భక్తుని చెంతకే భగవంతుని ఆశీస్సులు
23 Saturday Jan 2016
Posted in AP NEWS, Current Affairs, RELIGION
23 Saturday Jan 2016
Posted in AP NEWS, Current Affairs, RELIGION
23 Saturday Jan 2016
Posted in AP NEWS, Current Affairs, Economics, Education, Health, NATIONAL NEWS, Women
Tags
పదేళ్లలో వూబకాయులు రెట్టింపు-రక్త హీనత తగ్గినా ఆందోళనకరమే-ఏపి పురుషులలో ఎక్కువ
రెండు తెలుగు రాష్ట్రాలలో వూబకాయ సమస్య వేగంగా పెరుగుతోంది. పది సంవత్సరాల క్రితం పొడువు కంటే ఎక్కువ బరువున్న స్త్రీ ,పురుషుల పట్టణ, గ్రామీణ ప్రాంతాల సగటు 17.7, 17.6 వుండగా ప్రస్తుతం ఏపిలో 33.2, 33.5, తెలంగాణాలో 28.1,24.1 శాతానికి పెరిగింది. రెండు చోట్లా పట్టణాలలో ప్రస్తుతం ఏపిలో 45.6, 44.4 చొప్పున స్రీ, పురుషులలో వూబకాయం శాతాలున్నాయి.అదే తెలంగాణాలో 39.5,31.9గా వున్నాయి.
రక్త హీనత విషయానికి వస్తే రెండు రాష్ట్రాలలోనూ గతంతో పోల్చితే కొంత మెరుగు పడినప్పటికీ ఇంకా అందోళనకర స్ధాయిలోనే వుంది. పిల్లలు, స్త్రీలలో 79.6,62.7 నుంచి ఏపిలో 58.6,60.2కు తెలంగాణాలో 60.7, 56.7తగ్గింది.పట్టణాలలో వూబకాయాలు ఎక్కువుంటే గ్రామాలలో రక్తహీనులు ఎక్కువగా వున్నారు.పురుషులలో పదేళ్లనాడు 17.6శాతం రక్త హీనత వుంటే ప్రస్తుతం ఏపిలో వారిశాతం 26.9కి పెరగ్గా , తెలంగాణాలో 15.4కు తగ్గింది.
జన జీవితంలోని కొన్ని సూచికలు
ఎం కోటేశ్వరరావు
అవిభక్త ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, వుద్రేకాలు తగ్గాయి. తాపీగా కాకపోయినా ఎవరి రాష్ట్రాన్ని వారు బాగు చేసుకోవాలంటే నిజాయితీగా ఆలోచించాల్సిన సమయమిది. రాష్ట్రం బాగు చేసుకోవటం అంటే వేళ్లమీద లెక్కించదగిన కొన్ని పారిశ్రామిక కుటుంబాలు లేదా సంస్ధల ఆస్తులు పెరగటం కాదు. ప్రజల జీవన సూచికలు అభివృద్ధికి కొలబద్దలుగా అంగీకరిస్తే వాటిని బట్టి సమగ్రంగా గాకపోయినా కొంత మేరకు మనం ఎక్కడున్నామో అర్ధం చేసుకోవచ్చు. వాటిలో ఆరోగ్యం, మరికొన్ని సూచికలను ప్రమాణాలుగా ఐక్యరాజ్యసమితి తీసుకుంది. అందువలన అంతకంటే మెరుగైన కొలబద్దలు రూపొందే వరకు వాటితోనే మనం కొలవాల్సి వుంటుంది. కొత్త రాష్ట్రం తెలంగాణా జనంలో ఎన్నో ఆశలు, ఇంకా సజీవంగానే వున్నాయి. మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదు, రాదు అని అధికారికంగా చెప్పకపోయినా అక్కడి వారు మాట్లాడటం లేదంటే తెలుగుదేశం పార్టీ, బిజెపి, వారి కనుసన్నలలో మెలిగే మీడియా అంతకంటే ఎక్కువే ప్రయోజనం కలిగిస్తారని చెప్పిన మాటలను మరోసారి ప్రజలు నమ్మారని భావించాలి. ఎందుకంటే అమరావతి రాజధాని శంకుస్ధాపన సభకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కుండలో పార్లమెంట్ ప్రాంగణంలోని కాస్తంత మట్టి ,మురికి యమునా నది నీళ్లు తేవటమే మహాభాగ్యంగా భావించారు మరి. వారిలో కూడా ఇంకా ఆశలు అలాగే వున్నాయి.
అంధ్రవలస పాలకుల కారణంగా తెలంగాణా ప్రాంత ఆదాయానికి తగిన విధంగా అభివృద్ధి చెందలేదు కనుక ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది ప్రధాన నినాదాలలో ఒకటి. ఇంకా అనేకం వున్నాయనుకోండి, సందర్భం వచ్చినపుడు ముందు ముందు పరిశీలించుకుందాం. ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16కు సంబంధించి కొన్ని రాష్ట్రాల వివరాలను ప్రకటించింది. వాటిలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాలు వున్నాయి.తొలిసారిగా జిల్లాల వారీ అంచనాలను అందచేశారు.స్ధానిక భాషలోనే సమాచారాన్ని సేకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది మేనెల ఆరవ తేదీ నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు, తెలంగాణాలో ఫిబ్రవరి 23 నుంచి మే నెల తొమ్మిదవ తేదీవరకు సర్వే నిర్వహించారు. అందుకని తప్పుడు సమాచారం అందచేయటానికి లేదా అందించటానికి ఆస్కారం లేదు.
పొగ, మద్యపానంలో స్త్రీలతో సహా తెలంగాణా టాప్
మద్యపానం విషయంలో తెలంగాణా రాష్ట్రం అగ్రస్ధానంలో వుంది. అక్కడ స్త్రీలలో సగటున 8.8శాతం మంది తాగుతుండగా గ్రామీణ ప్రాంతాలలో 14.3శాతం, పురుషులలో సగటున 53.9 శాతం వున్నారు. అదే ఏపి విషయానికి వస్తే స్త్రీలు 0.4, పురుషులు 34.9 శాతం వున్నారు. తెలంగాణాలో 2.8శాతం స్త్రీలు, 28.3శాతం పురుషులు పొగతాగుతుండగా ఏపీలో 2.3, 26.8శాతం వున్నారు
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కలసి వున్నపుడు జరిగిన కార్యక్రమాలు, వాటి పర్యవసానాలే ఈ సర్వేలో వెల్లడైన సమాచారానికి ప్రాతిపదికలు. ఎవరైనా ఏడాది కాలంలో మా ముఖ్యమంత్రి అల్లా వుద్దీన్ అద్బుత దీపం మాదిరి అభివృద్ధి చేశారు, ఆ ఘనత వారికే చెందాలి అని వాదిస్తే అలాంటి వారికి రెండు రాష్ట్రాలకు కలిపి రెండు రెళ్లు నాలుగు దండాలు. ఈ సర్వేకు సంబంధించి జాతీయ స్థాయి సూచికలు ఎలా వున్నాయి, వాటితో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటో పోల్చేందుకు ఇంకా మిగతా వివరాలు వెలువడలేదు. అందువలన దక్షిణాదిలో తమిళనాడుతో పోల్చితే రెండు రాష్ట్రాలలో కీలకమైన అభివృద్ధి సూచికలు ఇలా వున్నాయి. ఇది నిజమైన అభివృద్ధి కాదు అంటే వున్న పరిస్ధితి అనుకుందాం.గ్రామీణ, పట్టణాల మొత్తం,అంకెలు శాతాలలో వున్నాయి. మొత్తం 114 ప్ర శ్నలు వేసి సమాచారాన్ని రాబట్టారు. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. ఎలాంటి వ్యాఖ్యలు లేకుండా ఈ సమాచారాన్ని ఇస్తున్నాం. గతంలో వుమ్మడి రాష్ట్రంగా వున్నపుడు వెల్లడైన సూచికలతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సూచికలను పోల్చలేము. అందుకే అయితే వుమ్మడి రాష్ట్రంలో వున్న సూచికలతో పోల్చినపుడు రెండు ప్రాంతాలలోని తాజా పరిస్ధితులను బట్టి కొంతమేర అర్ధం చేసుకోవచ్చు. గతంలో కొన్ని వివరాలు సేకరించలేదు కనుక కొన్నింటితో పోల్చుకోలేము కనుక ఆ పరిమితులను గమనంలో వుంచుకోవాలి. గత సర్వే 2005-06లో జరిగింది. వుమ్మడి ఆంధ్రప్రదేశ్ వివరాలు పదేళ్లనాటి సర్వే వివరాలని గమనించాలి. (వు.అ-వుమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపి-ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, టిజి-తెలంగాణా, టిఎన్-తమిళనాడు)
వు.ఆ ఏపి టిజి టిఎన్
1.ఆరేళ్లకు పైబడిన పురుషులలో స్కూళ్లకు వెళ్ళిన వారు 62.0 62.2 77.2
2. పదిహేనేళ్ల లోపు జనాభా 23.7 25.0 23.3
3వెయ్యిమంది పురుషులకు మహిళలు 1020 1007 1033
4.గత ఐదేళ్లలో పుట్టిన వెయ్యిమంది పురుషులకు మహిళలు 914 874 954
5.అయోడిన్ వుప్పు వాడుతున్నవారు 81.6 95.8 82.8
6.మెరుగైన మరుగుదొడ్డి వున్నవారు 53.6 50.2 52.2
7.మంచినీటి సౌకర్యం వున్నవారు 72.7 77.6 90.6
8 వంటకు గ్యాస్, విద్యుత్ వాడుతున్నవారు 62.0 66.8 73.0
9.మహిళా అక్షరాస్యులు 62.9 65.2 79.4
10.పురుష అక్షరాస్యులు 79.4 83.4 89.1
11. పదేళ్లకు పైగా చదువుకున్న మహిళలు 21.9 34.3 43.3 50.9
12. పద్దెనిమిదేళ్లకు ముందే వివాహమైన యువతులు 54.8 32.7 25.7 15.7
13.21ఏళ్లకు ముందే వివాహిత యువకులు 34.0 23.5 23.9 17.0
14.ప్రసవ సమయంలో మరణాలు 35 28 21
15.ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 41 32 27
16.ఏదో ఒక కుటుంబనియంత్రణ 67.6 69.5 57.2 53.3
17.మహిళలకు ఆపరేషన్లు 68.3 54.2 49.4
18.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవానికి అదనపు ఖర్చు రు. 2,138 4,020 2496
20.సిజేరియన్ ఆపరేషన్లు 40.1 58.0 34.1
21.ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్లు 25.5 40.6 26.3
22.ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్లు 57.0 74.9 51.3
23.ఎత్తుకు సరిపడా బరువులేని మహిళలు 30.8 17.6 23.1 14.6
24.ఎత్తుకు సరిపడా బరువులేని పురుషులు 24.8 14.8 21.4 12.4
25.అధిక బరువున్న మహిళలు 17.7 33.2 28.1 30.9
26.అధిక బరువున్న పురుషులు 17.6 33.5 24.2 28.2
27.పిల్లలలో రక్త హీనత 79.6 58.6 60.7 50.7
28.మహిళలలో రక్త హీనత 62.7 60.0 56.7 55.1
29.పురుషులలో రక్త హీనత 23.1 26.9 15.4 20.6
30.స్త్రీలలో మద్యపానం 0.4 8.8 0.4
31.పురుషులలో మద్యపానం 34.9 53.9 46.7
32.స్త్రీలలో పొగతాగేవారు 2.3 2.8 2.2
33.పురుషులలో పొగతాగేవారు 26.8 28.3 31.7
34.మహిళలలో స్వంతంగా సెల్ వున్నవారు 36.2 47.8 62.0
35.బ్యాంకు ఖాతా వున్న మహిళలు 66.3 59.7 77.0
14 Thursday Jan 2016
Posted in AP NEWS, Current Affairs, Health, INDIA, NATIONAL NEWS
కేంద్రం వరాల జల్లు – భ్రమలు, వాస్తవాలు
సత్య
కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతేనే అంతకంటే ఎక్కువే ఇస్తోంది అని ఆంధ్రప్రదేశ్ పౌరులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారా ? ఏమో ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో ? ‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అనూహ్యమైన వరాలు ప్రకటించింది. విభజన చట్టంలో హామీలకు అతీతంగా చేసిన ఈ పెట్టుబడి ప్రతిపాదనలతో మూడు రోజుల భాగస్వామ్య సదస్సులో సీన్ మొత్తం మారిపోయింది.’ ఈ వ్యాఖ్యలు విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి అనంత కుమార్ చేసిన ప్రకటన గురించి ఒక పత్రికలో వచ్చిన వార్తలోనివి. దాని ప్రకారం 75వేల కోట్ల రూపాయల పెట్టుబడులు లభించే ఎంతో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులను మంజూరు చేశారు అని మరొక పత్రిక రాసింది. అవగాహనా ఒప్పందాలు కుదిరిన 4.78లక్షల కోట్లకు ఇవి అదనం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
అనంతకుమార్ విశాఖ పట్టణంలో మంగళవారం ఈ ప్రకటన చేసి ఢిల్లీ వెళ్లిన 24 గంటలలోపే అంటే బుధవారం నాడు అక్కడ మరొక ప్రకటన చేశారు. అదేమంటే ఔషధాల వుత్పత్తిని పెంచేందుకు కేంద్రం రూపొందించిన పధకంలో భాగంగా ఆరు ఫార్మా పార్కులు, రెండు వైద్య పరికరాల తయారీ సంస్ధలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ పధకాలకు మొత్తం 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఏపీ ఒక్కదానిలోనే 20వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నట్లుగా భ్రమ కల్పించారు.
నిజానికి ఇప్పటికే విశాఖలో ఫార్మా పరిశ్రమ ప్రారంభమైంది, పరవాడలో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ (జెఎన్‌పిసి)లో 2000 సంవత్సరం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాయితీలను పొందేందుకు హైదరాబాదులో వున్న అనేక కంపెనీలు అక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇప్పటికి అక్కడ 103 యూనిట్లకు అనుమతి ఇవ్వగా 68 పని చేస్తున్నాయి, మరో పదిహేను వివిధ దశలలో వున్నాయని గతేడాది సెప్టెంబరు ఎనిమిదిన హిందూ వార్త వెల్లడించింది.ఫార్మస్యూటికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రాంగణాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం ఆ సంస్ధ డైరెక్టర్ జనరల్ పివి అప్పాజీ, సలహాదారు లంకా శ్రీనివాస్ తదితరులు ఆప్రాంతాన్ని సందర్శించారు. అందుకు అవసరమైన స్ధలాన్ని కూడా ఫార్మాసిటీ అధికారులు కేటాయించారు. అనంత కుమార్ ప్రకటించిన పార్కులో ప్రయివేటు వారికి అవకాశం కల్పిస్తారు తప్ప ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు కల్పించటం తప్ప పరిశ్రమలు పెట్టరాదన్నది కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయం.అందుకే ఎక్కడైనా రక్షణ పరిశ్రమలను నెలకొల్పారేమో తప్ప 1991 తరువాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలు స్ధాపించలేదు.
13 Wednesday Jan 2016
Posted in AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

సత్య
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ‘వుషోదయ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029’ పేరుతో భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ)తో కలసి ఈనెల 10-12 తేదీలలో పెట్టుబడుల ఆకర్షక సదస్సు నిర్వహించారు. దీనిలో ‘ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా సదస్సుకు ముందు ఒక పత్రిక కధనం.’4.5లక్షల కోట్ల టార్గెట్ ‘ మరో పత్రిక శీర్షిక. ఈ రెండూ చంద్రబాబు దృష్టిలో వున్నవి వున్నట్లుగా రాసే పత్రికలే. ‘ భాగస్వామ్య సదస్సు బంపర్ హిట్ అయింది. ప్రభుత్వమే రూ.2 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరగలవని భావించగా అనూహ్యంగా రు.4,76,878 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదరటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనందం వెల్లి విరుస్తోంది’ అని ఏడు కోట్ల లక్ష్యం అని రాసిన పత్రిక సదస్సు తరువాత రాసింది. చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని నిర్వహించిన ఈసదస్సు గ్రాండ్ సక్సెస్ అయిందని రెండో పత్రిక రాసింది. ఇవి గాకుండా కేంద్ర మంత్రి అనంత కుమార్ ప్రతిపాదించిన (75వేల కోట్లు) అదనం అంటూ ఊహించినదానికన్నా ఎక్కువ స్పందన వచ్చింది, వచ్చే ఏడాది కూడా విశాఖలోనే భాగస్వామ్య సదస్సు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుదిరిన ఒప్పందాలతో పెట్టే పరిశ్రమలు, ఇతర సంస్ధలలో పదిలక్షల పదిహేను వేల వుద్యోగాలు వస్తాయని సదస్సు నిర్వాహకులు ప్రకటించారు. ఇవన్నీ త్వరలో ఆచరణకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారటనటంలో సందేహం లేదు.
ఈ సదస్సుతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది సంక్రాంతి మరింత కాంతి వంతం అవుతుందని అనేక మంది భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలనే కర్మాగారాలలో ఏటా లక్షా 50వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుఏట్లు వుత్పత్తి అవుతున్నారు. మన ఇంజనీర్లు వుత్పత్తి అవుతున్నంత వేగంగా మన ఆర్ధిక వ్యవస్ధ పెరగటం లేదు. దాంతో ఇంజనీరింగ్ నిరుద్యోగుల సైన్యం ఏడాది కేడాది గణనీయంగా పెరుగుతోంది. మన విద్యార్ధులు వుద్యోగాలు అడిగేవారు కాకుండా వుద్యోగాలు కల్పించేవారుగా తయారు కావాలని మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ మధ్య సందేశమిచ్చారు.
