తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం ప్రతిపక్షాలను, జనాన్ని వాటి చుట్టూ తిప్పటంలో కొంత మంది సిద్దహస్తులు. వారిలో నరేంద్రమోడీకి సాటి రాగల వారెవరూ కనిపించటం లేదు. గతాన్ని కాసేపు పక్కన పెడితే నూతన పార్లమెంటు భవన ప్రారంభాన్ని ప్రధమ పౌరురాలు, రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతి పదవిని అగౌరవపరచి, ఆ పదివిలో ఉన్న ద్రౌపది ముర్మును విస్మరించి తానే ప్రారంభించి చర్చకు తెరలేపారు. అదే విధంగా రాజ్యాంగం. అధికారంతో సంబంధంలేని ఒక రాజ దండాన్ని ముందుకు తెచ్చి మరో పనిలేని చర్చను ముందుకు తెచ్చారు. పురాతన సంప్రదాయాలకు ప్రాణ ప్రతిష్ట చేయాలనే నాన్నగారి తాతగారి భావాలకు దాసులైన వారికి వెనుక చూపు తప్ప వర్తమానం, ముందు చూపు ఉండదు. అలాంటి వారు కుహనా గతాన్ని అమలు జరపాలని చూస్తారు. లేని చరిత్రను, ఉదంతాలను సృష్టించటంలో, చిన్న వాటిని బూతద్దంలో చూపటంలోనూ పేరు మోసిన మన వాట్సాప్‌ విశ్వవిద్యాలయం స్వర్గంలో ఉన్న గోబెల్స్‌కు సదరు అంశాలపై తమకు మార్గదర్శకుడిగా ఉన్నందుకు గౌరవడాక్టరేట్‌ ప్రదానం చేసిందట.


ఫలానా చోట ఫలానా ఉదంతం జరిగింది. మీడియాలో మొత్తం హిందూ వ్యతిరేకులే ఉన్నందున ఏ టీవీ, పత్రికలోనూ రాలేదు, రాదు. కనుక మీరు దీనిని అందరికీ పంపించండి అన్న తప్పుడు వర్తమానం ఒక్కటైనా వాట్సాప్‌ను వాడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అందే ఉంటుంది. పెద్దలు చెప్పిన ఒక హితవును కాషాయ దళాలు పక్కాగా పాటిస్తున్నాయి . అదేమంటే ఒక అబద్దం చెబితే గోడ కట్టినట్లు ఉండాలి తప్ప తడికలా ఉండకూడదు. ప్రాణ, విత్త, మాన భంగములందు అబద్దం చెప్పవచ్చనే మినహాయింపు ఇచ్చారు మన పెద్దలు. దీనీలో ఎన్నికలను కూడా చేర్చి పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వీటిని చూసి, విని గోబెల్స్‌ కూడా సిగ్గుపడుతున్నట్లు సమాచారం. తాజాగా దేశమంతటా పెద్ద చర్చ జరిగిన, పార్లమెంటులో ప్రతిష్టించిన రాజదండం గురించి కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా తడిక కథ చెప్పారు. దేవుడు ప్రసాదం తినడని పూజారికి మాత్రమే తెలుసు. అదే మాదిరి నరేంద్రమోడీకి రాజకీయ ఇబ్బందులు వస్తున్నట్లు అమిత్‌షాకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఆడిన మాట తప్పని తెగకు చెందినవారం అని చెప్పుకుంటారు గనుక చెప్పింది వాస్తవం కాదు అని తేలిన తరువాత కూడా తన ప్రకటనను వెనక్కు తీసుకోలేదు, సవరించుకోలేదు. చరిత్రలో అత్యంత దుర్మార్గమైన రెండవ ప్రపంచ యుద్ధం తప్పుడు ప్రచారంతోనే నాజీలు ప్రారంభించారు. అదేమిటంటే జర్మనీ రేడియో ట్రాన్స్‌మిటర్‌ మీద పోలాండ్‌ చేసిన దాడికి ప్రతీకారం పేరుతో హిట్లర్‌ మూకలు పోలాండ్‌ మీద టాంకులతో దాడికి దిగాయి. ఒక ట్రాన్స్‌మిటర్‌ను ధ్వంసం చేస్తేనే మరొక దేశం మీద దాడికి దిగాలా ? ఏదో ఒక సాకు కావాలి. తరువాత నిజానిజాలు వెల్లడైనా అప్పటికే జరగాల్సిన మారణ హౌమం జరిగింది. మహా జర్మనీ నుంచి నినాదం నుంచి కాపీ కొట్టిందే అఖండభారత్‌,అలాంటి అనేక పోలికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గతమెంతో ఘనం అన్న జాతీయవాదం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. ఏ దేశ చరిత్రలోనైనా ఘనమూ, హీనమూ రెండూ ఉంటాయి. ఘనాన్ని దాచుకొని రెండవ దాన్ని చరిత్ర చెత్తబుట్టలోకి నెడుతుంది. దాన్నుంచి కూడా లబ్ది పొందాలని చూసే వారు చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తారు.


నూతన పార్లమెంటు భవనంలో గత ఘనం, సంస్కృతి పరిరక్షణలో భాగంగా రాజ దండానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామంటూ మన ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ప్రతిష్టించారు. అంతకు ముందు హౌమంత్రి అమిత్‌ షా విలేకర్లతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినపుడు బ్రిటీష్‌ చివరి వైస్రాయి మౌంట్‌ బాటన్‌ అధికార మార్పిడి చిహ్నంగా రాజదండాన్ని నెహ్రూకు అందచేస్తే దాన్ని పక్కన పెట్టేసి మన సంస్కృతిని అవమానపరిచారు, ఆ చారిత్రాత్మకమైన రాజదండాన్ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు భవనంలో ప్రతిష్టించి గౌరవాన్ని నిలబెడతారు అని సెలవిచ్చారు. దేశ ప్రజలందరూ దీన్ని చూసి ఈ చారిత్రాత్మక ఉదంతం గురించి తెలుసుకోవాలని, అందరికి గర్వకారణము అని కూడా చెప్పారు. ఆ రాజదండం మన దేశంలోని అనేక రాజవంశాలలో ఏదో ఒకరు వాడినది అనుకుందామా అంటే అదేమీ కాదు. అది శైవ మతాన్ని అవలంభించిన వారు రూపొందించిన దండం, వైష్టవులు, బౌద్ద, జైనాలను ఆదరించిన రాజులు వాడిన దండాలు వేరుగా ఉంటాయి. వర్తమాన ప్రభుత్వం అంగీకరించాలంటే ఏ రాజదండాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ? అసలు అది రాజదండం కాదు, చరిత్రలో వర్ణించిన చోళ రాజరిక దండ నమూనా మాత్రమే. స్వాతంత్య్ర తరుణంలో అధికార మార్పిడి గురుతుగా ఏదైనా క్రతువు నిర్వహించుతారా అని మౌంట్‌ బాటన్‌ నాడు నెహ్రూను అడిగారట. దాని గురించి రాజాజీగా సుపరిచితులైన సి రాజగోపాలచారిని నెహ్రూ సంప్రదించగా చోళ రాజుల పద్దతిని పాటిద్దామని చెప్పారట. ఈ పూర్వరంగంలో తమిళనాడులోని తిరువదుత్తురై అనే ఒక మఠానికి చెందిన వారు 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూకు నమూనా రాజదండాన్ని పూజా పునస్కార తంతుతో బహుకరించారు తప్ప దానికి మౌంట్‌బాటన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. నమూనా రాజదండాన్ని ఉమ్మిడి బంగారు చెట్టి రూపొందించగా ఉమ్మిడి ఎతిరాజులు(96),ఉమ్మిడి సుధాకర్‌(88) తయారు చేశారు. వారు చెన్నైలో నివసిస్తున్నారు. క్రీస్తు పూర్వం 300సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1279 వరకు చోళ రాజుల పాలన సాగింది. అంటే తరువాత వారి రాజదండాన్ని ఎవరికిచ్చినట్లు ? తరువాత వచ్చిన రాజులు దాన్ని పక్కన పెట్టి కొత్త రాజదండాలను వాడారా అసలు సిసలు దండం ఎక్కడ ఉన్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.


అసలు పురావస్తుశాలలోని రాజదండం ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఆసక్తికరం. దీనికోసం చెప్పిన ” కత ” విన్న తరువాత సందేహాలు తలెత్తటం సహజం. దీన్ని చారిత్రాత్మక రాజదండం అని వర్ణించటంతోనే పురాతన వస్తువు పేరుతో నకిలీలను అంటగట్టే మోసగాళ్లను గుర్తుకు తెచ్చారు. చోళుల నాటి ఈ రాజదండాన్ని బ్రిటీష్‌ వారికి అందచేయగా వారి చివరి ప్రతినిధి మౌంట్‌బాటన్‌ అధికార మార్పిడి సూచికగా దాన్ని దాని నెహ్రూకు అందచేశారన్నది కూడా మోసగాళ్ల కథలో భాగమే. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌గా మారిన పూర్వపు అలహాబాద్‌ నగరంలో నెహ్రూ నివాసం ఆనంద భవన్‌ను ఒక పురావస్తుశాలగా మార్చారు. దానిలో తనకు బహుమతిగా ఇచ్చిన నమూనా రాజదండాన్ని కూడా ఉంచారు. దాన్ని బంగారు చేతి కర్రగా నమోదు చేశారు. ఇది చోళ రాజవంశం నాటిదని చివరికి అమిత్‌ షా కూడా నమ్మారు.లేదా నమ్మినట్లు నటించి చెప్పారు. పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం దాన్ని తయారు చేసిన ఉమ్మిడి బంగారు చెట్టి కుటుంబీకులు కూడా దాని గురించి మరచిపోయారు.నిజానికి దానికి అంతటి ప్రాధాన్య ఉంటే దాన్ని తయారు చేసిన ఆ కుటుంబీకులు ఇప్పటికీ సజీవులుగా ఉన్నప్పటికీ గడచిన 75 సంవత్సరాలుగా తమ వారికి చెప్పలేదంటే తాము తయారు చేసిన అనేక వస్తువుల్లో ఒకటిగా చూశారు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఆ కుటుంబానికి చెందిన ఉమ్మిడి అమరేంద్రన్‌ చెప్పినదాని ప్రకారం 2018లో ఒక పత్రికలో దాని గురించి చదివారట. మరుసటి ఏడాది పురావస్తు శాలలో చూశారట. దాని గురించి ఒక పత్రికా గోష్టి పెడదామనుకుంటే కరోనా (2020లో కరోనా బయటపడింది) కారణంగా కుదరలేదట. దాంతో ఒక నిమిషము నిడివి గల వీడియో తీస్తే అది నరేంద్రమోడీ కంటబడటంతో వెలుగులోకి వచ్చిందట. దాన్ని ఎప్పుడు తీశారు, నరేంద్రమోడీ ఎప్పుడు చూశారు, ప్రధానికి వీడియోలు చూసే తీరిక ఉందా అని సందేహం కలగవచ్చు.

ఉమ్మిడి కుటుంబం దాన్ని వంద సావరిన్‌(సవర్లు)ల బంగారంతో తయారు చేసి ప్రభుత్వం నుంచి రు.15వేలు తీసుకున్నదట. దీని గురించి ప్రధాని మోడీ కార్యాలయం పంపిన బృందంలోని జర్నలిస్టు ఎస్‌ గురుమూర్తి ఉమ్మిడి కుటుంబాన్ని సంప్రదించారు. వారి కోరిక మేరకు దాని ప్రతిరూపాన్ని రూపొందించారు. వెండితో చేసిన దానికి బంగారు పూత పూశారు. అసలైన బంగారు వస్తువును శాశ్వతంగా పార్లమెంటు భవనంలో, దాని ప్రతి రూపాన్ని జనం కోసం ప్రదర్శిస్తారని చెప్పారు. గవర్నర్‌ జనరల్‌గా ఉన్న రాజగోపాల చారి అనేక పుస్తకాలను చదివి చివరికి చోళుల రాజదండం గురించి తెలుసుకొని కొత్త రాజులకు అధికారిక మార్పిడి సూచికగా రాజదండాలను అందచేసే వారని తెలుసుకొన్నారు. తరువాత తికెవదుత్తురై మఠానికి చెందిన స్వాములను సంప్రదించి బంగారు రాజదండాన్ని తయారు చేయించి వారి ద్వారానే నెహ్రూకు అంద చేయించారు. దీనికి నెహ్రూ అంగీకరించారని చెబుతున్నారు. అదే గనుక వాస్తవమైతే అదే నెహ్రూ దాన్ని ఎందుకు పక్కన పడవేసినట్లు ? తన తరువాత అధికారానికి వచ్చేవారికి దాన్ని అందచేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ? ఈ విషయాలన్నీ తరువాత అధికారానికి వచ్చిన లాల్‌బహదూర్‌ శాస్త్రికి ఎవరూ ఎందుకు చెప్పలేదు ? నెహ్రూకు అందచేసిన మఠాధిపతులైనా తరువాత ప్రధానులుగా చేసిన వారికి కూడా ఎందుకు ఈ ఘనమైన సంప్రదాయం, సంస్కృతి గురించి ఎందుకు గుర్తు చేయ లేదు ? ఇలా ఆలోచించటం కూడా జాతి వ్యతిరేకం అంటారేమో ? రాజదండ ప్రహసనం వచ్చే ఎన్నికల్లో తమిళుల ఎన్నికల కోసమే అన్న విమర్శ ఉంది.


ద్రావిడ నాడు అనే పత్రికలో 1947 ఆగస్టు 24వ తేదీ సంచికలో తరువాత డిఎంకె స్థాపకుడిగా, సిఎంగా పని చేసిన సిఎన్‌ అన్నాదురై రాజదండం బహుకరించిన వారి ఉద్దేశం ఏమిటో గ్రహించాలని నెహ్రూను హెచ్చరిస్తూ రాశారు. దానిలో ఎక్కడా అది చోళుల నాటి రాజదండం అని గానీ పరంపరగా అధికార బదిలీ గురించిగానీ లేదు. అన్ని రకాలుగాను జనాన్ని దోచుకుంటున్న మఠాలు, స్వాములు కేంద్ర ప్రభుత్వాన్ని మంచి చేసుకొనేందుకు, తమ ఆస్తుల జోలికి రాకుండా, ఎదురులేకుండా చేసుకొనేందుకు గాను దాన్ని బహుకరించినట్లు పేర్కొన్నారు.దాని గురించి తమిళనాడు ప్రభుత్వ పత్రాల్లో ప్రస్తావించారు.అధికారానికి చిహ్నంగా రాజముద్రికలు ఉండేవి.రాజ ఫర్మానాల మీద ఆ ముద్రిక ఉంటేనే దాన్ని రాజాధికారిక పత్రంగా పరిగణించారని తెలుసు. రాజులుగా అధికారం స్వీకరించినపుడు కిరీటం ధరించటం అధికారిక చిహ్నంగా ఉండేది. రాజదండం అనేది ఒక అలంకార ప్రాయం తప్ప అధికారిక గుర్తు కాదు. అధికార మార్పిడి అంటే ఒక పత్రం మీద సంతకం చేసి కరచాలనం చేసుకోవటమే కాదు, స్థాుక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని అమిత్‌ షా గారు చెప్పారు. మన దేశంలో అనేక రాజవంశాలు, సంప్రదాయాలు ఉండేవి. దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? సంప్రదాయాల ప్రకారం అధికారానికి చిహ్నంగా పరిగణించారని చెబుతున్న రాజదండం, రాజముద్రికలు, కిరీటం రాజుగారి కనుసన్నలలోనే ఉంటాయి.


అలాంటి దాన్ని లోక్‌సభ స్పీకర్‌ స్థానం పక్కనే ప్రతిష్టించారు. ఆడా మగా కాని ఈ కొత్త పరంపర ఏమిటి ? స్పీకర్‌ దేశ సర్వాధికారి అని అర్ధమా? ఉప రాష్ట్రపతి ఉండే రాజ్యసభ సంగతేమిటి ? స్థానిక సంప్రదాయాల గురించి వాటికి అసలు సిసలు వారసులుగా చెప్పుకొనే వారి పరంపరకు చెందిన వాజ్‌పాయి, నరేంద్రమోడీ పదవీ స్వీకారం చేసినపుడు వారికి, లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ, బిజెపినేతలకు వాటి గురించి గుర్తులేదా ? ఆధునిక రాజ్యాంగం ప్రకారం అధికారాన్ని అనుభవిస్తూ మనుధర్మశాస్త్ర కాలానికి జనాన్ని తీసుకుపోవాలని చూస్తున్న వారికి సంప్రదాయాలను, ఆధునికతను మేళవించాలనే అందమైన మాటలను చెప్పటం కష్టం కాదు. పోనీ అలా చేస్తే నష్టం ఏమిటి , గతాన్ని ఎందుకు వదులు కోవాలి అని గొర్రెదాటు కబుర్ల చెప్పేవారు మపకు ఎక్కడబడితే అక్కడ దొరుకుతారు, వాటిని సమర్ధించటమూ తెలిసిందే. కనిపించిన ప్రతి రాయికి రప్పకూ మొక్కి ఒక నమస్కారమే కదా పోయేదేముంది అనే వారికి కొదవ లేదు. ఆ తర్కం ప్రకారమే సమర్ధన. రాజదండంతో పాటు కిరీటం, పట్టపురాణి, రాజ గురువు, రాజనర్తకి తదితర సాంప్రదాయాల సంగతేమిటి ? ఇపుడు అధికారిక పురోహితులు, స్వాములు లేరు. ఏ ప్రాతిపదికన రాజరిక చిహ్నమైన రాజదండాన్ని పట్టుకొని నరేంద్రమోడీ ఒక మతానికి చెందిన 20 మఠాల వారిని పార్లమెంటులో నడిపించినట్లు ?

ఇదంతా నూతన పార్లమెంటు భవనం బదులు ఒక రాజు కొత్త కోటను ప్రారంభించినట్లుగా ఉంది. అందుకే కొల్‌కతా నుంచి వెలువడే టెలిగ్రాఫ్‌ దినపత్రిక పతాక శీర్షికలో క్రీస్తు పూర్వం 2023 అని ప్రముఖంగా ప్రచురించింది. రాజరికాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ రాజదండం అన్నది 1300 సంవత్సరాల నుంచి మాత్రమే ఉనికిలోకి వచ్చిందని, దాని అసలు పేరు నంది ధ్వజము అని ఆరియాలజిస్టులు సిహెచ్‌ బాబ్జీరావు, ఇ శివనాగిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాములుగా చెలామణిలో ఉన్న కొందరు రాజ దండాన్ని ధర్మ దండం అని పిలిచేవారని చెబుతున్నారు. ప్రధాని మోడీ, అమిత్‌ షాకు మద్దతుగా సాంప్రదాయాల గురించి స్వామీజీలు, మరి కొందరు రంగంలోకి దిగారు. రాజు కోరుకుంటే ఇలాంటి వారికి కొదవా ? వారి వాదనలసారం ఇలా ఉంది.
పట్టాభిషేకం జరిగినపుడు మంత్రాల ద్వారా ” నా రాజదండంతో పరిపాలన చేసేందుకు పూనుకున్నాను. నా అధికారంతో నేను పాలన-దండన చేస్తాను ” అని ప్రమాణం చేసిన తరువాత రాజ గురువు రాజును రాజదండంతో తాటించి ధర్మ దండంతో పాలించాలని అందచేస్తాడట.( వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పే వేదకాలం నాటి వారు ప్రతి తరంలోనూ ఉంటారు.) రాజదండం అంటే ధర్మ ప్రతీక అని, దానికి వృషభం ప్రతినిధి అని, దానికి ఉండే నాలుగు కాళ్లను సత్య, సౌచ(శుచి), బహుతాద్య,(భూత దయ), నిష్మామకర్మలుగా చెప్పారు. పూర్వీకులు చెప్పిన ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుందంటే అర్ధమిదేనట.

నంది ఒక పాదాన్ని ఎందుకు ముడవకుండా కూర్చుంటుందటా !. ఎందుకంటే సత్యం కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు లేచి వెళ్లటానికట. ధర్మాన్ని కాపాడే శివుడి ముందే కూర్చుంటుంది గనుక అది లేవాల్సిన అవసరం ఉండదట. అలాగే నరేంద్రమోడీ ధర్మ పరీక్షకు కూడా పరిగెత్తనవసరం లేదట. అంటే మోడీ శివుడితో సమానం అని చెప్పటం. సంస్కృత పదాలకు అర్ధాలకోసం కూడా వెతుక్కోవాల్సిన పని లేదట. భారత అంటే సత్యం, సెక్యులర్‌ ఇండియా అంటే మాయ, విశ్వగురువు అంటే దక్షిణామూర్తి (నరేంద్రమోడీ అవతారానికి అర్ధం అదే అని చెప్పలేదుగానీ భావం అదే ). వసుధైక కుటుంబం అంటే స్వచ్చ భారత్‌, స్మార్ట్‌ సిటీస్‌,జాతీయ రహదారులు, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్లు, వందే భారత్‌ తదితరాలు శుచిలో భాగమట. భూత దయ అంటే నమామి గంగ, పునరుత్పాదక శక్తి, ఎల్‌ఇడి లైట్లు, ఉజ్వల పధకం, ఆయుష్మాన్‌ భారత్‌, నేరుగా నగదు బదిలీ, గోవధ నిషేధం, ఆవు పేడతో సేంద్రీయ సాగు, నిష్కామకర్మ అంటే అగ్నివీర్‌, అవినీతి రహిత పాలన, అధికారయంత్రాంగ ప్రక్షాళన, కిసాన్‌ సమ్మాన్‌ యోజన, ముద్ర యోజన తదితరాలట. అమృత కాలం నూతన పార్లమెంటు భవనంతో ప్రారంభమౌతుందట. (అంటే ఇప్పటి వరకు చెప్పిన అచ్చేదిన్‌, ఇతర వాగ్దానాలన్నీ వచ్చే రోజుల్లో అమలు చేస్తారని, గతం గురించి ప్రశ్నించకుండా నోర్మూసుకోవాలని చెబుతున్నారు ధర్మ మూర్తులు) ధర్మ విజయాన్ని పున:ప్రతిష్టించే అవకాశం నరేంద్రమోడీకి వచ్చింది. ధర్మాన్ని కాపాడే ధర్మ దండాన్ని నరేంద్రమోడీ ప్రతిష్ఠిస్తున్నారు గనుక కాంగ్రెస్‌ వణికి పోతోందని కూడా చెప్పారు.

