Tags
BJP, farm crisis, Farmers agitations, Jagjit Singh Dallewal, MSP demand, Narendra Modi Failures, SKM
ఎం కోటేశ్వరరావు
నవంబరు 26వ తేదీ నుంచి రైతుల సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చారాజకీయ రహిత సంస్థ కన్వీనర్ జగత్‌సింగ్ దల్లేవాల్ జనవరి 18వ తేదీ అర్ధరాత్రి వైద్య చికిత్సకు అంగీకరించారు, ఆ మేరకు ప్రభుత్వ వైద్యులు తగిన చర్యలను ప్రారంభించారు. ఫిబ్రవరి 14వ తేదీన చండీఘర్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయ రహిత), కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులతో కేంద్ర అధికారులు చర్చలు జరిపారు. ఏడు పదుల వయస్సున్న దల్లేవాల్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్న పూర్వరంగంలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు పోవాలని చర్చలు జరపటం, బిజెపికి కీలకమైన ఢల్లీి ఎన్నికలు, దల్లేవాల్‌కు మద్దతుగా మరో 121 మంది నిరవధిక దీక్షలకు పూనుకోవటం, కేంద్ర ప్రభుత్వంపై రోజు రోజుకూ వత్తిడి పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ మేరకు దిగివచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ రైతుల గురించి మాట్లాడరు, రైతు ప్రతినిధులతో మాట్లాడేందుకు సమయం లేదంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు.కోట్లాది మంది రైతుల గురించి చర్చించేందుకు సమయం లేదనటాన్ని బట్టి ఎవరి ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టం అయింది. బడ్జెట్‌పై చర్చలంటూ రైతు ప్రతినిధులను మినహా మిగిలిన వారందరినీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించి చర్చలను జరిపింది. వీటన్నింటినీ చూసినపుడు వచ్చే నెలలో జరిగే చర్చల్లో ఒరిగేదేమిటి అన్నది పెద్ద ప్రశ్న.ఈనెల 31న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇతర సమస్యలతో పాటు రైతుల గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, గతంలో రైతు ఉద్యమం సందర్భంగా మరణించిన వారికి పరిహారం, లఖింపూర్ ఖేరీ హింసా కాండ బాధితులకు న్యాయం,2013 భూసేకరణ పరిహార చట్ట పునరుద్దరణ,రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్, రైతుల రుణమాఫీ వంటి అంశాలపై రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.
బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వివిధ తరగతుల ప్రతినిధులతో చర్చలు జరపటం ఒక తంతుగా జరుగుతున్నది. అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లుగా ఏ పార్టీ చరిత్ర చూసినా గర్వకారణం ఏమీ లేదు. సంపదలలో పెద్ద పీట కార్పొరేట్ శక్తులకే వేస్తున్న కారణంగానే అసమానతలు ఏటేటా పెరుగుతున్నాయి. తంతుగా అయినా బడెట్ చర్చకు రైతు సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. కొంత మంది కొన్ని పోలికలు తెస్తున్నారు. వాటిలో ఉద్యోగులకు వేతన కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించిందిగానీ రైతులకు ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించటం లేదన్నది వాటిలో ఒకటి. దీనిలో రెండవది వాస్తవం, ఉద్యోగులకు పది సంవత్సరాల తరువాత వేతన కమిషన్ ఏర్పాటును దీనికి ముడి పెట్టనవసరం లేదు. పదేండ్లకు ఒకసారి వేతన సవరణ ద్వారా వారికి అన్యాయమే జరుగుతున్నది తప్ప న్యాయం కాదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, ఇతర అంశాల గురించి పరిశీలించేందుకు 2022 జూలైలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతవరకు అది ఏమి చేసిందో ఎవరికీ తెలియదు, వారు నివేదిక సమర్పించరు, ప్రభుత్వమూ అడగదు, అంతా ఒక నాటకంగా మారింది. ఈ లోగా 2021లో క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశంలో భూ కమతాలు పద్నాలుగు కోట్లకు పైగా ఉన్నాయి. వాటిలో 88శాతం రెండున్నర ఎకరాల లోపు కలిగిన రైతులే ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదంటూ వారందరినీ కార్పొరేట్లకు అప్పగించేందుకు తన బాధ్యతను వదిలించుకొనేందుకు కేంద్రం చూస్తున్నది.ఒకసారి అది జరిగితే రాష్ట్రాలు కూడా అదేబాట పడతాయి.పరిశ్రమలు, వాణిజ్యాలకు అనేక రక్షణలు, రాయితీలు ఉన్నాయి. వాటి మాదిరిగానే తమకూ కల్పించాలని రైతులు కోరటం గొంతెమ్మ కోర్కె కాదు. కనీస మద్దతు ధరను ఒక్క హక్కుగా చట్టబద్దం చేయాలని కోరుతున్నారు.