2013లో ‘యాస్పిరింగ్ మైండ్స్ ‘ అనే ఒక పరిశోధనా సంస్ధ కొన్ని తట్టుకోలేని నిజాలను వెల్లడించింది. చెన్నయ్ పట్టణం అక్కడి అన్నా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలనుంచి డిగ్రీ చేతపట్టుకు వస్తున్న ఇంజనీర్లలలో ఒక శాతానికి మాత్రమే వుద్యోగాలు కల్పిస్తున్నదని, అత్యధిక వుద్యోగాల కల్పన రేటు వున్న ఢిల్లీలో 13శాతం, భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగలూరులో 3.2శాతం కల్పిస్తున్నట్లు అది వెల్లడించింది. వాటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణం, రాజధాని అమరావతి ఎంతశాతం కల్పిస్తుందో మనం చంద్రబాబు సిద్దం చేసిన విజన్ 2029, 2050 పత్రాలను చూడాల్సిందే.
విశాఖలో కుదిరిన అవగాహనా ఒప్పందాల ప్రకారం ఐటి రంగంలో వస్తాయని చెబుతున్న పెట్టుబడుల మొత్తం 3,368 కోట్ల రూపాయలు, దాని వలన వస్తాయని చెప్పిన వుద్యోగాలు 50వేలు. తనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు కళ్లవంటివని దేన్నీ నిర్లక్ష్యం చేయనని హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికల సభలో జనవరి 12న చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందువలన ఒక కన్ను ఆంధ్రప్రదేశ్‌లో ఐటి కంపెనీల స్ధాపనకు ఆయన మరోసారి అధికారంలోకి వచ్చిన గత ఇరవై నెలల నుంచీ స్వయంగా, మధ్యలో రాష్ట్ర ఐటి మంత్రి పల్లె రఘనాధరెడ్డి, చంద్రబాబు తనయుడు లోకేష్ ఇబ్బడి ముబ్బడి విదేశీ పర్యటనల సందర్బంగా మొత్తం పెట్టుబడుల ఆకర్షణకే సమయాన్ని వెచ్చించినట్లు మనం మీడియాలో చదువుకున్నాం, టీవీలలో చూశాం. వాటి ఫలితమే 3,368 కోట్ల రూపాయలని అనుకోవాలి. ‘ ఇలాంటి సదస్సులలో కుదిరే ఒప్పందాలలో సహజంగా 15 నుంచి 25శాతం వాస్తవ రూపం దాల్చితే గొప్ప విజయం సాధించినట్లు పరిగణించాల్సి వుంటుందని పరిశ్రమల వర్గాల మాట. అయితే ఈ సారి 50 నుంచి 60శాతం వరకు ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నది చంద్రబాబు నిర్దేశం’ అని చంద్రబాబు చెప్పే బి పాజిటివ్ పత్రిక ఒకటి రాసింది. కాబట్టి ఐటి నిరుద్యోగులు, కాబోయే నిరుద్యోగులూ ఎవరో వస్తారని, ఏదో తెస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న శ్రీశ్రీ గీతాన్ని నిత్యం గుర్తుకు తెచ్చుకోవాల్సి వుంటుందేమో? ఒకవేళ వచ్చినా వస్తాయని చెబుతున్న 50వేల వుద్యోగాలకు గాను పదిహేను శాతం అంటే ఏడున్నర వేలు మాత్రమే. ఆపై ఎన్ని వచ్చినా అది బాబొస్తే జాబ్ అన్న పధకంలో బోనస్‌గా భావించాలి.
పోనీ ఐటి వుద్యోగాల బదులు ఇతర రంగాలలో వుద్యోగావకాశాల గురించి చూడాలంటే ఒక వూరి మునసబు మరోవూరికి వెట్టి కింద లెక్క అన్న సామెత తెలిసిందే. ఐటి ఇంజనీరు మిగతా రంగాలకు క్యాజువల్ కార్మికుడి కిందే లెక్క. ఇండ్ల నిర్మాణ రంగంలో 41వేల 500 కోట్లు పెట్టుబడులు వస్తాయని, వాటి ద్వారా రెండున్నరలక్షల వుద్యోగాలు వస్తాయని చెప్పారు. అవేమి వుద్యోగాలో ? ఎన్నిరోజులు పని ఇస్తాయో? ఈ రోజుల్లో రోడ్లు, ఇండ్ల నిర్మాణంలో యంత్రాలకే వుద్యోగాలు, శుభం పలకరా అంటే ఏదో అన్నట్లుగా సంతోష సమయంలో ఇదేమిటి అనుకుంటారేమో, ముగిద్దాం.
11 Monday Jan 2016
Posted in AP NEWS, Current Affairs, INDIA, Others
Tags
ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్ బోల్ట్ రికార్డులను తిరగరాశారు.
సత్య
విశాఖ పట్టణంలో మూడు రోజుల పెట్టుబడుల ఆకర్షక సదస్సులో మొదటి రోజే రెండు లక్షల కోట్ల రూపాయల విలువగల అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నది వార్త. అతిధి సత్కార్యాలకు పెట్టింది పేరు ఆంధ్రావని. అరిసెలు, వెన్న వుండలు, పూతరేకులు, గారెలు, నాటు కోడి కూర, గుంటూరు గోంగూర, జగ్గయ్య పేట దోసకాయ పచ్చడి, భీమవరం టైగర్ రొయ్యలు, నెల్లూరు చేపల పులుసు, బొంగులో చికెన్ వంటి వంటకాలను భారీగా వడ్డిస్తామని ముందే ప్రభుత్వం చెప్పింది కనుక మొదటి రోజు అవి తిన్న వారు ఆ మత్తులో గమ్మత్తులో మరికొన్ని కొత్త ఒప్పందాలపై సంతకాలు పెడతారన్నా అతిశయోక్తి కాదు. మొత్తం ఏడు లక్షల కోట్ల మేరకు ఒప్పందాల జరగవచ్చని ముందే అంచనా వేశారు కనుక తొలి రోజు వూపును బట్టి మలి, మూడవ రోజు ఇంకా జోరుగా ఎడా పెడా ఒప్పందాలు జరుగుతాయన్నది స్పష్టం. ఇలాంటి మాజిక్ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, చంద్రబాబు చేయగలరని నమ్ముతున్నారు గనుక అది వమ్ము కాకూడదని రాష్ట్ర భక్తులైన వారు కోరుకుంటారు. 1947 ఆగస్టు 16 నుంచి దేశభక్తి క్రమంగా తగ్గుతూ ఢిల్లీ నుంచి గల్లీ చివరికి ఇంటికి, అక్కడ కూడా నేను, నా కుటుంబ స్ధాయికి దిగజారిన పరిస్ధితుల్లో రాష్ట్ర భక్తి అనటం కొందరికి అతిశయోక్తిగా తోచవచ్చు, క్షంతవ్యుడను.
ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేసిన 1991 నూతన ఆర్ధిక సంస్కరణల అమలు నుంచి రాష్ట్రాలు పెట్టుబడుల కోసం తరచూ పెద్ద మేళాలను నిర్వహిస్తున్నాయి. వివాహాలకు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి విందులు ఆరగించి చందన తాంబూలాలు స్వీకరించి పోయినట్లుగా కొన్ని వేల మంది, లక్షల మంది విదేశీ కంపెనీల ప్రతినిధులు, వారి వంది మాగధులు మన రాష్ట్రాలను సందర్శించి వేలాది అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసి వెళ్లి వుంటారు. అవన్నీ వాస్తవ రూపం దాల్చి వున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడి వుండేవి కాదు, మన దేశం మొత్తంగా ఎప్పుడో అమెరికా అంత గాకపోయినా కనీసం చైనాను వెనక్కు నెట్టి వుండివుండేది.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు వైపుల తమిళనాడు(చెన్నయ్) కర్ణాటక(బెంగలూరు) తెలంగాణా(హైదరాబాదు) అనే మూడు మహానగరాలు వున్నాయి. నాలుగో వైపున వున్నది బంగాళాఖాతం కనుక పెట్టుబడుల ఆకర్షణ పోటీలో అది వుండదు, అయినా మూడు మహానగరాలను తట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు దేశం నలు మూలల నుంచి 1100 మంది 41 దేశాల నుంచి 315 మంది తొలిరోజు హాజరు కావటం చంద్రబాబు నాయుడి యాజమాన్య నిర్వహణకు నిదర్శనం. వివిధ కారణాలతో తొలి రోజు రాలేకపోయిన వారు చివరి రెండు రోజులలో రావచ్చు, వాటికీ రాలేని వారు తరువాత వచ్చి విజయవాడలో సంతకాలు చేసి వెళతారు. అన్నయ్యా ఎంత మంది వచ్చారు, ఏం తిన్నారు, ఎన్ని సంతకాలు చేశారని కాదు, ఎన్ని వాస్తవ రూపం దాల్చాయన్నది ముఖ్యం అన్నట్లుగా గతంలో జరిగిన ఆకర్షక సమావేశాల ఫలితాలేమిటో మచ్చుకు కొన్ని చూద్దాం.
ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే అందుకు అనువైన వాతావరణం అంటే దండిగా లాభాలు వచ్చే పరిస్ధితులు వున్నాయా లేవా అని చూస్తారు. లేకుంటే ప్రపంచం నలుమూలలు, పొరుగు రాష్ట్రాల నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంటుంది ? ఏ దేశంలో అయినా ఆర్ధిక వుత్పత్తి వనరులలో ఎంతశాతాన్ని వినియోగించుకుంటున్నారు? కొత్త పరిశ్రమలు పెడితే వాటి భవిష్యత్ ఎలా వుంటుంది అని ఎవరైనా వెనుకా ముందు ఆలోచిస్తారు. గత ఆగస్టు ఎనిమిదవ తేదీన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ప్రచురించిన క్రిసిల్ రేటింగ్ నివేదిక ఆధారంగా ఇచ్చిన ఒక వార్త ప్రకారం మన దేశంలో పెట్టుబడులు తగ్గుతున్నాయి, సామర్ధ్యవినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందన్నది దాని సారం. వర్తమాన ఆర్ధిక సంవత్సరం(2015-16)లో రెండుశాతం పెట్టుబడులు తగ్గుతాయని, ప్రయివేటు రంగ పెట్టుబడులు గత కొద్ది సంవత్సరాలుగా తగ్గటం ఆందోళన కలిగిస్తోందనిఈ ఏడాది మరో ఎనిమిదిశాతం తగ్గవచ్చని నివేదిక పేర్కొన్నది. పన్నెండు భారీ పరిశ్రమల రంగాలకు గాను పదింటిలో సామర్ధ్య వినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినందున కొత్త ప్రాజెక్టుల ఆశలు ఆవిరి అవుతున్నాయని, పర్యవసానంగా గతేడాది కాలంలో ప్రకటించిన లేదా అనుమతించిన పరిశ్రమలలో కేవలం 20శాతం మాత్రమే అమలులోకి రావచ్చని, మూల ధన పెట్టుబడులు 2017లోనే అర్ధవంతమైన విధంగా పెరగవచ్చని క్రిసిల్ వెల్లడించింది.
అల్యూమినియం, వుక్కు రంగాల సామర్ధ్యం పెంచిన కారణంగా వాటిని దిగుమతి చేసుకొనే భారత్ ఎగుమతి చేసే దేశంగా మారింది,ప్రపంచ మార్కెట్‌లో వస్తువుల ధరలు తగ్గిన కారణంగా చమురు శుద్ధి, మార్కెటింగ్, పెట్రోకెమికల్ రంగాలపై ప్రభావం పడింది.కాగితంతో సహా కొన్ని రంగాలలో సామర్ధ్య వినియోగం ఐదు సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. కొద్ది కాలం తరువాత గాని తిరిగి పూర్వస్ధితికి చేరుకోలేవు. ఈ రంగాలలో కొత్త ప్రాజెక్టులకు అవకాశాలు పూర్తిగామృగ్యమయ్యాయి. ఆటోమొబైల్, ఎరువుల రంగంలోనే పెట్టుబడులు పెరిగే అవకాశాలు వున్నాయి. ఎరువుల రంగంలో కల్పించే రాయితీలు, చమురు ధరలు, వడ్డీలు తగ్గిన కారణంగా ఆటోమొబైల్ రంగంలో ముఖ్యంగా కార్ల రంగంలో అవకాశాలు వున్నాయి.
మౌలిక సదుపాయాల విషయానికి వస్తే పరిస్ధితి పూర్తి తిరోగమనంలో వుంది. విద్యుత్ రంగంలో పెట్టుబడులు తగ్గుతాయి.ధర్మల్ విద్యుత్ విభాగంలో జతచేయదలచిన సామర్ధ్యం గత రెండు సంవత్సరాలలో40వేల మెగావాట్లకు తగ్గగా మరో రెండు సంత్సరాలలో36వేలకు తగ్గిపోనుంది. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు లేకపోవటం, పంపిణీ సంస్ధల ఆర్ధిక స్ధితి బలహీనంగా వున్న కారణంగా కొత్త కొనుగోలు ఒప్పందాలు లేని కారణంగా కొత్త ప్రాజక్టుల ప్రకటనలు రావటం లేదు అని క్రిసిల్ పేర్కొన్నది. ఇలాంటి నివేదికలను గమనంలోకి తీసుకొనే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు తప్ప మరొక ప్రాతిపదిక వుండదు. ఈ పూర్వరంగంలో కొన్ని రాష్ట్రాలు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు చిత్తుకాగితాలుగా మారాయి. పంజాబ్‌లో 2011-12 నుంచి ఖన్నా-మండి గోవింద ఘర్ పారిశ్రామిక ప్రాంతంలో 688 పరిశ్రమలు మూతపడ్డాయి. పంజాబ్‌లో భూముల ధరలు ఎక్కువగా వున్న కారణంగా పారిశ్రామిక సంస్ధలు విస్తరణకు మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్‌ఘర్‌లను ఎంచుకుంటున్నాయి. అసోచెమ్ తన అధ్యయనంలో ఇలా పేర్కొన్నది. పంజాబ్‌లో 2015 మార్చి వరకు ఆకర్షించిన పెట్టుబడులు రెండులక్షల కోట్ల రూపాయలు. వాటిలో 1.6లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఎలాంటి పురోగతి లేదు. మిగిలినవి ఖర్చు పెరిగిందని, సమయం పడుతుందని పేర్కొన్నాయి. పరిశ్రమల రంగ అభివృద్ధి 2006-07లో 20శాతం వుండగా 2014-15లో రెండుశాతానికి పడిపోయింది. పురోగమన పంజాబ్ మదుపుదార్ల సదస్సు 2013 డిసెంబరులో జరిగింది. ఆ సదస్సును ఘన విజయంగా అకాలీదళ్, బిజెపి వర్ణించాయి. దానిలో 65వేల కోట్ల రూపాయల అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటికీ అవి అలాగే వున్నాయి. కొన్ని కంపెనీలు కనీసం తమ ప్రతిపాదనలేమిటో కూడా సమర్పించలేదు. కొత్తవి రాకపోగా 2013-14లో వచ్చిన 7,200 కోట్లకు గాను మరుసటి సంవత్సరంలో రు.2,600 కోట్లకు పడిపోయాయి.
కర్ణాటకలో మూడు సంవత్సరాల తరువాత గతేడాది పెట్టుబడిదారుల సదస్సు జరిగింది.దానికంటే కొద్ది వారాల ముందే గతేడాదే తమిళనాడులో కూడా జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆంధ్రప్రదేశ్ సదస్సు జరుగుతున్నది ఈ మూడు కూడా కేవలం నాలుగు నెలల వ్యవధిలో జరిగాయి. దేశ, విదేశాల ప్రతినిధులు ఈ సదస్సులన్నింటికీ హాజరయ్యారు. ఒప్పందాలపై సంతకాలు చేశారు, వాగ్దానాలు చేశారు. ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం తాము ఇచ్చే రాయితీలను పెట్టుబడిదారుల ముందు ఏకరువు పెడుతున్నాయి,తమ ప్రత్యేకతలు ఏమిటో వివరిస్తున్నాయి. జోస్యం చెప్పే కోయరాజులు తాము ఎంత పెద్దవారికి జోస్యం చెప్పామో తెలిపేందుకు వారితో దిగిన ఫొటోలను ముందుగా తమవద్దకు వచ్చేవారికి చూపినట్లు ఏ ఏ కంపెనీలు ఇప్పటికే తమ రాష్ట్రాలలో వున్నాయో, ఎవరు ఆసక్తి చూపుతున్నారో చూడండంటూ హడావుడి చేస్తున్నాయి. పెట్టుబడుల సదస్సుల గురించి జనంలో ముఖ్యంగా నిరుద్యోగ యువకుల్లో ఎన్నో ఆశలు రేపుతున్నారు. గోరంతను కొండంతలు చేసి చూపుతున్నారు. దీనిలో ఏ ఒక్కరూ తక్కువ తినలేదు.
వుదాహరణకు కర్ణాటకలో 2012లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. సదానందగౌడ రాష్ట్రముఖ్య మంత్రి. ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన సమాచారంలో ఇలా వుంది. ‘2010లో ఎడ్డియూరప్ప ముఖ్యమంత్రిగా వున్న సమయంలో 2010లో జరిగిన సదస్సులో 3.92లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 7.27లక్షల వుద్యోగాలు కల్పించబడతాయని ప్రభుత్వం ఆరోజు చెప్పింది, వాస్తవానికి వచ్చింది 32,957 కోట్లు, 93,102 వుద్యోగాలు మాత్రమే. సదానందగౌడ 2012లో 2.81లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నానని, 13.99లక్షల వుద్యోగాలు వస్తాయని చెప్పారు. దానికి గాను వచ్చింది 12,468 కోట్లు వుద్యోగాలు 21,794 మాత్రమే. ఈ రెండింటినీ కలుపుకుంటే పెట్టుబడుల వాగ్దానం 6.37లక్షల కోట్లు , వస్తాయన్న వుద్యోగాలు 21.26లక్షలు కాగా వచ్చిన పెట్టుబడి 45,425 కోట్లు ఇచ్చిన వుద్యోగాలు 1.14లక్షలు మాత్రమే.