వీటిని చూస్తే మేం కూడా ఇంతగా పొగడలేదని పూర్వపు భట్రాజులు కూడా సిగ్గుపడిపోతారు( ఒక కులాన్ని కించపరచటంగా భావించవద్దని మనవి) రాజు దైవాంశ సంభూతుడని చిత్రించిన వారు, నిరంకుశ రాజరికాలను ప్రోత్సహించిన వారు రాజదండాన్ని ఆ దేవుడే పంపాడు, దేవు ప్రతినిధులం తాము గనుక రాజులకు అందించే తంతు తమదని పూజారులు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ భావనలను, హిందూత్వను ముందుకు తెచ్చిన విడి సావర్కర్‌ కూడా నమ్మారు, అతగాడిని ఆరాధించే శక్తులు గనుకనే సావర్కర్‌ జన్మదినం రోజునే పార్లమెంటులో రాజదండం ప్రతిష్టాపన, భవన ప్రారంభోత్సం జరిపారు. అదేమీ కాదు, ఏదో ఒక తేదీని ఎంచుకోవాలి కదా అలా చేస్తే ఏదో అలా కలసి వచ్చిందని చెబితే ఎవరూ నమ్మరు. రాజరికాలను తిరిగి ప్రతిష్టించాలనే కోరిక, తిరిగి సమాజాన్ని వెనక్కు నడపాలనే , ప్రజస్వామ్యాన్ని పాతిపెట్టి హిందూత్వ పాలన రుద్దాలన్న ప్రగాఢవాంఛ నరనరాన ఉన్నవారే దీనికి పాల్పడతారని వేరే చెప్పనవసరం లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు అనే గ్రంధంలో బిఆర్‌ అంబేద్కర్‌ రాసిన ఒక పేరాలో ఏముందో చూద్దాం.” ఒక బ్రాహ్మణుడు స్వతంత్ర దేశ తొలి ప్రధాని ఐన సందర్భంగా పండుగ చేసుకొనేందుకు బనారస్‌ బ్రాహ్మలు చేసిన యజ్ఞంలో ప్రధాని నెహ్రూ పాల్గొనలేదు. ఆ బ్రాహ్మలు అందించిన రాజదండాన్ని ధరించలేదు, గంగ నుంచి తెచ్చిన జలాన్ని తాగలేదు ” అని రాశారు. అధికార మార్పిడి జరిగిన మరుసటి రోజు యజ్ఞం జరిగింది. అధికార మార్పిడి చిహ్నంగా రాజదండం, దాన్ని మౌంట్‌బాటన్‌ అందచేశాడనటాుకి ఎలాంటి రుజువులు, ఆధారాలు లేవు.

గోద్రా ఉదంతం తరువాత గుజరాత్‌లో జరిగిన మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని ప్రధానిగా ఉన్న వాజ్‌పాయి నరేంద్రమోడీకి హితవు చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని పాటించిన దాఖలాల్లేవు. రాజులు దండాన్ని దుష్టుల మీద ప్రయోగించాలని చెప్పారు. ్ల ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుమేరకు విధిలేక కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు పెట్టిన వారిని అరెస్టు చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ తన పార్టీకి చెందిన సదరు ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌కి మద్దతుగా కొందరు ప్రదర్శనలకు దిగుతున్నారు. గుజరాత్‌లో అత్యాచారాలకు పాల్పడి రుజువైన కేసులో శిక్షలను పూర్తిగా అమలు జరపకుండా నేరగాండ్లను విడుదల చేసి వారికి గౌరవ మర్యాదలు చేసిన బిజెపి ఘనులను నరేంద్రమోడీ పల్లెత్తు మాట అనలేదు. బ్రిజ్‌ భూషణ్ను కాపాడుతూ అరెస్టు డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్ల మీద దండాన్ని ఝళిపించి అధికారాన్ని దేనికి, ఎలా ఉపయోగించేదీ బేటీ పడావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ లోకానికి వెల్లడించారు. ఇది మన గతం, సంప్రదాయం అని మనం నమ్మాలి, ఏమి చేసినా కిమ్మన కూడదు ? రాజదండ సందేశమిదే !

ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


కొట్టవద్దు తిట్టవద్దు, పొమ్మనకుండా పొగబెట్టు ఎలా దారికి రారో చూద్దాం అన్నట్లుగా ఆర్థిక ఆంక్షలను ఆయుధాలుగా చేసుకొని అమెరికా, పశ్చిమ దేశాలు సామ్రాజ్యవాదులు, వాటి తొత్తులు అనేక దేశాల మీద దాడులు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక మరియు విధాన పరిశోధనా కేంద్రం (సిఇపిఆర్‌) ” ఆర్థిక ఆంక్షల మానవీయ పర్యవసానాలు ” అనే శీర్షికతో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.మానవహక్కులు, ప్రజాస్వామ్యం వంటి పెద్ద కబుర్లు చెప్పే పశ్చిమ దేశాల దుర్మార్గాన్ని అది ఎండగట్టింది. ఆంక్షలలో రెండు రకాలు, ఐరాస విధించేవి ఒక తరగతి. ఇవి స్వంత పౌరుల పట్ల లేదా ఇతర దేశాల మీద కాలుదువ్వే పాలకులను దారికి తెచ్చేందుకు సమిష్టిగా విధించేవి. ఐరాసతో నిమిత్తం లేకుండా కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్లుగా తమకు లొంగని దేశాలు, సంస్థలు, వ్యక్తుల మీద ఏకపక్షంగా అమెరికా, దాని మిత్రదేశాలు విధించేవి రెండవ కోవకు చెందినవి. కేవలం కమ్యూనిస్టులుగా ఉన్నందుకు, ప్రపంచమంతటా కమ్యూనిజాన్ని అరికట్టే మొనగాడిగా ఉన్న తమకు కూతవేటు దూరంలోనే ఒక సోషలిస్టు దేశం ఉనికిలోకి రావటాన్ని సహించలేని అహంతో అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అమానవీయ ఆంక్షలను క్యూబా మీద అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. 1992 నుంచీ ప్రతి ఏటా 2020లో కరోనా కారణంగా తప్ప వాటిని ఖండిస్తూ ఐరాస సాధారణ అసెంబ్లీలో తీర్మానం పెట్టటం దాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేకించటం, అమెరికా వత్తిడిని తట్టుకోలేక కొన్ని దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం తప్ప మిగిలిన దేశాలన్నీ ఖండించినా అమెరికా ఖాతరు చేయటం లేదు.


ఐరాస విధించేవి తప్ప భద్రతా మండలి అనుమతి లేని మిగిలిన ఆంక్షలన్నీ చట్టవిరుద్దమైనవే. దేశమంటే మట్టి కాదు, మనుషులు అని చెప్పిన మహాకవి గురజాడ ప్రకారం అనేక దేశాలను అనేకంటే అక్కడి పౌరుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ దుర్మార్గాలను నిరోధించే సత్తా ఐరాసకు లేదు. 1960 దశకం నాటికి ప్రపంచంలోని నాలుగుశాతం దేశాలు ఐరాస, అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలకు గురికాగా ప్రస్తుతం 54 దేశాలు లేదా 27శాతానికి చేరాయి. వీటి జిడిపి నాలుగు నుంచి 29శాతానికి పెరిగింది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇటీవలి పరిణామాలను చూస్తే బరాక్‌ ఒబామా ఏలుబడిలో సంస్థలు లేదా వ్యక్తుల మీద ఏడాదికి 544 కొత్త ఆంక్షలు విధిస్తే అవి ట్రంప్‌ కాలంలో 975, వర్తమాన జో బైడెన్‌ ఇప్పటి వరకు సగటున 1,151గా ఉన్నాయి. దీర్ఘకాలంగా అమల్లో ఉన్నవాటిలో క్యూబా మీద 1960 దశకం నుంచి అమలు జరుగుతుంటే ఇరాన్‌ మీద 1979, ఆప్ఘనిస్తాన్‌ మీద 1999 నుంచి అమల్లో ఉన్నాయి. ఐరాస మానవహక్కుల మండలి 2014లో ఆమోదించిన తీర్మానంలో ఏకపక్ష ఆంక్షలు పౌరుల మీద చూపుతున్న ప్రతికూల ప్రభావాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ తరువాత తీవ్రత, సంఖ్య రీత్యా ఇంకా పెరిగాయి తప్ప తగ్గలేదు.


ఔషధాల దగ్గర నుంచి అన్నింటి మీద అమెరికా విధించిన ఆంక్షల వలన క్యూబా అపార నష్టానికి గురైంది. ఒక దశలో వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్ల వంటి వాటికి కూడా డీజిలు, పెట్రోలు దొరక్క గుర్రాలతో సాగు చేసుకోవాల్సి వచ్చింది. క్యూబా మీద ఆంక్షల వలన తమకు జరిగిన నష్టం గురించి అమెరికా సంస్థలు కూడా గగ్గోలు పెట్టాయి. ఎవడి గోల వాడిది. క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అనే సంస్థ 2002లో వేసిన అంచనా ప్రకారం ఏటా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 360 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. తరువాత అక్కడి కార్పొరేట్ల వత్తిడి మేరకు ఆంక్షలను సడలించటంతో 2000-2006 కాలంలో అమెరికా వార్షిక ఎగుమతులు 60లక్షల నుంచి 35 కోట్ల డాలర్లకు పెరిగాయి. అయినప్పటికీ తమకు ఏటా 120 కోట్ల డాలర్ల మేర నష్టం జరుగుతున్నట్లు 2009లో అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. ప్రారంభం నుంచి తమకు 753 బి. డాలర్ల నష్టం జరిగిందని క్యూబా సర్కార్‌ చెప్పింది. అమెరికాకు ఏటా 484 కోట్ల డాలర్ల మేర, క్యూబాకు 68.5 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగినట్లు క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అంచనా వేసింది.భిన్నమైన అంశాల ప్రాతిపదికన చెప్పే ఈ అంచనాలు ఒకదానికి ఒకటి పొసగవు. ఉదాహరణకు 2015లో అల్‌ జజీరా ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం ఆంక్షలు ప్రారంభమైన 55 సంవత్సరాలలో క్యూబాకు 1.1లక్షల కోట్ల నష్టం జరిగింది.


ఇరాన్‌ మీద విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన అత్యవసర ఔషధాల జాబితాలోని 32తో సహా 73 ఔషధాలకు అక్కడ కొరత ఏర్పడింది. ఆప్ఘ్‌నిస్తాన్‌లో తలసరి ఆదాయం దారుణంగా తగ్గింది.2021లో అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత అదే అమెరికా, ఐరోపా సమాఖ్య 960 కోట్ల డాలర్ల విలువగల ఆప్ఘన్‌ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఆ దేశ జిడిపిలో సగం. ఆంక్షల కారణంగా విదేశాల నుంచి ఏటా వచ్చే 80 కోట్ల డాలర్ల మేర నిలిచిపోయాయి. వెనెజులా మీద 2017లో విధించిన ఆంక్షల కారణంగా 2020నాటికి దేశ దిగుమతులు 91శాతం తగ్గాయి. దాదాపు పూర్తిగా దిగుమతుల మీదనే ఆహారం సమకూర్చుంటున్న వెనెజులా దిగుమతులు 78శాతం పడిపోయాయి. చమురు ఎగుమతులపై ఆంక్షల కారణంగా జీవన ప్రమాణాలు తగ్గి శిశు, సాధారణ మరణాల రేటు పెరిగింది. తమ ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడిన జనం ఇరాన్‌, వెనెజులా పాలకులపై తిరుగుబాటు చేసే విధంగా పురికొల్పటమే లక్ష్యమని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో గతంలో చెప్పాడు. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల పేరుతో ఇలాంటి దుర్మార్గమైన ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. ఆంక్షలు ప్రకటించిన ఏ దేశంలోనైనా జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప వీటిని సాధించలేదు. అవి సమర్ధించే అనేక దేశాల్లో వాటి జాడే కనపడదు. సోషలిస్టు బాట నుంచి వైదొలిగేట్లుగా లేదా తనకు అనుకూలంగా మార్చుకొనేట్లు క్యూబా మీద అమలు జరుపుతున్న ఆంక్షల ప్రభావం ఏమాత్రం లేదని విలియం లియోగ్రాండే అనే విశ్లేషకుడు చెప్పాడు. ప్రాణాలైనా ఇస్తాంగానీ అమెరికాకు లొంగేది లేదన్న కమ్యూనిస్టుల ప్రత్యేకత ఇది.


అన్ని దేశాల మీద ప్రకటిస్తున్న ఆంక్షల లక్ష్యం కూడా లొంగదీసుకోవటమే. అణుపరీక్షలు జరుపుతున్నదనే కారణంతో ఇరాన్‌ మీద భద్రతా మండలి విధించిన ఆంక్షలు కొన్ని కాగా దానితో నిమిత్తం లేకుండా అమెరికా, ఇతర దేశాలు విధించినవి మరికొన్ని.అణు కార్యమం నిలిపివేతకు అంగీకరించిన ఇరాన్‌తో దానికి ప్రతిగా స్పందించాల్సిన అమెరికా ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలిగింది. తమ భద్రతకు ముప్పుతెచ్చే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవద్దన్న రష్యా వినతిని ఖాతరు చేయకుండా ముందుకు పోతుండటంతో తప్పనిసరై సైనిక చర్యకు దిగిన పుతిన్‌పై ఆంక్షలు విధించి దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బతీసి జనాన్ని వీధుల్లోకి తెచ్చి పుతిన్‌ సర్కార్‌ను గద్దెదింపాలని అమెరికా చూసింది.వాణిజ్య పోరు పేరుతో చైనాను తన దారికి తెచ్చేందుకు అంతకు ముందే పూనుకుంది.వివిధ సందర్భాలలో మనతో సహా అనేక దేశాలను బెదిరించటం చూస్తున్నదే.


ఉక్రెయిన్‌ మీద మిలిటరీ దాడులు జరుపుతున్నదనే కారణంతో రష్యాకు చెందిన సంస్థలు, వ్యక్తుల మీద ఆంక్షలు విధించారు.రష్యా ఐటి,ఇంజనీరింగ్‌ వంటి రంగాలకు అవసరమైన వస్తువులు, సేవల ఎగుమతుల మీద బ్రిటన్‌ నిషేధం విధించింది, 70శాతం సెమీ కండక్టర్ల ఎగుమతులు నిలిచాయి. అమెరికా, ఇతర నాటో దేశాల చమురు, గాస్‌ ఎగుమతుల నిషేధం, చమురు ధరలపై ఆంక్షల గురించి తెలిసిందే. దేశాల వారీ చూస్తే అమెరికా 374, కెనడా 156, బ్రిటన్‌ 95, ఐరోపా సమాఖ్య 44, స్విడ్జర్లాండ్‌ 42,ఆస్ట్రేలియా 28 చొప్పున కొత్త ఆంక్షలు విధించాయి.ఇరాన్‌ మీద కొత్తగా 115 ఆంక్షలు ఈ దేశాలు విధించాయి.హిరోషిమాలో ఇటీవల జరిగిన జి7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ముందు పలు ఆంక్షలకు తెరతీశారు. వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే అమలు జరుపుతున్న ఆంక్షల వలన రష్యా ప్రభావితం అవుతున్నది. చమురును ఆరవై డాలర్లకు మించి కొనకూడదన్న ఆంక్ష వలన గానీ రాయితీ ధరలకు వివిధ దేశాలకు అమ్ముతున్నకారణం కావచ్చు ప్రస్తుత రష్యా చమురు సగటు ధర 58.62 డాలర్లు ఉంది. ఆర్మీనియా నుంచి అది దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ 3,700 శాతం పెరిగాయి.వివిధ దేశాల మీద 2023 ఫిబ్రవరి 22 నాటికి విధించిన ఆంక్షల సంఖ్య గురించి స్టాటిస్టా సమాచారం ఇలా ఉంది.
దేశం ×× మొత్తం ××2022, ఫిబ్రవరి×× 2022 ఫిబ్రవరి తరువాత
రష్యా ×× 14,081 ××× 2,754 ××× 11,327
ఇరాన్‌ ×× 4,191 ××× 3,616 ××× 575
సిరియా ×× 2,644 ××× 2,598 ××× 46
ఉ.కొరియా ×× 2,133 ××× 2,052 ××× 81
బెలారస్‌ ×× 1,154 ××× 788 ××× 366
వెనెజులా ×× 651 ××× ××××× ××× ×××


చైనా మార్కెట్‌లో మరింతగా తన వస్తువులను అమ్ముకొనేందుకు, దిగుమతులను అడ్గుకొనేందుకు, చైనాకు అధునాత సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు అమెరికా ఆంక్షలను అమలు జరుపుతోంది. 2008లో రెండు కొత్త ఆంక్షలను విధించగా తరువాత 2018నాటికి వాటిని 59కి పెంచింది. తరువాత నాలుగు సంవత్సరాలలో 29,300,89,36 కొత్తగా విధించింది.వీటిలో ఇటీవలి కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల ఎగుమతుల మీద విధించిన ఆంక్షలు తీవ్రమైనవి. తద్వారా చైనా ఆర్థిక రంగాన్ని కుదేలు కావించాలని చూస్తున్నది.2023తొలి మూడు మాసాలలో విధించిన ఆంక్షలను పరిగణలోకి తీసుకుంటే పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల సంఖ్య 36,500 దాటింది.తాము విధించిన వాటితో పాటు ప్రతిగా తమ మీద విధించిన ఆంక్షలతో పశ్చిమ దేశాలు కూడా కొంత మేరకు ప్రభావితం అవుతాయి. వాటి తీవ్రత పెరిగి తమ లాభాలు, అసలుకే ముప్పు వచ్చేంత వరకు కార్పొరేట్‌ సంస్థలు రంగంలోకి రావు. డాలరు పెత్తనం తగ్గుతుందని అనేక మంది చెబుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అది అంత తేలిక కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ దేశాల రిజర్వుబాంకుల్లో డాలరు నిల్వలు 2021 డిసెంబరులో 7,085.92 బిలియన్‌ డాలర్లుంటే 2022 ఆగస్టులో 6,652.32 బి.డాలర్లకు మాత్రమే తగ్గాయి. ఇదే కాలంలో మొత్తం రిజర్వుబాంకుల ఆస్తుల్లో చైనా యువాన్‌ నిల్వలు నామమాత్రం నుంచి 6.2శాతానికి పెరిగాయి. అందువల్లనే అమెరికా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది, ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నది. సామ్రాజ్యవాదులు, దానితో చేతులు కలుపుతున్న శక్తుల తీరు తెన్నులను చూస్తే తమకు లొంగని దేశాల మీద ఆంక్షలను రోజు రోజుకు పెంచటాన్ని గమనించాము. రానున్న రోజుల్లో ఇదే ధోరణి కొనసాగితే ఆయుధ యుద్ధాలకు బదులు ఆంక్షల దాడులతో జనాలకు ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఐరాస వీటిని నిరోధించలేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన యుద్ధాలనే కాదు ఆంక్షలనూ వద్దంటూ జనం వీధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది.


.

సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


షీ ఇన్‌ అనే ఒక చైనా కంపెనీతో మన దేశ బడాసంస్థ రిలయన్స్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్రం ఆమోద ముద్రవేసినట్లు వార్త. దీని గురించి మీడియా చాలా పరిమితంగా మాత్రమే వార్తలు ఇచ్చింది. పెద్ద హడావుడి లేదు. ఎందుకంటే చైనా వ్యతిరేకతను వెల్లడించటమే అసలు సిసలు దేశ భక్తి అన్నట్లు అవకాశం దొరికినపుడల్లా ప్రదర్శిస్తున్న వారికి ఇది తేలుకుట్టిన దొంగ పరిస్థితే మరి. అమెజాన్‌ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్రమోడీ సర్కార్‌ శాయశక్తులా చూస్తోంది.గతంలో అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌ ఢిల్లీ వచ్చినపుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్రమోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు.ఇంతకీ షీ ఇన్‌ కంపెనీ, దాని యాప్‌ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్ను పడిందంటే మూడేండ్ల క్రితం దాన్ని నిషేధించినా అమెజాన్‌ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ లాభపడుతున్నది. ఆ లబ్దిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్‌ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపోతుంది. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ, అసలు ఉండదు అన్నది కొందరి ప్రగాఢ విశ్వాసం. నరేంద్రమోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఘపరివార్‌ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశ భక్తి అలాంటిది. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకోవచ్చన్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్దిదారు అంబానీ. నరేంద్రమోడీతో 2014లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.


రష్యా ముడిచమురుతో తయారైన ఉత్పత్తులను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య తొలిసారిగా తన దేశాలను కోరింది.భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు రష్యా ముడిచమురుతో చేసినవేనని, వాటిని దిగుమతి చేసుకుంటే రష్యా మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘించటమే అని సమాఖ్య విదేశాంగ విధాన ఉన్నత ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ వర్ణించారు. పీపా ముడిచమురును 60 డాలర్లకు మించి కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా, ఐరోపా దేశాలు బెదరించిన సంగతి తెలిసిందే. బోరెల్‌ విమర్శలను మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ తోసిపుచ్చారు. తాము ఎగుమతి చేస్తున్నవాటిని భారత ఉత్పత్తులుగానే చూడాలి అన్నారు. మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కంటే రష్యా నుంచి వస్తున్నదానికి పది డాలర్లు తక్కువ చెల్లిస్తున్నాము. ఈ దిగుమతుల్లో 80శాతం పైగా రిలయన్స్‌ మరో ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని డీజిలు, పెట్రోలు, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నాయి. దీని వలన మన జనానికి ఎలాంటి లాభమూ లేదు. ఇది మోడీ అసలైన స్వాతంత్య్ర ఫలం.


ఇక తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ది గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్‌ కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. ఫాషన్‌ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్‌,యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. గత ఏడాది నాటికి మూడువేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో ” షి ఇన్‌ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు ” అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్‌ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు.
గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు.ఐటి చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్‌ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొనేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి. సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్‌మార్క్‌ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.


ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్‌ రిటెయిల్స్‌ సేకరణ సామర్ధ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్‌ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్‌ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించిందని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది. గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియ డాలర్లు ఉండవచ్చని అంచనా.చైనాతో తలెత్తిన విబేధాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీఇన్‌ మార్కెట్‌ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మైంత్రా ప్రధాన విక్రేతగా ఉంది. షీ ఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు.


ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నదాని ప్రకారం లైసన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో ద్వారా వచ్చే లాభాల్లో కొంతశాతం షి ఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.చైనాలో ఉన్న తన ఎనిమిదివేల మంది సరఫరదారుల నుంచి సేకరించే దుస్తులతో పాటు భారత్‌లో రిలయన్స్‌ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వంటి వారు సి ప్లస్‌ 1 అంటే చైనా ప్లస్‌ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్‌, టాటా, బిర్లా,అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ది పొందవచ్చని చెబుతున్నారు.చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్ధం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్నవాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్‌ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్‌ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో 2013లోనే అంటే నరేంద్రమోడీ అధికారానికి రాకముందే సి ప్లస్‌ 1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్‌ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢకొీట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ వత్తిడికి లంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం.రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని చౌక దుకాణాలు విలేజ్‌ మాల్స్‌గా మారుస్తామని, ఆ కంపెనీల ఉత్పత్తులను విక్రయిస్తామని 2017లో సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 29వేల చౌకదుకాణాల్లో తొలిదశలో 6,500లను మాల్స్‌గా మార్చాలని, వాటికి అన్న (ఎన్‌టిఆర్‌) విలేజ్‌ మాల్స్‌ అనే పేరు పెట్టాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఎందుకు కలిపారంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది ఆచరణలోకి రాలేదు.


ఒకటి మాత్రం నిజం, అంగీకరించకతప్పదు. ఒకసారి చెప్పిందాన్ని మరోసారి ప్రస్తావించకపోవటం, ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో జనాన్ని ఎలా రెచ్చగొట్టాలో, మనోభావాలను ముందుకు తెచ్చి వారితో ఎలా ఆడుకోవాలో, ఓట్లు ఎలా దండుకోవాలో, అంబానీ, అదానీల వంటి కార్పొరేట్లను ఎలా వాడుకోవాలో నరేంద్రమోడీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు. గాల్వన్‌ లోయలో మన సైనికుల మీద చైనా మిలిటరీ దాడి చేసి చంపినదానికి ప్రతీకారం అంటూ నాడు చైనా యాప్‌ల మీద, చైనా పెట్టుబడుల మీద నిషేధం విధించారు. ఆ విధంగా జనాల మనోభావాలను సంతుష్టీకరించి వారి దృష్టిలో చైనాను దెబ్బతీసిన మొనగాడిగా కనిపించిన సంగతి తెలిసిందే.యాప్‌ల మీద ఆంక్షలతో ఒక దేశాన్ని దెబ్బతీస్తున్నామంటే మన జనమంతా నిజమే కామోసు అనుకున్నారు. ఇంకే ముంది చైనా కథ ముగిసినట్లే అని సంతోషించారు. మోడీ మీద ఉన్న భ్రమ అలాంటిది. గాల్వన్‌ ఘర్షణ తరువాత చైనా వస్తువులను నిషేధించాలని కాషాయ దళాలు వీధుల్లో వీరంగం వేసిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. స్వదేశీ జాగరణ మంచ్‌ నిదురలేచింది. తరువాత అదే చైనా నుంచి మన దిగుమతుల అంశంలో మోడీ తన రికార్డులను తానే బద్దలు చేస్తున్నారు.వందల కోట్ల డాలర్లను ప్రతి ఏటా సమర్పించుకుంటున్నారు. మన ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 2022-23లో మన చైనా దిగుమతులు 4.16శాతం పెరిగి 98.51 బి.డాలర్లకు చైనాకు మన ఎగుమతులు 28శాతం తగ్గి 15.32 బి.డాలర్లుగా ఉన్నాయి. మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 72.91 నుంచి 83.2 బి.డాలర్లకు పెరిగింది. అదే మొనగాడు ఇప్పుడు అంబానీ కంపెనీ కోసం వాటిలో షీ ఇన్‌ అనే ఒక యాప్‌కు గుట్టుచప్పుడు కాకుండా అనుమతించేందుకు ఇచ్చేశారు. అటు జనం ఓట్లు ఇటు కార్పొరేట్ల నోట్లు కావాలి కదా ! నరేంద్రమోడీ ఒక చైనా కంపెనీ, యాప్‌ను తిరిగి అనుమతించటం ద్వారా ద్వారం తెరిచారు. వచ్చే రోజుల్లో ఏదో ఒకసాకుతో మిగిలిన వాటికి కూడా తెరుస్తారా ? మన దేశానికి చెందిన ఏదో ఒక బడా కంపెనీకి లబ్ది కలిగితే ఎలాంటి సందేహం లేకుండా అనుమతిస్తారని వేరే చెప్పనవసరం లేదు.


అమెజాన్‌ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్రమోడీ సర్కార్‌ శాయశక్తులా చూస్తోంది.గతంలో అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌ ఢిల్లీ వచ్చినపుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్రమోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు.ఇంతకీ షీ ఇన్‌ కంపెనీ, దాని యాప్‌ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్ను పడిందంటే దాన్ని నిషేధించినా అమెజాన్‌ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ లాభపడుతున్నది. ఆ లబ్దిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్‌ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపోతుంది.నరేంద్రమోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఘపరివార్‌ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశ భక్తి అలాంటిది. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకోవచ్చన్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్దిదారు అంబానీ. నరేంద్రమోడీతో 2014లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.


రష్యా ముడిచమురుతో తయారైన ఉత్పత్తులను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య తొలిసారిగా తన దేశాలను కోరింది.భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు రష్యా ముడిచమురుతో చేసినవేనని, వాటిని దిగుమతి చేసుకుంటే రష్యా మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘించటమే అని సమాఖ్య విదేశాంగ విధాన ఉన్నత ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ వర్ణించారు. పీపా ముడిచమురును 60 డాలర్లకు మించి కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా, ఐరోపా దేశాలు బెదరించిన సంగతి తెలిసిందే. బోరెల్‌ విమర్శలను మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ తోసిపుచ్చారు. తాము ఎగుమతి చేస్తున్నవాటిని భారత ఉత్పత్తులుగానే చూడాలి అన్నారు. మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కంటే రష్యా నుంచి వస్తున్నదానికి పది డాలర్లు తక్కువ చెల్లిస్తున్నాము. ఈ దిగుమతుల్లో 80శాతం పైగా రిలయన్స్‌ మరో ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని డీజిలు, పెట్రోలు, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నాయి. దీని వలన మన జనానికి ఎలాంటి లాభమూ లేదు. ఇది మోడీ అసలైన స్వాతంత్య్ర ఫలం.


ఇక తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ది గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్‌ కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. ఫాషన్‌ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్‌,యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. గత ఏడాది నాటికి మూడువేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో ” షి ఇన్‌ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు ” అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్‌ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు.
గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు.ఐటి చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్‌ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొనేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి. సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్‌మార్క్‌ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.


ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్‌ రిటెయిల్స్‌ సేకరణ సామర్ధ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్‌ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్‌ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించిందని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది. గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియ డాలర్లు ఉండవచ్చని అంచనా.చైనాతో తలెత్తిన విబేధాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీఇన్‌ మార్కెట్‌ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మైంత్రా ప్రధాన విక్రేతగా ఉంది. షీ ఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు.


ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నదాని ప్రకారం లైసన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో ద్వారా వచ్చే లాభాల్లో కొంతశాతం షి ఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.చైనాలో ఉన్న తన ఎనిమిదివేల మంది సరఫరదారుల నుంచి సేకరించే దుస్తులతో పాటు భారత్‌లో రిలయన్స్‌ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వంటి వారు సి ప్లస్‌ 1 అంటే చైనా ప్లస్‌ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్‌, టాటా, బిర్లా,అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ది పొందవచ్చని చెబుతున్నారు.చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్ధం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్నవాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్‌ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్‌ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో 2013లోనే అంటే నరేంద్రమోడీ అధికారానికి రాకముందే సి ప్లస్‌ 1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్‌ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢకొీట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ వత్తిడికి లంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం.రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని చౌక దుకాణాలు విలేజ్‌ మాల్స్‌గా మారుస్తామని, ఆ కంపెనీల ఉత్పత్తులను విక్రయిస్తామని 2017లో సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 29వేల చౌకదుకాణాల్లో తొలిదశలో 6,500లను మాల్స్‌గా మార్చాలని, వాటికి అన్న (ఎన్‌టిఆర్‌) విలేజ్‌ మాల్స్‌ అనే పేరు పెట్టాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఎందుకు కలిపారంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు నరేంద్రమోడీ ఒక చైనా కంపెనీ, యాప్‌ను తిరిగి అనుమతించటం ద్వారా ద్వారం తెరిచారు. వచ్చే రోజుల్లో ఏదో ఒకసాకుతో మిగిలిన వాటికి కూడా తెరుస్తారా ? మన దేశానికి చెందిన ఏదో ఒక బడా కంపెనీకి లబ్ది కలిగితే ఎలాంటి సందేహం లేకుండా అనుమతిస్తారని వేరే చెప్పనవసరం లేదు.

అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ బుధవారం నాడు ట్వీట్‌ చేశారు. భాగస్వామ్య దేశాలతో బంధం మరింతగా బలపడినట్లు పేర్కొన్నారు. గురువారం నాడు ఢిల్లీ చేరుకున్న ప్రధాని స్వాగతం పలికిన బిజెపి మద్దతుదార్లతో మాట్లాడుతూ పర్యటనలో ప్రతి క్షణం దేశ బాగుకోసమే వెచ్చించినట్లు చెప్పారు. అఫ్‌ కోర్స్‌ ఒక పర్యటన ఫలితాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడికావు అన్నది తెలిసిందే. తొలిసారిగా ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత వరుసబెట్టి విదేశీ ప్రయాణాలు చేశారు.ఎక్కువ కాలం విమానాల్లోనే గడిపినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకు ఇలా తిరుగుతున్నారు అంటే విదేశాల్లో దేశ ప్రతిష్టను పెంచేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అని మోడీ మద్దతుదారులు, బిజెపి పెద్దలు చెప్పారు. తొమ్మిది సంవత్సరాలు గడిచినా దాని ఫలితాలు పెద్దగా కనిపించలేదు. విదేశాల్లో దేశ ప్రతిష్టను కొలిచేందుకు కొలబద్దలు లేవు. నిజంగా మోడీ పెంచారనే అనుందాం, దాని వలన దేశానికి ఒరిగిందేమిటి ? మన ప్రమేయంతో పరిష్కారమైన సమస్యలేమీ లేవు. సేవా రంగంలో పెట్టుబడుల పెరుగుదల మోడీ ప్రభావంతో జరిగితే , ఉత్పత్తిరంగంలోకి ఎందుకు రాలేదు.గతేడాది డిసెంబరు 28న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన విశ్లేషణ ప్రకారం సేవారంగంలో ఏప్రిల్‌ 2000 నుంచి 2014 మార్చినెల వరకు విదేశీ పెట్టుబడులు 80.51 బి.డాలర్లుండగా అప్పటి నుంచి నుంచి 2022 మార్చి నెల వరకు 153 బి.డాలర్లకు పెరగ్గా ఉత్పాదక రంగంలో ఇదే కాలంలో 77.11 బి.డాలర్ల నుంచి 94.32కు మాత్రమే పెరిగాయి. దీన్ని బట్టి చైనాను వెనక్కు నెట్టేసి మన దేశం ప్రపంచ కర్మాగారంగా మారనుందని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని తేలింది. అందువలన తాజా పర్యటన గతానికి భిన్నంగా తెల్లవారేసరికి ఏదో ఒరగబెడుతుందని భావించనవసరం లేదు.


ప్రధాని తాజా టూర్‌ గురించి అతిశయోక్తుల ప్రచారం మొదలైంది.ప పొగడ్తలు పొగ చెట్టువంటివి. పొగ కనిపిస్తుంది గానీ ఎంత కోసినా గుప్పెడు కాదు, కడుపు నింపదు, దాహం తీర్చదు. కొద్ది సేపు ఉండి అదృశ్యమౌతుంది. ఒక ప్రధానికి లేదా మరొక ప్రముఖుడిని పొగడ్తలతో ముంచెత్తితే దేశానికి, జనానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. పాపువా న్యూగినియా ప్రధాని నరేంద్రమోడీకి పాదాభివందనం చేశాడని, అక్కడి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి రాత్రి పూట స్వాగతం పలికారని ఇవన్నీ నరేంద్రమోడీ ఘనతగా చిత్రించారు. కొన్ని అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. తమ అవసరాల కోసం నరేంద్రమోడీని మునగ చెట్టు ఎక్కించేందుకు చూశారు. మోడీ గారూ మీరు అంత పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నవారితో ఎలా నెట్టుకురాగలుగుతున్నారో చూసిన తరువాత మీ ఆటోగ్రాఫ్‌ (ఒక పుస్తకం మీద లేదా ఒక కాగితం మీద అభిమానులు సినిమా వాళ్లను, ఇతర ప్రముఖులను సంతకాలు అడగటం తెలిసిందే) తీసుకోవాలనిపిస్తోందని అమెరికా అధినేత జో బైడెన్‌ అడిగినట్లు వార్తలు. ఇద్దరి మధ్య సంభాషణల సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ ” మీరు నాకు నిజంగా ఒక సమస్య తెస్తున్నారు. వచ్చే నెలలో వాషింగ్టన్‌లో మీకోసం ఒక డిన్నర్‌ ఏర్పాటు చేస్తున్నాము. దేశమంతటి నుంచి ప్రతివారూ దానికి రావాలని కోరుకుంటున్నారు. నా దగ్గర (టికెట్ల) ఆహ్వానాల కొరత ఏర్పడింది.( పశ్చిమ దేశాల్లో ప్రముఖులతో కలసి విందులు ఆరగించేందుకు వెల చెల్లించి ఆహ్వానాలను కొనుక్కుంటారు,ఎందుకంటే అక్కడ ఏదీ ఊరికే పెట్టరు ) నేను హాస్యమాడుతున్నట్లు మీరు అనుకోవచ్చు. నా సిబ్బందిని అడగండి. నేను గతంలో ఎన్నడూ చూడని విధంగా సినిమా నటుల నుంచి బంధువుల వరకు ప్రతివారి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మీరు ఎంతో ప్రాచుర్యం పొందారు. ప్రధాని గారూ మనం చతుష్టయం(క్వాడ్‌)లో చేస్తున్నదానితో సహా మీరు ప్రతిదాని మీద గణనీయమైన ప్రభావం కలిగిస్తున్నారు. పర్యావరణం మీద కూడ మౌలిక మార్పును తెచ్చారు. ఇండో-పసిఫిక్‌లో మీ ప్రభావం ఉంది, మీరు ఎంతో తేడాకు కారకులుగా ఉన్నారు.” అని బైడెన్‌ అన్నట్లుగా పత్రికల్లో వచ్చింది.


మోడీ-బైడెన్‌ మాట్లాడుకుంటుండగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్‌ కూడా వచ్చాడట. వారితో మాట కలుపుతూ సిడ్నీ నగరంలో పౌర ఆహ్వానానికి వసతి ఇరవై వేల మందికి మాత్రమే సరిపోతుంది, వస్తున్న వినతులన్నింటినీ అంగీకరించలేకపోతున్నాను అన్నాడట. మీరు గెలిచినపుడు నరేంద్రమోడీ స్టేడియంలో తొంభైవేలకు పైగా వచ్చిన వారిని సర్దుబాటు చేసిన తీరు గుర్తుకు వస్తోంది అన్నాడట. అప్పుడు మీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని ఉందని బైడెన్‌ మన ప్రధాని మోడీతో అన్నాడట. ఈ ఉదంతం గురించి వేరే విధంగా స్పందించనవసరం లేదు. విదేశీ నేతలు అలా మాట్లాడకపోతేనే ఆశ్చర్యపడాలి. గత జి 7 సమావేశాల్లో కూడా వెనుక నుంచి వచ్చి మోడీ భుజం తట్టి బైడెన్‌ పలుకరించినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. బైడెన్‌, అల్బనీస్‌ అలా మాట్లాడినపుడు నరేంద్రమోడీ స్పందన ఏమిటన్నది వార్తలలో రాలేదు. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. మీడియాకు ఈ అంశాలను చెప్పిన వారు కేవలం నరేంద్రమోడీ గొప్పను పెంచేందుకు పనికి వచ్చే వాటిని మాత్రమే వెల్లడించారన్నది స్పష్టం. వారు అలా పొగుడుతుంటే మోడీ మౌనంగా ఉంటారని, ఉన్నారని ఎలా అనుకోగలం ? మర్యాద కోసమైనా మోడీ ఎలా స్పందించిందీ చెప్పాలని అధికార గణానికి తోచలేదా ? లేక మోడీ కూడా ప్రతిగా వారిని పొగిడి ఉంటే ఒకరి నొకరు పొగుడుకున్నారని జనం భావిస్తారు గనుక ఒక భాగాన్ని మాత్రమే విలేకర్లతో చెప్పారన్నది స్పష్టం.


ఇక ఆస్ట్రేలియా వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ సిడ్నీ సభలో మరిన్ని పొగడ్తలను పొందారు. విశ్వగురు, ప్రపంచ నేత అని ఇప్పటికే ప్రధాని గురించి చెబుతున్న అంశం తెలిసిందేమో ప్రధాని మోడీ ఈస్‌ ద బాస్‌ అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ సభికులకు పరిచయం చేశారు. సుప్రసిద్ద రాక్‌ స్టార్‌ బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్‌ అభిమానులు అతన్ని బాస్‌ అని పిలుస్తారని ప్రధాని నరేంద్రమోడీ కూడా అలాంటి వారేనని అన్నాడు. గతంలో ఇదే వేదిక మీద బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్ను చూశాను ప్రధాని నరేంద్రమోడీ మాదిరి స్వాగతం లేదు అని కూడా అల్బనీస్‌ అన్నాడు. ఏడాది క్రితం ఇదే రోజున ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటి నుంచి ఆరుసార్లు మేము కలుసుకున్నామంటే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని ఆల్బనీస్‌ చెప్పాడు. హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబులు వేయించి మారణహౌమానికి కారకురాలైన అమెరికా అధినేతలందరూ దాన్ని గురించి మరచిపోదాం అంటారు తప్ప క్షమాపణ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన బైడెన్‌తో కలసి కూర్చున్న మన ప్రధాని మోడీ అమెరికా దుర్మార్గాలకు నిలువెత్తు చిహ్నంగా ఉన్న హిరోషిమా బాధితుల స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు. జి 7వేదిక మీద అదే అమెరికాతో కలసి శాంతి వచనాలు వల్లించారు. ఇక జి 7 సమావేశంలో నరేంద్రమోడీ ప్రత్యేకతను గురించి చెప్పేందుకు ఆ సమావేశంలో మోడీ ధరించిన కోటును విశ్లేషకులు ఎంచుకున్నారు. వాడిపారేసిన ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలను కరగించి దానికి వేరే పదార్ధాలను కలిపి దారాలుగా మార్చి దానితో కుట్టిన కోటును మోడీ ధరించటం జి 7 సమావేశం మీద ప్రతిధ్వని ప్రభావం కలిగించిందని ఒక విశ్లేషకుడు వర్ణించారు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే ధరించిన ఆ కోటుతో వాతావరణ మార్పుల, పర్యావరణ అనుకూల సందేశాన్ని ఆ సమావేశంలో మోడీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చెప్పుకొనేందుకు వేరే ఏమీ లేనపుడు ఇలాంటి కబుర్లతో పేజీలు నింపటం కొత్తేమీ కాదు.


