• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

2022 ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు : నరేంద్రమోడీ,యోగి ఓదార్పు – లఖింపూర్‌ ఖేరీ నేరం మధ్య నలుగుతున్న బిజెపి విధి రాత !

04 Tuesday Jan 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, 2022 UP polls, BJP, BSP, Lakhimpur Kheri killings, Narendra Modi Failures, Samajavadi party, UP BJP poll fate, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


ఉత్తర ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసేందుకు బిజెపి నేతలు గంగకు ఎదురీదుతున్నారు.కరోనా శవాలను తనలోకి నెట్టిన వారిని గంగామాత ఏం చేస్తుందో చెప్పలేము. గడచిన నాలుగు దశాబ్దాలలో 1985 తరువాత ఇక్కడ ఒకసారి అధికారానికి వచ్చిన పార్టీ వరుసగా రెండవసారి గద్దెనెక్కలేదు.దాన్ని చరిత్రలోకి నెట్టివేసేందుకు నరేంద్రమోడీ ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రాన్ని ఒకేసారి రెండు ఇంజన్లు (కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో యోగి) లాగుతూ అభివృద్ది పరుగుపెట్టిస్తున్నామని చెప్పుకొనే బిజెపి నేతలు కొత్త రికార్డు నెలకొల్పుతారా ? ఎన్నికల ముందు అనేకం అంటాం, అనుకుంటాంగానీ గానీ సంప్రదాయం కొనసాగింది తప్ప ఇది మా ఓటమి కాదు అని చెప్పే పరిస్ధితి వస్తుందా లేక చూశారా మా తడాఖా మల్లయోధుడి పార్టీ(సమాజవాది- ములాయం సింగ్‌ యాదవ్‌ రాజకీయాల్లోకి రాక ముందు మల్లయోధుడు, ఆయన కుమారుడే ప్రస్తుత పార్టీ నేత, మాజీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ )ని మట్టి కరిపించాం అని జబ్బలు చరుచుకుంటారా ? చూద్దాం, తినబోతూ రుచెందుకు ?


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందు బిజెపిని ఇరుకున పెడుతుందని భావిస్తున్న లఖింపూర్‌ ఖేరీ కేసులో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. అక్టోబరు మూడవ తేదీన లఖింపూర్‌ ఖేరీ వద్ద సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై మోటారు వాహనాలను తోలి రైతులను హత్యచేసిన ఉదంతంలో నలుగురు రైతులు మరణించారు. ఒక జర్నలిస్టు ప్రాణాలు కూడా తీశారు. ఆగ్రహించిన రైతుల చేతిలో వాహనాల్లో ఉన్న ముగ్గురు బిజెపి కార్యకర్తలు కూడా మరణించారు. రైతుల మీదకు కార్లను తోలిన వారిలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆషిష్‌ మిశ్రా తదితరులు ఉన్నారని వచ్చిన వార్తలను అప్పుడు బిజెపి తోసి పుచ్చింది. అప్పుడు అతగాడు వేరే చోట ఉన్నట్లు కతలు చెప్పింది. కేసును నీరు కార్చేందుకు పూనుకోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. మూడు నెలల తరువాత పోలీసులు దాఖలు చేసిన ఐదువేల పేజీల ఛార్జి షీట్‌లో మంత్రి కుమారుడు ఆషిష్‌ మిశ్రా ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న రైతులను హత్యచేసేందుకు పధకం ప్రకారం కుట్రపన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేర్కొన్నది. ఉదంతం జరిగిన సమయంలో ఆషిష్‌ మిశ్రా ఘటనా స్ధలిలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఆషిష్‌ బంధువు కూడా సహనిందుడని పేర్కొన్నారు. తాను ఆ సమయంలో అక్కడ లేనంటూ కొన్ని వీడియోలు, పది మందితో అఫిడవిట్‌లను పోలీసులకు అంద చేశారు. ఘటన జరిగినపుడు ధీరేంద్ర శుక్లా అనే అతను ఉన్నాడని, అతని కారు ఆషిష్‌ మిశ్రా కారువెనుకే ఉందని ఈ వాస్తవాన్ని ధీరేంద్ర దాచినట్లు సిట్‌ పేర్కొన్నది. ఈ కేసు తరువాత ఏమౌతుందో చెప్పలేము గానీ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలగించాలనే డిమాండ్‌ మరింత ఊపందుకోవటంతో పాటు ఎన్నికల్లో ప్రచార అంశంగా మారనుంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎంపిక చేసిన పార్టీ ఎంపీలతో ప్రధాని నరేంద్రమోడీ జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా ఉంచినట్లు వార్తలు వచ్చాయి.


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి తాజాగా టైమ్స్‌ నౌ నవభారత్‌కు వీటో సంస్ధ నిర్వహించిన సర్వేలో 403 స్ధానాలకు గాను బిజెపి 230-249 మధ్య తెచ్చుకొని సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందని తేలినట్లు ప్రకటించారు. సమీప సమాజవాది పార్టీకి 137-152, బిఎస్‌పికి 9-14, కాంగ్రెస్‌కు 4-7 మధ్య రావచ్చని పేర్కొన్నారు. బిజెపి ఏడు పార్టీలతో కూటమిగా పోటీలోకి దిగుతోంది. సమాజవాది , కాంగ్రెస్‌, బిఎస్‌పి, ఆప్‌ పార్టీ విడివిడిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. వాటితో ఏ పార్టీలు జత కట్టేది చూడాల్సి ఉంది. టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం బిజెపి కూటమికి 38.6శాతం, సమాజవాదికి 34.4, బిఎస్‌పికి 14.1 శాతం ఓట్లు రావచ్చని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు, ఓట్లు, వచ్చే ఎన్నికల్లో అంచనాల పోలిక ఇలా ఉంది.2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి 311, మిత్రపక్షం కాంగ్రెస్‌ 114 చోట్ల పోటీ చేసింది. 2019లో ఎస్‌పి, బిