మసీదుల కింద శివలింగాల వెతుకులాట : మూడేండ్లుగా అఫిడవిట్‌ సమర్పించని కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మాటలపై నరేంద్రమోడీ మౌనానికి అర్ధమేమిటి !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు

మందిరాల మీద మసీదులు కట్టారంటూ వెనుకా ముందూ చూడకుండా ముందుకు తెస్తున్న వివాదాలను ఆపాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ తాజాగా సుభాషితం చెప్పారు. పూనాలో 2024 డిసెంబరు 19వ తేదీన ‘‘ విశ్వగురువు భారత్‌ ’’ అనే అంశం మీద సహజీవన వ్యాఖ్యాన మాల ప్రసంగాల పరంపరలో భాగంగా మాట్లాడుతూ సెలవిచ్చిన మాటలవి.కొంత మంది తాము హిందువుల నేతలుగా ఎదగాలని చూస్తున్నారంటూ గుడి గోపురం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుత్మంతుడిగా మారుతుందా అంటూ మసీదుల మీద కేసులు వేసినంత మాత్రాన వారంతా నేతలు అవుతారా అన్నారు. ఇదే మోహన భగవత్‌ 2022 జూన్‌ 2న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి మసీదు కింద శివలింగాల కోసం వెతక వద్దని బోధ చేశారు. ఆ పెద్దమనిషి మాటలను హిందూత్వవాదులు ఎవరైనా వింటున్నారా ? పూచిక పుల్లల మాదిరి తీసివేస్తున్నారా ? అసలు మోహన్‌భగవత్‌ నోటి వెంట ఇలాంటి మాటలు ఎందుకు వెలువడుతున్నాయి. ఇదంతా ఒక నాటకమా, వాటివెనుక అసలు చిత్తశుద్ది ఉందా ? అదే గుంపుకు చెందిన ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడటం లేదు ? ఇలా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.


దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు పదిహేను నాటికి ఉన్న ప్రార్ధనా మందిరాలను ఉన్నవాటిని ఉన్నట్లుగానే పరిగణించాలని 1991లో పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించింది. అయితే అప్పటికే అయోధ్య వివాదం కోర్టులో ఉన్నందున దానికి మినహాయింపు ఇచ్చారు. అయోధ్య వివాదం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనేక మంది ఆమోదించనప్పటికీ మసీదు అంటూ కేసును వాదించిన కక్షిదారులు కూడా ఆమోదించిన కారణంగా దానికి తెరపడిరది. అక్కడ రామాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత మందిరాలను కూల్చివేసి మసీదులు కట్టారంటూ తరువాత పది ప్రార్ధనా మందిరాలపై 18 కేసులు వివిధ రాష్ట్రాలలో దాఖలయ్యాయి. 1991నాటి ప్రార్ధనా మందిరాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మరోకేసు దాఖలైంది. ఇలాంటి వివాదాలను తమ నిర్ణయం వెలువడేంతవరకు దిగువ కోర్టులు పక్కన పెట్టాలని, కొత్తగా ఎలాంటి కేసులను తీసుకోవద్దంటూ 2024 డిసెంబరు 12న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌ దాఖలు చేయాలని నెల రోజుల గదువు ఇచ్చింది. ఆ తరువాత మరో నెల రోజుల్లో ఇతరులు తమ అఫిడవిట్లను సమర్పించాలని కోరింది.ఈ కేసులో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ కూడా ప్రతివాదిగా చేరారు.

కోర్టు ఆదేశించినట్లుగా కేంద్రం అఫిడవిట్‌ సమర్పిస్తుందా ? అనుమానమే, గత కొద్ది సంవత్సరాలుగా ఏదో ఒకసాకుతో తప్పించుకుంటున్నవారిని నమ్మటమెలా ? 2020లో ప్రార్ధనా స్థలాల 1991 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో గత నాలుగు సంవత్సరాలుగా అనేక గడువులు విధించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడిస్తూ ఇంతవరకు అఫిడవిట్‌ సమర్పింలేదు, ఏదో ఒకసాకుతో కాలం గడుపుతున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా అదే స్థితి. చట్టం రద్దు లేదా కొనసాగింపుకుగానీ ఏ వైఖరిని తెలియచేసినా అది ఎన్నికల్లో ప్రభావితం అవుతుందనే ముందుచూపుతోనే మోడీ ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. కేంద్రం ఇంకా తన వైఖరిని తేల్చకపోతే రాజకీయంగా విమర్శలపాలవుతుంది. అనేక చోట్ల మసీదులను సర్వే చేయించి శివలింగాలు, విగ్రహాలు ఉన్నదీ లేనిదీ తేల్చాలనే కేసులు దాఖలు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు, బెంచ్‌లు మారాయి, ఇంకే మాత్రం దీని గురించి తేల్చకపోతే అత్యున్నత న్యాయవ్యవస్థ మీదనే పౌరుల్లో విశ్వాసం కోల్పోయే స్థితి ఏర్పడిరది. కోర్టు కూడా తన అభిప్రాయాన్ని వెల్లడిరచాల్సి ఉంది.


ఈ పూర్వరంగంలో మోహనభగవత్‌ ఇలాంటి వివాదాలను ఆపాలని కోరారు. అసలు అలాంటి కేసులు దాఖలైన వెంటనే ఆ పిలుపు ఎందుకు ఇవ్వలేదన్నది ప్రశ్న. కేసులు దాఖలు చేసిన వారు ఏ సంస్థ పేరు పెట్టుకున్నా లేదా వ్యక్తిగతంగా చూసినా వారంతా హిందూత్వవాదులే. వారిలో బిజెపి రాజ్యసభ మాజీ సభ్యుడైన సుబ్రమణ్యస్వామి ఒకరు. అందువలన తమ పార్టీకి సంబంధం లేదంటే కుదరదు. పోనీ ఆ పెద్దమనిషిని పార్టీ నుంచి బహిష్కరించారా అంటే లేదు. సదరు స్వామితో సహా ఏ ఒక్కరూ మోహన్‌ భగవత్‌ మాటలను పట్టించుకోలేదు, అయినప్పటికీ ఎందుకు అలా సెలవిస్తున్నారంటే అదే అసలైన రాజకీయం. సంఘపరివార్‌ తీరు తెన్నులను చూసి ఊసరవెల్లులు దేశం వదలి వెళ్లిపోయినట్లు కొందరు పరిహాసంగా మాట్లాడతారు. రెండు నాలికలతో మాట్లాడవద్దు అనే లోకోక్తిని పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ గుంపు మాదిరి మాట్లాడవద్దు అనే కొత్త నానుడిని తీసుకు రావాల్సిన అవసరం కనిపిస్తోంది.నటీ నటులు ఏ సినిమాకు తగిన వేషాన్ని దానికి తగినట్లుగా వేస్తున్నట్లు వీరు కూడా ఎప్పటికెయ్యది అప్పటికా మాటలు మాట్లాడటం తెలిసిందే. పెద్దలుగా ఉన్న మీరు సుభాషితాలు వల్లిస్తూ ఉండండి మేము చేయాల్సింది మేము చేస్తాం, న్యాయవ్యవస్థలో ఉన్న మనవారు నాటకాన్ని రక్తికట్టిస్తారు అన్నట్లుగా హిందూత్వవాదుల తీరు ఉంది.


చరిత్ర పరిశోధకుల ముసుగులో ఉన్న కొందరు దేశంలో 1,800 దేవాలయాలను మసీదులుగా మార్చారంటూ ఒక జాబితాను రూపొందించారు. సుప్రీం కోర్టు ముందున్న 1991నాటి ప్రార్ధనా స్థలాల చట్టాన్ని మార్చే హక్కు ప్రభుత్వానికి ఉన్నదని గనుక తీర్పు వస్తే మరో 1,800 అయోధ్యలకు తెరలేస్తుంది. సుప్రీం కోర్టు మరోసారి కొత్త గడవు విధించింది. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఎలా వెల్లడిస్తుందన్నది చూడాల్సి ఉంది. మోహన్‌ భగవత్‌సుభాషితాలు చెబుతూనే ఉంటారు. వేర్వేరు ముసుగుల్లో ఉన్నవారు వివాదాలను ముందుకు తెస్తూనే ఉంటారు. వారి సంగతేమంటే తమ వారు కాదని తప్పించుకుంటారు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో బలహీనపడిన బిజెపి, నరేంద్రమోడీ నాయకత్వం దేశమంతటా మసీదుల కింద శివలింగాల వెతుకులాటలకు దిగే శక్తులు సృష్టించే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం లేదు గనుకనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇలాంటి పిలుపు ఇచ్చారని కొందరి అభిప్రాయం. ఒక మాటను జనంలోకి వదలి దాని మీద స్పందనలు ఎలా ఉంటాయో చూడటం కూడా దీని వెనుక లేదని చెప్పలేము. ఈ పిలుపు ఇచ్చిన తరువాత ఒక్కరంటే ఒక్కరు కూడా తమ కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించలేదు. అంతెందుకు తన స్వంత నియోజకవర్గంలో ముందుకు వచ్చిన జ్ఞానవాపి మసీదులో శివలింగవెతుకులాట గురించి నరేంద్ర మోడీ ఒక్కసారైనా నోరు విప్పారా ? నిజంగా అలాంటి వివాదాలను రేపకూడదని బిజెపి నిజంగా కోరుకుంటే ఎందుకు మాట్లాడటం లేదు ? మౌనం అంగీకారం అన్నట్లే కదా ! మణిపూర్‌లో మానవత్వం మంట కలిసినా నోరు విప్పని, అక్కడికి వెళ్లి సామాజిక సామరస్యతను పాటించాలని కోరేందుకు వెళ్లని నేత నుంచి అలాంటివి ఆశించగలమా ? గతంలో గోరక్షకుల పేరుతో రెచ్చిపోయిన వారి ఆగడాల మీద తీవ్ర విమర్శలు రావటంతో స్పందించిన మోడీ శివలింగాల వెతుకులాట మీద ఎందుకు మాట్లాడటం లేదు. తాను ఆర్‌ఎస్‌ఎస్‌ వాదినే అని గర్వంగా చెప్పుకుంటారు కదా ! దాని అధినేత చెప్పిన మాటలను ఔదాల్చకపోతే క్రమశిక్షణ తప్పినట్లు కాదా ?


మోహన్‌ భగవత్‌ రాజకీయ అవకాశవాదంతో మాట్లాడుతున్నారంటూ ఉత్తరాఖండ్‌ జ్యోతిర్మయిపీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద విమర్శించారు.అయోధ్య రామాలయ నిర్మాణం తరువాత మిగతా అంశాలను మాట్లాడకూడదని అంటే కుదరదన్నారు. గతంలో మనదేశంలోకి చొరబాటుదార్లుగా వచ్చిన వారు నాశనం చేసిన దేవాలయాల జాబితాను తయారు చేసి వాటన్నింటినీ పునరుద్దరించాలన్నారు. భగవత్‌ వ్యక్తిగతంగా వివాదాల గురించి మాట్లాడి ఉండవచ్చు. అది అందరి అభిప్రాయం కాదు. అతను ఒక సంస్థకు అధినేత తప్ప హిందూమతానికి కాదు.హిందూయిజానికి బాధ్యత సాధు, సంతులది తప్ప అతనిది కాదు అని జగద్గురు రామభద్రాచార్య డిసెంబరు 24వ తేదీన ధ్వజమెత్తారు. చారిత్రక సంపదను హిందువులు తిరిగి పొందాల్సిందే అన్నారు.అఖిల భారతీయ సంత్‌ సమితి కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతను విమర్శించింది. మతపరమైన అంశాలేమైనా వస్తే నిర్ణయించాల్సింది మత గురువులు, వారి నిర్ణయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి ఆమోదించాల్సి ఉందని స్వామి జితేంద్రనాదానంద సరస్వతి చెప్పారు.


నరేంద్రమోడీని విశ్వగురువు అని వర్ణిస్తూ ప్రపంచ నేతగా చిత్రించేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. అందుకే ఇటీవల ఆ ప్రచారాన్ని తగ్గించారని చెబుతారు. ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపాలంటారు, మరోచోట మంచి జరగాలంటారు తప్ప మణిపూర్‌ ఎందుకు వెళ్లరనే ప్రశ్న పదే ముందుకు రావటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.నిజానికి గత పదేండ్లలో మనకు మనం చెప్పుకోవటం తప్ప ఏ ప్రధాన వివాదంలోనూ మన దేశ సహాయం కోరిన వారు లేరు, మనంగా తీసుకున్న చొరవ కూడా లేదు. బహుశా అందుకే విదేశాంగ మంత్రి జై శంకర్‌ భారత్‌ విశ్వమిత్ర అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయినప్పటికీ భారత్‌ విశ్వగురువు పాత్ర గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ మాట్లాడుతున్నది.1991నాటి ప్రార్ధనా స్థలలా చట్టాన్ని సంఘపరివార్‌కు చెందిన వారు ఇప్పుడు సవాలు చేస్తున్నారు. దాని ప్రకారం వాటి స్వభావాన్ని మార్చకపోయినా చరిత్రలో జరిగిందేమిటో తెలుసుకొనేందుకు తాము పేర్కొన్న మసీదులను సర్వే చేయాలని, తవ్వివెలికి తీయాలని వారు కోరుతున్నారు. గతంలో బాబరీ మసీదు వివాదంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్ధించిన అనేక మంది ఇప్పుడు ఇతర మసీదుల వివాదాలను ముందుకు తెస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. దేశంలో ఇతర సమస్యలేమీ లేనట్లు, మసీదుల కింద శివలింగాలు, ఇతర విగ్రహాలకోసం వెతుకులాట గురించి కేంద్రీకరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించేవారు ప్రస్తుతానికి పరిమితమే అయినా మరోసారి మసీదుల కూల్చివేతల అంశం ముందుకు వస్తే కచ్చితంగా పెరుగుతారు. అప్పుడు బిజెపి హిందూత్వ అజెండాకే ఎసరు వస్తుంది. ఇప్పటికే పక్కనే ఉన్న మతరాజ్యం పాకిస్తాన్‌ మాదిరి భారత్‌ను కూడా అదే మాదిరి మార్చి దిగజారుస్తారా అన్న ప్రశ్నకు హిందూత్వ వాదుల వద్ద సరైన సమాధానం లేదు. మరోవైపున మారని సనాతన వాదాన్ని ముందుకు తెస్తూ దాన్ని రక్షించాలని కోరతారు. దానికోసం ఎంతదూరమైనా వెళతామంటూ ఊగిపోతారు.మానవజాతి చరిత్రను చూసినపుడు పనికిరాని వాటిని ఎప్పటికప్పుడు వదలించుకోవటం తప్ప కొనసాగించటం కనపడదు.

సద్గురుగా భావిస్తూ అనేక మంది అనుసరించే జగ్గీ వాసుదేవ్‌ హిందూమతంలో లేదా సనాతనంలో ఏ మెట్టులో ఉన్నారో ఎక్కడ ఇముడుతారో,సాధికారత ఏమిటో తెలియదు. ‘‘ సనాతన ధర్మం అంటే మీరు ఏదో ఒకదాన్ని నమ్మాలి లేదంటే మరణిస్తారు అని కాదు. నేను ఏదైనా ఒక విషయాన్ని చెబితే దానివల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రశ్నలు ఉదయించాలి.సనాతన ధర్మ ప్రక్రియ అంతా కూడా మీలో ప్రశ్నలను పెంచటం గురించే కాని సంసిద్దంగా ఉన్న సమాధానాలను ఇవ్వటం కాదు.’’ అని వాసుదేవ్‌ చెప్పారు. సనాతనం అంటే మారనిది అన్నారు, ఇక దాన్ని గురించి ప్రశ్నించేదేమి ఉంటుంది. అసలు సమస్య ఏమంటే సనాతనం లేదా హిందూ ధర్మం మనదేశంలో ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలను, నూతన ఆలోచనలనే అణచివేసింది.ప్రశ్న అడగటమే తప్పు, మన పెద్దలనే అవమానిస్తావా, ప్రశ్నిస్తావా అంటూ నోరుమూయించటం నిత్యం కనిపిస్తున్నదే.

ఉలిక్కి పడిన బిజెపి : అంబేద్కర్‌ రాజ్యాంగం లేకపోతే…. అమిత్‌ షా పాతసామాన్లు, తాను గొర్రెలు కాచే వాడినన్న సిద్దరామయ్య !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో అనధికారికంగా పెత్తనం చెలాయిస్తున్నారని, ప్రధాని నరేంద్రమోడీ నీడగా భావిస్తున్న అమిత్‌ షా. సహనం కోల్పోయి ఏం మాట్లాడుతున్నదీ తెలియనంతగా అంతరంగంలో బిఆర్‌ అంబేద్కర్‌ మీద ఉన్న ఉక్రోషాన్ని వెళ్లగక్కటం దేశంలో తీవ్ర వివాదానికి దారి తీసింది. దాంతో ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. దేశంలో అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఉలిక్కి పడిన బిజెపి ఎదురుదాడికి దిగటంతో పాటు అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ అవమానించిందంటూ ప్రతినిరసనకు పాల్పడిరది. నరేంద్రమోడీ ఒకనాడు దేవాలయంగా వర్ణించిన పార్లమెంటు ప్రాంగణంలో దిక్కుతోచని బిజెపి ఎంపీలు దెబ్బలాటలకు దిగటం తమ నేత వ్యాఖ్యలు వారి మీద ఎంత వత్తిడిని పెంచాయో వెల్లడిరచింది. ఆక్రమంలో జరిగిన తోపులాటలో వారు కూడా కిందపడటం, గాయాలపాలైనట్లు కనిపిస్తోంది. మీరే ముందు దాడికి దిగారంటే కాదు మీరే అని బిజెపికాంగ్రెస్‌ పరస్పరం ఆరోపించుకోవటం పోలీసు కేసుల వరకూ వెళ్లింది. స్థానిక సంస్థల పాలకవర్గాల సమావేశాలపుడు కొన్ని చోట్ల ఇలాంటి ఉదంతాల గురించి విన్నాం గాని పార్లమెంటు చరిత్రలో ఇదే ప్రధమం.

ఇంతకీ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలేమిటి ? 2024 డిసెంబరు 17వ తేదీన రాజ్యసభలో రాజ్యాంగం మీద ప్రత్యేక చర్చలో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ అంబేద్కర్‌ పేరును దుర్వినియోగపరుస్తున్నదని ఆరోపించారు. ఆ క్రమంలోనే ‘‘ అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌, అంబేద్కర్‌ అని మాట్లాడటం ఇప్పుడొక ఫాషన్‌గా మారింది. ఎవరైనా ఇలాగే అనేక సార్లు దేవుడి పేరును ఉచ్చరిస్తే అలాంటి వారికి స్వర్గం ప్రాపిస్తుంది. అంబేద్కర్‌ పేరు మరో వందసార్లు ఉచ్చరించండి, కానీ ఆయన పట్ల మీరు ఏ విధంగా వ్యవహరించారో నేను చెబుతా ’’ అన్నారు. ఆంగ్లంలో ఫాషన్‌ అంటే దురాచారం, రీతి, వాడుక, తీరు వంటి అనేక అర్ధాలు ఉన్నాయి. అమిత్‌ షా ఏ అర్ధంతో మాట్లాడిరదీ ఎవరికి వారు అన్వయించుకోవచ్చు. ఏ విధంగా చూసినప్పటికీ అమిత్‌ షా తీరు అంబేద్కర్‌పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించలేదు. అందుకే అంత వివాదాస్పదమైంది. దాని ప్రతికూల ప్రభావాన్ని గ్రహించిన బిజెపి వెంటనే నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. తమ నేతను సమర్ధించుకోవటాన్ని ఒక విధంగా అర్ధం చేసుకోవచ్చు. కానీ అంతకు మించి ఎంపీలు సభలో ప్రవేశించే మకరద్వారం వద్ద మెట్ల మీద బిజెపి సభ్యులు భైఠాయించి ప్రతిపక్ష సభ్యులను సభలోకి వెళ్లకుండా అడ్డుకోవటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఆ క్రమంలో కూర్చున్న తమను తోసివేసి రాహుల్‌ గాంధీ లోపలికి వెళ్లారని, పక్క నుంచి వెళ్లటానికి అవకాశం ఉన్నా కావాలనే ఈ పని చేశారని బిజెపి ఆరోపించటం ఎదురుదాడి తప్ప మరొకటి కాదు. అసలు అడ్డంగా కూర్చోవటం ఎందుకు, పక్కకు తప్పుకు పోవాలని అనటం ఏమిటి ? సభ్యులకు అంతటి అగత్యం ఎందుకు ? కావాలంటే ఇరు పక్షాలూ చెరోవైపు నిలుచుని నినాదాలతో నిరసన తెలపవచ్చు, లోపలికి వెళ్లే వారిని అడ్డుకోవటం ఏమిటి ? బిజెపి ఎంపీలు తనను నెట్టివేయటంతో కాలికి గాయమైందని కాంగ్రెస్‌ అధినేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు అధికారపక్షాన్ని అడ్డుకుంటారు, కానీ పార్లమెంటుప్రాంగణంలో దానికి విరుద్ధంగా అధికారపార్టీ దౌర్జన్యానికి దిగినట్లు కనిపిస్తోంది.ఈ తోపులాటలో కొందరికి గాయాలు కావటం విచారకరం.

