ఎం కోటేశ్వరరావు
తనకు లేని అధికారాన్ని చెలాయించబోయి కేరళ గవర్నర్ అభాసుపాలయ్యారు.ఉక్రోషం పట్టలేక కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. మలప్పురం జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా బంగారం స్మగ్లింగ్,దానితో సంబంధాలున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలపై, సిఎం పినరయి విజయన్ చెప్పినట్లు హిందూ పత్రికలో ఆపాదించిన అవాస్తవ అంశాలను అధారం చేసుకొని గవర్నర్ సిఎం మీద దాడికి దిగారు. సదరు పత్రికలో వచ్చిన అంశాలపౖౖె నేరుగా 2024 అక్టోబరు ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తనకు నివేదించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్, డిజిపి షేక్ దర్వేష్ సాహిబ్‌లను గవర్నర్ ఆదేశించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు.అంతకు ముందు ఇదే అంశం గురించి వివరించాలని, తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని సిఎంకు గవర్నర్ లేఖ రాశారు. అయితే ఆ పత్రిక విజయన్‌కు ఆపాదించిన మాటలను ఆయన చెప్పలేదని సవరించుకున్న తరువాత కూడా దాన్నే పట్టుకొని కక్ష సాధించాలని గవర్నర్ ప్రయత్నించటం గమనించాల్సిన అంశం. మలప్పురం గురించి సిఎం చెప్పని అంశాలు తమ వార్తలో చోటు చేసుకున్నాయని, ఒక పబ్లిక్ రిలేషన్స్ ఏజన్సీకి చెందిన వ్యక్తి సిఎంపేరుతో వాటిని కలిపి రాయమని కోరినట్లు ఆ పత్రిక రాసింది. అయితే సిఎం తన ప్రచారం కోసం ఒక ఏజన్సీని నియమించారంటూ ప్రతిపక్షం దాని మీద రాద్దాంతం చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి ఏజన్సీని నియమించలేదని ముఖ్యమంత్రి విజయన్ స్పష్టం చేశారు. సిఎంకు రాసిన లేఖకు ఎలాంటి స్పందన లేకపోవటంతో అధికారులు వచ్చి వివరణ ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు.‘‘ దొంగబంగారంతో వచ్చిన సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ సిఎం చెప్పారని, అలాంటి పనికి పాల్పడుతున్నవారెవరు, వారిపై తీసుకున్న చర్య ఏమిటి ?వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సిఎంను కోరాను.‘‘ కొద్ది రోజులు వేచి చూశాను. రాష్ట్రంలో చాలా తీవ్రమైన పరిస్థితి ఉన్నట్లు నాకు కనిపిస్తోంది, సిఎం తన బాధ్యతను విస్మరించారు. నాకు తెలియకుండా ఎందుకు దాచాలని చూస్తున్నారో తెలియటం లేదని విలేకర్లతో గవర్నర్ ఆరోపించారు. అధికారులకు గవర్నర్ ఆదేశించటంపౖౖె రాజభవన్‌కు సిఎం ఒక లేఖ రాస్తూ అలా నేరుగా పిలిచే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అంగీకారంతోనే సీనియర్ అధికారులను పిలవాలని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలను చూపి తనకు సమాచారం ఇవ్వకుండా ఉండజాలరని, రాష్ట్రపతికి నివేదించాల్సి ఉన్నందున వివరణ ఇవ్వాల్సిందేనని సిఎంకు మరొక లేఖ రాశారు. కోరిన సమాచారం ఇవ్వకపోతే నిబంధనలు, రాజ్యాంగబద్దమైన విధి నిర్వహణను ఉల్లంఘించినట్లు అవుతుందని గవర్నర్ బెదిరించారు.
తనకు చెప్పకుండా కొన్ని విషయాలను దాస్తున్నారన్న గవర్నర్ ఆరోపణలపై సిఎం పినరయి విజయన్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశారు. తనను పక్కన పెట్టి తన ప్రభుత్వంలో పనిచేసే అధికారులను పిలవటం ఏమిటని ప్రశ్నించారు. సత్యదూరమైన, ఆధారంలేని అంశాలతో గవర్నర్ చేసిన ఆరోపణల కారణంగా గౌరవ ప్రదమైన రీతిలో నిరసనతెలపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి తానెలాంటి బహిరంగ ప్రకటన చేయలేదని, గవర్నర్ వక్రీకరించిన కథనంపై ఆధారపడ్డారని స్పష్టం చేశారు. కేరళ వెలుపల దొంగబంగారాన్ని పట్టుకున్న వివరాలను కొన్నింటిని తాను సేకరించానని దొంగరవాణా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, గణనీయ మొత్తంలో పన్నుల ఎగవేత జరుగుతుందని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను కూడా హెచ్చరించానని పేర్కొన్నారు. విమానాశ్రయాల ద్వారా జరుగుతున్న దొంగబంగార రవాణాను అరికట్టాల్సిన ప్రాధమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వ కస్టమ్స్‌శాఖదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను దాని గురించి అడగకూడదని, అయినా ముఖ్యమంత్రితో నిమిత్తం లేకుండా రాష్ట్ర అధికారులను పిలవటం ఏమిటని ప్రశ్నించారు.
అక్టోబరు ఏడవ తేదీ సోమవారం నాడు కేరళ అసెంబ్లీలో జరిగిన అనూహ్య పరిణామంతో కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ తమ ఎత్తుగడ వికటించటంతో అల్లరికి దిగింది. దాంతో స్పీకర్ సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు.తాము సంధించిన 49 ప్రశ్నలను నక్షత్ర గుర్తు కలవిగా పరిగణించి సభలో ప్రత్యక్షంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా స్పీకర్ కార్యాలయం వాటిలో ఎక్కువ భాగం రాతపూర్వక సమాధానాలు ఇచ్చే ప్రశ్నలుగా మార్చివేసిందంటూ ప్రశ్నోత్తరాల సమయంలో యుడిఎఫ్ సభ్యులు గొడవకు దిగారు. ఆ సందర్భంగా స్పీకర్‌కు దురుద్ధేశ్యాలను ఆపాదించటంతో పాటు పోడియం ముందుకు వెళ్లి అల్లరి చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేత సతీశన్ తన స్థానంలోకి వెళ్లారు. అయితే కొందరు కాంగ్రెస్ సభ్యులు అల్లరి కొనసాగిస్తుండగా అసలు ప్రతిపక్ష నేత ఎవరూ, మీరందరూ నేతలేనా అని ప్రశ్నించటాన్ని సతీశన్ తప్పుపడుతూ తమను అవమానించారని, స్పీకర్ ఎఎం శంషీర్ పరిణితిలేకుండా మాట్లాడారని, ఆ పదవికే అవమానమని తీవ్రంగా ఆరోపించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి అవినీతి పరుడని ఆరోపించారు. తమ ప్రశ్నల స్వభావాన్ని మార్చినందుకు నిరసనగా ప్రశ్నోత్తరాల సమయాన్ని బహిష్కరించినట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత, యుడిఎఫ్ సభ్యుల తీరును ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. ప్రతిపక్ష నేత దిగజారిన వ్యక్తని పదే పదే ప్రదర్శించుకుంటున్నారని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ప్రతిపక్షనేతను చూడలేదని దుయ్యబట్టారు. స్పీకర్ మీద చేసిన విమర్శలను ఖండిరచాలన్నారు. తనను అవినీతి పరుడని ప్రతిపక్ష నేత అంటే కుదరదని సమాజం అంగీకరించదని అన్నారు.