పారిశ్రామిక ఉత్పత్తులకు, ఎగుమతులకు, దిగుమతులకూ రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతులను ఎందుకు విస్మరిస్తున్నది, పోనీ వ్యవసాయం ఉపాధి కల్పించటం లేదా పరిశ్రమలు, సేవారంగాల కంటే ఎక్కువ 44శాతం మందికి కల్పిస్తున్నది. సంఘటితంగా పోరాడే స్థితిలో వారు లేకపోవటం తప్ప మరొకటి కనిపించటం లేదు. మనకు అవసరమైన వంట నూనెల్లో 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, దానికి ఎన్నో రాయితీలు ఇస్తున్నది ప్రభుత్వం కానీ ఇక్కడ నూనె గింజలు పండిరచేవారికి ధరల గురించి ఒక హామీ ఇవ్వటానికి ముందుకు రావటం లేదు.మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదలివేస్తున్నది. గతేడాది సోయా, ఆవ రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువే పొందారు. మరోవైపున బియ్యం, గోధుమలు, ఉల్లి, పంచదార వంటి వాటి ఎగుమతుల మీద నిషేధం పెట్టి మార్కెట్లో రైతులకు అన్యాయం చేశారు. వినియోగదారులకు మేలు చేయటం అంటే రైతుల నోట్లో మట్టికొట్టటం కాదు కదా ! ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే తక్కువకు రైతుల నుంచి చెరకును మిల్లులు కొనుగోలు చేయకూడదు(అది గిట్టుబాటు కావటం లేదు). అదే మాదిరి ఇతర పంటలకు ప్రభుత్వం ఎందుకు హామీ ఇవ్వటానికి నిరాకరిస్తున్నది ? కనీస వేతన చట్టాన్ని అమలు జరపకపోతే కార్మికులు కోర్టులకు ఎక్కే హక్కు ఉంది, కానీ రైతులకు కనీస మద్దతు ధరలకు అలాంటి అవకాశం లేదు. దాదాపు పదిహేను కోట్ల మంది రైతులు ఉండగా వారిలో తొమ్మిది కోట్ల మందికి ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి అదే మహాభాగ్యం అని చెబుతున్నది. తప్పుల తడకలతో కూడిన గణాంకాలు( వివిధ సూచికలను ప్రకటించినపుడు ప్రభుత్వమే అలా చెబుతున్నది. ఉదా : దేశ ఆకలి సూచిక) వెల్లడిరచినదాని ప్రకారం 2004-05లో వ్యవసాయ వాణిజ్య సూచిక 87.72గా ఉన్నది 2010-11 నాటికి 102.95కు పెరిగింది.దాని ప్రకారం పెట్టుబడుల కంటే పంటల అమ్మకం ద్వారా ఎక్కువ పొందారని భాష్యం చెప్పారు. అదే 202223లో ఆ సూచిక 97.21కి పడిపోయింది. అంటే రైతులు పొందుతున్నది తగ్గిపోయింది. అందుకే రైతుల కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కోరుతున్నారు.
రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మూడు సంవత్సరాల తరువాత కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మరో రూపంలో ముందుకు తీసుకురావటం ఆందోళన కలిగించే అంశం. నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పాలసీ(నాంప్)ని 2024 నవంబరు 25న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం) ఆధ్వర్యాన డిసెంబరు 23న దేశమంతటా నిరసన తెలిపారు. అనేక మంది నిపుణులు విమర్శించారు. దాని మీద అభిప్రాయాలు తెలిపేందుకు కేవలం పదిహేను రోజులు మాత్రమే కేంద్రం గడువు ఇచ్చింది. ఇప్పుడున్న మార్కెటింగ్ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని కాదు, దాన్ని సంస్కరించకూడదని ఎవరూ చెప్పటం లేదు. అయితే ఆ పేరుతో ఇప్పుడున్నదాని కంటే ప్రమాదకరమైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయద్రవ్య పెట్టుబడి సంస్థలు సూచించిన పద్దతిలో సమూల మార్పులు ప్రతిపాదించటం ఆందోళనకరం. దాని ప్రకారం దేశమంతటిని అనుసంధానించే ఒకే మార్కెట్‌ను ఏర్పాటు చేస్తారు. ఇదంతా చిన్న రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాల కంటే కార్పొరేట్లకే ప్రాధాన్యత ఇచ్చే వ్యవహారం.రైతులు ముడి సరకును సరఫరా చేసేవారిగా మాత్రమే ఉంటారు.వాటి నుంచి ఉత్పత్తులు తయారు చేయటం,వాణిజ్యం, ఎగుమతి అంతా కార్పొరేట్లదే. ఈ క్రమంలో తేలే మిగులులో రైతుల వాటా గురించి ఎక్కడా స్పష్టత లేదు. అంతే కాదు కనీస మద్దతు ధరలకు ఎలాంటి హామీ ప్రస్తావన కూడా లేదు.అలాంటి ఉద్దేశ్యం ఉంటే ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఒక స్పష్టత ఇచ్చి ఉండేది. రైతాంగానికి గరిష్ట ప్రయోజనం, డిజిటల్, పారదర్శకత, జాతీయ మార్కెట్ సమాచారం వంటి పదజాలం ఎంతగా వల్లించినా వాటిని వినియోగించుకొనే అవకాశం ఎంత మంది రైతులకు ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పుడు అనేక నియంత్రణలు ఉన్నా వాటిని ఖాతరు చేయకపోవటం, దొడ్డిదారిన ఉల్లంఘిస్తున్న కంపెనీలపై అసలు ఎలాంటి నియంత్రణలు ఉండకూడదని ఈ ప్రతిపాదనల్లో ఉన్నది. వ్యవసాయ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఈ విధానంతో రాష్టాల హక్కులు, నియంత్రణలకు నీళ్లదులుకోవాల్సిందే. అమల్లోకి వచ్చిన తరువాత గానీ ఇతర మంచి చెడ్డలు వెల్లడి కావు.