తన మాటలను వక్రీకరించారంటూ ప్రత్యారోపణ చేయటం తప్ప అమిత్‌ షా వద్ద సదరు వక్రీకరణ ఏమిటో మాట్లాడరు. ప్రధాని నరేంద్రమోడీ మొదలు గల్లీ నేతల వరకు అమిత్‌ షాకు సమర్ధనగా రంగంలోకి దిగారు.మోడీ సమర్ధన పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని ఆమ్‌ ఆద్మీనేత కేజరీవాల్‌ అన్నారు. అమిత్‌ షా మాట్లాడిన తీరుతో అంబేద్కర్‌ను అభిమానించేవారందరి మనోభావాలు గాయపడ్డాయి. ఆయన పేరు బదులు దేవుడి పేరు స్మరిస్తే స్వర్గం లభిస్తుందనటం అవమానించటం, అంతరంగంలో ఉన్న చులకన భావం తప్ప మరొకటి కాదని వారందరూ భావిస్తున్నారు. బిజెపి మద్దతుదారులుగా ఉన్న అంబేద్కర్‌ భావజాల అనుచరులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అనేక వివాదాలు చెలరేగినపుడు, మణిపూర్‌ వంటి దారుణాలు జరిగినపుడు కూడా మౌనమే నా భాష ఓ దేశమా అన్నట్లు ఉన్న మోడీ రంగంలోకి దిగి అమిత్‌ షాను సమర్ధించటం, చరిత్రలో అంబేద్కర్‌ పట్ల కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు తెలిసిందే అంటూ ఎదురుదాడి చేశారు. రెండు సార్లు అంబేద్కర్‌ను ఎన్నికల్లో నెహ్రూ ఓడిరచారని, ఓటమిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, భారత రత్న నిరాకరించటంతో పాటు పార్లమెంటు హాలులో ఫొటో కూడా పెట్టలేదని ఆరోపించారు. ఎందుకు మోడీ నోరు విప్పాల్సి వచ్చిందంటే 17శాతంగా ఉన్న దళితుల్లో మద్దతు తగ్గే ప్రమాదాన్ని పసిగట్టటమే. 2015లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రిజర్వేషన్ల గురించి సామాజిక సమీక్ష జరపాలని ఇచ్చిన పిలుపు మొదటి రెండు దశల్లో బిజెపిని దెబ్బతీసిందని ఆ పార్టీ సీనియర్‌నేత సిపి ఠాకూర్‌ వాపోయారు. మూడోదశలో నష్ట నివారణకు మోడీ రంగంలోకి దిగి అలాంటిదేమీ లేదని చెప్పాల్సి వచ్చింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి నాలుగు వందల సీట్లు వస్తాయన్న ప్రచారం ఒకటైతే ఆ బలంతో రాజ్యాంగాన్ని సవరిస్తామని కొందరు నేతలు చేసిన ప్రకటనలతో దళితుల్లో అనుమానాలు తలెత్తాయి, రిజర్వేషన్లకు ఎసరు పెడతారని భావించారు. పార్లమెంటులో షెడ్యూలు కులాలకు కేటాయించిన 84 స్థానాలకు గాను 2019లో 46 సీట్లు తెచ్చుకున్న బిజెపి 2024లో 29కి దిగజారింది. దళితులు, గిరిజనులపై అత్యాచారాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ దాన్ని ఆచరణలో నీరుగార్చిన తీరు తెలిసిందే. తీవ్ర నిరసన వెల్లడి కావటంతో చట్టంలో కొన్ని నిబంధనలను తిరిగి చేర్చాల్సి వచ్చింది. వీటన్నింటినీ చూసినపుడు సున్నితమైన అంశాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, వ్యవహరిస్తే నష్టం అన్నది గ్రహించి బిజెపి అమిత్‌ షా వ్యాఖ్యలపై నష్టనివారణకు పూనుకుంది. వారి తీరు చూసిన తరువాత తమ నేతను అలా తక్కువ చేసి మాట్లాడతారా అని గాయపడిన మనోభావాలకు స్వాంతన కలుగుతుందా అన్నది అనుమానమే.

అంబేద్కర్‌ నాయకత్వంలో రాజ్యాంగ రచన జరిగి ఉండకపోతే అమిత్‌ షా కేంద్ర మంత్రి పదవికి బదులు స్వంత గ్రామంలో చెత్తకాగితాల, పాత సామాన్ల వ్యాపారం చేసుకోవాల్సి వచ్చేదని, మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్‌లో ఉన్నత స్థానాన్ని అధిరోహించేవారు కాదని, తాను పశువులు, గొర్రెలను కాయటానికి పరిమితం అయ్యేవాడినని కర్ణాటక సిఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. అమిత్‌ షా మాటలు తనకు ఆశ్చర్యం కలిగించటం లేదని బిజెపి, సంఘపరివార్‌ నేతల మనసులో మాట చెప్పారన్నారు. అంతరంగాన్ని బయట పెట్టినందుకు షాను అభినందిస్తున్నా అంటూ చమత్కరించారు. అంబేద్కర్‌ నాయకత్వంలో రాజ్యాంగ రచన జరిగే వరకు దేశంలో లింగ, వర్ణ వివక్షతో కూడిన మనుస్మృతి ఒక చట్టంగా చెలామణైందన్నారు. రాజ్యాంగం 1949 నవంబరు 30న దేశానికి అంకితమైందని, తరువాత నాలుగు రోజులకు ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ దానికి వ్యతిరేకంగా సంపాదకీయం రాసిందని సిద్దరామయ్య గుర్తు చేశారు.‘‘ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంలో భారతీయత లేదు. ఈ నాటికి కూడా మనుస్మృతిలో పేర్కొన్న వాటిని ప్రపంచం గౌరవిస్తున్నది. రాజ్యాంగాన్ని రాసిన పండితులకు ఇవేవీ పట్టలేదు ’’ అని రాశారని, అంబేద్కర్‌ను ఒక పండిట్‌ అని ఎద్దేవాచేశారని, ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి దాన్ని సమర్ధిస్తూనే ఉన్నదన్నారు.

మనుస్మృతిని బహిరంగంగా తగులబెట్టి వివక్షను వ్యతిరేకించిన అంబేద్కర్‌ను అదే మనువాదులు తమవాడిగా చిత్రించేందుకు నిరంతరం ప్రయత్నించటం గమనించాల్సిన అంశం. బుద్దుడిని కూడా దశావతారాల్లో ఒక దేవుడిగా చెప్పేవారు అంబేద్కర్‌కు కాషాయ ముద్రవేయటంలో కొత్తేముంటుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలలో ఒకరైన దత్తోపంత్‌ టేంగ్డీ రాసిన పుస్తకంలో హిందూ సమాజాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసే వారు ఐక్యం చేయాలనుకుంటే దాని విస్తరణను వేగవంతం చేయాలని చెప్పినట్లు, ఆ సంస్థ క్రమశిక్షణ గురించి మురిసిపోయారని రాశారు.దాన్లో అంబేద్కర్‌తో తన అనుబంధం, ఆర్‌ఎస్‌ఎస్‌అంబేద్కర్‌ మధ్యవారధిగా ఉన్నట్లు చెప్పుకున్నారు. అనేక పుస్తకాలు టేంగ్డీ రాసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు ఉటంకిస్తారు. కమ్యూనిస్టు వ్యతిరేకత అంశంలో అంబేద్కర్‌`ఆర్‌ఎస్‌ఎస్‌ది ఒకే వైఖరని ఇలా ఎన్నో రకాలుగా రాతపూర్వక చరిత్ర, మౌఖిక చరిత్ర అంటూ ఆధారాలు లేని అంశాలను నిజాలుగా చిత్రించేందుకు గతంలో చూశారు, ఇప్పటికీ గోబెల్స్‌ ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాటిని గుడ్డిగా నమ్మేవారికి అంబేద్కర్‌ కూడా సంఘపరివార్‌ వ్యక్తిగా కనిపిస్తారు. మరి అంతగా ఆర్‌ఎస్‌ఎస్‌ వారు అంబేద్కర్‌, అంబేద్కర్‌,అంబేద్కర్‌,అంబేద్కర్‌ అంటూ పదే పదే తమవాడని చెబుతున్న విషయం అమిత్‌ షాకు తెలియదా ? అది ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాషన్‌గా ఎప్పుడూ అనిపించలేదా ? ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి అంబేద్కర్‌ సానుకూలంగా, సదభిప్రాయంతో ఉన్నారని చెప్పేందుకు రాతపూర్వక ఆధారాలేమీ లేవు. నిజానికి సంఘపరివార్‌కు అంబేద్కర్‌ మీద కొత్తగా పుట్టుకువచ్చిన ప్రేమ 1980దశకం తరువాతే. అంతకు ముందు వ్యతిరేకించారు.పదిహేడుశాతంగా ఉన్న దళితుల ఓట్లు లేకుండా అధికారానికి రావటం కష్టమని వారికి జనతా ప్రయోగం తరువాత అవగతమైంది. కొంత మంది చెబుతున్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ఊసరవెల్లి, ఒక హైడ్రా దాని రాజకీయ అవసరాల కోసం రంగు, ఏ రూపమైనా మార్చగలదు, ఏమాటైనా చెప్పగలదు. అంబేద్కర్‌ నిజమైన హిందువని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే మనుస్మృతిని తగుల పెట్టినందుకు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన పశ్చాత్తాపం ప్రకటించారా ? లక్షలాది మందితో హిందూమతం నుంచి బౌద్దానికి ఎందుకు మారారో ఎవరైనా చెప్పగలరా ?

సిరియా పోరు ముగియలేదన్న ఐరాస – కొత్త కుట్రకు తెరతీసిన అమెరికా !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


ఐదుదశాబ్దాలకు పైగా సాగిన అసద్‌ కుటుంబ పాలన సిరియాలో ముగిసింది.అరబ్‌ సోషలిస్టు బాత్‌ పార్టీనేత, అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలన 2000 సంవత్సరం జూలై 17 నుంచి 2024 డిసెంబరు 8వరకు సాగింది.అంతకు ముందు బషర్‌ తండ్రి హఫీస్‌ ఆల్‌ అసద్‌ 1971 మార్చి 14 నుంచి మరణించిన 2000 జూన్‌ పది వరకు అధికారంలో ఉన్నాడు. మధ్యప్రాచ్యంలో పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా పాలకులు సిరియాకు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. నవంబరు చివరి వారం నుంచి హయత్‌ తహ్రరిర్‌ అల్‌ షామ్‌(హెచ్‌టిఎస్‌) సాయుధ సంస్థ, దానికి మద్దతు ఇచ్చిన వారు కలసి అసద్‌ మిలిటరీపై పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించి డిసెంబరు ఎనిమిదవ తేదీన రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవటం, అసద్‌ కుటుంబం రష్యాకు ప్రవాసం వెళ్లటంతో సిరియాలో నూతన అధ్యాయం మొదలైంది.సిరియా ఉగ్రవాదుల చేతికి చిక్కిన తరువాత తాను ప్రవాసం వెళ్లినట్లు మాజీ అధ్యక్షుడు అసాద్‌ చేసినట్లుగా చెబుతున్న ప్రకటనలో ఉంది.ముందుగా రూపొందించిన పథకం ప్రకారమే తాను తప్పుకున్నట్లు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నాడు.సిరియా తమ తొత్తుల చేతికి చిక్కనందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రోషాన్ని వెళ్లగక్కాడు. అక్కడ తాము పోరాటం జరపలేదని తొలుత ప్రకటించిన ట్రంప్‌ సోమవారం నాడు మరోసారి స్పందించాడు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా టర్కీ పని ముగించిందని అంటూనే బలవంతంగా ఆక్రమించిందని వ్యాఖ్యానించాడు.మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు సిరియాలో ఉన్న 900 మంది తమ సైనికులను ఉపసంహరించనున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ తరువాత మాట మార్చాడు. సోమవారం నాడు అదే ప్రశ్నకు తరువాత చూద్దామన్నట్లుగా స్పందించాడు. ఇప్పుడు సిరియా భవిష్యత్‌ ఏమిటన్న ప్రశ్నకు ఎవరికీ ఏమీ తెలియదని, టర్కీ కీలక పాత్ర పోషించనుందని చెప్పాడు.


అసద్‌ ప్రభుత్వం పతనమైన తరువాత కూడా సిరియాలో ప్రత్యర్థివర్గాల మధ్య శతృత్వం కొనసాగుతున్న కారణంగా అక్కడ పోరు ఇంకా ముగియలేదని ఐరాస ప్రతినిధి గెయిర్‌ పెడర్సన్‌ చెప్పాడు. మంగళవారం నాడు భద్రతా మండలి సమావేవశంలో మాట్లాడుతూ పరిస్థితి పెద్ద ఉపద్రవానికి దారితీసేదిగా ఉందని చెప్పాడు. అమెరికా మద్దతుతో పని చేస్తున్న సిరియన్‌ డెమోక్రటిక్‌ ఫోర్స్‌(ఎస్‌డిఎఫ్‌) టర్కీ మద్దతు ఉన్న సిరియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఎస్‌ఎన్‌ఏ) మధ్య జరుగుతున్న పోరును చూసిన తరువాత ఐరాస ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన సయోధ్య గడువును పొడిగించినట్లు అమెరికా చెబుతోంది. మరోవైపు అమెరికా మద్దతుతో సిరియాలోని గోలన్‌ గుట్టలను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ ఇప్పుడు ఐరాస ఆధ్వర్యంలో ఉన్న బఫర్‌జోన్‌ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంటామని, ఆ ప్రాంతంలో ఉన్న పౌరుల రక్షణకు ఆ ప్రాంతం అవసరమని సాకు చెబుతోంది. గతంలో కూడా అదే పేరుతో గోలన్‌ గుట్టలను కబ్జా చేసింది.

అసద్‌ స్థానంలో కొత్తగా అధికారానికి వచ్చిన వారు ఉగ్రవాదులా కాదా అంటే అవును అన్నది వాస్తవం.హెచ్‌టిఎస్‌ నేత అబూ మహమ్మద్‌ అల్‌ జొలానికి ఆ నేపధ్యం ఉంది, ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలో పని చేశాడు. తాజాగా అధికారానికి రావటం కోసం అలాంటి వారితో చేతులు కలిపాడు. ఇదే సమయంలో ఆల్‌ఖైదాతో విడగొట్టుకోవటంతో పాటు జీహాదీలకు వ్యతిరేకంగా పనిచేసిన చరిత్ర కూడా ఉంది. అతగాడిని అమెరికా ఇప్పటికీ ఉగ్రవాదిగానే పరిగణిస్తున్నది, గతంలో అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టింది. అయితే తాజాగా అమెరికన్లు అధికారంలో ఉన్నవారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అసద్‌ ప్రభుత్వం కూలిపోయినందుకు అక్కడి జనం ఆనందంతో ఉన్నారు. అది ఎంతకాలం ఉంటుంది ? రానున్న రోజుల్లో జొలానీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎలా ఉంటుంది, అసలు స్థిరత్వం చేకూరుతుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై పద్నాలుగు నెలలు గడిచాయి. పాలస్తీనియన్లకు మద్దతుగా ఉన్న లెబనాన్‌లోని హిజబుల్లా సాయుధ సంస్థతో ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తరువాత సిరియా పరిణామాలు జరిగాయి.2011లో ప్రారంభమైన అంతర్యుద్ధంతో సిరియన్లు అనేక విధాలుగా దెబ్బతిన్నారు, దేశం సర్వనాశనమైంది. కుక్కలు చింపిన విస్తరిలా సాయుధ ముఠాలు కొన్ని ప్రాంతాలను తమ అదుపులో ఉంచుకున్నాయి. ఆరులక్షల మంది వరకు పౌరులు, సాయుధులు, సైనికులు మరణించినట్లు అంచనా, 70లక్షల మంది అంతర్గతంగా నెలవులు తప్పగా మరో 70లక్షల మంది వరకు ఇరుగు పొరుగుదేశాలకు శరణార్ధులుగా వెళ్లారు. అంతర్యుద్ధం ముగిసినా సాధారణ జీవన పరిస్థితి ఎంతకాలానికి పునరుద్ధరణ అవుతుందన్నది పెద్ద ప్రశ్న.


కొత్త ప్రభుత్వం కొలువు తీరలేదు,వారు తమతో ఎలా ఉంటారో తెలియదు కనుక రానున్న రోజుల్లో సిరియాను దెబ్బతీయాలంటే దాని పాటవాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఆయుధ ఫ్యాక్టరీలు,నౌకా దళం ఇతర మిలిటరీ వ్యవస్థలను నాశనం చేస్తున్నది. వాటిలో ఇరాన్‌, రష్యా సరఫరా చేసిన ఆయుధాలు, వాటి నిల్వకేంద్రాలు కూడా ఉన్నాయి. ఇదంతా అమెరికా కనుసన్నలలో జరుగుతున్నదని వేరే చెప్పనవసరం లేదు. గత కొద్ది నెలలుగా లెబనాన్‌పై దాడి అక్కడ పెద్ద సాయుధ శక్తిగా ఉన్న హిజబుల్లాపై దాడులు, దాని నేతల హత్యలో ఇజ్రాయెల్‌ పాత్ర గురించి తెలిసిందే. సిరియాకు మద్దతుగా అది ఇంకేమాత్రం దాడులు చేసే స్థితిలో లేదని చెబుతున్నారు. కొనసాగుతున్న ఉక్రెయిన్‌ సైనిక చర్య కారణంగా రష్యా, ఆంక్షల వలన ఇరాన్‌ మిలిటరీ సరఫరాలు కూడా తగ్గిపోయాయి. సిరియాలో ఉన్న తన నౌకా కేంద్రాన్ని రక్షించుకోవటంలోనే రష్యా మునిగి ఉంది. సిరియాలో అధికారాన్ని చేజిక్కించుకున్న హెచ్‌టిఎస్‌ సంస్థకు టర్కీ ప్రధాన మద్దతుదారుగా ఉంది. పరోక్షంగా ఇజ్రాయెల్‌ కూడా ఒక దశలో సాయం చేసిందని నిఘావర్గాలు చెబుతున్నాయి. అసద్‌ ప్రభుత్వం అణచివేతలకు పాల్పడిరదనే విమర్శలు ఉన్నప్పటికీ అది ఇస్లామిక్‌ మత ఛాందసవాదాన్ని ప్రోత్సహించిన దాఖలాలు లేవు. ముస్లింలలో అనేక తెగలు ఉన్నాయి. అవి ఒక్కో ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిలో కర్దులు ఒకరు. ఇస్లామిక్‌ తీవ్రవాద ఐసిస్‌, ఆల్‌ఖైదా కూడా అసద్‌ను వ్యతిరేకించాయి. వీటితో పాటు అమెరికా తనకు అనుకూలమైన శక్తులకు భారీ ఎత్తున సాయం చేసింది. అవేవీ అసద్‌ ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. సిరియాలో చమురు నిల్వలున్న ప్రాంతాల మీద అమెరికా ఆధిపత్యం ఉంది. అక్కడ దాని సైనికులు కూడా ఉన్నారు. గతంలోనే సిరియాలోని గోలన్‌ గుట్టల ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. కొంత ప్రాంతాన్ని ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో బఫర్‌ జోన్‌గా ఉంచారు. అక్కడికి ఎవరూ ప్రవేశించకూడదు. అయితే డిసెంబరు ఎనిమిది నుంచి ఇజ్రాయెల్‌ దళాలు అతిక్రమించి సిరియాలోకి చొచ్చుకుపోయాయి.
ఇప్పుడు సిరియా భవితవ్యం ఏమిటి అంటే ఎవరూ ఏమీ చెప్పలేని స్థితి.అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా దశాబ్దాలపాటు జోక్యం చేసుకున్న రష్యా రానున్న రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించేది తెలియదు.నూతన పాలకులు టర్కీ కనుసన్నలలో పని చేసే అవకాశం ఉంది. నాటోలో అది అమెరికా అనుయాయి.అదే సమయంలో కొన్ని అంశాలలో దానితో విబేధించి రష్యాతో సంబంధాలు కలిగి ఉంది. సిరియా పరిణామాల్లో రష్యా, అమెరికా రెండూ తమ ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నించాయి. దాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా పెద్ద ఎత్తున తిరుగుబాటుదార్లను ప్రోత్సహించింది.ఇటీవల జరిగిన పరిణామాలను చూసినపుడు సిరియాలో ఇంక అమెరికా చేసేది ఏముంది అని కొందరు నిరుత్సాహాన్ని ప్రకటించారు. ప్రచ్చన్న యుద్ధం ముగిసిన 1990దశకం తరువాత ‘‘ఆపరేషన్‌ టింబర్‌ సైకామోర్‌ ’’ పేరుతో అమెరికా భారీ మొత్తాలను సిరియాలో కుమ్మరించిందని చెబుతున్నారు. ఉదారవాద తిరుగుబాటుదార్ల ముసుగులో 2013 నుంచి 2017వరకు నాలుగు సంవత్సరాలలో అమెరికా సిఐఏ ద్వారా వివిధ సంస్థలకు వంద కోట్ల డాలర్లకు పైగా అందచేసిందని అంచనా. ఆ తరువాత కూడా తరతమ తేడాలతో ఇదే విధంగా తిరుగుబాటుదార్లకు చేరుస్తున్నది. అసద్‌ వ్యతిరేకులకు మద్దతుతో పాటు సిరియాలోఅమెరికాను కూడా వ్యతిరేకించే శక్తులను దెబ్బతీసేందుకు చూసింది. అమెరికా మిలిటరీ కూడా 50 కోట్ల డాలర్లతో తిరుగుబాటుదార్లకు శిక్షణ, ఆయుధాలను అందచేసింది. ఇవన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. టర్కీ మద్దతు ఉన్న తిరుగుబాటుదార్లు డమాస్కస్‌ను పట్టుకుంటారని కూడా అమెరికా ఊహించినట్లు కనపడదు.లేదా నిస్సహాయంగా ఉండిపోయిందని చెప్పవచ్చు. అందుకే ట్రంప్‌ అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.
ఒబామా గనుక కాస్త ముందుగా జాగ్రత్తపడి ఉంటే అసద్‌ తొలగింపు మరింత వేగిరం, అమెరికా ప్రమేయం కూడా ఉండేదని రణోన్మాదులు కొందరు నిష్టూరాలాడుతున్నారు.అమెరికా మద్దతు ఇచ్చిన మిలిటెంట్‌ సంస్థలన్నీ అంతర్గత కుమ్ములాటలు, అవినీతి, గూండాయిజాలతో కొట్టుకు చచ్చాయని, ఆల్‌ఖైదాకు ఆయుధాలు అమ్ముకున్నట్లు విమర్శిస్తున్నారు. ఈ శక్తులు అసద్‌ మీద వత్తిడి తెచ్చి అంతర్జాతీయ సమాజంతో చర్చలకు నెడతాయని అమెరికా ఊహించినదానికి భిన్నంగా అసద్‌ బలమైన శక్తితో అనేక నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు సిరియాలో మాజీ అమెరికా రాయబారి రాబర్ట్‌ పోర్డ్‌ చెప్పాడు. సిఐఏ మద్దతు ఇచ్చిన తిరుగుబాటుదార్లు ఒక బాల ఖైదీ తలనరికే వీడియోను చూసిన డోనాల్డ్‌ ట్రంప్‌ సిరియా మీద ఆసక్తి కోల్పోయాడని, అమెరికా మిలిటరీ తరువాత సిరియాలోని కర్దులకు మద్దతు ఇవ్వటంపై కేంద్రీకరించిందని చెబుతున్నారు.అమెరికా నుంచి నిధులు పొందిన ఫ్రీ సిరియన్‌ ఆర్మీ వంటి సంస్థలు చివరకు టర్కీ అనుకూల సిరియన్‌ నేషనల్‌ ఆర్మీగా మారిపోయాయని, వారు కర్దులపై అత్యాచారాలు, దోపిడీలకు పాల్పడటంతో అదే అమెరికా చివరికి మానవహక్కులకు భంగం కలిగించారనే పేరుతో ఆంక్షలు విధించిందని, చివరికి నవంబరు చివరి వారంలో ఈ శక్తులు లూటీలకు పాల్పడుతుండటంతో తాజాగా అధికారానికి వచ్చిన హెచ్‌టిఎస్‌ దళాలు వారిని అణచివేసి అరెస్టు చేశాయని ఇలాంటి పనులు చేసిన తరువాత అమెరికాకు సిరియాలో ఇంక చేసేందుకు ఏమి మిగిలిందని ప్రశ్నిస్తున్నారు.ఈ విమర్శలన్నీ మరింత గట్టిగా వ్యవహరించలేదని, సిరియాను తమ అదుపులోకి తెచ్చుకోలేదని తప్ప పరాయి దేశంలో జోక్యం తప్పనే కోణం నుంచి కాదు. రాబోయే రోజుల్లో ఏమి జరిగినప్పటికీ అమెరికా డ్రైవర్‌ సీట్లో కూర్చొనే అవకాశం లేదని, చేసిన ఖర్చంతా వృధా అయిందని విమర్శిస్తున్నారు.
సిరియాలో అసద్‌ ప్రభుత్వాన్ని కూలదోయటంలో ఏకీభావంతో ఉన్న శక్తులన్నీ తరువాత అధికారాన్ని అలాగే పంచుకుంటాయని చెప్పలేకపోతున్నారు. లిబియాలో అమెరికాను వ్యతిరేకించిన గడాఫీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నాటో కూటమి దేశాలన్నీ తిరుగుబాటు శక్తులను ప్రోత్సహించాయి, తీరా 2011లో గడాఫీ సర్కారు కూలిపోయిన తరువాత ఇప్పటి వరకు అధికారం కోసం కుమ్ములాడుకుంటూనే ఉన్నాయి. అదే స్థితి సిరియాలో తలెత్తవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికీ హెచ్‌టిఎస్‌ను ఉగ్రవాద సంస్థగా దాని నేత జొలానీ ఉగ్రవాదిగా వర్ణిస్తున్న అమెరికా రానున్న రోజుల్లో అతని నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడితే ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రశ్న.అతనికీ అదే పరిస్థితి.ఈ సంస్థ రానున్న రోజుల్లో ఇరాన్‌తో చేతులు కలపవచ్చని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అనుమానిస్తున్నాడు. అది గనుక తమపై దాడికి దిగితే ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని, గత ప్రభుత్వానికి ఏమి జరిగిందో దీనికీ అంతే అని హెచ్చరించాడు.నూతన పాలకులతో రష్యా సంబంధాలు పెట్టుకోవచ్చని, ఇరాన్‌ కూడా అదే చేయవచ్చని కూడా పశ్చిమదేశాల పరిశీలకులు చెబుతున్నారు. సిరియాలో ఉన్న తమ సైన్యాన్ని వెనక్కు రప్పిస్తానని గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. అయితే జనవరి 20న కొలువు తీరనున్న ట్రంప్‌ సర్కార్‌లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మార్కో రుబియో మాత్రం వేరుగా స్పందించాడు. రానున్న రోజుల్లో ఉగ్రవాద ముప్పు తలెత్తితే ఎదుర్కొనేందుకు అక్కడ తమ సైన్యం ఉండటం అవసరమని సెలవిచ్చాడు.సిరియాలో ఇప్పటికైతే పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

ఎరుపంటే ఎందుకంత భయం : అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేక విద్య బిల్లు !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


ఒక భూతం ఐరోపాను వెంటాడుతున్నది. అదే కమ్యూనిస్టు భూతం అంటూ ప్రపంచ సామాజిక గతినే మార్చివేసిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది.బ్రిటన్‌లో కారల్‌ మార్క్స్‌ఫెడరిక్‌ ఎంగెల్స్‌ 1848 ఫిబ్రవరి 21న ఆ గ్రంధాన్ని వెలువరించారు.నాటి నుంచి నేటి వరకు 176 సంవత్సరాల తరువాత కూడా ప్రపంచంలోని దోపిడీ వర్గాలు, వాటిని కాపాడేవారిని అది భయపెడుతూనే ఉంది. సోషలిజం, కమ్యూనిజాలను ఏడు నిలువుల లోతున పాతిపెట్టాం, విజయం మాదే అని ప్రకటించుకున్న అమెరికా గడ్డ మీదే పాలకవర్గం ఇప్పుడు ఎందుకు వణికి పోతున్నది. 2024 డిసెంబరు మొదటి వారంలో అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్‌)లో కమ్యూనిస్టు వ్యతిరేక బిల్లును 32762 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. సోషలిజం, కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రపంచంలో ఉధృతంగా ఉన్న రోజుల్లో అలాంటి బిల్లు పెట్టారంటే అదొక దారి, ఆ ఉద్యమాలు అంత ఆకర్షణీయంగా లేని వర్తమానంలో ఎందుకు ఇలాంటి చట్టాలు తీసుకువస్తున్నట్లు ? అధికార రిపబ్లికన్‌ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా చేతులు కలపటంతో ఇంత మెజారిటీ వచ్చింది. ఈ బిల్లుకు పెట్టిన పేరు ఎడ్యుకేటింగ్‌ ఫర్‌ డెమోక్రసీ యాక్ట్‌( ప్రజాస్వామ్యం కోసం చైతన్య చట్టం). ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన అడుగు అని కొందరు వర్ణిస్తే సైద్దాంతిక పరమైన విభజన జరుగుతుందని మరికొందరు పేర్కొన్నారు. ఒక భావజాలాన్ని అణగదొక్కటం చరిత్రలో ఇంతవరకు ఎవరి వల్లా కాలేదు. ఎవరైనా ఫలానా సిద్దాంతాన్ని రూపుమాపాం అని చెబితే ఎలా అనే ఉత్సుకత ఏ ఒక్కరిలో చిగురించినా అది మొక్కై మానుగా మారుతుంది. ఇప్పుడు అమెరికాలో ఇతర పెట్టుబడిదారీ దేశాలలో జరుగుతున్నది అదే. ఓడిరచామన్న సోషలిజం, కమ్యూనిజాల గురించి యువతరంలో ఆసక్తి, అనురక్తి పెరుగుతున్నదనే సర్వేల సమాచారం అక్కడి దోపిడీ శక్తులకు కునుకు పట్టకుండా చేస్తున్నది.


1997-2012 మధ్య జన్మించిన వారిని జెడ్‌ తరం అని పిలుస్తున్నారు. వారిలో గణనీయంగా కమ్యూనిజం పట్ల సానుకూలంగా ఉన్నారు. అంతకు ముందు 1946-64 మధ్యకాలంలో జన్మించిన వారిలో కేవలం మూడు నుంచి ఆరుశాతం మంది మాత్రమే సుముఖంగా ఉన్నారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం కంటే కమ్యూనిజం మెరుగని 28శాతం మంది జడ్‌ తరం భావిస్తున్నది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలే పురాతన కాలం నుంచి నేటి ఆధునిక సమాజానికి బాటలు వేశాయి. ఇంతకాలం సోషలిజం విఫలమైందని ప్రచారం చేసిన వారి ఏలుబడిలో సోషలిస్టు చైనా నుంచి దిగుమతులు లేకపోతే రోజు గడవటం లేదు. ఈ పరిస్థితి ఎందుకు అనే ఆలోచన అమెరికా యువతలో ఉదయించదా ? ‘‘ పెట్టుబడిదారీ విధాన ఒక వైఫల్యం ’’ అనే పేరుతో అమెరికా న్యాయమూర్తిగా పనిచేసిన రిచర్డ్‌ ఫోసనర్‌ 2009లో ఒక గ్రంధం రాశాడు. ఈ పెద్దమనిషి కమ్యూనిస్టు కాదు. అప్పటి నుంచి సోషలిజం వైఫల్యం కంటే పెట్టుబడిదారీ వైఫల్యం గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ కాలంలోనే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ దేశాలలో సోషలిజం, కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి పెరుగుతోంది.ఈ ధోరణి అమెరికా పాలకవర్గం, అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఆందోళన కలిగిస్తోంది. దిక్కుతోచని స్థితిలో అమెరికా పాలకవర్గం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఎంత ఎక్కువ చేస్తే అంతగా యువతలో ఆసక్తి పెరటం అనివార్యం. ఉన్మాదంలో ఉంచటం ద్వారా యువతను సైద్దాంతిక మధనానికి దూరం చేయాలని విఫలయత్నం చేస్తోంది.


సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలు, చైనా తదితర సోషలిస్టు దేశాలు, వాటికి నాయకులుగా ఉన్నవారి గురించి ఇప్పటికే పేలిన అవాకులు చవాకులను అమెరికా పిల్లలకు పాఠాలుగా బోధించేందుకు తాజా బిల్లును తెచ్చారు. కమ్యూనిజం లోపాల గురించి చెబితే విద్యార్థులు స్వేచ్చ, ప్రజాస్వామ్య విలువ గురించి తెలుసుకుంటారని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ జాన్సన్‌ చెప్పాడు. ఈ చట్టం ప్రకారం బోధించాల్సిన పాఠ్యాంశాలను ‘‘ కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌(విఓసిఎంఎఫ్‌) రూపొందిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది మరణాలకు కారకులైన నాజీలు ఎర్ర సైన్యం చేతిలో చచ్చారు. వారిని కూడా కమ్యూనిజం బాధితులుగానే ఈ సంస్థ చిత్రిస్తున్నది.చైనాలోని యుఘిర్స్‌ పట్ల, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనల పట్ల చైనా అనుసరించిన వైఖరిని కూడా కమ్యూనిస్టు వ్యతిరేక అంశాలతో పాటు బోధించాలని ఈ చట్టం నిర్దేశించింది. ఒక భావజాలాన్ని వక్రీకరించి చూపుతున్నారని, రాజకీయ భావజాలం కోసం తరగతి గదులు యుద్ధ క్షేత్రాలుగా మారతాయని కొందరు హెచ్చరించారు. ప్రపంచ చరిత్రను సమగ్రదృష్టితో చూడకుండా నిస్సిగ్గుగా పాక్షిక వైఖరితో ఈ బిల్లు చూసిందని వ్యతిరేకించిన డెమోక్రాట్లు పేర్కొన్నారు.‘‘ చరిత్రను బోధించటం అంటే ఒక దానికి వ్యతిరేకంగా మరొక భావజాలాన్ని ప్రోత్సహించటం కాదు. మన రాజకీయం కోసం అవసరమైన దాన్ని మాత్రమే కాదు మొత్తం కథను చెప్పాలి ’’ అని డెమోక్రటిక్‌ సోషలిస్టు 35 ఏండ్ల అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్‌ చెప్పారు. ఈమె డెమోక్రటిక్‌ పార్టీ తరఫున 2019 నుంచి న్యూయార్క్‌ నుంచి ప్రజాప్రతినిధుల సభకు ఎన్నికై పని చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ ప్రేరేపితమైన సిలబస్‌తో వత్తిడికి గురవుతున్న టీచర్లు కమ్యూనిజం ముప్పు అంటే స్పష్టత లేని ఈ బిల్లు వలన మరింతగా ఇబ్బంది పడతారని నిపుణులు చెప్పారు. కమ్యూనిజం గురించి చెప్పాలంటున్నారు సరే అడ్డూ అదుపులేని పెట్టుబడిదారీ విధానం సంగతేమిటి ? కథను సంపూర్ణంగా చెప్పరా లేక కేవలం స్వంత సిద్దాంతాలను చెప్పుకోవటమేనా అన్న విమర్శలు కూడా సామాజిక మాధ్యమంలో వెలువడ్డాయి.


ఇటీవలి కాలంలో నిర్వహిస్తున్న అనేక సర్వేల ప్రకారం గత తరాలతో పోల్చితే సోషలిజం, కమ్యూనిజాల గురించి యువ అమెరికన్లు సానుకూల వైఖరితో చూడటం పెరిగిపోతోందని, ప్రజాస్వామ్య సూత్రాల గురించి అవగాహన తగ్గుతున్నదని రిపబ్లికన్‌ సెనెటర్లు వాపోయారు. బిల్లును రూపొందించిన వారిలో ఒకరైన మరియా సాలాజార్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో అమెరికా విలువల బోధన అన్నది ఒక విప్లవాత్మక ఆలోచనేమీ కాదు. యువతరంలో మూడోవంతు మంది కమ్యూనిజానికి అనుకూలంగా ఉన్న సమయం, అయితే ఆ సిద్దాంత ప్రమాదం, దాని చరిత్రను యువతకు చెప్పటంలో విఫలం అవుతున్నామన్నది స్పష్టం, అందుకే ఈ బిల్లు అవసరమైంది అన్నారు. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించుకొనేందుకు ఇది అవసరమని మరికొందరు సమర్దించారు. స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ బిల్లును ఆమోదించినందుకు అభినందించాడు. విద్యావ్యవస్థలో కమ్యూనిజం వాస్తవాలను గమనించకపోవటం లేదా తక్కువ చేసి చూస్తున్నారని ఆరోపించాడు. చైనా వంటి శత్రుదేశాలు అమెరికా వ్యవస్థలో తమ అజెండాను చొప్పిస్తున్నాయన్నాడు. అమెరికా చట్టాలు అనుమతించిన మేరకు కన్ఫ్యూసియస్‌ తరగతి గదుల పేరుతో చైనా ఐదువందల చోట్ల ఏర్పాటు చేసింది.అవి అమెరికా మిలిటరీ కేంద్రాలకు దగ్గరగా ఉన్నాయని, వాటిలో కమ్యూనిస్టు సిద్దాంతాలను బోధిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది.
పురోగామి భావాలను వెల్లడిరచే ప్రతి ఒక్కరిని కమ్యూనిస్టుగా భావిస్తూ అమెరికన్లలో అనేక మంది మానసికవ్యాధితో బాధపడుతున్నారు. కొందరు కావాలని అలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ సామాన్యజనాల బుర్రలను చెడగొడుతున్నారు. అలాంటి వాటిలో హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ఒకటి. దాని ట్రస్టీ కెవిన్‌ రాబర్డ్‌తో జెసీ కెలీ అనే రేడియో వ్యాఖ్యాత గతేడాది ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేశాడు.‘‘ 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనమైంది. దాంతో పాటే ప్రపంచ కమ్యూనిజపు నీడ జాడలేకుండా పోయింది. కమ్యూనిజం అంతరించిందని అమెరికన్లందరూ ఊపిరి పీల్చుకున్నారు, కానీ మనింట్లో కొత్త కుట్ర ప్రారంభమైంది.పురోగామివాద ముసుగులో నేడు కమ్యూనిస్టులు అనేక సంస్థలలో చొరబడ్డారు. అమెరికన్ల రోజువారీ కార్యకలాపాలను వారి నూతన శక్తితో అదుపు చేస్తున్నారు ’’ అని వ్యాఖ్యాత చెప్పాడు. అతగాడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రణాళిక పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. దాన్లో కమ్యూనిస్టుల పని తీరు పేరుతో అనేక వక్రీకరణలకు పాల్పడ్డాడు.


