• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

కనిపించిన కేసు ఒక్కటే, పరీక్షలు కోటీ 80లక్షలు – కరోనా కట్టడిలో చైనా రహస్యం అదే !

11 Friday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science

≈ 1 Comment

Tags

china communists action to fight against covid-19, China Covid-19, COVID- 19 pandemic, Guangzhou tests 18m people, Narendra Modi Failures, nucleic acid test


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు, ఏ నెలలో చైనా ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవటం ఎంతో కష్టంగా మారిందంటూ ఒక విశ్లేషకుడు కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యానం రాశాడు. ఇది నిజమే. అది అతని వ్యక్తిగతం కాదు, చైనా వారు చెప్పే అంశాలపై నమ్మకం కోల్పోయిన వారందరి తీవ్ర మానసిక సమస్య ఇది. వారికి పూర్తిగా తెలియదు, ఇతరులు చెబితే వినరు. చైనా వారు చెప్పేవన్నీ అతిశయోక్తులే, అంత అభివృద్ది, పురోగమనం లేదూ, పాడూ లేదు, అన్నీ నాశిరకరం అని కొట్టి పారవేసిన వారు ఇప్పుడు నమ్మలేని అంశాలతో బిత్తరపోతున్నారు. అది నేల నుంచి నింగి విజయాల వరకు దూసుకుపోతున్నది. త్వరలో ఆర్ధికంగా అమెరికాను అధిగమించనుంది. సాంకేతిక రంగంలో కొన్ని అంశాలలో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలదే పైచేయిగా ఉన్నప్పటికీ వాటికి ధీటుగా ముందుకు వస్తోంది.


అనేక మంది చైనా గురించి సరైన సమాచారం తెలుసుకోవటం కష్టం అంటూనే రకరకాల చెత్తకథనాలు రాయటం, చూపటం, వినిపించటం చూస్తున్నాము. ఎంతో స్వేచ్చ, దేన్ని గురించైనా మాట్లాడుకోవచ్చు, తెలుసుకోవచ్చు, బయట పెట్టవచ్చు అడ్డూ అదుపు ఉండదు అని చెప్పుకొనే అమెరికా వంటి దేశాలలో కూడా అక్కడి పాలకుల కనుసన్నలలో వారికి పనికిరానిదాన్ని, వారి ప్రయోజనాలకు పనికి వచ్చే సమాచారాన్నే బయటికి వదులుతారు తప్ప ప్రతిదాన్నీ బహిరంగపరచరు. చైనా దానికి మినహాయింపు కాదు. చైనా విలేకర్ల పేరుతో వ్యవహరించే వారిలో అత్యధికులు తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణకొరియా, జపాన్‌లో ఉండి వార్తలు రాస్తారు. వారికి సిఐఏ ఏజంట్లు, చైనా వ్యతిరేకులు అందించే అంశాలే ఆధారం. చైనా ప్రధాన భూభాగంలో ఉండేవారు కూడా ఎక్కువ మంది అసత్య, అర్ధసత్య వార్తలనే వండి వడ్డిస్తారు. వీరిలో చాలా మంది జర్నలిస్టుల ముసుగులో విదేశీ గూఢచార ఏజంట్లు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. రెండు పనులూ చేస్తారు. మరి చైనా జర్నలిస్టులు ఇతర దేశాల్లో ఎలా ఉంటారు ? వ్యతిరేకులు బాంబులు వేస్తుంటే చైనా వారు రసగుల్లాలు విసురుతూ ఉంటారా ? అయితే ఎవరూ నిజాన్ని అంగీకరించరు.

విదేశీ జర్నలిస్టులు ప్రశ్నించినపుడు సహజంగానే జనాలు ఏ దేశంలో అయినా సందేహిస్తారు. దానికి చైనా మినహాయింపు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలను విదేశీ జర్నలిస్టులు కలిసినపుడు వారు చెప్పదలచుకున్న అంశాలను వక్రీకరించకుండా ఉండేందుకు రాతపూర్వకంగా అందచేస్తారు. ప్రభుత్వ వైఖరి గురించి జనాలు స్వేచ్చగా అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం, వేదికలు ఉండవు అని చాలా మంది చెబుతారు. కానీ చైనా పేరుతో విశ్లేషణలు రాసే అనేక మంది అక్కడి సామాజిక మాధ్యమాల్లో వెల్లడయ్యే వైఖరుల ఆధారంగా, వాటిని ఉటంకిస్తూ, భిన్నఅభిప్రాయాలను తీసుకొని కాళిదాసు కవిత్వానికి తమపైత్యం జోడించి అన్నట్లుగా రాస్తారు.


కరోనా వైరస్‌ గురించి చేసిన తప్పుడు ప్రచారాల్లో వెయ్యోవంతు ఆ వైరస్‌ నివారణ, అంతానికి చైనా సర్కార్‌ తీసుకుంటున్న చర్యల గురించి రాసినా ప్రపంచానికి ప్రయోజనం ( అది చైనాకు కాదు ) ఉండి ఉండేది. అక్కడ అనుసరిస్తున్న పద్దతులను ఎందుకు అమలు చేయరంటూ ఆయా దేశాల జనాలు పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉండేది. వరల్డో మీటర్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఇది రాసిన సమయానికి ప్రపంచలో మొత్తం కరోనా కేసులు 17కోట్ల 56లక్షల 79వేల 912. మరణించిన వారు 37లక్షల 90వేల 392 మంది. మన దేశానికి సంబంధించి మొత్తం కేసులు రెండు కోట్ల 92లక్షల 74,823, మరణాలు 3,63,097. కేసుల సంఖ్యలో అమెరికా తరువాత రెండవ స్ధానంలో ఉంది, మరణాల్లో అమెరికా,బ్రెజిల్‌ తరువాత మూడవ స్ధానం. మొత్తం 222 దేశాలు, ప్రాంతాలలో చైనా 98వ స్ధానంలో ఉంది. అక్కడ నమోదైన కేసులు 91,359, మరణాలు 4636.చైనాలో కరోనా కేసులు, మరణాలు అంత తక్కువ ఎందుకున్నాయని ఇప్పటికీ సందేహించే వారున్నారు. వారిని ఎవరూ ఒప్పించలేరు,మెప్పించలేరు.ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా కేసులు, మరణాలు తక్కువే ఉన్నాయని వారికి తెలిస్తే తట్టుకోలేరేమో !

తాజాగా ప్రపంచ మీడియాలో వచ్చిన ఒక వార్త మరోసారి చైనా కరోనా కట్టడి గురించి ఆసక్తిరేపింది. దేశీయంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకు మన ప్రధాని నరేంద్రమోడీ తన భుజాలను తానే చరుచుకొని అభినందించుకున్నారు. పొగడ్తలకు అలవాటు పడ్డ ప్రాణం కదా, పోనీయండి అని అనేక మంది సమర్ధిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ అనే పట్టణం, పరిసరాల జనాభా కోటీ 86లక్షలు. ఒక మహిళ (75) ఒక హౌటల్‌కు వెళ్లినపుడు కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు మేనెల 21 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు నగరంలో కోటీ 80లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 115 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి, 106 మందికి నిర్ధారణ అయింది. ఈ కేసులన్నింటిలో భారత్‌లో బయటపడిన డెల్టా రకం కనిపించింది. ఇది వేగంగా వ్యాపించే లక్షణం కలిగినదని చైనా అధికారులు చెప్పారు. ఒక గంటలోపే ఫలితాన్ని వెల్లడించే న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టులు చేశారు. రక్తం,కండరాలు,మూత్రంలో ఏవైనా వైరస్‌, బాక్టీరియాలు ఉంటే వెంటనే పసిగట్టే ఆధునిక పరిజ్ఞానంతో ఆ పరీక్షను చేస్తారు. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన పట్టణంగా రికార్డులకెక్కింది. గతంలో చైనాలోనే మరికొన్ని పట్టణాల్లో కూడా ఈ పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించినా సంఖ్యరీత్యా ఇదే అత్యధికం. వాన్‌ఫు బయోటెక్నాలజీ అభివృద్ది చేసిన విధానం ప్రకారం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలలో బయటపడిన కరోనా వైరస్‌ లక్షణాలను ఈ పరీక్ష వెల్లడిస్తుంది. గ్వాంగఝౌ పట్టణం, పరిసరాలలో 5,500 బయో, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు, ఈ రంగంలోనే వెయ్యి ఆధునిక పరిజ్ఞాన సంస్ధలు ఉన్నాయి. కింగ్‌మెడ్‌ డయాగస్టిక్స్‌ గ్రూప్‌ రోజుకు మూడున్నరలక్షల పరీక్షలు చేయగల సామర్ధ్యం కలిగినది ఇక్కడ ఉంది, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. తమకు కరోనా వచ్చిన విషయాన్ని దాచినందుకు లేదా తెలియచేయనందుకు, పరీక్షకు నిరాకరించినందుకు కొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక హౌటల్‌లో ఉన్న వ్యక్తి పరీక్షకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగటమేగాకుండా భోజనానికి ఉపయోగించే ఫోర్క్‌తో పోలీసు మీద దాడి చేశాడు.

చైనాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు మూడు రకాల వ్యూహాలను అనుసరించారు. వైరస్‌ బయటపడగానే దానికి చికిత్స ఏమిటో తెలియలేదు గనుక తొలి దశలో ప్రజారోగ్య నిరోధం మరియు అదుపు పద్దతులను అమలు జరిపారు. రెండవ దశలో వాక్సిన్లను ఉపయోగించారు. ఇప్పుడు మూడవ దశలో నిరోధం మరియు అదుపు పద్దతులను కూడా పాటిస్తున్నట్లు చైనా సిడిసి అధిపతిగా గతంలో పని చేసిన జెంగ్‌ గ్వాంగ్‌ చెప్పారు.ఈ చర్యలతో పాటు వాటిని అమలు జరిపే క్రమంలో చైనీయుల సామాజిక అలవాట్లను, అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు. గ్వాంగ్‌ఝౌ నగరంలో కేసులు 115 మాత్రమే బయటపడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ప్రకటించి జన సంచారాన్ని పరిమితం చేశారు.చైనాలో అనేక సంస్ధలు వాక్సిన్ల తయారీకి పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఏడు రకాలకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 80 కోట్ల మందికి తొలి, రెండవ డోసు వాక్సిన్లు వేసినట్లు చైనా ప్రకటించింది.


గత ఏడాది ఊహాన్‌ నగరంలో కరోనాను కట్టడి చేయటం అనేక అనుభవాలను ముందుకు తెచ్చింది. తరువాత కాలంలో చెదురుమదురుగా వివిధ నగరాల్లో చాలా పరిమితంగా అయినా కేసులు బయటపడ్డాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా వైరస్‌ విస్తరించకుండా చూసేందుకు నూక్లియక్‌ యాసిడ్‌ పరీక్షలు చేసి జల్లెడ పట్టాలని నిర్ణయించారు. దీనికి కూడా ఊహాన్‌ అనుభమేతోడ్పడింది. అక్కడ ప్రారంభంలో యాభైవేల పరీక్షలు చేసి సమాచారాన్ని విశ్లేషించారు. తరువాత గతేడాది మేనెల ప్రారంభంలో అక్కడి కోటి మంది జనాభాకు పది రోజుల్లో ఈ పరీక్షలు చేసి దాగున్న వైరస్‌ను వెలికి తీసే యత్నం చేశారు.లక్షణాలు బయటకు కనిపించకుండా వైరస్‌ ఉన్న మూడు వందల కేసులు వెల్లడయ్యాయి.తరువాత బీజింగ్‌లోని కోటి ఇరవైలక్షల మందికి పరీక్షలు చేశారు, 174కేసులు బయటపడ్డాయి.


చైనాలో ప్రయాణాలు చేసే వారు గణనీయ సంఖ్యలో ఉంటారు. ప్రతివారినీ ప్రతి చోటా పరీక్షించటం సాధ్యంకాదు, అవసరమైన సిబ్బంది లభ్యత కూడా పెద్ద సమస్యే. అందువలన చైనా ప్రయాణ ఆరోగ్య సూచిక (కోడ్‌)లను రూపొందించాలని ఐటి కంపెనీలను కోరారు. ఆమేరకు తయారు చేసి ప్రతి ఒక్కరికీ ఒక సూచికను కేటాయించారు. వారి సెల్‌ఫోన్లలో యాప్‌ ఏర్పాటు చేశారు. దానిలో మూడు రంగుల సూచికలను పొందుపరిచారు.దానిలో సదరు వ్యక్తి చిరునామా వంటి ప్రాధమిక సమాచారంతో పాటు అనుమతించిన ఆరోగ్య వివరాలు, సందర్శించిన ఆసుపత్రులు, వాడిన మందుల వంటి వాటిని పొందుపరిచారు.అంతే కాదు, వారు పర్యటించిన ప్రాంతాలు, హౌటల్స్‌, మాల్స్‌, రైలు, విమానం, బస్‌, స్వంత వాహనం వంటి వివరాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా తనిఖీ సిబ్బంది ఫోన్లలో వారి కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఆకుపచ్చ సూచిక ఉన్నవారి వివరాలను చూస్తే వారు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు లేవని, కరోనా ప్రాంతాల్లో సంచరించలేదని అర్ధం. పసుపు పచ్చ కోడ్‌ వస్తే వారు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారని, కరోనా ముప్పు ప్రాంతాలను సందర్శించటం, వైరస్‌ సోకిన వారితో కలిసినట్లు అర్ధం. ఎరుపు సూచిక ఉంటే ప్రమాదం ఉందని అర్ధం. వారికి లేదా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకటం, సోకినవారిని కలిసినందున విడిగా ఉంచాల్సిన అవసరం ఉందని అర్ధం. కరోనాను మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించినందున పసుపు, ఎరుపు సూచికలు ఉన్న వారికి ప్రయాణించేందుకు అవసరమైన టిక్కెట్లను తిరస్కరించే, ప్రయాణ అనుమతి నిరాకరించే అధికారం యంత్రాంగానికి ఉంటుంది. ఆకుపచ్చ సూచిక ఉన్నవారు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

కరోనా నివారణకు వాక్సిన్‌ రూపొందించే వరకు ఫలానా ఔషధంతో నివారించవచ్చనే హామీ ఎక్కడా లేదు. అనేక రకాలతో ప్రయోగాలు చేశారు. . రెమిడెసివర్‌ కరోనా చికిత్సకు పనికిరాదని గతేడాది ఏప్రిల్‌ 15 నుంచే చైనాలో దాన్ని పక్కన పెట్టారు. అయినా మన నిపుణులు దాని గురించి జనంలో పెద్ద ఎత్తున ఆశలు కల్పించేందుకు కారకులయ్యారు. దాంతో మన జనాన్ని ఎలా పిండుకున్నారో చూశాము. ఫార్మా మాఫియాల పీకనులిమే కొత్త దేవుడు మోడీ అంటూ ప్రచారం చేసినప్పటికీ ఇది జరిగింది. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశోధనలో కూడా అదే తేలింది. చైనాలో మన ఆయుర్వేదం మాదిరే స్ధానిక వైద్య పద్దతిలో వాడుతున్న ఔషధాలను కూడా చికిత్సలో ఉపశమనానికి వినియోగించారు. ఆ రంగ నిపుణులను కూడా అల్లోపతి ఆసుపత్రుల్లో నియమించారు, పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వైద్యపద్దతి, ఔషధం వైరస్‌ను అంతం చేస్తుందనే భ్రమలు కల్పించలేదు. కనుకనే అక్కడ బాబా రామ్‌దేవ్‌ వంటి వారు వాటితో సొమ్ము చేసుకోవటం గానీ, ఆనందయ్య పచ్చడి వంటివి రంగంలోకి రావటం గానీ జరగలేదు.


ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న కారణంగానే చైనాలో వైరస్‌ అదుపులో ఉంది. అయితే ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కనుక దేశ సంపదలను జనం కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు.లాభ నష్టాల లెక్కలు వేసుకోలేదు. ముందు ప్రాణాలను రక్షించటమే ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. మన వంటి దేశాలలో పెట్టుబడిదారులు దేని మీద ఎంత ఖర్చు చేస్తే ఎంత లాభం వస్తుందనే లెక్కలు ముందే వేసుకుంటారు. కొత్తదాని మీద ఖర్చు పెడితే ఒకవేళ ప్రయోజనం లేకపోతే మొత్తం దండగే అని భావిస్తే అసలు ముందుకు రారు. పాలకులు కూడా వారినే అనుసరిస్తారు గనుక అంబానీ, అదానీ అండ్‌కోకు ఆత్మనిర్భర అనో మరొక పేరుతోనే రాయితీలు ఇచ్చేందుకు చూపే శ్రద్ద జనం మీద చూపరు. ఆ కారణంగానే కేవలం రెండు వందల కోట్ల ఖర్చుతో జనానికి అవసరమైన ఆక్సిజన్‌ అందించే యంత్రాల ఏర్పాటు టెండర్లను ఎనిమిది నెలల పాటు కేంద్రం ఖరారు చేయలేదు. తీరా ముప్పు ముంచుకు వచ్చిన తరువాత, సుప్రీం కోర్టు మందలింపులతో చేయటాన్ని చూశాము. వాక్సిన్లు కూడా అంతే కదా ! అందుకోసం కేటాయించినట్లు చెప్పిన 35వేల కోట్లకు లెక్కలు చెబుతారా లేదా అని నిలదీసిన తరువాత విధిలేక మేమే వాక్సిన్లు వేయిస్తాం అనే ప్రకటన వెలువడింది. కేసులు తక్కువే అయినప్పటికీ చైనాలో ఖర్చు తక్కువేమీ కాలేదు. దాని కంటే ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవటం పెద్ద దెబ్బ అని వెంటనే గ్రహించింది. అందుకే ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో ఎక్కడా లేనిóంగా వైరస్‌ కనిపించిన నాలుగు నెలల్లోనే దాన్ని అదుపులో ఉంచి ఆర్ధిక కార్యకలాపాలన్నింటినీ పునరుద్దరించింది. అది ఖర్చు కంటే లబ్దే ఎక్కువ చేకూర్చిందని రుజువైంది. దాన్నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా ? మన భుజాలను మనమే చరుచుకుంటామా ?
అనువుగాని చోట అధికులమన రాదు,
కొంచెమైన నదియు కొదువగాదు,
కొండ అద్దమందు కొంచెమై ఉండదా,
విశ్వదాభిరామ వినుర వేమా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదివేల కోట్ల కోసం కక్కుర్తి – స్వయంగా పరువు తీసుకున్న ప్రధాని మోడీ !

09 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Health, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Science

≈ Leave a comment

Tags

#Modi’s vaccine policy, BJP, Modi’s Vaccine U-Turn, Narendra Modi Failures, Supreme Court of India

ఎం కోటేశ్వరరావు

కరోనా బాధితుల పట్ల రాష్ట్రాలకు బాధ్యత లేదా, అసలు వైద్యం, ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కదా, అన్నీ కేంద్రమే చేయాలంటే సాధ్యమేనా అంటూ జనం చెవుల తుప్పు వదిలేలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపి పెద్దలు తమ టూల్‌కిట్‌లోంచి ఒక ప్రచార ఆయుధాన్ని ప్రయోగించారు. జనానికి రాజ్యాంగం గురించి బోధ చేయటంతో పాటు ప్రతిపక్షాల మీద దాడికి కత్తులు, కటార్లు, మొరటు బాంబులు, విషపూరిత ఆయుధాలను సిద్దం చేసుకున్న భక్తులందరినీ విశ్వగురువు, దేవుడు లేదా దేవదూత నరేంద్రమోడీ దారుణంగా దెబ్బతీశారు. పద్దెనిమిది సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వాక్సిన్‌ వేయించే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని నాటకీయ పద్దతుల్లో స్వయంగా ప్రకటించారు. దాంతో ఆయుధాలన్నింటినీ ఎక్కడికక్కడ పడవేసి పాలాభిషేకాలు, పాదాభిషేకాలు చేయటంతో పాటు భజన ప్రారంభించారు. భక్తుల హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో ఇవి లేదా వీటికి అనుబంధ అంశాలు మాత్రమే ఉంటాయి. పరిమిత ప్రయోజనం కోసమే వారిని తయారు చేస్తారు. ఇది విశ్వజనీన సత్యం.

గతంలో ప్రకటించిన వాక్సిన్‌, ధరల విధానం కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అయితే నరేంద్రమోడీ ప్రకటించిన తాజా విధానానికి ముందు అలాంటి సమావేశం జరిగినట్లుగానీ, కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగానీ ఎలాంటి సమాచారం లేదు. రాజ్యాంగం ప్రకారం విధానపరమైన నిర్ణయాలు ఫెడరల్‌ వ్యవస్ధలో మంత్రివర్గం తీసుకోవాలి. అధ్యక్ష తరహా వ్యవస్ధలో అధ్యక్షుడు నిర్ణయం తీసుకొని తరువాత మంత్రివర్గఆమోదానికి పెడతారు. ఇక్కడ నరేంద్రమోడీ గారు చేసిందేమిటి ? పెద్ద నోట్ల రద్దు అంటే రహస్యం కనుక ఆకస్మికంగా చేశారని అనుకుందాం. వాక్సిన్‌ విధానం అలాంటిది కాదు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చీమకుట్టలేదు. సుప్రీం కోర్టు స్వయంగా పూనుకున్న తరువాత కూడా స్పర్శలేనట్లుగానే వ్యవహరించారు. తీరా గట్టిగా నిలదీసి కేటాయించిన 35వేల కోట్లు ఏం చేశారో చెప్పాలంటూ గడువు పెట్టటంతో మరోదారి లేకపోయింది. మోడీ స్వయంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్ణయాన్ని ప్రకటించేశారు. మంత్రులను రబ్బరు స్టాంపులుగా మార్చివేశారు. తొలుత ప్రకటించిన దానికీ దానికీ మంత్రి వర్గ ఆమోదం లేదు, దీనికీ అవసరం ఏముంది అంటారా ?

తామేం చేసినా ప్రశ్నించేవారు లేరు, ఉండకూడదు, ప్రతిపక్షాలను లెక్కచేయాల్సిన అవసరం లేదు అనే యావలో పడిన బిజెపి పెద్దలకు ఈ మధ్య వాస్తవ పరిస్ధితులు అర్ధం కావటం లేదు. కరోనా రెండవ దశ నిర్లక్ష్యంతో తలెత్తిన పరిస్ధితి మీద వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఉంటే వాక్సిన్‌ విధానంలో ఇంత షాక్‌ తగిలి ఉండేది కాదు. నిజానికిది కరోనా కంటే పెద్ద దెబ్బ. సుప్రీం కోర్టు వాక్సిన్‌ విధానం గురించి ఇలా నిలదీస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. గతంలో చేసిన నిర్ణయాలకే విధానం అనే ముద్రవేసి కోర్టుకు సమర్పించి ఉంటే రాజ్యాంగబద్దమా కాదా అన్నది చూస్తాం తప్ప విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని న్యాయమూర్తులు చెప్పి ఉండేవారేమో ! కానీ ఇది ఎవరో వేసిన కేసు కాదు, స్వయంగా చేపట్టిన అంశం. యాభై ఆరు అంగుళాల గుండె పిరికిబారినట్లుంది. లేకపోతే కోట్లాది భక్తులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రుల పరువు తీస్తూ ఇలాంటి ప్రకటన ఎందుకు చేస్తారు అన్న అనుమానాలు కలగటం సహజం కాదంటారా ?

మరి ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించాలా వద్దా ? స్వాగతించాల్సిందే. కేంద్రమే వాక్సిన్‌ బాధ్యత చేపట్టాలని, మూడు ధరల విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేసిన వారు తప్పకుండా ఆ పని చేస్తారు, చేశారు.అయితే స్వాగతించటానికి – భజన చేయటానికి తేడా ఉంది. బిజెపి ముఖ్యమంత్రులకు భజన చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అలా చేస్తే జనం దృష్టిలో మరింత పలుచన అవుతారు. నలభైఅయిదు సంవత్సరాల లోపు వారికి వాక్సిన్‌ గురించిన నిర్ణయం రాష్ట్రాలకే వదలి వేయాలని డిమాండ్‌ చేశారని చెబుతున్న బిజెపి ముఖ్యమంత్రులు, ఆ వాదనలతో కొండెక్కి కూర్చున్నవారు ఏ నోటితో స్వాగతిస్తారు, ఏ ముఖాలతో దిగివస్తారు ? కేంద్ర వాక్సిన్‌ విధానం గురించి విమర్శలు చేసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ నాలుగుసార్లు ఏలుబడిలో ఉన్న మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వారం రోజుల క్రితం ఏం మాట్లాడారు ? ” ఎంతో చక్కటి, పక్కాగా ఉన్న కేంద్ర వాక్సిన్‌ విధానాన్ని రాష్ట్రాల వత్తిడి మేరకే కేంద్రం మార్చింది. ముఖ్యమంత్రులందరూ ఒక దగ్గరకు వచ్చి కేంద్రీకృత విధానం కావాలని ప్రధానిని కోరితే ఆయన కూడా పరిశీలిస్తారు.రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నపుడు కేంద్రం కూడా ఒకే రకమైన విధానాన్ని తీసుకురాలేదు, అందుకే రాష్ట్రాలకు వదిలిపెట్టింది ” అన్నారు. మా వాక్సిన్‌ మేం కొనుక్కుంటాం అని బిజెపి ముఖ్యమంత్రులు చెప్పారు. కాదు కేంద్రమే మొత్తంగా ఇవ్వాలి లేదా సేకరించి ఒకే ధరకు రాష్ట్రాలకు ఇవ్వాలి తప్ప ద్వంద్వ ధరలేమిటని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చెప్పారు. ఎద్దు-దున్నతో అరక కడితే ఏమౌతుంది. ఎండ ముదిరే కొద్దీ ఎద్దు నీడవైపు లాగుతుంది-దున్న ఎండవైపు మొగ్గుతుంది. అలాగే భిన్న వైఖరుల మధ్య ఏకాభిప్రాయం ఎలా సాధ్యం ? అప్పుడు కేంద్రం ఏమి చేయాలి, ధర చెల్లించగలిగిన రాష్ట్రాలు కొనుక్కోవచ్చు, మాకంత శక్తిలేదు అని అన్నవారికి మేమే ఇస్తామని చెప్పాలి. ఆయుష్మాన్‌ భారత్‌ కేంద్ర ప్రభుత్వ పధకం దాన్ని అమలు జరపాలా లేదా అన్నది రాష్ట్రాలకే వదలి వేసినట్లు వాక్సిన్‌ విషయంలో ఎందుకు చేయలేకపోయింది. దురుద్ధేశ్యాన్ని కడుపులో పెట్టుకొని కొన్ని రాష్ట్రాల పేరుతో ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరి ఇప్పుడు ఆ పక్కా పధకం ఏమైంది ? రాష్ట్రాలతో సంప్రదించకుండానే ప్రధాని ఏకపక్షంగా ఎలా ప్రకటించారు. మేమే కొనుక్కుంటాం అన్న రాష్ట్రాల మనోభావాలను గాయపరచి, ముఖ్యమంత్రులను అవమానించినట్లు కాదా ?

ఐదూండ్లు కాదు కదా సూదిమొన మోపినంత కూడా ఇచ్చేది లేదన్న రారాజు మాదిరి గత కొన్ని వారాలుగా భీష్మించిన విశ్వగురువు ఆకస్మికంగా అందరికీ మేమే వేయిస్తాం అని ఎందుకు చెప్పారు? ఇది వైఫల్యాన్ని అంగీకరించటమే, పోనీ ఆ చెప్పిందైనా సక్రమంగా ఉందా ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా లేదూ ! పోయిన పరువును తిరిగి తెచ్చుకొనే యత్నమన్నది ఏకాభిప్రాయం. అంటే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదనుకోవాలా ? రారాజు దిగి వచ్చారు సరే, మంచిదే , మళ్లా 25శాతం ప్రయివేటు ఆసుపత్రులద్వారా వేయించుకోవచ్చనే పితలాటకం ఏమిటి ? ఫార్మా, కార్పొరేట్‌ మాఫియాకు లాభాలు చేకూర్చే ఎత్తుగడ అనే విమర్శలను ఎందుకు భరిస్తున్నారు. వారిచ్చే నిధుల ముందు విమర్శలు ఒక లెక్కా ?

ఉచితంగా ఇస్తామనే ప్రకటన హుందాగా చేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు, ఎవరూ వేలెత్తి చూపే వారు కాదు. ప్రధాని స్వయంగా రాష్ట్రాల మీద నెపం మోపారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్ప ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలేవీ వాక్సిన్‌ సేకరణ తమకు వదిలేయాలని అడగలేదు. చివరకు బిజెపి భాగస్వామిగా ఉన్న బీహార్‌ నుంచి కూడా అలాంటి డిమాండ్‌ లేదు. సుప్రీం కోర్టు ప్రశ్నలతో ఊపిరి సలుపుకోలేక తప్ప చిత్తశుద్ది లేదు.గతంలో వాక్సిన్‌ వేసి నందుకు వంద రూపాయల సేవా రుసుం ప్రయివేటు ఆసుపత్రులు తీసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు దాన్ని 150కి పెంచారు. ఇంతలోనే ఇంత పెంపుదల ఎందుకు ? అదనపు ఖర్చులు ఆసుపత్రులకు ఏమి వచ్చాయి ?

నరేంద్రమోడీ దిగిరావటం వాక్సిన్‌కంటే ముందే ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌ కుంభమేళాను మధ్యలో ఆపివేయాలనటం అదే కదా ? అంతకు ముందు అనేక మంది కరోనా నిబంధనలను ఉల్లంఘించి లక్షలాది మందిని సామూహిక స్నానాలకు అనుమతించటం ప్రమాదకరం అని హెచ్చరిస్తే పెడచెవిన పెట్టారు. మొరటుగా ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు జనాన్ని మునగమని చెప్పారు. తీరా కొందరు అఖారాలు మరణించటం, కరోనా సోకటం, మీడియాలో వార్తలు రావటంతో విధిలేక ప్రధాని మోడీ జోక్యం చేసుకొని నిలిపివేయించారు.

కరోనా మొదటి తరంగం సమయంలో జనానికి కొన్ని ఉపశమన చర్యలు చేపట్టారు, రెండోసారి వాటి ఊసే లేదు. లాక్‌డౌన్‌ విధించాలా వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదలివేసి పర్యవసానాలకు బాధ్యత తమదేమీ లేదన్నట్లు వ్యవహించారు. అందుకే రెండో సారి దీపాలు వెలిగించటం, గ్లాసులు,కంచాలు మోగించటం వంటి పిలుపులకు దూరంగా ఉన్నారు. కానీ వాక్సిన్‌ భారాన్ని రాష్ట్రాల మీద మోపాలన్న ఎత్తుగడ పారకపోగా వికటించింది.మోడీ ఉంటే చాలు ఏదైనా సాధ్యమే అని అతిశయోక్తులు పలికి మునగ చెట్టు ఎక్కించిన వారికి కరోనా రెండవ దశ తీవ్రతను గుర్తించటంలో వైఫల్యాన్ని చూసి దిమ్మతిరిగినోట మాట రావటం లేదు.

ఆత్మనిర్భర పాకేజ్‌ కింద మేడిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా రెండు వ్యాక్సిన్లు తయారు చేసి దేశ ప్రజలకు ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇది వాస్తవమా ? కోవాగ్జిన్‌ ఒక్కటే మన దేశంలో తయారు చేసిందని జనానికందరికీ తెలిసిందే. అనేక మంది అది స్వదేశీ అని మరొక వ్యాక్సిన్‌ వేసుకోము అని ఆలస్యం చేసిన వారు కూడా ఉన్నారు. కోవీషీల్డ్‌ విదేశీ ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారీ, కంపెనీ అనుమతితో ఇక్కడ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అయినా రెండు వాక్సిన్లు ఇక్కడే రూపొందించినట్లు చెప్పటం భావ్యమేనా ? జనాన్ని మరీ అంత అమాయకులుగా భావిస్తున్నారా ?

వాక్సిన్ల విముఖతను విడనాడాలని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి కాషాయ దళాలు చెబుతున్నదేమిటి ? ఆవు పేడ పూసుకొని మూత్రం తాగితే కరోనా అంటదనే వీడియోలను ప్రపంచమంతా చూసింది. తాజాగా బిజెపి ఎంపీ, అలనాటి హీరోయిన్‌ హేమమాలిని కరోనా నుంచి రక్షణకు హౌమాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందే అనేక మంది చేశారు. స్ఫూర్తికోసం ప్రధాని దీపాలు వెలిగించమని కోరితే దాంతో కరోనాను నాశనం చేయవచ్చని ప్రచారం చేసిన ప్రబుద్దులు ఉన్నదేశం మనది, గో కరోనా గో కరోనా అంటూ భజనలు చేయించిన పెద్దలున్నారు. గంగలో మునిగితే కరోనా అంటదు అని ప్రబోధించిన వారి గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలన్నింటీని ప్రోత్సహించటంలో అన్ని మతాలూ ఒకటిగానే ఉన్నాయి, ప్రోత్సహించాయి.జనాభా రీత్యా చూస్తే వాక్సిన్‌కు విముఖత చూపితే ఎక్కువగా నష్టపోయేది నూటికి 80శాతంగా ఉన్న మతానికి చెందిన వారే. మరి హిందూత్వ శక్తులు ఇంతగా మూఢత్వాన్ని ఎందుకు ఎక్కించినట్లు ? ఇప్పుడు ఒక్క మాటతో దాన్ని పోగొట్టుకోమంటే అంత తేలికగా మత్తు దిగుతుందా ?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలు దిమ్మతిరిగేట్లు చేస్తే , ఉత్తర ప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు సామాన్యమైనవి కాదు. ప్రధాని వారణాసి జిల్లాలోనే బిజెపి బొక్కబోర్లా పడింది. రాష్ట్రాల నుంచి డిమాండ్‌ వచ్చిన కారణంగానే వికేంద్రీకరణ విధానాన్ని ప్రకటించామని, ఇప్పుడు కొన్ని అనేక రాష్ట్రాలు తిరిగి కేంద్రీకరణ విధానాన్ని డిమాండ్‌ చేస్తున్నాయని మోడీ చెప్పారు.మీడియాలో కొన్ని తరగతులు కూడా ఈ డిమాండ్‌ గురించి ప్రచారం చేశాయి. ఇతర దేశాలు పని ప్రారంభించక ముందే మన దేశంలో శాస్త్రవేత్తలు, తయారీదార్లకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. ఇది అతిశయోక్తి, అర్ద సత్యం తప్ప ప్రధాని నోటి నుంచి రావాల్సింది కాదు.

గత కొద్ది వారాలుగా చర్చలను చూసినపుడు కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి పెద్దలు సమాధానాలు చెప్పాల్సి ఉంది. దేశంలో వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు లేక సీరం సంస్ద ఉత్పత్తి నిలిపివేసిన విషయం తెలుసు, భారత్‌బయోటెక్‌ ఉత్పత్తి సామర్ధ్యం తక్కువనీ తెలిసినా రాష్ట్రాలు వాక్సిన్లు కొనుగోలు చేయవచ్చని, అవసరమైతే దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర పెద్దలు ఎలా భావించారు.ఇతర వాక్సిన్ల తయారీకి అవసరమైన పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం తాత్సారం చేసింది. విదేశీ కంపెనీలు వాక్సిన్ల సరఫరాకు పెట్టిన షరతులకు అంగీకరించటమా లేదా అన్నది నిర్ణయించాల్సింది కేంద్రం అయినపుడు దిగుమతులు ఎలా చేసుకుంటాయని భావించారు. కొన్ని రాష్ట్రాల టెండర్లకు ఎలాంటి స్పందన లేదని తెలిసి కూడా కేంద్రం ఏమీ తెలియనట్లు వ్యవహరించిందా లేదా ? ఒకే వాక్సిన్‌కు వివిధ ధరలకు అనుమతించిన విధాన హేతుబద్దతు ఏమిటి ? మిగతా దేశాల మాదిరి తగినంత ముందుగా వాక్సిన్ల కోసం కేంద్రం ఎందుకు ఆర్డర్లు పెట్టలేదు. ప్రభుత్వ రంగంలోని వాక్సిన్‌ తయారీ సంస్ధల గురించి ముందుగానే ఎందుకు కేంద్రం పరిశీలన జరపలేదు. కరోనా మహమ్మారి ప్రారంభమై ఏడాది గడచిన తరువాత దాన్ని జాతీయ సమస్యగా చూడాలా, రాష్ట్రాల పరిధిలో ఆరోగ్య సమస్యగా పరిగణించాలా అన్న చర్చ కేంద్రం వైపు నుంచి ఎందుకు జరపలేదు. ఆరోగ్యం గురించి రాజ్యాంగంలో ఉంది తప్ప మహమ్మారులను ప్రత్యేక అంశంగా పరిగణించాలని పేర్కొనలేదా ? జాతీయ విపత్తుల యాజమాన్య చట్టానికి అర్దం ఏమిటి ?

గతేడాది కరోనా పేరుతో 21లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి ప్రకటించామని ఊరూ వాడా ప్రచారాన్ని ఎలా అదరగొట్టారో చూశాము. నరేంద్రమోడీ గడ్డం ఎందుకు పెంచుతున్నారో తెలియనట్లుగానే ఆ పాకేజి ఏమిటో దాని వలన సామాన్య జనానికి కలిగిన ప్రయోజనం ఏమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. అన్ని లక్షల కోట్లు ప్రకటించినపుడు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు పెట్టి వాక్సిన్లు వేయించలేని దుస్ధితిలో మోడీ సర్కార్‌ ఉందా ? వాక్సిన్లకోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. పద్దెనెమిదేండ్లు పైబడిన అందరికీ వేస్తే అదనంగా మరో పదివేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. ఈ మాత్రం భరించలేని స్ధితిలో కేంద్రం ఉందా ? లేదూ పిల్లలకూ వేస్తే మరొక పదివేల కోట్లు అవుతుంది, మరొక అంచనా ప్రకారం 80వేల కోట్లతో అందరికీ వేయించ వచ్చు, 138 కోట్ల మందికి ఆ మాత్రం ఖర్చు చేయలేరా ? ఐదులక్షల కోట్ల జిడిపి లక్ష్యమైనా, మరొకటైనా దేనికోసం ? అంబానీ, అదానీలకు కట్టబెట్టటానికా ? ఎందుకీ కక్కుర్తి పనులు ? ఇంతచిన్న తర్కాన్ని కూడా సలహాదారులు,మంత్రులు ఆలోచించే స్ధితిలో లేరా లేక చెబితే వినే పరిస్ధితి లేదా ? మోడీ సర్కార్‌ను తెరవెనుక నుంచి నడుపుతున్న సంఘపరివార్‌ మేథావులకు సైతం ఇది ఎందుకు తట్టలేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏది ముందు పుట్టింది ? జ్ఞానమా , అజ్ఞానమా – మత శక్తులెందుకు జ్ఞానం మీద దాడి చేస్తాయి ?

07 Monday Jun 2021

Posted by raomk in AP NEWS, BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, imperialism, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, USA

≈ Leave a comment

Tags

Anandaiah's K medicine, Ignorance, knowledge, pseudoscience, Science, science literacy, scientific temper


ఎం కోటేశ్వరరావు


జ్ఞానం ముందు పుట్టిందా ? అజ్ఞానం ముందు పుట్టిందా ! ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి రాక ముందు జనానికి అస్సలు విజ్ఞానం లేదా ? లేదని చెబితే పురాతన మానవుల అనుభవాలను, తరతరాలుగా వాటిని పరిరక్షించటాన్ని కించపరచటమే. ఈజిప్టు పిరమిడ్లు నిర్మించిన వారు, వాటిలో మమ్మీలను భద్రపరచిన వారి పరిజ్ఞాన్ని విస్మరించగలమా ? చైనా గోడ నిర్మాతలకు తట్టిన ఆలోచన సామాన్యమైనదా ? క్రీస్తు పూర్వమే మన దేశంలో చెక్కిన ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్రాలకు ప్రాతిపదిక విజ్ఞానం కాదా ? రోమ్‌ నగరంలో వేల సంవత్సరాల నాడు నిర్మించిన ప్రఖ్యాత బహిరంగ స్డేడియం కూడా అలాంటిదే. అయితే ఇవన్నీ కూడా ప్రపంచమంతటా వాటి నిర్మాణ కాలంలో లేదా తరువాత గానీ మరోచోట పునరావృతం కాలేదు. ఎందుకు ? విదేశీ దండయాత్రల నుంచి రక్షణకోసమే చైనా గోడ నిర్మాణమైందనుకుందాం. విదేశీ దండయాత్రలు ఒక్క చైనా మీదే జరిగాయా ? మిగతా దేశాలకు అలాంటి ఆలోచన ఎందుకు తట్టలేదు, చూసి కూడా ఎందుకు నిర్మించలేదు ? అలాగే మిగతావీనూ. ఎవరైనా ఈ కోణం నుంచి పరిశోధించారో లేదో నాకైతే తెలియదు, అలాంటి విశ్లేషణలు ఉంటే అందరం చదువుకుందాం.

గత కొద్ది వారాలుగా ఆనందయ్య ఆకుల మిశ్రమం ( మందు లేదా ఔషధం కాదని ఆయుష్‌ చెప్పింది కనుక), ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని తూలనాడిన రామ్‌దేవ్‌ బాబా గురించి చర్చలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ సమగ్రంగా చర్చించటం ఇక్కడ సాధ్యం కాదు, కొన్ని పరిశీలనలకే పరిమితం. దక్షిణాసియా, మరికొన్ని ప్రాంతాలలో ఆకు, వక్క, సున్నంతో కిళ్లీలు వేసుకోవటం ఎప్పటి నుంచో ఉంది.దానితో నోరు ఎర్రగా పండుతుందని తెలుసు కానీ ఎరుపుకు బదులు వేరే రంగులో ఎందుకు పండదో లేదా అసలు ఎందుకు పండుతుందో వేసుకొనే వారందరికీ తెలుసా ? తెలియనంత మాత్రాన వారిది అజ్ఞానం అనలేము ? ఆకు, వక్కలను పూజల్లో వినియోగిస్తాము. ఎందుకు ? ముఖ్యమైన దేవతలంతా తమలపాకులోని వివిధ భాగాలలో ఉంటారనే పుక్కిటి పురాణాలు వీటికి మూలం.

మహలక్ష్మి ఆకు కింది భాగంలో, సరస్వతి మధ్యలో, జేష్టలక్ష్మి తొడిమ-ఆకు కలిసే చోట, పార్వతి, మాంగల్యదేవి ఎడమవైపు, భూదేవి కుడి వైపు, శివుడు ఆకు బయట, శుక్రుడు పైన, సూర్యుడు ఆకులో మొత్తంగా ఇలా అనేక మంది దేవతలు, దేవుళ్లు, కాని ప్రముఖులకు కూడా తమలపాకులో స్ధానం కల్పిస్తూ కథలు రాశారు. శివుడు, పార్వతి ఆకు, వక్క మొక్కలను హిమాలయ ప్రాంతంలో నాటారు అని చెబుతారు. వాటినే ఇప్పటికీ విద్యావంతులు కూడా నమ్ముతూ ఉంటే దాన్ని అజ్ఞానం అంటారు, వారిని అజ్ఞానులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. చదువులేని వారికి తెలియని తనం తప్ప అజ్ఞానం అనలేము. శివుడు, పార్వతి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు, హిమాలయాల్లోనే ఎందుకు నాటారు, మిగతా ప్రాంతాలను ఎందుకు విస్మరించారు. దేవతలకు పక్షపాతం ఉండకూడదు కదా ? అనే ప్రశ్నలకు సమాధానం ఉందా ? అదంతే అంటే దాన్నేమనాలి ? ఆయుర్వేదంలో తమలపాకులో ఉన్న ఔషధ లక్షణాల గురించి రాశారు. అది వేల సంవత్సరాల మానవుల అనుభవ సారం తప్ప ఎవరో ఒకరు పరీక్షించి కనుగొన్న పర్యవసానం కాదు. ఆకు, వక్కలతో వేసుకునే సున్నం మోతాదు మించితే నోరు బొక్కుతుంది. ఇది కూడా అనుభవంలోంచి వచ్చిందే కదా ? ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే అదంతే అంటే వితండవాదం, నాకు కనిపించేదాన్ని మాత్రమే నమ్ముతా మిగతావి నమ్మను అంటే మూర్ఖత్వం అవుతుంది.


ఇప్పుడంటే యావత్‌ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఆ మూల నుంచి ఈ మూలకు కొన్ని గంటల్లోనే వెళ్లి రావచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతి దేశం లేదా ప్రాంతం వారు అనుభవంలో తమవైన వైద్య పద్దతులను ఉనికిలోకి తెచ్చారు. ఎవరికి వారు తమ పద్దతే గొప్ప అనుకోవటమే కాదు, మిగతావాటిని అంత తేలికగా స్వీకరించలేదు. ఐరోపాలో హౌమియోపతి వైద్యులు తొలి రోజుల్లో అల్లోపతిని అంగీకరించలేదు, అపహాస్యం చేశారు. నాగరిక సమాజాలతో సంబంధాలు లేకుండా ఆడవులు, కొండలకే పరిమితమైన గిరిజనులు ఇప్పటికీ తమవైన ఔషధాలను తయారు చేసుకొని వాడుతున్నారు. వారికి ఆయుర్వేదం అంటే తెలియదు, ఆయుర్వేదాన్ని గిరిజన ప్రాంతాలకు తీసుకుపోయిన చరిత్రా లేదు. ఉంటే ఇప్పటికీ వారు తమ నాటు మందులనే ఎందుకు నమ్ముతున్నారు. తమ సాంప్రదాయ గిరిజన వైద్య పద్దతులకే కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో. నల్లమలలోని చెంచు ఆదివాసులు కరోనా వాక్సిన్‌ తీసుకొనేందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎక్కడికక్కడ స్ధానిక వైద్య పద్దతులు ఉనికిలోకి వచ్చాయి. వాటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కానీ ఆయుర్వేదానికి మన కాషాయ దళాలు పెట్టినట్లు హిందూ వైద్యం, ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల పేర్లు పెట్టలేదు. మన దేశంలో బౌద్దం, జైనం ఒకప్పుడు ప్రధాన మతాలుగా ఉన్నాయి, మరి వాటి పేరుతో వైద్యం ఎందుకు లేదు ! మన దేశంలో హిందూత్వ శక్తులకు ఒక అజెండా ఉంది, దానిలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం ఒక ఎత్తుగడ గనుక ఇప్పుడు ప్రతిదానికి మతాన్ని తగిలిస్తున్నారు. సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశంలో విడదీయలేని భాగం, ఆయుర్వేదానికి మత, కుల ముద్రలు వేయటం ద్వారా దానికి ఆదరణ పెంచాలనుకుంటున్నారా ? దెబ్బతీయాలని తలపెట్టారా ? ఆనందయ్య మిశ్రమానికి కొందరు అతివాదులుగా చెలామణి అవుతున్నవారు కులాన్ని కూడా జత చేశారు. అందుకే అతివాదం-మితవాదం నాణానికి బొమ్మా బొరుసూ వంటివి అంటారు.


ఒక నాడు అల్లోపతి అప్పటికి ఉన్న వైద్యపద్దతులకు ప్రత్యామ్నాయ వైద్య విధానంగా ముందుకు వచ్చింది అనే విషయాన్ని మరచిపోకూడదు. ఇప్పుడు అదే అసలైనదిగా మారి, స్ధానిక, దేశీయ వైద్య పద్దతులు జనం దృష్టిలో ప్రత్యామ్నాయమైనవిగా మారిపోయాయి. ఆయా దేశాలలో అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులను ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూ పోయి ఉంటే అల్లోపతి రంగంలోకే వచ్చేదే కాదు కదా ? వాటికి చాదస్తాలను తగిలించి అభివృద్ది కాకుండా చేసింది ఎవరు ? వర్తమాన ప్రభుత్వాల సంగతి పక్కన పెడదాం. అమెరికా, ఐరోపా దేశాలలో ఉన్న స్ధానిక వైద్య పద్దతులు ఉన్నప్పటికీ వాటి స్ధానంలో అల్లోపతి అభివృద్ది చెందింది. అదేమీ రహస్యంగా జరగలేదు. బలవంతమూ చేయలేదు. మన దేశంలో ఆయుర్వేద పండితులు వాటిని చూసి తమ వైద్య పద్దతిని, ఔషధాలను అభివృద్ది చేయటాన్ని ఎవరు అడ్డుకున్నారు. బ్రిటీష్‌ పాలకులేమీ ఆంక్షలు పెట్టలేదు, అప్పటికి అల్లోపతి కార్పొరేట్‌ ఆసుపత్రులు వాటితో కుమ్మక్కయ్యే ఔషధ మాఫియాలు కూడా రంగంలో లేవే !

హౌమియోపతి వైద్యపద్దతి రోగి లక్షణాల మీద ఆధారపడింది. దానికి ప్రత్యామ్నాయంగా అమెరికా, ఐరోపాలో కొందరు ముందుకు తెచ్చినదానిని హౌమియోపతి నిపుణుడు హానిమన్‌ తొలిసారిగా అల్లోపతి అని వర్ణించాడు. రోగ లక్షణంతో సంబంధం లేకుండా చికిత్సకు వేరే పద్దతుల్లో వైద్యం చేయటాన్ని ఎగతాళి చేస్తూ తొలిసారిగా 1810లో ఆ పదాన్ని ఉపయోగించాడు. జ్వరం వస్తే లక్షణాలను బట్టి హౌమియో పద్దతిలో కొన్ని మందులు ఇచ్చి దాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదంలో కాషాయం, లంఖణాలతో చిక్సిత చేస్తారు. అదే అల్లోపతిలో యాంటీబయోటెక్‌ ఇచ్చి జ్వరానికి కారణమైన బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయటం ద్వారా జ్వరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదం, హౌమియోపతి వంటి వాటిలో శస్త్రచికిత్సలు లేవు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే రెండు పద్దతులను అసలు పోటీ దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక ఔషధాలతో జ్వరాన్ని రెండు మూడు రోజుల్లో తగ్గిస్తే లంఖణం పరమౌషధం పేరుతో వారాల తరబడి మంచాలకే పరిమితం చేస్తే ఉద్యోగాలేమి కావాలి, సెలవులు ఎక్కడి నుంచి వస్తాయి. శస్త్రచికిత్సలు అవసరమైన చోట దానికి బదులు మన మతం, మన కులం, మనదేశ పద్దతుల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా ?

” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” ఇలాంటి ట్వీట్ల ద్వారా పతంజలి కంపెనీ సిఇఓ ఆచార్య బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఈ పెద్దమనిషికి నిజంగా ఆయుర్వేదం మీద, అన్నింటికీ మించి తాము తయారు చేస్తున్న ఔషధాల మీద, సకల రోగ నివారిణిగా చిత్రిస్తున్న యోగా మీద విశ్వాసం ఉందా ? నిజంగా ఉంటే ఉత్తరాఖండ్‌ రిషీకేష్‌లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌( అల్లోపతి)లో చేరి ఎందుకు చికిత్స తీసుకున్నారు. 2019 ఆగస్టు 23న ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి, బాలకృష్ణను పరామర్శిస్తూ రామ్‌దేవ్‌ బాబా నిలిచిన చిత్రాలూ దర్శనమిచ్చాయి. తాజాగా అలాంటి ఈ పెద్దమనుషులిద్దరూ అల్లోపతి వైద్యం మీద అనుచిత విమర్శలు చేయటంతో కొందరు పాతవీడియోలకు వ్యాఖ్యానాలు తోడు చేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. బాలకృష్ణకు గుండెపోటు వస్తే దివ్య అర్జున్‌ కషాయం ఇవ్వలేదు, అనులోమ విలోమ యోగా చేయించకుండా నేరుగా ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు, ఇప్పుడు రామ్‌దేవ్‌ బాబా అల్లోపతిమీద విమర్శలు చేస్తున్నారు సిగ్గు చేటు అని పేర్కొన్నారు. అయితే బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారా లేదా అని బూమ్‌ వెబ్‌సైట్‌ నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తే ఆసుపత్రిలో చేరిన మాట నిజమే అని తేలింది. ఇండియా టుడే గుండెనొప్పితో అని రాస్తే జీ న్యూస్‌ కలుషిత ఆహారం కారణంగా అని రాసింది. అయితే ఆ సమయంలో రామ్‌దేవ్‌ ప్రతినిధి కెకె తిజార్‌వాలా చేసిన ట్వీట్‌లో కలుషిత ఆహారం గురించి పేర్కొన్నారు. ఇక్కడ సమస్య చిన్నదైనా పెద్దదైనా , జబ్బు ఏదైనా అల్లోపతి సామర్ధ్యం గురించి విమర్శిస్తున్న వారు అదే ఆసుపత్రిలో చేరటం ఏమిటి ? ఒక చెట్టునో, ఆవు మూతినో వాటేసుకోకుండా సిలిండర్ల ఆక్సిజన్‌ తీసుకోవటం ఏమిటి ?

ఏడాది తరువాత కరోనాకు,రోగనిరోధక శక్తికి ఇదిగో మందు అంటూ ఆనందయ్య రంగంలోకి వచ్చారు లేదా కొందరు తెచ్చారు. దీని నేపధ్యం ఏమిటి ? కరోనా కొత్త వైరస్‌ గనుక దానికి చికిత్స ఏమిటో ఏ వైద్య పద్దతికీ తెలియదు. జ్వరం వస్తుంది కనుక పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్నే చెప్పారు. మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ ఇస్తే ఫలితం ఉంటుందన్నారు. వెంటనే మన దేశం వాటిని ఎగుమతి చేయటాన్ని నిషేధించింది. నిషేధం ఎత్తివేయకపోతే డొక్క చించుతా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. తరువాత రెమిడెసివిర్‌ దివ్వ ఔషధం అన్నారు, ఎంతగా బ్లాక్‌ మార్కెట్‌ జరిగిందో చూశాము. చివరికి బిజెపి పెద్దలు కంపెనీ నుంచి తామే సేకరించి పెద్ద మేలు చేకూర్చేవారిగా ఫోజు పెట్టారు. తరువాత దాని వలన ఫలితం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో ప్లాస్మా చికిత్స గురించి ప్రచారం. చివరికి అదీ ఫలితం లేదని తేలిపోయింది. రామ్‌దేవ్‌ బాబా కరోనిల్‌ పేరుతో కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రారంభించి కరోనాకు దివ్వ ఔషధం అన్నారు. అది అసలు ఔషధమే కాదు తేలిపోయింది. ఒకవైపు కరోనా రెండవ తరంగం రెచ్చిపోతుంటే జనానికి దిక్కుతోచని స్ధితిలో ఆనందయ్యను రంగంలోకి తెచ్చారు. అతను గాకపోతే మరొకరు వచ్చి ఉండేవారు. గతంలో మెదడు వాపు వ్యాధి, స్వైన్‌ఫ్లూ వంటివి జనాన్ని భయపెట్టిన సమయంలో నిర్ధారణగాని హౌమియో, ఆయుర్వేదం మందులు ఇలాగే పెద్ద ఎత్తున పంచారు. నష్టం లేదు కదా అని జనం కూడా తీసుకున్నారు.


అల్లోపతిలో ప్రయత్నించిన ప్రతి ఔషధం ఉపశమనం కల్పించేది తప్ప నిరోధించేది కాదని తేలిన సమయంలో ఆనందయ్య మూలికల మిశ్రమం వచ్చింది. దాన్ని తినేందుకు మాత్రమే ఇస్తే ఇంత రగడ జరిగి ఉండేది కాదేమో ? కండ్లలో వేసే చుక్కలతో రోగనిరోధకశక్తి వస్తుందని చెప్పటమే తీవ్ర వివాదాన్ని రేపింది.నిర్ధారణ కాని వాటిని కరోనా రోగులు కంట్లో వేసుకున్నా, తిన్నా వారి కండ్లు,ప్రాణాలకు ముప్పు కనుక అనేక మంది అభ్యంతరాలు తెలిపారు. ఇది కూడా ఎందుకు జరిగింది. ఏడాదికి పైగా కరోనా జనాన్ని చంపేస్తుంటే ఆనందయ్య ఎక్కడున్నాడో తెలియదు. ఏడాది కాలంగా చేసిన పరిశోధన లేదా తెలుసుకున్న పరిజ్ఞానం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. తెల్లవారేసరికి మందు కనుగొన్నా అంటే సరిపోతుందా ? ఇక్కడ ఆనందయ్య ఒక చిన్న వ్యక్తి. కరోనా వైరస్‌ గురించి నిర్ధారణ కాగానే అనేక దేశాల్లో ఉన్న స్ధానిక వైద్యపద్దతుల నిపుణులు ఔషధాన్ని ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు ? అల్లోపతి శాస్త్రవేత్తలు, వైద్యుల ప్రయోగాలే ఫలించి వాక్సిన్‌ ఉనికిలోకి వచ్చింది. సహజంగానే దాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్‌ సంస్ధలు పూనుకున్నాయి. వాటిని చూపి నిర్ధారణ కాని నాటు మందులను ఒకసారి వాడి చూస్తే ఏమౌతుంది? నష్టమేమీ లేదు కదా అనే వాదనలు చేసే వారికి చెప్పేదేముంది. వాడి చూడండి, అనుభవించండి. ఆయిల్‌ పుల్లింగు చూశాము, నీటి వైద్యం వంటి వాటిని చూశాము. సాధారణ రోగాలకు అలాంటి వాటిని వెయ్యి వాడండి ఎవరి ఖర్మ వారిది. కానీ కరోనా ఒక మహమ్మారి, ఆదమరిస్తే, సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయేదానితో కూడా ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేయకూడదని చెబుతుంటే వితండవాదం చేసే వారి మానసిక స్ధితిని అనుమానించాల్సి వస్తోంది. చుక్క వేయగానే పక్కాగా తయారయ్యానని చెప్పిన కోటయ్య మాస్టారు కొద్ది రోజుల్లోనే ఎందుకు మరణించారు,సమర్ధించిన వారే ఆయన ప్రాణాలకు మీదకు తెచ్చారనటం వాస్తవం కాదా ?


వైద్య రంగంలో అల్లోపతి ఆసుపత్రులు, ఔషధాల మాఫియా ఎలా అయితే ఉందో ఆయుర్వేద మాఫియా కూడా ముందుకు వచ్చింది. జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తాము తయారు చేసిన కరోనిల్‌ ఔషధం కరోనాను అరికడుతుందని ప్రచారం చేసి సొమ్ము చేసుకొనేందుకు పెద్ద పధకం వేసిన రామ్‌దేవ్‌ బాబా ఆయుర్వేద మాఫియా తెగకు చెందిన వారు కాదా ? ఇలాంటి వారిని చూసి పక్కా ప్రణాళికతోనే ఆనందయ్యను కొందరు రంగంలోకి దించారని చెబుతున్నారు ? కాదని నిరూపించండి. నిజానికి ఏ పట్టా లేని ఆనందయ్యకు కొన్ని మూలికల మిశ్రమంతో కరోనా తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసినపుడు ఆమాత్రం కూడా ఆయుర్వేద నిపుణలకు ఎందుకు తట్టలేదు. జగదేక వీరుడి సినిమాలో మాదిరో లేక ఆఫ్రికా లేదా అమెజాన్‌ అడవుల నుంచి తెచ్చిన అపురూప మూలికలు కాదే. వేటితో తాను తయారు చేస్తున్నదీ ఆనందయ్యే చెప్పాడంటున్నారు కదా ? అప్పుడైనా ఆ మిశ్రమానికి ఆ లక్షణం ఉంటుందో లేదో నిపుణులు ఎందుకు చెప్పలేకపోయారు ? ఆయుష్‌ రంగంలోకి దిగి అలాంటి లక్షణాలేమీ లేవు వేసుకుంటే వేసుకోండి, చస్తే చావండి మీ ఇష్టం, ఇతర మందులను ఆపకుండా కావాలంటే దాన్ని కూడా తీసుకోండి తప్ప అల్లోపతి మందులను ఆపవద్దని చెప్పింది కదా ? దీనికి అనుగుణ్యంగానే దాన్ని పంపిణీ చేయవచ్చని రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్ధానం తామే దాన్ని తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు అది ఔషధం కాదంటున్నారు గనుక ఆపని మానుకున్నాం అంటోంది. చిత్రం ఏమిటంటే ఆ పార్టీ ఎంఎల్‌ఏలు మాత్రం మందు తయారు చేయించి పంపిణీ ప్రారంభించారు. ఇంత చర్చ జరిగాక కూడా ఎవరైనా దాని మీదే ఆధారపడితే ఎవరూ చేయగలిగింది లేదు. తమ పార్టీ వారే ఈ పని చేస్తున్నారు గనుక ఏదైనా అనుకోనిది జరిగితే వైఎస్‌ జగన్‌ మరోమారు ఓదార్పు యాత్రలు చేయాల్సి ఉంటుంది.

ఆనందయ్య మందును ప్రశ్నించటం ఒక కులాన్ని అణగదొక్కటంగా లేదా ఆయుర్వేదం హిందూ ఔషధం గనుక దాన్ని వ్యతిరేకించటం అంటే హిందూమతాన్ని వ్యతిరేకించటం , నాశనం చేసేందుకు పూనుకోవటమే అంటూ వాటిని అనుమతించాల్సిందే అని ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. శాస్త్రీయ అంశాలు బయటికి రావటం మతశక్తులకు ఇష్టం ఉండదన్నది చరిత్ర చెప్పిన సత్యం. బాగ్దాద్‌లో మహమ్మద్‌ బిన్‌ జకారియ లేదా రహేజాగా సుపరిచితుడైన వైద్యుడు 860-932 సంవత్సరాల మధ్య జీవించాడు. హేతువాద భావనలు, ఆ నాటికి ఉన్న పశ్చిమ దేశాల బోధనలను ముందుకు తెచ్చాడు. వైద్యం గురించి ఒక పుస్తకం రాశాడు. దాన్ని తట్టుకోలేని ముస్లిం మత పెద్ద ఆ పుస్తకంతోనే తల మీద మోదాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో అతని కండ్లు పోయాయి. మైఖైల్‌ సెర్వెటస్‌ అనే స్పెయిన్‌ వైద్యుడు 1511-53 మధ్య జీవించాడు. ఊపిరితిత్తుల పనితీరు గురించి, క్రైస్తవాన్ని సంస్కరించటం గురించి తన అభిప్రాయాలతో ఒక పుస్తకం రాశాడు.అది మతవిరుద్దమని ప్రకటించటంతో కాథలిక్‌ మతగురువుల విచారణ, శిక్ష నుంచి తప్పించుకొనేందుకు స్విడ్జర్లాండ్‌ వెళ్లాడు. అక్కడ ప్రొటెస్టెంట్‌ మతగురువులకూ కంటగింపయ్యాడు. జెనీవా సరస్సు ఒడ్డున సజీవదహనం చేశారు. అందరికీ తెలిసిన గెలీలియో (1564-1642) గురించి చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని చెప్పటాన్ని సవాలు చేసి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు. దాన్ని వ్యతిరేకించిన క్రైస్తవమత పెద్దలు జీవితాంతం గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించటమే గాక ఆయన రచనలను నిషేధించారు.


మన దేశంలో హేతువాదం, భౌతికవాదానికి ఆదిపురుషులు చార్వాకులు అన్నది ఒక అభిప్రాయం. వారు బౌద్ద, హిందూ మతాలను రెండు చెప్పే ఆశాస్త్రీయ, పరస్పర విరుద్ద అంశాలను వ్యతిరేకించారు. స్వర్గ నరకాలు లేవన్నారు. అంతకు ముందు ఉనికిలో ఉన్న అనేక భావనలను వారు సవాలు చేశారు. అది తమ మతాల మనుగడకే ప్రమాదమని భావించిన నాటి మత పెద్దలు వారిని సర్వనాశనం చేశారు, వారి రచనలను దొరక్కుండా చేశారు. వారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రస్తావనలతో రాసిన వ్యతిరేక రచనల నుంచి వారి భావజాలం గురించి తెలిసింది, వారి అసలు రచనలు లేవు. మొత్తంగా చెప్పాలంటే ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా నాశనం చేశారు. పర్యవసానంగా ఒక నిర్వీర్యమైన జాతిగా మనది తయారు కావటానికి మతాలు తప్ప మరొకటి కాదన్నది కొందరి అభిప్రాయం. నాడు మతశక్తులు హేతువాదాన్ని అణగదొక్కితే నేటి మతశక్తులు మరోరూపంలో అశాస్త్రీయాన్ని ముందుకు తెచ్చి ఈసమాజాన్ని అజ్ఞానంలోకి నెట్టాలని చూస్తున్నాయి. దేశంలోని హిందూత్వ శక్తులు సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్నాయి గనుక మూఢనమ్మకాలకు, ఆశాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సైన్సు సమావేశాలనే వేదికగా చేసుకొని అశాస్త్రీయ, ఆధారంలేని అంశాలను ప్రచారం చేశారు. ఆవు మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా తేల్చమని నిధులు కేటాయిస్తున్నారంటే ఏమనుకోవాలి. తిరోగామి జాతీయవాద అజెండాలో భాగంగా పురాతన సంస్కృతికి, మెజారిటీ హిందూమతానికి ముప్పు వచ్చిందనే పేరుతో జరుగుతున్న ప్రచారం తెలిసిందే. దానిలో భాగంగానే హేతువాదం ఘర్షణ పడే ప్రతిదానికి మతానికి సంబంధం కలిపితే జనాన్ని తమవెంట తీసుకుపోవటం సులభమని వారు భావిస్తున్నారు.

ఆల్లోపతి వైద్యం చేసే కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఔషధాలు తయారు చేసే కంపెనీల లాభాపేక్ష, ఇతర లోపాలను చూపి ఆయుర్వేదానికి మతాన్ని తగిలించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్న పతంజలి వంటి కంపెనీల యజమానులు అలాంటి ధోరణులను ప్రోత్సహిస్తున్నారు.వారికి కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు గురించి చెప్పనవసరం లేదు. విదేశీ కార్పొరేట్‌లు పెరిగితే తప్పు పట్టని వారు స్వదేశీ కార్పొరేట్ల ఎదుగుదలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమెజాన్‌ మాదిరి మన అంబానీ కంపెనీ ఎందుకు పెరగకూడదు, ఒక ఫైజర్‌, ఒక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ మాదిరి రామ్‌దేవ్‌ బాబా పతంజలి ఎందుకు విస్తరించకూడదు అనే వాదనలకు స్వదేశీ కార్పొరేట్‌ జాతీయవాదమే మూలం. అసలు మొత్తంగా దేశాన్ని కార్పొరేట్‌లకు అప్పగించటం హానికరం అని ఎక్కడా చెప్పరు. ఐరోపా సామ్రాజ్యవాదులు ఇలాంటి కార్పొరేట్‌ జాతీయవాదంతోనే తమ కంపెనీలకు మార్కెట్‌ను కల్పించేందుకు గతంలో దేశాలను వలసలుగా చేసుకున్నారు, ఎన్నో ప్రాంతీయ యుద్దాలు, రెండు ప్రపంచ యుద్దాలకు, నిత్యం ఏదో ఒక మూల ఉద్రిక్తతలకు కారకులు అవుతున్నారు. ఆనందయ్య వంటి వారిని కొందరు తమ స్ధాయిలో ఉపయోగించుకోవాలని చూస్తుంటే మతశక్తులతో చేతులు కలిపిన పతంజలి పెద్దలు పెద్ద స్ధాయిలో లబ్ది పొందాలనుకుంటున్నారు. ” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” అంటూ చేస్తున్న ట్వీట్లు, హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందంటూ సంఘపరివారం చేసే ప్రచారానికి పెద్ద తేడా ఏముంది ?


శాస్త్రం, కుహనా శాస్త్రం, జ్ఞానం, అజ్ఞానం వీటిలో ఏది ముందు ? బతుకు పోరాటంలోనే మానవుడు అనేక అంశాలను నేర్చుకున్నాడు. చెట్టుమీది కాయలు కింద పడటం మానవులకు తెలియని అంశం కాదు. దానిక్కారణం తెలియక ముందు అది దేవుడు, దేవత లేదా ఆదృశ్యశక్తి మహిమ అనుకున్నారు. అది కారణం తెలియని స్ధితి. దీనికి అజ్ఞానం ఒక పర్యాపదం. చెట్టుమీది యాపిల్‌ పండ్లు పైకి పోకుండా, పక్కకు పడకుండా నిటారుగా కిందనే ఎందుకు పడుతున్నాయన్న ఆలోచన న్యూటన్‌కు వచ్చింది కనుకనే భూమ్యాకార్షణ సిద్దాంతం వచ్చింది. అది విజ్ఞానం. అంతకు ముందు దేవుడే అలా రాసిపెట్టాడు అనుకోవటం తప్పుకాదు. తరువాత కూడా ఆ సిద్దాంతం గురించి తెలియని వారు అనుకుంటే దాన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు. కానీ చదువుకొన్న వారు కూడా దేవుడి మహిమే అంటే అది అజ్ఞానం. పిల్లలు ఎలా పుడతారో తెలియక ముందు దేవుడి దయ, తెలిసిన తరువాత కూడా అలా అనుకుంటే అజ్ఞానం. అందువలన మౌలికంగా తెలియని స్ధితి లేదా అజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టింది. సైన్సు, కుహనా సైన్సు కూడా అంతే. వివేకం లేని జ్ఞానం ఇసుకలో నీరు వంటిది అన్నది ఒక సామెత. వానరుడు నరుడిగా మారిన పరిణామ క్రమం గురించి మీరు విశ్వసిస్తారా అంటూ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా సంస్ద జరిపిన సర్వే ప్రకారం జపాన్‌లో 78, ఐరోపాలో 70, చైనాలో 69, దక్షిణ కొరియాలో 64శాతం మంది అవునని అంగీకరిస్తే అమెరికాలో 45శాతం మందే ఉన్నారు. అజ్ఞానిగా ఉండటం పెద్దగా సిగ్గుపడాల్సిన అంశం కాదు, తెలుసు కొనేందుకు నిరాకరించటమే సిగ్గులేనితనం అని అమెరికా జాతిపితలలో ఒకడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చెప్పారు. వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో అన్నింటి గురించి రాశారని, మన సంస్కృత గ్రంధాల్లో ఉన్నవాటిని పాశ్చాత్యులు అపహరించి తామే కనుగొన్నట్లు ప్రచారం చేసే, చెబుతున్నవారు కొత్తగా తెలుసుకొనేందుకు ముందుకు వస్తారని ఆశించటం అత్యాశే. తెలుసుకొనేందుకు నిరాకరించే జాతి ఎక్కడైనా ముందుకు పోయిందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

టీకాల్లేక జనం చావులు – భారత్‌, చైనా తీరుతెన్నులు !

05 Saturday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, Science, USA

≈ Leave a comment

Tags

anti china, China's vaccine diplomacy, Global COVID vaccine diplomacy, India vaccine diplomacy, India Vaccine Matters, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సలహాదారులెవరో గానీ అచ్చతెలుగులో చెప్పాలంటే దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నారు.అఫ్‌కోర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దగ్గర కూడా అలాంటి వాటిని ఇచ్చేవారు పుష్కలంగా ఉన్నారనుకోండి. లేకపోతే వధువు-వరుడు లేకుండా పెళ్లి చేసినట్లు టీకాలు లేకుండా నాలుగు రోజుల పాటు కరోనా టీకా ఉత్సవాలు జరపటం ఏమిటి ? అత్యున్నత న్యాయస్ధానం కరోనాటీకా విధానం గురించి తీవ్ర ఆక్షేపణ తెలియచేయటం వ్యక్తులు ఎవరని కాదు ఒక దేశ ప్రధానికి ఎంత నామర్ధా ! ఒక విధానం అంటూ లేదని వ్యాఖ్యానించటాన్ని చూసి అడ్డగోలు పాలన నడుస్తున్నట్లుగా ప్రపంచమంతా అనుకుంటుంటే ఎంత అవమానం!


మన జనానికి జ్ఞాపకశక్తి తక్కువ అన్నది మోడీ భక్తులకు పూర్తి విశ్వాసం. ఒక్క విషయాన్ని గుర్తు చేసి అసలు విషయానికి వద్దాం. పదమూడు కోట్ల వాక్సిన్లు వేసేందుకు నరేంద్రమోడీ నాయకత్వం కేవలం 95 రోజులే తీసుకుంటే అగ్రరాజ్యం అమెరికాకు 101, చైనాకు 109రోజులు పట్టిందని పెద్ద ఎత్తున కాషాయ దళాలు ప్రచారం చేశాయి. భారత్‌ ఎంత వేగంగా స్పందించిందో చూడండి అంటూ దాన్నొక పెద్ద విజయంగా విర్రవీగాయి. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా రెండవ తరంగం గురించి స్పందించకుండా నిర్లక్ష్యం చేశారన్న దుమారం నేపధ్యంలో ఈ విజయగాధను గానం చేశారు.


ఇప్పుడు పరిస్ధితి ఏమిటి ? ప్రపంచంలో మే నెలాఖరుకు 209 కోట్ల మందికి కనీసం ఒక డోసు వాక్సిన్లు వేశారు. ఒక్క చైనా లోనే 72 కోట్ల మందికి వేయగా మన దేశం 22 కోట్ల దగ్గర ఉంది. జూన్‌ నాలుగవ తేదీ నాటికి మన దేశంలో రెండు డోసుల వాక్సిన్‌ తీసుకున్నవారు 4.44 కోట్ల మంది, జనాభాలో కేవలం 3.3శాతమే. చైనా గురించిన సమాచారం లేనప్పటికీ అంతకంటే ఎక్కువే అన్నది స్పష్టం. వారిని పక్కన పెడదాం ఫైనాన్సియల్‌ టైమ్స్‌ జూన్‌ మూడవ తేదీ నాటి సమాచారం ప్రకారం బ్రిక్స్‌లోని బ్రెజిల్‌లో 10.6, రష్యాలో 8.9శాతం చొప్పున పూర్తిగా వేస్తే మనం ఎక్కడ ఉన్నాం అని ఆలోచించాలి. ఆలశ్యంగా ప్రారంభించినా ఈ ఏడాది చివరికి చైనాలో 80శాతం మందికి పూర్తిగా రెండు డోసులూ వేస్తారంటూ వార్తలు రాస్తున్నారు. మనం ఆస్ధాయిలో ఉన్నామా ? కొంత మంది మన దేశంలో వాక్సిన్లు వేయటం గురించి ఆలోచించకుండా చైనాలో ఎడతెగని వరుసల్లో జనం రోజుల తరబడి వేచి చూస్తున్నారంటూ ఈ మధ్య కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమంలో తిప్పారు.ఇది కూడా నరేంద్రమోడీ వైఫల్యాన్ని సమర్ధించుకొనే యత్నంలో భాగమే. లేదూ సదరు వీడియోలు నిజమే అనుకుందాం. మోడీ తప్పేమీ లేదు, అంతా అలాగే ఉంది అని చెప్పేందుకు గాకపోతే దాని వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ? రోజుకు ఇప్పుడు కోటీ 90 లక్షల వాక్సిన్లు చైనాలో వేస్తున్నట్లు వార్తలు. ఎవరైనా అవన్నీ మేం నమ్మం అంటే అది వారిష్టం. చైనా గురించి కొన్ని నమ్ముతున్న వారు కొన్నింటిని ఎందుకు నమ్మటం లేదు ? లోకంలో నిత్యం ప్రతిదాన్నీ చివరికి తమను తామే నమ్మకుండా శంకించేవారు కొందరు ఉంటారు. మరికొందరు అతి తెలివి గలవారు అది కమ్యూనిస్టు నియంతృత్వం అండీ అవసరమైతే బలవంతంగా వాక్సిన్‌ వేస్తారు, మనది ప్రజాస్వామ్యం అని చెప్పే బాపతు కూడా తగలవచ్చు. దేశంలో ఇంతగా వ్యాధిని పుచ్చబెట్టమని, చంపమని ప్రజాస్వామ్యం చెప్పిందా ?

గేట్స్‌ ఫౌండేషన్‌ మాజీ డైరెక్టర్‌ రే ఇప్‌ చైనా గురించి వంకర బుద్దిని బయట పెట్టుకుంటూ అమానుష వ్యవస్ధలో భాగంగా ప్రతి గ్రామంలోనూ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఉంటారు, అయితే వారు ఎంతో శక్తివంతంగా జనాన్ని సమీకరిస్తారు కూడా అని వాక్సినేషన్‌కు జనాన్ని సమీకరించటం గురించి చెప్పారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కంటే తమ పార్టీలో ఎక్కువ మంది సభ్యులున్నారని బిజెపి చెప్పుకుంటుంది కదా ఇప్పుడు వారంతా ఏమయ్యారు? మైనారిటీ మతాల వారి మీద విద్వేషం రెచ్చగొట్టటం, మెజారిటీ మతోన్మాదాన్ని ఎక్కించటం తప్ప వారు చేస్తున్నది ఏమిటి ? నిజంగా కరోనాపై పోరులో రంగంలోకి దిగితే నరేంద్రమోడీ ఖ్యాతి ఇంకా పెరుగుతుంది కదా ? ఏప్రిల్‌ నెలలో అమెరికాలో గరిష్ట స్దాయిలో వాక్సినేషన్‌ జరిగింది. రోజుకు 34 లక్షల మందికి వేశారు, అదే చైనాలో ఏడు రోజుల సగటు కోటీ 90లక్షల మంది అని ఏపి వార్తా సంస్ధ తన కథనంలో పేర్కొన్నది. రాజధాని బీజింగ్‌లో 87శాతం మందికి ఒక డోసు వేశారు. సినోవాక్‌, సినోఫామ్‌ అనే రెండు రకాల వాక్సిన్ల తయారీకి అంతకు ముందున్న ఫ్యాక్టరీలేగాక కొత్తగా నిర్మించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు, ఫ్లూ(జలుబు) మాదిరి కరోనా వైరస్‌ కూడా పదే పదే వచ్చే అవకాశం ఉన్నందున నివారణకు రానున్న రోజుల్లో కూడా వాక్సిన్‌ అవసరం అని కొంత మంది నిపుణులు భావించటం, అవసరమైతే మూడో డోసు కూడా వేయాల్సి రావచ్చన్న హెచ్చరికల నేపధ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. అవసరం లేకపోతే ఆ ఫ్యాక్టరీలను వేరే ఔషధాలు లేదా వాక్సిన్ల తయారీకి వినియోగిస్తారు. గతేడాది కరోనా కట్టడికి కొద్ది రోజుల్లోనే తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించిన విషయం తెలిసిందే. సినోవాక్‌ ఏడాదికి రెండు వందల కోట్లు, సినోఫామ్‌ మూడు వందల కోట్ల డోసుల తయారీ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. అనేక దేశాలలో మాదిరి వాక్సిన్ల తయారీకి చైనా ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చినప్పటికీ దాని తీరు వేరేగా ఉంది. మిగతాదేశాల మాదిరి వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి పదార్దాలకు అమెరికా నుంచి దిగుమతులపై ఆధారపడినందున మన దేశంలో సీరం సంస్ధ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. చైనా కంపెనీలు దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
కొంత కాలం తరువాత వాక్సిన్‌ ప్రభావం తగ్గిపోతుంది కనుక రాబోయే రోజుల్లో తిరిగి తీసుకోవాల్సి రావచ్చని షాండోంగ్‌ రాష్ట్రంలోని క్వింగ్‌డావోలో ఉన్న బోయావో ఫోరమ్‌ ఫర్‌ ఆసియా సంస్ద ప్రతి ఝాంగ్‌ చెప్పారు. కొత్త రూపాన్ని సంతరించుకున్న వైరస్‌ల మీద వాక్సిన్ల ప్రభావం ఇంకా రుజువు కానందున మరింత సమాచారాన్ని పరిశీలించిన తరువాత గానీ మరోసారి వాక్సిన్లు తీసుకోవాలా లేదా అనేది చెప్పజాలమన్నారు. ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ మాదిరి కరోనా కూడా మారవచ్చని కొందరు భావిస్తున్నారు. అమెరికా వంటి కొన్ని చోట్ల ఇప్పటికీ ఫ్లూ కారణంగా జనం మరణిస్తున్నప్పటికీ మనవంటి అనేక దేశాలలో జనంలో రోగనిరోధకశక్తి పెరిగి కొద్ది రోజులు ఇబ్బంది పెట్టి మాయం అవుతున్నది. గతంలో పది కోట్ల డోసుల లభ్యతకు 25 రోజులు పడితే తరువాత క్రమంగా 16,9, 7 రోజులకు తగ్గి ఇప్పుడు ఐదు రోజుల్లోనే అందుబాటులోకి వచ్చింది. ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే డోసు 0.5 మిల్లీ లీటర్లు ఉంటుంది. చైనాలో ఇలాంటి వాటితో పాటు ఒక కంపెనీ 0.1 మిల్లీలీటరును ముక్కుతో పీల్చుకొనే విధంగా ఒక వాక్సిన్‌ తయారు చేసి పరీక్షలు నిర్వహించింది. అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి వస్తే వాక్సిన్‌ లభ్యత ఇబ్బడి ముబ్బడి అవుతుంది, రవాణా కూడా సులభంగా చేయవచ్చు.

కరోనా రెండవ దశ గురించి చేసిన హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పట్టిందనే విమర్శలు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అలాంటిదేమీ లేదని చెబుతోంది, అంగీకరిద్దాం. కరోనా నిరోధానికి వాక్సిన్‌ అవసరాన్ని గుర్తించారు కదా ! తానే స్వయంగా ఉత్పత్తిని పర్యవేక్షిస్తున్నారని జనం అనుకొనే విధంగా ప్రధాని నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌ పర్యటనలను జరిపారు కదా ! దాని మీద చూపిన శ్రద్ద ప్రణాళిక మీద ఎందుకు పెట్టలేదు, సుప్రీం కోర్టుకు సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయింది ? నరేంద్రమోడీ సర్కార్‌ మనోవైకల్యం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ విమర్శించారు. ప్రభుత్వంలో గందరగోళంలో పడిన కారణంగానే సత్తా అంతటినీ చూపలేకపోయిందన్నారు. ఆర్ధిక రంగంలో, సామాజిక సంబంధాల వైఫల్యం మహమ్మారి దాడిని ఎదుర్కోవటంలో వైఫల్యానికి ప్రాతిపదిక అన్నారు.