రాజకీయ నాయకుల వాగ్దానాలు ఎలా వుంటాయంటే లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి నేత నరేంద్రమోడీ విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికితీస్తానని దానిని ఒక్క్కొరికి పంచితే 15లక్షలు వస్తుందని చెప్పారు. బహుశా దాన్ని తీసుకు వచ్చే క్రమంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి లక్షా నలభైవేల కోట్ల రూపాయల ప్రత్యేక పాకేజి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ నిండు సభలో ప్రకటించిన ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు కంటి చూపు తప్ప నోటమాటలేదు.
విశాఖ సభకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్ బోల్ట్ రికార్డులను తిరగరాశారు. అలాగే నరేంద్రమోడీ గతేడాది ఎర్రకోట ప్రసంగంలో 17కోట్ల బ్యాంకు ఖాతాలను తెరుస్తామని ప్రకటించారు అంటే సెకనుకు ఆరు అన్నమాట. ఎప్పుడూ విదేశాల్లోనే తిరుగుతుంటారు మీకు భారత్‌లో చేసే పనేమీ లేదా అంటే దేశానికి కనీసం లక్ష కోట్ల డాలర్లు అంటే 66లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం తన లక్ష్యమని చెప్పుకున్నారు. అందువలన అలాంటి నరేంద్రమోడీని స్ఫూర్తిగా తీసుకున్న చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ప్రతినిధితో ఒక్కొక్క ఒప్పందం కుదుర్చుకోవటంలో అతిశయోక్తి ఏముంటుంది, గొప్ప ఏముంది?
07 Thursday Jan 2016
Posted in AP NEWS, Current Affairs, NATIONAL NEWS, STATES NEWS
సత్య
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత జగన్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి దాసరి నారాయణ రావును కలుసుకున్నారన్నది ఒక వార్త, కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు వైసిపి ఎంఎల్‌ఏలు తెలుగుదేశంలోకి రానున్నారన్నది మరొక వార్త. హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎవరెటు దూకుతారో తెలియని స్ధితి. అనేక మంది చెవులు కొరుక్కుంటూ చెప్పుకొనేదాని ప్రకారం పెద్ద అవసరం, ప్రయోజనం వుంటే తప్ప వైఎస్ జగన్ తానుగా వెళ్లి ఎవరినీ కలవరు అంటారు. అది ఆయన తండ్రి ఎల్లో మీడియాగా వర్ణించిన ఒక పత్రికాధినేత రామోజీరావు కావచ్చు, మరొకరు కావచ్చు. దాసరి నారాయణరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరతారా లేదా ఆయనకు అంటిన బొగ్గు మసి ఏమౌతుంది అని కొంత మంది జుట్టుపీక్కుంటున్నారు. దానికి అంత సీన్ అవసరం లేదు. ఏదో ఒక మసి కేసులు లేని నాయకుడూ ఒక నాయకుడేనా ఈ రోజుల్లో ! ఎవరెన్ని పార్టీలు మారితే, ఎక్కడ అధికారం వుంటే అక్కడ చేరితే అంత తెలివి గలవాడిగా జనం నీరాజనాలు పడుతున్నారు. అందువలన ఏ నాయకుడు ఏ పార్టీలో అయినా ఏ క్షణంలో అయినా చేరవచ్చు. ఎందుకంటే రేచుక్క పగటి చుక్కల వంటి పాలక పార్టీలకు ఈ రోజుల్లో అధికారం, నీకది-నాకిది ఫార్ములా తప్ప మరొకటి తెలియదు. సమాజం అలాంటి వాటికి అనుమతించిన బలహీనతకు లోనైంది. ఎవరికి వారు తమకూ అలాంటి లాటరీ ఒకటి తగలకపోతుందా వీలైతే ఒక లక్ష కోట్లు సంపాదించకపోతామా( ఆశలకు పిసినారితనం ఎందుకు) అప్పుడు సిద్ధాంతాలు,ఆదర్శాలు అంటే కుదురుతుందా అని అంతర్గతంగా ఆలోచిస్తూ వుండి వుండాలి.తమకు దారి సుగమం కావాలంటే ఆ బాటన పోయిన వారికి మద్దతు ఇవ్వాలి
ఇంతకూ దాసరితో జగన్‌కు అవసరం ఏమిటి? వచ్చే ఎన్నికలలో కాపు వర్గాన్ని తన మద్దతుదారులుగా మార్చుకోవాలంటే అలాంటి నేతలను దగ్గరకు తీసుకోవాలన్న వ్యూహంతోనే కలిశారన్నది జనవాక్యం. సమాజంలో విపరీతంగా పెరిగిపోయిన అస్తిత్వ భావనల పూర్వరంగంలో ఈ రోజు నాయకులు తాము కుల సామాజిక వర్గ ప్రతినిధులుగా చెప్పుకోవటానికి లేదా ఆ విధంగా జనం ముందుకు రావటానికి సిగ్గుపడక పోగా గర్వంగా చెప్పుకుంటున్నారు. దాన్ని తమ రాజకీయ, ఆర్ధిక బేరసారాలకు వుపయోగిస్తున్నారు. అలాంటి వారికి తెలిసో తెలియకో లేదా వారు కూడా అలాంటి భావనలకు లోనయిగానీ ఎలాంటి విమర్శనాత్మక దృష్టి లేకుండా జనం కూడా మద్దతు ఇస్తున్నారు.
పత్తి రైతులకు గిట్టుబాటు కాదు కదా మద్దతు ధర కూడా రావటం లేదు, ధాన్య రైతులకూ అంతకంటే ఒరిగేదేమీ కనిపించటం లేదు.ఫ్యాక్టరీలలో కనీస వేతనాలూ, పని గంటల వంటి వాటి గురించీ అడగనవసరం లేదు.ఒక్క వామపక్ష పార్టీలకు తప్ప వైఎస్ జగన్ లేదా ఆ పార్టీలోని ఇతర నాయకులకు ఇవేమీ పట్టటం లేదు.అంటే వారి వెన్నుదన్నుగా వున్న మద్దతుదారులు కూడా ఇదేం పని ఎప్పుడూ రాజకీయాలేనా ఒక్కసారన్నా జనం సమస్యలు పట్టించుకోరా ? ఆందోళనలు లేకపోయినా కనీసం ఓదార్పు యాత్రలు జరపరా అని అడిగి వత్తిడి తెస్తున్నట్లు లేదు.
జనం కుల రాజకీయాలను ఆదరిస్తున్నారు కనుక మేం కూడా అదే బాటలో నడుస్తున్నామని నేతలు, నేతలు కుల రాజకీయాలలో మునిగి తేలుతున్నారు గనుక మా కులపోడికి మేం మద్దతు ఇవ్వవద్దా అని జనం. ఈ మురికి కూపం నుంచి బయట పడనంత వరకూ రెడ్డి, కమ్మ, కాపు ఏ కులం వాడికీ గిట్టుబాటు ధరలు రావు, మార్కెట్లో దోపిడీ ఆగదు. వ్యాపారాలు చేసేది, ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేదీ ఆయా కులాల ధనికులే.ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు కొత్త కాదు. 1950 దశకంలో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని దెబ్బతీసేందుకు ప్రవేశ పెట్టిన ఈ దుష్ట రాజకీయాలు ఈనాడు పెద్దపీట వేసుకున్నాయి. ఎంత కాలమీ దుస్ధితి కొనసాగుతుందో తెలియదు. ప్రతి తరంలో ఒక కుల నాయకుడు లేదా నాయకులు పుట్టుకు వస్తున్నారు. వారు తమ సామాజిక వర్గాన్ని వుద్ధరించివుంటే ఈ పాటికి సోషలిజం వచ్చి వుండేది. పోనీయండి ఎంత కాలం అలా మద్దతు ఇస్తారో అదీ చూద్దాం. కందకు లేని దురద కత్తి పీటకెందుకు ?
20 Sunday Dec 2015
Posted in AP NEWS, BJP, NATIONAL NEWS, Others
Tags
ఎంకెఆర్
కాంగ్రెస్ అంటే కుంభకోణాలకు మారుపేరు, సందేహించేవారే లేరు. వేల కోట్ల రూపాయలున్న (కొందరు ఐదువేలంటారు మరికొందరు రెండువేలంటారు) నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రిక ఆస్ధులను తమ ఖాతాలో వేసుకొనేందుకు కాంగ్రెస్ నేతలు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. దానిని అమలు జరిపారు. సుబ్రమణ్యస్వామి అనే ఒక నాయకుడో కార్యకర్తో స్థాయో అసలు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియని ఒక లిటిగెంట్ బిజెపిలో చేరక ముందు నేషనల్ హెరాల్డ్ కుంభకోణం అంటూ ఒక కేసు వేశాడు. దానిలో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు శనివారం నాడు న్యూఢిల్లీలో ఎలాంటి హంగామా చేసిందీ జనమంతా ప్రత్యక్షంగా టీవీలలో చూశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది కనుక జైలుతో పనిలేకుండా బెయిల్ వచ్చింది. విచారణ వాయిదా పడింది. మనం కూడా దాన్ని కాసేపు పక్కన పెడదాం.
