Tags
#Hindutva, Ayodhya Ramalayam, BJP, CPI(M), Hinduism, Hinduthwa, Mohan Bhagwat, Narendra Modi Failures, RSS, shivling under every mosque
ఎం కోటేశ్వరరావు
మందిరాల మీద మసీదులు కట్టారంటూ వెనుకా ముందూ చూడకుండా ముందుకు తెస్తున్న వివాదాలను ఆపాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ తాజాగా సుభాషితం చెప్పారు. పూనాలో 2024 డిసెంబరు 19వ తేదీన ‘‘ విశ్వగురువు భారత్ ’’ అనే అంశం మీద సహజీవన వ్యాఖ్యాన మాల ప్రసంగాల పరంపరలో భాగంగా మాట్లాడుతూ సెలవిచ్చిన మాటలవి.కొంత మంది తాము హిందువుల నేతలుగా ఎదగాలని చూస్తున్నారంటూ గుడి గోపురం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుత్మంతుడిగా మారుతుందా అంటూ మసీదుల మీద కేసులు వేసినంత మాత్రాన వారంతా నేతలు అవుతారా అన్నారు. ఇదే మోహన భగవత్ 2022 జూన్ 2న ఆర్‌ఎస్‌ఎస్ నేతల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి మసీదు కింద శివలింగాల కోసం వెతక వద్దని బోధ చేశారు. ఆ పెద్దమనిషి మాటలను హిందూత్వవాదులు ఎవరైనా వింటున్నారా ? పూచిక పుల్లల మాదిరి తీసివేస్తున్నారా ? అసలు మోహన్‌భగవత్ నోటి వెంట ఇలాంటి మాటలు ఎందుకు వెలువడుతున్నాయి. ఇదంతా ఒక నాటకమా, వాటివెనుక అసలు చిత్తశుద్ది ఉందా ? అదే గుంపుకు చెందిన ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడటం లేదు ? ఇలా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు పదిహేను నాటికి ఉన్న ప్రార్ధనా మందిరాలను ఉన్నవాటిని ఉన్నట్లుగానే పరిగణించాలని 1991లో పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించింది. అయితే అప్పటికే అయోధ్య వివాదం కోర్టులో ఉన్నందున దానికి మినహాయింపు ఇచ్చారు. అయోధ్య వివాదం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనేక మంది ఆమోదించనప్పటికీ మసీదు అంటూ కేసును వాదించిన కక్షిదారులు కూడా ఆమోదించిన కారణంగా దానికి తెరపడిరది. అక్కడ రామాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత మందిరాలను కూల్చివేసి మసీదులు కట్టారంటూ తరువాత పది ప్రార్ధనా మందిరాలపై 18 కేసులు వివిధ రాష్ట్రాలలో దాఖలయ్యాయి. 1991నాటి ప్రార్ధనా మందిరాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మరోకేసు దాఖలైంది. ఇలాంటి వివాదాలను తమ నిర్ణయం వెలువడేంతవరకు దిగువ కోర్టులు పక్కన పెట్టాలని, కొత్తగా ఎలాంటి కేసులను తీసుకోవద్దంటూ 2024 డిసెంబరు 12న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ దాఖలు చేయాలని నెల రోజుల గదువు ఇచ్చింది. ఆ తరువాత మరో నెల రోజుల్లో ఇతరులు తమ అఫిడవిట్లను సమర్పించాలని కోరింది.ఈ కేసులో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్ కూడా ప్రతివాదిగా చేరారు.
