ఎం కోటేశ్వరరావు
జనంపై భారాలు మోపుతూ పార్లమెంటు ఆమోదించిన విత్త బిల్లుకు వ్యతిరేకంగా జూన్ 25న కెన్యాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా 26 మంది కాల్పుల్లో మరణించగా అనేక మంది గాయపడినట్లు దేశ మానవహక్కుల కమిషన్ ప్రకటించింది.మృతుల సంఖ్య 30దాటినట్లు వార్తలు వచ్చాయి.దేశ పార్లమెంటు భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టటంతో సహా అనేక చోట్ల లూటీలు, దహనకాండకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బిల్లుపై తాను సంతకం పెట్టటం లేదంటూ అధ్యక్షుడు విలియమ్స్ రూటో ప్రకటించాడు. అయినప్పటికీ నమ్మకం లేక రాజీనామా చేయాలని కోరుతూ జూలై రెండున తిరిగి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చారు. రాజధాని నైరోబీలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకులను బ్రెట్టన్ ఉడ్ కవలలు అంటారు. అక్కడ జరిగిన సమావేశాల్లో అవి పుట్టాయిగనుక ఆ పేరు వచ్చింది.ప్రజాకంటకుల పుట్టుక కూడా మామూలుగానే జరిగినప్పటికీ వారు పెరిగి పెద్దవారైన తరువాత మాత్రమే సమాజానికి ముప్పుగా చివరకు జనం చేతిలో తుప్పుగా మారతారు.కానీ ఈ కవలలు అలాంటివి కాదు. పుట్టుకతోనే వాటి దగ్గరకు వెళ్లిన దేశాలకు స్పాట్ పెడుతున్నాయి.ప్రపంచ బ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తమ విధానాలకు ముఖ్యంగా విద్యుత్ సంస్కరణలకు ఒక ప్రయోగశాలగా మార్చిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, పర్యవసానంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పరాజయం పాలైన విషయాన్నీ వేరే చెప్పనవసం లేదు.
ఆఫ్రికా ఖండంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక దేశం కెన్యా. హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఈ దేశ జనాభా 5.22 కోట్లు. రాజధాని నైరోబీ. ఐరోపా సామ్రాజ్యవాదుల వలసగా ఉంది. బ్రిటీష్ పాలకులు తొలుత తమ రక్షక ప్రాంతంగా, తరువాత వలసగా మార్చారు.1952 నుంచి ప్రారంభమైన మౌమౌ విప్లవంగా పిలిచిన ఉద్యమం కారణంగా 1963లో స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది.ఆఫ్రికాలో ఆర్థికంగా అభివృద్ధి, ప్రజాస్వామిక వ్యవస్థతో స్థిరంగా ఉన్న దేశంగా చెబుతారు.అలాంటిది గతంలో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనాలపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మరణించారని, నేరస్థ ముఠాల చేతుల్లో గితురాయి అనే చోట250 మంది మరణించినట్లు, వారి మృత దేహాలను కూడా లభ్యం కావటం లేదని, అనేక మంది అపహరణలకు గురైనట్లు వార్తలు వచ్చాయి.పౌరులపై భారాలను మోపే ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన వెంటనే ఆందోళన తలెత్తింది. దాంతో బిల్లును నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించినప్పటికీ నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. అతగాడి మాటల మీద తమకు నమ్మకం లేదంటూ రూటో రాజీనామా చేసి గద్దె దిగాల్సిందేనంటూ యువత అనేక పట్టణాల్లో ప్రదర్శనలు జరిపింది. మిలిటరీ కవాతులతో భయపెట్టాలని చూసినా బెదరటం లేదు. మరో శ్రీలంకగా మారినా ఆశ్చర్యం లేదు.
ఎందుకీ పరిస్థితి వచ్చింది ? దేశం అప్పులపాలైంది. దేశ, విదేశీ అప్పు 80 బిలియన్ డాలర్లు దాటింది. వాటిని గడువులోపల తీర్చే పరిస్థితి కనిపించటం లేదు.దివాలా ప్రకటిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు దగ్గరకు వెళ్లింది. మేం చెప్పిన షరతులకు అంగీకారం తెలిపితే ఇబ్బందుల నుంచి బయటపడవేస్తామని అవి చెప్పాయి. ఆ మేరకు ప్రభుత్వం 2021లో ఒప్పందం చేసుకుంది. బ్రెట్టన్‌ఉడ్ కవలలు, ఇతర అంతర్జాతీయ సంస్థలన్నీ ముందుగా అప్పెలా తీరుస్తారో చెప్పమంటాయి. వెంటనే, మీరేమీ చెప్పలేరుగానీ మేం చెప్పినట్లు చేయండి, వాటికి మీ పేరు పెట్టుకోండి అంటాయి. ఇదిగో అలాంటి ఒప్పందంలో భాగంగానే కెన్యా పార్లమెంటు ఆమోదించిన 2024 విత్త బిల్లు.దాని ప్రకారం నిత్యావసర వస్తువులు, పిల్లలకు మార్చే డైపర్లతో సహా అనేక వస్తువులపై ఎడాపెడా పన్నులను పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదలతో అతలాకుతలంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారనుందనే భయంతో జనం నిరసనలకు దిగారు. ఆగ్రహం ఎలా ఉందంటే పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు.ఎంపీలందరూ బతుకు జీవుడా అంటూ పారిపోయారు.అయినా తగ్గేదే లే అన్నట్లుగా అధ్యక్షుడి వైఖరి ఉండటంతో ఆందోళన విస్తరించింది.దాంతో బిల్లు మీద సంతకం చేయటం లేదని ప్రకటించాడు. ఇదంతా ఒక నాటకమని, వ్యవధి తీసుకొనేందుకు వేసిన పాచిక అని చెబుతున్నారు.నిజానికి జనంలో ఆగ్రహం ఇప్పటికిప్పుడు పెరిగింది కాదు. కరోనాకు ముందు పరిస్థితి దిగజారటం ప్రారంభమైంది, కరోనా మరింత దెబ్బతీసింది. అనేక మంది యువతకు ఉపాధిపోయింది. గతేడాది వేసవిలోనే పన్నుల వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఉపాధి, పరిశ్రమలు పెద్దగా పెరగకపోయినా అనేక దేశాల్లో విదేశీ సంస్థలు ఇచ్చే రుణాలు, వాటితో పాటు దొరకే ముడుపులకు ఆశపడి ఆర్థిక వ్యవస్థ అవసరాలతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు గాను దొరికిన మేర అప్పులు చేసిన దేశాలలో కెన్యా ఒకటి.రెండువేల సంవత్సరాల ప్రారంభంలో విదేశాల నుంచి తీసుకున్న భారీ మొత్తాలను ఆర్థిక వృద్దికి ఖర్చు పెట్టలేదు.దానికి తోడు వరదలు, కరోనా జతకలిశాయి.
దివాలా కోరు ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న అన్ని వర్ధమాన దేశాల మాదిరే కెన్యా కూడా ఉంది.ప్రపంచంలో మూడు వందల కోట్ల మంది జనాభా ఉన్న దేశాలు ప్రజారోగ్యం, వైద్యం వంటి వాటికి చేస్తున్న ఖర్చు కంటే రుణాల అసలు, వడ్డీలు తీర్చటానికి ఎక్కువ మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అధ్యక్షుడు బినాయిఫెర్ నౌరోజీ చెప్పాడు. వలసవాద అవశేషాలు, అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, విత్త దుర్వినియోగం. పెరిగిన ఆర్థిక, తెగల మధ్య అసమానతల వంటి అంశాలు కెన్యాను పట్టిపీడిస్తున్నాయి. వీటన్నింటినీ తొలగించి మంచి రోజులను తెస్తానంటూ అనేక సంవత్సరాలు మంత్రిగా, ఐదేండ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పని చేసిన విలియం రూటో 2022 ఎన్నికల్లో అధ్యక్షుడయ్యాడు. రెండు సంవత్సరాల్లోనే తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి ప్రజా వ్యతిరేకిగా రుజువు చేసుకున్నాడు. తాజా విత్త బిల్లును ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఉద్దేశించారు. దానికి గాను పొదుపు అని ముద్దు పేరు పెట్టారు. చూడండి నా కార్యాలయ ఖర్చుకే కోతపెడుతున్నా అంటూ రూటో ప్రకటించాడు. ఇదంతా జనం మీద మోపే భారాలకు నాంది. ప్రపంచంలో పొదుపు చర్యలు ఎక్కడ తీసుకున్నప్పటికీ తొలుత కోతల వేటు పడేది సామాన్యులు, వారికి ప్రభుత్వం చేసే ఖర్చుల మీదే.అన్నింటికీ ఒక్కసారే కోతపెడితే జనం సహించరు. చేదు మాత్రను మింగించటం అలవాటు చేసినట్లుగా దశల వారీ మొదలు పెడతారు. కెన్యా రాబడిలో 60శాతం రుణాలు తీర్చేందుకే పోతోంది. అందువలన నేరుగా చేసే నగదు బదిలీల మొత్తాల కోత, చివరకు బడి పిల్లల మధ్యాహ్న భోజనఖర్చునూ తగ్గించనున్నారు.
