ఎం కోటేశ్వరరావు
రూపాయి పతనంలో రికార్డుల మీద రికార్డులను బద్దలు కొడుతుంటే ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ మాటా పలుకూ లేకుండా గుడ్లప్పగించి చూస్తున్నది. ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? మోడీ అంటే విశ్వగురువు గనుక ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోరని, ప్రపంచ రాజకీయాలను చక్కపెడుతున్నారని అనుకుందాం. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, ఇతర పెద్దలు ఏమయ్యారు. శుక్రవారం నాడు 85.80వరకు పతనమై 85.48దగ్గర స్థిరపడిరది, అంతకు ముందు రోజు 85.27కు దిగజారింది. నరేంద్రమోడీ గురించి చరిత్రలో ఇప్పటికే అనేక వైఫల్యాలు నమోదయ్యాయి.ఒకసారి చెప్పిన మాట మరోసారి చెప్పరు, వైఫల్యం గురించి వాటి వలన జనానికి కలిగిన ఇబ్బందులకు విచార ప్రకటన లేదు. రూపాయి పతనం గురించి తాను మాట్లాడిన మాటలను జనం మరచిపోయి ఉంటారన్న గట్టి నమ్మకం కారణంగానే మాట్లాడటం లేదు. బిజెపి ప్రచార కమిటీ నేతగా 2014 ఎన్నికలకు ముందు రూపాయి పతనాన్ని కాంగ్రెస్‌పై దాడికి ఒక ఆయుధంగా వాడుకున్నారు. విలువలువలువల గురించి నిత్యం తమ భుజాలను తామే చరుచుకొనే సంఘపరివార్‌కు చెందిన వ్యక్తి నుంచి అనేక మంది జవాబుదారీతనాన్ని ఆశించారు, నమ్మారు.వారందరూ కూడా మౌనంగా ఉంటున్నారు, దేశం ఏమై పోతున్నా పట్టని ఈ బలహీనత ఎందుకు ?
రూపాయి విలువ పతనమౌతుంటే గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమన్నారో తెలుసా ! ‘‘ ఆర్థికం లేదా రూపాయి విలువ పతనం గురించి ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు, తన కుర్చీని ఎలా కాపాడుకోవాలన్నదే దాని ఏకైక ఆందోళన. ఈ కారణంగా దేశం ఈ రోజు ఆశాభంగం చెందింది. గత మూడు నెలలుగా పతనం అవుతున్న రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దాన్ని అవకాశంగా తీసుకుంటాయి. గడచిన ఐదు సంవత్సరాలుగా ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెబుతున్నారు తప్ప జరిగిందేమీ లేదు ’’ (2013 ఆగస్టు 20, బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో పిటిఐ వార్త).మోడీ ఈ ఆరోపణలు చేసిన రోజు డాలరుకు రూపాయి విలువ 64.11గా ఉంది, తరువాత కొంత మేరకు పెరిగినా గత పదేండ్లలో మొత్తం మీద చూసినపుడు 2024 డిసెంబరు 27వ తేదీ 85.80కు దిగజారింది. పార్లమెంటులో బిజెపికి, దానికి వంతపాడుతున్న పార్టీల బలాన్ని బట్టి 2029వరకు మధ్యలో అనూహ్య రాజకీయ సంక్షోభం ఏర్పడితే తప్ప ప్రధానిగా మోడీ పదవికి ఎలాంటి ఢోకా ఉండదు. పదేండ్ల క్రితం రూపాయి విలువ పతనం గురించి గుండెలు బాదుకొన్న నరేంద్రమోడీ పదిహేనేండ్లు అధికార వ్యవధిని పూర్తి చేసుకొనే నాటికి 101కి పతనం అవుతుందని ద్రవ్యవ్యాపార నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతన చరిత్రను చూసినపుడు ఇంకా ఎక్కువ మొత్తంలో దిగజారేందుకే అవకాశం ఉంది తప్ప బలపడే లక్షణాలు కనిపించటం లేదు. 