కోర్టు ఆదేశించినట్లుగా కేంద్రం అఫిడవిట్ సమర్పిస్తుందా ? అనుమానమే, గత కొద్ది సంవత్సరాలుగా ఏదో ఒకసాకుతో తప్పించుకుంటున్నవారిని నమ్మటమెలా ? 2020లో ప్రార్ధనా స్థలాల 1991 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో గత నాలుగు సంవత్సరాలుగా అనేక గడువులు విధించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడిస్తూ ఇంతవరకు అఫిడవిట్ సమర్పింలేదు, ఏదో ఒకసాకుతో కాలం గడుపుతున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా అదే స్థితి. చట్టం రద్దు లేదా కొనసాగింపుకుగానీ ఏ వైఖరిని తెలియచేసినా అది ఎన్నికల్లో ప్రభావితం అవుతుందనే ముందుచూపుతోనే మోడీ ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. కేంద్రం ఇంకా తన వైఖరిని తేల్చకపోతే రాజకీయంగా విమర్శలపాలవుతుంది. అనేక చోట్ల మసీదులను సర్వే చేయించి శివలింగాలు, విగ్రహాలు ఉన్నదీ లేనిదీ తేల్చాలనే కేసులు దాఖలు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు, బెంచ్‌లు మారాయి, ఇంకే మాత్రం దీని గురించి తేల్చకపోతే అత్యున్నత న్యాయవ్యవస్థ మీదనే పౌరుల్లో విశ్వాసం కోల్పోయే స్థితి ఏర్పడిరది. కోర్టు కూడా తన అభిప్రాయాన్ని వెల్లడిరచాల్సి ఉంది.
ఈ పూర్వరంగంలో మోహనభగవత్ ఇలాంటి వివాదాలను ఆపాలని కోరారు. అసలు అలాంటి కేసులు దాఖలైన వెంటనే ఆ పిలుపు ఎందుకు ఇవ్వలేదన్నది ప్రశ్న. కేసులు దాఖలు చేసిన వారు ఏ సంస్థ పేరు పెట్టుకున్నా లేదా వ్యక్తిగతంగా చూసినా వారంతా హిందూత్వవాదులే. వారిలో బిజెపి రాజ్యసభ మాజీ సభ్యుడైన సుబ్రమణ్యస్వామి ఒకరు. అందువలన తమ పార్టీకి సంబంధం లేదంటే కుదరదు. పోనీ ఆ పెద్దమనిషిని పార్టీ నుంచి బహిష్కరించారా అంటే లేదు. సదరు స్వామితో సహా ఏ ఒక్కరూ మోహన్ భగవత్ మాటలను పట్టించుకోలేదు, అయినప్పటికీ ఎందుకు అలా సెలవిస్తున్నారంటే అదే అసలైన రాజకీయం. సంఘపరివార్ తీరు తెన్నులను చూసి ఊసరవెల్లులు దేశం వదలి వెళ్లిపోయినట్లు కొందరు పరిహాసంగా మాట్లాడతారు. రెండు నాలికలతో మాట్లాడవద్దు అనే లోకోక్తిని పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్ గుంపు మాదిరి మాట్లాడవద్దు అనే కొత్త నానుడిని తీసుకు రావాల్సిన అవసరం కనిపిస్తోంది.నటీ నటులు ఏ సినిమాకు తగిన వేషాన్ని దానికి తగినట్లుగా వేస్తున్నట్లు వీరు కూడా ఎప్పటికెయ్యది అప్పటికా మాటలు మాట్లాడటం తెలిసిందే. పెద్దలుగా ఉన్న మీరు సుభాషితాలు వల్లిస్తూ ఉండండి మేము చేయాల్సింది మేము చేస్తాం, న్యాయవ్యవస్థలో ఉన్న మనవారు నాటకాన్ని రక్తికట్టిస్తారు అన్నట్లుగా హిందూత్వవాదుల తీరు ఉంది.