మితవాదుల నాయకత్వంలో నడిచే ఫ్రాసర్‌ ఇనిస్టిట్యూట్‌ అనే మేథోమధన సంస్థ జరిపిన సర్వేలో 1834 ఏండ్ల మధ్య ఉన్న కెనడా యువతలో 54శాతం మంది సోషలిజం దేశ ఆర్థిక వ్యవస్థ, పౌరుల మంచి చెడ్డలను ప మెరుగుపరుస్తుందని భావిస్తున్నట్లు తేలింది. అంతవరకే కాదు, ఆ సర్వే ప్రకారం పదిలక్షల మంది యువత సోషలిజం కంటే కమ్యూనిజం మంచి ఆర్థికవ్యవస్థను కలిగి ఉంటుందని చెప్పటంతో సర్వే నిర్వాహకులు నిర్ఘాంతపోయారట. అంతేనా ఇప్పుడున్న పెట్టుబడిదారీ వ్యవస్థ పనిచేయటం లేదని యువత భావించటం వారికి ఆందోళన కలిగించింది. ఆ సర్వేను మరింత లోతుగా చూసినపుడు 1834 ఏండ్ల వారిలో సోషలిజం అనువైనదని చెప్పినవారు 46శాతమైతే, 1824 ఏండ్ల వయస్సు వారిలో 50శాతానికి పెరిగారు. పెట్టుబడిదారీ విధానం మంచిదని చెప్పిన వారు 1834లో 39శాతమే ఉండగా కాదన్నవారు 41శాతం. సోషలిజానికి మారాలని చెప్పిన వారు 1834లో 54శాతం ఉండగా 1824లో 58శాతం ఉన్నారు, కాదని చెప్పిన వారు 17శాతం మాత్రమే. ఎందుకు యువత ఇలా భావిస్తున్నదంటే 2008లో ధనిక దేశాల్లో వచ్చిన సంక్షోభం అనుభవించారు గనుక, అది ఇంకా ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. దానికంటే మరింత పెద్ద సంక్షోభం రానున్నదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలే హెచ్చరిస్తున్నందున ఎక్కడైనా యువత ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకుండా ఉంటుందా ? వారికి సోషలిజం, కమ్యూనిజం తప్ప మరొకటి కనిపించటం లేదు. పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక సరైన సమాధానం చెప్పలేక ధరలు పెరిగి ఆహారవస్తువులను కొనుగోలు చేయలేకపోతే ఉదయపు అల్పాహారాన్ని మానుకోండని ఉచిత సలహా చెప్పింది. పరిస్థితి ఇంకా దిగజారితే రోజుకు ఒక పూటే తినండని కూడా చెప్పగలదు.యువత కమ్యూనిజం పట్ల ఇంత ఆసక్తిని ఎందుకు పెంచుకుంటున్నదన్న ప్రశ్నకు ఫ్రాసర్‌ సంస్థ ఉపాధ్యక్షుడు జేసన్‌ క్లెమెన్స్‌ సమాధానమిస్తూ ఇంతటి దురవస్థను వారి మీద ఎన్నడూ రుద్దలేదు అన్నాడు. భూతల స్వర్గం అనుకుంటున్నవారికి లాభాలు పిండుకొనే కార్పొరేట్‌ భూతాలు కళ్ల ముందు కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోవటం మానవనైజం కాదు. తగ్గేదే లేదు, దాని అంతమే తమ పంతం అంటారు, కాదంటారా ! దానికి సోషలిజం తప్ప మరొక మార్గం కనుచూపు మేరలో కనిపించటం లేదు, అందుకే మూలనపెట్టిన సిద్దాంత పుస్తకాలు దుమ్ముదులుపుతున్నారు.నడిచే సమయం రాగానే, తపన కలగ్గానే ఏం చేయాలో పసివాళ్లకు ఎవరూ చెప్పనవసరం లేదు. వారంతటవారే లేచి అడుగులు వేసినట్లుగా మార్గం వెతుక్కుంటారు. సమాజమార్పూ అంతే !


కమ్యూనిస్టు మానిఫెస్టో రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో అనేక మార్పులు జరిగిన మాట నిజం. అది ఆ నాటికి సరిపోయిందిగానీ నేటికి పనికి రాదు అని కొందరు వ్యతిరేకులు దాడి చేస్తున్నారు.దాన్లో చెప్పింది ఒక శాస్త్రీయ సిద్దాంతం. కూడినా హెచ్చవేసినా రెండురెళ్లు నాలుగే. అది మారదు. అలాగే శ్రమదోపిడీ ఉన్నంత కాలం దాన్నుంచి జనావళిని విముక్తం చేసేందుకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి దేశంలో విప్లవం ఒకే విధంగా జరగదని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా వెనుకబడిన, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం ప్రభావితం చేస్తున్న దేశాలలో విప్లవాన్ని ఎలా తీసుకురావాలనేది అక్కడి కార్మికవర్గం నిర్ణయించుకోవాల్సిందే.

న్యాయవ్యవస్థలో హిందూత్వ శక్తుల చొరబాటు : ముస్లింలపై విద్వేషం-అలహాబాద్‌ హైకోర్టు జడ్జి వివరణ కోరిన సుప్రీం !

Tags

, , , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

ఆ పెద్దమనిషి దేశంలోనే పురాతన కోర్టులలో ఒకటైన అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి. పేరు శేఖర్‌ కుమార్‌ యాదవ్‌, 2026లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాషాయ తాలిబాన్ల మాదిరి ముస్లిం విద్వేషాన్ని వెళ్లగక్కిన ఆ పెద్దమనిషిని జడ్జిగా తొలగించాలని తీర్మానం పెట్టేందుకు ఎంపీల నిర్ణయం, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలువురి ఫిర్యాదు. విశ్వహిందూ పరిషత్‌ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరిన సుప్రీం కోర్టు. దేశవ్యాపితంగా సంచలనం కలిగించిన ఈ ఉదంతానికి వస్తే..... 2024 డిసెంబరు ఎనిమిదవ తేదీన కోర్టు ప్రాంగణంలోని గ్రంధాలయ హాలులో వివాదాస్పద హిందూత్వ ఉగ్రవాద సంస్థగా కొందరు పరిగణించే విశ్వహిందూపరిషత్‌ న్యాయవాదుల విభాగం నిర్వహించిన సభను అలహాబాద్‌ హైకోర్టు జడ్జి దినేష్‌ పాథక్‌ ప్రారంభిస్తే అదే కోర్టుకు చెందిన మరో జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ రాజ్యాంగవిరుద్దమైన, విద్వేషపూరిత ప్రసంగం చేశారు. చేసిన ప్రమాణానికి విరుద్దంగా మాట్లాడినందున న్యాయమూర్తిగా అనర్హులని ఆ మేరకు చర్య తీసుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. న్యాయవ్యవస్థ జవాబుదారీతనం మరియు సంస్కరణల ప్రచార సంస్థ(సిజెఎఆర్‌) కన్వీనర్‌, ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషన్‌ కూడా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరం రాశారు. సదరు జడ్జి ప్రసంగం న్యాయవ్యవస్థకు అపచారమని, ప్రసంగ అంశాలపై విచారణ జరపాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబాల్‌ కూడా పదవి నుంచి తొలగించాలని కోరారు. ఈ ఉదంతం దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది. సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మరోసారి న్యాయవ్యవస్థలో ఆవాంఛనీయ ధోరణులు, హిందూత్వ శక్తుల ప్రవేశం, ముస్లిం వ్యతిరేక విద్వేష ప్రచారం తదితర అంశాల గురించి చర్చకు దారితీసింది. ఒక వివాదాస్పద సంస్థ హైకోర్టు ప్రాంగణంలో సభకు అనుమతించటం, దానిలో న్యాయమూర్తులు పాల్గొని అనుచిత ప్రసంగం చేయటం మన న్యాయవ్యవస్థకు ముంచుకువస్తున్న ముప్పుగా అనేక మంది భావిస్తున్నారు.

1991నాటి ప్రార్ధనా స్థలాల చట్టం ప్రకారం 1947 నాటికి ఏ మత ప్రార్ధనా స్థలం అలా ఉంటే దాన్ని అలాగే కొనసాగించాలి తప్ప వివాదాస్పదం చేయకూడదు. అయితే బాబరీ మసీదు లేదా రామజన్మభూమి వివాదం కోర్టులో ఉన్నందున దానికి మినహాయింపు ఇచ్చారు. దీన్ని సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది. గతంలో పార్లమెంటుచేసిన అనేక చట్టాలను మార్చినందున దీన్ని కూడా సవరించాలనే వాదనలు ముందుకు వచ్చాయి. దీని మీద సుప్రీం కోర్టులో దాఖలైన కేసు ఈనెల 12న విచారణకు రానున్నది. గతంలో షాబానో కేసు తీర్పును వమ్ము చేస్తూ కాంగ్రెస్‌ హయాంలో పార్లమెంటులో చట్ట సవరణ చేయటాన్ని అనేక మంది పురోగామి వాదులు వ్యతిరేకించారు. బిజెపి దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ముస్లింలను కాంగ్రెస్‌ సంతుష్టీకరిస్తున్నదని దాడి చేస్తున్నది. చరిత్రలో జరిగిన తప్పులను సరిదిద్దే పేరుతో ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఎందుకు మార్చకూడదని కాషాయ దళాలు ప్రశ్నిస్తున్నాయి. ఆర్టికల్‌ 370ని రద్దు చేశారని, ఈ చట్టాన్ని కూడా ఎందుకు మార్చకూడదనే వాదనలను ముందుకు తెచ్చాయి. దీనికి కూడా సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు వారికి ఆయుధంగా మారింది. ‘‘ ఉమ్మడి పౌర స్మృతిరాజ్యాంగ అనివార్యత ’’ అనే అంశంపై ముప్ఫై నాలుగు నిమిషాల ప్రసంగంలో దేశం మెజారిటీ వాంఛలకు అనుగుణంగా పని చేయాలని, ముస్లిం సమాజం నుంచి కీడు తలెత్తిందని అలహాబాదు జడ్జి చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా హిందూమతోన్మాదశక్తులు చేస్తున్న వాదనల సారాంశాన్ని శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ పునశ్చరణ చేశారు.బహుభార్యాత్వం,ఛాందసత్వం,కుహనా మతవాదులంటూ ముస్లింలోని ఒక తరగతిని కించపరుస్తూ ఉపయోగించే ‘‘కత్‌ముల్లా ’’ అనే పద ప్రయోగం చేశారు. అలాంటి వారు దేశానికి ముప్పు అన్నారు. హిందువులు పిల్లలకు చిన్నతనం నుంచి అహింసను బోధిస్తారని, సహనాన్నిచొప్పిస్తారని, అదే ముస్లింల పిల్లలు చిన్నతనంలోనే జంతువధ హింసను చూస్తారని ఆరోపించారు. ఇంకా అయోధ్యలో రామమందిరం కోసం పూర్వీకులు త్యాగాలు చేశారు. ఉమ్మడి పౌర స్మృతి కూడా త్వరలో సాకారం కానున్నది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మెజారిటీకి అనుకూలంగా చట్టం పని చేస్తుంది.ఇది చట్టం, ఒక హైకోర్టు న్యాయమూర్తిగా నేను ఇది చెబుతున్నానని మీరు చెప్పలేరు. అది కుటుంబ నేపధ్యమైనా సమాజ సంబంధమైనా మెజారిటీ ప్రకారమే జరగాలి.కేవలం మెజారిటీ సంక్షేమం, సంతోషాలకు తోడ్పడేదానినే అంగీకరించటమౌతుంది. నేను మాట్లాడుతున్నదంతా చెడ్డ కాదు, కానీ మీరు ఎవరినైతే కత్‌ముల్లాస్‌ అని పిలుస్తున్నారో….ఈ మాట అభ్యంతరకరమని నాకు తెలుసు, కానీ దీన్ని చెప్పటానికి నేను సంకోచించను, ఎందుకంటే దేశానికి ఇది వినాశకరమైనది. హిందువులు సహనం, దయతో ఉన్నారంటే పిరికి వాళ్లని పొరపాటు పడవద్దు. మీరు ఒక లాయరు, ఒక వ్యాపారి లేదా ఒక విద్యార్థి కావచ్చు గానీ ముందు నీవు ఒక హిందువు. ఇది తన మాతృభూమి అని ఎవరు చెప్పినా వారు దాని బిడ్డలే, వారు ఏ మతాన్ని పాటించినా హిందువులే. అలహాబాద్‌ జడ్జి ప్రసంగం సాగిన తీరు ఇది.


ఈ న్యాయమూర్తి గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2021లో సంభాల్‌కు చెందిన ఒక ముస్లిం వ్యక్తి తన అనుచరులతో కలసి ఆవును అపహరించి వధించినట్లు కేసు దాఖలైంది.సదరు నిందితుడికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, హిందువుల ప్రాధమిక హక్కుల్లో గోరక్షణ చేర్చాలని చెప్పారు. ఆక్సిజన్‌ పీల్చి దాన్నే బయటకు వదిలే ఏకైక జంతువు ఆవు అని శాస్త్రవేత్తలు నమ్ముతారని కూడా అన్నారు. రాముడు, కృష్ణుడిని అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడనే మరొక కేసులో హిందువుగా ఉన్న దళితుడికి బెయిలు ఇస్తూ వాల్మీకి, వేదవ్యాసులకు జాతీయ గౌరవాన్ని కల్పించాలని అన్నారు. సంఘపరివార్‌ ముందుకు తెచ్చిన హిందూత్వకు న్యాయవ్యవస్థ తనదైన శైలిలో భాష్యం చెప్పటంతో బిజెపి ఆ పేరుతో ఓట్లడగటానికి, మనోభావాలను రెచ్చగొట్టటానికి వీలు కలుగుతోంది.1995లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జెఎస్‌ వర్మ, ఎన్‌పి సింగ్‌,కె.వెంకటసామి ఇచ్చిన ఒక తీర్పులో రాజకీయ నేతలు మతం, కులం,జాతి, తెగ లేదా భాష పేరుతో ఓట్లు అడగటాన్ని, పౌరుల్లోని భిన్న తరగతుల మధ్య శతృత్వం లేదా విద్వేషాన్ని పెంచటాన్ని అక్రమ పద్దతులుగా పేర్కొన్నారు. అయితే హిందూత్వ అనేది మతం కాదని, ఒక జీవన విధానం లేదా ఒక మానసిక స్థితి అని దాన్ని హిందూమత ఛాందసంతో సమానంగా చూడకూడదని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు. అందుకే బిజెపి నేతలు పదే పదే తాము హిందూత్వకు కట్టుబడి ఉన్నామని, అలాగే ఉంటామని చెబుతుంటారు. అందుకే నరేంద్రమోడీని హిందూ హృదయ సామ్రాట్‌గా పిలుచుకుంటారు.


మరికొన్ని కోర్టు తీర్పులు కూడా విమర్శలకు గురైన సంగతి తెలిసిందే.బాబరీ మసీదు కేసులో తమ ముందు ఉన్న సాక్ష్యాలను బట్టిగాక మతపరమైన మనోభావాల ప్రకారం తీర్పు ఇచ్చి రామాలయ నిర్మాణానికి వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. బాబరీ మసీదు కూల్చివేత రాజ్యాంగ విరుద్దం, అత్యంత చెడు చర్య అని గుర్తిస్తూనే తీర్పును వెల్లడిరచారు. ఆ బెంచ్‌లో తీర్పురాసిన, తరువాత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన చంద్రచూడ్‌ తన పదవీకాలం చివరిలో చెప్పిన మాటలతో అనేక మంది నిర్ఘాంతపోయారు. అయోధ్య కేసు తీర్పు రాజ్యాంగాన్ని బట్టిగాక దేవుడి ప్రమేయంతో ఇచ్చినట్లు, ఒక పరిష్కారం చూపాలని తాను ప్రార్దించినట్లు చెప్పారు.(తన జన్మ మామూలుగా జరగలేదని, దేవుని అంశంతో జన్మించినట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకున్న సంగతి తెలిసిందే) ఈ వివాదం రేకెత్తించినప్పటి నుంచి హిందువుల మనోభావాలను గౌరవించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలు చేసిన వాదనలకు అనుగుణంగా ఆ తీర్పు ఉంది. కాశీలోని గ్యానవాపి మసీదు స్వభావాన్ని మార్చాలని హిందువులు అడగటం లేదని కేవలం దాని మత స్వభావాన్ని నిర్ధారించాలని మాత్రమే కోరుతున్నందున సర్వే చేయవచ్చంటూ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్‌ ఇచ్చిన తీర్పు కొత్త వివాదాలకు తెరలేపింది. దాన్ని అవకాశంగా తీసుకొని సంభాల్‌లో ఉన్న పురాతన మసీదును సర్వే చేయాలని జిల్లా కోర్టు అనుమతివ్వటం, అనంతరం జరిగిన అవాంఛనీయ పరిణామాలు తెలిసిందే.అనేక మసీదులపై అలాంటి సర్వేలు చేయాలన్న డిమాండ్లను ముందుకు తేవటమే గాక చివరికి 1947 తరువాత ప్రార్ధనా స్థలాల స్వభావాన్ని మార్చకూడదన్న 1991నాటి చట్టాన్ని తిరగదోడేందుకు పూనుకున్నారు.


న్యాయవ్యవస్థలో కాషాయ దళాలు తమ భావజాలం ఉన్న వారిని న్యాయమూర్తులుగా ప్రవేశపెట్టిన తీరును కూడా చూడవచ్చు.కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తన పదవీ విరమణ రోజునే ఆర్‌ఎస్‌ఎస్‌తో తన జీవితాంతం కొనసాగిన బంధాన్ని వెల్లడిరచారు, దానికి తాను రుణపడి ఉంటానని ప్రకటించారు.మరొక న్యాయమూర్తి లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజీనామా చేసి బిజెపి అభ్యర్ధిగా పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఇద్దరు సభ్యుల బెంచ్‌ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరటంపై ఇచ్చిన తీర్పు దారుణంగా ఉంది. ఒక కేసులో ఇచ్చిన తీర్పులో ప్రముఖ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో నిషేధిత సంస్థలో చేర్చిన తప్పు కారణంగా ఐదు దశాబ్దాలపాటు అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక విధాలుగా దేశానికి సేవచేయాలనుకొని కూడా ఈ నిషేధం కారణంగా చేయలేక పరిమితమయ్యారని బెంచ్‌ వ్యాఖ్యానించింది. అంటే దేశానికి సేవచేయాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలన్న సందేశం దీనిలో ఉంది.ప్రస్తుతం విధుల్లో ఉన్న అడ్వొకేట్‌ జనరల్స్‌, జడ్జీలు 33 మంది ఆర్‌ఎస్‌ఎస్‌ లాయర్ల విభాగం ఏర్పాటు చేసిన సభలు, సమావేశాలకు ప్రధాన అతిధులుగా హాజరయ్యారని, వారిలో తొమ్మిది మంది ఒకటి కంటే ఎక్కువ సభల్లో పాల్గొన్నట్లు కారవాన్‌ 2024 అక్టోబరు సంచికలో పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో విశ్వహిందూ పరిషత్‌ లాయర్ల విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో 30 మంది సుప్రీం కోర్టు, హైకోర్టులలో పనిచేసిన మాజీ న్యాయమూర్తులు పాల్గ్గొన్నారు. వారణాసి, మధుర వివాదం, వక్ఫ్‌ బిల్లు, మతమార్పిడుల గురించి చర్చించినట్లు విహెచ్‌పి అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ చెప్పారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ కూడా దీనిలో పాల్గ్గొన్నారు. ఇది తొలిసారి జరిపిన సమావేశమని తరువాత నిరంతరం జరపుతామని ఒక నేత చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. గతంలో అనేక మంది ఇలాంటి సమావేశాల్లో పొల్గొనేందుకు సంకోచించేవారు. ప్రస్తుతం దేశంలో హిందూత్వశక్తుల హవా నడుస్తున్నందున నిజరూపాలను బయటపెట్టుకుంటున్నారు.