వాక్సిన్‌ తయారీ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు తప్ప మూడు ధరల విధానాన్ని కేంద్రం ముందుకు తీసుకురావటంలో మరొక పరమార్ధం లేదు.ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధానమిది. కేంద్రానికి 150 రూపాయలకు ఇచ్చిన కంపెనీలు రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులకు భారీ మొత్తాలను వసూలు చేయటంలో ఆంతర్యం ఏమిటి ? కేంద్రానికి ఇచ్చిన రాయితీలను కూడా ఈ రూపంలో పూడ్చుకోవాలన్న కంపెనీల ఎత్తుగడ, వాటితో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దల అతి తెలివి తప్ప మరొకటి కాదు. నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచటంతో పాటు కంపెనీలకు లాభం చేకూర్చటమే దీని అంతరార్ధం. ముడిపదార్దాలు, అవసరమైన పరికరాల ఎగుమతులపై అమెరికా ఇంతవరకు ఆంక్షలు ఎత్తివేయలేదు. మరోవైపు రాష్ట్రాలు వాక్సిన్ల కోసం ప్రపంచ స్ధాయి టెండర్లను పిలిచినా కంపెనీల నుంచి స్పందన లేదు. అవి పెడుతున్న షరతుల మీద నిర్ణయం తీసుకోవాల్సిందీ, పరిష్కరించాల్సిందీ కేంద్ర తప్ప రాష్ట్రాలు చేయగలిగినది కాదు. ఇంత జరుగుతున్నా, వాక్సిన్‌ విధానం మీద కేంద్రం చురుకుగా కదులుతున్న దాఖలాలు లేవు.


కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం ఒకటైతే దాని కొనసాగింపుగా వాక్సిన్‌ దౌత్యంతో దూరమైన ఇరుగు పొరుగు, ఇతర దేశాలకు దగ్గర కావాలని మోడీ సర్కార్‌ ఆలోచన చేసింది. ఇప్పుడు ఇటు దేశంలో తీవ్ర విమర్శలపాలు కావటమే గాక దౌత్య రంగంలో కూడా అనుకున్నది సాధించే స్ధితిలో లేవని పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అనేక దేశాలు ఇప్పుడు చైనా వైపు చూస్తున్నాయి. ప్రతి దేశానికి దౌత్య సంబంధమైన, అంతర్జాతీయ సహకారానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేద దేశాలకు కోవాక్స్‌ పేరుతో వాక్సిన్లు అందచేసేందుకు నిర్ణయించింది. వాక్సిన్‌ తయారీ దేశాలన్నీ తమ శక్తిమేరకు దానికి విరాళంగా వాక్సిన్లు అందచేస్తున్నాయి. మన దేశం కూడా అలాంటి బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఓకే. కానీ జరిగిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ సంస్ధ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) మార్చినెల 23న ఒక ప్రకటన విడుదల చేసింది. దానిలో పేర్కొన్న సమాచారం ప్రకారం 74 దేశాలకు గ్రాంట్‌ (ఉచితం) వాణిజ్యం, కోవాక్స్‌ కార్యక్రమానికి గాను వాక్సిన్లు ఎన్ని డోసులు అందచేసిందీ వివరంగా ఉంది. మూడు తరగతులకు సంబంధించి మొత్తం 5.959 కోట్ల డోసులను ఎగుమతి చేసింది. వీటిలో గ్రాంట్లుగా 81.25లక్షలు, కోవాక్స్‌ కార్యక్రమానికి కోటీ 75లక్షల డోసులు ఇవ్వగా వాక్సిన్‌ ఎగుమతి చేసే కంపెనీలు వాణిజ్య పరంగా ఎగుమతి చేసినవి 3.396 కోట్ల డోసులు ఉన్నాయి. విశ్వగురువు నరేంద్రమోడీ పేరుతో ప్రచారం మాటున ఇదంతా జరిగింది. అంటే దానం, విరాళం అనే పేరుతో దౌత్యం దాని వెనుక పక్కా లాభసాటి వ్యాపారం. మరోవైపు నరేంద్రమోడీ కార్పొరేట్ల తాట తీస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో భక్తుల ప్రచారం. మార్చినెలలో మన రాయబారి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ భారత్‌ దేశీయంగా ఉపయోగించే వాటి కంటే ఎగుమతులు చేసిందే ఎక్కువ అని గొప్పగా చెప్పుకున్నారు.


దేశంలో వాక్సిన్ల కొరత తలెత్తటంతో అబ్బే అంతా ఉత్తిదే అని జనాన్ని నమ్మించేందుకు కొత్త నాటకం. ప్రపంచం అంతా రాజకీయమయంగా ఉన్నపుడు ఎవరికి అవకాశం దొరికితే వారు ఉపయోగించుకుంటారన్నది జగమెరిగిన సత్యం. చైనా అదే చేస్తున్నది, ఎవరెంత గింజుకున్నా చేయగలిగిందేమీ లేదు. మనల్ని నమ్ముకొని వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిన వారు ఇప్పుడు మన మీద జాలి చూపుతూ చైనా వైపు చూస్తున్నారు. చిన్న దేశమైన భూటాన్‌ మన మీద ఆధారపడుతున్న దేశం, డోక్లాం వివాదంలో మన మిలిటరీ వెళ్లి చైనా వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇండియా మాకు విశ్వసనీయమైన మిత్ర దేశమే, మేము అడిగితే రెండో డోసుకు వాక్సిన్లు ఇవ్వగలదు కానీ ఆ దేశంలోనే ప్రాణాలను నిలిపేందుకు ఎంతో అవసరం పడుతున్నపుడు మేము వత్తిడి చేయలేము అని ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్‌ గత నెలలో ప్రకటించాడు.చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకు పూనుకున్నారు.నేపాల్‌దీ అదే పరిస్ధితి. మన వాక్సిన్ల కంటే చైనావి ధర ఎక్కువే అయినప్పటికీ, అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎగుమతులు చేయనందున మిగతా ప్రపంచ దేశాలు చైనా వైపు చూడక తప్పని స్ధితి.

చైనాలో తయారు చేస్తున్న సినోఫామ్‌, సినోవాక్‌ వాక్సిన్‌న్లకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆమోదం తెలపటంతో ఇప్పుడు అనేక దేశాలు అంతకు ముందు వచ్చిన వార్తలతో సందేహాలు వెలిబుచ్చినవి కూడా ఇప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అమెరికా, ఐరోపాల వెలుపల తయారు చేసిన వాక్సిన్లలో ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదం పొందిన వాటిలో ఇంతవరకు చైనావి మాత్రమే ఉన్నాయి. మన దేశానికి చెందిన కోవాక్సిన్‌కు ఇంతవరకు ఆమోదం లేదు. ఒకసారి వాగ్దానం చేస్తే అది గ్రాంటు అయినా వాణిజ్య ప్రాతిపదిక అయినా కచ్చితంగా చైనా సరఫరా చేస్తుందనే నమ్మకం ప్రపంచ దేశాల్లో ఉంది. ఎనిమిది కోట్ల డోసులను అందచేస్తామని అమెరికా ప్రకటించటమే తప్ప వారాలు గడుస్తున్నా ఎటూ తేల్చటం లేదు. ఈ నెలాఖరుకు వస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్నింటిని మనకు అమెరికా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా ఆవి అక్కడి గోడౌన్లలో పడి ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలకు 26.5కోట్ల డోసులు సరఫరా చేసిన చైనా మరో 50కోట్ల డోసుల సరఫరా చేయనుందని ఎయిర్‌ ఫినిటీ అనే సంస్ద నెల రోజుల క్రితం వెల్లడించింది. చైనా తరువాత ఐరోపా యూనియన్‌ వంద దేశాలకు 6.7 కోట్ల డోసులను ఎగుమతి చేసింది. మన దేశం నుంచి వాక్సిన్లు వస్తాయని ఆశించిన ఫిలిప్పైన్స్‌ అధికారి ఒకడు వాస్తవ పరిస్ధితిని అర్ధం చేసుకోకుండా దక్షిణ చైనా సముద్ర దీవుల వివాదంలో చైనాను విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు. ప్రభుత్వం ఒకవైపు వాక్సిన్‌కోసం సంప్రదింపులు జరుపుతుంటే ఇలాంటి చర్యలేమిటని సదరు అధికారిని అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెరేట్‌ మందిలించాడు. చైనాతో వివాదం ఉన్నంత మాత్రాన దాని పట్ల దురుసుగా, అమర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నాడు. మన దేశం వాక్సిన్‌ ఎగుమతులపై నిషేధం విధించటంతో ఇండోనేషియా ప్రభుత్వం చైనా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. చైనాతో వివాదం పేరుతో వాక్సిన్లు కొనుగోలు చేయకుండా జనం ప్రాణాలను ఫణంగా పెట్టటమా వివాదం ఉంటే తరువాత తేల్చుకుందాం ముందు ప్రాణాలు కాపాడటం ముఖ్యం అని వాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేస్తారా అన్నది మోడీ సర్కార్‌ తేల్చుకోవాల్సి ఉంది.


అవసరమైతే మనం కూడా చైనా నుంచి వాక్సిన్లు ఎందుకు దిగుమతి చేసుకోకూడదనే సూచనలు ఇప్పటికే వెలువడుతున్నాయి. మన మాదిరే చైనా కూడా గ్రాంటుగా ఇచ్చేది ఇస్తోంది, మరోవైపు వాక్సిన్లను ఆమ్ముతోంది. గత నెలాఖరులో మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికా వెళ్లి వాక్సిస్లు ఆమ్ముతారా అంటూ వాకబు చేసి వచ్చారు. అమెరికన్లు ఏవీ ఉచితంగా ఇవ్వరు. ఒక వేళ ఒకదాన్ని ఇచ్చినా మరొకదానితో మొత్తం రాబడతారు. చైనా నుంచి ఆక్సిజన్‌ పరికరాలు, ఇతర సరఫరాలకు ఆటంకం లేకుండా సరకు రవాణా విమానాలు నడపాలని అదే జైశంకర్‌ చైనాను అడిగారు గానీ వాక్సిన్ల దగ్గర మొహమాట పడ్డారు. వాక్సిన్లు లేక జనం చస్తుంటే ఇదేమి వైఖరో, రాజకీయమో అర్ధం కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ, బిజెపిని వణికిస్తున్న ” టూల్‌కిట్లు ” -సరఫరాదారుగా న్యాయవ్యవస్ధ ?

04 Friday Jun 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP dangerous toolkits, Congress Toolkit case, Judiciary Activism, Supreme Court of India, Toolkits


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ ఏడు సంవత్సరాల ఏలుబడిలో అన్నీ విజయాలే అన్న మాటలు జనానికి ఏమాత్రం ఉత్సాహం కలిగించలేదు. వంది మాగధులు కూడా పొగిడేందుకు వెనుకా ముందూ చూశారు. ఏడు సంవత్సరాలకు ముందు- ఏడు సంవత్సరాల తరువాత ఏమిటని ఎవరైనా పోల్చుకున్నారా ? కాస్త నిదానంగా ఆలోచించండి. కాంగ్రెస్‌ గురించి 2014కు ముందు బిజెపి మీడియా వారికి, పార్టీ ప్రచారదళాలకు ఇచ్చిన టూల్‌కిట్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే పార్టీని టూల్‌కిట్లు గజగజ వణికిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏడేండ్ల నరేంద్రమోడీ పాలనలో మిగతావన్నీ దిగజారుతుంటే ఇవి ఏటికేడు పెరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం స్వయంగా బిజెపి పార్టీ, సర్కార్‌ తయారు చేస్తున్నవే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు, చర్యలను విమర్శించటం దేశద్రోహంగా భావిస్తున్న రోజుల్లో ఈ టూల్‌కిట్లకు న్యాయవ్యవస్ధలో వెలువడుతున్న తీవ్ర వ్యాఖ్యలు మరింతగా పదును పెడుతున్నాయా అనిపిస్తోంది. ప్రపంచ వ్యాపితంగా ప్రభుత్వ పరువు తీశారంటూ దిశ రవి అనే యువతి మీద రైతు ఉద్యమం గురించి టూల్‌కిట్‌ కేసు వేశారు. వివాహ సమయాల్లో పెళ్లికూతుళ్లకు పంపే మేకప్‌కిట్‌ గురించి, సుత్తీ, రెంచీలు, స్క్రూడ్రైవర్ల వంటి చిన్న పరికరాలు ఉండే దానిని టూల్‌ బాక్సు, కిట్‌ అంటారని తెలుసుగానీ మీడియా టూల్‌కిట్‌లో ఏముంటాయో తెలియక, ఎవరినైనా అడిగితే ఏమనుకుంటారో అని చాలా మంది మధనపడ్డారు. కానీ బిజెపి వారు దిశ రవి కేసుతో తెలియని వారికి అవేమిటో తెలియ చేశారు.జనానికి విజ్ఞానం పంచారు.


తరువాత తమ నేత నరేంద్రమోడీ, ప్రభుత్వాన్ని బదనామ్‌ చేసేందుకు కాంగ్రెస్‌ టూల్‌కిట్లను పంపిణీ చేసిందని బిజెపి నేతలు ఆరోపించారు. చివరికి అది వారికే ఎదురు తన్నింది, పరువు తీసింది. దాంతో దాని వ్యూహకర్తలకు చెప్పుకోరాని చోట దెబ్బ తగిలింది. మా పేరుతో బిజెపి రూపొందించిన టూల్‌కిట్‌ అని కాంగ్రెస్‌ ఎదురు కేసు పెట్టింది. దాంతో కాంగ్రెస్‌ టూల్‌కిట్‌కు సంబంధించి బిజెపి నేతలు చేసిన ట్వీట్లకు మానిప్యులేటెడ్‌ మీడియా(మోసపుచ్చే సమాచారం) అని ట్విటర్‌ కంపెనీ ముద్రవేసి దేశ, విదేశీయులకు ఒకటూల్‌ కిట్‌ అందించింది. దీని అర్ధం ఏమంటే బిజెపి వారు చేసే ట్వీట్లు మోసపుచ్చేవి సుమా మీరు జాగ్రత్త అని చెప్పటమే. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడటం అంటే ఇదే. ఆ ముద్రను చెరిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ కంపెనీ మీద పోలీసులతో దాడి చేయించి భయపెట్టింది. ఇది మరింత పరువు తీసింది.


ఏడు సంవత్సరాలకు ముందు బిజెపి టూల్‌కిట్‌లో గుజరాత్‌ తరహా అభివృద్ది, నల్లధనం వెలికితీత, అచ్చేదిన్‌ వంటివి ఎన్నో ఉన్నాయి. అధికారానికి వచ్చిన తరువాత మేక్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా తోడయ్యాయి. ఏడు సంవత్సరాల తరువాత చూస్తే టూల్‌కిట్‌లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. అన్నింటికంటే చిత్రం ఏమంటే ప్రపంచానికి, ప్రతిపక్షాలకు, ప్రచార, ప్రసార సాధనాలకు స్వయంగా ప్రభుత్వంతో పాటు కొన్ని సందర్భాల్లో న్యాయవ్యవస్ధ కూడా టూలుకిట్లు ఎలా అందించగలదో దాదాపు ప్రతి రోజూ చూస్తున్నాం.దిశ రవి ఒక సాధారణ యువతి, ఏమీ చేయలేదని కేసు దాఖలు చేశారు గానీ న్యాయమూర్తుల మీద కూడా పెడతారా ?


లోపభూయిష్టమైన వెంటిలేటర్లతో రోగుల మీద ప్రయోగాలు చేయవద్దని, వాటిని తాము అంగీకరించబోమని బొంబాయి హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇదీ కరోనా వైఫల్యాల టూల్‌కిట్టులో చేరింది. ఇదే వ్యాఖ్యను ప్రతిపక్ష పార్టీలు గనుక చేసి ఉంటే ఈ పాటికి కాషాయ దళాలు ఎలా రెచ్చిపోయి ఉండేవో తెలిసిందే. పిఎం కేర్‌ నిధులకు దాతలు ఉదారంగా నిధులు ఇస్తే వాటితో పనికి రాని వెంటిలేటర్లు కొనుగోలు చేయటం వెనుక అవినీతి, అక్రమాలు లేవంటే ఎవరైనా నమ్ముతారా ? అలాంటి నాసిరకం పరికరాలను రోగులకు అమర్చితే వారి ప్రాణాలు హరీమంటే దాన్ని హత్య అనాలా, స్వర్గానికి పంపారనుకోవాలా ? ఆ పుణ్యం ప్రధాని మోడీ ఖాతాలోనే వేయాలి, ఎందుకంటే ప్రధాని పేరుతోనే కదా కొనుగోలు చేస్తున్నది ! బొంబాయిహైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు అర్దం ఏమిటి ? మరట్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాలకు నాసిరకం వెంటిలేటర్ల సరఫరా గురించి వచ్చిన వార్తల మీద ప్రజాప్రయోజన వ్యాజ్య విచారణ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరట్వాడా ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు పంపిన 150 వెంటిలేటర్లలో 113 లోపభూయిష్టమైనవని బయటపడింది. మిగిలిన 37ను ఆసుపత్రుల వారు అసలు రవాణా చేసిన డబ్బాల నుంచి బయటకు తీయనేలేదు. మే 28వ తేదీన ఈ ఆరోపణలను కేంద్రప్రభుత్వం తిరస్కరించింది. వెంటిలేటర్లను మామూలుగా పని చేసేట్లు చూస్తామని, వేటిలో అయినా లోపాలుంటే తొలగిస్తామని పేర్కొన్నది. అయితే ప్రధాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డిఆర్‌ కాలే మే 29వ తేదీన ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వెంటిలేటర్ల పనితీరు నమోదు చేసిన అంశాలను కోర్టుకు సమర్పిస్తూ మరమ్మతులు చేసిన తరువాత కూడా అవి సరిగా పని చేయటం లేదని పేర్కొన్నారు. సిబ్బందికి వాటిని పని చేయించటం తెలియదన్న కేంద్ర వాదనను తిప్పికొట్టారు. వాటిని గుజరాత్‌ రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతి సిఎన్‌సి అనే కంపెనీ సరఫరా చేసింది. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వైద్యులను పంపి పరిశీలించిన తరువాత లోపాలుంటే తయారీదారును బాధ్యులను చేస్తామని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తాము పూర్తిగా సంతృప్తి చెందేంత వరకు వాటిని వినియోగించబోమని అలాంటి వాటితో తీవ్ర ముప్పు ఉంటుందని మహారాష్ట్ర న్యాయవాది చెప్పారు. ఈ వాదనల తరువాత న్యాయమూర్తులు పైన పేర్కొన్న వ్యాఖ్యలను చేశారు. ఇది ప్రతిపక్షాల విమర్శలకు ప్రాతిపదిక అవుతుందా లేదా ? ఈ ఆయుధాన్ని ఎవరిచ్చారు, దానికి మూలం ఎవరు ? దీన్ని కుంభకోణం అనక ఏమంటారు ?


కేంద్ర ప్రభుత్వ వాక్సినేషన్‌ విధానం గురించి సాక్షాత్తూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిన విషయాన్ని చెప్పుకోనవసరం లేదు. మూడు ధరల విధానం గురించి ప్రతిపక్షాలు విమర్శించాయంటే రాజకీయం అనుకుందాం, సుప్రీం కోర్టు సంగతేమిటి ? దేశంలో వేస్తున్న వాక్సిన్‌ ధరలు-విదేశాల్లో వాటి ధరలను పోలుస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించిందా లేదా ? వాక్సిన్లకోసం 35వేల కోట్లు కేటాయించినట్లు మోడీ సర్కార్‌ పెద్ద ప్రచార ఆయుధంగా వాడుకుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారో చెప్పాలని నిలదీసింది. ఇప్పటి వరకు వాక్సిన్లను ఏ రోజు ఎన్ని కొన్నారో చెప్పమంది, ఆ మొత్తంతో 18-45 సంవత్సరాల వయస్సు వారికి వాక్సిన్లు ఎందుకు వేయకూడదో వివరించాలంది ? ఈ వివరాలన్నింటినీ సుప్రీం కోర్టు ముందు కూడా మూసిపెడుతుందా ? అంతకు ముందు ప్రతిపక్షాలు ఇదే డిమాండ్‌ చేస్తే పట్టించుకున్న దిక్కులేదు. ఇది మీడియా, ప్రతిపక్షాలకు, అన్నింటికీ మించి అంతర్జాతీయంగా నరేంద్రమోడీ ప్రతిష్టను దెబ్బతీసే ఆయుధం కాదా ? అంతకు ముందు ఆక్సిజన్‌ సరఫరా విధానం లేదంటూ తానే ఒక కమిటీని వేసిన తీరు తెలిసిందే. మోడీ, బిజెపి విమర్శకులకు ఇవన్నీ బహిరంగంగా అందుతున్న ఆయుధాలు కావా ? టూల్‌ కిట్స్‌ కాదా ?వివిధ రాష్ట్రాల హైకోర్టులు చేసిన వ్యాఖ్యలన్నింటినీ గుదిగుచ్చి చూస్తే తేలుతున్నదేమిటి ? గతంలో కాంగ్రెస్‌ తన విధానాలు, తీరుతెన్నులతో తానే ప్రతిపక్షాలకు టూల్‌కిట్లు అందించింది. ఇప్పుడు బిజెపి అదే బాటలో నడుస్తున్నది.

వాక్సిన్‌ విధానం గురించి రాష్ట్రాలు తీసుకోవాల్సిన వైఖరుల గురించి కేరళ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రాసిన లేఖలు కూడా టూల్‌కిట్లే. వాటి తయారీకి ముడి పదార్దాన్ని అందించిది నరేంద్రమోడీ సర్కారే కదా ! ప్రతిపక్షాలు బహిరంగంగా విమర్శిస్తాయి, బిజెపి ముఖ్యమంత్రులు లోలోపల కుమిలిపోతారు. పది సంవత్సరాల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నగరంలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన తీర్మానం పేరు ” మన సమాఖ్యవాదానికి పెను ముప్పు యుపిఏ ”. దానిలో ఏమి రాశారు ? రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నది, దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నది, గవర్నర్లను రాజకీయకీయ ఏజంట్లుగా పని చేయిస్తున్నది. కాంగ్రెసేతర రాష్ట్రాలు చెబుతున్నదానిని ఆమోదించటం లేదు. ఇలా సాగింది, దానిలో నూటికి నూరు పాళ్లు వాస్తవం ఉన్నది.

కానీ ఇప్పుడు అదే నరేంద్రమోడీ చేస్తున్నది ఏమిటి ? ఆ కాంగ్రెస్‌ చెప్పుల్లోనే కాళ్లు దూర్చి అంతకంటే ఎక్కువ చేస్తున్నారా లేదా ? ఇదీ టూలుకిట్టే, ప్రతిపక్షాలకు ఇచ్చిందెవరు ? కేరళ గవర్నరు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని చదవకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ చేస్తున్న రాజకీయం చూస్తున్నాం. మహారాష్ట్ర గవర్నర్‌ రాజకీయాన్ని ఎలా రక్తి కట్టించారో చూశాము. తమ ఆదేశాలను ఖాతరు చేయలేదని బెంగాల్‌ ప్రధాన కార్యదర్శిని కేంద్రానికి రావాలని ఫర్మానా జారీ చేశారు. ప్రధాని మోడీ తమ మాటలు వినటం లేదని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత సొరేన్‌ బహిరంగంగానే చెప్పారు. మంత్రులను పక్కన పెట్టి తమ రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో కేంద్ర మంత్రి మాట్లాడటం ఏమిటంటూ తమిళనాడు సర్కార్‌ ఆ సమావేశాన్నే బహిష్కరించింది. వైద్య, ఆరోగ్య విషయాలు రాష్ట్రాలకు సంబంధించినవి అని బిజెపి నేతలు ఎలుగెత్తి చాటుతున్న సమయంలోనే ఇది జరిగింది. విద్య రాష్ట్రాల అంశం కాదా ? కేంద్ర మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ చేసిందేమిటి ? డిఎంకెకు టూల్‌కిట్‌ అందించట కాదా ?


కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో దాదాపు అందరూ ముస్లింలే ఉన్నారు. గుజరాత్‌ వివాదాస్పద బిజెపి రాజకీయ నేత ప్రఫుల్‌ పటేల్‌ను దాని సామంతుడిగా నియమించి అక్కడ చిచ్చు పెట్టారు. చివరికి స్ధానిక బిజెపి నేతలకే అది నచ్చక అనేక మంది పార్టీకి రాజీనామా చేశారు. జిఎస్‌టి నుంచి కోవిడ్‌-19 అత్యవసరాలను మినహాయించాలా లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్రాల మంత్రులు కమిటీలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. ఇవన్నీ ప్రతిపక్షాలకు బిజెపి అందించిన టూల్‌కిట్స్‌ కాదా ?


సుప్రీం కోర్టు, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు కేంద్రంలో ఉన్న బిజెపి లేదా రాష్ట్రాలలో ఉన్న బిజెపి, ఇతర పార్టీలకు చురకలు, అభిశంసనల వంటివే. అయితే గతంలో ఇదే న్యాయవ్యవస్దలో వెలువడిన తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యలను మరచిపోకూడదు. భారత్‌, అమెరికా, చైనా, పాకిస్ధాన్‌ రాజ్యాంగాలు ఏవైనా అక్కడ ఉన్న న్యాయవ్యవస్ధలు పాలకవర్గాలకు అనుకూలంగా పని చేసేవే అనే అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. చైనాలో కార్మికవర్గ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ వర్గానికి అనుకూలంగా అక్కడి వ్యవస్ధ ఉంటుంది. మిగతా దేశాలలో పాలకవర్గాలు పెట్టుబడిదారులు కనుక వాటికి అనుకూలంగా న్యాయవ్యవస్దలు ఉంటాయి. కొన్ని అంశాల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం అంటే పుట్టి మునుగుతుంది జాగ్రత్త పడమనే హెచ్చరిక అని ఎందుకు అనుకోకూడదు. గాంధీ పుట్టిన దేశంలోనే గాడ్సే కూడా పుట్టాడు. అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా పొగిడిన నోటితోనే ఆ రాజ్యాంగాన్నే దెబ్బతీసే శక్తులను భక్తితో కొలిచే ప్రబుద్దులను చూస్తున్నాము.

న్యాయవ్యవస్ధకు మొత్తంగా దురుద్దేశ్యాన్ని ఆపాదించటం లేదు. పాలనా విధానాలకు అనుగుణ్యంగా వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. అందువలన ఆ వ్యవస్ధలోని వారి తీరు తెన్నులను విమర్శనాత్మకంగా చూడక తప్పదు. పైన చెప్పుకున్న న్యాయమూర్తుల వ్యాఖ్యలు, కోర్టుల నిర్ణయాలు నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూడకపోతే ఇబ్బందుల్లో పడతాము. రాజ్యాంగ పదవుల్లో, రక్షణలతో ఉన్న వారు రాజకీయ నేతలను పొగడటాన్ని ఎలా అర్దం చేసుకోవాలి. పదవీ విరమణ చేయగానే ఎంపీ నామినేషన్‌ పోస్టును తీసుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి గొగోరు న్యాయవ్యవస్ధకు, సమాజానికి ఎలాంటి సందేశమిచ్చారు. సుప్రీం కోర్టు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా 2020లో అంతర్జాతీయ న్యాయ సమావేశంలో మాట్లాడుతూ ” ప్రధాని నరేంద్రమోడీ అంతర్జాతీయ ప్రశంసలు పొందిన దార్శనికుడు, ప్రపంచ దృష్టితో ఆలోచిస్తూ స్ధానికంగా పని చేసే బహుముఖ ప్రజ్ఞాశాలి ” అని ప్రశంసలు కురిపించారు. ఆ సమావేశంలో ఇరవై దేశాలకు చెందిన న్యాయమూర్తులు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఉన్నారు.( అలాంటి ప్రజ్ఞాశాలి కరోనా విషయంలో ఏం చేశారో యావత్‌ ప్రపంచం చూస్తున్నది) ఒక స్వతంత్ర వ్యవస్ధలో ఉన్నత స్ధానంలో ఉన్న వారే అలా పొగిడి ఎలాంటి సందేశాన్ని జనానికి పంపినట్లు ? అంతకు ముందు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉండి తరువాత పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎంఆర్‌ షా చెప్పిందేమిటి ? ” మోడీ ఒక ఆదర్శం, ఒక హీరో ” అన్నారు.


అధికారంలో ఉన్న వారిని పొగడటం ప్రయోజనాలు పొందటం నరేంద్రమోడీ హయాం కంటే ముందే కాంగ్రెస్‌ పాలనలోనే ప్రారంభమైంది.1980 ఎన్నికల్లో విజయం సాధించగానే ఇందిరా గాంధీని పొగుడుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న పిఎన్‌ భగవతి ఒక లేఖ రాశారు. అత్యవసర సమయాల్లో పౌరుల ప్రాధమిక హక్కులను తీసివేయవచ్చని ఒక హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ కేసులో మెజారిటీ తీర్పు ఇచ్చిన వారిలో భగవతి ఒకరు . ఆ కేసులో జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా అసమ్మతి తీర్పు రాశారు. దానికి గాను ఆయనకు రావాల్సిన ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కలేదు. దానికి నిరసనగా ఆయన న్యాయమూర్తి పదవికి 1977లో రాజీనామా చేశారు. మరోవైపున ముగ్గురు న్యాయమూర్తుల సీనియారిటీని పక్కన పెట్టి భగవతిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. రాజకీయ నేతలను పొగిడే న్యాయమూర్తులకు ఇవన్నీ తెలియవా, ప్రభావితం చేయవా ? అలాంటి వారు పక్షపాతం లేని తీర్పులు ఇస్తారంటే జనం నమ్ముతారా ? న్యాయవ్యవస్ధ మీద నమ్మకం ఉంటుందా ? ఇప్పటికే మూడు రాజ్యాంగ వ్యవస్ధలోని కార్యనిర్వాహక వ్యవస్దను, శాసనవ్యవస్ధలను ఎలా నీరుగారుస్తున్నారో చూస్తున్నాము. న్యాయవ్యవస్ధను కూడా తమ అదుపులోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నం ప్రారంభమైంది. పురుషులందరు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా న్యాయమూర్తులలో కూడా తేడాలున్నాయని ముందే చెప్పుకున్నాము. అదే పాలకులకు నచ్చదని కరోనా వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న న్యాయమూర్తుల మీద మింగా కక్కలేకుండా ఉన్న పాలకులను చూస్తున్నాము. తమ పీఠాలకు ముప్పు అనుకుంటే న్యాయవ్యవస్దను కూడా ఎలా దిగజారుస్తారో లాటిన్‌ అమెరికాతో సహా అనేక దేశాల్లో చూశాము. అలాంటి పరిస్ధితే మన దేశం కూడా రానుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నల్లధనం కేసులో గిల గిలా కొట్టుకుంటున్న కేరళ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి !

03 Thursday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

BJP Hawala Case, Kerala BJP, Kerala RSS, Kodakara Hawala Case


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. నిజమే అని నమ్మిన వారు కోరినంత నల్లధనాన్ని పంపారు. దాన్ని పంచుకోవటం లేదా దొంగ డబ్బు కనుక లెక్కా పత్రం ఉండదు కనుక బొక్కేసిన వారి మధ్య వచ్చిన తేడా వంటి కారణాలతో బయట పడి పార్టీ రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో ఊహించుకోవాల్సిందే. ఆ డబ్బంతా హవాలా మార్గంలో వచ్చిన నల్లధనం అని వేరే చెప్పనవసరం లేదు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు ఇంకా ఎక్కువే అని తేలింది,మూడున్నర కోట్లుగా చెబుతున్నారు. ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. ఈ ఉదంతంలో రాష్ట్ర బిజెపి, ఆర్‌ఎస్‌ఎన్‌ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో పార్టీలోని రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు పోలీసులు కోటి రూపాయల దొంగడబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయక ముందే బిజెపి నేతలకు దొంగడబ్బు మాయం గురించి తెలుసునని వెల్లడైంది.


తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌, ఆయన అనుయాయులు మాత్రమే మాట్లాడుతుండగా మిగతావారు మౌనం దాలుస్తున్నారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది ఇప్పుడు చర్చ. చివరికి మెట్రోమాన్‌ శ్రీధరన్‌ను పాలక్కాడ్‌లో ఓడించేందుకు కొందరు బిజెపి నేతలు ప్రత్యర్ధికి ఓట్లను అమ్ముకున్న కారణంగానే అరవైవేల ఓట్లు రావాల్సింది 50వేలు వచ్చాయనే ఫిర్యాదు కూడా కేంద్రానికి పంపారు.


గిరిజన నాయకురాలిగా మీడియా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన సికె జాను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఐదు అసెంబ్లీ స్దానాల్లో పోటీ చేసేందుకు, కేంద్రంలో మంత్రిపదవికోసం బేరమాడినట్లుగా అందుకోసం పది కోట్ల రూపాయలు కావాలని డిమాండ్‌ చేయగా సురేంద్రన్‌ కేవలం పదిలక్షల రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు ఆపార్టీ కోశాధికారి ప్రసీత మీడియాకు చెప్పారు. పదిలక్షలు తీసుకొని పోటీ చేసేందుకు జాను అంగీకరించిన విషయాన్ని ప్రసీత ఫోను ద్వారా సురేంద్రన్‌కు చెప్పగా తిరువనంతపురంలో జాను బసచేసిన హౌటల్‌కు పంపినట్లు ఆమె చెబుతున్నారు. ఈ మేరకు వారి ఫోను సంభాషణ ఆడియోను స్వయంగా ప్రసీత విడుదల చేశారు. కొడక్కరలో పట్టుబడిన దొంగ డబ్బు కేసులో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసిన మొత్తం కంటే ఎక్కువ సొమ్మునే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో సురేంద్రన్‌ వంటి బడానేతలు కూడా ఉన్నారని దొరికిన వారు చెప్పటంతో వారిని కూడా ప్రశ్నిస్తారని వార్తలు వచ్చాయి. గురువారం నాడు సురేంద్రన్‌ కోజికోడ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ సికె జాను నన్ను డబ్బు అడగలేదు, ఆమెకు పైసా కూడా ఇవ్వలేదు అన్నారు. ఆమె పార్టీలో అంతర్గత తగాదాల కారణంగా ఆడియోలు బయటకు వచ్చి ఉండవచ్చన్నారు. పోలీసులు పిలిచిన వారందరూ విచారణకు వెళుతున్నారు తప్ప కోర్టును ఆశ్రయించలేదు,భయపడలేదు. కొడక్కరలో దొరికింది నల్లధనమో, తెల్లధనమో నాకు తెలియదు. ఆడియో సంభాషణ తనది కాదు అన్నారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ముస్లిం లీగ్‌, సిపిఎం మద్దతుదారులు ఉన్నారని సురేంద్రన్‌ ఆరోపించారు.


ఆడియో సంభాషణ బయటకు వచ్చిన దృష్టా పార్టీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం కనిపిస్తోందని సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ చెప్పారు. లేనట్లయితే రాష్ట్రంలో పార్టీ అసంగత సంస్ధగా మారిపోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరువు పోయిందని, దీనికి సురేంద్రనే కారణమని అన్నారు. నిధుల చెల్లింపులకు సంబంధించి పరస్పర విరుద్దంగా పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. పార్టీలో ఏం జరుగుతోందో కేంద్ర పెద్దలకు తెలుసునని, తనను సంప్రదిస్తున్నారని, విచారణ కూడా జరుపుతున్నారని ముకుందన్‌ చెప్పారు.


ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు. సురేంద్రన్‌ చేసిన ప్రకటనను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ కోశాధికారి ప్రసీత బహిరంగ సవాలు చేశారు. ఆడియో నిజమైనదో, నకిలీదో కావాలంటే పరీక్షలు జరపాలన్నారు. తిరువనంతపురంలోని హొరైజన్‌ హౌటల్‌లో సికె జానుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ డబ్బు అందచేశారన్నారు. అంతకు ముందు తనకు ఫోన్‌ చేశారని కావాలంటే నిర్ధారించుకోవచ్చన్నారు. రెండు నిషేధిత సంస్దలతో జానుకు సంబంధాలు ఉన్నాయని, కొంత మంది ఆమెను కలిశారని, డబ్బును వాటి కార్యకలాపాలకు వినియోగించి ఉండవచ్చు అన్నారు.


ఇదిలా ఉండగా ఎన్నికల నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాల కారణంగా జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జానును తొలగించినట్లు రాష్ట్రకమిటీ ప్రకటించగా తాను పదవిలోనే ఉన్నట్లు ఆమె చెప్పారు. అవసరమైతే పార్టీ నేతలతో స్వయంగా మాట్లాడతాను తప్ప మధ్యవర్తులనెవరినీ నియమించలేదని, తన పేరుతో వారేమైనా డబ్బు తీసుకున్నారో తెలియదు కనుక విచారణ జరపాలని సికె జాను చెప్పారు. ఆమె పోటీ చేసిన సుల్తాన్‌ బాతరే నియోజకవర్గంలో ఎన్‌డిఏ ప్రచారం నిమిత్తం కోటీ 25లక్షల ఖర్చుకు సంబంధించిన వివరాలు బయటకు రావటం దొంగడబ్బు వివాదాన్ని మరో మలుపు తిప్పింది. కోజికోడ్‌ నుంచి రెండు కార్లలో కోటీ 25లక్షలు సుల్తాన్‌బాతరేకు తరలించారని, అక్కడ కొంత సొమ్ము ఇచ్చి మిగిలిన మొత్తాన్ని కొడకర పద్దతుల్లో పంపిణీ చేశారని వార్తలు వచ్చాయి.
ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు ఇప్పుడు చెబుతున్నారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా తెలుస్తోంది. అయితే అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని మరొకొ సందర్భంగా చెప్పారు. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది.పార్టీ ఆఫీసులోని వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు. మొత్తం మీద చివరకు వెల్లడయ్యే వివరాలు కేరళలో బిజెపికి తద్వారా కేంద్ర నాయకత్వానికి తలవంపులు తేవటం ఖాయం అని చెప్పవచ్చు.

మూడున్నర కాదు కేరళ బిజెపి దొంగ సొమ్ము ఇప్పటికి 9.8 కోట్లు !

పోలీసులు తవ్విన కొద్దీ బిజెపి కేరళ ఎన్నికల దొంగ సొమ్ము బయటకు వస్తోంది.కొడక్కర వంతెన వద్ద తమ కారును ఆపి సొమ్ము దోపిడీ చేశారంటూ కారు డ్రైవర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు జరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు కర్ణాటక నుంచి వచ్చిన దొంగ సొమ్ముతో బిజెపి అభ్యర్ధులు విచ్చలవిడిగా ఖర్చు చేసింది కొంతైతే దాచుకున్నది ఎంతో అన్నది అంతుచిక్కటం లేదు. రోజు రోజుకూ మరింత సమాచారం వెల్లడికావటంతో దిక్కుతోచని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నష్టనివారణతో పాటు కేరళ ప్రభుత్వంపై ఎదురుదాడికి మార్గాలు వెతుకుతున్నారు.ధర్మరాజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత త్రిస్సూర్‌కు తెచ్చిన దొంగ సొమ్ము 9.8 కోట్లని పోలీసులు చెప్పారు. దీనిలో త్రిస్సూర్‌లోని ఒక వ్యక్తికి 6.30 కోట్లు ఇచ్చిన తరువాత మిగతా సొమ్మును వేరే చోటికి తరలిస్తూ దోపిడీ కట్టుకధలు అల్లారని తేలుతోంది. ధర్మరాజన్‌ అంతకు ముందు కూడా సొమ్మును తెచ్చారని, అది ఎంత, ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాల మీద పోలీసులు కేంద్రీకరించారు. త్రిస్సూరు నియోజకవర్గంలో బిజెపి రాజ్యసభ ఎంపీ సురేష్‌ గోపి పోటీ చేసి మూడవ స్ధానంలో నిలిచారు. అక్కడ ఖర్చుల కోసం రెండు కోట్లు ఇచ్చినట్లు తేలింది.

మంజేశ్వరమ్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కేవలం 89 ఓట్ల తేడాదో ఓడిపోయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అక్కడ కె సుంద్రా అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉండటంతో తన మద్దతుదార్లు పొరపాటున సుందర్‌కు ఓటు వేసిన కారణంగా తాను ఓటమి పాలైనట్లు సురేంద్రన్‌ భావించారు.ఈ సారి కూడా అదే వ్యక్తి బిఎస్‌పి అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు. అయితే దాన్ని ఉపసంహరించుకోవాలని కోరటంతో తనకు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని, సురేంద్రన్‌ గెలిస్తే పక్కనే ఉన్న కర్ణాటకలో ఒక మద్యం షాపు ఇప్పించాలని సుంద్రా డిమాండ్‌ చేశాడు. అయితే రెండున్నర లక్షల రూపాయలు , పదిహేను వేల రూపాయల విలువ గల ఫోను ఇచ్చారు. మిగతా కోర్కెల గురించి ఎన్నికల తరువాత చూద్దాం లెమ్మని సురేంద్రన్‌ స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారని, స్ధానిక బిజెపి నేతలు తనకు సొమ్ము ఇచ్చినట్లు ఉపసంహరణ అనంతరం అతను బిజెపిలో చేరుతున్నట్లు ఒక సభలో ప్రకటన కూడా చేశారు. నామినేషన్‌ ఉపసంహరణకు ముందు రోజు తమ అభ్యర్ధి కనిపించటం లేదంటూ బిఎస్‌పి నేతలు పోలీసు సేష్టన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కొడక్కర దొంగ సొమ్ము ఉదంతం బయటకు వచ్చిన తరువాత సదరు సుంద్రా ఈ విషయాలన్నీ స్వయంగా బయట పెట్టాడు. వాటి ఆధారంగా బిజెపి నేత సురేంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంజేశ్వరమ్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి వివి రమేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సురేంద్రన్‌తో పాటు స్ధానిక బిజెపి నేతల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.తాను డబ్బు ఇచ్చిన విషయాన్ని బయట పెట్టిన తరువాత బిజెపి నేతలు తమ కుటుంబం మీద వత్తిడి తెస్తూ అలాంటిదేమీ లేదని చెప్పాలని, సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని సుంద్ర చెప్పాడు. తన తల్లి మీద వత్తిడి తెచ్చారని, ఆ సొమ్మంతా ఖర్చయిపోయిందని, తాను తిరిగి ఇవ్వలేనని , ఈ విషయాలను వెల్లడించటానికి తన మీద ఎవరి వత్తిడీ లేదని సుంద్ర చెప్పాడు. ఇతను ఇప్పుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటున్నాడు.

దొంగ సొమ్ము పంపిణీదారైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ అనేక మంది బిజెపి నేతలతో ఫోన్‌ ద్వారా సంభాషించాడు. వారిలో సురేంద్రన్‌ కుమారుడితో పలుమార్లు మాట్లాడినట్లు బయటపడింది. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దొంగ సొమ్ము ఉదంత దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని, పట్టుబడిన సొమ్ము తీవ్ర ఆర్ధిక నేర స్వభావం కలిగినదని , అయినా పట్టించుకోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మీద చర్య తీసుకోవాలని కోరుతూ లోక్‌తాంత్రిక్‌ యువ జనతా దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్‌ మాదవుర్‌ కేసు దాఖలు చేశారు. దీని గురించి ఇడి అధికారులకు నోటీసలు ఇవ్వగా తమకు సమయం కావాలని కోరారు, పది రోజుల్లో తీసుకున్న చర్యలను కోర్టుకు దాఖలు చేయాలని ఆదేశించారు. సీనియర్‌ బిజెపి నేత సికె పద్మనాభన్‌ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఉప్పు తిన్న వారు నీరు తాగటం ప్రకృతి ధర్మమని అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే అన్నారు.కొడకర దొంగ సొమ్ము ఉదంతంలో తవ్విన కొద్దీ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని, మరింత సమగ్ర దర్యాప్తు జరపాలసి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు కొడియరి బాలకృష్ణన్‌ అన్నారు. దొంగ సొమ్ము గురించి వార్తలు రాగానే ఇడి వెంటనే రంగంలోకి దిగుతుందని, కానీ ఈ ఉదంతంలో పట్టనట్లుగా వ్యవహరిస్తుండటాన్ని బట్టి దాని వైఖరి ఏమిటో వెల్లడైందన్నారు. భవిష్యత్‌లో తాము ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌కు పోటీగా వస్తామని భయపడుతున్నవారు తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, పధకం ప్రకారం నాశనం చేయాలని చూస్తున్నారని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనం రాజశేఖరన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో ఆరోపించారు. గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్ధానంలో రాజశేఖరన్‌ నిలిచిన విషయం తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు ధరల పెంపుదల- బిజెపి ద్వంద్వ ప్రమాణాలు, మోసకారి తనం !

02 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ 1 Comment

Tags

BJP, BJP double standards, India fuel price increase, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మా పార్టీ తీరే వేరు, ఓట్ల కోసం కక్కుర్తి పడం, ఎన్నికలు వచ్చాయని అవకాశవాదంతో వ్యవహరించం, గెలుపుకోసం అడ్డదారులు తొక్కం, చేయదలచుకున్నది సూటిగా చెబుతాం అని బిజెపి చెప్పుకుందా లేదా ? కానీ చేస్తున్నదేమిటి ? సాధారణ రోజుల్లో ధరల పెరుగుదల గురించి అడిగితే వాటితో ప్రభుత్వానికి ఏమిటి సంబంధం ? చమురు కంపెనీల వ్యవహారం అది, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే పెంచుతారు, తగ్గితే తగ్గిస్తారు మధ్యలో ప్రభుత్వానిదేముంది అన్నారు. కరోనా తొలి దశలో రికార్డు స్ధాయిలో ముడిచమురు ధరలు పడిపోయినపుడు దానికి అనుగుణంగా ధరలు తగ్గించలేదు. ఎందుకయ్యా అంటే అంతర్జాతీయ ధరలు తగ్గినంత మాత్రాన మన చమురు కంపెనీల ఖర్చులు తగ్గుతాయా? చమురు బంకుల వారి నిర్వహణ వ్యయంలో మార్పు ఉంటుందా ? లాక్‌డౌన్‌ వలన వినియోగం పడిపోయింది అందుకే ధరలు తగ్గించలేదు అని సమర్ధిస్తూ సంఘపరివార్‌ దళాలు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించిన వారి మీద దాడి చేశాయి.


నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత రాష్ట్ర ఎన్నికల సమయంలో జరిగిందేమిటి ? ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు చమురు ధరలు స్ధిరంగా ఉన్నాయి. ఎందుకని, ఎలా సాధ్యమైంది? లాక్‌డౌన్‌ లేదు, చమురు వినియోగమూ తగ్గినదాఖలా లేదు. జనం పట్ల నిబద్దత, శ్రద్ద ఉన్న ప్రభుత్వం అందునా ఎన్నికల కోసం అసలు ఏమాత్రం కక్కుర్తి పడం అని ప్రమాణాలు చేసిన వారు ఏ నాడైనా ధరలు స్ధిరంగా ఎందుకున్నాయి అని చమురు కంపెనీలను ఆరాతీయలేదు ? పోనీ ఎన్నికల తరువాత దాదాపు ప్రతి రోజూ లేదా రోజు మార్చి రోజు ఎందుకు పెంచుతున్నారు అని ఎవరైనా ప్రశ్నించారా ? ఎవరి కనుసైగలతో ప్రభుత్వ చమురు కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. జనం చెవుల్లో పూలు పెట్టుకున్న అమాయకులని అనుకుంటున్నారా ?


కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా చమురు ధర మార్పుల వివరాలను పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ పేరుతో ప్రకటిస్తుంది. ఆ వివరాలు, 2021 జనవరి నుంచి ముడి చమురు, ఆయా నెలల్లో హైదరాబాదులో పెట్రోలు ధరలు ఎలా ఉన్నాయో దిగువ చూడవచ్చు.


నెల ××××× ముడిచమురు (డా) ××××× పెట్రోలు ధర రు.
జనవరి ××× 54.41 ××××××× 87.02 – 89.75
ఫిబ్రవరి ×× 60.12 ××××××× 89.75 – 94.77
మార్చి ××× 64.87 ××××××× 94.77 – 94.14
ఏప్రిల్‌- ×× 63.18 ××××××× 94.14 – 93.97
మే 28 ××× 66.76 ××××××× 93.97 – 97.43

జూన్‌ రెండవ తేదీన లీటరు పెట్రోలు ధర రు.98.27కు పెరిగింది. ఈ కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులలో ఎలాంటి మార్పు లేదు. జనవరిలో 54.41 నుంచి ఫిబ్రవరిలో 60.12 డాలర్లకు అంటే 5.71 డాలర్లు పెరిగినా వినియోగదారుల ధరలో వచ్చిన మార్పు రు. 5.02 తరువాత మార్చినెలలో 4.75 డాలర్లు పెరిగినా వినియోగదారుల ధర అంతకు ముందు నెలతో పోలిస్తే మొత్తంగా 63 పైసలు తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడి చమురు ధర 1.69 డాలర్లు తగ్గితే వినియోగదారుల ధర 17పైసలు తగ్గింది. మే నెలలో ముడిచమురు ధర 3.58 డాలర్లు పెరిగితే వినియోగదారులకు జూన్‌ రెండు నాటికి పెరిగిన ధర 4.30. దీనికి అడ్డగోలు, అధికార పార్టీకి తోడ్పడే అక్రమం తప్ప మరొకటి కాదు. చమురు కంపెనీలు బిజెపికి లబ్ది చేకూర్చేందుకు ధరలను అదుపులో ఉంచి అవసరం తీరిన తరువాత ఏకంగా బాదుడు ప్రారంభించాయన్నది స్పష్టం. మరి దీని గురించి సామాజిక మాధ్యమంలో పరివార్‌ దళం మాట్లాడదేం.


బిజెపి సీరియల్‌ను ఏడు సంవత్సరాల ముందుకు తిప్పితే స్మృతి ఇరానీ వంటి వారు గ్యాస్‌ ధరల పెరుగుదల గురించి సిలిండర్లు మోసి ప్రదర్శనలు చేశారు, ధరలు పెరిగితే సరకులమ్మే నటన చేశారు. చమురు ధరలు పెరిగితే ఎడ్ల బండ్లను లాగారు. ఇప్పుడెక్కడా బిజెపి వైపు నుంచి ప్రదర్శనలు లేవేం. తాము అధికారంలో ఉంటే ఒక నీతి, వేరే పార్టీలు ఉంటే ఒక రీతా ? వీటిని ఏమని పిలవాలి ?ద్వంద్వప్రమాణాలు అందామా పక్కా మోసం గురూ అని చెప్పాలా ?


పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వధాభిరామా వినురవేమా అన్నారు మహాకవి వేమన. రాజకీయ పార్టీలలో తమ పార్టీ వేరయా అని స్వయంగా బిజెపి కితాబు ఇచ్చుకుంది. ఇక్కడే ఉంది కిటుకు. దీనికి మూలం, స్ఫూర్తి ఎవరు అంటే స్వదేశీ కాదు, పక్కా విదేశీ జర్మన్‌ నాజీ హిట్లర్‌ ప్రచార మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌. ఒక అబద్దాన్ని వందసార్లు పునశ్చరణ చేస్తే 101వ సారికి అది నిజమై కూర్చుంటుంది. బిజెపి విషయంలో కూడా అదే జరిగిందో లేదో ఎవరికి వారు గుర్తుకు తెచ్చుకోవాలి. ఏ విషయంలో కాంగ్రెస్‌కు భిన్నంగా ప్రవర్తించింది ? ఎంపీలు, ఎంఎల్‌ఏలు కాంగ్రెస్‌ అధిష్టానం మీద వత్తిడి తీసుకురాకుండా కట్టడి చేసేందుకు, తోక ఝాడిస్తే కత్తిరిస్తామని చెప్పేందుకే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారన్నది తెలిసిందే. దాని వలన విడిగా వెళ్లే వారు సామూహిక ఫిరాయింపులకు తెరతీశారు. బిజెపి ఆ చట్టాన్ని అపహాస్యం చేస్తూ కొత్తపుంతలు తొక్కి సామూహిక ఫిరాయింపులను కట్టడి చేస్తూ నిబంధనలు మార్చటంతో ఎంత మంది అవసరం అయితే అంతమందితో రాజీనామాలు చేయించి ప్రభుత్వాలను కూల్చటం, తాము గద్దెనెక్కి తరువాత వారిని పార్టీ పేరుతో గెలిపించుకొనే పర్వానికి తెరలేపింది. ఇది నిజాయితీ కలిగిన వారు చేయాల్సిందేనా ? విలువల వలువలు కప్పుకున్నవారు అంతనిస్సిగ్గుగా వాటిని విప్పి పక్కన పడేయటాన్ని ఏమనాలి ? ద్వంద్వ ప్రమాణమా, దిగజారుడా ?

అన్నట్లు గుర్తుకు తెచ్చుకోవాలి అంటే జనాలకు మతిమరుపు ఎక్కువ అన్నది కొందరి గట్టి విశ్వాసం కదా ! కాకపోతే ఏమిటి చెప్పండి. గత సంవత్సరం కరోనా ప్రారంభంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌ తబ్లిగీ సమావేశాలకు అనుమతి ఇచ్చిందెవరు ? అప్పటికే కొన్ని దేశాలలో జరిగిన తబ్లిగీ సమావేశాలలో పాల్గొన్నవారికి కరోనా వైరస్‌ సోకిందని తెలిసినప్పటికీ ఆయా దేశాలు వారికి లేదా వాటిలో పాల్గొన్నవారికి వీసాలు ఇచ్చి మరీ ఢిల్లీకి అనుమతించింది ఏ సర్కార్‌ ? విదేశాల్లో తబ్లిగీ సమావేశాలను కొన్ని చోట్ల అర్ధంతరంగా నిలిపివేసి పాల్గొన్నవారిని స్వస్ధలాలకు పంపిన విషయమూ తెలిసి కూడా అనుమతి ఇచ్చారే ! వారెవరు, బిజెపి పెద్దలే కదా కేంద్ర అధికారంలో ఉంది, ఢిల్లీ పోలీసు యంత్రాంగం అంతా కేంద్ర సర్కార్‌ ఆధీనంలోనే కదా పని చేసేది ! తీరా సంఘపరివారం, వారితో గొంతు కలిపిన మీడియా దేశంలో కరోనా విస్తరించటానికి వారే కారణం అని నానా యాగీ చేశారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టారు. సామూహిక నమాజులపై ఆంక్షలు విధించారు. వారిని అరెస్టు చేశారు. ఇవన్నీ ఇప్పుడు జనానికి గుర్తు ఉండకపోవచ్చు. కానీ ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారంలో ఉన్న పెద్దలకు ఉండవా ?


మొదటి దశకంటే తీవ్రంగా కరోనా పెరుగుతున్న దశలో కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది జనం గుమికూడటానికి అనుమతించటాన్ని ఏమనాలి ? ద్వంద్వ ప్రమాణమా, మేము మెజారిటీ మా ఇష్టం ఏమైనా చేసుకుంటాం అడగటానికి ఎవరు అనే పెత్తందారీ తనమా ? పాకిస్తానీ ముస్లిం మత పెద్దలు దేవుడు మాతో ఉన్నాడు కరోనా మమ్మల్నేమీ చేయదు, మనం నిదురపోతుంటే కరోనా కూడా నిదురపోతుంది అని చెప్పి నిబంధనలు ఉల్లంఘించి జనం ప్రాణాల మీదకు తెచ్చారు. వారి కంటే తెలివిగలవారమని అనుకునే బిజెపి పెద్దలు ఏం చెప్పారు? గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నందున కరోనా అంటదు, మునిగి పుణ్యం పొందండి అని ఉత్తరాఖండ్‌ బిజెపి ముఖ్యమంత్రి రావత్‌, ఇతర బిజెపి మంత్రులు, నేతలు జనాన్ని ప్రోత్సహిస్తుంటే దేశమంతటా కరోనా నిబంధనలు పాటించాలని ఉద్బోధలు చేస్తున్న నరేంద్రమోడీ బాబా ఏం చేశారు. నోరు మూసుకున్నారు. అఖాడాలు, కొందరు సాధువులు కరోనాతో దిక్కులేని చావు చచ్చిన తరువాత కుంభేమేళా వైరస్‌ అంటూ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత నిలిపివేయాలని విధిలేక పిలుపు నిచ్చారు. దీన్నేమందాం ద్వంద్వప్రమాణాలు అని గాక ఇంకేదైనా గౌరవ ప్రదమైన వర్ణన ఉందా ?

ఇంతవరకు దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో తమకు తాముగా గొప్పల ముద్ర వేసుకున్న పార్టీ బిజెపి తప్ప మరొకటి లేదు. కొత్త బైరాగికి పంగనామాలు ఎక్కువ అన్నట్లు లేని వాటిని తగిలించుకొని ప్రచారం చేసుకుంది. దీనికి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది. హిట్లర్‌, ముస్సోలినీ వంటి నియంతలు, ఫాసిస్టులకు అనుకరణ, ఎత్తుగడల పర్యవసానమే. ఆ పార్టీ కొలిచే దేవుళ్లలో ఒకరైన వినాయక దామోదర సావర్కర్‌ ఒకరు. ఈ పెద్దమనిషినే సంఘపరివారం వీర సావర్కర్‌ అని గౌరవంగా పిలుచుకుంటుంది. ఆయనకు సదరు వీర అనే బిరుదు ఎవరిచ్చారు అని అడగండి ఎవరి దగ్గర నుంచైనా సాధికారికమైన సమాధానం వస్తుందేమో ! రాదు, మరి ఎలా వచ్చింది, ఆ పెద్దమనిషే చిత్రగుప్త అనే మారు పేరుతో తన గురించి ఒక పుస్తకం రాసుకున్నారు. దానిలో తన వీరత్వం, శూరత్వం గురించి పొగుడుతూ తానే రాసుకున్నారు. ఆ పుస్తకం పునర్ముద్రణకు ముందు దాన్ని చదివి నిజమే కామోసు అనుకొని అలా పిలిచారంటే అర్ధం ఉంది. కానీ సదరు పుస్తక పునర్ముద్రణ సందర్భంగా దానిలో సదరు చిత్రగుప్త మరెవరో కాదు సావర్కరే అని రాశారు. తరువాత కూడా అదే ప్రచారం చేస్తున్నారంటే ఏమనుకోవాలి. అనేక మంది కొన్ని సంస్దల పేరుతో ప్రాంతీయ, ప్రపంచ అవార్డులు, బిరుదులూ ప్రకటించుకుంటూ ఉంటారు. వాటి చిరునామా కోసం ప్రయత్నిస్తే మనకు ఎక్కడా దొరకవు. నకిలీ పట్టాలు ఇచ్చే వారు ఉన్నపుడు నకిలీ అవార్డులు, బిరుదులకు కొదవేముంటుంది.


రూపాయి విలువ గురించి బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పెద్ద రాజకీయం చేశారు. ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం యుపిఏ పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది. కాంగ్రెస్‌ కారణంగా రూపాయి ఐసియులో ఉంది. కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు మిమ్మల్ని కాపాడాలా రూపాయిని కాపాడాలా అన్నారు ? యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వస్తే 45 రూపాయల స్ధాయికి పెంచుతానని చెప్పింది.

అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.’పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని ” లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని కూడా రవిశంకర ప్రసాద్‌ చమత్కరించారు. అదేమో గానీ నరేంద్రమోడీ వయస్సును మించి పోయింది. యుపిఏ పాలనలో 2013 ఆగస్టు 2న రూపాయి 68.85కు పడిపోయి అప్పటికి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తరువాత మోడీ అధికారానికి వచ్చిన 2014లో మే 26నాటికి రు.58.42కు పెరిగింది. అప్పటి నుంచి గత ఏడు సంవత్సరాలలో పతనమే తప్ప ఆ స్ధాయికి బలపడలేదు. మధ్యలో 75 వరకు పతనం అయినా ఇప్పుడు 73 రూపాయలకు అటూ ఇటూగా ఉంటోంది. ఈ పతనం గురించి ఎందుకు మాట్లాడరు ? కారణాలేమిటో ఎప్పుడైనా వివరించారా ? ద్వంద్వ ప్రమాణాలు, ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు అన్నట్లు జనాన్ని తప్పుదారి పట్టించటం కాదా ?

గోవధ, గొడ్డు మాంసం గురించి ఒక ప్రాంతంలో ఒక వైఖరి, మరొక చోట దానికి భిన్న వైఖరి.ఈశాన్య రాష్ట్రాలలో, గోవాలో గొడ్డు మాంసానికి అనుకూలంగా మాట్లాడతారు, వాగ్దానాలు చేస్తారు. కేరళలో నాణ్యమైన గొడ్డుమాంసం లభ్యమయ్యేట్లు చూస్తామని వాగ్దానాలు చేసిన బిజెపి అభ్యర్దులను చూశాము. బీహార్‌ ఎన్నికల సమయంలో తమకు అధికారమిస్తే అందరికీ ఉచితంగా వాక్సిన్లు వేస్తామని చెప్పారు. తొలుత దేశమంతటికీ ఉచిత వాక్సిన్లు అని చెప్పి, దానికోసం వేల కోట్ల నిధులు కూడా కేటాయించామని ప్రచారం చేసుకున్నారు. తీరా నలభై అయిదు సంవత్సరాల పైబడిన వారికే మా బాధ్యత, మిగతావారు రాష్ట్రాలు చూసుకోవాలి లేదా ప్రయివేటుగా వేయించుకోవాలని చెప్పారు. వాక్సిన్‌ ధరలు కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రానికి ఒక ధర, ప్రయివేటుకు మరొకటన్నారు. వీటిని ద్వంద్వ ప్రమాణాలు అంటారా, ఏమనాలి? ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత అని చెబుతారు, పోనీ మాకు ఎలాంటి బాధ్యత లేదు అని ప్రకటిస్తారా అంటే అదీ లేదు. అసలు ఒక విధానం ఉందా అని సర్వోన్నత న్యాయస్ధానం ప్రశ్నిస్తే జవాబు చెప్పరు. రాజ్యాంగంలో సాధారణ ఆరోగ్యం రాష్ట్రాలదే అని చెప్పారు. కాని ఇప్పుడు వచ్చింది మహమ్మారి కదా ? మహమ్మారుల గురించి చెప్పలేదు. వాటిని కలసికట్టుగా ఎదుర్కోవాలి తప్ప ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేపట్టేది కాదు. ఇది అంతర్జాతీయ సమస్య అని ప్రపంచ సంస్ధల్లో బాధ్యత వహించాల్సింది రాష్ట్రాలు కాదు, కేంద్రం అని ఇలాంటి వారికి ఏ భాషలో చెబితే అర్ధం అవుతుంది. జవాబుదారీ తనంతో వ్యవహరించే వారు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ?


తాజా ఉదంతానికి వస్తే ప్రస్తుతం మన దేశంలో వ్యాపిస్తున్న బి.1.617 వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక శాస్త్రీయ నామం పెట్టింది. ఆపేరుతోనే వ్యవహరించాలి. ఇటీవలి కాలంలో తలెత్తిన కొన్ని వైరస్‌లు వాటితో వచ్చిన వ్యాధుల పేర్లపై అభ్యంతరాలు రావటం, కొన్ని అవాంఛనీయ పరిణామాలు తలెత్తటంతో ప్రపంచ ఆరోగ్య సంస్ద వివిధ అంతర్జాతీయ సంస్దలతో చర్చించిన తరువాత వైరస్‌లు, వ్యాధులకు ఒక దేశ, ప్రాంత, నగర,జాతి, వ్యక్తులు, జంతువుల పేర్లు పెట్టకూడదనే మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉదాహరణకు గతంలో స్పానిష్‌ ఫ్లూ అనే పేరుతో పిలిచిన దానికి స్పెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదు, అది అమెరికా నుంచి వ్యాప్తి చెందినట్లు తేలింది. అలాగే స్వైన్‌(పంది) ఫ్లూ. ఈ పేరుతో ప్రచారం కాగానే ఆహారానికి వినియోగించే ఆ జంతువులను విచక్షణా రహితంగా చంపివేయటానికి దారి తీసింది. అలాగే ‘మెర్స్‌ ‘ ఇది కూడా వివాదాస్పదమైంది. మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ అని పేరు పెట్టటంతో మధ్య ప్రాచ్య దేశాల మీద మిగతా జనాలకు అనుమానాలు తలెత్తాయి. అలాగే రిప్ట్‌ వ్యాలీ ఫీవర్‌( ఒక ప్రాంతం పేరు) వంటివి, వృత్తి సంబంధమైన పేర్లు వివాదాస్పదం అయ్యాయి.

ఈ నేపధ్యంలోనే ఊహాన్‌ లేదా చైనా వైరస్‌ అని పిలవటం ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శక సూత్రాలకు విరుద్దం. ఆ పేర్లను మీడియా వినియోగించినా, సంఘపరివార్‌, ఇతరులు సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసినా తప్పిదమే. అయినా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా ట్రంప్‌ మొదలు అనేక మంది నోరు పారవేసుకున్నారు. చివరకు ఆ అలవాటు మన నరేంద్రమోడీ సర్కార్‌ యంత్రాంగానికి అంటుకొన్నది. సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో బి.1.617 వైరస్‌ను ” భారతీయ కరోనా వైరస్‌ ” అని రాసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీవాల్‌ సింగపూర్‌లో బయటపడిన వైరస్‌ను సింగపూర్‌ కరోనా రకం అని వివాదాస్పద వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. దాని మీద సింగపూర్‌ నిరసన తెలపటంతో అది కేజరీవాల్‌ వ్యాఖ్య తప్ప భారత ప్రభుత్వ వైఖరి కాదని మన దేశం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికిగానీ తప్పిదం తెలిసిరాలేదు తరువాత అలాంటి పేర్లు వాడకూడదని అదే సర్కార్‌ ఆదేశించింది. మనకు నొప్పి తగిలిన తరువాత గానీ దానిలో ఉండే తప్పిదం ఏమిటో తెలిసిరాలేదు. తరువాత కూడా మీడియాలో, సంఘపరివార్‌, ఇతరులూ కోవిడ్‌-19 గురించి గతంలో చేసిన తప్పిదాన్నే చేస్తున్నారు. దీన్నేమందాం ? ద్వంద్వప్రమాణం అందామా లేక ఇతరులు చేస్తే వ్యభిచారం- మనం చేసేది సంసారం అందామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరుగుతున్నారా – ఒక పరిశీలన !

01 Tuesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

#Kerala Politics, Believers in Kerala LDF, CPI(M), Kerala LDF, Sabarimala controversy


ఎం కోటేశ్వరరావు


కేరళ ఎల్‌డిఎఫ్‌లో గతంలో ఎన్నడూ లేనంత మంది ” విశ్వాసులు ” దేవుడి పేర శాసనసభ్యులుగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అంటూ కేరళలో ప్రముఖ మీడియా సంస్ధ మలయాళ మనోరమ పత్రిక ఒక విశ్లేషణ రాసింది. అంతకు ముందు కొన్ని పత్రికలు మంత్రివర్గంలో కులాల వారీ ఎవరు ఎందరున్నారనే విశ్లేషణలు చేశాయి. వీటిని చదివిన వారు ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం వ్యతిరేకులైతే శత్రుపూరిత దాడి చేసేందుకు, శ్రేయోభిలాషులైతే స్నేహపూర్వక విమర్శలు, సమర్దనలు చేసేందుకు పూనుకోవచ్చు.


మనోరమ పత్రిక విశ్లేషణ ప్రకారం 1980లో ఎల్‌డిఎఫ్‌ ఏర్పడిన తరువాత తొలిసారిగా 99 మంది కూటమి సభ్యులలో 17 మంది దేవుడి పేరుతో ప్రమాణం స్వీకారం చేశారు, మరొక సభ్యుడు సకాలంలో వచ్చి ఉంటే 18 అయ్యేవారు. ఇరవై ఒక్క మంది మంత్రుల్లో ఆరుగురు దేవుడి మీద ప్రమాణం చేశారు. ఇక పార్టీల వారీ చూస్తే పదకొండు పార్టీల కూటమిలో కేరళ కాంగ్రెస్‌(ఎం) ఐదుగురు, సిపిఎం ముగ్గురు, జనతాదళ్‌(ఎస్‌) ఇద్దరు, మిగిలిన వారిలో సిపిఐ మినహా ఇతర పార్టీల సభ్యులు దేవుడి పేరుతో ప్రమాణాలు చేసిన వారు ఉన్నారు. మంత్రుల్లో సిపిఎంకు చెందిన వీణాజార్జి ఉన్నారు. గత అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ నుంచి 10 మంది, అంతకు ముందు ఏడుగురు ఉన్నారు. కుక్క మనిషిని కరవటం వార్త కాదు, మనిషి కుక్కను కరవటం వార్త అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కూటమిలో సిపిఎం, సిపిఐ మినహా మిగిలిన పార్టీల వారు ఎలా ప్రమాణ స్వీకారం చేసినా అది పెద్ద సమస్య కాదు. కమ్యూనిస్టుల్లో వారి మద్దతుదారుల్లో ఎవరైనా ఉంటేనే అది విశేషం అవుతుంది.


ప్రపంచంలోని ఇతర దేశాలలో మాదిరే మన దేశంలో కూడా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ ఉన్న పార్టీలలో సిపిఎం అగ్రస్దానంలో ఉంది. ఆ పార్టీ నిబంధనావళిని చూసినపుడు పార్టీ ఆశయాలను అంగీకరించటం, కనీస నిబంధనలు పాటించటం తప్ప మతం, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండకూడదన్న నిబంధన లేదు అనే అంశం చాలా మందికి తెలియదు. వ్యక్తిగతంగా వాటిని పాటించటానికి ఆటంకం లేదు. ఆ నిబంధనలు, ఆశయాలేమీ రహస్యం కాదు. పుస్తకాల దుకాణాల్లో అవి దొరుకుతాయి అనుమానం ఉన్న వారు కొని చదువుకోవచ్చు. చరిత్రలో మత రాజ్యాల గురించి, పాలకులు ఏ మతాన్ని ఆచరిస్తే జనం కూడా దాన్నే ఆచరించాలనే వత్తిడిని చూశాం తప్ప కమ్యూనిస్టుల పాలనలో అలాంటిది ఎక్కడా కనపడదు. నిజంగా కమ్యూనిస్టులు అలా చేసి ఉంటే సోషలిస్టు దేశాలలో ఒక్క చర్చి, ఒక్క మసీదు కూడా మిగిలి ఉండేది కాదు. కానీ ఎక్కడా వాటి జోలికి పోలేదు, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనిజం లక్ష్యం దోపిడీ లేని సమాజాన్ని నిర్మించటం, ఆ క్రమంలో మతం, కులం, దేవుడి వంటి భావాలు, వివక్ష పాటింపు వంటివి సామాజిక చైతన్యంతో అంతరిస్తాయని నమ్ముతారు, అందుకు కృషి చేస్తారు తప్ప బలవంతంగా అమలు చేయలేదు, చేయరు.

ఈ నేపధ్యంలో కేరళలో జరుగుతున్నదానిని చూడాల్సి ఉంది. కమ్యూనిస్టులు, వారి సిద్దాంతాలు, ఆచరణ గురించి మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మూడు మతాలకు చెందిన వారు బలమైన శక్తులుగా ఉన్నారు. అక్కడ ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రతినిధులతో పాటు లౌకికవాద పార్టీ అయిన కాంగ్రెస్‌, పురోగామి సిద్దాంతాలతో పని చేస్తున్నామని చెప్పుకున్న ప్రజా సోషలిస్టు పార్టీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, కేరళ సోషలిస్టు పార్టీ, ఒక మతానికే ప్రధానంగా పరిమితమైన ముస్లిం లీగు విమోచన సమరం పేరుతో కుమ్మక్కయ్యాయి. ఆందోళన చేసి 1957లో ఏర్పడిన నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని 1959లో కేంద్ర ప్రభుత్వంతో బర్తరఫ్‌ చేయించాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమోదించిన భూసంస్కరణలు, విద్యా బిల్లులతో ప్రభావితులైన వారందరూ దీని వెనుక ఉన్నారు. వీరందరినీ దగ్గరకు చేర్చిందీ, ఆందోళనల రూపాలు ఎలా ఉండాల్సిందీ, జనాన్ని ఎలా రెచ్చగొట్టాల్సిందీ నేర్పింది, అవసరమైన నిధులు ఇచ్చిందీ అమెరికా గూఢచార సంస్ద సిఐఏ అన్న విషయం తెలిసిందే. ఇది కమ్యూనిస్టుల ఆరోపణ లేదా చీకట్లో బాణం కాదు. మన దేశంలో అమెరికా రాయబారులుగా 1973-75లో పని చేసిన డేనియల్‌ మోయినిహన్‌ 1978లో ఏ డేంజరస్‌ ప్లేస్‌ పేరుతో రాసినపుస్తకంలో, 1956-61 మధ్య పని చేసిన రాయబారి ఎల్స్‌వర్త్‌ బంకర్‌ జీవిత చరిత్రను రాసిన హౌవర్డ్‌ ష్కాఫర్‌ దాని గురించి ప్రస్తావించారు. ” భారత్‌లో మరికొన్ని కేరళలు ” ఏర్పడకుండా చూడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేక విముక్తి సమరానికి నిధులు ఇచ్చిన విషయాన్ని చెప్పారు.

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఎలా కుమ్మక్కు అవుతాయో ఈ పరిణామం పాఠాలు నేర్పింది. దీన్నుంచి ఉద్యమాన్ని రక్షించుకోవటమే కాదు, ఆదరించిన కష్టజీవుల తీర్పుకు అనుగుణ్యంగా ప్రభుత్వాల ఏర్పాటుకు గాను అనుసరించిన అనేక పురోగామి ప్రయోగాల ప్రతి రూపమే నాలుగు దశాబ్దాల నాడు ఏర్పడిన ఎల్‌డిఎఫ్‌.అయితే దీనిలోని కొన్ని పార్టీలు ఈ మధ్యకాలంలో అటూ ఇటూ మారిన ఉదంతాలూ, రెండు కమ్యూనిస్టు పార్టీలతో పాటు ముస్లిం లీగు నుంచి చీలి ఇండియన్‌ నేషనల్‌ లీగుగా ఏర్పడిన పార్టీ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిన తీరూ ఉంది. పశ్చిమ బెంగాల్లో వామపక్ష సంఘటనలో సిపిఎంతో కలసి అధికారం పంచుకున్న ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డు బ్లాక్‌ కేరళలో కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నాయి. ఏనాడూ అధికారం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర ఎల్‌డిఎఫ్‌, దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎంకు లేదు. ఉదాహరణకు 2011 ఎన్నికల్లో కేవలం 0.89శాతం ఓట్ల తేడా, ఎల్‌డిఎఫ్‌కు 68, యుడిఎఫ్‌ 72 సీట్లు వచ్చిన సమయంలో ఒకటి రెండు యుడిఎఫ్‌ ఫ్రంట్‌ పార్టీలు,ఎంఎల్‌ఏలు ముందుకు వచ్చినప్పటికీ ప్రజాతీర్పును ఎల్‌డిఎఫ్‌ హుందాగా స్వీకరించింది తప్ప అధికారం కోసం కక్కుర్తి పడలేదు.


కమ్యూనిస్టులు మతాన్ని మత్తు మందుగా ఎందుకు భావిస్తారు, ఎందుకు వ్యతిరేకిస్తారు అని అనేక మంది అడుగుతారు. అలాంటి వారు ముందుగా తెలుసుకోవాల్సింది కమ్యూనిస్టులకంటే అంటే కారల్‌మార్క్స్‌కు ముందుగానే మతాన్ని మత్తు మందుతో పోల్చిన వారు, వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. రెండవది కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకిస్తారనేది హిమాలయమంత వక్రీకరణ. నల్ల మందుతో వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి, హానిచేసే లక్షణాలూ ఉన్నాయి. దాన్ని ఎవరైనా తినిపించినా, స్వయంగా తీసుకున్నా మందమతులుగా మత్తుతో పడిఉంటారు. అందువలన దాన్ని దుర్వినియోగం చేయటమే ఎక్కువగా ఉంది, దానితో తయారు చేసే మాదక ద్రవ్యాలతో అక్రమ సంపాదనకు ఒక ప్రధాన వనరుగా ఉన్నందున ప్రతికూల భావంతోనే జనం చూస్తారు. మతం కూడా అలాగే దుర్వినియోగమైంది. కనుకనే కమ్యూనిస్టులు పుట్టక ముందే ఐరోపాలో కొందరు మత్తు మందు అన్నారు. రాజకీయాలోకి మతాన్ని చొప్పించటం, పరమత ద్వేషంతో వ్యవహరించే మతాలను, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా మతాన్ని ఒక ఆయుధంగా వినియోగించటాన్ని మాత్రమే కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు.

మతం ఆ విధంగా దుర్వినియోగం అవుతున్నందున మతం అంతరించాలని కోరుకోవటంలో ఎలాంటి మినహాయింపులు, రాజీలు లేవు. గాయపడిన, జబ్బు పడిన వారికి పూర్వం నల్లమందు ఇవ్వటం ద్వారా ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించేవారు. దాంతో తక్షణం ఉపశమనం కలిగేది, భ్రమల్లోకి తీసుకుపోయేది కనుక కొంత శక్తినిచ్చేది. మార్క్స్‌ ఈ కోణం నుంచే మతాన్ని నల్ల (మత్తు) మందుతో పోల్చారు. ఫ్యూడల్‌ సమాజంలోనూ, తరువాత పారిశ్రామిక విప్లవంతో ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ విధానంలోనూ ఐరోపా సమాజాల్లో క్రైస్తవ మతం దోపిడీదారులకు సాయపడింది తప్ప జనానికి కాదు, దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటాలను తప్పుదారి పట్టించేందుకు చేయాల్సిందంతా చేసింది. అందుకనే మతం పట్ల ఆయనకు ఎలాంటి సానుభూతి లేదు. ఆయన సిద్దాంతాలతో ప్రభావితులైన కమ్యూనిస్టులకూ అదే అభిప్రాయం ఉంటుంది. మతం గురించి నాలుగు ముక్కల్లో మార్క్స్‌ చెప్పిందేమిటి ? ” అణచివేతకు గురైన వారికి మతం ఒక నిట్టూర్పు, హృదయం లేని ప్రపంచానికి గుండెకాయ, పశుప్రాయమైన పరిస్ధితులకు ఆత్మవంటిది. జనం పాలిట మత్తుమందు.”


ఇరవై ఎనిమిదేండ్ల వయస్సులోనే టీబితో మరణించిన జర్మన్‌ కవి నోవాలిస్‌ (1772-1801) మతం మత్తు మందు మాదిరి పనిచేస్తుంది. ఉద్దీపకగా,ఇంద్రియ జ్ఞానాన్ని పోగొట్టేదిగా, దుర్బలపరచి నొప్పిని తగ్గిస్తుంది అన్నారు. అప్పటికి మార్క్సు పుట్టనేలేదు. మార్క్స్‌ సమకాలికుడు హెన్రిచ్‌ హెయిన్‌ 1840లో మతం గురించి చెబుతూ బాధల్లో ఉన్న జనానికి మతం కొన్ని చుక్కల ఆధ్యాత్మిక మత్తుమందును, కొన్ని చుక్కల ప్రేమ, ఆశ, విశ్వాసాన్ని కలిగిస్తుంది అన్నారు. బైబిల్‌ను ఒక మత్తుమందు డోసుగా ఉపయోగిస్తున్నామని ఇంగ్లండ్‌ చర్చికి చెందిన చార్లెస్‌ కింగ్‌స్లే 1847లో రాశాడు. వీరెవరూ కమ్యూనిస్టులు కాదు. తమ అనుభవంలోంచి చెప్పిన మాటలే.జనానికి నిజమైన సంతోషం కలగటానికి చేసే పోరాటాల నుంచి భ్రమలతో కూడిన తప్పుదారి పట్టించే ఉపశమనాన్నిచ్చేందుకు ప్రయత్నించే సంఘటిత మతం అంతరించాలని కమ్యూనిస్టులు కోరుకుంటారు. అయితే జనం స్వచ్చందంగా వదులుకోవాలని చెబుతారు తప్ప బలవంతం చేయరు.

సామ్రాజ్యవాదులు, క్రైస్తవ మతాధికారులు కుమ్మక్కై కూల్చివేసిన సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా రాజ్యాలలో కమ్యూనిస్టులు మతాన్ని నాశనం చేయలేదు, దానికి ఆలవాలంగా ఉన్న చర్చ్‌లను కూల్చివేయలేదు.మతం మత్తు మందు అని నమ్మినప్పటికీ దాన్ని వదిలించేందుకు కమ్యూనిస్టు పార్టీలు తగిన చర్యలు తీసుకోకపోతే అక్కడ జరిగిందేమిటో చూశాము. జనంలో తలెత్తిన అసంతృప్తిని క్రైస్తవమత పెద్దలు ఉపయోగించుకొని జనాన్ని రెచ్చగొట్టారు. ఏ చర్చ్‌లను, మసీదులనైతేే సురక్షితంగా ఉంచారో వాటినే సమీకరణ కేంద్రాలుగా మార్చారు. చైనాలో కూడా టిబెట్‌లో బౌద్దమతం పేరుతో చిచ్చుపెట్టేందుకు గతంలో, ఇప్పుడూ సామ్రాజ్యవాదులు చేస్తున్న ప్రయత్నం, ఇప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న ఒక రాష్ట్రంలో రెచ్చగొడుతున్నతీరు, సోషలిస్టు వ్యవస్ధకు వ్యతిరేకంగా రహస్య పద్దతుల్లో క్రైస్తవమతాన్ని రంగంలోకి తెస్తున్న పరిణామాలనూ, వాటిని సమర్దవంతంగా ఎదుర్కొన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అనుభవాన్ని చూశాము.


ఇక కేరళ అసెంబ్లీ సభ్యులలో ఎల్‌డిఎఫ్‌కు చెందిన కొందరు ప్రమాణ స్వీకారాలు ఎలా చేశారనే అంశానికి వస్తే 99 మంది సభ్యులలో 18 మంది దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే 81 మంది ఆత్మ సాక్షిగా చేశారంటే త్రాసు ఎటు వైపు మొగ్గుగా ఉంది. వీరిలో సిపిఎంకు చెందిన వారు ముగ్గురు అని పేర్కొన్నారు. సిపిఎం వారు అంటే పార్టీ గుర్తుమీద పోటీ చేసిన వారు, సిపిఎంకు కేటాయించిన స్ధానాలలో అది బలపరచిన స్వతంత్రులు కూడా ఉన్నారు. వారిలో ఆరుగురు గెలిచారు. వారందరినీ సిపిఎం కిందే పరిగణిస్తున్నారు. సిపిఎం నుంచి ముగ్గురు దేవుడి మీద ప్రమాణం చేశారంటే వారిలో ముగ్గురు కూడా కావచ్చు, మరో ముగ్గురు చేయలేదని అనుకోవచ్చు. ఎవరు అన్నది మనోరమ విశ్లేషకుడు రాయలేదు. లేదూ ముగ్గురూ సిపిఎం సభ్యులే కూడా కూడా అయి ఉండవచ్చు. గతం కంటే పెరిగారు అన్నది ఒక వ్యాఖ్య. ఇది ఒక వైపు మాత్రమే, రెండో వైపును చూడాలి. లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ అనే కొత్త పార్టీ మూడు సీట్లకు పోటీ చేసి ఒకటి గెలుచుకుంది. కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే పార్టీ యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరి పన్నెండు సీట్లకు పోటీ చేసి ఐదు గెలుచుకుంది. ఈ కారణంగా కూడా గతం కంటే పెరిగారు. దీన్ని చూపి ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరిగారు అని చెప్పటం గురించి పాఠకులను దురుద్దేశ్య పూరితం, తప్పుదారి పట్టించే యత్నంగా ఎందుకు భావించకూడదు ?

దేవుడి మీద లేదా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసేందుకు మన రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా మతాన్ని పాటించటానికి, దేవుణ్ని విశ్వసించటానికి- మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి, దేవుణ్ని ఓట్ల కోసం వీధుల్లోకి తీసుకురావటానికి ఎంతో తేడా ఉంది. సిపిఎం విషయానికి వస్తే గతంలో కొంత మంది సభ్యులు దేవుడి సాక్షిగా ప్రమాణస్వీకారం చేసినందుకు అభిశంసనకు గురయ్యారు. సిపిఎంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జారీ చేసిన మార్గదర్శక సూత్రాల మీద కొంత మంది విబేధించారు. పార్టీ సభ్యులు మత కార్యక్రమాల్లో పాల్గొన కూడదని దానిలో పేర్కొన్నారు. దానికి నిరసనగా కేరళకు చెందిన మాజీ ఎంపీ కెఎస్‌ మనోజ్‌ పార్టీకి రాజీనామా చేశారు. మత విశ్వాసాలు పార్టీ కంటే ఉన్నతమైనవని, దిద్దుబాటు పేరుతో జారీ చేసిన మార్గదర్శకాలు రాజ్యాంగానికి వ్యతిరేమైనవని రాజీనామా కారణాలుగా పేర్కొన్నారు. కమ్యూనిస్టులు సాధారణంగా, సూత్రరీత్యా హేతువాదులు, వారికి ఏమతం పట్లా విశ్వాసం ఉండదు. అయితే మతం, కులం అనేవి ఉనికిలో ఉన్నాయి గనుక వాటిని విస్మరించజాలరు. అందుకే అలాంటి భావాలు ఉండి కూడా కమ్యూనిస్టు సిద్దాంతాలను కూడా అంగీకరిస్తే అలాంటి వారికి సభ్యత్వం ఇస్తున్నారు. వాటి మూలం ఏమిటో తెలుసు, వాటికి అతీతంగా జనాన్ని ఎలా మార్చాలో కూడా అవగాహన ఉన్నవారు. అదే సమయంలో వాటి అడుగుజాడల్లో నడవరు. అలాంటి పరిస్ధితే ఉంటే కమ్యూనిస్టులు పార్టీ దుకాణం మూసుకొని ఇతర పార్టీల్లో చేరి బాబాలు, స్వామీజీల అడుగుజాడల్లో నడిచే వారు. అందువలన స్వతంత్రులుగా గెలిచిన ఆరుగురితో సహా సిపిఎంకు చెందిన 68 మంది ఎంఎల్‌ఏల్లో ముగ్గురు దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తే దాన్ని బూతద్దంలో చూపటం భావ ప్రకటన రీత్యా ఎవరికైనా ఎంత హక్కుందో అదే హక్కు ప్రకారం దురుద్ధేశ్య పూరితం అని కూడా చెప్పవచ్చు.


దేశ లౌకిక రాజ్యాంగంలో మత విశ్వాసాలను కలిగి ఉండటానికి ఎంత హక్కు ఉందో మతాన్ని పాటించకుండా ఉండేందుకు కూడా అంతే హక్కు ఉంది. కనుకనే కమ్యూనిస్టులు అలాంటి ప్రమాణాలను పాటించే విధంగా ఉండాలని నిరంతరం చెబుతుంటారు తప్ప వాటిని ఒక నిబంధనగా పెట్టలేదు. సమాజం మొత్తం లేదా అత్యధిక భాగం ఏదో ఒక మతం లేదా కులంలో పుట్టిన వారితో నిండి ఉన్నపుడు వారు లేకుండా కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం ఎలా సాధ్యం ? ముందే వాటిని వదులుకోవాలని షరతు పెడితే ఎవరైనా అటువైపు చూస్తారా ? వేల సంవత్సరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన వాటిని కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకోగానే అందరూ వాటిని పోగొట్టుకుంటారని అనుకుంటే వాస్తవ పరిస్ధితుల మీద ఆధారపడిన అవగాహన కాదు. దోపిడీని వ్యతిరేకించి సోషలిస్టు సమాజాన్ని నిర్మించేందుకు పార్టీ నిబంధనావళిని అంగీకరిస్తున్నారా, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా లేదా అనేదే కొలబద్ద గానీ మతాన్ని, కులాన్ని వదులుకుంటారా అన్న షరతులు ఉండవు. పార్టీలోకి వచ్చిన తరువాత అన్యవర్గధోరణులుగా వాటిని పొగొట్టుకొనేందుకు సభ్యులు, సైద్దాంతిక అవగాహన కలిగించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది.ఎక్కడైనా అలా జరగలేదంటే స్ధానికంగా అధిగమించాల్సిన లోపం తప్ప పార్టీ సిద్దాంతం లేదా పార్టీది కాదు. ప్రజల కోసం చిత్తశుద్దితో పని చేసే మత సంస్ధల పెద్దలు ఎవరైనా ఉంటే వారితో కలసి పనిచేసేందుకు వారి సాయం తీసుకోవటం కూడా తప్పుకాదని కూడా సిపిఎం తన వైఖరిని వివరించే వ్యాసాల్లో పేర్కొన్నది. పార్టీలో చేరిన వారు గుడులు గోపురాలు, చర్చ్‌లు, మసీదులకు వెళ్లటం వారి వ్యక్తిగత విషయంగానే భావిస్తుంది. దాని అర్ధం మతోన్మాద చర్యల్లో భాగస్వాములు కమ్మని, మతాన్ని రాజకీయాలు, అధికారానికి జోడించమని కాదు. అలాంటి పనులు చేస్తే సిపిఎం నిర్మాణంలో వారు ఇమడలేరు.


అందువలన ఎల్‌డిఎఫ్‌, దానిలో ప్రధాన భాగస్వామి అయిన సిపిఎంలో కొంత మంది దేవుడి మీద ప్రమాణాలు చేసినంత మాత్రాన వారు మతశక్తులు కాదు. శబరిమల విషయంలో హిందూమతానికి వ్యతిరేకంగా విజయన్‌ సర్కార్‌ పని చేసిందని మతశక్తులు గగ్గోలు పెట్టినపుడు దానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఇప్పుడు ఎంఎల్‌ఏలు, మంత్రులుగా ఉన్నవారందరూ పని చేసిన వారే. వారు ఎక్కడైనా మతాన్ని, తమ వ్యక్తిగత విశ్వాసాలను ప్రజాజీవితంలో జనం మీద రుద్దారా, ప్రభావితం చేశారా అంటే అలాంటి రికార్డు ఎక్కుడా లేదు. అదే గనుక ఉంటే మనోరమ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికలు ఈపాటికి దుమ్మెత్తి పోసి ఉండేవి. అదే విధంగా హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు, కులసంఘాల వారు కమ్యూనిస్టులు, వారితో కలసి పని చేస్తున్నవారికి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినప్పటికీ ఓటమికైనా సిద్ద పడ్డారు తప్ప ఓట్ల కోసం కక్కుర్తి పడని వారే వారందరూ. ఎక్కడా మతశక్తులతో రాజీ పడలేదు, అలాగని ఆయా మతాలకు చెందిన సామాన్యుల సంక్షేమం విషయంలో మడమతిప్పలేదు గనుక జనం మత, కులశక్తులకు చెంపపెట్టుగా ఎల్‌డిఎఫ్‌కు చారిత్రాత్మక విజయం చేకూర్చారు. కొన్ని స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ కోరకుండానే స్ధానిక రాజకీయాలు, ఇరుకున పెట్టే ఎత్తుగడల్లో భాగంగా మతశక్తులు మద్దతు ఇచ్చినపుడు గెలిచిన పదవులకు రాజీనామా చేసిన వారి నిజాయితీ, చిత్తశుద్ది గురించి తెలిసిందే.

అధికారంలో దేవాదాయశాఖ మంత్రిగా కమ్యూనిస్టు ఉన్నపుడు పూజలు చేసి కమ్యూనిస్టు విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తే అది కూడని పని తప్ప అసలు గుళ్లకు వెళ్లకూడదంటే కుదరదు. ఇంత మంది దేవుడి పేరుతో ప్రమాణస్వీకారం చేసినందున శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు పునర్విచారణ తీర్పు ఎలా వచ్చినప్పటికీ వీరిని సిపిఎం విస్మరించజాలదని మనోరమ విశ్లేషకుడు ఒక పెడర్ధాన్ని తీశారు. శబరిమల విషయం మీద సిపిఎం వైఖరి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా ఒకటే అన్నది స్పష్టం. ఓట్ల కోసమే అయితే హిందూమతశక్తులు నిర్దేశించిన విధంగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చి ఉండేది. అనుకూలంగా తీర్పు వచ్చింది కనుక దానికి కట్టుబడి అమలు జరిపేందుకు ప్రయత్నించింది.కోర్టు తీర్పును గౌరవించనిది, ఖాతరు చేయకుండా మనోభావాల పేరుతో జనాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతు ఇచ్చే కుల, మతశక్తులు. దాన్ని వ్యతిరేకించింది ఎల్‌డిఎఫ్‌. గత ఎన్నికల్లో మతశక్తులు, వాటితో రాజీపడిన కాంగ్రెస్‌ కూటమి దాన్ని వినియోగించుకొని లబ్ది పొందాలని చూసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓట్లు వస్తాయా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా తీర్పు ఎలా వచ్చినా దాని గురించి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సిపిఎం ప్రకటించింది తప్ప మతశక్తుల వత్తిడికి లొంగలేదు.ఆ కక్షతోనే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత ఎన్నికలు ప్రారంభమైన తరువాత ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చారు.


లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో వామపక్ష ప్రభుత్వాలకు నాయకత్వం వహించి, వరుస విజయాలకు కారకులైన ఛావెజ్‌, మదురో వంటి వారు ఒకచేత్తో బైబిలు మరొక చేత్తో కష్టజీవుల జెండాను మోసిన వారే. అయినప్పటికీ అక్కడి చర్చి అధికారులు వారిని వ్యతిరేకించటంలో, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు చేయటానికి వెనుకాడటం లేదు. చర్చి పెద్దలు చెప్పారు కదా అని సామాన్య జనం వామపక్షాలకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. అది నికరాగువా డేనియల్‌ ఓర్టేగా కావచ్చు మరొకరు కావచ్చు. కమ్యూనిస్టుల గురించి లాటిన్‌ అమెరికా, అమెరికా ఖండాలలో జరిగిన విష ప్రచారం మనవంటి వారికి పెద్దగా తెలియదు. ఫలానా వ్యక్తి కమ్యూనిస్టు అంటే వ్యతిరేక ఉన్మాదం తలకు ఎక్కిన వారు ఉట్టిపుణ్యానికే ఇండ్ల మీద దాడులు చేసిన ఉదంతాలు అమెరికాలో ఉన్నాయి. తాము మతానికి, వ్యక్తిగత మతవిశ్వాసాలకు, ఆచరణకు, విశ్వాసాలు, సంస్కృతికి వ్యతిరేకం కాదు అని కమ్యూనిస్టులు విశ్వాసం కలిగించకపోతే జనం పార్టీ వైపు రారు, దోపిడీలేని సమాజానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సిద్దం కారు. మేము కూటికి పేదలం తప్ప కులానికి కాదు అని చెప్పే అనేక మంది సామాన్యులను మనం చూస్తాం. అలాంటి వారిని పేదరికానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమీకరించదలచిన వారు మేం మతాన్ని, కులాన్ని నిర్మూలిస్తాం, మీరు వాటిని వదులు కోవాలనే షరతులు పెట్టి సమీకరించలేరు. ఎవరైనా అలా చెబితే అది మొరటు తనం తప్ప మరొకటి కాదు.


కమ్యూనిస్టుల గురించి సమాజంలో ఉన్నతమైన భావనలతో పాటు దురభిప్రాయాలు కూడా ఉన్నాయి. వారి సిద్దాంతం, ఆచరణ మొదటి వాటికి మూలమైతే రెండవ వాటికి శత్రువులు కారణం. అయితే దురభిప్రాయాల ప్రచారానికి గురైన వారందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కాదు. కమ్యూనిస్టు సిద్దాంతానికి ముందే ప్రపంచంలో వేల సంవత్సరాలుగా మతాలు,వాటికి ప్రతీకలుగా తయారు చేసిన దేవుళ్లను వ్యతిరేకించిన నాస్తికులు ఉన్నారు. నాస్తికులందరూ కమ్యూనిస్టులు కాలేరు. కమ్యూనిస్టు పార్టీల సభ్యులు, అభిమానులందరూ కూడా తెల్లవారేసరికి నాస్తికులు కాలేరు అన్నది గ్రహించటం అవసరం. కమ్యూనిస్టు సిద్దాంతంలో అనేక అంశాలలో నాస్తికత్వం కూడా ఒకటి తప్ప అదే ఏకైక ప్రాతిపదిక కాదు. నాస్తికులలో అనేక మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు ఉన్నారు. కమ్యూనిస్టులలోని ఆస్ధికులలో నాస్తికత్వం మీద అలాంటి వ్యతిరేకత కానరాదు. పినరయి విజయన్‌ నాయకత్వంలో వరుసగా రెండవ సారి అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించిన ఎల్‌డిఎఫ్‌ కొత్త మంత్రి వర్గంలో దేవస్దానాల మంత్రిగా ఒక దళితుడిగా పుట్టిన కె రాధాకృష్ణన్‌ను నియమించటాన్ని ఎలా చూడాలి ? ఆయనేమీ దేవుడి మీద ప్రమాణం చేయలేదు. హిందూ మత లేదా అగ్రకుల భావనలు కలిగిన వారిని సంతుష్టీకరించేందుకు నిజంగా విజయన్‌ సర్కార్‌ పూనుకుంటే ఇలా జరుగుతుందా ? రాధాకృష్ణన్‌ గతంలో స్పీకర్‌గా పని చేశారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, విద్యార్ధి ఉద్యమం నుంచి ఎదిగిన నేత. మరి ఈ నియామకాన్ని ఎలా చూడాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జై శంకర్‌ వాషింగ్టన్‌ పర్యటన : పేరు వ్యాక్సిన్‌, అసలు లక్ష్యం అమెరికాకు బాసట !

30 Sunday May 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

jaishankar US visit, Narendra Modi, Narendra Modi Failures, Quad, Quadrilateral Security Dialogue, US Vaccine Diplomacy, US-India Relations, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


” జైశంకర్‌ అమెరికా పర్యటనలో వాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం ”
” అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్‌తో వాణిజ్యం, వాక్సిన్లు, చతుష్టయం, ఇండోఫసిఫిక్‌ అంశాలపై జైశంకర్‌ చర్చ ”
” చతుష్టయం, ఆఫ్ఘనిస్తాన్‌, వాక్సిన్‌ తదితరాలపై భారత్‌-అమెరికా ద్వౌపాక్షిక చర్చ ”
” ట్విటర్‌, వాట్సాప్‌ గురించి అమెరికా పర్యటనలో జైశంకర్‌ చర్చ”
” జైశంకర్‌ అమెరికా పర్యటనలో తొలి చర్చనీయాంశం చైనా ”
” చతుష్టయ కూటమికి వెన్నుదన్నుగా భారత్‌ ”


మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మే 24 నుంచి 28 వరకు జరిపిన అమెరికా పర్యటనకు ముందు, ఆ సమయంలో వచ్చిన కొన్ని వార్తల శీర్షికలు ఇవి. ఇటీవలి కాలంలో కరోనా కారణంగా అన్నీ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా జరుగుతుంటే స్వయంగా వెళ్లటం అంటే ముఖాముఖీ తేల్చుకునేవి ఉండి ఉంటాయని జనం అనుకున్నారు. ఎందుకు వెళ్లారు, ఏం మాట్లాడారు, ఏమి సాధించారు అని మన దేశం తిరిగి వచ్చిన తరువాత ఎవరైనా అడిగితే ఏం చెబుతారో తరువాత చూద్దాం.
జైశంకర్‌ పర్యటనకు ముందు వివిధ మీడియా సంస్ధలు పర్యటన లక్ష్యం, ఉద్దేశ్యాల గురించి కథనాలు రాశాయి. పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నట్లుగా పరిపరి విధాలుగా అవి ఉన్నాయి. జేమ్స్‌బాండ్‌గా మోడీ అభిమానులు వర్ణించే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అమెరికన్లతో ఫోన్లో మాట్లాడి దెబ్బకు దిగివచ్చేట్లు చేశారు చూడండి అంటూ ఏప్రిల్‌ నాలుగవ వారంలో కాషాయ దళాలు ఊదరగొట్టాయి. ఇంకేముంది ఫోను పెట్టేలోగానే వాక్సిన్‌ తయారీ ముడి పదార్ధాలతో అమెరికా విమానాలు గుంపులు గుంపులుగా ఎగురుకుంటూ బయలు దేరాయి చూడండి అన్నట్లుగా వాట్సాప్‌లో తెగ ప్రచారం చేశారు. ట్రంప్‌ బెదిరించగానే నిషేధం ఎత్తివేసి ఎందుకంత ఆగ్రహం జీహుజూర్‌ అంటూ మనం హైడ్రోక్సీక్లోరోక్విన్‌ మాత్రలు పంపిన మాదిరి మనకు వాక్సిన్‌ ముడి పదార్దాలను పంపటానికి అక్కడున్నది నరేంద్రమోడీ కాదని గత ఐదు వారాల్లో రుజువైంది.


వచ్చిన వార్తలను బట్టి అమెరికాలో వినియోగానికి అనుమతి ఇవ్వకుండానే కొనుగోలు చేసిన ఆరు కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా వాక్సిన్లను, మరో రెండు కోట్ల ఇతర కంపెనీల వాక్సిన్లను మనకు విక్రయించటానికి లేదా దానంగా ఇవ్వటానికి మాత్రమే అమెరికా సుముఖంగా ఉంది. బోలెడు సానుభూతి కబుర్లు తప్ప వాక్సిన్‌ ముడి పదార్ధాల సరఫరా గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఒక వైపు ప్రాణాలు పోతున్నా, అక్కడి వాడని వాటి మీద కూడా నెలల తరబడి అమెరికా నిర్ణయం తీసుకోలేదని గమనించాలి. అమెరికా దానం చేసే వాక్సిన్ల కోసం, ముడి పదార్దాలు విక్రయించండి మహా ప్రభో అని స్వయంగా వెళ్లి ఐదు రోజులు ఉండాల్సి అవసరం ఉందా ? కేవలం వాటికోసమే అయితే అవసరం లేదు.


మనకు కరోనా వాక్సిన్‌ ముడి పదార్దాలను అమెరికా ఇవ్వదా ? ఎందుకివ్వదు, ఇస్తుంది. ఎప్పుడు ? ఉద్రిక్తలను మరింతగా పెంచకుండా, దెబ్బలాటలకుదిగకుండా లడఖ్‌ సరిహద్దుల్లో ఉన్న సైన్యాల ఉపసంహరణ గురించి మనం చైనాతో జరుపుతున్న చర్చలు జోబైడెన్‌ సర్కార్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయా ? చైనా విషయంలో భారత్‌ రాజీపడుతున్నదనే అనుమానం అమెరికాలో తలెత్తిందా ? కరోనా కారణంగా మన దేశంలో తలెత్తిన విపత్కర పరిస్ధితిని వినియోగించుకొని మనల్ని మరింతగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టేందుకు వాక్సిన్‌ ముడిపదార్దాల సరఫరాను ఎరగా వేస్తున్నదా ? మన దేశం దానికి లొంగిపోతున్నదా ? ఇలా ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి.

హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు మలేరియా చికిత్సలో వినియోగిస్తారు. అవి కరోనా నివారణకు కూడా పనికి వస్తాయోమో అన్న ఆలోచన రాగానే మన దేశం వాటిపై నిషేధం విధించింది. తన ఎన్నికలు ముందున్నాయి, అమెరికాలో కరోనా పుచ్చిపోతోంది, భారత్‌ సదరు ఔషధం మీద నిషేధం విధించిందంటే నిజంగానే అది పని చేస్తుందేమో అన్న ఆశతో డోనాల్డ్‌ ట్రంప్‌ తనకు కౌగిలింతల సన్నిహితుడు అని కూడా చూడకుండా బహిరంగ బెదిరింపులతో నరేంద్రమోడీని అవమానించాడు. ఇప్పుడు వాక్సిన్లు తప్ప మరొక చికిత్సలేదు అని తేలిపోయింది, అవి అందుబాటులోకి వచ్చాయి గనుక వాటితో రాజకీయం చేసేందుకు అమెరికా నిర్ణయించుకుంది. ముందు చూపులేని కారణంగా మోడీ సర్కార్‌ జనాన్ని బలిచేస్తున్నది. ముతక సామెత చెప్పినట్లు మంచమిరిగినా……అన్నట్లు కరోనా మహమ్మారిని కూడా సామ్రాజ్యవాదం తన ఎత్తుగడలకు అనుగుణ్యంగా వినియోగించుకుంటుంది అన్నది తేలిపోయింది.


నిజానికి మన సర్కార్‌తో లెక్కలు తేలిఉంటే జైశంకర్‌ పర్యటన సమయంలోనే వాక్సిన్‌ ముడిపదార్దాల సరఫరా గురించి నిర్దిష్టమైన ప్రకటన అమెరికా వైపు నుంచి వెలువడి ఉండేది. జో బైడెన్‌ జనవరిలో అధికారాన్ని స్వీకరించిన తరువాత మన కేంద్ర మంత్రి ఒకరు అమెరికాలో పర్యటించటం ఇదే ప్రధమం. ప్రపంచ పరిణామాల గురించి ఎవరి దృష్టి వారికి ఉంటుంది, మన వైఖరి ఏమిటో కూడా వారు వినాలి కదా అని జైశంకర్‌ చెప్పారు. తన పర్యటనలో ప్రతి సమావేశంలోనూ కరోనా మీద పోరు, వాక్సిన్‌ సరఫరాలు, ఉత్పత్తి గురించి ప్రముఖంగా ప్రస్తావించినట్లు చెప్పారు. అయినా అమెరికా వైపు నుంచి నిర్ధిష్ట ప్రకటన లేదా సూచన లేదు. అంటే ఇంకా మన నుంచి ఏదో ఆశిస్తున్నది. ఇటీవలి అనుభవాల తరువాత అమెరికాతో పూర్తిగా అంటకాగితే లాభం కంటే నష్టమే ఎక్కువన్నది స్పష్టమైంది. బహుశా దీనికి సూచికగానే తమ దేశ ప్రయోజనాలు, ప్రాధాన్యతలకు అనుగుణ్యంగానే విదేశాంగ విధానం కొనసాగుతుందని అమెరికా పర్యటనకు ముందు ఒక సమావేశంలో జైశంకర్‌ చెప్పారు. ఇలాంటి వైఖరి అమెరికన్లకు నచ్చదు. వారు ఆడించినట్లు ఆడే కీలుబొమ్మలుగా ఉండాలి.

తాము కూడా ప్రపంచ స్ధాయి కార్పొరేట్లుగా ఎదగాలనుకుంటున్న మన దేశీయ కార్పొరేట్లకు అలాంటి లొంగుబాటు నష్టదాయకం కనుక అలాంటి వైఖరిని పూర్తిగా అంగీకరించరన్నది గత అనుభవం. ఉదాహరణకు అమెరికాకు చెందిన అమెజాన్‌ కంపెనీ యజమాని మన దేశం వచ్చినపుడు ఎక్కడ ముఖేష్‌ అంబానీకి కోపం వస్తుందో అని నరేంద్రమోడీ కనీసం దర్శనానికి అనుమతి కూడా ఇవ్వలేదు. అమెజాన్‌ వాణిజ్య విస్తరణను అడుగడుగునా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. తమకు వ్యతిరేకంగా భారత్‌ను మరింతగా ముందుకు తోసేందుకే వాక్సిన్‌ను ఆయుధంగా చేసుకొని అమెరికా ఇలా చేస్తున్నదని, సాయం చేసినా షరతులతో కూడినదే అవుతుందని చైనా పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాదు కరోనా రెండవ తరంగం విషయంలో వైఫల్యంతో తలెత్తిన జనాగ్రహాన్ని చల్లార్చేందుకు మోడీ సర్కార్‌ దౌత్యపరమైన బహిరంగ తమాషాకు పాల్పడిందని కూడా ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. అందుకే జైశంకర్‌ పర్యటన సాధించింది ఏమిటనే ప్రశ్నకు ప్రాధాన్యత ఏర్పడింది.


ఒకవైపు చైనా పెద్ద ఎత్తున వివిధ దేశాలకు వాక్సిన్‌ సరఫరా చేస్తున్న నేపధ్యం, మా వాక్సిన్‌ మాకే అన్న అమెరికా మీద ప్రపంచం అంతటి నుంచి వస్తున్న వత్తిడిని తట్టుకోలేక తమకు పనికిరాని దానిని గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు ఇతర షరతులను తగిలించి దానం పేరుతో ఆరుకోట్ల ఆస్ట్రాజెనెకా, మరో కోట్ల ఇతర వాక్సిన్లు కలిపి ఎనిమిది కోట్ల డోసులను ఇతర దేశాలకు ఇస్తామని ప్రకటించింది. దానిలో మన దేశానికి ఎన్నో ఇంతవరకు తేల్చలేదు. ఇంతవరకు మనకు వచ్చిందేమైనా ఉంటే మిగతా దేశాల మాదిరి ఆక్సిజన్‌ కానసెంట్రేటర్లు, ఇతర చిన్న చిన్న పరికరాలు తప్ప కీలకమైన వాక్సిన్‌ ముడిసరకుల సరఫరాలు లేవు. ఎప్పటిలోగా ఇచ్చేది కూడా ఇంతవరకు చెప్పలేదు.

అమెరికా ప్రతినిధులతో వ్యూహాత్మక మరియు రక్షణ భాగస్వామ్యం గురించి కూడా సమగ్రమైన సంభాషణ జరిగిందని, అభిప్రాయాల మార్పిడి జరిగిందని జైశంకర్‌ చెప్పారు. చతుష్టయం పేరుతో అమెరికా ఏర్పాటు చేసిన జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా కూటమిలో సభ్యత్వం గురించి తమకు స్పష్టత ఉందని చైనా చర్యల నేపధ్యంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఒక ముఖ్యమైన అంతరాన్ని పూడ్చిన కూటమితో నిబంధనలకు అనుగుణ్యమైన వ్యవస్ధకు తాము మద్దతు ఇస్తున్నట్లు వాషింగ్టన్‌ సమావేశాల తరువాత జైశంకర్‌ చెప్పారు. చతుష్టయ కూటమి ఆలోచన ఇప్పటిది కాదు.2007లోనే రూపుదిద్దుకుంది తప్ప ముందుకు సాగలేదు. మరుసటి ఏడాదే దేశ రాజకీయ అంతర్గత విబేధాల కారణంగా ఆస్ట్రేలియా కూటమి నుంచి తప్పుకుంది. తిరిగి 2017లో చేరింది. చైనా-భారత్‌ల మధ్య సరిహద్దు ఘర్షణల నేపధ్యం, ట్రంప్‌ అధికారాన్ని కోల్పోవటంతో చతుష్టయంలో కొనసాగినా చురుకుగా ఉండకపోవచ్చని మన దేశాన్ని అమెరికా అనుమానించింది. అలాంటిదేమీ లేదు, పూర్తి స్ధాయిలో పని చేస్తామని ఈ పర్యటన సమయంలో జైశంకర్‌ స్పష్టం చేసినట్లు ఈ పర్యటనమీద వెల్లడైన విశ్లేషణలు, వ్యాఖ్యలు వెల్లడించాయి. ” సభ్యులంగా దేనికైనా సిద్దపడాలి, దాని గురించి మాకు చాలా స్పష్టత ఉంది. లేనట్లయితే మేము సభ్యులుగా ఉండజాలము. ఇప్పటి వరకు ఈ కూటమి సముద్ర ప్రయాణ భద్రత, సంబంధాల గురించే చర్చించేదిగా ఉంది, ఇటీవలి సంవత్సరాలలో అది సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సరఫరా వ్యవస్దలు, వాక్సిన్ల ఉత్పత్తి గురించి కూడా చర్చిస్తున్నది, అంటే అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాల గురించి ఆందోళన ఉంది. పెద్ద దేశాలు చేయగలిగింది ఎక్కువ, పెద్ద సంబంధాలు దానికి తోడౌతాయి, అయితే చివరికి ఒక బృందంగా కొన్ని దేశాలు కూర్చుని కలసి పని చేస్తేనే అనేక పనులు జరుగుతాయి. మా అందరికీ ఒకే విధమైన స్దానం, ప్రయోజనాలు ఉన్నాయి, అలాంటపుడు అందరం కూర్చొని ఎందుకు సమస్యలను చర్చించకూడదు ” అని జైశంకర్‌ విలేకర్లను ప్రశ్నించారు. కొద్ది రోజులు గడచిన తరువాత గానీ కేంద్ర మంత్రి పర్యటన వివరాలు, పర్యవసానాలు వెల్లడయ్యే అవకాశం లేదు.

పెరుగుతున్న చైనా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసేందుకు అమెరికాతో కలసి పని చేస్తే మనకు ఒరిగేదేమీ లేదని గత ఏడు సంవత్సరాల అనుభవం నేర్పుతున్నా, మోడీ సర్కార్‌ వైఖరిలో పునరాలోచన ఉన్నట్లు కనపడదు. మరోవైపు చైనా నుంచి తనకు ఎదురవుతున్న సవాలును ఒంటరిగా ఎదుర్కోగలిగినప్పటికీ అర్ధికంగా లాభదాయకం కాదు గనుక మనవంటి దేశాలను అమెరికా తన వ్యూహంలోకి లాగుతున్నది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని, దాని లక్ష్యాలపట్ల ఏమాత్రం గౌరవం లేని శక్తులు నేడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్‌లో కూడా తరాలు మారి నయవుదారవాద విధానాల పట్ల మోజు పెరిగింది కనుకనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వాటిని అమలు జరిపారు. రాష్ట్రాల హక్కుల సమస్యల మీద ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు కూడా నయాఉదారవాద విధానాలకు అనుకూలమే గనుక వాటికి అధికారం తప్ప కాంగ్రెసా-బిజెపినా అనే తేడా పెద్దగా ఉండదు.


ఎండమావులను చూసి నీటి సరస్సులుగా భావించినట్లు అమెరికా, పశ్చిమ దేశాలను చూసి మన దేశం వాటితో జతకట్టి లబ్దిపొందాలని చూస్తున్నది. ఇప్పటికే అమెరికా -ఐరోపా ధనిక దేశాల మధ్య మిత్రవైరుధ్యం ఉంది. తమకు పోటీగా మనవంటి మరొక దేశాన్ని ఎదగనిస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. అనూహ్యంగా తమను సవాలు చేస్తున్న చైనాను దెబ్బతీసేందుకు పొరుగునే దానికి చికాకు కలిగించే శక్తివారికి కావాలి. గతంలో మనలను లొంగదీసుకొనేందుకు పాకిస్ధాన్‌ను అమెరికా, పశ్చిమ దేశాలు ప్రయోగించినట్లే ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా మనలను నిలబెట్టాలన్నది బహిరంగ రహస్యం. పాకిస్ధాన్‌ బావుకున్నదేమీ లేదు.మనకూ అదే మర్యాద జరగబోతున్నది.


గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ ఢకొీన్న సమయంలో పరిస్ధితి వేరు, ఇప్పుడు వేరు. సోవియట్‌ స్ధానంలో చైనాను దెబ్బతీయాలని చూస్తున్నారు. మొదటి విషయం చైనా నాటి సోవియట్‌ కాదు. నాడు సోవియట్‌కు వ్యతిరేకంగా యావత్‌ ఐరోపా ధనిక దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. తరువాత ఏం జరుగుతుందో తెలియదు గానీ ఇప్పుడు చైనాను ఉపయోగించుకొని లబ్దిపొందాలని అవి చూస్తున్నందున గతంలో మాదిరి అమెరికా ఏమి చెబితే అది నడవదు. ఈ తేడాను గమనించకుండా మన దేశం అమెరికాకు తోకగా మారితే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఎంఏ అధ్యక్షుడికి మత ముద్ర వేసిన కాషాయ దళం- రామ్‌దేవ్‌ బాబాకు జూన్‌ ఒకటిన వైద్యుల నిరసన !

29 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, Uncategorized

≈ Leave a comment

Tags

Ayush systems, Baba Ramdev, Christianity, Dr Johnrose Austin Jayalal, Gaytri Mantra, Hindu Fundamentalism, IMA, RSS Propaganda, Yoga


ఎం కోటేశ్వరరావు


అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తూ మాట్లాడిన రామ్‌దేవ్‌ బాబా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడినందున ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్‌ ఒకటవ తేదీన దేశవ్యాపితంగా నిరసన దినం పాటించాలని రెసిడెంట్‌ డాక్టర్ల ఫోరం పిలుపు నిచ్చింది. దీంతో ఇష్టవచ్చినట్లుగా బాబా మీద, మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగట్టే ఎండగట్టే అవకాశం ఉంది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలి లేదా వెయ్యి కోట్ల జరిమానా దావాను ఎదుర్కోవాలని అందుకు పదిహేను రోజుల గడువు ఇస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) ఇచ్చిన నోటీసులో పేర్కొన్నది. అందువలన ఆ గడువులోగా క్షమాపణ చెబుతారా, కేసును ఎదుర్కొంటారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శల తుపానుతో గుక్కతిప్పుకోలేని మోడీ సర్కార్‌కు అటు వైద్యులను సమర్ధించాలా లేకా విశ్వాసపాత్రుడైన రామ్‌దేవ్‌ను సమర్ధించాలా అన్న కొత్త తలనొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్‌ రామ్‌దేవ్‌ బాబా పతంజలి కరోనిల్‌ టూల్‌కిట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంచాలని నిర్ణయించటాన్ని బట్టి బాబాకు మద్దతు ఇస్తున్నదెవరో స్పష్టమౌతోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఏదో ఒకసాకుతో కొనుగోలు చేస్తాయా ?


వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని కొందరు పండితులు చెప్పారు, ప్రచారం చేశారు తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఏ వైద్య విధానమూ సర్వరోగ నివారిణులను కనుగొన్నాము అని ప్రకటించలేదు. అల్లోపతి కూడా చెప్పలేదు. కానీ కరోనా వైరస్‌ను సొమ్ము చేసుకోవాలని చూసిన రామ్‌దేవ్‌ బాబా వంటి వారు ఢిల్లీ పెద్దల అండచూసుకొని రెచ్చిపోతున్నారు. ప్రశ్నల పేరుతో అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికీ అనేక వ్యాధులకు సరైన ఔషధాలు, చికిత్స లేదు. అలాంటపుడు రామ్‌దేవ్‌ వంటి వారు ఒక్క అల్లోపతినే ఎందుకు ప్రశ్నించాలి, మిగతా విధానాలకు ఈ ప్రశ్నలను ఎందుకు వేయటం లేదు.


ఎందుకంటే ఆయుర్వేదం పేరుతో సొమ్ము చేసుకోవటం సులభం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం అల్లోపతి ఔషధాలకు మాత్రమే పరీక్షల నిర్దారణ నిబంధనలు ఉన్నాయి. సంప్రదాయ వైద్య పద్దతులను ప్రోత్సహించే పేరుతో ఆయుర్వేద, సిద్ద, యునానీ పేరుతో తయారు చేసే ఔషధాలకు వాటి నుంచి మినహాయింపులు ఇచ్చారు. ఆనందయ్య లాంటి వారు ఊరికొకరు మందుల పేరుతో పుట్టుకు వస్తున్నారు. ఈ లోపం కారణంగానే రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలి తాము కరోనాను అరికట్టే కరోనిల్‌ అనే ఔషధాన్ని తయారు చేసినట్లు ప్రకటించుకుంది. దాన్ని విడుదల చేసిన సభలో స్వయంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ పాల్గొన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా సొమ్ము చేసుకోవటం కంటే జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నందున ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అలా చెప్పుకోవటాన్ని సవాలు చేసింది. కనుకనే బాబా గారికి అల్లోపతి వైద్యం, వైద్యుల మీద కోపం వచ్చింది. అందుకే నోటికి ఏది తోస్తే దాన్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. చివరికి అది వివాదానికి దారితీయటంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని అల్లోపతి వైద్యం మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సలహా వంటి హెచ్చరిక చేయటంతో వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించిన బాబాగారికి ఉక్రోషం ఆగలేదు. ఐఎంఎగానీ దాని బాబు గాన్ని నన్ను అరెస్టు చేయించలేరు అని నోరుపారవేసుకున్నారు. దాని కొనసాగింపుగా వాక్సిన్‌ తీసుకున్నా పది వేల మంది వైద్యులు కరోనాతో మరణించారని అబద్దాలు ప్రచారం చేశారు. తన పాతిక ప్రశ్నలకు అల్లోపతి వైద్యవిధానాన్ని సమర్ధిస్తున్న వారు సమాధానం చెప్పాలంటూ సవాలు విసిరారు.


రామ్‌దేవ్‌ బాబా సవాలుకు తాము జవాబు చెబుతామని, తాము కూడా కొన్ని ప్రశ్నలు వేస్తామని ఆ చర్చను మీడియా సమక్షంలో నిర్వహించి ప్రత్యక్ష ప్రసారం చేయాలని, పతంజలి యోగ పీఠం నుంచి ముగ్గురు ఆయుర్వేదాచార్యులను నియమించాలని, కావాలంటే రామ్‌దేవ్‌ బాబా,ఆయన అనుచరుడు మరో భాగస్వామి బాలకృష్ణ కూడా చర్చలో ప్రేక్షకులుగా ఉండవచ్చునని ఐఎంఎ ప్రతిసవాలు విసిరింది. ఆయుర్వేదంలో వారిద్దరి అర్హతలేమిటో వెల్లడించాలని తాము గతంలోనే మూడు సార్లు కోరినప్పటికీ ఇంతవరకు జవాబు లేదని, అర్హత లేనివారితో చర్చించటం పద్దతి కాదు కనుక వారు తమ నిపుణులను నియమించాలని స్పష్టం చేసింది. అల్లోపతి వైద్య సామర్ద్యాన్ని ప్రశిస్తూ రామ్‌దేవ్‌ ప్రశ్నలు ఉన్నాయి.
ఈ వివాదంలో బిజెపి బీహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సంజరు జైస్వాల్‌ అల్లోపతి వైద్యులకు మద్దతు ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో స్పందిస్తూ రామ్‌దేవ్‌ ఒక యోగా గురువు మాత్రమే, దానిలో ఆయన సమర్దతను ఎవరూ ప్రశ్నించరు. పానీయాలకు కోకా కోలా ఎంత ప్రాచుర్యం తెచ్చిందో యోగాకు ఆయన అలా చేశారు.భారతీయులు పురాతన కాలం నుంచీ షికంజీ, తండారు వంటి పానీయాలను తాగుతున్నారు. కోకా కోలా వచ్చిన తరువాత అదే జనాలు పెప్సీ, కోక్‌లను ఇండ్లలో నిలవచేసుకుంటున్నారు. రామ్‌దేవ్‌ యోగి కాదు, ఎందుకంటే యోగులు తమ మెదళ్లు, స్పృహలను అదుపులో ఉంచుకుంటారని అన్నారు. అల్లోపతి వైద్యులు పనికిమాలిన చర్చల్లో తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దని పవిత్రమైన వృత్తి మీద కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. వ్యాధులను దూరంగా ఉంచినంత వరకు ముఖ్యమైనదే గాని యోగా వైద్యవిధానం కాదు, ప్రతి వైద్యవిధానానికి దేనికి ఉండే పరిమితులు దానికి ఉంటాయి, యోగా మనలను జాడ్యానికి దూరంగా ఉంచవచ్చు కానీ ఉన్న రోగాలకు చికిత్సగా చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి అన్నారు.


ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి డాక్టర్‌ సహజానంద కుమార్‌ సింగ్‌ ఒక ప్రకటన చేస్తూ రామ్‌దేవ్‌ తన యోగా, పతంజలి ఉత్పత్తులకు పరిమితం కావాలి, కరోనా సమయంలో అవసరమైన చికిత్స చేస్తున్న వైద్యులను నిరుత్సాహపరచ కూడదన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ పదివేల మంది వైద్యులు మరణించారంటూ పుకార్లు వ్యాపింప చేస్తున్నందుకు, కరోనా మీద ప్రభుత్వ చికిత్సా విధానాలను సవాలు చేయటం దేశద్రోహంగా పరిగణించి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసినట్లు తెలిపారు. అలాంటి చర్యలు జనాన్ని వాక్సిన్లు తీసుకోకుండా చేసేందుకు ప్రోత్సహిస్తాయని, ఇది జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని, ఇంతకంటే దేశద్రోహం ఏముంటుందని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌ ఐఎంఎ శాఖ వెయ్యి కోట్ల పరువు నష్టం దావా నోటీసు పంపిందన్నారు.


కరోనిల్‌ గురించి పతంజలి తప్పుడు ప్రచారం చేసి రోగులను తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటంతో దాని సామర్ధ్యం గురించి ఐఎంఎ సవాలు చేసింది. అయితే తాము 46 మంది రోగుల మీద పరీక్షలు జరిపామని సమర్ధించుకొనేందుకు చూసినప్పటికీ కుదరకపోవటంతో అది చికిత్సకు సహాయకారి అని ప్రకటించాల్సి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ సంస్ధ కూడా అలాంటిదిగానే పరిగణించి అనుమతి ఇచ్చినప్పటికీ ఏకంగా కరోనా నిరోధం అని ప్రచారం చేశారు. దీంతో ఐఎంఎ మీద అక్కసుతో అల్లోపతి వైద్యం బుద్ది తక్కువ శాస్త్రం అని రామ్‌దేవ్‌ అంటే పతంజలి సంస్ధ సారధుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ సమస్యకు మతం రంగు పులిమి కుట్ర కోణాన్ని ముందుకు తెచ్చి పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. బిజెపి అనుకూల మీడియా కూడా దాన్ని భుజానవేసుకొని మతకోణాన్ని ముందుకు తీసుకు వచ్చిదాడి చేస్తోంది. సహజంగానే ఆ దాడికి గురైన నెటిజన్లు అదే పాటపాడుతున్నారు.


యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు అని బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దీని వెనుక అసలు కారణంగా కరోనిల్‌ మీద అదే విధంగా అల్లోపతిని అవమానిస్తూ వ్యాఖ్యానించిన రామ్‌దేవ్‌ మీద చర్యకు డిమాండ్‌ చేసిన ఐఎంఏకు ప్రస్తుతం అధ్యక్షుడిగా డాక్టర్‌ జాన్‌ రోజ్‌ జయలాల్‌ చురుకుగా వ్యవహరించటమే. తన పదవిని ఉపయోగించుకొని జాన్‌ రోజ్‌ జనాన్ని క్రైస్తవులుగా మార్చేందుకు పూనుకున్నారని గర్హనీయ, హాస్యాస్పదమైన ఆరోపణలకు దిగారు.


ప్రతిదానికీ ఆయుర్వేదంలో చికిత్స ఉంది, ఔషధాలున్నాయని చెప్పే వారు ప్రత్యామ్నాయ చికిత్సా విధానం కోసం ఎదురు చూస్తున్న జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు దేన్నీ వదలటం లేదు.మూడు సంవత్సరాల క్రితం కేరళలో వచ్చిన నీఫా వైరస్‌ వ్యాప్తి సమయంలో కూడా ఆయుర్వేదంలో కషాయ చికిత్స ఉందంటూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకున్న సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. అప్పుడు కూడా ఐఎంఎ రంగంలోకి దిగి జనాన్ని హెచ్చరిస్తూ అలాంటి ప్రచారాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించింది.నిజానికి నీఫా వైరస్‌ 1990 దశకంలోనూ, తరువాత కూడా మన దేశంలో వ్యాపించింది, దేశంలో కేరళ ఆయుర్వేద ప్రాచుర్యం గురించి తెలిసిందే, అయినప్పటికీ ఆ వైద్య విధానం లేదా ఆరంగంలో పని చేస్తున్న వారు గానీ ఔషధాన్ని తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఎలాంటి అర్హతలు, నైపుణ్యంలేని ఆనందయ్య కరోనాకు తాను మందు తయారు చేశానని చెబితే సమర్ధించే ఆయుర్వేద వైద్యులందరూ తమ పట్టాలను పక్కన పడేసి కల్వాలు-గూటాలు తీసుకొని ఆనందయ్య అనుచరులుగా మారిపోవటం మంచిది. ఆనందయ్యను సమర్ధించే పాలకులు ఆయుర్వేద కాలేజీలు, ఆసుపత్రులను అల్లోపతికి మార్చివేయాల్సి ఉంటుంది.


తన పదవిని ఉపయోగించుకొని జనాన్ని క్రైస్తవంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న తప్పుడు వార్తలను పట్టుకొని ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ ఐఎంఎ అధ్యక్షుడు జాన్‌ రోజ్‌ జయలాల్‌ మీద ఒక క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. రామ్‌దేవ్‌పై ఐఎంఎ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఇది దాఖలు కావటం గమనించాల్సిన అంశం. సామాజిక మాధ్యమంలో ప్రకటనలు చేయటం ద్వారా మత బృందాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని లాయర్‌ ఆరోపించారు. తాను ఒక టీవీ చర్చను చూశానని, దానిలో బాబా రామ్‌దేవ్‌ను దూషిస్తూ, దుర్భాషలాడారని, బెదిరించారని, తాను యోగా గురువు భక్తుడిని కనుక మానసికంగా గాయపడ్డానని పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ” కుష్టు, కలరా, ఇతర మహమ్మారులు ప్రపంచంలో నష్టం కలిగించినపుడు వాటికి వ్యతిరేకంగా క్రైస్తవ వైద్యులు, చర్చ్‌లు పని చేశారని, క్రైస్తవ కరుణ చూపించారని ” చెప్పారని అది క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నమని ఆరోపించారు.


ఒక కులం లేదా మతంలో పుట్టటం అనేది ఎంపిక ప్రకారం జరిగేది కాదు.అనేక మంది హిందూ, ముస్లిం, సిక్కు తదితర మతాల కుటుంబాలలో పుట్టినట్లుగానే డాక్టర్‌ జాన్‌ రోజ్‌ క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అతని మీద చేస్తున్న ఆరోపణల స్వభావం ఏమిటి ? అతను హగ్గారు ఇంటర్నేషనల్‌ అనే క్రైస్తవ సంస్ద సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రతి దేశాన్ని ఏసు క్రీస్తు సువార్తతో మార్చివేయాలన్న లక్ష్యం మాది అని సదరు సంస్ధ ప్రకటించుకుంది. ఐఎంఎ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆధ్యాత్మిక జీవితంలో వైద్య వృత్తిలో సువార్త స్ఫూర్తిని నింపుకొని పని చేస్తానని, దేవుడికి సజీవ సాక్షిగా జీవించాలని గాఢంగా భావిస్తున్నాను. తమ వ్యక్తిగత రక్షకుడిగా ఏసును స్వీకరించాలని యువ వైద్య విద్యార్ధులు, వైద్యులను ప్రోత్సహిస్తాను, నేను పని చేస్తున్న ఒక లౌకిక సంస్ధలో దేవుడికోసం ఒక సాక్షిగా పని చేస్తాను అని చెప్పారు. సంఘపరివార్‌ శక్తులు ఈ మాటలను పట్టుకొని వాటికి చిలవలు పలవలు అల్లి తమ భాష్యాన్ని జోడించి నానా యాగీ చేశాయి. సదరు హగ్గీ సంస్ద ప్రకటించుకున్న లక్ష్యాలకు జాన్‌ రోజ్‌ ఎలా బాధ్యుడు అవుతారు?


లౌకిక రాజ్యాన్ని హిందూత్వ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించిన ఆర్‌ఎస్‌ఎస్‌లోని వారే నేడు దేశాన్ని ఏలుతున్నారు. నిత్యం అందుకోసమే ఎన్ని ఎత్తులు, ఎన్ని జిత్తులు,ఎంతగా ప్రచారం చేస్తున్నారో తెలుసు. అలాంటివి ఇంకా అనేక సంస్ధలు ఉన్నాయి. వాటి సమావేశాల్లో పాల్గొన్నవారు అనేక మంది వివిధ అధికారిక సంస్దలు, పదవుల్లో ఉన్నారు. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అలాంటిది కాదు, వైద్య వృత్తిదారుల సంస్ధ. దాని నిబంధనావళికి లోబడి అర్హతలు ఉన్న ఎవరైనా చేరవచ్చు, పదవులకు ఎన్నిక కావచ్చు. వివిధ మతాలకు చెందిన వైద్యులు దాని సభ్యులుగా ఉండి తమ మత సంస్ధల సమావేశాలు, ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటమా లేదా అనేది వారిష్టం. అదేమీ అనర్హత కాదు కనుకనే జాన్‌ రోజ్‌ జయలాల్‌ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న అనేక మంది తమ మతవిశ్వాసాలకు అనుగుణ్యంగా గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. అంతమాత్రాన లౌకిక రాజ్యాంగం ప్రకారం పదవిని పొందిన వారిని వాటికి వెళ్లవద్దని ఎవరూ చెప్పటం లేదు. అది వారికి సంబంధించిన వ్యక్తిగత అంశం. విధి నిర్వహణలో తమ మతాన్ని, కులాన్ని తీసుకురావటం చట్టవిరుద్దం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. జాన్‌ రోజ్‌ ఎన్నికైన తరువాత ఏ వైద్య విద్యార్ధులు లేదా వైద్యులను ఐఎంఎ అధ్యక్షుడి హౌదాలో సమావేశ పరచి క్రైస్తవాన్ని పుచ్చుకోమని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు సర్కార్‌ పుష్కర స్ధానాలు చేస్తే పుణ్యం వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బిజెపి ముఖ్యమంత్రులు, మంత్రులు కుంభమేళాలో పాల్గొని గంగలో మునగాలని ప్రోత్సహించారు, తమ అధికార పదవులను దుర్వినియోగం చేశారు.


ఇక జాన్‌ రోజ్‌ హిందూయిజాన్ని, పురాతన భారత సంస్కృతిని ద్వేషించారు అన్న ఆరోపణ. ఏ సందర్భంలో ద్వేషించారో లేదో కాషాయ దళాల రాతలను బట్టి నిర్ధారణలకు రాలేము. లేదూ ఒకవేళ ద్వేషించారే అనుకుందాం. అలాంటి అభిప్రాయాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. లేదూ మతవిద్వేషాలు రెచ్చగొట్టిన నేపధ్యం ఏమైనా ఉందా ? ఒక అభిప్రాయం కలిగి ఉండటం దేశద్రోహమా, రాజ్యాంగ విరుద్దమా ? కులము-హిందూయిజం రెండింటికీ తేడాలేదని ద్వేషించిన తరువాతనే కదా అంబేద్కర్‌ రాజ్యాంగ రచనకు అధ్యక్షత వహించలేదా, కేంద్రమంత్రిగా పని చేయలేదా.
ఒక ఇంటర్వ్యూలో ” వారు దేశాన్ని ఒకటిగా, వైద్య పద్దతిని ఒకటే ఉండాలని కోరుకుంటున్నారు, రేపు ఒకే మతం ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా సంస్కృత భాష ప్రాతిపదికన, అది ఎల్లవేళలా హిందూ సిద్దాంతాలతోనే ఉంటుంది.ఇది పరోక్ష పద్దతిలో సంస్కృతం పేరుతో జనం మెదళ్లలో హిందూత్వను నింపాలని చూస్తున్నారు ” అని కూడా జాన్‌ రోజ్‌ చెప్పారట. దానిలో అభ్యంతరం ఏముంది, గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నది అదే కదా ?


ప్రాణాయామం చేయటం ద్వారా, గాయత్రీ మంత్రాన్ని పఠించి కరోనాను పోగొట్టవచ్చా అని పరీక్షలు చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ నిర్ణయించటాన్ని, రెండు వారాల పాట్లు క్లినికల్‌ ప్రయోగాలు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి, దాన్ని చదివి, విన్న వారికి కలిగే అభిప్రాయం ఏమిటి ? హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రోత్సహించటమా కాదా ? ముస్లిం, క్రైస్తవ ఇతర మతాల ప్రార్ధనలతో కూడా కరోనాను పోగొట్టవచ్చేమో పరీక్షించాలని గాయత్రీ మంత్రంతో పాటు ఎందుకు జత చేయలేదు. దీనితో పోల్చుకుంటే చర్చిల్లోంచి పరిశుద్ద జలం తెచ్చి వాటిని తాగితే లేదా చల్లుకుంటే కరోనా పోతుందని జాన్‌ రోజ్‌ చెప్పలేదు. తాను చెప్పిన వాటిని వక్రీకరించారని డాక్టర్‌ జయలాల్‌ చెప్పారు, ఆయన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఐఎంఎం స్వయంగా ఖండించింది. తమ విధానాలు, వైఖరిని విమర్శించిన ప్రతివారి మీద మతం ముద్రవేయటం ద్వారా తమ దాడిని సమర్ధించుకొనే యత్నం తప్ప ఇది మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d