జి7లో వేసుకున్న పనికిరాని ప్లాస్టిక్‌తో రూపొందించిన పాలిస్టర్‌ కోటు రంగు వేరేది, కానీ ఫిబ్రవరి ఎనిమిదిన మరొక కోటు ధరించి పార్లమెంటుకు వచ్చారు.అంతకు ముందు భారత ఇంథన వారోత్సవాలలో బెంగలూరులో ఐఓసి కంపెనీ ఈ కోటును ప్రధానికి బహుకరించింది. అదే రోజు పార్లమెంటులో కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే ధరించిన శాలువ గురించి బిజెపి వివాదం రేపింది. ప్రధాని రీసైకిల్డ్‌ దారంతో ఉన్న తక్కువ ఖర్చుతో చేసిన జాకెట్‌ ధరించగా ఖర్గే శాలువ ఖరీదు రు.56,332 అని ట్వీట్లు చేసింది. నరేంద్రమోడీ ఎక్కడకు వెళితే అక్కడి వేషాలను(దుస్తులను) వేసుకుంటారన్నది మన జనానికి బాగా తెలిసిందే. ఈ అంశంలో గతంలో ఇందిరా గాంధీకి ఆ పేరు ఉండేది, దాన్ని మోడీ తుడిచివేసి తన పరంపరను ప్రారంభించారు.దాన్ని తలదన్నే విధంగా ఎవరు ఉంటారో చరిత్రకే వదలివేద్దాం. ఇక నరేంద్రమోడీ, ఇతర నేతలు ధరించిన దుస్తుల గురించి దేశంలో పెద్ద చర్చే జరిగింది, కొనసాగుతోంది కూడా.

కాలమహిమ ఏమంటే గతంలో నెహ్రూ మీద నిరంతరం దాడి చేసే తెగకు చెందిన ప్రధాని అదే నెహ్రూ కోటుగా జనంలో ప్రాచుర్యం పొందిన పొట్టి కోటునే నరేంద్రమోడీ కూడా ధరించారు, అలాంటి వాటిని 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జె ఇన్‌కు బహుమతిగా పంపారు. దాన్ని ధరించి చూడండి నేను మోడీ పొట్టి కోటును ధరించాను అని మూన్‌ ట్వీట్‌ చేశారు. తాను భారత సందర్శనకు వచ్చినపుడు నరేంద్రమోడీ ధరించిన కోటును చూసి ఈ కోటులో మీరు ఎంతో బాగున్నారు అని ప్రశంసించానని, తన కొలతలు తీసుకొని అలాంటి కోట్లను కుట్టించి మోడీ పంపారని మూన్‌ పేర్కొన్నారు. వాటి మీద మోడీ జాకెట్‌ అనే రాసి ఉంది. దీని గురించి పలు స్పందనలు వెలువడ్డాయి. వాటిలో ఒకదానిలో ఇలా ఉంది.” ప్రెసిడెంట్‌ గారూ మీరు చెప్పింది తప్పు. ఇది మోడీ వెస్ట్‌ కాదు, నెహ్రూ జాకెట్‌, మోడీకి నెహ్రూకు సంబంధం లేదు, ఎన్నడూ కాలేరు. మోడీ గురించి ఏదైనా చెప్పాలంటే అది ఖాకీ నిక్కరు ” అని ఒక ట్వీట్‌లో ఉంది. మన ప్రధాని మూన్‌కు అలాంటి కోట్లను పంపటం చాలా బాగుందని, అయితే వాటి పేరు మార్చకుండా పంపి ఉండాల్సిందని పేర్కొంటూ వాటిని నెహ్రూ కోటు అంటారని, 2014కు ముందు దేశంలో మోడీ జాకెట్లు లేవని కాశ్మీరు మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. ఇది వివాదం కావటంతో వాటిని రూపొందించిన కంపెనీని రంగంలోకి దించి వివరణ ఇప్పించారు. జేడ్‌ బ్లూ లైఫ్‌ స్టైల్‌ ఇండియా కంపెనీ ఆ కోట్లను మూన్‌కు పంపింది. దాని ఎండి బిపిన్‌ చౌహన్‌ ఒక వివరణ ఇచ్చారు. నెహ్రూ జాకెట్లు మెడను మూసివేస్తాయని, వాటిని సర్దార్‌ పటేల్‌ కూడా ధరించారని, కానీ మోడీ వెస్ట్‌ల పేరుతో తాము అమ్ముతున్నవి అలాగాక కాస్త పొడవుగా, సౌకర్యవంతంగా ఉంటాయని వివరణ ఇచ్చారు. ఇవి నెహ్రూ జాకెట్లు ఏమాత్రం కాదని, మోడీ అనేక భిన్నమైన రంగులకు ప్రాధాన్యత ఇస్తారు గనుక వీటిని మోడీ వెస్ట్‌లనే పిలవాలని అన్నారు.అంతే కాదు, గతంలో నెహ్రూ, పటేల్‌ ధరించిన కోట్లు ఎంతో నాణ్యమైన వస్త్రంతో రూపొందించి ప్రముఖులు మాత్రమే ధరించే వారని, అలాంటి వాటిని మోడీ సామాన్యులలో ఎంతో ప్రచారం కల్పించారని కూడా అన్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా మోడీ ప్రతిష్టకు మచ్చపడితే వివరణలకు కొదవ ఉంటుందా ? నెహ్రూ జాకెట్‌ అన్నా మోడీ వెస్ట్‌ అన్నా అర్ధం ఒకటే పొట్టి కోటు.


నెహ్రూ కోటు మాదిరి లాల్‌ బహదూర్‌ శాస్త్రి ధోవతి, ఇందిరాగాంధీ తేలికైన, సాదాసీదా చీరలు, జయలలిత షిఫాన్‌, నేత చీరల గురించి గతంలో చర్చలు జరిగాయి.నరేంద్రమోడీ పేదల గురించి పేద కబుర్లు చెప్పినా సందర్భానికి తగిన విధంగా ధరించే దుస్తులు ఎంతో ఖరీదైనవనే విమర్శల గురించి తెలిసిందే. భక్తులు వాటి గురించి ఒక్క మాట కూడా అననివ్వరు. కెమెరా కోసమే నరేంద్రమోడీ పుట్టారా లేక కెమెరాలను నరేంద్రమోడీ కోసమే రూపొందించారా అన్నట్లుగా కూడా ప్రచారం పొందిన అంశం తెలిసిందే. అడవిలోకి వెళ్లినపుడు వేటగాడిగా కనిపించిన మోడీ కేదారనాధ్‌ గుహలో ఒక కాషాయ సన్యాసిలా దర్శనమిచ్చినా, అవసరానికి తగిన దుస్తులను ధరించటంలో మోడీకి మరొకరు సాటి రారు అని అంగీకరించాల్సిందే. మోడీని చాయి వాలా అని చెప్పిన వారిని పదిలక్షల విలువగల సూట్‌, ఖరీదైన కళ్లజోళ్లు ధరించారేమిటి అంటే చాయి వాలా కూడా ఆ స్థాయికి ఎదగాలనే సందేశం అంతర్లీనంగా ఇమిడి ఉందని భక్తులు భాష్యం చెప్పటంతో ఎవరేమనుకున్నా నా తీరు మారదు అన్నట్లుగా మోడీ ఇంతవరకు రాజీపడిన దాఖాల్లేవు.


జయలలిత ఒకసారి కట్టిన చీరను మరోసారి కట్టలేదని, ఆమె దగ్గర పదివేలకు పైగా చీరలు ఉన్నట్లు చెబుతారు. నరేంద్రమోడీ కూడా అదే మాదిరి ఒకసారి వేసుకున్న దుస్తులను మరోసారి వేసుకోరని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌ 2016లో చెప్పిన సంగతి తెలిసిందే.మోడీ ధరించే దుస్తుల విలువ రెండు లక్షలని,రోజుకు ఐదుసార్లు మారుస్తారని అంటే రోజుకు పదిలక్షలు ఖర్చు చేస్తారని, మోడీ దుస్తులకు కోసం చేసే ఖర్చు కంటే తమ ప్రభుత్వ ప్రకటనల ఖర్చు రు.76కోట్లు చాలా తక్కువని కేజరీవాల్‌ చెప్పారు. భారత జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ ధరించిన టీ షర్టు విలువ రు.41వేలని బిజెపి విమర్శించింది. దాన్ని తిప్పికొడుతూ మోడీ సూట్‌ పదిలక్షలని, దాన్ని వేలం వేస్తే నాలుగుకోట్లు వచ్చినట్లు, మోడీ ధరించే కళ్లద్దాల వెల లక్షన్నర ఉంటుందని, వీటి గురించి చర్చిద్దామా అని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. నరేంద్రమోడీ తైవాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న రు.80వేల విలువగల పుట్టగొడుగులు తింటారని, ధరించే సూటు ధర ఎనిమిది నుంచి పదిలక్షల వరకు ఉంటుందని, రోజూ వైద్య పరీక్షలు చేయించుకుంటారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి వాస్తవాలను నిర్ధారించుకోగా సమాచార హక్కు చట్టం కింద మోడీ తన ఇంట్లో నెలకు ఎన్ని గాస్‌ సిలిండర్లు వాడతారు, కొనుగోలు చేసిన కూరగాయల బిల్లులు, దుస్తుల గురించి వివరాలు అడిగితే వాటికి మోడీ తన ఖర్చులను తానే భరిస్తారని, ప్రభుత్వానికి సంబంధం లేదు గనుక మోడీ వెల్లడిస్తే తప్ప వివరాలు లేవని ప్రధాని ఆఫీసు చెప్పినట్లు టైమ్స్‌ నౌ పేర్కొన్నది.


ఎవరినైతే మేము నమ్మామో అవసరం వచ్చినపుడు వారు మాతో నిలబడలేదని పాపువా న్యూగినియాలో ధనిక దేశాల గురించి ప్రధాని నరేంద్రమోడీ అన్నట్లు ఇండియా టుడే పేర్కొన్నది. భారత్‌, పద్నాలుగు దీవుల దేశాల సదస్సులో మోడీ మాట్లాడారు.నేడు ఇంథనం, ఆహారం, ఫార్మా, ఎరువుల సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నం కావటాన్ని చూస్తున్నాము. మాకు అవసరమైనపుడు మేము నమ్మిన వారు మాతో నిలబడలేదు, దీవుల దేశాలకు ఇబ్బందులు వచ్చినపుడు భారత్‌ బాసటగా నిలిచిందని మోడీ అన్నారు. పాపువా న్యూగినియా ప్రధాని జేమ్స్‌ మరాపే మాట్లాడుతూ ప్రపంచ అధికార క్రీడలో తాము బాధితులమని, మీరు పేద దేశాల నేత, ప్రపంచ వేదికల మీద మీ నాయకత్వం వెనుక నిలుస్తామని మోడీని ఉద్దేశించి అన్నాడు. మరి అలాంటి వారు ఆ ధనిక దేశాల ప్రాపకం కోసం ఎందుకు పాకులాడుతున్నట్లు ?


మన దేశం నుంచి గరిష్టంగా లబ్ది పొందేందుకు ఆస్ట్రేలియా చూసింది. సిడ్నీలోని హారిస్‌ పార్క్‌ పేరును లిటిల్‌ ఇండియాగా మారుస్తున్నట్లు ప్రధాని అల్బనీస్‌ భారత సంతతి వారితో జరిగిన సభలో ప్రకటించారు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు.గతంలోనే పేరు మార్పు ప్రతిపాదన వచ్చినపుడు కొన్ని అభ్యంతరాలు తలెత్తటంతో ఆగింది.మనల్ని ఉబ్బించేందుకు చూడటం తప్ప దీని వలన మన దేశానికి ఒరిగేదేమిటి ? హైదరాబాదులో లాలాగూడ పరిసరాలను లిటిల్‌ ఇంగ్లండ్‌ అని పిలుస్తారు, అలాగే ముషిరాబాద్‌లో బంగ్లాదేశ్‌ మార్కెట్‌ అని ఉంది. చైనా బజార్ల గురించి తెలిసిందే వాటివలన ఆ దేశాలకు ఒరిగేదేమీ లేదు. అవసరం కొద్దీ అధికారంలో ఉన్న వారు ఆహా ఓహౌ అంటూ నరేంద్రమోడీని పొగడినా ఆస్ట్రేలియాలో మోడీ ఉన్న సమయంలో పార్లమెంటు సభ్యులు నరేంద్రమోడీపై బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని పార్లమెంటు భవనంలో తిలకించారు. దాని గురించి చర్చలు జరిపారు. డాక్యుమెంటరీని మన దేశంలో అనధికారికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.మానవ హక్కుల కోసం పని చేసే హిందువుల సంస్థ,ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, పెరియార్‌ అంబేద్కర్‌ ఆలోచనల బృందం,హూమనిజం ప్రాజెక్టు,కేర్‌ తదితర సంస్థలు ఈ ప్రదర్శన, చర్చను ఏర్పాటు చేశాయి.నరేంద్రమోడీ తన భావజాలానికి అనుగుణంగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నట్లు, వాటిని నివారించాలని కోరటం ద్వారా హిందూత్వ వాదులను సంతుష్టీకరించేందుకు చూశారు.

రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఏ పదజాలం వెనుక ఏమి దాగుందో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ మాటలు పరమ సత్యాలు. అలాగే ఏ సమావేశం ఎందుకు జరిగిందో అని కూడా మనం అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఒకే సారి ఆసియాలో రెండు ముఖ్య సమావేశాలు జరిగాయి. ఒకటి ప్రపంచంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ శాంతి, అభివృద్ధికి ముప్పు తెస్తున్న అమెరికా నేతృత్వంలోని జి 7 సమావేశం 19-21 తేదీలలో జపాన్‌లోని హీరోషిమాలో జరిగింది. రెండవది చైనాలోని షియాన్‌ నగరంలో మే 18-19 తేదీలలో మధ్య ఆసియా దేశాల సదస్సు. మొదటిది రాజకీయాల చుట్టూ నడిస్తే రెండవది అభివృద్ధి కేంద్రంగా జరిగింది. చైనాతో విడగొట్టుకోకుండానే నష్టాలను పరిమితం చేసుకోవాలని ఈనెల జపాన్‌లోని హిరోషిమా నగరంలో జరిగిన జి 7 దేశాల శిఖరాగ్ర సమావేశం పిలుపునిచ్చింది. తన పాటకు అనుగుణంగా నృత్యం చేయించాలని ఈ బృందంతో సహా ప్రపంచదేశాలన్నింటి మీద అమెరికా వత్తిడి తెస్తున్నప్పటికీ దానికి కొన్ని దేశాలు సిద్దంగా లేవన్నది ఈ ప్రకటనలో అంతర్లీనంగా ఉన్న సందేశం. అయితే పదజాలం దానికి చెప్పే భాష్యాలు ఎలా ఉన్నప్పటికీ సమావేశం జరిగిన తీరు, ఆమోదించిన ప్రకటన చూస్తే చైనా చుట్టూ తిప్పి దాన్ని ఎలా దెబ్బతీయాలన్న దాని మీదే కేంద్రీకరించారన్న విశ్లేషణలు వెలువడ్డాయి.


అమెరికా కోరుతున్నట్లుగా చైనాతో విడగొట్టుకొనేందుకు జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి కొన్ని దేశాలు సిద్దంగా లేవు. ఈ కారణంగానే ఆర్థిక అంశాల్లో బస్తీమే సవాల్‌ అంటూ చైనా మీద తొడగొట్టకుండా అటు అమెరికాను, ఇటు ఇతర దేశాలను సంతుష్టీకరించే విధంగా ఈ పిలుపు ఉంది. ఆర్థికంగా చైనా ఇతర దేశాలను బలాత్కారం చేస్తోందన్న ఆరోపణలను ఇటీవలి కాలంలో అనేక దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.హిరోషిమా సమావేశాలు కూడా దాని చుట్టూ తిరిగాయి గానీ బహిరంగంగా వేలెత్తి చూపేందుకు ఎవరూ ముందుకు రాలేదు.చైనా నుంచి చేసుకొనే దిగుమతులను తగ్గించుకొని ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు.చైనా నుంచి విడగొట్టుకోవటం ఇప్పటల్లో జరిగేది కాదని తెలుసు గనుకనే ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు చూస్తుంది తప్ప చైనా ఆర్థిక ప్రగతి, అభివృద్ధిని అడ్డుకోవటం తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చుకొనేందుకు చూశాయి. దశాబ్దాల తరబడి పక్షవాత రోగి మాదిరిగా ఉన్న జపాన్‌కు చైనాతో వాణిజ్య సంబంధాలు ఎంతో అవసరం. గత సంవత్సరం జపాన్‌ చైనాకు 189 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు, 145బి.డాలర్ల దిగుమతులు చేసుకుంది. నష్టాలను తగ్గించుకోవటం అంటే అవసరమైన వస్తువుల కోసం ఒక దేశం మీద ఆధారపడకుండా చూసుకోవాలన్నది అమెరికా వైఖరి అని జో బైడెన్‌ చెప్పాడు. చైనాలో పెట్టుబడులతో ముప్పు కూడా ఉంటుందని తెలిసినప్పటికీ తాము పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ చెప్పాడు.


చైనాతో సంబంధాలను విడగొట్టుకోవాలని జి 7 కోరుకోవటం లేదు, ఎందుకంటే అది ఎంతో కష్టం,ఇబ్బందులను కూడా తెస్తుంది, సాధ్యం కూడా కాదు అని కునీహికో మియాకే అనే విశ్లేషకుడు చెప్పాడు. అందుకే సమావేశ ప్రకటనలో విడగొట్టుకోవటం అనే పదం బదులు ముప్పు తగ్గించుకోవటం అని చెప్పారని అన్నాడు. జి 7 సమావేశం చైనా వ్యతిరేక (వర్క్‌షాప్‌) కసరత్తు అని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వర్ణించింది.2021 నుంచి జి 7 సమావేశాల ప్రకటనలు క్రమంగా ట్రాఫిక్‌ సిగల్‌ మాదిరి మారుతూ చైనాను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, ఆ బృందం పూర్తి పేరు ఏడు పారిశ్రామిక శక్తి దేశాల బృందం అనీ, ఆర్థికంగా చేసేదేమీ లేక ఇప్పుడది ఒక చిన్న వర్క్‌షాప్‌గా పని చేస్తూ చైనా వ్యతిరేక నకిలీ ఉత్పత్తుల సామూహిక ఉత్పత్తి మీద కేంద్రీకరిస్తోందని గ్లోబల్‌టైమ్స్‌ ఎద్దేవా చేసింది. తాజా ప్రకటనలో తైవాన్‌,తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్‌, షింజియాంగ్‌, చైనా అణుశక్తి అంటూ ఇరవైసార్లు చైనా పేరును పలవరించినట్లు పేర్కొన్నది. దీనికి తోడు చైనా ఆర్థిక బలత్కారాన్ని కూడా చేర్చినట్లు పేర్కొన్నది. శిబిరాల మధ ఘర్షణలను కోరుతూ ఈ బృందం ప్రపంచ శాంతి, అభివృద్ధికి అతి పెద్ద ముప్పులలో ఒకటిగా మారినట్లు స్పష్టం చేసింది.


ఆర్థిక అంశాలకు సంబంధించి సమావేశ ప్రకటనలో మాటల గారడీ చేసినా రాజకీయాలకు వస్తే చైనా మీద దూకుడుగానే ఉన్నారు. దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ ఆర్థిక నియమావళిని తిరిగి రాసేందుకు పూనుకుందని ఆరోపించాయి. సిడ్నీలో జరగాల్సిన చతుష్టయ(క్వాడ్‌) సమావేశాలు రద్దు కావటంతో పరువు దక్కించుకొనేందుకు హిరోషిమాకు వచ్చిన అమెరికా,ఆస్ట్రేలియా,జపాన్‌, భారతదేశ నేతలు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌ అధినేత జెలెనెస్కీని ఆహ్వానించి జి7 సభ్యదేశాలన్నీ అతని వెనుక నిలిచాయి.సాయాన్ని పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలను చూసినపుడు ఈ సమావేశం చైనా, రష్యాల మీద కేంద్రీకరించినట్లు చెప్పకనే చెప్పింది. ఈ ప్రకటనలు చేస్తుండగానే దీర్ఘకాలంగా పోరు సాగుతున్న బఖుమత్‌ పట్టణాన్ని రష్యా తన అదుపులోకి తెచ్చుకొని ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న దేశాల పప్పులు ఉడకవనే సందేశాన్ని పంపింది. గత సమావేశాలు లేదా ఇతర శిఖరాగ్ర సమావేశాలకు భిన్నంగా హిరోషిమా సభ ఒక రోజు ముందుగానే సమావేశ ప్రకటనను విడుదల చేసింది. మీడియాలో జెలెనెస్కీకి ప్రాధాన్యత ఇచ్చి ఈప్రకటనను పక్కన పడవేస్తారన్న కారణంగా ముందుగానే విడుదల చేసినట్లు కొందరు చెప్పారు. నిజానికి గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అన్నట్లుగా సమావేశం చేసే ప్రకటనలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా చైనా మీద కేంద్రీకరించటం తప్ప కొత్తగా చెప్పేదేమీ ఉండదని ముందుగా ఊహించిందే. దానికోసం ప్రకటన దాకా ఆగాల్సిన అవసరం కూడా లేదు.చైనా మీద వత్తిడి స్వరాన్ని పెంచినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం, సహకరించుకోవటం లక్ష్యంగా ఏర్పడిన జి7 ఇటీవలి కాలంలో దాని కంటే ప్రపంచ రాజకీయాల మీదనే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నది. ఐదు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ కూటమిలోని దేశాలు నాడు ప్రపంచ జీడిపిలో 70శాతం కలిగి ఉన్నాయి. ఇప్పుడు దాని విలువ నలభైశాతానికి అటూ ఇటూగా ఉంది.