దక్షిణ కొరియాలో కుట్ర : అధ్యక్ష కార్యాలయంపై పోలీసు దాడి, మిలిటరీ పాలన పత్రాల స్వాధీనం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అత్యవసరపరిస్థితి పేరుతో సైనిక పాలనకు తెరతీసి కేవలం ఆరుగంటల వ్యవధిలో అనివార్య పరిస్థితుల్లో ఎత్తివేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ దేశం విడిచి పోకుండా అక్కడి అవినీతి నిరోధకశాఖ ప్రధాన కార్యాలయం ఆంక్షలు విధించింది. అధ్యక్ష కార్యాలయం, ఇతర భద్రతా విభాగాల ఆఫీసులపై కూడా పోలీసులు దాడి చేసి సైనిక పాలన విధింపు సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారని బుధవారం నాడు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో అధ్యక్షుడు కార్యాలయంలో లేడని చెబుతున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని అధికారులు వెల్లడిరచారు. దీంతో అక్కడ సంక్షోభం ఏ మలుపు తిరిగేదీ ఆసక్తి కలిగిస్తోంది. 1987 తరువాత తొలిసారిగా దక్షిణ కొరియాలో మిలిటరీ పాలన రుద్దేందుకు చూశారు.2024 డిసెంబరు మూడవ తేదీ మంగళవారం రాత్రి సైనిక పాలన విధించి బుధవారం తెల్లవారు రaామున రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటన, మిలిటరీకి అధికారాలు అప్పగింత, పార్లమెంటు వ్యతిరేక తీర్మానం, ఉపసంహరణ నాటకీయంగా జరిగాయి. అనేక అనుమానాలకు తావిచ్చే ఈ పరిణామం ఎందుకు, ఎలా జరిగింది, తెరవెనుక కథ ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. కారణాలేమైనా తాత్కాలికంగా అయినా జనం ఊపిరి పీల్చుకున్నారు. అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మీద ప్రతిపక్షాలు పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. మరోసారి పెట్టేందుకు చూస్తున్నారు. తప్పు చేసినట్లు యూన్‌ ప్రకటించాడు. తనపై ఏదో ఒక నిర్ణయం తీసుకొనే బాధ్యతను పార్టీకి అప్పగిస్తున్నట్లు జాతీయ టీవీలో ప్రసంగిస్తూ చెప్పాడు. అయితే అధ్యక్షుడు ఏ కార్యకలాపాలు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు ప్రధాని హాన్‌ డక్‌ సూ. అధికార పీపుల్స్‌ పవర్‌ పార్టీ (పిపిపి) నేత హాన్‌ డాంగ్‌ హూ ప్రకటించారు. మరోవైపు యూన్‌ మీద విచారణ జరుపుతున్నట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి ప్రకటించాడు. అధ్యక్షుడు రాజీనామా చేస్తే లేదా నేరాలకు పాల్పడినపుడు అరెస్టయితే తప్ప విధులు నిర్వహించటానికి ప్రధానికి అవకాశం లేదు. మిలిటరీ కమాండర్‌ ఎవరనే ప్రశ్న కూడా తలెత్తింది. సాంకేతికంగా అధ్యక్షుడు ఉన్నా అధికారాలు లేనట్లు ప్రకటించిన తరువాత హోం మంత్రి రాజీనామాను ఆమోదించిన తీరు చూస్తే తెరవెనుక ఏదో జరుగుతోందన్న భావన కలుగుతోంది. అధ్యక్షుడికి అధికారాలు లేకుండా చేసి పదవి నుంచి తొలగించకుండా కొనసాగించటం దేశంలో జరిగిన రెండవ కుట్రగా ప్రతిపక్షాలు వర్ణించాయి.


తాత్కాలిక రక్షణ మంత్రి, సైనిక దళాల జాయింట్‌ చీఫ్‌ కమాండర్‌ ఒక ప్రకటన చేస్తూ యూన్‌ మరోసారి అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ఆమోదించేది లేదని చెప్పటం విశేషం. అత్యవసర పరిస్థితి ఎత్తివేత తరువాత రక్షణ మంత్రి రాజీనామా చేశాడు, అతనిపై దేశద్రోహనేరం మోపి అరెస్టు చేశారు. ప్రత్యేక దళాల, రాజధాని రక్షణ కమాండర్లు అనేక మందిని విధుల నుంచి తప్పించారు. దక్షిణ కొరియాలో మిలిటరీ నియంత పాలన అధికారికంగా అంతమైనప్పటికీ పాలనలో మిలిటరీ ప్రమేయం కొనసాగుతూనే ఉంది.1961లో జరిగిన తొలి మిలిటరీ తిరుగుబాటు తరువాత 1987నుంచి పౌరపాలన ఉన్నప్పటికీ పౌర భద్రతా వ్యవహారాలన్నీ మిలిటరీ మాజీ నేతలే ఎక్కువగా చూస్తున్నారు. ఇంతవరకు రక్షణ మంత్రిగా ఒక్కరంటే ఒక్కరు కూడా మిలిటరీయేతరులు లేరు. అనేక ముఖ్య బాధ్యతల్లో ఉద్యోగవిరమణ చేసిన మిలిటరీ అధికారులే ఉంటున్నారు. అందువలన పౌర నేతలు తమ రాజకీయ అవసరాల కోసం మిలిటరీ నేతల మీదనే ఆధారపడుతున్నారు. మిలిటరీ అధికారుల తీరుతెన్నులు చూసినపుడు వారు రాజకీయాల్లోని మితవాద శక్తులతోనే బలమైన సంబంధాలు కలిగి ఉండటం ఆందోళన కలిగించే అంశం.ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఆందోళన, ఉద్యమాలను అణచివేసిన చరిత్ర వారిది. తమతో చేతులు కలపని లేదా విబేధించే వారిని కమ్యూనిస్టులతో సంబంధాలు ఉన్నాయనో దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారనో ఆరోపించి అణచివేయటం పరిపాటిగా మారింది. డిసెంబరు మొదటి వారంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి విధిలేక వెనక్కు తీసుకున్న యాన్‌ కూడా అవే చిలుక పలుకులు వల్లించాడు. అక్కడ మిలిటరీ పాలన ముప్పు మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. 2017లో దొడ్డిదారిన మిలిటరీ పాలన రుద్దేందుకు చూశారు. అవినీతికి పాల్పడినందుకు అధ్యక్షురాలు పార్క్‌ యున్‌ హై మీద పెట్టిన అభిశంసన తీర్మానం నెగ్గింది. దాంతో ఆమెను తిరిగి నియమించకూడదంటూ ఆందోళనకు సిద్దపడిన వారిని, మీడియాను అణచేందుకు వందలాది మిలిటరీ వాహనాలు, ఆరువేల మంది సైనికులను సిద్దం చేసి మిలిటరీ పాలన ప్రకటించేందుకు దాదాపు ఏర్పాట్లు చేశారు.


తాజా పరిణామాలకు వస్తే అత్యవసర పరిస్థితి విధింపును వ్యతిరేకిస్తూ పద్దెనిమిది మంది అధికార పక్ష సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటంతో నెగ్గింది. అయితే అభిశంసన తీర్మానం సమయానికి వారు వెనక్కు తగ్గటంతో వీగిపోయింది. అయినప్పటికీ యూన్‌ రాజీనామా, అతగాడి అరెస్టు, అధికార పార్టీని రద్దు చేయాల్సిందేనంటూ ఆదివారం నాడు సియోల్లో పార్లమెంటు ముందు వేలాది మంది జనం ప్రదర్శన చేశారు. అధ్యక్షుడిని తప్పించకుండా ప్రధానికి అధికారాన్ని కట్టబెట్టటం రాజ్యాంగ విరుద్దమని పార్లమెంటు స్పీకర్‌ ఊ వన్‌ షిక్‌ ప్రకటించాడు. తక్షణమే యూన్‌ అధికారాన్ని సస్పెండ్‌ చేసేందుకు అవకాశాలను వెతికేందుకు ప్రతిపక్ష పార్టీలతో సమావేశం జరపనున్నట్లు ప్రకటించాడు. స్వల్ప మెజారిటీతో అధ్యక్ష పదవికి ఎన్నికైన యూన్‌ గత రెండున్నర సంవత్సరాలుగా ప్రతిపక్షాలు, మీడియా, కార్మికవర్గాన్ని అణచివేసేందుకు చూశాడు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాడు. 2023 ఆగస్టులో లిబరేషన్‌ డే ప్రసంగంలో కమ్యూనిస్టు నియంతృత్వశక్తులు ప్రజాస్వామ్యం, మానవహక్కుల కార్యకర్తలు లేదా పురోగామి శక్తుల ముసుగులో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అనైతిక ఎత్తుగడలను అనుసరిస్తున్నారని ఆరోపించాడు. నియంతల పాలనలో ప్రతివారూ ఇలాంటి చిలుక పలుకులే వల్లించారు. సైనిక పాలన విధించేందుకు అవసరమైన పద్దతుల్లో యూన్‌ ఏదో చేయబోతున్నట్లు ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ కిమ్‌ మిన్‌ ఒక ప్రకటనలో హెచ్చరించాడు. తన స్కూలు సహాధ్యాయులు, అనుచరులను పెద్ద సంఖ్యలో కీలకమైన మిలిటరీ, ఇతర భద్రతా అధికార పదవుల్లో నియమించాడని పేర్కొన్నాడు. తాజా పరిణామాల తరువాత కిమ్‌ చెప్పింది వాస్తవమే అని పచ్చి మితవాద పత్రిక చోసన్‌ ఇబో వ్యాఖ్యానించింది. యూన్‌ భార్య కిమ్‌ ఇవోన్‌ హి, అధ్యాత్మిక సలహాదారు మైయుంగ్‌, ఇతర అనుచర గణం అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. అధికార పార్టీలో తమ అనుచరులకు పెద్ద పీటవేశారు.


కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకమైన చర్యలను యూన్‌ ప్రతిపాదించాడు. వారానికి 52గంటలకు బదులు 120 గంటలు పని చేయాలని, ఏడు రోజులూ 17 గంటల చొప్పున విధి నిర్వహించాలని పిలుపునిచ్చాడు. మార్చినెలలో కార్మిక శాఖ 69 గంటల పని వారాన్ని ప్రతిపాదించగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సైనిక పాలన విధించిన వెంటనే సైనిక జనరల్‌ ఆన్‌ సూ అన్ని రాజకీయ కార్యకలాపాలు, కార్మికుల సమ్మెలను నిషేధించాడు, పత్రికల మీద సెన్సార్‌షిప్‌ ప్రకటించాడు, ఎవరినైనా వారంటు లేకుండా అరెస్టు చేసే అధికారమిచ్చాడు. సమ్మెచేస్తున్న వైద్యులు విధుల్లో చేరాలని ఆదేశించాడు. కార్మిక సంఘాలలో లేని కార్మికుల రక్షణ కోసమంటూ ప్రతిపాదించిన చర్యలకు ప్రతిపక్షం మద్దతు ఇవ్వాలని ఈ ఏడాది మేనెలలో యూన్‌ కోరాడు. అలాంటి కార్మికులు పరస్పరం సహాయం చేసుకొనే విధంగా అసోసియేషన్లను ప్రోత్సహిస్తామని చెప్పాడు. ఇది కార్మికులను సంఘాలకు దూరం చేసే, విచ్చిన్నం చేసే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. పార్లమెంటులో ప్రతిపక్షాలు మెజారిటీగా ఉన్నందున ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందే అవకాశం లేదు. సంఘటిత కార్మిక సంఘాలంటే హింసాత్మక నేరాలకు పాల్పడే సంఘటిత శక్తులని యూన్‌ ఆరోపించాడు. నిర్మాణ రంగంలో తమ కార్మికులను మాత్రమే వినియోగించాలని కంపెనీల మీద సంఘాలు వత్తిడి చేస్తున్నాయని నిందించాడు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు కార్మిక సంఘాలను బూచిగా చూపి నిందిస్తే జనం హర్షిస్తారని భావించిన యూన్‌ ఇతర చర్యలతో అదే ప్రజల్లో పలుకుబడి కోల్పోయాడు. 2022లో జరిగిన ఎన్నికల్లో కేవలం 0.73శాతం ఓట్ల మెజారిటీతో మాత్రమే యూన్‌ ఎన్నికయ్యాడు.ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని 300 స్థానాలకు గాను యూన్‌ నాయకత్వంలోని పీపుల్స్‌ పవర్‌ పార్టీ 108 స్థానాలను మాత్రమే తెచ్చుకోగా ప్రతిపక్షాలకు 192 వచ్చాయి. అందువలన తన అజెండాకు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం లేకపోవటంతో దాన్ని పక్కన పెట్టేందుకు కుంటి సాకులతో అత్యవసర పరిస్థితి లేదా మిలిటరీ పాలన రుద్దేందుకు ప్రయత్నించాడు. ఒక వైపు మిలిటరీ పాలన ప్రకటనకు క్షమించాలని అంటూనే తన చర్యను సమర్ధించుకున్నాడు. పార్లమెంటులో మెజారిటీగా ఉన్న పార్టీలు అసాధారణ రీతిలో తన యంత్రాంగాన్ని అభిశంసించేందుకు పూనుకొని బడ్జెట్‌తో సహా ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు పూనుకున్నట్లు ఆరోపించాడు.


ఇప్పుడు దక్షిణ కొరియాలో ఏం జరగబోతోంది అన్న ఆసక్తి తలెత్తింది. యూన్‌ రాజీనామా చేయటం, అధ్యక్ష ఎన్నికలను ప్రకటించటం ఒకటి. అయితే గత ఎన్నికల్లోనే స్వల్ప మెజారిటీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాభవం పాలైన అధికార పక్షం ఇంత జరిగాక ఎన్నికల్లో పోటీకి సిద్దపడుతుందా ? యూన్‌ మీద విచారణ తతంగం జరిపి తిరిగి ఓటర్లలో విశ్వాసం ఉంది అనుకుంటే అప్పుడు ఎన్నికలకు వెళ్లవచ్చు. దాన్లో భాగంగానే దేశ పౌరులకు టీవీలో క్షమాపణ కూడా చెప్పించారు. అధికార విధులేవీ నిర్వర్తించకూడదని, ఒక క్రమ పద్దతిలో తప్పుకుంటాడని ఆదివారం నాడు పార్టీ ప్రకటించినప్పటికీ మరోసారి సైనిక పాలన విధించేందుకు అవసరమైన అధికారాలన్నీ అతగాడి వద్ద ఉన్నాయి.శనివారం నాడు పార్లమెంటు వద్ద యూన్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పదిలక్షల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు ప్రకటించగా పోలీసులు లక్షా 49వేల మంది అని చెప్పారు.అనేక అంశాలతో పాటు ఆర్థిక దిగజారుడు అక్కడి కార్పొరేట్లను ఆందోళనకు గురిచేస్తున్నది.వృద్ధి రేటు 2010లో 6.8శాతం ఉండగా గతేడాది 1.4శాతానికి దిగజారింది. ఈ ఏడాది 2.2శాతంగా ఉండవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికల ప్రకారం 2022లో నిజవేతనాలు 0.2శాతం, 2023లో 1.3శాతం పడిపోగా ఈ ఏడాది 0.5శాతం ఉండవచ్చని అంచనా. ఈ కారణంగానే అనేక పరిశ్రమల, సంస్థల కార్మికులు ఇటీవలి కాలంలో ఆందోళనలు చేపట్టారు. దాని అణచివేత ప్రయత్నమే సైనిక పాలన అని చెప్పవచ్చు. వచ్చే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా లేదా సైనిక తిరుగుబాటు జరిగినా కార్మికవర్గానికి పోరుబాట తప్ప మరొక మార్గం లేదు.

బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక ఎగిరెగిరి తన్నినా కిమ్మనటం లేదనే సామెతను నిజం చేస్తున్నారా ? మనది కర్మభూమి అనుకుంటున్నాం గనుక తప్పదు ! పదేండ్ల క్రితం డాలరుతో మారకంలో రూపాయి విలువ పతనం గురించి నరేంద్రమోడీ మొదలు బిజెపి నేతలందరూ ఎన్ని మాట్లాడారు ! ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పతనమైనా పల్లెత్తు మాటల్లేవేమి ? రూపాయి పతనం, జిడిపి వృద్ధి రేటు పతనం, ఎగుమతుల్లో ఎదుగుదల పతనం ఇలా పదేండ్ల పాలనలో అవే ఎక్కువ. మరక మంచిదే అని ఒక వాణిజ్య ప్రకటనలో చెప్పినట్లుగా రూపాయి విలువ తగ్గటం మనకు మంచిదే అని కొంత మంది సమర్థిస్తారు. కొన్ని అంశాలలో వాస్తవమే, ఎగుమతిదార్లకు, విదేశాల నుంచి డబ్బు పంపేవారికి లబ్ది, దిగుమతిదార్లకు, తద్వారా జనాలందరికీ భారం. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్న లోకోక్తి తెలిసిందే. మన దేశంలో అదే జరుగుతోంది. మన కరెన్సీ పతనం కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తుండగా అత్యధికుల జేబులు గుల్లవుతున్నాయి. ఏటా వేల కోట్ల డాలర్లను విదేశాలకు సమర్పించుకుంటున్నాము. ఉదాహరణకు 202223లో రు.21,45,690, 202324లో రు.19,54,060 కోట్లు విదేశాలకు సమర్పించుకున్నాము. దీనిలో ఎక్కువ చైనాకే రు.6,73,0006,97,000 చొప్పునవెళ్లింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఈ భారం మొత్తాన్ని మన జనం మీద మోపారు. కార్పొరేట్లు లేదా ప్రభుత్వ కంపెనీలు లాభాలతో సహా దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలను వినియోగదారులనుంచే కదా వసూలు చేసేది.


కొందరు వర్ణిస్తున్నట్లుగా ముచ్చటగానో లేదా మరికొందరంటున్నట్లుగా దేశానికి మూడిగానీ మోడీ పాలనలో పదకొండో ఏడులో ఉంది. 2014లో ఒక వస్తువు ధర రు.106 ఉంటే ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా అదే ఇప్పుడు రు.156 పెట్టి కొనాల్సి వస్తోంది.ద్రవ్యోల్బణం సగటున 5.12శాతం పెరిగిన ఫలితమే. ఈ నిర్వాకం సంగతేమిటి ? ఈ మేరకు జనానికి రాబడి పెరుగుతోందా ? 2024 అక్టోబరులో పద్నాలుగు నెలల గరిష్టం 6.21శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం అంతకు మించి 15నెలల గరిష్టం 10.87శాతానికి చేరింది.ఏడాది క్రితం అక్టోబరు నెలలో 6.61శాతమే ఉంది. వినియోగదారులు కొనేటట్లు లేదు కడుపు నిండాతినేట్లు లేదు. అన్నదాతల పరిస్థితి ఏమిటి ? ప్రస్తుతం రబీ సీజన్‌ నడుస్తున్నది, దేశమంతటా ఈ పంటలకు ముఖ్యమైన డిఏపి ఎరువుల కొరత, దాన్ని ఆసరా చేసుకొని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.యూరియాయేతర ఎరువుల కోసం రబీ తరుణంలో ఎరువుల సబ్సిడీ నిమిత్తం రు.24,474 కోట్ల సబ్సిడీ ఇవ్వనున్నట్లు, అది గత ఏడాది కంటే పదిశాతం ఎక్కువ అని గొప్పగా కేంద్ర పెద్దలు చెప్పారు. డిఏపి మే నెలలో టన్ను దిగుబడి ధర 510 డాలర్లు ఉండగా నవంబరు మొదటి వారంలో 645కు పెరిగింది.అది రు.54,000కు సమానం. ఈ స్థితిలో కేంద్రం గరిష్ట ధరగా రు.27వేలు నిర్ణయించి సబ్సిడీగా రు.21.911గా ప్రకటించింది. కొరత ఏర్పడిన స్థితిలో మరో మూడున్నరవేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఏ వ్యాపారి 54వేలు చెల్లించి దిగుమతి చేసుకుంటాడు ? ఒకవేళ దిగుమతి చేస్తే అంత ధరలో రైతులు కొనుగోలు చేయగలరా ?