2024 డిసెంబరు 27న రూపాయి 85.80కి దిగజారి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ పతనం కొందరికి మోదం ఎందరికో ఖేదాన్ని తెస్తుంది. ఎగుమతులు చేసే వారికి, విదేశాల నుంచి మనదేశానికి డబ్బు పంపేవారికి సంతోషం కలిగిస్తే, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల భారంతో కోట్లాది సామాన్యులకు జేబు గుల్ల అవుతుంది.అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయిన నవంబరు ఐదున రూపాయి విలువ 84.11 ఉంటే డిసెంబరు చివరి వారంలో ముందే చెప్పుకున్నట్లు 85.80ని తాకింది. జనవరి 20న అధికారాన్ని స్వీకరించే సమయానికి, తరువాత ఏమౌతుందో తెలియదు. రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబాంకు రంగంలోకి దిగి విదేశీ కరెన్సీ విక్రయాలకు పాల్పడి స్థిరంగా ఉండేట్లు చేస్తుంది. ఇప్పుడూ చేసింది, గతంలోనూ చేసింది, అయినప్పటికీ మొత్తం మీద పతనం ఆగటంలేదు. దేశం వెలిగిపోతోంది అని బిజెపి చెప్పుకున్న వాజ్‌పాయి ఏలుబడిలో 2000 సంవత్సరంలో రూపాయి విలువ 43.35 ఉంది. అది మన్మోహన్ సింగ్ అధికారానికి వచ్చిన 2004లో 45.10, మోడీ పదవీ స్వీకారంచేసిన 2014లో 62.33గా ఉంది. ఇప్పుడు 85.80 దగ్గర ఉంది.1947లో స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ డాలరుకు 3.30 ఉంది. మోడీ అధికారానికి వస్తే ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవంతో రూపాయిని 45కు తిరిగి తీసుకువస్తారని అనేక మంది పండితులు జోశ్యాలు చెప్పారు. గల్లా పట్టుకు అడుగుదామంటే వారెక్కడా ఇప్పుడు మనకు కనిపించరు. మోడీ నోరుతెరవరు.
రూపాయి పతనంతో జన జీవితాలు అతలాకుతలం అవుతుంటే ఇతర కొన్నింటితో పోల్చితే మన కరెన్సీ పతనం తక్కువ అని అధికారపార్టీ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. వీళ్లను ఏమనాలో అర్ధం కాదు. దాని వలన మనకు ఒరిగేదేమిటి ? పెట్రోలు, డీజిలు లేకపోతే క్షణం గడవదు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా ధర రవాణా ఖర్చులను కూడా కలుపుకొని 89.44 డాలర్లు, అది నవంబరు నెలలో 73.02కు తగ్గింది.తొమ్మిది నెలల సగటు చూసినా 79.20 డాలర్లు. ఈ మేరకు పెట్రోలు, డీజిలు ధరలను ఎందుకు తగ్గించలేదు, కారణం జనం పట్టించుకోకపోవటమే. నిలబెట్టి జేబులు కత్తిరిస్తున్నా మౌనంగా భరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గిస్తాం అన్న విధానాన్ని ఎందుకు పక్కన పెట్టినట్లు ? రూపాయి విలువ పతనంతో వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి మన విదేశీ వాణిజ్య లోటు తగ్గుతున్నదా అంటే ఆ జాడలేదు. రూపాయి పతనం ఎంత పెరిగితే అంతగా ద్రవ్యోల్బణంధరల పెరుగుదల ఉంటుంది. డాలర్లు, ఇతర కరెన్సీలను రప్పించేందుకు విదేశాల్లో ఉన్న భారతీయుల బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేపు పెంపుదలకు ఆర్‌బిఐ అనుమతిస్తున్నది. అమెరికాలో వడ్డీ రేటు కోత, రూపాయి విలువ పతనం కారణంగా విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళుతున్నాయి. మన స్టాక్ మార్కెట్ కుప్పకూలటానికి ఇదొక కారణం. ముడిచమురు, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల యంత్రాల దిగుమతులకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. వస్తు ఎగుమతిదార్లు, ఐటి రంగ కంపెనీలు ప్రధాన లబ్దిదారులుగా ఉంటున్నాయి.