ఆసలు ఆ కేసుతో దానిని వేసిన సుబ్రమణ్యస్వామితో మాకు సంబంధం ఏమిటి అంటుందేమిటి బిజెపి? సదరు స్వామి బిజెపిలో లేనపుడు వేశారని ఇప్పుడు బిజెపిలో వున్నప్పటికీ అది స్వంత కేసు తప్పకేసు తప్ప పార్టీకి సంబంధం లేదని నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో వున్న బిజెపి మాజీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు, ఆ పార్టీ ఇతర నాయకులు బల్లచరిచి మరీవాదిస్తున్నారు. ఇక్కడ సమస్య స్వామి ఇప్పుడు ఏ గంగలో వున్నాడన్నది కాదు. ఆ కేసు విషయంలో బిజెపి వైఖరి ఏమిటి ? పార్టీలో చేర్చుకొనే ముందు బిజెపి లేదా స్వామి ఆ కేసుల గురించి చెప్పలేదు. స్వామి తప్ప కేసులతో తమకు సంబంధం లేదని అనటం వింతగా వుంది. పాత కేసులు వున్న అనేక మందిని బిజెపి తన కండువా కప్పి వారిని ఎన్నికలలో నిలబెడుతున్నది. అయినంత మాత్రాన వారు అఫిడవిట్లలో ఆ కేసులను ప్రస్తావించకుండా వుంటున్నారా? వుంటే కుదురుతుందా ? ఏదో ఒక వైఖరి చెప్పాలా లేదా ?
కాల్ మనీ మాఫియా వ్యవహారంలో అసెంబ్లీలో జరిగిన చర్చ తీరుతెన్నులను పరిశీలిస్తే అధికారపక్షం ఆబురదను పూసుకుందా ప్రతిపక్షం పైచేయి సాధించిందా అన్నది జనం బేరీజు వేసుకుంటున్నారు. ఈ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ తనకు తెలియకుండానే తానే మకిలి అంటించుకుంది అన్న అభిప్రాయం బలంగా వుంది. దీనిలో తెలుగు కాల్ మనీ మాఫియా వ్యవహారాలను పోలీసుల దృష్టికి తెచ్చిన తెలుగుదేశం ఎంపీ ఈ సమస్య అసెంబ్లీ సమావేశాల స్దంభనకు దారితీస్తుందని, అధికారపక్షాన్ని ఇంతగా ఇరుకున పెడుతుందని, పరిణామాలు ఈ విధంగా వుంటాయని ఊహించి వుండరు. దీన్ని గురించి బయట పెట్టిన నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ వెంటనే పది రోజులపాటు సెలవుపై వెళుతున్నారనే వార్తలు రావటంతో ప్రభుత్వం, పాలకపార్టీ ప్రతిష్ట దిగజారింది. కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వమే ఆ పని చేయించిందని వూరూ వాడా గుప్పు మంది. తెలుగుదేశం పార్టీని కాపాడటమే తమ కర్తవ్యంగా పెట్టుకున్న మీడియా కూడా ఈ విషయంలో ఆయన ప్రతిష్టకు మచ్చ రావటాన్ని నివారించలేకపోయింది. నష్ట నివారణ చర్యలు కూడా సరిగా చేపట్టలేదు. తన సెలవును తానే రద్దు చేసుకున్నట్లు సవాంగ్ మీడియాతో చెప్పగా ముఖ్యమంత్రి రద్దు చేయించారని తెలుగుదేశం నాయకులు ప్రకటించి అభాసుపాలయ్యారు.
కాల్ మాఫియా దురంతాలపై అసెంబ్లీలో చర్చ చేయకుండా పాలకపక్షాన్ని రచ్చకు ఈడ్వకుండా ప్రతిపక్షం ఎలా వుంటుంది. రాష్ట్రాన్ని కుదిపివేసిన కాల్ వ్యవహారంపై ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించి చర్చకు అంగీకరించి వుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్నది కనుకే వెంటనే చర్చకు అంగీకరించినట్లు చెప్పుకోవటానికి ఒక మంచి సందేశం పంపటానికి అవకాశం వుండేది. నిజానికి దీని గురించి అధికారపార్టీ అంత ప్రతిష్టకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సభ జరిగినన్ని రోజులూ ఈ అంశం తప్ప మరొకటి లేదు. ఈ అం శాన్ని రచ్చ చేయటం వలన రాజధానికి చెడ్డపేరు వచ్చిందని చంద్రబాబు నాయుడు వాపోవాల్సిన అవసరం వచ్చి వుండేది కాదు. చంద్రబాబు నాయుడి పాలనలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయా అని జపాన్, సింగపూర్ పాలకులకు తెలిసి వుండేది కాదు. ఈ మాఫియాలో వున్న తమ పార్టీ వారిపై తెలుగుదేశం పార్టీ వెంటనే చర్య తీసుకోకపోగా ఇతర పార్టీల వారూ వున్నారనే ప్రచారం కోసం రాష్ట్రంలో పలుచోట్ల దాడులు చేయించిందన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత జరిగిన తరువాత అసెంబ్లీలో వైసిపి సభ్యురాలు రోజా అనుచితంగా ప్రవర్తించిందని అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు తప్ప కాల్‌మాఫియాలో వున్న వారిని తెలుగుదేశం లేదా వైసిపీ గానీ ఎవరూ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అలాంటి వారితో ఫొటోలు దిగటంలో తప్పులేదన్నట్లుగా మాట్లాడిన వైసిపి నేత జగన్ తమ పార్టీ వారూ ఫొటోల ప్రదర్శనకు దిగిన విషయాన్ని మరిచిపోతే ఎలా ?
తెలుగుదేశం పార్టీకి అంబేద్కర్‌పై ఎక్కడలేని ప్రేమ ఆకస్మికంగా వుట్టుకువచ్చినట్లు ప్రవర్తించింది. ఒకవైపు రిజర్వేషన్లు అమలు జరపాల్సిన ప్రభుత్వ రంగ సంస్దలను నిర్వీర్యం చేసి వుద్యోగ నియామకాలను నిలిపివేస్తున్నది. ప్రభుత్వ వుద్యోగాలలోనూ అదే పరిస్ధితి. ప్రయివేటు రంగంపై నియంత్రణల ఎత్తివేతలో భాగంగా కార్మిక చట్టాలను నీరు గార్చేందుకు మద్దతు ఇస్తున్నది. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేయటమంటే అంబేద్కర్ సామాజిక న్యాయాన్ని కాదని చెప్పటమే. అంబేద్కర్‌పై అసెంబ్లీలో నిజంగా చర్చజరపాలనుకుంటే దానికోసం ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించి జరిపితే ఎవరూ గొడవ చేయరు. ఆ పని ఎందుకు చేయలేదు. రెగ్యులర్ సమావేశాలలో ఆ అజెండాను మిళితం చేయటం ఒక రాజకీయం. దాన్ని అడ్డుకున్నారని ప్రతిపక్షంపై నెపం వేసేందుకే దాన్ని ముందుకు తెచ్చారనిపిస్తోంది. నిజంగా అంబేద్కర్‌పై, ఆయన పోరాడి, సంఘటితపరచిన దళితులు, గిరిజనులపై ప్రేమ వంటే గత ఇరవైనెలలుగా ఎస్సీ కమిషన్ ఎందుకు నియామకం జరపలేదు?
19 Saturday Dec 2015
Posted in AP NEWS, NATIONAL NEWS, Others
Tags
సత్య
శాసన సభలో కాల్ మనీ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలు రెండూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఆ దుమ్ములో జనానికి ఏం జరుగుతోందో, ఏ జరగనుందో తెలియటం లేదు. ఒక గీతను చిన్నదానిని చేయాలంటే దాని పక్కన పెద్ద గీతను గీయటం పాత విద్యే.కాల్‌మనీ, అప్పు ఇచ్చి అత్యాచారాలు చేశారన్న ఆరోపణ, దందాలో చిక్కుకున్న విజయవాడ తెలుగుదేశం పార్టీ పరివారాన్ని కాపాడుకొనేందుకు, ఈ సమస్యను దారి మళ్లించేందుకు ఇప్పటికే చేయాల్సింది చేశారు. దానిలో భాగంగానే అన్ని పార్టీలకు తలాకాస్త బురద పూసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల వారూ వున్నారని, వారిలో వైసిపి వారే ఎక్కువగా వున్నారని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తం 188 మందిలో తమ వారు 20 మంది మాత్రమే వున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంలో ఆంతర్యం ఏమిటి ? దీనిలో నిజం కూడా వుండవచ్చు.