గతేడాది అక్టోబరు ఒకటి నాటికి 30లక్షల టన్నుల మేర నిల్వలుండగా ఈ ఏడాది 16లక్షలకు తగ్గింది. పోనీ దేశీయంగా ఉత్పత్తి పెరిగిందా అంటే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏడు శాతం తగ్గింది. దిగుమతులను చూస్తే గతేడాది ఏప్రిల్‌సెప్టెంబరు మధ్య 34.5లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అది 19.6లక్షలకు పడిపోయింది. ఏడాదికి 100 నుంచి 110లక్షల టన్నులు అవసరం కాగా దీనిలో 60శాతం దిగుమతి చేసుకుంటున్నాము. ఈ ఏడాది ఇప్పటి వరకు దిగుమతులు సగం తగ్గటానికి కేంద్రం ఎరువుల మీద సబ్సిడీలో భారీ కోత విధించటమే అసలు కారణం. 202223లో రు.2.51లక్షల కోట్లు కేటాయించిన మోడీ సర్కార్‌, 202324లో రు.1.88, 202425లో ఆ మొత్తాన్ని రు.1.64లక్షల కోట్లకు కోత పెట్టింది. యుపిఏ సర్కార్‌ 2010లో అమల్లోకి తెచ్చిన విధానం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని మాత్రమే సబ్సిడీగా ఇస్తారు, దాన్ని విమర్శించిన నరేంద్రమోడీ తనదాకా వచ్చేసరికి దాన్నే అమలు జరిపారు. అయితే మధ్యలో అంతర్జాతీయంగా ధరలు విపరీతంగా పెరగటం, రైతాంగం ఏడాది పాటు ఢల్లీి శివార్లలో ఉద్యమించిన నేపధ్యంలో సబ్సిడీ మొత్తాన్ని పెంచారు. తిరిగి పైన పేర్కొన్న విధంగా కోత మొదలు పెట్టారు.ద్రవ్యోల్బణం అదుపులో ఉండాలంటే సబ్సిడీలకు కోతపెట్టి ప్రభుత్వ ఖర్చు తగ్గించటానికి పూనుకున్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గటానికి దిగుమతి చేసుకొనే ఎరువులు, గ్యాస్‌ ధర తగ్గటమే అని కొందరు చెబుతున్నారు. అదే ప్రాతిపదిక అయితే అవసరాలకు అనుగుణంగా డిఏపి దిగుమతి చేసుకొని పంటలు పండేందుకు తోడ్పడాల్సిందిపోయి, ధరలు పెరిగాయనే పేరుతో దిగుమతులు ఎందుకు తగ్గించినట్లు ?


రూపాయి పతనం అన్నది ఆర్థిక స్థిరత్వం మీద పెద్ద ప్రభావం చూపుతుంది.అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది.యుపిఏ పాలన మీద ధ్వజమెత్తటానికి బిజెపి ప్రచార కమిటీ నేతగా 2014 ఎన్నికలకు ముందు దీన్ని ఒక అయుధంగా వాడుకున్నారు. రూపాయి విలువ పతనమౌతుంటే గతంలో ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమన్నారో తెలుసా ! ‘‘ ఆర్థికం లేదా రూపాయి విలువ పతనం గురించి ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు, తన కుర్చీని ఎలా కాపాడుకోవాలన్నదే దాని ఏకైక ఆందోళన. ఈ కారణంగా దేశం ఈ రోజు ఆశాభంగం చెందింది. గత మూడు నెలలుగా పతనం అవుతున్న రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దాన్ని అవకాశంగా తీసుకుంటాయి. గడచిన ఐదు సంవత్సరాలుగా ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెబుతున్నారు తప్ప జరిగిందేమీ లేదు ’’ (2013 ఆగస్టు 20, బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో పిటిఐ వార్త). మోడీ ఈ ఆరోపణలు చేసిన రోజు డాలరుకు రూపాయి విలువ 64.11గా ఉంది. పదేండ్ల తరువాత ఇప్పుడు 84.73కు దిగజారింది.అడిగేవారు లేక గానీ పైన చెప్పిన అంశాలన్నీ మోడీకి వర్తించవా ? ఈ దిగువ ఆయా సంవత్సరాలలో రూపాయి సగటు విలువ ఎలా ఉందో చూడవచ్చు. 2024 విలువను రాసిన సమయానికి ఉన్నదిగా పరిగణించాలి.
సంవత్సరం = రూ.విలువ
2014 = 62.33
2015 = 62.97
2016 = 66.46
2017 = 67.79
2018 = 70.09
2019 = 70.39
2020 = 76.38
2021 = 74.57
2022 = 81.35
2023 = 81.94
2024 = 83.47
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. యుపిఏ చివరి సంవత్సరాలలో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం, ధరలు కూడా పెరిగాయి. మోడీ పదవిలోకి రాగానే ముడి చమురు ధర బాగాపడిపోయి దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గింది, ఆ సమయంలో వినియోగదారులకు ఆ మేరకు లబ్ది చేకూరకుండా వివిధ సెస్సులను భారీగా విధించి, పెద్ద మొత్తంలో కేంద్రం రాబడిని పొందింది. రూపాయి విలువ తగ్గితే మన ఎగుమతులు పెరుగుతాయన్నది కూడా వాస్తవం కాదు. 2013లో మన ఎగుమతులు 472 బిలియన్‌ డాలర్లు కాగా 2023లో అవి 777 బి.డాలర్లకు పెరిగాయి. దీన్నే జిడిపిలో చూస్తే ఎందుకంటే దాన్ని పెంచిన ఘనత తమదే అని బిజెపి చెప్పుకొంటోంది గనుక25.43 నుంచి మధ్యలో 18.66శాతానికి పడిపోయినా 2023లో 21.89శాతంగా ఉంది. అంటే మొత్తంగా చూసినపుడు పతనం తప్ప పెరుగుదల లేదు. దిగుమతులు వినియోగదారులకు భారం కాకూడదు. వజ్రాలు, బంగారం వంటి వాటిని దిగుమతి చేసుకుంటే వాటి మీద పన్ను విధించవచ్చు, ఇబ్బంది లేదు, కానీ ముడిచమురు దిగుమతుల మీదకూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాభాలను పిండుకుంటున్నాయి.

నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాదికి ఇప్పటికీ తేడాను చూద్దాం. యుపిఏ పాలన చివరి ఏడాది నుంచి ఇప్పటి వరకు మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా సగటు ధరలు ఇలా ఉన్నాయి.
ఏడాది = డాలర్లు ——–ఏడాది = డాలర్లు
2013-14 =105.52 2014-15 = 84.16
2015-16 = 46.17 2016-17 = 47.56
2017-18 = 56.43 2018-19 = 69.88
2019-20 = 60.47 2020-21 = 44.82
2021-22 I 79.18 2022-23 = 93.15
2023-24 = 82.58

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 81.95 డాలర్లు ఉంది. దీనికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా గడచిన రెండున్నర సంవత్సరాలుగా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ ధరలను బట్టే రాష్ట్రాలు వ్యాట్‌ వసూలు చేస్తున్నాయి. కేంద్రం ధర తగ్గిస్తే ఆ మేరకు రాష్ట్రాలూ తగ్గిస్తాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదుల్చుతున్నారు. 201415 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 202021 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 202324 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. 2024 ఆగస్టు ఒకటవ తేదీన ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం ప్రకారం 201920లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను, తదితరాల రాబడి మొత్తం రు.5,55,370 కోట్లు కాగా దీనిలో కేంద్ర వాటా రు.3,34,315 కోట్లు, ఈ మొత్తాలు 202324 తాత్కాలిక అంచనాలో పెరిగిన మొత్తం రు.7,51,156 కోట్లు కాగా కేంద్ర వాటా రు.4,32,394 కోట్లు ఉంది. ఇంత మొత్తం సంపాదిస్తున్న కేంద్రం ఉజ్వల గాస్‌ పధకం పేరుతో ఒక్కొక్క వినియోగదారుకు ఏడాదికి ఇస్తున్న సబ్సిడీ రు.1,114 కాగా ఇతర వినియోగదారులకు ఇస్తున్న మొత్తం రు.670 మాత్రమే. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచుతామంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 201415లో ప్రభుత్వప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023`24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇలాంటి పాలనతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు. అదుపులేని రూపాయి పతనం,ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరుగుతూ నడ్డి విరుస్తున్నాయి. పదేండ్ల క్రితం మోడీ చెప్పిన అచ్చే దిన్‌ ( మంచి రోజులు ) బిజెపి మద్దతుదార్లకైనా వచ్చాయా ?

కాషాయ తాలిబన్ల దాష్టీకం : ఏ మతంలో ఎందరుండాలో, ఎందరు పిల్లలను కనాలో కూడా వారే నిర్ణయిస్తారా !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


జనాభా తగ్గకుండా ఉండాలంటే ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ చెప్పారు. జనానికి చెప్పే ముందు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లోని వారు ఆచరించి చూపాలని ప్రతిపక్షాలు వెంటనే స్పందించాయి. గతంలో కొందరు సాధువులు, సాధ్విలు ఇలాగే చెప్పినపుడు ముందు మీరు సంసారులు కండి అన్న స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. నాగపూర్‌లో జరిగిన ఒక సభలో భగవత్‌ చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారమే రేగింది. అదానీ లంచాలపై మోడీ నోరు విప్పాలంటూ పార్లమెంటును స్థంభింప చేయటం, దిగజారిన జిడిపి, ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం వంటి అనేక సమస్యలు చుట్టుముడుతుండగా వాటి మీద నోరెత్తకుండా ఒక కుల సమావేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న పిలుపు ఇవ్వటం ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడిరచినట్లు జనాభా తగ్గుదల, వృద్ధుల పెరుగుదల గురించి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యల పూర్వరంగంలోనే ఇలా మాట్లాడినట్లు ఒక వర్గపు మీడియా భాష్యం చెప్పింది. అసలు విషయం ఏమంటే ఇద్దరు సిఎంలు చెప్పింది మొత్తంగా వృద్ధులు పెరుగుతున్నారని, దాన్ని అవకాశంగా తీసుకొని మోహన్‌ భగవత్‌ హిందువులు తగ్గిపోతున్నారని, పెంచాలనే నేపధ్యంలో మాట్లాడారు. జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1కంటే తగ్గితే ఎవరూ నాశనం చేయకుండానే సమాజం అంతరించిపోతుందని భగవత్‌ చెప్పారు.0.1సంతానం ఉండదు గనుక ముగ్గురు ఉండాలన్నారు. సంతానోత్పత్తి రేటు అంటే ఒక మహిళ జీవితకాలంలో ఎంత మంది పిల్లలకు జన్మనిచ్చిందో తెలిపే సగటు.ఇది దేశాలను బట్టి, దేశంలోనే ప్రాంతాలు, విశ్వాసాలు, ఇతర అనేక అంశాలను బట్టి మారుతూ ఉంటుంది, అన్నింటినీ కలిపితే ప్రపంచ సగటు వస్తుంది. జనాభా పెరుగుదల లేదా తగ్గుదల గురించి ఎవరైనా తమ వైఖరిని చెప్పవచ్చు. కానీ దానికి మతాన్ని ముడిపెట్టటమే అసలు సమస్య. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి 2022 అక్టోబరులో జనాభా అదుపుకు సమగ్ర విధానం ఉండాలని, మత ప్రాతిపదికన అసమతూకం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

హిందూ మతం బతికి బట్టకట్టాలంటే హిందువులు పది మంది పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్‌ గుంపుకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ నేతలు పిలుపు ఇచ్చారు.(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2015జనవరి 19 లక్నో ) ఆ సంస్థ ఏర్పాటు చేసిన ఒక సభలో దాని అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా మాట్లాడుతూ హిందూమతం పెరగాలంటే ఎనిమిది నుంచి పది మంది పిల్లలను కనాలని చెప్పారు. బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ నలుగురిని కనాలన్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2006 ఏప్రిల్‌ 20వ తేదీన ‘‘కాషాయ జనాభా శాస్త్రం ’’ పేరుతో ప్రచురించిన విశ్లేషణ వివరాల ప్రకారం అదే సంస్థ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌ 2004లో మాట్లాడుతూ హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనకపోవటం ఆత్మహత్యా సదృశ్యమన్నారు. కుటుంబ నియంత్రణ పాటించకూడదన్నారు. 2005 ఫిబ్రవరిలో విహెచ్‌పి మార్గదర్శక మండల్‌ సమావేశంలో శ్రీకృష్ణుడి తలిదండ్రుల మాదిరి సంతానాన్ని కనాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.సుభాష్‌ చంద్రబోస్‌ కృష్ణుడి మాదిరి ఎనిమిదవ సంతానమని, రవీంద్రుడు తొమ్మిదవ సంతానమని దానిలో పేర్కొన్నారు.హిందూ మహిళలు విచ్చల విడిగా అబార్షన్లు చేయించుకోకుండా చూడాలని విహెచ్‌పి కోరింది.ముస్లింల జనాభా అదుపులేకుండా పెరుగుతోందని, వారికి పోటీగా హిందువులు పిల్లలను ఎక్కువగా కనాలని హరిద్వార్‌లో జరిగిన విశ్వహిందూపరిషత్‌ మార్గదర్శక్‌ మండల్‌ పిలుపు ఇచ్చిందని, భగవద్గీతను జాతీయ గ్రంధంగా ప్రకటించాలని కోరిందని రెడిఫ్‌ న్యూస్‌ 2006 జూన్‌ 15న ‘‘ హిందువులు జనాభాను పెంచాలని కోరిన విహెచ్‌పి ’’ అనే శీర్షికతో వార్త ఇచ్చింది. ఎంత ఎక్కువ జనాభా ఉంటే ఆ సమాజం ప్రపంచంలో ఎక్కువ ప్రభావితం చేస్తుందని, జనాభా పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందన్నది ఒట్టి మాట అని స్వామి అవదేశానంద గిరి విలేకర్లతో చెప్పారు. దేశ జనాభా తీరును మార్చేందుకు పెద్ద కుట్ర ఉందని, అసమతూకం గురించి ఆమోదించిన తీర్మానాన్ని చదివి వినిపించారు.దేశంలోని కొన్ని ప్రాంతాలలో మైనారిటీలు పైచేయి సాధించటాన్ని నివారించాలంటే పెద్ద హిందూ కుటుంబాలు ఉండాలని, ఉన్నత హిందూ కుటుంబాల వారు కుటుంబనియంత్రణ గురించి తీవ్రంగా సమీక్షించుకోవాని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కేరళలోని కొచ్చిలో 2013లో జరిగిన ఒక సభలో పిలుపునిచ్చారు. కుటుంబ నియంత్రణ అన్నది హిందువులకు ఇంకేమాత్రం వ్యక్తిగత సమస్య కాదని, ఒక బిడ్డ చాలని వారు అనుకుంటే ముస్లింలు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని విశ్వహిందూ పరిషత్‌ నేత చంపత్‌ రాయ్‌ 2015లో ఒక పత్రికా గోష్టిలో చెప్పారు. చిత్రం ఏమిటంటే ఇదే విహెచ్‌పి కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటి వరకు ఉమ్మడి పౌరస్మృతిని అమలు జరపాలన్న వారు జనాభా నియంత్రణ అందరికీ ఒకే విధంగా ఉండాలని, ఇద్దరు పిల్లలకు మించి ఏ మతం వారూ కనకూడదని చెబుతోంది.‘‘ ఆర్గనైజర్‌(రాసిన) తరువాత ఉమ్మడి జనాభా విధానం, ఉమ్మడి పౌరస్మృతి ప్రకారం అందరికీ ఇద్దరు పిల్లల నియమం ఉండాలని కోరుతున్న విహెచ్‌పి ’’ అనే శీర్షికతో 2024 జూలై 11న ‘‘ ది ప్రింట్‌ ’’ ఆన్‌లైన్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. జనాభా అసమతూకాన్ని నిరోధించాలని, ముస్లిం జనాభా పెరుగుదల గణనీయంగా ఉండటమే దీనికి కారణమని ఆర్గనైజర్‌(ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక) సంపాదకీయం లంకెపెట్టిందని దానిలో వ్యాఖ్యానించారు. విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ ఆ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ఉమ్మడి పౌర స్మృతిలో ఇద్దరు పిల్లల నిబంధన కూడా చేర్చాలన్నారు.

హిందూ జాతి అంతరిస్తున్నదని, మతానికి ముప్పు వచ్చిందని, త్వరలో ముస్లిం జనాభా మెజారిటీగా మారుతుందని హిందూ మహాసభ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులంతా పదే పదే చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తెలిసిందే. మోహన్‌ భగవత్‌ గారు కనీసం ముగ్గుర్ని కనాలంటూ సంఖ్యను తగ్గించారు. గతంలో మాదిరి డజన్ల కొద్దీ సంతానాన్ని కని హిందూమతాన్ని పెంచాలంటే మొదటికే మోసం వస్తుందని, ఉన్న ఆదరణ కోల్పోతామన్న భయంతోనే ఇలా మాట్లాడుతున్నారన్నది స్పష్టం.జనాభా నియంత్రణ విధానంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఇతర పద్దతులను మన ప్రభుత్వాలు ప్రోత్సహించాయి తప్ప ఒక్క హిందువులు మాత్రమే పాటించాలని, ముస్లింలు, ఇతర మతాలవారికి మినహాయింపులు ఇచ్చినట్లు చెప్పలేదు. అది కూడా స్వచ్చందం తప్ప ఎలాంటి నిర్బంధం చేయలేదు. మరి కాషాయ దళాలు దాన్ని ఎందుకు వక్రీకరిస్తున్నట్లు ? అన్ని మతాల వారికి ఇద్దరిని మించి కనగూడదని నిబంధనలు పెట్టాలని ఎందుకు కోరుతున్నట్లు ? జనాభా సమతూకం అంటే వీరి దృష్టిలో ఏమిటి? ఏమతం వారు ఎందరుంటే సమతూకం ఉంటుంది ? అంటే వీరు చెప్పినట్లే జనం మతాన్ని పాటించాలి, ఎందరు పిల్లల్ని కనమంటే ఆ సంఖ్యలోనే కనాలి. ఇలాంటి వారిని సహిస్తే రానున్న రోజుల్లో ఏ కులంవారు ఎంత మంది ఉండాలో కూడా నిర్దేశిస్తారు.