ప్రశ్నోత్తరాల బహిష్కరణ తరువాత జీరో అవర్‌లో సభలో ప్రవేశించిన యుడిఎఫ్ సభ్యులు మరోసారి అల్లరికి దిగారు. ప్రతిపక్ష నేత సతీశన్ మాట్లాడుతూ తనపై సిఎం చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, సిఎం మాదిరి అవినీతి పరుడు కాకుండా చూడమంటూ తాను ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్ధిస్తానని చెప్పుకున్నారు. దాంతో ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పాటు తమ వెంట తీసుకువచ్చిన బానర్‌ను ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులను అడ్డుకొనేందుకు కొందరు అధికారపక్ష సభ్యులు కూడా ముందుకు రావటంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. హిందూ పత్రిక ప్రతినిధితో సిఎం ముఖాముఖి మాట్లాడినదానిని వక్రీకరించి వార్త రాశారు. సిఎం చెప్పని అంశాలను ఒక ప్రజాసంబంధాల సంస్థ ప్రతినిధి జోడిరచమని కోరగా రాసినట్లు సదరు పత్రిక తరువాత తప్పును సవరించుకుంటూ పెద్ద వార్తను ఇచ్చింది. అసలు తామే సంస్థను నియమించలేదని, అవసరం కూడా లేదని విజయన్ స్పష్టం చేసినప్పటికీ దాని గురించి సభలో అల్లరి చేసేందుకు కాంగ్రెస్ ఎత్తువేసింది. దానిలో భాగంగా ఆ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. అక్కడే కాంగ్రెస్ పప్పులో కాలేసింది. ఇతర అంశాల మీద ప్రతి పక్షాలు ఇచ్చిన వాటిని చర్చకు అంగీకరించారు తప్ప నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలతో కూడిన వాయిదా తీర్మానాలను ఏ రాష్ట్ర అసెంబ్లీ లేదా పార్లమెంటులో ఆమోదించిన దాఖలాలు ఇంతవరకు లేవు. బహుశా చరిత్రలో మొదటి సారిగా కేరళలో జరిగింది. తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తారని, కనీసం సభలో ఉంచరని, దాన్ని అవకాశంగా తీసుకొని అల్లరి చేయాలనే ఎత్తుగడతో వచ్చిన కాంగ్రెస్‌ను ఊహించని విధంగా సిఎం దెబ్బతీశారు. ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని, మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడుగంటల పాటు ఇతర కార్యక్రమాలను వాయిదా వేసి చర్చించటానికి అంగీకరిస్తూ విజయన్ ప్రకటించారు. ఆ తరువాత జీరో అవర్‌లో సభలోకి వచ్చిన కాంగ్రెస్ సభ్యులు తాము అనుకున్నదొకటి అయింది ఒకటని గ్రహించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరసనపేరుతో సభలో గందరగోళం సృష్టించి సభను వాయిదాపడేట్లు చేశారు. ఇలాంటి తీర్మానాలపై చర్చ తరువాత చివరగా ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు, అంతటితో చర్చ ముగుస్తుంది. ప్రతిపక్ష ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికారపక్షం పూర్తిగా సమాయత్తమైందని గ్రహించి తమ ఆరోపణల బండారం బయటపడుతుందని భావించిన కాంగ్రెస్ అల్లరికి దిగిందన్నది స్పష్టం.
వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన మద్దతుతో మలప్పురం జిల్లా నుంచి రెండుసార్లు గెలిచిన స్వతంత్ర సభ్యుడు పివి అన్వర్ గత కొద్ది నెలలుగా సంఘటన నుంచి వెళ్లిపోయేందుకుగాను సిపిఎం, సిఎం, ఇతరుల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. అతగాడిని చేర్చుకొనేందుకు కాంగ్రెస్ కూడా సిద్దంగా లేదు. దాంతో డిఎంకెలో చేరి కేరళలో ఆ పార్టీ ఏర్పాటు, లేదా తమిళనాడు ముస్లింలీగుతోనైనా చేతులు కలపాలని పావులు కదిపారు. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో సత్సంబంధాలు కలిగిన డిఎంకె నేత స్టాలిన్ అందుకు అంగీకరించలేదు, కనీసం అన్వర్ కలుసుకొనేందుకు సమయం కూడా ఇవ్వలేదు. అక్కడి ముస్లిం లీగ్ కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నందున అది కూడా విముఖత చూపింది. దాంతో డిఎంకె అనే పేరు వచ్చేట్లుగా డెమోక్రటిక్ మువ్‌మెంట్ ఆఫ్ కేరళ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని రాజకీయాలు నడపాలని అన్వర్ నిర్ణయించుకున్నారు.డిఎంకె నేతలు ధరించే రంగు కండువాలను కప్పుకొని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు.