చరిత్ర పరిశోధకుల ముసుగులో ఉన్న కొందరు దేశంలో 1,800 దేవాలయాలను మసీదులుగా మార్చారంటూ ఒక జాబితాను రూపొందించారు. సుప్రీం కోర్టు ముందున్న 1991నాటి ప్రార్ధనా స్థలాల చట్టాన్ని మార్చే హక్కు ప్రభుత్వానికి ఉన్నదని గనుక తీర్పు వస్తే మరో 1,800 అయోధ్యలకు తెరలేస్తుంది. సుప్రీం కోర్టు మరోసారి కొత్త గడవు విధించింది. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఎలా వెల్లడిస్తుందన్నది చూడాల్సి ఉంది. మోహన్ భగవత్‌సుభాషితాలు చెబుతూనే ఉంటారు. వేర్వేరు ముసుగుల్లో ఉన్నవారు వివాదాలను ముందుకు తెస్తూనే ఉంటారు. వారి సంగతేమంటే తమ వారు కాదని తప్పించుకుంటారు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో బలహీనపడిన బిజెపి, నరేంద్రమోడీ నాయకత్వం దేశమంతటా మసీదుల కింద శివలింగాల వెతుకులాటలకు దిగే శక్తులు సృష్టించే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం లేదు గనుకనే ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇలాంటి పిలుపు ఇచ్చారని కొందరి అభిప్రాయం. ఒక మాటను జనంలోకి వదలి దాని మీద స్పందనలు ఎలా ఉంటాయో చూడటం కూడా దీని వెనుక లేదని చెప్పలేము. ఈ పిలుపు ఇచ్చిన తరువాత ఒక్కరంటే ఒక్కరు కూడా తమ కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించలేదు. అంతెందుకు తన స్వంత నియోజకవర్గంలో ముందుకు వచ్చిన జ్ఞానవాపి మసీదులో శివలింగవెతుకులాట గురించి నరేంద్ర మోడీ ఒక్కసారైనా నోరు విప్పారా ? నిజంగా అలాంటి వివాదాలను రేపకూడదని బిజెపి నిజంగా కోరుకుంటే ఎందుకు మాట్లాడటం లేదు ? మౌనం అంగీకారం అన్నట్లే కదా ! మణిపూర్‌లో మానవత్వం మంట కలిసినా నోరు విప్పని, అక్కడికి వెళ్లి సామాజిక సామరస్యతను పాటించాలని కోరేందుకు వెళ్లని నేత నుంచి అలాంటివి ఆశించగలమా ? గతంలో గోరక్షకుల పేరుతో రెచ్చిపోయిన వారి ఆగడాల మీద తీవ్ర విమర్శలు రావటంతో స్పందించిన మోడీ శివలింగాల వెతుకులాట మీద ఎందుకు మాట్లాడటం లేదు. తాను ఆర్‌ఎస్‌ఎస్ వాదినే అని గర్వంగా చెప్పుకుంటారు కదా ! దాని అధినేత చెప్పిన మాటలను ఔదాల్చకపోతే క్రమశిక్షణ తప్పినట్లు కాదా ?
మోహన్ భగవత్ రాజకీయ అవకాశవాదంతో మాట్లాడుతున్నారంటూ ఉత్తరాఖండ్ జ్యోతిర్మయిపీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద విమర్శించారు.అయోధ్య రామాలయ నిర్మాణం తరువాత మిగతా అంశాలను మాట్లాడకూడదని అంటే కుదరదన్నారు. గతంలో మనదేశంలోకి చొరబాటుదార్లుగా వచ్చిన వారు నాశనం చేసిన దేవాలయాల జాబితాను తయారు చేసి వాటన్నింటినీ పునరుద్దరించాలన్నారు. భగవత్ వ్యక్తిగతంగా వివాదాల గురించి మాట్లాడి ఉండవచ్చు. అది అందరి అభిప్రాయం కాదు. అతను ఒక సంస్థకు అధినేత తప్ప హిందూమతానికి కాదు.హిందూయిజానికి బాధ్యత సాధు, సంతులది తప్ప అతనిది కాదు అని జగద్గురు రామభద్రాచార్య డిసెంబరు 24వ తేదీన ధ్వజమెత్తారు. చారిత్రక సంపదను హిందువులు తిరిగి పొందాల్సిందే అన్నారు.అఖిల భారతీయ సంత్ సమితి కూడా ఆర్‌ఎస్‌ఎస్ నేతను విమర్శించింది. మతపరమైన అంశాలేమైనా వస్తే నిర్ణయించాల్సింది మత గురువులు, వారి నిర్ణయాన్ని ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి ఆమోదించాల్సి ఉందని స్వామి జితేంద్రనాదానంద సరస్వతి చెప్పారు.