ఇంతకీ ముగ్గురు పిల్లలను కనాలని కేవలం హిందువులకే చెబుతున్నారా లేక జనాభా మొత్తానికా అన్నది మోహన్‌భగవత్‌ చెప్పలేదు. ముస్లింలు, నాలుగు వివాహాలు చేసుకొని ఎక్కువ మందిని కని హిందూజనాభాను మించిపోవాలని చూస్తున్నారన్న ప్రచారం వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాలలో చేస్తున్నది హిందూత్వశక్తులే అని వేరే చెప్పనవసరం లేదు. ఇది నిజమా ? ఈ గుంపు మాటలు వాస్తవమైతే భారత్‌ ఎప్పుడో ముస్లిం మతస్తులతో నిండిపోయి ఉండాల్సింది. భారత ఉపఖండంలోకి ముస్లింలు, ఇస్లాం మతరాక క్రీస్తుశకం 7వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. పన్నెండు వందల నుంచి 1,700శతాబ్దం వరకు ఐదు వందల సంవత్సరాల పాటు ముస్లిం రాజుల పాలన సాగింది. తరువాత రెండు వందల సంవత్సరాలు క్రైస్తవులైన ఆంగ్లేయుల పాలన ఉంది. అయినప్పటికీ భారత్‌లో ఇప్పటికీ 80శాతం మంది హిందువులే ఉన్నారు. బలవంతపు మతమార్పిడులు చేశారని, ఎక్కువ మంది పిల్లలను కన్నారని చెప్పిన తరువాత పరిస్థితి ఇది. ఆ ప్రచారం ఇప్పటికీ కొనసాగుతున్నందున హిందూమతాన్ని నిలబెట్టేందుకే ముగ్గురు పిల్లలను కనాలన్నది మోహన్‌ భగవత్‌ మాటలకు అర్ధం.ఎందుకంటే ఇదే భగవత్‌ 2022 అక్టోబరులో అందరికీ వర్తించే సమగ్ర జనాభా విధానం కావాలంటూనే మత ప్రాతిపదికన అసమతూకం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో జనాభా పెరుగుదలను మతకోణంలో చూడటం అవాంఛనీయ వైఖరి.


ఇదే గనుక వాస్తవమైతే ముస్లిం ఛాందసులు అధికారంలో ఉన్న ఇరాన్‌లో సంతానోత్పత్తి రేటు ఏడాదికేడాది ఎందుకు తగ్గుతున్నదో ఎవరైనా చెప్పగలరా ? 1950లో అక్కడ 6.9 ఉండగా 2024లో 2.08కి తగ్గింది. ఐరోపాలో సంతానోత్పత్తి రేటు 1.5, సగం ఐరోపా, సగం ఆసియాలో ఉన్న టర్కీ ముస్లిం దేశం అక్కడ కూడా అంతే ఉంది.ముస్లింలు అధికంగా ఉన్న దేశాలలో 201121 సంవత్సరాల కాలంలో సంతానోత్పత్తి రేటు 3.3 నుంచి 2.7కు, అత్యంత వెనుక బడిన ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో 3.8 నుంచి 3.4కు, సబ్‌ సహారా ప్రాంతంలో ఇతర ఆఫ్రికా దేశాలతో పోలిస్తే ఒక బిడ్డ అదనంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. విద్య, పట్టణీకరణ, ఆర్థిక, సామాజిక,ఆరోగ్య, శిశుమరణాలు తదితర పరిస్థితులను బట్టి తప్ప ప్రపంచంలో ఎక్కడా మత ప్రాతిపదికన పిల్లలను కనటం లేదు. తమ ఉన్మాద చర్యలకు ఉపయోగించుకోవటం తప్ప ఏ మతమూ పిల్లల బాగోగులకు బాధ్యత తీసుకోవటం లేదు. 2023లో దక్షిణ కొరియాలో సంతానోత్పత్తి 0.7 ఉండగా ఆఫ్రికాలోని నైగర్‌లో 6.1 ఉంది.ఆర్థికాభివృద్ధి, విద్య, పట్టణీకరణ తదితర అనేక అంశాలు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన 1,800 సంవత్సర ప్రారంభంలో ప్రపంచంలో 4.5 నుంచి 7.5వరకు ఉంది, 1960దశకంలో ఐదు ఉండగా 2023నాటికి 2.3కు తగ్గింది. 2,100 నాటికి 1.8కి తగ్గుతుందని అంచనా. ఇతర అన్ని దేశాలలో మాదిరే మనదేశంలో కూడా అన్ని చోట్లా ఒకే విధంగా లేదు. కొన్ని వివరాలు చూద్దాం. 201921లో జరిగిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటే దక్షిణాది రాష్ట్రాలలో 1.64,ఉత్తరాదిన 2.0, పశ్చిమాన 1.81, తూర్పున 2.0, మధ్య ప్రాంతంలో 2.1 ఈశాన్య ప్రాంతంలో 2.15 ఉంది. రాష్ట్రాలన్నింటా ఒకే విధంగా లేదు.బీహార్‌లో 3.02 పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 2.38, దాన్నుంచి ఏర్పాటు చేసిన ఉత్తరా ఖండ్‌లో 1.87, పశ్చిమ బెంగ్లాల్లో 1.56 పక్కనే ఉన్న ఒడిషాలో 2.14 చొప్పున ఉంది. ఒకే రాష్ట్రంలో చూస్తే గుజరాత్‌ గ్రామీణంలో 2.15, పట్టణాల్లో 1.63, మధ్యప్రదేశ్‌లో 2.231.62, తెలంగాణాలో 1.951.63, ఆంధ్రప్రదేశ్‌లో 1.741.62 ఉంది.

ఎందరు పిల్లల్ని కనాలనే అంశంలో కాషాయ దళాలు మాట ఎందుకు మారుస్తున్నట్లు ? సమగ్ర జనాభా విధానం ఉండాలని చెబుతున్నవారు జనాభా గురించి ఒక సమగ్రదృష్టితో కాకుండా విద్వేష, పాక్షిక దృష్టితో ఎందుకు చూస్తున్నట్లు ? ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అదే నిజం అవుతుందన్న గోబెల్స్‌ సిద్దాంతం కొంతకాలం నడిచింది. ఇప్పుడు అదే అబద్దాలు చెబితే కుదరదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో వాస్తవాన్ని కూడా అంతే.దేశంలో వారు ప్రచారం చేసినట్లుగా ముస్లింల జనాభా పెరగలేదు, హిందువులు అంతరించలేదు.కుటుంబ నియంత్రణ పద్దతులను ప్రవేశపెట్టిన వెంటనే దేశంలోని అన్ని సామాజిక తరగతులు ఒకే విధంగా స్పందించలేదు. 201516 జాతీయ కుటుంబ సర్వే వివరాల ప్రకారం ఎక్కువ విద్యావంతులున్న జైన్‌ సామాజిక తరగతిలో సంతానోత్పత్తి రేటు 1.2శాతమే. మొత్తంగా చూసినపుడు అత్యంత పేదల్లో 3.2 ఉండగా ధనికుల్లో 1.5 మాత్రమే ఉంది. ముస్లిం సామాజిక తరగతిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండటానికి వారు ఆలశ్యంగా మేలుకోవటమే. దానికి కుట్ర సిద్దాంతాలతో విద్వేష ప్రచారం చేయటం తగనిపని. తాజా సమాచారాన్ని చూసినపుడు సంతానోత్పత్తి రేటు తగ్గుదల హిందువులతో పోల్చితే ముస్లింలలో వేగంగా ఉంది.1992 నుంచి 2021 మధ్య కాలంలో ముస్లింలలో 4.41 నుంచి 2.36కు(2.05 మంది) తగ్గగా హిందువుల్లో 3.3 నుంచి 1.94కు(1.36మంది) పడిపోయింది. హిందువుల్లోని దళితుల్లో 2.08, గిరిజనుల్లో 2.09, ఓబిసిల్లో 2.02 ఉంది. ఈ మూడు కాని తరగతుల్లో 1.78 ఉంది. సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉన్న వారిలో విద్య, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే కొద్దీ సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నట్లు ప్రతి సర్వే వెల్లడిస్తున్నది. అందువలన ముస్లింలను బూచిగా చూపటం మెజారిటీ ఓట్ల రాజకీయం తప్ప మరొకటి కాదు. కొస మెరుపు ఏమిటంటే ముస్లింల కంటే ఎక్కువగా ఉత్తర ప్రదేశ్‌లో 2.47,బీహార్‌లో 3.19 ఉంది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందని ఎవరైనా చెప్పగలరా ? ఆ రాష్ట్రాలు దుర్భరదారిద్య్రంలో ఉండటమే కారణం. ముస్లింలూ అంతే.

అమెరికన్‌ డాలరుకు ఎసరు వస్తోందా ! డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు అర్ధమేమిటి !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


తమ కరెన్సీ డాలరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీతో వాణిజ్యం జరిపేందుకు బ్రిక్స్‌ కూటమి దేశాలు పూనుకుంటే వందశాతం పన్ను విధిస్తామని జనవరి 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు.బ్రిక్స్‌ దేశాలని, వేరే కరెన్సీ అని చెప్పినప్పటికీ స్థానిక కరెన్సీలతో లావాదేవీలు జరిపే అన్ని దేశాలకూ వర్తింపచేస్తామనే హెచ్చరిక దీని వెనుక ఉంది.ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌,ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏయి) ఉన్నాయి.మరో 34 దేశాలు చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. వాటిని నిరుత్సాహపరిచేందుకు కూడా ట్రంప్‌ ఈ ప్రకటన చేశాడు. నిజానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మార్చి నెలలోనే దీని గురించి చెప్పాడు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ దువ్వూరు సుబ్బారావు వంటి వారు ట్రంప్‌ మాటలు ఊకదంపుడేనా, నిజంగా అమలు జరుగుతాయా, అమెరికా చట్టాలు అందుకు అనుమతిస్తాయా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చైనా వస్తువుల మీద పదిశాతం, కెనడా, మెక్సికోల నుంచి వచ్చే వాటి మీద 25శాతం పన్ను విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చర్యకు ప్రతిచర్య ఉంటుంది, అది ఏ రూపంలో అన్నది చూడాల్సిఉంది.


మొదటి ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచ మారకపు కరెన్సీగా బ్రిటీష్‌ పౌండు ఉన్నది.1920దశకం నుంచి డాలరు క్రమంగా పెరిగి పౌండ్‌ను వెనక్కు నెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధ ముగింపులో ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్థల ఏర్పాటు తరువాత పూర్తిగా డాలరు పెత్తనం ప్రారంభమైంది. గతంలో ఒక ఔన్సు(28.35 గ్రాములు) బంగారం 35 డాలర్లకు సమానమైనదిగా మారకపు విలువ నిర్ణయించారు. 2024 డిసెంబరు రెండవ తేదీన ఒక ఔన్సు బంగారం ధర 2,626 డాలర్లు ఉంది. 1971లో డాలరుబంగారం బంధాన్ని తెంచిన తరువాత డాలరుకు ఎదురులేకుండా పోయింది. దాన్ని అడ్డుకొనేందుకు ఐరోపా ధనికదేశాలు యూరో కరెన్సీని ముందుకు తెచ్చినా డాలరుకు ప్రత్యామ్నాయం కాలేకపోయింది. గత పదిహేను సంవత్సరాలుగా డాలరు ప్రభావం క్రమంగా తగ్గుతోంది.రాజకీయంగా తమ పెత్తనానికి ఎదురు దెబ్బలు తగులుతున్న పూర్వరంగంలో ఆర్థికంగా నిలిచి ప్రపంచ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని అమెరికా చూస్తున్నది, అదే ట్రంప్‌ అజెండా, దానికి అనుగుణంగా ప్రకటనలు ఉన్నాయి.అయితే అది జరిగేనా ?

డాలరుకు ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా 2023లో ప్రతిపాదించాడు. అంతకు ముందు నుంచే దీని గురించి చర్చ ఉంది. డాలరును ఉపయోగించవద్దని ఏ దేశం మీద కూడా వత్తిడి తేవద్దని, బ్రిక్స్‌ మద్దతు ఇచ్చే కరెన్సీలో చెల్లింపులు పెరగాలని, దుర్బలత్వాలను తగ్గించుకోవాలని లూలా అన్నాడు. తనకు నచ్చని దేశాల మీద డాలరును అమెరికా ఆయుధంగా ఉపయోగిస్తున్నది. ఇరాన్‌తో లావాదేవీలపై అమెరికా నిషేధం విధించిన కారణంగా మనదేశం అక్కడి నుంచి చమురుకొనుగోలు నిలిపివేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి రష్యా ఒక్కదాన్నే బాధ్యురాలిగా చేస్తూ దాని మీద కూడ అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు మన ప్రభుత్వం ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాల్సి వచ్చింది.మరోవైపు మన కరెన్సీని అంగీకరించే విధంగా 23 దేశాలతో ఇప్పటికే అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. రూపాయితో లావాదేవీలు జరిగితే ఎగుమతి, దిగుమతిదార్లకు కరెన్సీ మారకపు విలువ హెచ్చు తగ్గుల ముప్పు ఉండదు. మన విదేశీ వాణిజ్యంలో మూడోవంతు ఈ దేశాలతోనే జరుగుతున్నది.అమెరికాతో ఉన్న రాజకీయ బంధం, డాలరుతో తెగతెంపులు చేసుకోవటం పూర్తిగా ఇష్టం లేని కారణంగా మనదేశం ఇరకాటవస్థలో ఉంది.తామెన్నడూ డాలరును దెబ్బతీసేందుకు లక్ష్యంగా చేసుకోలేదని మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చెప్పారు. కొన్ని సందర్భాలలో తమ వాణిజ్య భాగస్వాములకు డాలర్లు ఉండటం లేదని, ఆ కారణంగా ప్రత్యామ్నాయాలను చూస్తున్నాం తప్ప ఎలాంటి దురుద్ధేశ్యాలు లేవని చెప్పారు.చైనాతో మన వాణిజ్యం లోటులో ఉండగా అమెరికాతో మిగులులో ఉంది. ఈ కారణంగానే దానితో సంబంధాల విషయంలో మనదేశం ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉమ్మడి కరెన్సీ పథకాలకు దూరంగా ఉంటోంది. కొన్ని లావాదేవీల్లో డాలర్లకు ఆటంకాలు ఉన్నందున స్థానిక కరెన్సీలతో ఏర్పాట్లు చేసుకుంటున్నది.డాలరుతో తెగతెంపులు చేసుకొనేందుకు, తద్వారా అమెరికా మార్కెట్‌ను కోల్పోయేందుకు మనదేశంలోని ఐటి, దాని అనుబంధ, సేవారంగాలలో, ఔషధ, వస్త్ర పరిశ్రమల కార్పొరేట్లు అంగీకరించే అవకాశం లేదు.

కార్పొరేట్‌ శక్తులు పశ్చిమదేశాల మార్కెట్‌ మీద కేంద్రీకరించిన కారణం కూడా విస్మరించరానిదే.మనదేశం డాలర్‌ పెట్టుబడులను ఆశిస్తున్నందున దాన్ని దెబ్బతీసేందుకు ముందుకు పోదన్నది అభిప్రాయం. బ్రిక్స్‌ కూటమి జిడిపిలో 70శాతం వాటా చైనాదే. ప్రత్యామ్నాయ కరెన్సీ రూపొందితే దానిలో ఆధిపత్యం ఉండే అవకాశం ఉంది, రాజకీయంగా దాన్ని ఎదుర్కోవాలని కోరుతున్న మనదేశంలోని చైనా వ్యతిరేకశక్తులు అంగీకరించే అవకాశం కూడా లేదు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలరుకు బదులు మరొక కరెన్సీని వినియోగించే అవకాశం లేదని, ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే అమెరికాకు వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది, బ్రిక్స్‌ దేశాలు డాలరుకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుండటాన్ని మేము గమనించటం ముగిసిందని, అద్బుతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో తమ వస్తువులను అమ్ముకోవటానికి స్వస్థి పలకాల్సి ఉంటుందని ట్రంప్‌ బెదిరించాడు. ప్రస్తుతం డాలర్‌దే ఆధిపత్యమైనా అన్ని దేశాలూ తమ విదేశీమారక ద్రవ్యంలో ఒక్క డాలరు మీదే ఆధారపడటం లేదు. ఇతర కరెన్సీలను కూడా నిల్వచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఎటుబోయి ఎటువస్తుందో అన్నట్లుగా బంగారం నిల్వలను కూడా పెంచుకుంటున్నాయి.ఇరాన్‌, రష్యా దేశాలపై ఆంక్షలు విధించి తన స్వంత చట్టాలను రుద్దుతోంది. దానిలో భాగంగా అంతర్జాతీయ అంతర బ్యాంకుల ద్రవ్య లావాదేవీల టెలికమ్యూనికేషన్‌ సమాజ (స్విఫ్ట్‌) వ్యవస్థ నుంచి వాటిని ఏకపక్షంగా తొలగించింది. రేపు తనకు నచ్చని లేదా లొంగని ఏ దేశం మీదనైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవచ్చుగనుక గత కొద్ది సంవత్సరాలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కరెన్సీల గురించి ఆలోచిస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 23శాతం కలిగి ఉన్నాయి. ఇవి నూతన కరెన్సీని సృష్టించటం లేదా డాలరును పక్కన పెట్టే మరొక కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని తమకు హామీ ఇవ్వాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశాడు. మహావృక్షం వంటి డాలరుకు బదులు మరొక పిలక కోసం ప్రయత్నించినా ఫలితం ఉండదన్నాడు. సార్వభౌత్వం కలిగిన ఏ దేశమూ ఇలాంటి హామీ ఇవ్వదు. అమెరికా నాయకత్వంలోని జి7 కూటమిని ఎదుర్కోవాలంటే బ్రెజిల్‌,రష్యా,భారత్‌,చైనా చేతులు కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గోల్డ్‌మన్‌ శాచస్‌ ప్రధాన ఆర్థికవేత్త జిమ్‌ ఓ నెయిల్‌ 2001లో ప్రతిపాదించాడు. తరువాత అది నిజంగానే 2011లో ఉనికిలోకి వచ్చింది. డాలరును తాము ఏకపక్షంగా తిరస్కరించటం లేదని, డాలరు లావాదేవీలపై పరిమితులు విధిస్తున్నందున ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి వస్తోందని ఆంక్షలకు గురైన రష్యా అధినేత పుతిన్‌ ఇటీవల జరిగిన కజాన్‌ బ్రిక్స్‌ సమావేశాల్లో చెప్పాడు. ఇప్పటికే ఈ కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎన్‌డిబి)ని మరింతగా విస్తరించాలని కూడా నిర్ణయించారు.

ప్రస్తుతం అమెరికా ఖండాల్లో వాణిజ్యంలో 96శాతం, ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో 74, ఇతర చోట్ల 74శాతం డాలరు వినియోగంలో ఉంది. ఐరోపాలో మాత్రం 66శాతం యూరో ఆక్రమించింది. ప్రపంచ దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో 60శాతం డాలర్ల రూపంలో, మిగిలింది ఇతర కరెన్సీలు, బంగారం రూపంలో ఉంటుంది. ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 1960దశకంలో ప్రపంచ జిడిపిలో అమెరికా వాటా 40శాతం కాగా 2023లో 26శాతానికి పడిపోయింది.చైనాను చూస్తే 2000 సంవత్సరంలో 3.6శాతంగా ఉన్నది 16.9శాతానికి పెరిగింది. మన జిడిపి ఇదే కాలంలో 1.4 నుంచి 3.4శాతానికి మాత్రమే పెరిగింది. దేశాల రిజర్వుబ్యాంకులు తమ వద్ద నిల్వ ఉంచుకొనే విదేశీ కరెన్సీలలో డాలరు వాటా 2002లో 70శాతం ఉండగా 2024 మార్చి ఆఖరులో 59శాతం ఉంది. ఇదే సమయంలో యూరో, ఎన్‌, పౌండ్‌ తప్ప ఇతర కరెన్సీల వాటా 1.8 నుంచి 10.9శాతానికి పెరిగింది. అనేక దేశాలు డాలరును క్రమంగా వదిలించుకుంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి అస్థిరతకు గురికావాల్సి వస్తుందో అన్న భయంతో ఇటీవలి కాలంలో బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచుతున్నాయి.దేశాల రిజర్వుబాంకులు 2010లో 79.15 టన్నుల బంగారం కొనుగోలు చేయగా 2015లో 579.6 టన్నులు, 2023లో 1,037.1టన్ను కొనుగోలు చేశాయి. మన విషయానికి వస్తే ఆర్‌బిఐ ప్రతినెలా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నది.జనవరి నుంచి 43 టన్నులు కొనుగోలు చేయగా మొత్తం నిల్వ 846 టన్నులకు పెరిగింది. చైనా రిజర్వుబాంకు వద్ద అక్టోబరు ఆఖరులో 2,264 టన్నుల బంగారం ఉంది. గతేడాది అన్ని దేశాల కేంద్ర బాంకులు కొనుగోలు చేసిన 1,037 టన్నుల్లో 30శాతం చైనా పీపుల్స్‌ బాంకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది అంతకు మించి కొనుగోలు చేయనున్నట్లు జనవరిమార్చినెలల్లో లావాదేవీలు వెల్లడిరచాయి. ఎందుకు ఈ విధంగా కొనుగోలు చేస్తున్నదంటే డాలరుకు ప్రత్యామ్నాయంగా కరెన్సీని ముందుకు తెచ్చేందుకే అని పరిశీలకులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయా దేశాల్లో విదేశీమారక నిల్వల్లో పోర్చుగల్‌లో బంగారం వాటా 72శాతం, అమెరికా 70,జర్మనీ 69, ఫ్రాన్సు 67, ఇటలీ 66, నెదర్లాండ్స్‌ 58, టర్కీ 30, రష్యా 26శాతం భారత్‌ 9, చైనా నాలుగుశాతం మాత్రమే కలిగి ఉన్నాయి. శాతం రీత్యా చూస్తే మనం ఎగువన ఉన్నప్పటికీ విలువలో చూస్తే చైనాతో ఎంత తేడా ఉందో పైన పేర్కొన్న అంకెలు వెల్లడిస్తాయి.