రూపాయి విలువ పతనం చెందినప్పుడల్లా పండితుల జోశ్యాలు చెబుతారు. అవి కూడా పరిస్థితి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే అనే ప్రాతిపదిక మీద చెప్పేవే. లాంగ్ ఫోర్‌కాస్ట్ డాట్ కాం గతంలో చెప్పిన జోశ్యం ప్రకారం 2025 జనవరిలో 79.79తో ప్రారంభమై ఏడాది చివరికి 86.97గా ఉంటుందని పేర్కొన్నది. జనవరిలో రూపాయి విలువ పెరగాలి. ఏఐ పికప్ అనే సంస్థ 2027 నాటికి రూపాయి 74.97కు బలపడుతుందని చెప్పింది. అయితే 2024లో రికార్డు పతనం 84.35 తరువాత 2030లో 72.6కు బలపడుతుందట.కృత్రిమ మేథ జోశ్యాలు తప్పు కావచ్చని కూడా కొందరు హెచ్చరించారు. రానున్న సంవత్సరాలలో ఏడాది ప్రారంభం, చివరిలో రూపాయి ముగింపు విలువలు దిగువ విధంగా ఉంటాయి. దిగువ పట్టికలో మొదటి వరుస జోశ్యం లాంగ్ ఫోర్‌కాస్ట్ డాట్ కాంది కాగా, రెండవ వరుసలో ఉన్నది వాలెట్ ఇన్వెస్టర్ డాట్‌కాం అంకెలుగా గమనించాలి
.ఏడాది–జనవరి– డిసెంబరు
2024– RRRR– 85.06
2025– 85.27– 86.67
2025II 84.62II 88.13
2026II 86.27II 87.16
2026II 87.89II 91.40
2027II 88.60II 96.78
2027II 91.16II 94.66
2028II 96.09II 98.68
2028II 94.47II 97.92
2029II 97.41II RRRRR
2029II 97.77II 101.20
ఇవే గాక అనేక సంస్థలు తమ తమ అంచనాలను చెబుతున్నాయి. ఎవరు చెప్పినా అంకెల తేడాలున్నప్పటికీ పతనం వాస్తవం.రూపాయి పతనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బిఐ చెబుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించటం లేదు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో డాలరుకు 84 దాటకుండా చూడాలని లక్ష్యంగా చెప్పుకున్నప్పటికీ ఇప్పటికే 86వరకు రావటాన్ని చూశాము.రోగనిరోధక శక్తి సన్నగిల్లితే అన్ని రకాల జబ్బులు వస్తున్నట్లు కరెన్సీ విలువ పతనం కూడా ఆర్థిక వ్యవస్థకు అలాంటిదే. ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తటానికి మూడు ప్రధాన కారణాలను చెబుతున్నారు. విదేశీ మదుపుదార్లు(ఎఫ్‌ఐఐ) స్టాక్, రుణ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కు తీసుకొని ఎక్కడ లాభాలు వస్తే అక్కడికి తరలిస్తుండటం. అవి డాలర్ల రూపంలో ఉండటంతో వాటికి డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతున్నది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక, అక్కడ వడ్డీ రేట్లను పెంచటంతో మదుపుదార్లందరూ ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు ఎగబడుతున్నారు. వారి చెలగాటం మన వంటి ఆర్థిక వ్యవస్థలకు ప్రాణ సంకటం. మోడీని ఆయన భక్తులు విశ్వగురువుగా కీర్తిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ సంక్షోభం, మధ్య ప్రాచ్యంపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, తమకు లొంగని దేశాలపై ట్రంప్ బెదిరింపులు, వాణిజ్య పోరు వంటి అనేక సమస్యలు కూడా అనేక దేశాల కరెన్సీల విలువ పతనానికి కారణం అవుతున్నాయి. వాటిని పరిష్కరించటంలో ఎవరూ కూడా మోడీ ప్రమేయాన్ని కోరటం లేదు.
రూపాయి పతనం వలన లబ్ది కంటే మనకు నష్టమే ఎక్కువ.ద్రవ్యోల్బణం, దాంతో ధరల పెరుగుదలకు దారితీస్తుంది.దీని వలన కొనుగోలు శక్తి తగ్గుతుంది. చమురు దిగుమతి బిల్లు పెరిగి అందరి మీదా భారం పెరుగుతుంది. విదేశాల నుంచి రుణాలు పొందిన కంపెనీల మీద భారం పెరుగుతుంది, పరోక్షంగా పెట్టుబడుల మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. రూపాయి విలువ పతనం కాకుండా కాపాడేందుకు ఆర్‌బిఐ తన వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యంలో కొన్ని డాలర్లను విక్రయిస్తుంది, దాంతో వాటి సరఫరా పెరిగి రూపాయి విలువ స్థిరంగా ఉంటుందన్నది ఆశ. అయితే తాత్కాలికంగా కొద్ది రోజులు అలా ఉన్నప్పటికీ పతనం సాగుతూనే ఉంది. అదే విధంగా రూపాయల కొనుగోలు, వడ్డీల సవరణ ద్వారా విలువను పెంచేందుకు చూసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. గడచిన ఇరవై సంవత్సరాల్లో సగటున ఏటా 3.2శాతం పతనం అవుతున్నది.ట్రంప్ ఏలుబడి నాలుగేండ్ల కాలంలో 810శాతం వరకు రూపాయి పతనం చెందవచ్చని ఎస్‌బిఐ పరిశోధన విశ్లేషణ తెలిపింది. కనీసం ఈ పతనాన్ని అయినా నరేంద్రమోడీ నివారించగలరా ? వంది మాగధుల భజనలతో కాలక్షేపం చేస్తారా ? రోమ్ తగులబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరి ఉంటారా ?
