ఎం కోటేశ్వరరావు
పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలో పరిణామాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తమ శత్రువులు, ఇజ్రాయెల్ గూఢచార కేంద్రాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉండే నౌకలపై కొనసాగిస్తున్న దాడులను ఎమెన్‌లోని హౌతీ సాయుధులు తీవ్రం చేశారు. వారి మీద అమెరికా, బ్రిటన్ ప్రత్యక్షంగా దాడులు చేస్తుండగా పది దేశాలు వాటికి వివిధ రూపాలలో సాయపడుతున్నాయి. గాజాపై యూదు దురహంకారుల మారణకాండ, విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు ఇప్పుడున్న బ్రెంట్ రకం 78 డాలర్ల నుంచి ఏప్రిల్ నాటికి 110 డాలర్ల వరకు పెరగవచ్చని కొందరు జోశ్యాలు చెబుతున్నారు. తాము పాలస్తీనాకు మద్దతుదార్లమే అనే సంకేతాలు ఇచ్చేందుకు ఎర్ర సముద్రంలో ప్రవేశించే అనేక నావలు చైనా, రష్యా సిబ్బందితో నడుస్తున్నట్లు సంకేతాలు పంపుతున్నాయి. ఇవి నిజంగా ఆ దేశాల కంపెనీలకు చెందినవేనా లేక దాడులను తప్పించుకొనేందుకు అలా సూచిస్తున్నాయా అన్నది నిర్ధారణ కాలేదు.ఉత్తర గాజా ప్రాంతంలో పౌరుల ప్రాణ రక్షణకు అవసరమైన ఆహారం, ఔషధాలు,మంచినీరు, ఇతర అవసరాలను అందచేస్తున్న సంస్థలను ఇజ్రాయెల్ అడ్డుకుంటున్నదని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇప్పటివరకు గాజాలో 24వేల మందికి పైగా పౌరులను ఇజ్రాయెల్ చంపింది, 61వేల మంది గాయపడ్డారు. తాను గనుక అధ్యక్షుడిగా ఉండి ఉంటే పరిస్థితిని ఎంతో వేగంగా చక్కదిద్ది ఉండేవాడినని డోనాల్ట్ ట్రంప్ చెప్పుకున్నాడు. తాను పదవిలో ఉంటే అసలు ఇజ్రాయెల్ దాడే చేసి ఉండేది కాదన్నాడు. అమెరికా చరిత్రలో జో బైడెన్ పరమ చెత్త అధ్యక్షుడని వర్ణించాడు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళం (ఐఆర్‌జిసి) సోమవారం నాడు ఇరాక్, సిరియాల్లోని శత్రు కేంద్రాలు,స్థావరాలపై ఖండాంతర క్షిపణులతో దాడులు జరిపింది. ఇరాక్‌లోని కర్దిష్ పాక్షిక స్వయం పాలిత ప్రాంత రాజధాని ఎర్బిల్ నగరంలోని ఇజ్రాయెల్ గూఢచార కేంద్రంపై దాడులను కేంద్రీకరించింది.పేలుళ్ల కారణంగా జరిగిన నష్టం గురించి వెల్లడి కాలేదు గానీ ఐదుగురు మరణించినట్లు కర్దిష్ డెమోక్రటిక్ పార్టీ ప్రకటించింది. ఈనెల ప్రారంభంలో ఇరాన్‌లోని కెర్మెన్ పట్టణంలో జరిపిన దాడుల్లో వంద మంది మరణానికి కారకులం తామే అని ఐఎస్‌ఐఎల్ ప్రకటించింది. సోమవారం నాడు సిరియాలోని ఆ సంస్థ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది.సిరియాలోని ఐఎస్‌ఐఎస్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సోమవారం నాడు దీర్ఘశ్రేణి క్షిపణిదాడి జరిపిందని, నిజానికి ఇది ఇజ్రాయెల్‌ను హెచ్చరించటమే అని ఇరాన్ మిలిటరీ వ్యవహారాల జర్నలిస్టు మహమ్మద్ షల్‌టౌకీ చెప్పాడు. ఆ క్షిపణి పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని, ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దాడి జరపలేదని అన్నాడు.తాను తలచుకొంటే నేరుగా ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలను గురిచూసి కొట్టగలనని చెప్పటమే ఇదన్నాడు.హమస్‌ను ఓడించటం జరిగేది కాదని అయినప్పటికీ లక్ష్యాన్ని సాధించాల్సిందేనని ఇజ్రాయెల్ న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత యుద్ధ కాబినెట్ మంత్రి గిడియన్ సార్ చెప్పాడు.వంద రోజులుగా జరుపుతున్న దాడుల మీద పెద్ద ఎత్తున వత్తిడి వస్తున్నది. గాజాపై యుద్ధాన్ని సమర్ధిస్తున్నందుకు గాను ఇద్దరు ముఖ్యమైన అధికారులు జో బైడెన్‌కు తమ రాజీనామాలను సమర్పించారు. ఎర్ర సముద్రంలో అమెరికా వస్తురవాణా నౌక ఎంవి జిబ్రాల్టర్ ఈగిల్‌పై ఎమెన్ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధులు క్షిపణులతో దాడులు జరిపారు. అది మార్షల్ ఐలాండ్స్ పతాకంతో ఉంది. పెద్దగా నష్టం లేదని, ప్రయాణం కొనసాగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఎమెన్‌లోని హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ దాడులు జరుపుతున్నాయి. సోమవారం నాడు ఒక విమానాశ్రయం వద్ద పేలుళ్లు వినిపించాయి. ఇజ్రాయెల్ వైపు వెళ్లే నౌకలపై దాడులను కొనసాగిస్తూనే ఉంటామని హౌతీ నేతలు ప్రకటించారు. అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రం, ఏడెన్ జలసంధికి దగ్గరగా ఉన్న కీలక ప్రాంతం, రాజధాని సనాతో సహా ముఖ్యమైన ప్రాంతాలన్నీ హౌతీ సాయుధుల ఆధీనంలో ఉన్నాయి.తమదే అధికారం అని ప్రకటించుకున్నాయి. ఎమెన్‌పై దాడులను ఆపాలని ఇరాన్ ప్రభుత్వం అమెరికా,బ్రిటన్‌లను కోరింది. ఆ దాడులు చట్టవిరుద్దమని ప్రకటించగా తాము ఆత్మరక్షణ కోసం జరుపుతున్నట్లు అమెరికా చెప్పుకుంటున్నది.హౌతీలకు ఇరాన్ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఎమెన్ అంతర్యుద్ధంలో హౌతీలకు వ్యతిరేకంగా అమెరికా అనుకూల శక్తులకు దాదాపు పది సంవత్సరాలపాటు మద్దతు ఇచ్చిన సౌదీ అరేబియా ఇటీవల ఇరాన్‌తో దౌత్య సంబంధాలను పునరుద్దరించుకుంది.దాంతో హౌతీలపై చేస్తున్న దాడులకు సాయాన్ని నిలిపివేసింది. ఈ పరిణామం మింగుడుపడని అమెరికా ఇప్పుడు ఎర్రసముద్రంలో నౌకల రక్షణకు గాను తాము ఎమెన్‌పై దాడులు జరుపుతున్నట్లు సాకు చూపుతున్నది.హౌతీల వెనుక ఇరాన్ ఉన్నట్లు ఆరోపిస్తున్నది.
అమెరికా నౌకపై దాడి దానికి ప్రతిగా బ్రిటన్‌తో కలసి అమెరికా దళాలు చేస్తున్న దాడుల తరువాత హౌతీలు ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని ప్రకటించటంతో అమెరికా కూటమి సామర్ధ్యం గురించి విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.సమీప భవిష్యత్‌లో తాము ఎల్‌ఎన్‌జి రవాణా నౌకలను ఎర్ర సముద్రంలోకి పంపే అవకాశం లేదనని కతార్ ప్రకటించింది. గురువారం నాటి అమెరికా,బ్రిటన్ దాడుల తరువాత ఆ మార్గంలో ప్రయాణించే నౌకలు తగ్గాయి.గత ఆరువారాల్లో హౌతీలు 30సార్లు నౌకలపై జరిపారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేస్తే తాముకూడా స్వేచ్చగా నౌకల రవాణాను అనుమతిస్తామని ప్రకటించారు. తమ దాడులు ఒక హెచ్చరిక మాత్రమేనని, నిరంతరం కొనసాగిస్తామని చెప్పలేదని బ్రిటన్ రక్షణ మంత్రి గ్రాంట్ షాప్స్ చెప్పాడు.ఐరాస గుర్తింపు పొందిన ఎమెన్ ప్రభుత్వం హౌతీలను ఓడించాలంటే తమకు మిలిటరీ ఆయుధాలు, శిక్షణతో పాటు గూఢచార సమాచారాన్ని అందించాలని పశ్చిమ దేశాలను కోరింది. తొమ్మిది సంవత్సరాల పాటు సౌదీ అరేబియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, వైమానిక దళ శక్తి చాలదని మేజర్ జనరల్ ఇదారస్ చెప్పాడు.హౌతీల క్షిపణులు భూగర్భంలో ఉంటాయని వాటిని పసిగట్టటం కష్టమని కూడా చెప్పాడు.ఆదివారం నాడు ఎమెన్ పిఎల్‌సి ప్రభుత్వ ప్రధాని మయీన్ అబ్దుల్ మాలీతో బ్రిటన్ రాయబారి భేటీ అయ్యాడు. మరుసటి రోజు తాము ఇజ్రాయెల్‌ను సమర్ధించటం లేదని, పాలస్తీనియన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఎమెన్ ప్రకటించింది. తొలిసారిగా ఎమెన్‌పై అమెరికా,బ్రిటన్ దాడులకు దిగినప్పటికీ వాటిని ఎదురుదాడులుగా పరిగణించలేమని కొందరు చెబుతున్నారు.ఎర్ర సముద్రంలో స్వేచ్చగా తమ నౌకలు తిరిగే హక్కుందని స్పష్టం చేయటమే అసలైన లక్ష్యమని చెబుతున్నారు. ఈ దాడులకు ఆస్ట్రేలియా, బహరెయిన్, కెనడా, నెదర్లాండ్స్ తదితర దేశాల మద్దతు ఉంది.హౌతీల చరిత్ర చూసినపుడు వారిని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదని చెబుతున్నారు.అమెరికా యుద్ధ నౌక డెస్ట్రాయర్ మీద జరిపిన దాడి తరువాత సోమవారం నాడు అమెరికా వాణిజ్య నౌక మీద హౌతీలు దాడులు జరిపారు. ఎర్ర సముద్రం నుంచి సూయజ్ కాలువకు వెళ్లే మార్గంలో కీలకమైన బాబ్ అల్ మండెబ్ జలసంధితో సహా ఎమెన్ కీలక ప్రాంతాలన్నీ హౌతీల చేతుల్లో ఉన్నాయి. ఉద్రిక్తతలు మరింత దిగజారకుండా చూడాలని జో బైడెన్ పైకి చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్‌కు ఆయుధాలు పంపేందుకు ఇప్పటికి రెండు సార్లు అమెరికా పార్లమెంటును పక్కన పెట్టి తన అధికారాలను వినియోగించాడు. రానున్న రోజుల్లో ఎమెన్ మీద దాడులు జరిపితే పరిస్థితి విషమించవచ్చు.
విశ్లేషకుల అంచనాలు తప్ప వచ్చు, పోరు తమకు లాభం చేకూర్చుతుందని అమెరికా, దాని మిత్ర దేశాలు భావిస్తే ఆ ప్రాంతాన్ని యుద్ధ రంగంలోకి లాగవచ్చు. అదే జరిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ప్రపంచ కంటెయినర్ రవాణా 30, పన్నెండుశాతం ప్రపంచ వాణిజ్యం ఎర్ర సముద్రంగుండా జరుగుతున్నది. ఐరోపాతో మన దేశ వస్తువాణిజ్యం 80శాతం ఈ మార్గం నుంచే ఉంది. రవాణా వ్యయం పెరిగి మనం చేసుకొనే దిగుమతుల ఖర్చు పెరిగితే వాటిని మనజనం మీద మోపుతారు. అదే మన ఎగుమతుల రవాణా ఖర్చు పెరిగితే వాటిని కొనేవారు లేకపోతే పరిస్థితి ఏమిటన్నది సమస్య. ఇప్పటి వరకైతే ఎలాంటి సమస్య లేదు గానీ జనవరి నుంచి ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. నవంబరు మధ్య నుంచి సూయజ్ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించాల్సిన నౌకలలో 95శాతం ఆఫ్రికాలోని గుడ్ హౌప్ ఆగ్రంను చుట్టి వస్తున్నాయి. దీని వలన నాలుగు నుంచి ఆరువేల నాటికల్ మైళ్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి రావటం, 14 నుంచి 20రోజులు అదనపు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ దాడులను కొనసాగించినంతకాలం హౌతీల దాడులు కొనసాగుతూనే ఉంటాయి. అదే జరిగితే ప్రపంచ ముడిచమురు సరఫరా వ్యవస్థ దెబ్బతినవచ్చని ఆరు నుంచి ఎనిమిది మిలియన్ల పీపాల సరఫరాలోటు ఏర్పడవచ్చని అక్టోబరు చివరిలో ప్రపంచ బాంకు హెచ్చరించింది.ఫలితంగా 56 నుంచి 75శాతం వరకు ధరలు పెరిగి 140 నుంచి 157 డాలర్ల వరకు పీపా ధర పెరగవచ్చని పేర్కొన్నది. అయితే చమురు వ్యాపారులు మార్చి, ఏప్రిల్ నెలల్లో పీపాధర 110 డాలర్లవరకు పెరగవచ్చనే అంచనాతో 30 మిలియన్ల పీపాల మీద పందెంకాశారు.( అంతకంటే తక్కువ ధర ఉంటే వారు చెల్లిస్తారు ఎక్కువ ఉంటే ఇతరుల నుంచి తీసుకుంటారు.చమురు చేతులు మారదు) దీనికి ప్రధాన కారణం ఇరాన్ పూర్తి మద్దతు ఉన్న హౌతీ సాయుధుల చర్యలే. అదే విధంగా మే, జూన్ మాసాల్లో 130 డాలర్లు ఉండవచ్చని కూడా పందెం కాస్తున్నారు. మార్కెట్ విశ్లేషకులు మాత్రం ఈ ఏడాది ఆరునెలల్లో వంద డాలర్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో పెద్ద పరిణామాలేవీ జరగకపోవచ్చని అనేక మంది చెబుతున్నారు. డిసెంబరులో రాయిటర్స్ సర్వేలో 34 మందిలో ఒక్కరే ఈ ఏడాది 90 డాలర్లకంటే ఎక్కువ ఉండవచ్చని చెప్పారు.అమెరికా, ఇతర పశ్చిమదేశాలు అనుసరిస్తున్న వైఖరి కారణంగా మొత్తం మీద పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి.తమ మీద దాడులు జరిగిన తరువాత కూడా అమెరికా నౌకల మీద హౌతీలు దాడులు చేశారు. ఇవి ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.