మొత్తంగా బ్రిక్స్‌ దేశాల మీద ట్రంప్‌ దాడి ఉన్నప్పటికీ కేంద్రీకరణ అంతా చైనా మీదనే అన్నది స్పష్టం.అక్కడి మార్కెట్‌లో తన వస్తువుల విక్రయాలకే ఈ వత్తిడి. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ దాడి తీవ్రత పెరగవచ్చని ఊహించిన చైనా ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు గత ఆరు సంవత్సరాలుగా ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నది. దాని అమ్ముల పొదిలో కూడా అమెరికాను దెబ్బతీసే కొన్నిఅస్త్రాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఉదాహరణకు చైనా వద్ద అమెరికా తీసుకున్న రుణం 734 బిలియన్‌ డాలర్లు ఉంది.2017 నుంచి క్రమంగా ఈ మొత్తాలను తగ్గిస్తున్నది. దాన్ని ఇతర దేశాలకు చైనా విక్రయిస్తే ప్రపంచ మార్కెట్ల మీద ప్రతికూల ప్రభావం, అమెరికా బాండ్ల మీద వచ్చే రాబడి తగ్గి ఆకర్షణ కోల్పోతుంది. తన దగ్గర ఉన్న 3.38లక్షల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వదిలించుకుంటే చైనాకూ సమస్యలు వస్తాయి.అమెరికాను దెబ్బతీయాలంటే తన కరెన్సీ యువాన్‌ విలువ తగ్గింపు ఒక ఆయుధం. దానితో లాభంనష్టం రెండూ ఉన్నాయి. సెమీకండక్టర్లు, విద్యుత్‌ బాటరీలకు ఉపయోగించే అరుదైన ఖనిజాల ఎగుమతులు నిలిపివేయవచ్చు. తమ మార్కెట్లో ఆపిల్‌, టెస్లా వంటి అమెరికా కార్పొరేట్‌ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించి దెబ్బతీయవచ్చు.అయితే వాటిని ప్రయోగిస్తుందా లేదా అన్నది చెప్పలేము.

మోడినోమిక్స్‌ జిడిపి ఢమాల్‌ : జాడలేని ఆత్మనిర్భరత, రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తున్నారా !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

     వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాస కాలంలో మన జిడిపి వృద్ధి రేటు అంతకు ముందున్న 7.5శాతం నుంచి 5.4శాతానికి దిగజారింది.దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు లోక్‌సభ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోడీ చూపిన రంగుల కలను ఇది భగ్నం చేసింది. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు విఫలమైన తరువాత 20లక్షల కోట్ల రూపాయలతో 2020లో ఆత్మనిర్భర అభియాన్‌ పేరుతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన తరువాత పరిస్థితి ఇది. ఈ ఉద్దీపన కూడా విఫలమైనట్లు వేరే చెప్పనవసరం లేదు. జాతీయ గణాంక సంస్థ(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన ఈ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో జిడిపిలో రుణ భారం 49.9శాతం కాగా 2023 నాటికి అది 83.1శాతానికి పెరిగింది. తాము చేస్తున్న అప్పు దేశ ఆభివృద్ధికి వినియోగిస్తున్నామని చెబుతున్న బిజెపి ఆచరణలో అప్పు తప్ప అభివృద్ధిని చూపటం లేదు. పోనీ దేశ జనం మీద పన్నుల భారం ఏమైనా తగ్గిందా అంటే లేదు. గోడదెబ్బ`చెంపదెబ్బ అన్నట్లుగా రోడ్ల అభివృద్ధి పేరుతో చమురు మీద పెద్ద మొత్తంలో సెస్‌ వసూలు, ఆ రోడ్ల మీద ప్రయాణించిన వారి నుంచి ముక్కు పిండి టోల్‌ టాక్సు వసూలు చేస్తున్నారు. ఇంత అప్పు చేస్తున్నా మూల ధన పెట్టుబడుల మొత్తం పెంచటం లేదు, జిడిపి వృద్ధి రేటు పడిపోవటానికి ఇది ఒక ప్రధాన కారణమని తేలింది గనుకనే అప్పుల గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. మూల ధన పెట్టుబడులు ఎంత ఎక్కువ ఉంటే అంతగా శాశ్వత, రాబడిని తెచ్చే ఆస్తులు సమకూరుతాయి.  కాగ్‌ నివేదిక ప్రకారం గతేడాది రెండవ త్రైమాస కాలంలో  ప్రభుత్వ మూలధన  పెట్టుబడి 49శాతం( రు.4.9లక్షల కోట్లు) ఉండగా ఈ ఏడాది రు.4.14లక్షల కోట్లు 37.3శాతానికి పడిపోయిందని కేర్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్థికవేత్త రజనీ సిన్హా చెప్పారు. ప్రైవేటు రంగ మూలధన పెట్టుబడులు లేనపుడు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవటం ప్రతిదేశంలోనూ జరుగుతున్నదే.ప్రభుత్వం ద్రవ్యలోటు తగ్గించుకొనేందుకు చూస్తున్నందున ప్రయివేటు రంగం ముందుకు రావాలని క్రిసిల్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్థికవేత్త డికె జోషి చెప్పారు. పెట్టుబడులు తగ్గిపోవటమే కాదు, గృహస్తులు చేసే ఖర్చు కూడా 7.4 నుంచి ఆరుశాతానికి పతనమైంది. జనాన్ని మభ్యపెట్టేందుకు గతేడాది పెట్టుబడుల మొత్తం రు.9.48లక్షల కోట్లను ఈ ఏడాది రు.11.11లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే తొలి ఐదు మాసాల్లో ఈ మొత్తంలో ఖర్చు చేసింది రు.3.09లక్షల కోట్లు 27శాతం మాత్రమే. గతేడాది ఇదే కాలానికి 37.4శాతం ఖర్చు చేసింది. అందువలన రానున్న ఏడు నెలల్లో 73శాతం ఖర్చు చేసే అవకాశం లేదని, కోత పెడతారని చెబుతున్నారు.

        ఉత్పాదక రంగ వృద్ధి సగటు జిడిపి కంటే తక్కువగా కేవలం 2.2శాతమే ఉంది. గతేదాది ఇదే కాలంలో 14.3శాతం ఉంది. విద్యుత్‌ 10.4 నుంచి 3.3శాతానికి తగ్గింది. ఉత్పాదక రంగం పడిపోయిన తరువాత విద్యుత్‌ వినియోగం కూడా పడిపోతుంది.వ్యవసాయం రెండు నుంచి 3.5శాతానికి పెరిగింది. గనుల రంగం వార్షిక ప్రాతిపదికన గతంలో 11.1శాతం, తొలి త్రైమాసంలో 7.2శాతం ఉండగా రెండవ త్రైమాసంలో 0.1శాతానికి దిగజారింది. నిర్మాణ రంగం 10.5 నుంచి 7.7కు,ద్రవ్య, రియలెస్టేట్‌, ఇతర సేవల రంగం 7.1 నుంచి 6.7శాతానికి పడిపోయింది. రవాణా,హోటల్స్‌ వంటి సేవారంగం 5.7 నుంచి 6 కు పెరిగింది.   మేడిన్‌ ఇండియా,మేకిన్‌ ఇండియా, అత్మనిర్భరత వంటి మాటలు, పథకాలన్నీ ఏమైనట్లు ? ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ప్రైవేటు రంగం, ప్రైవేటు వినియోగం, పారిశ్రామిక ఉత్పత్తి నిస్తేజంగా ఉంది. వ్యవసాయం,ప్రభుత్వ రంగ వ్యయమే మద్దతుగా నిలిచింది.అయితే ఏడాది మొత్తం వృద్ధి రేటు 7.5శాతం ఉంటుందని చెబుతున్నారు.

          దేశంలో మూల ధన పెట్టుబడుల పథకాలు దెబ్బతినటానికి నెపం ఇతర దేశాల మీద నెడుతున్నారు.చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాలు తమ దేశాలలో విస్తరణ మీద కేంద్రీకరించటం, ప్రపంచ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణాకు ఆటంకం ఏర్పడటం వంటి కారణాల వలన మనదేశానికి అవసరమైన భారీ యంత్రాల రాక ఆలస్యం అవుతున్నదని సాకుగా చూపుతున్నారు.వేగంగా అమ్ముడు పోయే వినియోగదారుల వస్తువుల తయారీకి అవసరమైన యంత్రాల దిగుమతిలో రిలయన్స్‌ వంటి కంపెనీలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కాంపాకోలా డ్రిరకుల తయారీకి అవసరమైన యంత్రాల కోసం ఏడాది అంతకు ముందు నుంచి ఎదురుచూస్తున్నదని ఈ ఏడాది మే నెలలో వార్తలు వచ్చాయి. చైనా ఉత్పాదక రంగం దెబ్బతిన్నదని చెప్పేవారే మన దేశానికి యంత్రాలు సకాలంలో రాకపోవటానికి అక్కడి ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణకు తీసుకుంటున్న చర్యలే కారణమని అదే నోటితో చెబుతారు. వెయ్యి కోట్లతో ఈ ఏడాది యంత్రాలు అమర్చాలని తాము తలపెట్టగా ఆలశ్యం కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు హావెల్స్‌ ఇండియా ఇడి రాజీవ్‌ గోయల్‌ చెప్పారు. చైనా తన పరిశ్రమలను నవీకరించుకొనేందుకు 140 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు, సాంకేతిక రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. స్థానికంగా గిరాకీని పెంచేందుకు పాత వస్తువులను ధ్వంసం చేసేందుకు, పాత కార్లకు బదులు విద్యుత్‌ వాహనాలను వినియోగించేందుకు ప్రోత్సాహకాలనిస్తున్నది, అక్కడ ఫ్యాక్టరీ కార్యకలాపాలు విస్తరించాయి. పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా ఇజ్రాయెల్‌ గాజాలో సాగిస్తున్న మారణకాండను అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో పాటు మనదేశం కూడా సమర్థిస్తున్న కారణంగా ఎర్ర సముద్రంలో నౌకల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. దాని వలన మనదేశం దిగుమతి చేసుకొనే వస్తువుల రవాణా ఖర్చులు పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయి.

       మన దేశంలో ఉత్పాదక రంగం పెరగకపోవటానికి ఒక ప్రధాన కారణం మన జనాల వినియోగం పెరగకపోవటమే అన్నది స్పష్టం. ఆహారం మీద చేసే ఖర్చు తక్కువగా ఉందంటే  అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు. ఉదాహరణకు అమెరికాలో కుటుంబ ఆదాయంలో ఆహారానికి చేసే ఖర్చు కేవలం 12.9శాతం, ఫ్రాన్సులో 13.3 శాతమే, అదే మన దేశంలో నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీస్‌( ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సర్వే ప్రకారం   2011`12లో 53శాతం ఉండగా 2022`23లో 46.5శాతానికి తగ్గింది. జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనాను మనదేశం వెనక్కు నెట్టింది.చైనాలో కూడా ఆహారం మీద చేసే ఖర్చు ఎక్కువగానే ఉన్నప్పటికీ తగ్గుతున్నతీరు అక్కడి సమాజం అభివృద్ది వైపు వెళుతున్నట్లుగా చెబుతున్నారు. అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డాటా పోర్టల్‌ సమాచారం ప్రకారం 2022లో చైనా కుటుంబ మొత్తం వినియోగం 4,805 డాలర్లు కాగా దానిలో ఆహారం కోసం 20.1శాతం వినియోగిస్తున్నారు. భారత్‌లో 1,553 డాలర్లకు గాను 32శాతం ఖర్చు చేస్తున్నారు.( గమనిక ఈ సమాచారంలో పరిగణనలోకి తీసుకొనే వాటిని బట్టి అంకెల్లో తేడాలు ఉన్నందున ధోరణిని అర్ధం చేసుకొనేందుకు మాత్రమే వీటిని పరిగణనలోకి తీసుకోవటం మంచిది) రావూస్‌ ఐఏఎస్‌ అకాడమీ విశ్లేషణలో అందచేసిన 2022 సమాచారం ప్రకారం భారత్‌, చైనాల్లో వినియోగానికి చేసే ఖర్చు దిగువ విధంగా ఉంది. ఆహారం అంటే పొగాకుతో, దుస్తులు అంటే పాదరక్షలతో కలిపి అని పరికరాలు అంటే గృహవినియోగ వస్తువులు అని గమనించాలి.

దేశం IIఆహారంIIదుస్తులుIIరవాణాIIఇల్లుII విద్యII ఆరోగ్యంIIపరికరాలుII ఇతరం

భారత్‌II 32.5 II 6.1  II 16.3 II13.2II4.5 II  5.2  II   3  IIII 17

చైనా II  30.5 II 5.6  II 13.0 II24.0II10.1II 8.6  II   5.8 IIII 2.5

       నేషనల్‌  శాంపుల్‌ సర్వేను పరిగణనలోకి తీసుకున్నపుడు మనదేశంలో ఆహారం మీద చేసే ఖర్చు తగ్గుదల సంతృప్తి చెందాల్సినదా లేక ఆందోళన పడాల్సిన అంశమా అన్న మీమాంస ఉంది. పట్టణ ప్రాంతాల్లో 42.7 నుంచి 39.2శాతానికి తగ్గింది. మొత్తం మీద తృణ ధాన్యాలు, కూరగాయల మీద చేసే ఖర్చు తక్కువగా ఉండటం వలన ఈ తగ్గుదలకు దోహదం చేసిందని దీన్ని సంతోషించాలా లేక దేన్నయినా కోల్పోతున్నామా అన్నది చర్చ. ఆహారం కోసం నెలవారీ రాబడిలో సగం ఖర్చు చేయాల్సి వస్తోందంటే దాన్ని మరో రకంగా చెప్పుకోవాలంటే కుటుంబ ఆదాయం తగినంత లేనట్లు, పొదుపు చేసుకొనేందుకు ఏమీ మిగలటం లేదనే. రాబడి పెరిగితే ఇతర వాటి మీద  ఖర్చు చేస్తారు. సర్వే చేసిన కాలంలో నెలవారీ ఖర్చు గ్రామీణ ప్రాంతాలలో 164, పట్టణాల్లో 146శాతం పెరిగినట్లు తేలింది. ఆహారం మీద చేసే ఖర్చులో తగ్గుదల కనిపించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత లేదా సబ్సిడీ ఆహారధాన్యాల కోణం ఉందన్నది ఒక అభిప్రాయం. దీనిలో మరో కోణం కూడా ఉంది. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు బిజెపి గొప్పలు చెప్పుకుంటున్నది. దీని కోసం ఏటా రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు సబ్సిడీ మొత్తాన్ని భరిస్తున్నట్లు చెబుతున్నది. ఒకటి జనంలో కొనుగోలు శక్తి లేనపుడు దాన్ని పెంచటానికి సబ్సిడీలు ఒక మార్గం. ఆహార సబ్సిడీ లేకపోతే జనాలు ఆ మేరకు భారం భరించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదే సబ్సిడీ ఇస్తే ఆ మొత్తాన్ని ఇతర వస్తువులు లేదా సేవల కోసం వినియోగిస్తే పరోక్షంగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు మేలు జరుగుతుంది. కరోనా సమయంలో జనాలు ఉచితంగా నగదు అందచేయాలని కోటక్‌ మహింద్ర బ్యాంక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపక్‌ గుప్తా సూచించారు.ఇది జనాల మీద ప్రేమతో కాదు. అలా చేస్తే ఏడాది కాలంలో ఆర్థికరంగం పుంచుకుంటుందని  గుప్తా అసలు విషయం కూడా చెప్పారు. జనాల్లో ఉన్న పేదరికం, దారిద్య్రం తీరదు గానీ అంతిమంగా అది పారిశ్రామికవేత్తలను ఆదుకొనేందుకు దారితీస్తుంది. కరోనా సమయంలో ఉచితంగా ఇచ్చారంటే నరేంద్రమోడీ జనాలకు మేలు చేస్తున్నారని అనుకుందాం. అంతకు ముందు ఐదేండ్లలో ఎందుకు ఇవ్వలేదు, కరోనా తరువాత సాధారణ పరిస్థితులు నెలకాన్నాయని చెప్పిన తరువాత మరికొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా ఇస్తామని ప్రకటించటం వెనుక దేశ ఆర్థిక వ్యవస్థ, జనాల నిజరాబడి దిగజారుడే కారణం. ఆ విషయాలను చెప్పకుండా మేలు చేస్తున్నట్లు ఫోజుపెడుతున్నారు. మొత్తంగా చూసినపుడు మన వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగటం లేదు.పారిశ్రామిక వస్తువులకు గిరాకీ లేకపోవటానికి ఇది ప్రధాన కారణం.

    ఇప్పటికీ మనది ఉపాధి రీత్యా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్తే. దాని ద్వారా జిడిపికి గత రెండు దశాబ్దాల్లో 17`20శాతం మధ్యనే ఊగిసలాడుతోంది, తగ్గుదల ధోరణిలో ఉంది. వ్యవసాయంపై ఆధారపడే వారు 1993`94లో 64.6శాతం ఉండగా ప్రస్తుతం 46 శాతానికి అటూ ఇటూగా ఉంది. ఇదే కాలంలో పరిశ్రమలు గొప్పగా అభివృద్ధి చెందాయని చెబుతున్నప్పటికీ ఆ రంగంలో ఉపాధి 1993`94 నుంచి 2021`22 మధ్య 10.4 నుంచి మధ్యలో 12.6కు పెరిగినా 11.6శాతంగా ఉంది. అంటే ఉపాధి రహిత పారిశ్రామిక వృద్ధి అన్నది స్పష్టం. వ్యవసాయంపై ఆధారపడే ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో 2019`2024 మధ్య కాలంలో వేతనాలు 5.2శాతం పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణనాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవంలో 0.4శాతం తగ్గింది, అంటే ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదు. ఈ కారణంగానే వినియోగంపై ఖర్చు పెరగలేదు, పారిశ్రామిక వస్తువులకు గిరాకీ ఉండటం లేదు.మోడినోమిక్స్‌ పేరుతో తనదైన ఆర్థిక విధానాలను అమలు జరుపుతున్నట్లు చెబుతున్నారు, పదేండ్ల తరువాత అన్ని ప్రధాన రంగాలు దిగజారటం తప్ప మెరుగుపడటం లేదు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి.