని సారాంశం ఇలా ఉంది. మీడియా, కొంత మంది ప్రముఖులు ట్రంప్ చర్యలను కొన్నింటిని వర్ణించేందుకు సోషలిస్టు అనే పదాన్ని వినియోగించినట్లు, ఆ పదం సరైనదేనా అంటూ వర్ణన సాగింది. గతనెలలో అట్లాంటిక్ పత్రిక ప్రచురించిన ఒక వ్యాసానికి ” ట్రంప్ మితవాద సోషలిజం ” అనే శీర్షిక పెట్టింది. ప్రైవేటు రంగంలో ఉన్న మీడియా, విశ్వవిద్యాలయాలు, న్యాయ కంపెనీల పట్ల ట్రంప్ నిరంకుశ పోకడలను ప్రత్యేకంగా ప్రస్తావించి ఆట్లాంటిక్ పత్రిక విశ్లేషణ రాసింది. ఈ పూర్వరంగంలో అనేక ప్రసారాల్లో, ప్రముఖులు కూడా ట్రంప్ జోక్యాల మీద అలాంటి వర్ణనలు చేస్తున్నారు.వారిలో కాలిఫోర్నియా డెమోక్రటిక్ గవర్నర్ గావిన్ న్యూసమ్ ఒకడు. రిపబ్లికన్ పార్టీ సెనెటర్ రాండ్ పాల్ కూడా సోషలిజం వైపుగా ఒక అడుగు వేసినట్లు ట్రంప్ గురించి వ్యాఖ్యానించాడు. ఫార్యూన్ పత్రిక ” మాగా (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ -అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలపండి) కార్యక్రమం మార్క్సిస్టుగా ఇంకా చెప్పాలంటే పెరిగి మావోయిస్టుగా ” ఉన్నట్లు పేర్కొన్నది. ఇక న్యూయార్క్ టైమ్స్ పత్రికైతే పెట్టుబడిదారీ విధానం మీద దాడి అంటూ ట్రంప్ చర్యలను వర్ణించింది.అధ్యక్షుడిని కామ్రేడ్ అని వర్ణించింది. ఇంటెల్ కంపెనీలో పదిశాతం వాటాలను ప్రభుత్వం తీసుకోవటాన్ని సోషలిజంగా వ్యాఖ్యాత పేర్కొన్నాడు.
సోమవారం నాడు డెమోక్రటిక్ పార్టీకి చెందిన మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ” మనం ఒక కమ్యూనిస్టు నియంత ” తో వ్యహరిస్తున్నాం అని చెప్పారు. ” నూట ఏడు రోజుల జ్ఞాపకాలు ” అనే పేరుతో రాసిన సంకలనాన్ని ఆమె విడుదల చేశారు. ట్రంప్ రెండవ ఏలుబడి ఎలా ఉంటుందో ఆమె జోశ్యం చెప్పారు. ప్రైవేటు రంగం అణగిమణిగి ఉంటుందని తాను అనుకోవటం లేదని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఒక టీవీలో మాట్లాడుతూ పరిశ్రమలో అగ్రగణ్యులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉంటారని ఆశించానని, వారు మౌనంగా ఉన్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ విధానాన్ని నిలబెడుతుంది, పెట్టుబడిదారీ విధానం ప్రజాస్వామ్యంలో వర్ధిల్లుతుంది అన్నారు. గత ఏడాది తాను ట్రంప్‌ను ఒక క్రూరుడు అని వర్ణించానని ఇప్పుడు అతనితోనే పని చేస్తున్నామని చెప్పారు. మన ప్రజాస్వామ్యాన్ని కమ్యూనిస్టు నియంతలతో పోలిస్తే మనం ఇప్పుడు నియంత ట్రంప్‌తోనే వ్యవహరిస్తున్నామన్నారు.కార్పొరేట్ శక్తులు ట్రంప్ బెదిరింపులకు భయపడి నోరు విప్పటం లేదని చెప్పారు.
అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో, వక్రీకరించటంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు దొందూ దొందే. ఈ రెండు పార్టీలను అనుసరించే మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించినట్లుగా వ్యవహరిస్తున్నాయి. వారెంతగా రెచ్చగొట్టినా అక్కడ జరుగుతున్నదానిని చూస్తే ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండీ అంటూ మహాకవి శ్రీశ్రీ యువతరానికి ఆహ్వానం పలికాడు. ఇటీవలి కాలంలో అమెరికాలో జడ్ జనరేషన్ సోషలిజం, కమ్యూనిజం పట్ల సానుకూలతను వ్యక్తం చేయటాన్ని చూస్తే సోషలిస్టు జగన్నాధ రధ చక్రాలను అడ్డుకోవటం శత్రువుల వల్లకాదన్నది స్పష్టం.పెట్టుబడిదారీ విధాన కుంభస్థలం వంటి న్యూయార్క్ నగరంలో నవంబరులో జరిగే మేయర్ ఎన్నికలో డెమోక్రటిక్ సోషలిస్టు జోహ్రాన్ మమ్దానీ తాజా సర్వేల ప్రకారం 45శాతం ఓట్లతో ముగ్గురు ప్రత్యర్ధులకంటే ఎంతో ముందున్నాడు. సమీప ప్రత్యర్ధి, డెమోక్రటిక్ పార్టీ తిరుగుబాటు నేత మాజీ గవర్నర్ ఆండ్రూ కుమో 25శాతం దగ్గరే ఉన్నాడు. అదే పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్ కూడా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు.న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డెమోక్రటిక్ సోషలిస్టు జోహ్రాన్ మమ్దానీకి ఓటు వేయాలని కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హౌచుల్ ప్రకటన చేయటంతో డోనాల్డ్ ట్రంప్ చిందులు తొక్కాడు. గత కొద్ది నెలలుగా తాను మేయర్ ఎన్నికల్లో జోక్యం చేసుకోనంటూ గవర్నర్ దూరంగా ఉండి ఆకస్మికంగా మద్దతు ప్రకటించింది. దాంతో కేంద్రం ఇచ్చే నిధులు నిలివేస్తానని ట్రంప్ బెదిరించాడు.కరుడు గట్టిన కమ్యూనిస్టుకు గవర్నర్ మద్దతు ప్రకటించాడంటూ వ్యాఖ్యానించాడు.అదెలా జరుగుతుంది, వాషింగ్టన్ (ఫెడరల్ ప్రభుత్వం) పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్నదని పేర్కొన్నాడు.మమ్దానీ ఎన్నికైతే పోలీసు యంత్రాంగానికి నిధుల కోత పెడతాడని, పౌరులకు రక్షణ ఉండదని వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దారుణాలను వ్యతిరేకించటం, పాలస్తీనియన్లకు మద్దతు ప్రకటించటాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ధనికుల మీద పన్నులు పెంచుతానంటూ చేసిన వాగ్దానంతో ధనికులుగా ఉన్నవారు ఎలాగైనా ఓడించాలని పెద్ద ఎత్తున డబ్బు సంచులతో రంగంలోకి దిగారు. ఆ పన్నులతో నగర పౌరులకు ఉచిత బస్ ప్రయాణం, పిల్లల సంరక్షణ కేంద్రాలు, కార్పొరేషన్ తరఫున చౌకధరలకు సరకులను అందించే దుకాణాలను ప్రారంభిస్తానని, అద్దెలను పెంచకుండా చూస్తానని కూడా మమ్దానీ చెప్పాడు.
గతంలో సోషలిజం విఫమైంది అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరగింది. ఇప్పుడు సోషలిజం విఫలమైంది అనే భావన రోజు రోజుకూ పెరుగుతున్నది. ఇటీవల కాటో, యు గవ్ సంస్థలు జరిపిన సర్వేలో అమెరికా సమాజంలో మార్పులు కనిపించాయి. విద్యా సంస్థలు, మీడియాలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం యువత మీద పెద్దగా కనిపించటం లేదని చెప్పవచ్చు. మొత్తంగా సోషలిజం పట్ల 43, కమ్యూనిజం పట్ల 14శాతం, 18-29 ఏండ్ల మధ్య వయస్సువారిలో సోషలిజం పట్ల 62శాతం, కమ్యూనిజం పట్ల 34శాతం మంది సానుకూల వైఖరిని వెల్లడించారు. అమెరికా సమాజంలో 18-29 సంవత్సరాల వయస్సు వారు 5.2కోట్ల మంది ఉన్నారు, అంటే 3.2 కోట్ల మంది సోషలిజం పట్ల సానుకూలతను ప్రదర్శించినట్లు అయితే సోషలిజం అంటే ఏమిటో నిర్వచించలేదు గనుక స్పష్టత లేదని కొందరు భాష్యం చెబుతున్నారు. కొంత మంది అలా ఉన్నప్పటికీ సైద్దాంతిక చర్చ జరుగుతున్నది గనుక తెలుసుకోవటం అసాధ్యమేమీ కాదు.డెమోక్రటిక్ పార్టీలో 66శాతం మంది సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నారని కూడా సర్వేలు వెల్లడించాయి. అసలు విషయం ఏమంటే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇది పెద్ద దెబ్బ.సోషలిజానికి అనుకూలమా కాదా అనేదాని కంటే పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందని గ్రహించటం కూడా పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. డోనాల్డ్ ట్రంప్ మరియు సోషలిజం గురించి వ్యంగ్యంగా ఉక్రోషంతో మీడియా ఏమి రాసినప్పటికీ అసలు సోషలిజం అంటే ఏమిటి అని తెలుసుకొనేవైపు యువతను నెడుతుండటం ఒక విధంగా మంచి పరిణామమే.
మొత్తంగా సమాజంలో 14 శాతం, 18-29 ఏండ్ల యువతలో 34శాతం మంది కమ్యూనిజం పట్ల సానుకూలత వ్యక్తం చేయటాన్ని జీర్ణించుకోలేని వారు కమ్యూనిజం పని చేయదని యువతరం తెలుసుకోవాలంటూ విశ్లేషణలు రాస్తున్నారు. పాత చింతకాయ పచ్చడి జాడీల దుమ్ముదులుపుతున్నారు. సోషలిజం పని చేయకపోతే వివిధ రంగాలలో కమ్యూనిస్టు చైనా నేడు అమెరికాను సవాలు చేసే స్థితికి ఎలా ఎదిగిందన్నదానికి సమాధానం చెప్పటం లేదు.ఆస్ట్రేలియాలోని లేబర్ పార్టీ నిజానికి ఒక బూర్జువా పార్టీ తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం అధికారంలో ఉంది. దాని పోకడ నయా కమ్యూనిజం వైపు ఉన్నదంటూ వ్యతిరేకులు ధ్వజమెత్తుతున్నారు. వారు చూపుతున్న కారణాలేమిటంటే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతున్నదన్నది ఒకటి. స్వేచ్చ తక్కువగా ఉండే విధానాలను అనుసరిస్తున్నదని, ఆ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోలేకపోతున్నదని, ప్రధాని ఆల్బనీస్ రాజకీయ జీవితం ప్రారంభ దినాల్లో కమ్యూనిస్టు ఉద్యమంతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాడని, కమ్యూనిస్టులను పొగిడాడని, కొంత మంది లేబర్ పార్టీ నేతలకు చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని, చైనా బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులతో కలసి భోజనం చేశారని, గతంలో ఆల్బనీస్ పొరుగున ఉన్న విక్టోరియా రాష్ట్ర మాజీ ప్రధాని డేనియల్ ఆండ్రూస్ చైనాను చూసి కరోన సమయంలో కఠిన నిబంధనలను అమలు జరిపాడని, చైనా మిలిటరీ పరేడ్‌కు వెళ్లాడని, రెండవసారి గెలిచిన తరువాత షీ జింపింగ్‌తో భేటీ కోసం ఆల్బనీస్ ఆరు రోజుల పాటు జరిపిన చైనా పర్యటన అనుమానాస్పదంగా ఉందంటూ ఒక వ్యాఖ్యాత తన చౌకబారు తనాన్ని వెల్లడించుకున్నాడు.
సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఐరోపా, ఇతర అనేక దేశాల్లో ఇలాంటి వక్రీకరణలు నిత్యకృత్యం. అగ్రభాగాన ఉన్న అమెరికాలో న్యూయార్క్, మినియపోలిస్ పట్టణ మేయర్లకు జరిగే ఎన్నికలలో డెమోక్రటిక్ సోషలిస్టులు జోహ్రాన్ మమ్దానీ, ఓమా ఫతే పోటీ చేస్తున్నారు. వారు ఓడినా, గెలిచినా అమెరికాలో పెనుమార్పులు ఇప్పటికిప్పుడు జరగవు. అయినప్పటికీ పాలకవర్గం భయపడుతున్నది. అందుకే సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్దాంతాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచార దాడికి మరోసారి పూనుకున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి పెట్టింది పేరైన జో మెకార్ధీ తిరిగి రావాల్సిన అవసరం ఉందని కొందరు పిలుపు ఇచ్చారంటేనే మితవాదశక్తులు బెంబేలెత్తుతున్నట్లు స్పష్టం అవుతున్నది. అందుకే కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తులు నయా మెకార్థిజాన్ని ఎదుర్కోవటంలో గతంలో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వకూడదని నిర్ణయించాయి.దాన్లో భాగంగా మధనం జరుపుతున్నాయి.ట్రంప్ పోకడలు మెకార్థీని పోలి ఉన్నట్లు చెబుతున్నారు.1950 దశకంలో జో మెకార్థీ ఒక రిపబ్లికన్ సెనెటర్. అబద్దాలు చెప్పటంలో పేరుమోసిన వాడు.ఒక నిచ్చెన మీద నుంచి పడిపోయినపుడు తగిలిన గాయం తాను యుద్ధంలో పాల్గొన్నపుడు అయిందని జనాన్ని నమ్మించాడు. ఒక గొప్ప ప్రజాస్వామ్యం(నిజానికి అదొక భ్రమ) నాశనం అయిందంటే దానికి కారణం అంతర్గత శక్తులు తప్ప వెలుపలి నుంచి వచ్చిన ముప్పు కాదని అనేక మంది ప్రముఖులు చెప్పారు. ఇప్పుడు అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అండ్ కో నుంచే అది జరుగుతున్నది. నాడు మెకార్థి చేసిన ప్రచారం ఏమంటే విద్రోహులైన కమ్యూనిస్టులు విదేశాంగశాఖలో ప్రవేశించారని 205 మంది జాబితా తన దగ్గర ఉందని చెప్పాడు. అయితే దాన్నెపుడూ బహిర్గతపరచలేదు. తరువాత జరిపిన విచారణలో మెకార్థీ చెప్పినవన్నీ అసత్యాలని తేలింది. ఆ సమయంలో హాలీవుడ్‌తో సహా అనేక రంగాలలో పురోగామి భావాలు కలిగిన అనేక మందికి కమ్యూనిస్టు ముద్రవేసి ఎంతో హానికలిగించారు. ఇప్పుడూ అదే జరుగుతోంది, గిట్టని ప్రత్యర్ధులపై ఆ పేరుతో దాడి చేస్తున్నారు.మీడియాలో ట్రంప్‌ను,అతగాడి విధానాలను విమర్శించే వారిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.హత్యకు గురైన ట్రంప్ అనుయాయి పచ్చి మితవాది చార్లీ కిర్క్ గురించి చేసిన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టును తొలగించారు, లేకపోతే ప్రసార అనుమతులను రద్దు చేస్తామని ట్రంప్ యంత్రాంగం బెదిరించింది. పాలస్తీనాకు మద్దతు ప్రకటించటం, ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని నిరసించటాన్ని సహించలేని యంత్రాంగం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 160 మంది విద్యార్థుల పేర్లను ప్రభుత్వానికి అందచేసింది. అందుకే మెకార్థీ చచ్చినా మెకార్థీయిజం పురుడు పోసుకుంటున్నదని చెబుతున్నారు.అయితే రోజులు మారాయి. జడ్ జనరేషన్ 66శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారన్న అంశాన్ని విస్మరిస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని మూసిపెట్టటం ఎలా అసాధ్యమో భావజాలాన్ని అణిచిపెట్టటం కూడా అంతే !. శీఎ.aబ06:41