తమ వారు అంత తక్కువగా వున్నపుడు ఇతర పార్టీల వారూ ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి వారు ఎక్కువ మంది వున్నట్లు ఇప్పుడు చెబుతున్న సర్కార్ తమ వారిపై ఫిర్యాదు వచ్చేంత వరకు ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్న అధికారం పక్షం ఇంత తీవ్ర విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు ? వడ్డీ వ్యాపారులందరూ విజయవాడలో వారి మాదిరి మాఫియా లేదా సెక్స్‌రాకెట్‌లో నిమగ్నమైనవారు కాకపోవచ్చు. వడ్డీ వ్యాపారం చేసేవిగా పేరుపడిన పట్టణాలు,గ్రామాలకు చెందిన వారందరినీ ఈ సందర్బంగా పోలీసులు రౌండప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది కూడా సమస్యను పలచపడేట్లు చేయటానికి వేసిన ఎత్తుగడ మాత్రమే అని జనం భావిస్తున్నారు.
విజయవాడలో ఆరోపణలు వచ్చిన వారి వివరణలు చూస్తే ముఖ్య ంగా అధికార పార్టీ వారివి కహానీలుగా కనిపిస్తున్నాయి. పెనమలూరు ఎంఎల్‌ఏ బోడె ప్రసాద్ రాజకీయాలలోకి రాకముందు తనకు 23 ఎకరాల పొలం వుందని ఇప్పుడు రెండున్నర ఎకరాలకు తగ్గిపోయిందని స్వయంగా చెప్పారు కనుక మనం నమ్మాలి. ఎందుకంటే అనేక మంది అలా పోగొట్టుకున్నవారు వున్నారు. ఈ రోజుల్లోనా అని ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం కష్టం. అదే ఎంఎల్‌ఏ గారు మరొక మాట కూడా చెప్పారు బ్యాంకుల నుంచి పది కోట్ల రూపాయల అప్పు తీసుకొని వ్యాపారం చేస్తున్నానని అన్నారు. రెండున్నర ఎకరాల ఆసామికి పది కోట్ల రూపాయల అప్పు ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులు ఎంతో వుదారంగా అప్పులిస్తున్నట్లు మనం నమ్మాలి. ఇంత తక్కువ ఆస్ధి వున్నవారికే బ్యాంకులు పదికోట్ల రూపాయల అప్పులిస్తుంటే అంతకంటే ఎక్కువ ఆస్థులున్నవారు కూడా కాల్‌మనీ మాఫియా చేతుల్లో ఎందుకు చిక్కుకున్నారో, మాన మర్యాదలు ఎందుకు పోగొట్టుకున్నారో ఎంఎల్‌ఏగారు చెపితే బాగుంటుంది. ఇంకొకటి కాల్‌మనీ కేసులో తప్పించుకుతిరుగుతున్న తన ఇంటి పక్క స్నేహితుడితో కలసి విదేశాలకు వెళితే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నీవెలాంటి వాడివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అన్న లోకోక్తి ఒక్క వైసిపి నేతలకే కాదు అందరికీ వర్తిస్తుంది. ఫిర్యాదు చేసింది స్వంత పార్టీ ఎంపి కేశినేని నాని అని అసలు కాల్‌మాఫియా గురించి బయట పెట్టింది తామేనని చెప్పుకుంటున్న ఎంఎల్‌ఏ గారు అలాంటి మాఫియాలోని ఒకడైన తన స్నేహితుడిని గుర్తించలేకపోయారా ? స్నేహితులతో విదేశాలకు వెళ్లటమే తప్పా అని ఇప్పుడు అమాయకంగా అడిగితే ఎవరైనా నమ్ముతారా ?
మరో అధికార పార్టీ ఎంఎల్‌సి బుద్ధా వెంకన్న తాను ఇరవై సంవత్సరాలుగా తన తమ్ముడితో కలసి లేనని చెప్పారు. ఇది అంతగా అతుకుతుందా ? పోనీ లెండి తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పినట్లు కాల్ ముఠాలో లేడు అని చెప్పలేదు. తమ్ముడు తప్పుదారి పట్టినపుడు అన్నగా ఎందుకు మందలించలేదు, దాన్నుంచి ఎందుకు తప్పించలేదు అన్నదే సమాధానం రాని ప్రశ్న. కేశినేని నాని ఫిర్యాదు చేసేంత వరకు ఆపని మిగతావారు ఎందుకు చేయలేకపోయారు అన్నది అపూర్వ చింతామణి లేదా తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీతల వేయి ఒక్కలౌతుందన్న భేతాళుడి ప్రశ్న. తాను వైసిపి అరాచకాలను ఎదుర్కొంటున్న కారణంగానే జగన్ తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పటం కొంచెం ఎక్కువగా వుంది. మిగతా ఎంఎల్‌ఏలు వైసిపిని ఎదుర్కోవటం లేదా ? వైసిపి కాల్ మనీ మాఫియాను మీరు ఎందుకు వుపేక్షించినట్లు ?
కాల్ మనీ వార్తలు చదువుతుంటే రామాయణంలో పిడకల వేటలా ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ ఎన్ పటేల్ బ్యాంకర్లకు ఇది మంచి బేరాలు వచ్చే సమయం అని తిరుపతిలో వెంకన్న సన్నిధిలో చెప్పారు. మరిచి పోయా అసలు వెంకన్న పెద్ద వడ్డీ కాసులవాడు కదా ! జనానికి అప్పులు ఎలా తీసుకోవాలి అన్న విద్య తక్కువగా వున్న కారణంగా వారు కాల్ నాగుల వలలోచిక్కుకుంటున్నారని, దీన్ని చూస్తుంటే తమ బ్యాంకులకు మంచి బేరాలు తగిలే అవకాశాలున్నాయని చెప్పారు. జనానికి రుణ విద్య తెలియక కాదు, బ్యాంకర్లు పెట్టే నస, తిరగలేక లేక మాత్రమే వడ్డీ వ్యాపారుల వలలో పడుతున్నారు. ఆస్ది తనఖా పెట్టినా సామాన్యులకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లు కావూరి సాంబశివరావు వంటి వారికి వేల కోట్ల రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇస్తారు. సామాన్యులు గడువులోగా కట్టకపోతే సామాన్లు బయటపడవేసి చుట్టుపక్కల వారి ముందు అవమానాల పాలు చేసే బ్యాంకర్లు సాంబశివరావు వంటి వారిని బాబ్బాబు అని బతిమిలాడుకుంటారు. ఏమైనా మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో జనం ఎదుర్కొంటున్న ఒక ముఖ్య సమస్యపై అసెంబ్లీలో గొడవల రూపంలో అయినా చర్చ జరుగుతోంది. కనీసం ఒక్కరినైనా శిక్షించి పుణ్యం కట్టుకుంటే అదే పదివేలు.
18 Friday Dec 2015
Posted in AP NEWS, Current Affairs, NATIONAL NEWS, Women
సత్య
కాల్ మనీ అత్యాచారాల గురించి రోజు రోజుకూ కొత్త వుదంతాలు వెలువడుతున్నాయి. దీనికి బలైంది పేద, మధ్యతరగతి వారే కాదు, ధనికులు కూడా వున్నట్లు స్పష్టమౌతోంది. దీనిలో వడ్డీ మాఫియా, వాటికి బలైన అనేక కుటుంబాల మానవతుల మర్యాదలు మంట గలవటం గురించి బయటకు చెప్పుకోలేని వారెందరో వున్నారు. ఆ బలహీనతను ఆసరా చేసుకొని మాఫియాలు తమ పంజా విసురుతున్నాయన్నది స్పష్టం. ఈ దారుణాల గురించి అసెంబ్లీలో తొలి రోజే ప్రతిపక్షం, అధికారపక్షం బాహా బాహీ తలపడ్డాయి. ఇదెలా వుందంటే త్వశుంఠ అంటే త్వశుంఠ అన్నట్లుగా తయారైంది. బాధితులను రక్షించటం ఎలా, నేరగాళ్లపై చర్యలు తీసుకోవటం, ఇలాంటి దారుణాలను రాబోయే రోజుల్లో ఆపటం ఎలా అనే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మీ పార్టీ వారు, మీ అనుచరులే ఎక్కువ మంది వున్నారంటూ పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. అంటే అసలు సమస్యను రెండు పక్షాలూ పక్కదారి పట్టిస్తున్నాయి. వారి అనుచరులు కోరుకుంటున్నది ఇదే. ఇక్కడ ఒక విషయం స్పష్టం. ఏ పార్టీ వారు ఎందరున్నా వారంతా గతంలోనో, ఇప్పుడో అధికార ప్రాపకం వున్న వారు, లేదా సంఘవ్యతిరేక శక్తులు తప్ప మరొకరు కాదు. అలాంటి విభజన చేసేందుకు ప్రయత్నించటమంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలను ఏరే యత్నం తప్ప మరొకటి కాదు. రెండు పక్షాలకు మద్దతుదారులుగా పేరు పడిన మీడియా పత్రికలు లేదా టీవీ ఛానల్స్ తమ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఎదుటి పక్షానికి చెందిన నేరగాళ్లనే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. అంటే అందరి గురించి తెలుసుకోవాలంటే రెండు పక్షాల మీడియా వార్తలను చదువుకోవాల్సి వుంటుంది.
గతంలో మద్యం, ఇసుక మాఫియాలు, వాటి అక్రమాల గురించి సంచలన వార్తలు వచ్చిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. వాటిలో శిక్షలు పడిన వారెందరు? ఏ పార్టీ వారెందరో వున్నారో ప్రభుత్వం ప్రకటిస్తే తాజా కాల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం బాధితుల్లో కలుగుతుంది, మరిన్ని దారుణాలను నివేదించటానికి, ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తారు. అది చేయటానికి బదులు ఫలానా నిందితుడు ఫలానా నాయకుడితో ఫొటోలు దిగాడు, ఫలానా నిందితుడు ఫలానా నేత పర్యటనలకు ఏర్పాట్లు చేశాడు వంటి వాదనల ద్వారా సాధించేదేమీ వుండదు. ఇలాంటి నిందితులందరూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ఫిరాయించటం జగమెరిగిన సత్యం. అలాంటి వారని తెలిసిన తరువాత కూడా పార్టీల కండువాలు కప్పుతున్నారా లేదా ? ఏదో సాకుతో సమర్ధిస్తున్నారా లేదా ?ఎక్కడ తిరిగినా సరే మా దొడ్లే ఈనితే చాలంటున్నారా లేదా ? అందువలన అసెంబ్లీలో,వెలుపలా పాలక, ప్రతిపక్ష పార్టీల వ్యవహారం అంతా లాలూచీ కుస్తీ తప్ప మరొకటి కాదని జనం అనుకుంటే తప్పేముంది?
విజయవాడ, కృష్ణాజిల్లాలోని తెలుగు దేశం పార్టీలోని ముఠా గొడవల్లో భాగంగా ప్రత్యర్ధి వర్గాన్ని ఇరుకున పెట్టేందుకు కాల్ మనీ దందాను ఒక వర్గం వుపయోగించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచిదే ! ప్రతిపక్షం చేయలేని పనిని ఎవరో ఒకరు చేశారు, వారు ఎందుకు చేసినా ‘అభినందిం’చాల్సిందే. ఇంకా అలాంటి విషయాలను బయటపెట్టేందుకు ప్రోత్స హించాల్సిందే. అప్పుడే అవతలి ముఠాలో ఏవైనా అక్రమాలుంటే ఇవతల ముఠా కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బయటపెడుతుంది. జనానికి వాస్తవాలు తెలుస్తాయి, మీడియాకు సంచలన వార్తలు దొరుకుతాయి. విజయవాడకు అలాంటి చరిత్ర గతంలో వున్నది. కాంగ్రెస్‌లో జిఎస్ రాజు, వంగవీటి రంగా వర్గాలు అలా అనేక విషయాలను బయటపెట్టాయి. ఆ మంచి సాంప్రదాయాన్ని ఎవరు కొనసాగించినా అభినందించాల్సిందే.ఎందుకంటే అధికార యంత్రాంగం తానుగా అక్రమాలను వెలికితీసి, అక్రమార్కుల పని బట్టదు అని తేలిపోయింది. ఎందుకంటే వారికి ఎంతసేపూ పాలకపార్టీ సేవ తప్ప మరొకటి చేసే తీరిక వుండదు.
ఈ సందర్బంగా జనం బలహీనతలను చెప్పుకోకుండా సంపూర్ణం కాదు. విజయవాడ, రాష్ట్రం, దేశం ఎక్కడైనా ఇలాంటి మాఫియాలు, నేరగాళ్ల గురించి జనానికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అయినా సరే ఎన్నికలలో వారికి మద్దతు ఇస్తున్నారు. దీని వెనుక వున్న లాజిక్కు ఏమిటి ?ఏటిఎం మిషన్‌లో కార్డు అలా పెట్టి ఇలా డబ్బు తీసుకున్నంత సులభంగా తెల్లవారే సరికి డబ్బు సంపాదించాలి, నువ్వు ఎంత డబ్బు సంపాదించావన్నది ముఖ్యం తప్ప ఎలా సంపాదించావన్నది కాదు అన్నది నీతి నేడు సమాజాన్ని నడిపిస్తున్నది. అందువలన డబ్బు సంపాదించే వారే సమర్ధులు, జనం, సమస్యలు, పరిష్కారాలంటూ వీధుల్లో తిరిగే కమ్యూనిస్టుల వలన ప్రయోజనం లేదు. మనం కూడా ఎప్పుడైనా డబ్బు సంపాదించాలంటే మార్గం అధికార పార్టీని బలపరచటం, దాని నాయకుల చుట్టూ తిరగటం తప్ప మరొక మార్గం లేదు.
దీనికి తోడు వినియోగదారీ సంస్కృతి జన నరనరాల్లో ప్రవేశించింది. అత్యాశలకు పోవటం, ఆడంబరాలను పదర్శించటం, లేనిగొప్పలు చెప్పుకోవటం, పిల్లలకు వాస్తవాలు తెలియకుండా దాచటం, అందుకోసం అందినకాడికి అప్పులు చేయటం ఇలాంటి మాఫియాల చేతుల్లో చిక్కుకోవటం. దీన్నుంచి బయటపడనంత వరకు ఈ రోజు కాల్ మనీ రేపు మరొక మనీ, మరొక మాఫియా చేతుల్లో చిక్కుకోవటం. దీన్ని గురించి ఆలోచించకుండా, మంచి చెడ్డల వివేచన చేయకుండా రాజకీయాలలో నేరగాళ్లను, వారిని వెంటవేసుకు తిరిగే వారిని సమాజం అసహ్యించుకొని దూరంగా పెట్టనంత కాలం ఎండమావుల వెంట పరుగుపెడుతూనే వుంటారు, మోసపోతూనే వుంటారు. కాల్ మాఫియా చేతుల్లో అత్యాశకు పోయిన ఒక కుటుంబం గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. అదే నిజమైతే జనం ఎంతటి ప్రమాదకర పోకడలలో వున్నారో ఆందోళన కలిగిస్తోంది.
షాపింగ్ కాంప్లెక్స్ కట్టటానికి కోట్ల రూపాయల అప్పుతీసుకొని కాల్‌మనీ మాఫియా వలలో చిక్కుకున్న ఒక కుటుంబం గురించి మీడియాలో వచ్చింది. లక్షల రూపాయలు తీసుకుంటేనే తీర్చలేని స్ధితి వున్నపుడు కోట్ల రూపాయలు అప్పు చేసి కాంప్లెక్సులు కట్టాలనుకోవటం ఏమిటి ?
18 Wednesday Nov 2015
Tags
ఆంధ్రప్రదేశ్‌లో, ఎగువ రాష్ట్రాలలో ఖరీఫ్ సీజనలో సరైన వర్షాలు పడక నాగార్జున సాగర్, మరికొన్ని ప్రాంతాల రైతాంగం ఈ ఏడాది పంటలను నష్టపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కోస్తాలోని నెల్లూరు నుంచి గోదావరి జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలో రైతాంగానికి పెను గండంగా మారింది. లక్షలాది ఎకరాలలోని పంటలు నీట మునిగినట్లు వార్తలు ఆందోళన కలగిస్తున్నాయి. వర్షాలు తగ్గు ముఖం పట్టిన తరువాత గానీ నష్ట తీవ్రతను అంచనా వేయటం సాధ్యం కాదు.
ఎగువ ప్రాంతాలలో వర్షాలు లేని కారణంగా ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు తగిన నీరు రాలేదు. ఈ కారణంగా ధాన్యం సాధారణ సాగు ఆంధ్రప్రదేశ్‌లో 16,75,518 హెక్టార్లకు గాను అధికారిక లెక్కల ప్రకారం ఖరీఫ్ సీజన్లో 13,76,515 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ప్రకాశంలో 27, గుంటూరు జిల్లాలో 66, కృష్టా 81శాతం మాత్రమే( అదీ కృష్ణా డెల్టా ప్రాంతం) సాగైంది. సాగర్ ప్రాంతంలో నాట్లు పడలేదు. ఇప్పుడు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగు చేసిన ప్రాంతంలోని వరితో, కోస్తా , రాయలసీమ జిల్లాలన్నింటా మెట్ట పంటలకు సైతం పెద్ద నష్టాన్ని కలగచేస్తాయని రైతాంగ ఆందోళన చెందుతోంది. సకాలంలో వర్షాలు లేక కొన్ని ప్రాంతాలు నష్టపోతే అకాల వర్షాలు అన్ని ప్రాంతాలను దెబ్బతీస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వుదారంగా ఆదుకోనట్లయితే రైతాంగం మరింతగా అప్పుల ఊబిలో కూరుకు పోనుంది.