అసలు జి 7 ఎలా ఉనికిలోకి వచ్చిందీ క్లుప్తంగా చూద్దాం. అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం.అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1998లో రష్యా చేరి జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలపుడు ఎవరు దేశాల అధిపతిగా ఉంటే వారు ప్రతినిధిగా హాజరవుతారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు.తమ దేశంలో జరిగే సమావేశాలకు ఇతర దేశాలను ఆహ్వానించే స్వేచ్చ ఆ దేశానికి ఉంటుంది. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. శిఖరాగ్ర సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఇప్పటి వరకు గత తొమ్మిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. మన దేశం ఆహ్వానం అందుకోవటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు. ఆహ్వానాలు అందుకున్న తొమ్మిది దేశాలలో మనది కూడా ఒకటి తప్ప ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇలా పాల్గన్నదేశాల అధినేతలు విడి విడిగా ఇతర దేశాల నేతలను కలుసుకోవటం, వేదిక మీద ధర్మోపన్యాసాలు చేయటం తప్ప బృంద నిర్ణయాలతో ఎలాంటి ప్రమేయం ఉండదు. ఈ ఏడాది అతిధులుగా ఆస్ట్రేలియా,బ్రెజిల్‌, కామెరూస్‌,కూక్‌ ఐలాండ్స్‌, భారత్‌, ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్‌, వియత్నాం అధినేతలను ఆహ్వానించారు. పసిఫిక్‌ సముద్రంలో కేవలం 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పదిహేను దీవుల సముదాయం 15,040 మంది జనాభా ఉన్న ఈ దేశ అధినేతకు ప్రపంచంలో పెద్దదైన భారత అధినేతల మర్యాదలు ఒకే విధంగా ఉంటాయి. పసిఫిక్‌ దీవుల్లో ఉన్న చిన్న దేశాలకు ఏర్పడిన ప్రాధాన్యాత కారణంగానే కూక్‌ ఐలాండ్స్‌కు ఆహ్వానం పలికారన్నది స్పష్టం.


ఒక దశలో ట్రంప్‌ ఏలుబడిలో తిరిగి రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.తరువాత అది ముందుకు పోలేదు. దాని వలన చేరే దేశాలకు జరిగే మేలేమీ కనిపించకపోవటం ఒక కారణం అని చెప్పవచ్చు.అన్నింటికీ మించి అమెరికా అజెండాను ముందుకు తీసుకువెళ్లే ఒక వాహనంగా అది మారింది. ధనిక దేశాల బృందం తన పూర్వపు ఆర్థిక శక్తిని తిరిగి తెచ్చుకొనేందుకు చూపుతున్న శ్రద్ద కంటే ఇటీవలి కాలంలో చైనా వ్యతిరేక స్వరాన్ని పెంచుతున్నారంటే దాని అర్ధం ఈ బృందం అమెరికా విదేశాంగ విధాన ప్రయోజనాలకు తోడ్పడటం తప్ప వేరు కాదు. చైనా ఆర్థిక బలాత్కారం అనే ఆరోపణ ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారంలో పెట్టారు. తన వస్తువులను కొనుగోలు చేయాలంటూ ఏ దేశాన్నైనా వత్తిడి చేసిన దాఖలాలు లేవు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ రుణాల ద్వారా అలాంటి పనిచేసిన, ఇప్పటికీ చేస్తున్నది వాటి మీద పెత్తనం చేస్తున్న ధనిక దేశాలన్నది బహిరంగ రహస్యం. తమకు లంగని లేదా రాజకీయంగా వ్యతిరేకించే దేశాల మీద ఆర్థిక, వాణిజ్య అంశాలను ఆయుధాలుగా మారుస్తున్నది పశ్చిమ దేశాలు. లడఖ్‌ సరిహద్దు వివాదం తరువాత మన దేశంలోని సంఘపరివార్‌, ఇతర చైనా వ్యతిరేక శక్తులు చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చేసిన హడావుడి గురించి తెలిసిందే. ఊహలు, వాంఛలను బట్టి ప్రపంచం నడవదు. నరేంద్రమోడీ సర్కార్‌ గత రికార్డులను బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులను భారీగా పెంచింది. మరోవైపు చైనా నుంచి విడగొట్టుకోవాలన్నదేశాలతో యుగళగీతం ఆలపిస్తున్నారు.


షియాన్‌ నగరంలో చైనా, ఆరు మధ్య ఆసియా దేశాల సదస్సు రాజకీయాలతో నిమిత్తం లేకుండా అభివృద్ది అజండాతో జరిగింది. పలు ఒప్పందాలను చేసుకున్నారు.అమెరికా, ఐరోపా, మన దేశంతో చైనా జరుపుతున్న వాణిజ్యలావాదేవీల మాదిరే ఈ దేశాలతో కూడా జరుపుతున్నది. పరస్పర అంగీకారంతో పెట్టుబడులు పెడుతున్నది.కొందరు విశ్లేషకులు ఈ సమావేశాన్ని తన పలుకుబడిని పెంచుకొనేందుకు చైనా చేసిన కసరత్తుగా ఆరోపించుతున్నారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట అమెరికా అభివృద్ది పేరుతో పాగా వేసేందుకు, రక్షణ పేరుతో తన విష కౌగిలిలో బంధించేందుకు చూస్తున్నది తెలిసిందే. అలాంటిది చైనా తన పొరుగున ఉన్నదేశాల ఆర్థిక వృద్ధికి తోడ్పడితే దాన్ని విస్తరణ కాంక్షగా వర్ణించటం అర్ధం లేదు. మన దేశం పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌లకు చేస్తున్న సాయాన్ని విస్తరణ కాంక్షలో భాగంగా చేస్తున్నామా ?

నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !

Tags

, , ,


ఎం.కోటేశ్వరరావు


ఎవరమైనా ఏదో ఒక నాటికి పోవాల్సిన వాళ్లమే. ఒకరు ముందు ఇంకొకరు వెనుక అంతే తేడా ! అన్న శ్మశాన వైరాగ్యం గురించి అందరికీ తెలిసిందే. అమూల్‌ పాల కంపెనీ గుజరాత్‌ ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వాలు చేయాల్సింది పాలన తప్ప పాలు, నీళ్లు,చింతపండు, ఉల్లిపాయల వంటి వాటిని అమ్మటం కాదు. కనుక గతంలో ఏం జరిగినా ప్రభుత్వ రంగంలో ఉన్న వీటికి సంబంధించిన సంస్థలన్నింటినీ అమ్మి సొమ్ము చేసుకోవాలన్నది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ విధానం. అఫ్‌ కోర్స్‌ ఇది, కాంగ్రెస్‌ విధానమే, కాకపోతే తాను జన్మించింది దాని కోసమే అన్నట్లుగా దాన్నే మరింత భక్తి శ్రద్దలతో మోడీ అమలు జరుపుతున్నారు. అందువలన అన్నింటినీ తెగనమ్మిన తరువాత అమూల్‌ను కూడా అమ్మకుండా మరోసారి అధికారం అప్పగిస్తే నరేంద్రమోడీ లేదా వారసులు ఊరుకుంటారా ? ఒకసారి అపని జరిగాక విదేశాల నుంచి చౌకగా దొరికే పాలు, పాలపదార్ధాలను మన మీద రుద్దుతారు. పాలతో కొంత రాబడి కోసం ఆవులు, గేదెలను మేపే రైతుల నోట్లో అప్పుడు మట్టే. కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్‌కు మార్కెట్‌ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే జనాలకు రోజుకు అరలీటరు పాలు సరఫరా చేస్తామని బిజెపి నమ్మబలికింది. మీ పాల సంగతి తరువాత అంటూ ఆ బిజెపిని పాల రైతులు కావేరీ, కృష్ణ నీళ్లలో ముంచి గుణపాఠం చెప్పారు.


అమూల్‌ పేరు చెబితే లేదా దాని మార్కెటింగ్‌ అవకాశాలు పెంచితే నరేంద్రమోడీ దృష్టిలో పడి ప్రశంసలు పొందవచ్చని బిజెపి నేతలు భావించి అందుకు తెగించినట్లు చెప్పవచ్చు. గతేడాది డిసెంబరులో పాల రైతులు ఎక్కువగా ఉన్న మాండ్య జిల్లా కేంద్రంలో జరిపిన సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా పాల వివాదానికి తెరతీశారు.పాల రైతుల సంక్షేమానికి కర్ణాటక నందిని, గుజరాత్‌ అమూల్‌ పాల సంస్థలు కలసి పని చేయాలని చెప్పారు. ప్రభుత్వ రంగ పాల కంపెనీలన్నీ సమన్వయంతో పని చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి ఉంటే అదొక తీరు. కేవలం అమూల్‌ పేరే చెప్పటంతో నందిని పాలు కనుమరుగుకానున్నాయనే అనుమానం కర్ణాటక రైతుల్లో తలెత్తింది. అదేమీ కాదని 40శాతం కమిషన్‌ సిఎం బొమ్మై మొదలు ఎందరు బిజెపి పెద్దలు సంజాయిషీ ఇచ్చుకున్నా రైతులు నమ్మలేదు. అవకాశం కోసం ఎదురు చూశారు. చేయాల్సింది చేశారు. బెళగావి, హసన్‌, తుంకూరు, మైసూరు, మాండ్య జిల్లాలు పాల ఉత్పత్తికి ప్రసిద్ది. ఈ ఐదు జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్‌ 33 గెలుచుకుంది. గతంలో పదకొండు ఉన్నాయి. బిజెపి బలం 21 నుంచి 12కు తగ్గింది. జెడిఎస్‌ కూడా సీట్లను పొగొట్టుకుంది. గతంలో జరిగిన సర్వే ప్రకారం దేశంలోని 20 రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిలో 9వ స్థానంలో ఉంది. గుజరాత్‌ తరువాత పాలను సహకార సంస్థలకు ఎక్కువగా అమ్మే రాష్ట్రంగా కర్ణాటక ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గతం కంటే ఏడుశాతం ఓట్లను అదనంగా పొందింది. రాష్ట్రమంతటా బిజెపి మద్దతుదారులుగా ఉన్న లింగాయత్‌ సామాజిక తరగతి ఓటర్లలో వచ్చిన మార్పు కూడా దీనికి దోహదం చేసింది.


జనాలకు పాలు సరఫరా చేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. ఇతరులకు శుద్దులు చెప్పిందని తప్ప నిజానికి దానిలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అది ఉచితం కాదు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పాల రైతులకు లబ్ది చేకూర్చేందుకు, మార్కెట్‌ను పెంచేందుకు అని బిజెపి నేతలు టీవీ చర్చల్లో సమర్ధించుకున్నారు. అదే పని గత మూడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండగా కర్ణాటక బిజెపి గానీ, గుజరాత్‌తో సహా ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో గానీ ఎందుకు అమలు జరపటం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. కర్ణాటక ఎన్నికల ప్రచారం మొదలైనపుడే ఏప్రిల్‌ నాలుగవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన ఒక వార్త ప్రకారం గత దశాబ్ది కాలంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది కాలంలోనే 15శాతం పాలధరలు పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దోహదం చేసింది. దాంతో ధరల తగ్గించే పేరుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పాలు, పాల ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను రద్దు చేసింది. ఇది పాల వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించినా అదే విధానాన్ని కొనసాగిస్తే మన పాడి పరిశ్రమ మూతపడుతుంది. డాలర్లు చెల్లించి చమురుతో పాటు పాలు, పెరుగు కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. రైతులకు తగిన గిట్టుబాటు ధర రాకపోతే పాడి తగ్గుతుంది. ధర పెరిగితే పోషకాహారం కొనుగోలూ తగ్గుతుంది. మాంసం కోసం ఆవులను వధించారని ఆరోపిస్తూ మూక దాడులు చేసి ప్రాణాలు తీసేందుకు వెనుకాడని గో వంశ రక్షక, గో రక్షక దళాలను చూశాము. ఈ కాషాయ దళాలు మేతలేక కృశించే, రోగాలతో మరణించే ఆవుల సంరక్షణ గురించి మాట్లాడవు. పాలు ఇవ్వని వాటిని, మేపలేక ఎవరైనా వధశాలలకు అమ్ముకోవటానికి వీల్లేకుండా చేశారు. రోడ్ల మీద వదలివేస్తే కొత్త సమస్యలను ముందుకు తెచ్చాయి. మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ఆవులకు సోకిన లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు లేవు. దాంతో 2022లోనే కనీసం మూడులక్షల ఆవులు మరణించటం లేదా ఈ రోగం కారణంగా వట్టిపోయినట్లు అంచనా. ఈ కారణంగా పాల ఉత్పత్తి తగ్గటంతో పాటు రైతాంగానికి ఆర్థికంగా విపరీత నష్టం వాటిల్లింది. ఆవు రాజకీయాలు చేసే వారికి ఇదేమీ పట్టలేదు.


ప్రపంచంలో అధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అవసరాలు-ఉత్పత్తికి జత కుదరటం లేదు. ఉత్పత్తి పెరుగుదల దిగజారింది. జాతీయపాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ సమాచారం మేరకు 2022-23లో మన దేశం 477 కోట్ల డాలర్ల విలువ గల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇది వెయ్యి శాతం ఎక్కువ. ప్రపంచంలో పెరిగిన నెయ్యి గిరాకీ కారణంగా మన దేశం గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు కాలంలో 47 కోట్ల డాలర్ల విలువగల ఎగుమతులు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గొప్పలు చెప్పుకొనేందుకు 19.45శాతం ఎక్కువే, కానీ భారీగా పెరిగిన దిగుమతుల మాటేమిటి ? దేశంలో నిల్వల పరిస్థితిని బట్టి పాలపొడి, వెన్న, నెయ్యితో సహా ఇతర పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు దిగుమతి పన్నులను సులభతరం చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగవచ్చని కేంద్ర పశుసంవర్థకశాఖ అధికారి రాజేష్‌ కుమార్‌ ఏప్రిల్‌ 5న చెప్పారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పాల ఉత్పత్తి ఒక్క శాతమే పెరిగింది. గత దశాబ్దికాలంలో వార్షిక సగటు 5.6శాతం ఉంది. ఈ ఏడాది పాల ఉత్పత్తుల డిమాండ్‌ ఏడుశాతం పెరగవచ్చని అంచనా.గోధుమ గడ్డి, ఇతర మేత లభ్యత తగ్గిన కారణంగా వాటి టోకు ధరలు ఏడాది కాలంలో 25శాతం పెరిగింది. మార్కెట్లో ఆవులు తగ్గిన కారణంగా గేదెల ధరలు బాగా పెరిగాయి.


ఇక కన్నడిగుల ఆరోగ్యం కోసం పాల సరఫరా వాగ్దానం చేసినట్లు వాదిస్తున్న బిజెపి నేతలను జనం నిలదీయాల్సి ఉంది. దేశమంతటా తమదే పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి జన ఆరోగ్యం గురించి పట్టించుకున్న తీరును ఒక్కసారి చూద్దాం. అజాగళ స్థనం వంటి నీతిఅయోగ్‌(ఎందుకంటే అది సూచించిన మేరకు కేంద్రం నిధులు ఇవ్వదు, కానీ కాగితాల మీద సిఫార్సులు మాత్రం అందంగా కనిపిస్తుంటాయి) నివేదికలను రూపొందించేందుకు మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ బాంకు, అది కలసి 2021 డిసెంబరులో మన దేశంలోని రాష్ట్రాల ఆరోగ్య సూచికలను విడుదల చేసింది.2019-20లో మొత్తంగా పందొమ్మిది పెద్ద రాష్ట్రాల పనితీరును మదింపు చేస్తూ రాంకులు ఇచ్చారు.దానిలో 82.2 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది. దేశానికి నమూనాగా చెబుతూ ఆ విధానాన్ని దేశమంతటా అమలు జరుపుతామని మోడీ 2014లో చెప్పిన గుజరాత్‌ 63.59 మార్కులతో ఆరవ స్థానంలో ఉంది. అది రెండింజన్ల పాలనలో కూడా ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇక యోగి ఆదిత్యనాధ్‌ పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ 30.57 మార్కులతో 19వ(చివరి) స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 36.72తో దిగువ నుంచి మూడవ స్థానం, చాలాకాలం బిజెపి ఏలుబడిలో ఉన్న బీహార్‌ 31మార్కులతో ఉత్తర ప్రదేశ్‌ కంటే ఎగువున ఉంది. అక్కడ ఎక్కడా జనాలకు బిజెపి పాల వాగ్దానం చేయలేదు. దీని గురించి ఒక చర్చలో బిజెపి ప్రతినిధి చెప్పిన హాస్యాస్పద కారణం ఏమింటే యోగి ఆదిత్యనాధ్‌ శాంతి భద్రతల మీద కేంద్రీకరిస్తున్నందున పాల గురించి పట్టించుకోలేదట. దానికీ దీనికి సంబంధం ఏమిటి, ఇతర పధకాలన్నింటినీ పక్కన పెట్టారా ? పోనీ గుజరాత్‌, ఎంపీ సంగతేమిటి ? రక్తహీనత తల్లీ,పిల్లల మరణాలకు దారి తీస్తోంది. రక్తహీనత ముక్త భారత్‌ అంటూ కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రకటించిన పధకం తీరుతెన్నుల గురించి 2022 ఫిబ్రవరి నాలుగున ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం జనాభాను ఆరు తరగతులుగా విభజించి 2019-20 సంవత్సరంలో నిర్వహించిన ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం ఎవరిలో ఎంతశాతం రక్తహీనత ఉందో పేర్కొన్నారు. 19-49 సంవత్సరాల పురుషుల్లో 25, మహిళల్లో 57, గర్భవతుల్లో 52.2శాతం చొప్పున ఉంది. ఇక 15-19 సంవత్సరాల తరగతి బాలురలో 31.1, బాలికల్లో 59.1 శాతం ఐదేండ్లలోపు పిల్లల్లో 67.1 శాతం ఉంది. ఇవి దేశ సగటు అంకెలు. పిల్లలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో 66.4, మహారాష్ట్రలో 68.9, బీహార్‌లో 69.4 హర్యానాలో 70.4, రాజస్తాన్‌లో 71.5, కాశ్మీరు, మధ్యప్రదేశ్‌లో 72.7, గుజరాత్‌లో79.7,లడఖ్‌లో 92.5 శాతాల చొప్పున రక్తహీనత ఉంది. ఇక్కడంతా బిజెపి ఏలుబడే సాగింది, సాగుతోంది. అక్కడెక్కడా లేని పాల ఊసు కర్ణాటకలో ఎందుకు తెచ్చారంటే అమూల్‌ కోసం నందిని బలిపెడుతున్నారని రైతాంగం భావించటం తప్ప జనం మీద శ్రద్దకాదంటే ఏమంటారు ? దేశ పాడి పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్లను కేంద్రం పట్టించుకుంటుందా ? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రైవేటు డైరీలకు పెద్ద పీట వేస్తున్నారు. రేపు దిగుమతులకూ అంగీకరిస్తే మన రైతుల గతేంగాను ?


ప్రపంచంలో పాల రైతులు రెండు తరగతులుగా ఉన్నారు. ఒకటి ఎగుమతుల కోసం పాడిని అమ్ముకొని లాభాలు పొందే వారు, రెండవది జీవనోపాధికోసం పాడిని నమ్ముకొని బతికేవారు. రెండవ తరగతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని ఐరోపా దేశాలు పాడిని అమ్ముకొనేవి కాగా మన దేశం వంటి కొన్ని దేశాలు రెండవ తరగతిలో ఉన్నాయి. మన పాడి పరిశ్రమలోని రైతులు నిలదొక్కుకొనేందుకు జీవన పోరాటం చేస్తుండగా వారిని పడగొట్టి తమ ఉత్పత్తులను మన దేశంలో గుమ్మరించాలని పైన పేర్కొన్న దేశాలు చూస్తున్నాయి. మనది జీవనోపాధి, వారిది లాభాల వేట.ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి వచ్చిన తరువాత మన మీద వత్తిడి పెరుగుతోంది. ఎగుమతులు చేస్తున్న దేశాలలో 2022లో న్యూజిలాండ్‌ 1,353 కోట్ల డాలర్ల మేర, అమెరికా 950, ఆస్ట్రేలియా(2021) 220, కెనడా 50, మన దేశం 2022లో 40 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు చేసింది. ఆస్ట్రేలియా తన పాల ఉత్పత్తులకు మార్కెట్‌ తెరవాలని మన మీద వత్తిడి తెస్తున్నది. భారత్‌లో ఉత్పత్తిగాని ఆహార ఉత్పత్తులను మాత్రమే అక్కడి నుంచి దిగుమతులకు అనుమతిస్తామని చెబుతున్న మన ప్రభుత్వం ఆ వైఖరికి ఎంతకాలం కట్టుబడి ఉంటుందో చూడాల్సి ఉంది. అమెరికా వత్తిడి కూడా తక్కువగా లేదు. న్యూజిలాండ్‌ ఉత్పత్తిలో 95శాతం ఎగుమతులకే ఉంటోంది. అమెరికా పెద్ద ఎత్తున ఎగుమతిదార్లకు సబ్సిడీ ఇచ్చి తన ఉత్పత్తులకు మార్కెట్‌ కోసం చూస్తున్నది.

పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిస్టు విప్లవం గురించి పాలక వర్గాలను భయపడనివ్వండి. కార్మికవర్గానికి వారి సంకెళ్లు తప్ప పోయేదేమీ లేదు.వారు గెలుచుకొనేందుకు తమదైన ప్రపంచం ఉంది. అన్ని దేశాల కార్మికులూ ఐక్యం కండి అన్న పిలుపు గురించి తెలిసిందే. సరిగ్గా 175 సంవత్సరాల క్రితం 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ముద్రితమైన కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రాశారు.పైకి ఎవరెన్ని చెప్పినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇప్పటికీ ఆ ప్రణాళిక పాలకవర్గాలను భయపెడుతూనే ఉంది. ఫిబ్రవరి 21 రెడ్‌ బుక్స్‌ డే రోజున ప్రపంచమంతటా కార్మికవర్గం దాన్ని పఠించింది. ప్రపంచ చరిత్రలో ఏ గ్రంధాన్ని ఇలా చదివి, చర్చించి ఉండరు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురణకు ముందు ప్రజాస్వామ్యం, విముక్తి కోసం అనేక పోరాటాలు, విప్లవాలు జరిగాయి. అప్పటివరకు జరిగింది ఒక ఎత్తుకాగా వాటికి ఒక దశ, దిశ నిర్దేశం చేస్తూ నిర్దిష్ట కార్యాచరణకు నాంది పలికింది కమ్యూనిస్టు ప్రణాళిక.అమెరికాలోని సెంటినల్‌ రికార్డ్‌ అనే వెబ్‌ పత్రిక మే ఎనిమిదవ తేదీన కమ్యూనిజం విజయం అనే శీర్షికతో బ్రాడ్లే గిట్జ్‌ అనే విశ్లేషకుడు రాసిన అంశాన్ని ప్రచురించింది. అదేమీ సానుకూల వైఖరితో చేసిన పరిశీలన కాదు. పేరులో ఏమున్నది పెన్నిధి అన్నట్లుగా పదాలను, వాటికి అర్ధాలను ఎటుతిప్పి ఎటు చెప్పినా చివరికి కమూనిస్ట్యులు చెప్పిన దాన్నే చెబుతున్నారుగా అని ఉక్రోషంతో పెట్టిన శీర్షిక అనిపించింది. భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) అని బైడెన్‌ ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల్లో ఏమి బోధించినప్పటికీ వెనుక ద్వారం నుంచి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రవేశపెట్టినట్లే.సమానత్వం అన్నది న్యాయం నుంచి పుట్టిందే. గత రెండువందల సంవత్సరాలు అంతకు ముందు నుంచి అమెరికాలో చెబుతున్న హక్కుల సమానత్వానికి కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, ఇతర కమ్యూనిస్టు సిద్దాంతవేత్తలు చెప్పిన పర్యవసానం లేదా ఫలితాల సమానత్వానికి వైరుధ్యం ఉంది. అని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు.


మన దేశంలో దున్నేవాడికే భూమి అన్న నినాదం ఇచ్చారు కమ్యూనిస్టులు. దున్నగలిగేవాడికే భూమి అన్నది తమ వైఖరని భూసమస్య ప్రధాన చర్చగా ఉన్నపుడు బిజెపి నేతలు చేప్పేవారు. సోషలిజం, తరువాత కమ్యూనిజం తమ అంతిమ లక్ష్యమని కమ్యూస్టులు చెప్పే సంగతి తెలిసిందే.జనం ఈ నినాదాల పట్ల ఆకర్షితులవటాన్ని గమనించి తామే సోషలిజాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆవడి ఏఐసిసి సమావేశంలో తీర్మానించింది.బిజెపి కూడా ఆ నినాద ప్రభావాన్ని తప్పించుకోలేక తాము గాంధేయ సోషలిజం తెస్తామని చెప్పింది.అదే మాదిరి భూ పోరాటాలు అవసరం లేకుండా భూ సంస్కరణలను తామే అమలు జరుపుతామని,భూమిని పంచుతామని కాంగ్రెస్‌ బూటకపు సంస్కరణలకు తెరతీసింది. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవి భూ సమస్య గురించి మాట్లాడటం లేదు. సోషలిస్టు నినాదం జనాన్ని ఆకర్షించిన కారణంగానే ఐరోపాలోని పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షేమ పధకాలు, సబ్సిడీల వంటి చర్యలతో అక్కడి పాలకవర్గాలు కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు చూశారు. తరువాత అనేక దేశాల్లో వాటిని అమలు జరపాల్సి వచ్చింది.చివరికి నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం కూడా అలాంటిదే. అసమానతలు పెరిగి జనజీవనం దిగజారుతున్న క్రమంలో మంచి రోజులు తెస్తానంటే తప్ప బిజెపి చెప్పే మత సిద్దాంతాలకు ఓట్లు రాలవని తెలిసే జనాన్ని వంచించేందుకు ఇలాంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. రాజకీయాలకు తోడు జనాన్ని చీల్చేందుకు, మత్తులో ముంచి వర్గ దృక్పధం వైపు చూడకుండా చూసేందుకు మతాన్ని ముందుకు తెస్తున్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక, సిద్దాంతాల మీద గందరగోళం సృష్టించే, తప్పుదారి పట్టించే ఎత్తుగడలతో నిరంతరం వక్రీకరణ దాడి జరుగుతూనే ఉంది.


కమ్యూనిజం గురించి ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు, విద్వేషాన్ని రెచ్చగొట్టినా జనజీవితాలు దుర్భరం అవుతున్నపుడు ప్రత్యామ్నాయాల గురించి జనం ఆలోచిస్తారు. అమెరికాలో, ఐరోపాలో,ఇతర చోట్ల ఇప్పుడు జరుగుతోంది అదే. గతంలో కమ్యూనిజం వైఫల్యగురించి చర్చకు తెరతీస్తే సోషలిజం అంతరించింది అని చెప్పిన చోట జనం పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. ముందే చెప్పుకున్నట్లు 175 ఏండ్ల నుంచి కమ్యూనిస్టు ప్రణాళిక దోపిడీ వర్గాన్ని భయకంపితం గావిస్తుంటే ఇప్పుడు పెట్టుబడిదారీ విధాన వైఫల్యంపై చర్చ కూడా దానికి తోడైంది. దాన్ని పక్కదారి పట్టించేందుకే మేము కూడా మీ గురించి ఆలోచిస్తున్నామని కార్మికవర్గానికి చెప్పేందుకు భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) భావనలను ముందుకు తెస్తున్నారు. అమెరికాలోని అనేక నగరాల్లో తమకు సరైనదారి చూపేది పురోగామి శక్తులే అనే భావం బలపడుతోంది. మూడో పెద్ద నగరమైన చికాగో నగరంలో మితవాదులను పక్కకు పెట్టి పురోగామి వాదులను నగరపాలక సంస్థకు ఎన్నుకోవటం దాన్నే సూచిస్తోంది.


అమెరికాలో న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ తరువాత మూడో పెద్ద నగరమైన చికాగో మేయర్‌గా పురోగామివాది బ్రాండన్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ నాలుగవ తేదీన ఎన్నికయ్యాడు. చికాగో టీచర్స్‌ యూనియన్‌, కార్మిక నేతగా పని చేస్తున్నారు.మే పదిహేనవ తేదీన ప్రమాణ స్వీకారం చేశాడు. యాభై మంది కౌన్సిలర్లలో నగర చరిత్రలో పురోగామి వాదులు ఎక్కువగా ఎన్నికైన సందర్భమిదే. నిబంధనల ప్రకారం నగర పోలీసు కమిషనర్‌ పదవికి నగరంలోని 22 పోలీసు డివిజన్ల నుంచి వివిధ సామాజిక తరగతుల సమూహాల నుంచి ఎన్నికైన 60 మంది కమిటి ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి సిఫార్సు చేస్తే వారిలో ఒకరిని మేయర్‌ ఎంపిక చేస్తారు. పోలీసు విభాగాన్ని కూడా ప్రజాస్వామ్యపద్దతుల్లో పనిచేసేట్లు చూస్తున్నారు. వచ్చే ఏడాది పాఠశాలల కమిటీలను కూడా ఎన్నికల ద్వారా నింపుతారు.ప్రజా ఉద్యమాల ప్రభావం, ప్రజానుకూల రాజకీయాలు, ఎన్నికల పట్ల పౌరుల ఉత్సాహంతో చికాగో నగరం మరింత ప్రజాస్వామిక వాతావరణంలో పురోగమించనుంది. ఇటీవలి కాలంలో అనేక నగరాలలో పురోగామి శక్తులు మేయర్లుగా ఎన్నిక అవుతున్నారు. వారంతా ప్రజా ఉద్యమాలలో పని చేసి ప్రజాదరణ పొందిన వారే.చికాగోలో గతంలో అధికారంలో ఉన్న వారు అనుసరించిన విధానాల ఫలితంగా ధనికులకు మెరుగైన వసతులు, కార్మికులకు దుర్భరపరిస్థితులు, అవినీతి, అక్రమాలు, నేరాలతో జనం విసిగిపోయారు. కేంద్రం, రాష్ట్రాల నుంచి నిధులను రాబట్టి నగర జీవనాన్ని మెరుగుపరచాలన్న ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఎన్నికల్లో పురోగామి శక్తులు నెగ్గారు. నగరంలోని 50 వార్డులకు గాను జాన్సన్‌ మద్దతుదారులు 29 మంది గెలిచారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ ఓటర్లలో 80శాతం, తెల్లవారిలో 39,లాటినోలలో 49శాతం మంది వారికి ఓటు వేశారు. ఇటీవలి కాలంలో ఆసియన్‌-అమెరికన్‌ జనాభా కూడా పెరుగుతోంది. ఎన్నికైన వారిలో ఆరుగురు డెమోక్రటిక్‌ సోషలిస్టులు కూడా ఉన్నారు. వారి నేత బెర్నీ శాండర్స్‌ రెండు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.


ఏప్రిల్‌ 23వ తేదీన ఐరోపా దేశమైన ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌ రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టులు(కెపిఓ) 11.7శాతం ఓట్లు సంపాదించారు.ఐదు సంవత్సరాల క్రితం వారికి వచ్చిన ఓట్లు కేవలం 0.4శాతమే. మితవాదానికి కేంద్రంగా ఉన్న ఇక్కడ ఇన్ని ఓట్లు రావటం పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.కెపిఓ ప్లస్‌ పేరుతో స్వతంత్రులను కూడా కలుపుకొని ఒక మ్యూజియంలో గైడ్‌గా పని చేస్తున్న 34 సంవత్సరాల కె మైఖేల్‌ డంకల్‌ అనే కార్మికుడి నేతృత్వంలో పార్టీ పోటీ చేసింది. మొదటి స్థానంలో ఉన్న పార్టీకి 30, రెండో స్థానంలో ఉన్న పార్టీకి 25శాతం చొప్పున వచ్చాయి. డంకల్‌ గతంలో గ్రీన్ప్‌ పార్టీలో పని చేశాడు. వర్గ రాజయాలను అనుసరించటం లేదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదని 2017లో రాజీనామా చేసి కమ్యూనిస్టులతో కలిశాడు. తరువాత 2019లో స్లాజ్‌బర్గ్‌ నగర ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచాడు. కమ్యూనిస్టు పార్టీ ఓట్లు అంతకు ముందున్న 1.19 నుంచి 21.5శాతానికి పెరిగాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆస్ట్రియాలో నాలుగో పెద్ద నగరమైన ఈ నగరమేయర్‌గా ఒక కమ్యూనిస్టు ఉండబోతున్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.దేశమంతటా పార్టీ ఓటింగ్‌ 2019లో ఒకటి నుంచి ఏడు శాతానికి పెరగ్గా 1959 తరువాత 2024 ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంటులో కూడా ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. ఇళ్ల సమస్య, అద్దెలు, ఇంథన ధరల పెరుగుదల వంటి రోజువారీ కార్మికుల సమస్యల మీద కేంద్రీకరించి పార్టీ ప్రజల అభిమానం పొందింది. అధికార కూటమి జనం నుంచి దూరమైంది.2021లో జరిగిన ఎన్నికల్లో దేశంలో రెండో పెద్ద నగరమైన గ్రాజ్‌ మేయర్‌గా కమ్యూనిస్టు ఎన్నికయ్యాడు. గ్రీసులో జరిగిన విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘ ఎన్నికల్లో వామపక్ష భావజాలం కలిగిన వారు 35శాతం ఓట్లు తెచ్చుకున్నారు.వరుసగా రెండవ ఏడాది ఈ ఆదరణ లభించింది. ఈ వీధులు ఎవరివి ? మావే, ఈ భూములు ఎవరికి, స్థానికులం మావే, వేరే వారికి అప్పగించటాన్ని అంగీకరించం అంటూ అమెరికాలోని మినియాపోలీస్‌లో జరిపిన ప్రదర్శనల్లో స్థానికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పతాకాలను చేబూని నినదించారు. పురోగామి శక్తులు ఎన్నికల పోరాటాలతో పాటు ప్రజా ఉద్యమాల్లోనూ ముందుంటున్నారు.లాటిన్‌ అమెరికాలో రాగల ముప్పును గురించి కూడా హెచ్చరిస్తున్నారు.


తమ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని చిలీ కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. దేశ నూతన రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన 50 మంది సభ్యుల సభకు మే ఏడవ తేదీన జరిగిన ఎన్నికల్లో మితవాద, తీవ్రవాదుల పార్టీలకు చెందిన వారు 33 మంది ఎన్నికకావటాన్ని కమ్యూనిస్టు పార్టీ ఉటంకించింది. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలను పొందిన పార్టీకి ఎనిమిదిశాతం ఓట్లు వచ్చాయి. అక్కడి నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాల్సి ఉంది. పోలైన ఓట్లలో 21శాతం చెల్లనివిగా ప్రకటించారు. ఇవన్నీ కూడా వామపక్ష శక్తులుగా చెప్పుకొనే వారివేనని, వారంతా వామపక్షాలకు ఓట్లు వేసి ఉంటే ఫలితాలు వేరుగా వచ్చి ఉండేవని కమ్యూనిస్టు పార్టీ చిలీ అధ్యక్షుడు గులిరెమో టెలియర్‌ అన్నారు. నూతన రాజ్యాంగ రచనకు ఎంతో గట్టిపోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు. కార్పొరేట్‌ శక్తులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ దేశంలో ఓట్ల రీత్యా మూడవ స్థానంలో పార్టీ నిలిచిందని చెప్పారు.2021 ఎన్నికల్లో గెలిచిన వామపక్ష గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వానికి తాజా పరిణామంతో ఎలాంటి ముప్పు లేనప్పటికీ కీలకమైన రాజ్యాంగ రచనకు ఓటర్లు మితవాద శక్తులవైపు మొగ్గు చూపటం గమనించాల్సిన అంశం. మొత్తం లాటిన్‌ అమెరికా, ప్రపంచంలోని కమ్యూనిస్టు, వామపక్ష శక్తులు చిలీ పరిణామాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.

కర్ణాటకలో మోడీపై పోలీస్‌ స్టేషన్‌లో ”ఉగ్ర ” ఫిర్యాదు : ఆవు మొదలు ఎందెందు చూసినా అందందు దొరుకుతున్న ” దేశభక్త ఉగ్రవాదులు, విద్రోహులు ” !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. దక్షిణ భారతంలో అడ్డదారిలో మూడున్నర సంవత్సరాల క్రితం అధికారం కైవశం చేసుకున్న ఏకౖౖెక రాష్ట్రాన్ని బిజెపి కోల్పోయింది. బిడ్డ పోయినా పురుటి వాసన పోదు అన్న సామెత తెలిసిందే. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు చేసిన వాగ్దానాలు, నేతల ప్రసంగాలు రానున్న రోజుల్లో చర్చనీయాంశాలుగా మారతాయి. వాటిలో ఒకటి ప్రధాని నరేంద్రమోడీ మీద కాంగ్రెస్‌ దాఖలు చేసిన ఒక కేసు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.ఉగ్రవాదానికి-కాంగ్రెస్‌కు సంబంధాన్ని అంటగడుతూ చేసిన ప్రసంగాల మీద విస్తృత దర్యాప్తు జరిపి కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామ్య పుట్టినిల్లు మన దేశమే అని నరేంద్రమోడీ స్వయంగా చెప్పినందున చట్టం ముందు అందరూ సమానులే కనుక తన మీద దాఖలైన కేసుకు సహకరిస్తారా లేదా అన్నది చూద్దాం.ఓట్‌ బాంక్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదాన్ని పోషించింది,ఆశ్రయం కల్పించింది, లొంగింది అని మోడీ ఒక ఎన్నికల సభలో ఆరోపించారు. తప్పుడు ఆరోపణలతో ప్రధాని పదవిని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు చూశారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించటమే గనుక చర్య తీసుకోవాలంటూ పోలింగ్‌కు ముందే బెంగలూరు నగరంలోని హై గ్రౌండ్స్‌ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అక్రమాలకు పాల్పడుతున్న మోడీ పేర్లున్న కొందరి గురించి రాహుల్‌ గాంధీ కర్ణాటకలో గత లోక్‌సభ ఎన్నికలపుడు చేసిన వ్యాఖ్యలు,వాటి మీద గుజరాత్‌లోని సూరత్‌లో కేసు, కోర్టు విచారణ, రెండేళ్ల జైలు శిక్ష, దాంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై వెంటనే అనర్హత వేటు, సదరు తీర్పు చెప్పిన జడ్జికి పదోన్నతి, దాన్ని నిలిపివేసిన సుప్రీం కోర్టు ఆదేశం వంటి అంశాలన్నీ తెలిసినవే. ఈ పూర్వరంగంలో తమ ప్రభుత్వమే అధికారానికి వచ్చింది గనుక కాంగ్రెస్‌ తాను దాఖలు చేసిన కేసు పట్ల ఎంత శ్రద్ద చూపుతుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.


ఉగ్రవాదులు అనే అనుమానంతో మధ్య ప్రదేశ్‌ పోలీసులు హైదరాబాదు, శివారు ప్రాంతాలలో ఇటీవల ఆరుగురిని అరెస్టు చేసి భోపాల్‌ తరలించారు. అక్కడ దొరికిన పదకొండు మంది నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఇక్కడ సోదాలు జరిపి పట్టుకున్నారు.అరెస్టైన వారిలో మజ్లిస్‌ నేత ఒవైసికి చెందిన మెడికాల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఒకరు కూడా ఉన్నారు. వారు ఏ దుండగాలకు పాల్పడిందీ ఇంకా వెల్లడికాలేదు. ఇలా పట్టుబడినపుడల్లా మీడియాలో, బిజెపి నేతల నోళ్లలో హైదరాబాద్‌ ఉగ్రవాదుల అడ్డా అని ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు నిందితులు సౌత్‌ గ్రూప్‌కు చెందిన వారు అన్న పదజాలాన్ని చార్జి షీట్లలో పదే పదే ప్రస్తావించటాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టి మొత్తం దక్షిణ భారతాన్ని నిందించేవిధంగా ఉన్నట్లు చివాట్లు వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాలను లండన్‌లో జరిగిన ఒక సభలో విమర్శించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విదేశాల్లో దేశ పరువు తీశారని ఊరూవాడా టాంటాం వేస్తున్న వారు హైదరాబాద్‌ను ఉగ్రవాదుల అడ్డాగా పేర్కొని అవమానిస్తున్నట్లు కాదా ? ఎక్కడ ఉగ్రవాదులు దొరికితే ఆ రాష్ట్రాన్ని వారి అడ్డాగా వర్ణిస్తే బిజెపి పాలనలో ఉన్న భోపాల్‌ను కూడా ఆ పార్టీ నేతలు అదే విధంగా పేర్కొంటున్నారా ? ముస్లింలందరూ ఉగ్రవాదులు, దేశ ద్రోహాలు కాదు గానీ దొరికినవారందరూ ముస్లింలే అనే ప్రచారం జరుగుతోంది.నిజమేనా ? అదే ప్రాతిపదికన మరి హిందువులు, క్రైస్తవులు, సిక్కుల సంగతేమిటి ?


డిఆర్‌డిఓ శాస్త్రవేత్త ప్రదీప్‌ ఎం కుల్కర్‌ను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధ పోలీసు దళం పూనేలో మే నెల మూడవ తేదీన అరెస్టు చేసింది, పదిహేనవ తేదీ వరకు కస్టడీకి పంపారు.యాభై తొమ్మిది సంవత్సరాల ఈ పెద్దమనిషి తన తండ్రి, తాతల నుంచి తాము ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు గర్వంగా చెప్పుకున్న వీడియో కూడా అందరికీ అందుబాటులో ఉంది. కేంద్రంలో, మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉన్నది రెండింజన్ల పార్టీ అన్నది తెలిసిందే. అందువలన కుట్రతోనో మరోరకంగానో అరెస్టు చేశారని చెప్పేందుకు లేదు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకపోగా బ్రిటీష్‌ వారికి సేవ చేసిన పూర్వరంగం, మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాడు కావటంతో నాడు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అందువలన ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నవారు గానీ అభిమానించే వారు గానీ బహిరంగంగా ఆ అంశాన్ని చెప్పుకొనేందుకు సిగ్గుపడేవారు. గుట్టుగా దాచేవారు. రోజులు మారాయి. చరిత్ర మరుగునపడింది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని వారు, ద్రోహం చేసిన వారిని అసలు సిసలు సమరయోధులుగా పేర్కొంటూ నకిలీ చరిత్రను రాస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కొత్త తరాలు అదే నిజమనుకుంటున్నాయి. కుల్కర్‌ లాంటి వారు పాకిస్తాన్‌కు మన రక్షణ రహస్యాలను ఎప్పటి నుంచి చేరవేస్తున్న జాతీయవాదో తెలియదు. తన ద్రోహాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశపాలనలో చక్రం తిప్పుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం గురించి చెప్పుకుంటే తనవైపు చూడరని కుల్కర్‌ అనుకున్నాడేమో అన్న సందేహం కలుగుతోంది. ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలో పని చేస్తూ ఒక మహిళ వలలో పడి సమాచారాన్ని చేరవేసినట్లు ప్రాధమిక సమాచారం. చార్జిషీటు దాఖలు చేస్తే మొత్తం వెల్లడిఅవుతుంది.