నరేంద్రమోడీని విశ్వగురువు అని వర్ణిస్తూ ప్రపంచ నేతగా చిత్రించేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. అందుకే ఇటీవల ఆ ప్రచారాన్ని తగ్గించారని చెబుతారు. ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపాలంటారు, మరోచోట మంచి జరగాలంటారు తప్ప మణిపూర్ ఎందుకు వెళ్లరనే ప్రశ్న పదే ముందుకు రావటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.నిజానికి గత పదేండ్లలో మనకు మనం చెప్పుకోవటం తప్ప ఏ ప్రధాన వివాదంలోనూ మన దేశ సహాయం కోరిన వారు లేరు, మనంగా తీసుకున్న చొరవ కూడా లేదు. బహుశా అందుకే విదేశాంగ మంత్రి జై శంకర్ భారత్ విశ్వమిత్ర అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయినప్పటికీ భారత్ విశ్వగురువు పాత్ర గురించి ఆర్‌ఎస్‌ఎస్ మాట్లాడుతున్నది.1991నాటి ప్రార్ధనా స్థలలా చట్టాన్ని సంఘపరివార్‌కు చెందిన వారు ఇప్పుడు సవాలు చేస్తున్నారు. దాని ప్రకారం వాటి స్వభావాన్ని మార్చకపోయినా చరిత్రలో జరిగిందేమిటో తెలుసుకొనేందుకు తాము పేర్కొన్న మసీదులను సర్వే చేయాలని, తవ్వివెలికి తీయాలని వారు కోరుతున్నారు. గతంలో బాబరీ మసీదు వివాదంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్ధించిన అనేక మంది ఇప్పుడు ఇతర మసీదుల వివాదాలను ముందుకు తెస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. దేశంలో ఇతర సమస్యలేమీ లేనట్లు, మసీదుల కింద శివలింగాలు, ఇతర విగ్రహాలకోసం వెతుకులాట గురించి కేంద్రీకరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించేవారు ప్రస్తుతానికి పరిమితమే అయినా మరోసారి మసీదుల కూల్చివేతల అంశం ముందుకు వస్తే కచ్చితంగా పెరుగుతారు. అప్పుడు బిజెపి హిందూత్వ అజెండాకే ఎసరు వస్తుంది. ఇప్పటికే పక్కనే ఉన్న మతరాజ్యం పాకిస్తాన్ మాదిరి భారత్‌ను కూడా అదే మాదిరి మార్చి దిగజారుస్తారా అన్న ప్రశ్నకు హిందూత్వ వాదుల వద్ద సరైన సమాధానం లేదు. మరోవైపున మారని సనాతన వాదాన్ని ముందుకు తెస్తూ దాన్ని రక్షించాలని కోరతారు. దానికోసం ఎంతదూరమైనా వెళతామంటూ ఊగిపోతారు.మానవజాతి చరిత్రను చూసినపుడు పనికిరాని వాటిని ఎప్పటికప్పుడు వదలించుకోవటం తప్ప కొనసాగించటం కనపడదు.
సద్గురుగా భావిస్తూ అనేక మంది అనుసరించే జగ్గీ వాసుదేవ్ హిందూమతంలో లేదా సనాతనంలో ఏ మెట్టులో ఉన్నారో ఎక్కడ ఇముడుతారో,సాధికారత ఏమిటో తెలియదు. ‘‘ సనాతన ధర్మం అంటే మీరు ఏదో ఒకదాన్ని నమ్మాలి లేదంటే మరణిస్తారు అని కాదు. నేను ఏదైనా ఒక విషయాన్ని చెబితే దానివల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రశ్నలు ఉదయించాలి.సనాతన ధర్మ ప్రక్రియ అంతా కూడా మీలో ప్రశ్నలను పెంచటం గురించే కాని సంసిద్దంగా ఉన్న సమాధానాలను ఇవ్వటం కాదు.’’ అని వాసుదేవ్ చెప్పారు. సనాతనం అంటే మారనిది అన్నారు, ఇక దాన్ని గురించి ప్రశ్నించేదేమి ఉంటుంది. అసలు సమస్య ఏమంటే సనాతనం లేదా హిందూ ధర్మం మనదేశంలో ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలను, నూతన ఆలోచనలనే అణచివేసింది.ప్రశ్న అడగటమే తప్పు, మన పెద్దలనే అవమానిస్తావా, ప్రశ్నిస్తావా అంటూ నోరుమూయించటం నిత్యం కనిపిస్తున్నదే.