పశ్చిమ దేశాలకు, ప్రత్యేకించి అమెరికా తొత్తుగా అధ్యక్షుడు విలియమ్ రూటో వ్యవహరిస్తున్నాడడని కెన్యా కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది. గద్దె దిగేవరకూ ఆందోళన చేస్తామని ప్రకటించింది. రాజీనామా మినహా మరొకదాన్ని అంగీకరించేది లేదంది. గాజాలో మారణకాండ జరుపుతున్న యూదు దురహంకార ఇజ్రాయెల్ పాలకులకు, ఉక్రెయిన్ వివాదంలో నాటోకు మద్దతు ఇచ్చాడు. ఇటీవల కెన్యాను నాటో ఏతర భాగస్వామిగా ప్రకటించారు. సిఐఏ అల్లుతున్న కతలన్నింటినీ వల్లిస్తున్నాడు. అమెరికా మిలిటరీ కార్యకలాపాలకు మండా అనే దీవిని అప్పగించాడు. దేశీయంగా ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతున్నట్లు కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. ఒకసారి పార్లమెంటు ఆమోదించిన బిల్లును వెనక్కు తీసుకోవటానికి రాజ్యాంగం అనుమతించదని, ఒక వేళ అధ్యక్షుడు వెనక్కు పంపితే మూడింట రెండువంతుల మెజారిటీతో ప్రతిపాదనను ఆమోదిస్తే అది చట్టమై కూర్చుంటుందని చెప్పింది. పార్లమెంటు బిల్లును ఆమోదించిన తరువాత 14రోజుల్లో అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది, లేదా సవరణలు చేయాలంటూ వెనక్కు పంపాలి.
రొట్టెలపై 16,వంటనూనెలపై 25శాతం పన్ను ప్రతిపాదించారు.ఆర్థిక లావాదేవీలపై దశలవారీ పన్ను పెంపుదల, మోటారు వాహనాల ధరలో రెండున్నరశాతం ప్రతి ఏటా పన్ను కొత్తగా విధింపు, పర్యావరణానికి హాని కలిగించే వృధా ఉత్పత్తులపై పన్ను ప్రతిపాదించారు. దీనిలోనే దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్ వస్తువులు, శానిటరీ పాడ్‌ల మీద పన్ను ప్రతిపాదించారు. జిఎస్‌టి 16శాతం, ఆసుపత్రుల్లో వాడే పరికరాలు, నిర్మాణ సామగ్రి మీద కూడా పన్ను ప్రతిపాదించారు.ఉద్యోగుల వేతనాలపై గరిష్ట పన్ను మొత్తాన్ని 30 నుంచి 35శాతానికి పెంచగా, కొత్తగా 1.5శాతం ఇంటి పన్ను, వైద్య బీమా పేరుతో 2.75శాతం, ఇంథనంపై ఎనిమిదిశాతంగా ఉన్న పన్నును 16శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. పన్నుల పెంపుదల బాధాకరమే అయినప్పటికీ మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడాలంటే జనం త్యాగాలు చేయాల్సి ఉంటుందని అధ్యక్షుడు సమర్ధించుకున్నాడు. తనకు గత ప్రభుత్వం నుంచి 65 బిలియన్ డాలర్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నాడు. రానున్న కాలంలో పన్ను వసూలు రోజులను కూడా పాటించాల్సి ఉంటుందేమో అంటూ జోకులు వేశాడు. ఏడాది కాలంలో 40సార్లు విదేశీ పర్యటనలు జరిపిన రూటో అట్టహాసంగా ఎంతో ఖర్చు చేశాడు. ఎందుకీ పర్యటనలు అంటే పెట్టుబడుల సాధన, ఉద్యోగఅవకాశాలను వెతికేందుకు అని సమర్ధించుకున్నాడు.ఇదే సమయంలో అనేక సంస్థలు మూతబడి వేలాది మందికి ఉపాధి పోయింది.రానున్న రోజుల్లో ఇంకా కార్యకలాపాలను కుదించవచ్చని కెన్యా యజమానుల సంఘం పేర్కొన్నది.జనం దగ్గర డబ్బులేక రోజుకు ఏడువందల గ్యాస్ సిలిండర్లు అమ్మేతాను ప్రస్తుతం రెండువందలకు పడిపోయినట్లు, తన దగ్గర ఉన్న సిబ్బందిని ఆ మేరకు తగ్గించినట్లు ఒక సంస్థ యజమాని చెప్పాడు. ప్రభుత్వ సిబ్బంది పన్ను వసూలు పేరుతో వ్యాపారులను వేధిస్తున్నట్లు చెప్పాడు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, జనాన్ని పట్టించుకోకపోవటం వంటి అంశాలను తీసుకొని తాము వస్తే మంచి రోజులు తెస్తామని చెప్పి, అంతకంటే ఎక్కువ భారాలు మోపిన వారిని చరిత్రలో ఎందరో ఉన్నారు. శ్రీలంకలో తాము అభిమానించిన దేశాధ్యక్షుడినే జనం చివరకు తరిమి కొట్టిన తీరును చూశాము. కెన్యాలో ప్రతిపాదించిన భారాలను రద్దు చేస్తే సరే లేకుంటే ఏం జరుగుతుందో చెప్పలేము.