డిఆర్‌డిఓకు చెందిన బాబూరామ్‌ డే అనే మరో ఉద్యోగిని ఫిబ్రవరి 24న ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు.బాలసోర్‌ జిల్లా చండీపూర్‌ క్షిపణి ప్రయోగ కేంద్రంలో పని చేస్తాడు. అన్ని పరీక్షలపుడు అతడు భాగస్వామి. ఆ సమాచారాన్ని, నిషేధిత ప్రాంతాల ఫొటోలను పాకిస్తాన్‌కు చేరేవేసేవాడని, అతను కూడా ఒక మహిళ వలలో చిక్కుకొని ఆమె ద్వారా కథ నడిపించేవాడని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు అందచేస్తున్నారనే సమాచారంతో (2016లో పెద్ద నోట్ల రద్దు ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేసినట్లు నరేంద్రమోడీ చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి, ఆ సలహా తానే ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి చెప్పుకున్నారు) 2019లో మధ్య ప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో భజరంగ్‌ దళ్‌ నేత బలరామ్‌ సింగ్‌, సునీల్‌ సింగ్‌, శుభమ్‌ మిశ్రా ఉన్నారు. పంపిన సమాచారం ఎప్పటికప్పుడు కనిపించకుండా చేసే ఒక ఆప్‌ ద్వారా వారు ఉగ్రవాదులకు నిధుల సమాచారాన్ని చేరవేసేవారని పోలీసులు వెల్లడించారు. అంతకు రెండు సంవత్సరాల ముందు బిజెపి యువమోర్చా, బిజెపి ఐటి విభాగ నేత ధృవ సక్సేనా మరోపదిమందిని కూడా ఇదే ఆరోపణలతో అరెస్టు చేశారు. వీరంతా ఒక ముఠాగా పని చేస్తున్నట్లు వెల్లడైంది. అరెస్టుల గురించి రాష్ట్ర మంత్రి గోవింద్‌ సింగ్‌ మాట్లాడుతూ అనేక మంది బిజెపికి చెందిన వారు సంవత్సరాలుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉన్నారని, నిధులు, రహస్య సమాచారాన్ని చేరవేశారని చెప్పారు. బిజెపి నేతలు పాక్‌ ఐఎస్‌ఐ ఏజంట్లుగా మారారని, వారికి బెయిలు కోసం ప్రయత్నించినందుకు సిఎం శివరాజ్‌ సింగ్‌ సిగ్గుపడాలని, ఎవరు దేశద్రోహులో చెప్పాలని మాజీ సిఎం, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాద సంబంధిత కేసులతో రాజకీయం చేయకూడదని, కోర్టు వారికి బెయిలిచ్చిందని బిజెపి నేత దీపక్‌ విజయవర్గీయ సమర్ధించుకున్నారు. ఈ తర్కం తెలంగాణా బిజెపి నేత బండి సంజయకు అర్ధంగాక లేదా తెలియక తరచూ అదే రాజకీయం చేస్తున్నారా ? బిజెపి చేస్తే సంసారం, ఇతర పార్టీలు చేస్తే మరొకటా ?


కాశ్మీరులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాకు చెందిన వారిని గత సంవత్సరం పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకడు బిజెపి ప్రాంతీయనేత అని అతను అమిత్‌షాతో దిగిన ఫొటోలు ఉన్నట్లు, అమరనాధ్‌ యాత్రీకుల మీద దాడి చేసేందుకు కుట్రపన్నినట్లు 2022 జూలై 9న కాంగ్రెస్‌ నేతలు ఒకే రోజు దేశమంతటా 23 చోట్ల విలేకర్ల సమావేశాలు పెట్టి మరీ చెప్పారు. నూపుర్‌ శర్మ నోటి దురుసు మాటలకు ప్రభావితుడై మద్దతు తెలిపిన ఉదయపూర్‌ దర్జీ కనయలాల్‌ను హత్య చేసిన వారిలో బిజెపి మద్దతుదారులు ఉన్నట్లు, ఒక తీవ్రవాద బృందానికి ప్రభుత్వ నిధులను అందచేసినందుకు 2017లో అసోం బిజెపి నేత నిరంజన్‌ హజయికి ఎన్‌ఐఏ కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు కూడా కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.శ్రీనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఉగ్రవాది అజార్‌ మసూద్‌ శిష్యుడు మహమ్మద్‌ ఫరూక్‌ ఖాన్ను బిజెపి నిలిపిందని కూడా వెల్లడించారు.


హైదరాబాదులో దొరికిన ఉగ్రవాదులు ఇరుగుపొరుగువారితో ఎలాంటి వివాదాలు లేకుండా అసలు ఉన్నట్లే తెలియకుండా ఉన్నారని, అరెస్టులతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడినట్లు మీడియా వెల్లడించింది. ఉగ్రవాదులు ఎవరైనా మెడలో బిళ్ల వేసుకొని లేదా ఇంటికి బోర్డు పెట్టి తమ గుర్తింపును వెల్లడించుకుంటారా ? హైదరాబాదులో అరెస్టు చేసిన ఆరుగురిలో ముగ్గురు మతం మారి ఇస్లాం బోధనలు సాగిస్తున్నట్లు కూడా ఒక పత్రిక రాసింది. అదే వాస్తవమైతే కొందరు హిందువుల పధకం ప్రకారమే మతం మారి ముస్లింల పేరుతో ఉగ్రవాద విద్రోహులుగా పని చేస్తున్నట్లు భావించాలి. ఇదొక కొత్త కోణం. ఒక ఉగ్రవాద ముఠా కుట్రను భగం చేసినట్లు 2018 ఆగస్టులో మహారాష్ట్ర ఏటిఎస్‌ టీమ్‌ ప్రకటించింది.వారిలో ఒకడి అరెస్టు వార్తతో ఇరుగుపొరుగు వారు అవాక్కయ్యారట. ఇరుగుపొరుగువారితో ఎంతో సౌమ్యంగా ఉండేవాడని, సమాజంలో ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరు ఉందని కూడా చెప్పారట. వారిలో వైభవ్‌ రౌత్‌ గో వంశ రక్ష సమితి నేతగా చెప్పుకున్నాడు. అతని అనుచరులుగా సుధాన్వ గోంధాల్కర్‌, శరద్‌ కలాస్కర్‌ ఉన్నారు. పోలీసులు వెల్లడించినదాని ప్రకారం వీరు మరికొందరు కలసి ఒక ఉగ్రవాద ముఠాగా ఏర్పడ్డారు. వారిలో రౌత్‌, కలాస్కర్‌ వద్ద 20 నాటుబాంబులు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, రెండు జిలిటెన్‌ స్టిక్స్‌, నాలుగు ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, 22 ఇతర డిటోనేటర్లు, రెండు సీసాల విషం, బాటరీలు, తదితరాలు దొరికాయి.సుధాన్వ గోంధాల్కర్‌ వద్ద పదకొండు నాటు తుపాకులు, తూటాలు, ఇతర విడిభాగాలు లభించాయి. ఇవన్నీ గోవులను సంరక్షించటానికే అని జనం నమ్మాలి. రౌత్‌ మతవిద్వేషాన్ని రెచ్చగొట్టటంలో దిట్ట. అతని నివాస ప్రాంతం పక్కనే ముస్లింలు ఎక్కువగా ఉండటంతో వారి పండుగులపుడు రౌత్‌ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశిస్తారు.సనాతనతో సహా అనేక హిందూత్వ సంస్థలతో కలసి సభల్లో అతను పాల్గొంటాడు. కలాస్కర్‌ అరెస్టు వార్త వినగానే సోదరుడు, ఇతర బంధువులు నమ్మలేదు. కొల్లాపూర్‌లో ఏదో పని చేస్తున్నాడనే భావనలో వారు ఉన్నారు.వివిధ సందర్భాలలో హిందూత్వ సభలు, ప్రదర్శనల్లో కలుసుకున్న వీరు ఒక ముఠాగా ఏర్పడ్డారు.మాలెగావ్‌ పేలుడు కేసులో అరెస్టయిన హిందూ తీవ్రవాదుల గురించి తెలిసిందే.


హిందూమతానికి ప్రమాదం వచ్చిందని, హిందూత్వ పేరుతో సాగిస్తున్న విద్వేష ప్రచారంతో అనేక మంది అమాయకులు నమ్మి అలాంటి వారి వలలో చిక్కుకుంటున్నారు. తొలుత బోధలతో బుర్రలను చెడగొట్టి తరువాత నేరాలు చేయించి తమ వలలో బంధిస్తారు.మాఫియా, గూండా ముఠాలు, ఇస్లామిక్‌, ఇతర అన్ని రకాల తీవ్రవాద సంస్థలు చేస్తున్నది కూడా ఇదే. ఇలాంటి శక్తులకు ఒక ప్రాంతం, దేశం, ఖండం అనే తేడాలు ఉండవు. ఎక్కడబడితే అక్కడ విష బీజాలు నాటుతారు. ఇస్లాంకు ముప్పు వచ్చిందని, భారత్‌తో సహా ప్రపంచమంతా ఇస్లామిక్‌ రాజ్యాలను స్థాపించాలని ఆ మత ఉగ్రవాద, ఛాందస సంస్థలు ఎలా రెచ్చగొడతాయో మిగిలిన మతోన్మాదశక్తులూ అంతే. దానికి ఒక ఉదాహరణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య. ఆమెను కాషాయ ఉగ్రవాదులు చంపారన్న కేసు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. పదివేల పేజీల చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు.మతం పేరుతో ఉగ్రవాద సంస్థలు ముస్లిం యువతను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా హిందూ యువతీ,యువకులను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. అలా మారినవారే గౌరీ లంకేష్‌ను హతమార్చారు.వారిలో ఒకడు అమోల్‌ కాలే అనే మెకానికల్‌ ఇంజనీరు. బహుళజాతి గుత్త సంస్థలో ఉద్యోగం మానుకొని హిందూత్వకు అంకితం కావాలని నిర్ణయించుకున్నాడు.హిందూ మతానికి ముప్పు తలెత్తిందనే విష ప్రభావానికి లోనై ఒక ఉన్మాదిగా మారినట్లు అతని తీరుతెన్నులు స్పష్టం చేశాయి. ఎవరైనా హిందూమతాన్ని కించపరిచినట్లు అని పిస్తే వారి మీద హింసాత్మక దాడులకు పాల్పడాలని తనకు అనిపిస్తుందని విచారణలో పోలీసులకు చెప్పాడు. గౌరితో పాటు హేతువాదులు నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారేల హత్యల్లోనూ ఇతని హస్తం ఉంది. మరోహేతువాది కెఎస్‌ భగవాన్ను కూడా చంపేందుకు కుట్ర చేశాడు.


కెనడా హిందూ మహాసభ అనే సంస్థ డైరెక్టర్‌గా ఉన్న రాన్‌ బెనర్జీ బీట్‌ ఆఫ్‌ ద నార్త్‌ అనే ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. దీని గురించి 2022 జూన్‌ 25న వార్తలు వచ్చాయి.ముస్లింలు, సిక్కులను ఊచకోత కోయాలని చెప్పాడు. ” హిందూయిజం ఒక మార్గం. నేను తీవ్ర హిందూ జాతీయవాదిని.భారత్‌లో మాదిరి కెనడాలో కూడా నరేంద్రమోడీ పాలన రావాలని కోరుకుంటున్నాను. అతను ముస్లింలు, సిక్కు తీవ్రవాదులను హతమారుస్తాడు.దాన్ని నేను సమర్ధిస్తాను, ఎందుకంటే వారు చావాల్సిందే, మోడీ చేస్తున్నది అద్భుతంగా ఉంది.” అని చెప్పాడు. ఇలా మాట్లాడినందుకు ఒకసారి అరెస్టైనా తీరు మార్చుకోలేదు. అమెరికా, కెనడాల్లో ఉన్న ఇలాంటి వారు హిందూత్వ సంస్థలకు అందచేస్తున్న నిధుల వంటి అనేక అంశాలను చూస్తే ఇస్లామిక్‌ జీహాదీల మాదిరే హిందూ జీహాదీలను కూడా తయారు చేస్తున్నారు. ఏ మత జీహాదీలైనా అమెరికా ఉగ్రవాద పరిశ్రమకు లాభాలు తెచ్చిపెట్టే వారిగా మారుతున్నారు.

కాషాయ ముప్పు తొలగలేదన్న కర్ణాటక ఫలితాలు : హిట్లర్‌, ముస్సోలినీ అంతరించినా నాజీ, ఫాసిజం బతికే ఉంది, మతోన్మాదమూ అంతే !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మూడు ముక్కలాటలకు తెరదించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కర్ణాటక ఓటర్లు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. మతతత్వ బిజెపి, అధికారమే పరమావధిగా ఉన్న అవకాశవాద జెడిఎస్‌కు గుణపాఠం చెప్పారు. మూడున్నర దశాబ్దాల తరువాత కాంగ్రెస్‌ ఓట్లు, సీట్లను కూడా భారీగా తెచ్చుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పుగా పరిణమిస్తున్న సంఘపరివార్‌ శక్తులను ఎదిరించేందుకు ముందుకు వస్తున్న ఒక ప్రధాన శక్తిగా కాంగ్రెస్‌ విజయాన్ని లౌకిక శక్తులన్నీ హర్షించాయి.అధికారికంగా ఫలితాలను నిర్ధారించక ముందే జరిగేదేమిటో స్పష్టమైనందున మీడియా పెద్దలు సిఎం గద్దెపై కూర్చొనేదెవరు అన్న చర్చకు తెరలేపారు. కాంగ్రెస్‌ గతాన్ని బట్టి అలాంటి విశ్లేషణలు చేసేవారిని తప్పుపట్టనవసరం లేదు. గెలిచిన కాంగ్రెస్‌ సంబరాల్లో ఉంది, నరేంద్రమోడీ ఓడినట్లుగా తాము భావించటం లేదని ఆపద్దర్మ సిఎం బసవరాజు బొమ్మై తనను తాను ఓదార్చుకున్నారు. ఒక ఎదురుదెబ్బ ఈ ఓటమి తమనేమీ కదిలించలేదని కమలనాధులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ గెలుపు కారణాలతో పాటు బిజెపి ఓటమి గురించి విశ్లేషణలు వెలువడుతున్నాయి.జెడిఎస్‌ భవితవ్యం ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చనీయమే.విధాన సభలోని మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 135(80), బిజెపి 66(104), జెడిఎస్‌(32) 19, ఇతరులు నాలుగు స్థానాలు తెచ్చుకున్నారు.బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు. ఓట్లను చూస్తే మూడు పార్టీలకు వరుసగా 42.9,36,13.3 శాతం వచ్చాయి. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌కు 4.9శాతం పెరగ్గా బిజెపికి 0.3, జెడిఎస్‌కు ఐదుశాతం చొప్పున తగ్గాయి. ఇతరుల ఓట్లు 0.4శాతం పెరిగాయి.


కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణా మీద ఎలాంటి ప్రభావం చూపవని బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ స్పందించారు. అదే ఊపులో ఇక్కడా విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.గెలుపు పట్ల తమ పార్టీ ధీమాగా ఉందని బిజెపినేత బండి సంజయ చెప్పారు. కాంగ్రెస్‌ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ముస్లింలు మొత్తంగా ఆ పార్టీకి ఓటు వేశారని, అలా వేయకపోతే బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందని జెడిఎస్‌ కర్ణాటక నేత ఇబ్రహీం బహిరంగంగానే చెప్పారని కూడా బండి చెప్పారు. తమకు సీట్లు తగ్గినా ఓట్లు తగ్గలేదన్నారు. ఫలితాలపై చర్చల్లో బిజెపి ప్రతినిధులందరూ దాదాపు ఇదే విధంగా మాట్లాడారు. టీవీలను వీక్షించేవారిని, పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో చదివేవారిని తప్పుదారి పట్టించేందుకు చూశారు. తరువాత కూడా మొదలు పెట్టారు. కర్ణాటకలోనే కాదు, దేశమంతటా ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాలను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి 80-20 నినాదాన్ని ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే.


హిందూత్వ సంస్థలు, నోటి తుత్తర నేతలు విద్వేష ప్రసంగాలను చేస్తున్న నేపధ్యంలో ఎవరూ ఫిర్యాదు చేయకున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. బిజెపి సబ్‌కా సాత్‌ -సబ్‌కా వికాస్‌ అని తీపి కబుర్లు చెబుతుంది. అందరం కలసి ఉంటే అందరి పురోభివృద్ధి అన్నది అర్ధం. ప్రపంచంలో మొత్తం ముస్లింలు వంద మంది ఉన్నారనుకుంటే ఒక్క మనదేశంలోనే 10.9 మంది ఉన్నారు. ఈ మాత్రాన్నే భరించలేని వారు ముస్లిం జనాభా శాతం ఇంకా పెరిగే అఖండ భారత్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.మన దేశ జనాభాలో తాజా అంచనా ప్రకారం 15.5శాతం ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న సామాజిక తరగతిని అభివృద్ధిలో, ప్రజా ప్రాతినిధ్యంలో విస్మరిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. కర్ణాటకలో జాతీయ సగటు కంటే తక్కువే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 12.92 శాతం ఉన్నారు.కొన్ని జిల్లాల్లో అంతకంటే ఎక్కువ ఉన్నారు. తాజా ఎన్నికల గురించి హిందూ పత్రిక చేసిన విశ్లేషణలో ముస్లిం సామాజిక తరగతి ఎక్కువగా (మొత్తం జనాభాలో కాదు) ఉన్న ఐదు జిల్లాల్లో బిజెపి ఓట్ల శాతం 2023 ఎన్నికల్లో గతంతో పోలిస్తే 0.3శాతం పెరుగుదలతో 44.5 శాతం కాగా కాంగ్రెస్‌కు 2.1శాతం పెరిగి 42.5శాతంగా ఉంది. జెడిఎస్‌ 3.9శాతం కోల్పోయి 5.5శాతానికి పరిమితమైంది. విద్వేషాన్ని ఎంతగానో ఎక్కించబట్టే బిజెపి తన ఓట్లశాతాన్ని స్వల్పంగానైనా గతం కంటే పెంచుకుంది. దాని ప్రమాదాన్ని నిరోధించాలని భావించబట్టే దాన్ని ఎదుర్కొనే పార్టీ కాంగ్రెసే గనుక అనేక మంది దానివైపు మొగ్గటంతో బిజెపి రాష్రమంతటా చావు దెబ్బతిన్నది.


ఒకవైపు ముస్లిం మత సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు తెరవెనుక సంప్రదింపులు జరుపుతారు.కేరళలో వామపక్షాలకు వ్యతిరేకంగా క్రైస్తవులను నిలిపేందుకు నరేంద్రమోడీ ఏకంగా చర్చ్‌కు వెళ్లారు, బిజెపి నేతలు బిషప్పులు, ఇతర మతాధికార్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈస్టర్‌ సందర్భంగా క్రైస్తవులు, రంజాన్‌కు ముస్లింల ఇండ్లకు వెళ్లి కానుకలు ఇవ్వాలని, మళయాళ సంవత్సరాది సందర్భంగా వారిని ఇండ్లకు ఆహ్వానించాలని కేరళ బిజెపి ఏకంగా ఒక కార్యక్రమాన్నే ప్రకటించింది. తెలంగాణాలో హిందూ ఏక్తా యాత్రలు జరుపుతున్నారు. అందరినీ కలుపుకోవాలని చెప్పే బిజెపి తాజా కర్ణాటక ఎన్నికల్లో గతంలో జరిగిన లోక్‌సభ లేదా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కరంటే ఒక్క ముస్లింను కూడా పోటీకి ఎందుకు నిలపలేదు. ఇంతేనా మాజీ ఉప ముఖ్యమంత్రి, కెఎస్‌ ఈశ్వరప్ప గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ 40శాతం కమిషన్‌ ఇవ్వాలని వేధించినట్లు లేఖలు రాసిన బిజెపికి చెందిన కాంట్రాక్టర్‌, హిందూవాహిని సంస్థ నేత సంతోష్‌ పాటిల్‌ 2022 ఏప్రిల్‌ 12న ఒక హౌటల్లో ఉరివేసుకొని మరణించాడు. దాంతో ఈశ్వరప్ప ఉద్యోగం ఊడింది. అతగాడు మేనెల పదవ తేదీన జరిగిన ఎన్నికల్లో ముస్లింలు తమ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయనవసరం లేదని బహిరంగంగా ప్రకటించాడు. అతన్ని ఏ ఒక్క బిజెపి నేత కూడా తప్పని ఖండించలేదు. మీ ఓట్లు వద్దన్న పార్టీకి వేసేందుకు ఏ సామాజిక తరగతికైనా ఆత్మగౌరవం అనుమతిస్తుందా ? తమ పార్టీ విద్వేషాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌ సంతుష్టీకరించిన కారణంగానే ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, అందువల్లనే తాము ఓడినట్లు మాట్లాడే బిజెపి నేతలవి నోళ్లా మరొకటా అని జనం అనుకుంటున్నారు. వారు చెప్పేదాని ప్రకారం ముస్లింలు వేస్తే వారికి లేదా ఇతర పార్టీలకు వేటికీ వేయకుండా దూరంగా ఉండాలి.