ఫిబ్రవరి 14వ తేదీన కేంద్ర, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరిగే చర్చల అజెండా ఏమిటో తెలియదు. ఎవరెవరు పాల్గ్గొనేదీ ఇంకా స్పష్టం కాలేదు. ఒకటి మాత్రం స్పష్టం, ఇది ఒక రోజులో తేలే వ్యవహారం కాదు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని 2012లోనే సిఎంగా ఉండగా నరేంద్రమోడీ కమిటీ నాటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని గురించి తాజా పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసినా మోడీ మొరాయిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫార్సును అమలు చేయాలంటూ కేంద్రానికి సూచించాలని రైతు సంఘాల నేతలు సుప్రీం కోర్టును కోరారు. వ్యవసాయ గ్రాంట్లపై ఏర్పాటైన కమిటీ 202425 నివేదికను గతేడాది డిసెంబరు 20న పార్లమెంటుకు సమర్పించింది.దీన్ని కేంద్రం ఆమోదిస్తే అమలుకు ఉపక్రమించాలి తిరస్కరిస్తే కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటరీ కమిటీ చేసిస సిఫార్సు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న కిసాన్ సమ్మాన్ యోజన మొత్తం రు. ఆరువేలను పన్నెండు వేలకు పెంచాలి.(దాన్ని చూసి కొంత మంది అమలు జరగనున్నట్లు ప్రచారం చేశారు) ఈ ప్రోత్సహకాన్ని కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు కూడా ఇవ్వాలి. కనీస మద్దతు ధరల చట్టబద్దతకు ఒక రోడ్ మాప్‌ను సాధ్యమైనంత త్వరలో ప్రకటించాలి. వ్యవసాయ కార్మికులకు కనీస జీవన వేతనాల నిమిత్తం జాతీయ కమిషన్ ఏర్పాటు. రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణాల రద్దు పధకాన్ని ప్రవేశ పెట్టాలి.వ్యవసాయ శాఖ పేరులో వ్యవసాయ కార్మికుల పేరును కూడా చేర్చాలి.
కనీస మద్దతు ధరలకు అనుకూల వాదనల సారం ఇలా ఉంది. రైతులకు ధరల మీద ఒక చట్టబద్దత ఉంటుంది. మార్కెట్ వడిదుడుకుల నుంచి రక్షణ ఉంటుంది. మధ్యవర్తుల దోపిడీ నిరోధంగా ఉంటుంది.ఉత్పత్తి ఖర్చులను భరించేందుకు, ఆర్థిక పరమైన భద్రతను మెరుగుపరచుకొనేందుకు స్థిరమైన రాబడికి వీలు కలిగిస్తుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉత్పాదకత, సామర్ధ్యాలను పెంచుతుంది. ఆహార భద్రత, కొరతలను తీరుస్తుంది, దారిద్య్ర తగ్గింపుకు తోడ్పడుతుంది.రైతాంగ జీవనాన్ని మెరుగుపరుస్తుంది. మార్కెట్ వడిదుడుకులను తగ్గిస్తుంది. వ్యతిరేకించే వారేమంటారంటే.. మార్కెట్లో అసమతూకానికి దారితీస్తుంది, కొన్ని పంటలను అవసరాలకు మించి ప్రోత్సహిస్తుంది. సరఫరాఅవసరాల తీరు తెన్నులను విచ్చిన్నం చేస్తుంది.ప్రభుత్వాల మీద భారం మోపుతుంది, మిగులును కొని నిల్వచేయాల్సిన అవసరాన్ని పెంచుతుంది.వనరుల కేటాయింపులో అసమర్ధతకు దారి తీస్తుంది. పంటల వైవిధ్యానికి బదులు కొన్ని పంటలనే ప్రోత్సహిస్తుంది.అవినీతిని ప్రోత్సహిస్తుంది. మధ్యవర్తులు అవకాశంగా తీసుకొని రైతులకు లబ్దిని తగ్గిస్తారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలను అడ్డుకుంటుంది,ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సి ఉంటుంది. మార్కెట్ వ్యవస్థలో పోటీని తగ్గిస్తుంది. రైతులు కొత్త పద్దతులవైపు చూడకుండా కనీస మద్దతు ధరల మీద ఆధారపడతారు,మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారరు.