మలప్పురం జిల్లాలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని, వచ్చిన సొమ్మును దేశవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ ముఖ్యమంత్రి మాట్లాడి జిల్లాను అవమానించారని అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేశారు. సిఎం అలాంటి ఆరోపణలు చేయలేదని, అసలు ఆ జిల్లాను ఏర్పాటు చేసిందే కమ్యూనిస్టులని, నాటి కాంగ్రెస్ నేతలు జనసంఘంతో కలసి జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారని, అలాంటి పార్టీతో ముస్లింలీగ్ స్నేహం నెరుపుతున్నదని సిపిఎం తిప్పికొట్టింది. ఆ జిల్లా గురించి మాట్లాడేందుకు ఎవరికీ యాజమాన్య హక్కులు లేవని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ విలేకర్ల సమావేశంలో చెప్పారు. తాము మెజారిటీ, మైనారిటీ మతోన్మాదాలు రెండిరటినీ వ్యతిరేకిస్తామని అన్నారు. రెండవ సారి విజయన్ అధికారానికి వచ్చిన తరువాత ప్రతిపక్ష యుడిఎఫ్, ఇతర శక్తులు ఒక అవకాశవాద కూటమిగా చేతులు కలిపి మీడియాలో కొన్ని సంస్థల మద్దతుతో 1957నాటి తొలి కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విముక్తి ఆందోళన మాదిరి రెచ్చగొట్టేందుకు పూనుకున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నది. వెనుకబాటు తనంతో ఉన్న కారణంగా ముఖ్యమంత్రిగా నంబూద్రిపాద్ ప్రత్యేక జిల్లాగా మలప్పురాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఒక చిన్న పాకిస్తాన్ను ఏర్పాటు చేస్తున్నారంటూ నాడు జనసంఫ్‌ు పార్టీ ఆరోపించిందని, దానితో చేతులు కలిపింది కాంగ్రెస్ అని చెప్పారు. ఒకప్పుడు ముస్లింలు, కమ్యూనిస్టులను పోలీసులుగా తీసుకొనేవారు కాదని నంబూద్రిపాద్ అధికారానికి వచ్చిన తరువాత పరిస్థితి మారిందన్నారు. సిపిఎంలో దేవుడిని నమ్మేవారు, నమ్మని వారు కూడా పని చేయవచ్చని, తమ మద్దతుతో రెండు సార్లు గెలిచిన స్వతంత్ర సభ్యుడు అన్వర్ ఇప్పుడు జమాతే ఇస్లామీ, ఎస్‌డిపిఐ, యుడిఎఫ్ మద్దతుతో అసత్యాలను ప్రచారం చేస్తున్నట్లు గోవిందన్ చెప్పారు. ముస్లింలీగ్, జమాతే ఇస్లామీ రెండూ కూడా ఎన్‌డిపిఐ భావజాలంతో ముస్లింలను సమీకరిస్తున్నాయని విమర్శించారు. అలప్పూజ, పాలక్కాడ్ జిల్లాల్లో పోలీసులు గట్టిగా జోక్యం చేసుకున్న తరువాత ఆర్‌ఎస్‌ఎస్`ఎస్‌డిపిఐ మతహింస అదుపులో ఉందని, అవి రెండూ సిపిఎం మీద రాజకీయదాడి చేస్తున్నాయంటే మతశక్తులకు వ్యతిరేకంగా తాము పనిచేస్తున్నదానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఓట్లు బిజెపికి పడిన కారణంగానే త్రిసూర్‌లో ఆ పార్టీ గెలిచిందని చెప్పారు.
కేరళలో మీడియా వివాదాల తయారీ కేంద్రంగా మారిందని సిఎం పినరయి విజయన్ విమర్శించారు. వయనాడ్‌లో జరిగిన ప్రకృతి విలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ఇచ్చారని ఆ కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. తప్పుడు వార్తల కారణంగా రాష్ట్రం అనర్హమైన సాయం పొందేందుకు చూస్తోందనే తప్పుడు అభిప్రాయం కలుగుతోందని అన్నారు. వీటి ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయటమేనని, వాటిని ఆధారం చేసుకొని ప్రతిపక్షం విమర్శలకు దిగుతున్నదని అన్నారు. కేంద్రానికి సమర్పించిన మెమోరాండాన్ని నిపుణులు రూపొందించారు తప్ప మంత్రులు కాదని, దానిలోని అంకెలనే తీసుకొని మీడియా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నదని అన్నారు. విధ్వంసం నుంచి కోలుకొనేందుకు రాష్ట్రం చూస్తుంటే టీవీ ఛానల్స్ రేటింగ్స్ పెంచుకొనేందుకు ఛానల్స్ చూస్తున్నాయన్నారు.