కర్ణాటక ఎన్నికల్లో ఓడిన తరువాత కూడా వాట్సాప్‌ యూనివర్సిటీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టటం మానుకోలేదు.తొంభైశాతం మైనారిటీలు ఓటింగ్‌కు వచ్చారని, హిందువుల 60శాతం దాటలేదని ఇలా ఉంటే భవిష్యత్‌ ఉండదంటూ ఒక ప్రచారం మొదలైంది. ఒక వెయ్యి ఓట్లు కాంగ్రెస్‌కు బదులు బిజెపికి పడితే ఆ పార్టీకి 51 సీట్లు వచ్చేవంటూ దానిలో లెక్క చెప్పారు. రెండున్నరశాతం, అంతకంటే తక్కువ ఓట్ల మెజారిటీతో మూడు పార్టీలు గెలిచిన స్థానాలు 33, గత ఎన్నికల్లో 23 ఉన్నాయి. వాటిలో గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఒకటి పెరిగి 17, బిజెపికి ఎనిమిది పెరిగి 13, జెడిఎస్‌కు ఒకటి పెరిగి మూడు వచ్చాయి. అలాంటపుడు వెయ్యి ఓట్లు పడితే బిజెపికి 51 ఎలా వస్తాయి. చిన్న పిల్లలు, అమాయంగా ఉండే వారిని మోసపుచ్చటం తప్ప మరొకటి కాదు. కాబినెట్‌లోని 22 మందికి గాను 14 మంది మంత్రులు ఓడారు. ఇంకా ఓడిన ప్రముఖుల్లో ఎడియూరప్పను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రముఖ నేత, బిజెపి జాతీయ కార్యదర్శి సిటి రవి ఒకరు. బాబాబుడాంగిరి దర్గా చుట్టూ విద్వేషాన్ని రెచ్చగొట్టిన వారిలో రవి పేరుమోసినట్లు విమర్శలున్నాయి. మాజీ సిఎం సిద్ద రామయ్య ఎన్నికలు వచ్చినపుడు హిందువు, తరువాత హిందువులను ద్వేషిస్తారు. సిద్దరాముల్లా ఖాన్‌ గనుక అధికారానికి వస్తే హిందువుల పని ఖతం అని రెచ్చగొట్టిన ప్రకటనల స్పెషలిస్టు. హాస్యనటుడు బ్రహ్మానందం వెళ్లి మంత్రి సుధాకర్‌కు మద్దతుగా ప్రచారం చేసి అపహాస్యం పాలైనారు. కిచ్చా సుదీప్‌ అనే కన్నడ సూపర్‌ స్టార్‌ బిజెపికి ప్రచారం చేసినా పరువుదక్కలేదు. అలాంటిది బ్రహ్మానందం ఒక లెక్కా. సుధాకర్‌ 2019లో కాంగ్రెస్‌ నుంచి బిజెపికి జంప్‌ చేశారు. కరోనాలో తన జిల్లావారిని తప్ప ఇతరులను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.ఓడినవారిలో హిజాబ్‌ మంత్రి నాగేష్‌ వంటి వారున్నారు.


ఇంకా అనేక అంశాల మీద సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఎన్నికలను ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా లేని విధంగా రోడ్‌ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఇరవై స్థానాల్లో ప్రచారం చేస్తే 15 చోట్ల బిజెపి ఓడినట్లు వార్తలు. జై భజరంగ బలీ అని నినాదమిస్తూ ఓటు వేయాలని పిలుపునిచ్చి ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా దిగజార్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.తనను చూసి ఓటు వేయాలని కూడా కోరినందున బిజెపి కంటే నరేంద్రమోడీ ఓటమిగానే జనం చూస్తున్నారు. 1989లో కాంగ్రెస్‌ నేత వీరేంద్ర పాటిల్‌ ఏలుబడిలో ఆ పార్టీకి 43.76శాతం ఓట్లు, 178 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో బిజెపికి ఓట్లు తక్కువ వచ్చినప్పటికీ సీట్లు ఎక్కువ రావటానికి కాంగ్రెస్‌-జెడిఎస్‌ మధ్య ఓట్ల చీలికే ప్రధాన కారణం. ఈ సారి గణనీయంగా జెడిఎస్‌ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లటంతో బిజెపి బొక్కబోర్లా పడింది. దీన్ని దాచిపెట్టి తమ ఓటమి కంటే జెడిఎస్‌కు ఓట్లు తక్కువ రావటం గురించే బిజెపి నేతలు ఎక్కువగా చెబుతున్నారు. తమ ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత ఉంటే తమకు గతం కంటే ఓట్లు కూడా తగ్గాలి కదా అని బిజెపి వాదిస్తోంది.


దక్షిణాదిన సంఘపరివార్‌ తమ హిందూత్వ ప్రయోగశాలగా కర్ణాటకను ఎంచుకోవటానికి అక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటం, దాడులు, హిజాబ్‌, హలాల్‌ వివాదం వంటి వన్నీ ప్రయోగాల్లో భాగమే.కులం, మతం, ప్రాంతీయ విద్వేషాల పులుల మీద ఒకసారి జనాన్ని ఎక్కించిన తరువాత వారు వాటి నుంచి అంత తేలికంగా దిగలేరు. విష ప్రభావానికి గురైన కొన్ని తరాలు చివరి వరకు అలాగే కొనసాగుతాయి.ఐరోపాలో ఫాసిజం, నాజీజాలను, యూదుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టిన శక్తులు సృష్టించిన మారణహౌమం, రెండు ప్రపంచ యుద్ధాలను తెచ్చిన సంగతి తెలిసిందే. అవి అంతరించినా అవి ముందుకు తెచ్చిన దుర్మార్గ భావజాలాన్ని నయా నాజీలు, ఫాసిస్టులు అందిపుచ్చుకుంటున్న వర్తమానం మన కళ్ల ముందు ఉంది. అలాంటి శక్తుల స్ఫూర్తితో మన దేశంలో ఉనికిలోకి వచ్చిన కాషాయదళాలు కూడా అలాంటి విష బీజాలనే నాటాయి. గతంలో యూదులను బూచిగా చూపి విద్వేషాన్ని రెచ్చగొడితే ఇప్పుడు ఇస్లాం మతం వారిని ప్రపంచ శత్రువులుగా చూపి అదే చేస్తున్నారు.కసాయిని నమ్మి గొర్రె వెంట వెళ్లిన లోకోక్తి గురించి మన పెద్దలు చెప్పిన సంగతి తెలిసిందే. నాజీల నిజస్వరూపం తెలుసుకొనేందుకు జర్మన్లు, ఐరోపా వారికి చాలా కాలం పట్టింది. మన దేశంలో కూడా అలాంటి శక్తులను గుర్తించే క్రమం ప్రారంభమైంది.

పెరుగుతున్న చైనా పలుకుబడి – తగ్గుతున్న అమెరికా పెత్తనం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆఫ్రికాలోని కీలక దేశమైన సూడాన్‌లో పారా మిలిటరీ-మిలిటరీ మధ్య కానసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు ఆరువందల మందికి పైగా మరణించగా ఐదువేల మంది గాయపడినట్లు వార్తలు. గురువారం నాటికి 27రోజులుగా ఘర్షణ సాగుతోంది. అమెరికా మార్గదర్శకత్వంలో సూడాన్‌ మిలిటరీ-పారామిలిటరీ మధ్య రంజాన్‌ మాసంలో కుదిరిన ఒప్పందాలు విఫలమయ్యాయి. దీంతో అక్కడ శాంతి, భద్రతలు భగం కావటానికి కారకులైన వ్యక్తుల మీద ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించాడు. తరువాత వైరి పక్షాల మధ్య రాజీకుదిర్చేందుకు చైనా రంగంలోకి దిగుతుందా అన్న చర్చ మొదలైంది. మిలిటరీకి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతు ఉండగా పారామిలిటరీకి పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల మద్దతు ఉంది. సంక్లిష్టమైన ఈ వివాదంలో చైనా ఏ పక్షమూ వహించటం లేదన్న ఒక్క సానుకూల అంశం తప్ప సయోధ్య కుదుర్చటం, కుదరటం అన్నది అంత తేలిక కాదు. ఆఫ్రికా సమస్యలను ఆఫ్రికాయే పరిష్కరించుకోవాలి అన్న ఆఫ్రికా యూనియన్‌ వైఖరిని గౌరవిస్తున్న చైనా ఏ దేశ వివాదంలోనూ ఒక పక్షం వైపు మొగ్గలేదు.


ఆఫ్రికాలో పశ్చిమ దేశాల భూ సంబంధ రాజకీయాలకు బలైన దేశాల్లో సూడాన్‌ ఒకటి. బ్రిటీష్‌ వలస పాలన నుంచి 1956లో విముక్తి పొందిన తరువాత అక్కడ శాంతి లేదు. అంతకు ముందు ఈజిప్టు ఆక్రమణలో తరువాత బ్రిటీష్‌ ఏలుబడిలో ఉన్నపుడు దక్షిణ, ఉత్తర సూడాన్‌ ప్రాంతాలుగా ఉంది. బ్రిటీష్‌ వారు వైదొలుగుతూ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా రెండు ప్రాంతాలను ఒకే దేశంగా చేశారు. అప్పటి నుంచి దక్షిణ సూడాన్‌ పౌరులు ప్రభుత్వంలో తమ ప్రాతినిధ్యం పెరగాలని, తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. నిరాకరించటంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. మధ్యలో పది సంవత్సరాలు తప్ప 1956 నుంచి 2005వరకు అది కొనసాగి ఐదు నుంచి పదిలక్షల మంది ప్రాణాలు తీసుకుంది. 2011లో దక్షిణ సూడాన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. అవిభక్త సూడాన్‌లో, తరువాత పదకొండు మిలిటరీ కుట్రలు, తిరుగుబాట్లు జరిగాయి. అంతర్యుద్ధంలో పాలకులు కిరాయి మూకలను సమీకరించి డార్ఫర్‌, ఇతర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాన్ని అణచివేశారు. తరువాత వాటిని 2013లో పారామిలిటరీగా మార్చారు. ఇటీవలి అధికార పంపిణీలో మిలిటరీ నేత, పారామిలిటరీ నేతలు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు అధికార వ్యవస్థను ఆక్రమించారు. పారామిలిటరీని మిలిటరీలో ఎప్పుడు విలీనం కావించాలన్న అంశంపై ఒప్పందానికి భిన్న భాష్యాలు చెప్పి అధికారం కోసం జరిగిన కుమ్ములాటల కారణంగా రెండింటి మధ్య అంతర్యుద్ధం మొదలైంది. జనం నలిగిపోతున్నారు. అణచివేతలో ఇద్దరూ ఇద్దరే.


సూడాన్‌లో వర్తమాన పరిణామాలను చూస్తే ఏడు లక్షల మంది పౌరులు నిర్వాసితులైనట్లు ఐరాస సంస్థ వెల్లడించింది. రాజధాని ఖార్టూమ్‌ పరిసర ప్రాంతాల మీద విమానదాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలన్నీ ఖాళీగా ఉన్నాయి.మరోవైపు అమెరికా-సౌదీ ప్రతిపాదన మేరకు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మిలిటరీ-పారా మిలిటరీ ప్రతినిధుల మధ్య తొలిసారిగా ముఖాముఖీ కాల్పుల విరమణ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సూడాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఆకలి కేకలు ప్రారంభమైనట్లు వార్తలు. బాంకులు, ఏటిఎంలు పని చేయటం లేదు.చమురు కొరత, ధరల పెరుగుదలతో జనం సతమతమౌతున్నారు.రాజధానిలో ఎక్కువ ప్రాంతాలు పారా మిలిటరీ ఆధీనంలో ఉన్నాయి. వారిని దెబ్బతీసేందుకు మిలిటరీ వైమానిక దాడులు జరుపుతున్నది. రాజధానిలో కాల్పుల విరమణకు పారామిలిటరీ(ఆర్‌ఎస్‌ఎఫ్‌) అంగీకరించకుండా ఒప్పందం కుదిరే అవకాశం లేదని మిలిటరీ అధికారి అల్‌ బుర్హాన్‌ చెప్పాడు.ఆర్‌ఎస్‌ఎఫ్‌ పౌరులను రక్షణగా చేసుకుందని, సేవా కేంద్రాలను ఆక్రమించిందని ఆరోపించారు. విమానాలను కూల్చివేసేందుకు పారా మిలిటరీ క్షిపణులను సంధిస్తున్నట్లు వార్తలు.


చైనా నిజంగా సూడాన్‌లో రాజీ కుదుర్చుతుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. సంక్లిష్టత రీత్యా అంత తేలికగాకపోవచ్చు. సూడాన్‌ పరిణామాలను గమనించినపుడు అక్కడ భద్రతా దళాల మధ్య హింసాకాండ ప్రబలటమే అమెరికా పెత్తనం దిగజారుడుకు ఒక నిదర్శనం అని, అది ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో భాగమే అని కొందరు చెబుతున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా అమెరికా, దాని అనుచరులుగా ఉన్న ఇతర పశ్చిమ దేశాల ప్రమేయం లేకుండా ప్రపంచంలో ఏదీ జరగదని బలంగా ఉన్న నమ్మకం సడలుతున్నది. ఈ దేశాల నేతలు ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం, అవి పెద్దన్న అమెరికా ప్రమేయం లేకుండా జరగటం పెద్ద చర్చగా మారింది. ఇరాక్‌ మీద దాడి చేసి అమెరికా చేతులు కాల్చుకుంది. ఇప్పుడు అక్కడ అమెరికా పలుకుబడి ఎంత అన్నది ప్రశ్నార్ధకం. తరువాత ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అవమానకరంగా తాలిబాన్లకు సలాం కొట్టి బతుకుజీవుడా అంటూ ఎక్కడి ఆయుధాలను అక్కడే వదలి కట్టుబట్టలతో అమెరికా మిలిటరీ పారిపోవటం తెలిసిందే.అది శిక్షణ ఇచ్చిన మిలిటరీ కూడా అమెరికాను ఆదుకోలేకపోయింది. దీని అర్ధం అమెరికా కథ ముగిసినట్లు కాదు.


రెండు ప్రపంచ యుద్ధాల్లో మిగతా దేశాలతో పోల్చితే అమెరికా లాభపడింది తప్ప నష్టపోయింది లేదు.తిరుగులేని మిలిటరీ, ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఐరోపా పునరుద్దరణ పేరుతో 13 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టి నాటో మిలిటరీ కూటమి పేరుతో ఐరోపాను తన చక్రబంధంలో బిగించుకుంది. ఇతర ఖండాలను కూడా తన కౌగిలిలోకి తెచ్చుకొనేందుకుగాను 80 దేశాలలో 800 మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది.అట్లాంటిక్‌ సముద్రంలో ఆరవ నౌకాదళాన్ని, పసిఫిక్‌ – హిందూ మహా సముద్రంలో సప్తమ నౌకాదళం, పర్షియన్‌ గల్ఫ్‌Ûలో పంచమ నౌకదళాన్ని మోహరించింది. అంటే అన్ని ఖండాల చుట్టూ త్రివిధ దళాలను మోహరించింది. దానికి గాను రకరకాల సాకులు చెబుతున్నది. ఇదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే కమ్యూనిజం, దానికి ఆలవాలంగా ఉన్న పూర్వపు సోవియట్‌ , వర్తమాన సోషలిస్టు చైనా, ఇతర సోషలిస్టు దేశాల పలుకుబడిని నిరోధించేందుకు అని ప్రపంచాన్ని నమ్మించింది. ఇంతటి శక్తి కలిగి ఉండి కూడా 1960,70 దశకాల్లో వియత్నాం కమ్యూనిస్టు మిలిటరీ, గెరిల్లాల చేతుల్లో చావుదెబ్బతిన్నది. ఆప్ఘనిస్తాన్‌లో తాను పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్లో అవమానాలపాలైంది. ఇప్పుడు ఉక్రెయిన్లో అక్కడి మిలిటరీ, కిరాయి మూకలకు ఆయుధాలు అందిస్తూ పరోక్షంగా పోరు సాగిస్తున్నది. అదే చైనాను చూస్తే ఆఫ్రికాలోని జిబౌటీలో అనేక దేశాలతో పాటు తాను కూడా ఒక సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇదిగాక మయన్మార్‌ బంగాళాఖాతంలోని కోకో దీవుల్లో, సంకేతాలను పసిగట్టే ఒక కేంద్రాన్ని, తూర్పు తజికిస్తాన్‌, లావోస్‌, దక్షిణ చైనా సముద్రంలో ఒక ఆరు చిన్న మిలిటరీ పోస్టులను ఏర్పాటు చేసింది. అమెరికా తన మిలిటరీని చూపి ప్రపంచాన్ని భయపెడుతుంటే చైనా తన దగ్గర ఉన్న మిగులు డాలర్లను ప్రపంచంలో వివిధ దేశాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర పధకాల మీద ఖర్చు పెడుతున్నది, రుణాలు ఇస్తున్నది.


ఆర్థిక, మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో ముందున్న తమ దేశం క్రమంగా తన పలుకుబడిని ఎందుకు కోల్పోతున్నదనే చర్చ అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచంలోనూ రోజు రోజుకూ బలపడుతున్నది.సోవియట్‌ కూలిపోయి, కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గగానే చరిత్ర ముగిసింది, పెట్లుబడిదారీ విధాన ప్రవాహానికి ఎదురు లేదు, ప్రచ్చన్న యుద్ధంలో తమదే గెలుపు అని అమెరికా ప్రకటించుకున్న తరువాత గడచిన మూడు దశాబ్దాల్లో చరిత్ర వేరే విధంగా నమోదౌతున్నది.అమెరికా విధాన నిర్ణేతలు, వ్యూహకర్తలు కలలో కూడా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అమెరికా ఆటకు అనుగుణంగా చైనా నడుచుకుంటుందని భావించి 1970దశకంలో దాన్ని అసలైన చైనాగా గుర్తించారు. తరువాత 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలోకి అనుమతించారు. అప్పుడు చైనా విదేశీమారకద్రవ్య నిల్వలు కేవలం 200 బి.డాలర్లు మాత్రమే, అవి 2023 జనవరి నాటికి 3,379 బి.డాలర్లకు చేరాయి. ఇంత భారీ మొత్తం ఉంది కనుకనే అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు అవకాశం వచ్చింది. వాటి కోసం మొహం వాచి ఉన్న దేశాలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. వందల కోట్ల డాలర్లను పెట్టుబడులు, అప్పుగా తీసుకుంటున్నాయి. ఎక్కడా మిలిటరీ కేంద్రాలను పెట్టటం లేదు గనుక దాని మీద అనుమానాలు కూడా లేవు. ఇస్లామిక్‌ దేశాల మధ్య షియా-సున్నీ విబేధాలను అన్ని దేశాలను తన అదుపులో ఉంచుకోవాలని చూసింది. చివరికి దానికి కూడా తెరపడింది. షియా ఇరాన్‌-సున్నీ సౌదీ అరేబియాలను చైనా దగ్గరకు చేర్చింది. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలకు తెరపడేందుకు ఆ ఒప్పందం దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ప్రాంతీయ, దేశాల అంతర్గత వివాదాలకు దూరంగా ఉండటమే చైనా పలుకుబడిని పెంచుతున్నవాటిలో ఒకటి.


నాటోలో భాగంగా అమెరికాతో స్నేహం చేస్తూనే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ ఇటీవలి బీజింగ్‌ పర్యటనలో మాట్లాడిన తీరు అమెరికాను బిత్తరపోయేట్లు చేసింది. తన వెనుక ఉన్న వారు ఎప్పుడేం చేస్తారో అన్న అనుమానాలను పెంచింది. తైవాన్‌ అంశంపై అమెరికా బాటలో నడిచేది లేదని, చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్య కలిగి ఉంటామని మక్రాన్‌ చెప్పాడు. వందల కోట్ల లాభదాయక ఒప్పందాలను ఫ్రెంచి కంపెనీలకు సాధించటంలో మక్రాన్‌ చొరవ చూపాడు. ఒక్క ఫ్రాన్సే కాదు జర్మనీ వైఖరి కూడా అలానే ఉంది.డాలరు పెత్తనానికి తెరదించాలన్న అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతున్నది. నిజానికి అనేక దేశాల మీద ఆంక్షలు విధిస్తూ అమెరికా దాన్ని ముమ్మరం చేస్తున్నది. మొత్తం మీద చూసినపుడు నూతన ప్రపంచ వ్యవస్థ రూపుదిద్దు కుంటున్నది. అది అమెరికా-పశ్చిమ దేశాల కేంద్రంగా జరగటం లేదు. ఏక ధృవ కేంద్రానికి బదులు రెండు లేదా అంతకు మించి ఎక్కువ అధికార కేంద్రాలున్నపుడు దేశాలకు ఎంచుకొనే అవకాశాలు పెరుగుతాయి.


” సాయుధ వివాదాన్ని మరింతగా కొనసాగించటంలో రెండు శక్తులకు పరస్పర ప్రయోజనం ఉంది, దీన్ని సాకుగా చూపి పౌరశక్తులకు అధికారాన్ని బదలాయించకుండా చూస్తున్నాయని ” సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి సాలె మహమ్మద్‌ సూడాన్‌ పరిణామాలపై చెప్పారు.ఈ వివాదంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతు ఇవ్వటం ద్వారా ఎఫ్‌ఎఫ్‌సి కూటమి తన విశ్వసనీయతను కోల్పోయిందని గతంలో ఆ సంస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి తరువాత వెలుపలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విప్లవ కార్యాచరణకు తిరిగి ఉపక్రమించటం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచటం తప్ప మరొక మార్గం లేదని కూడా పేర్కొన్నది.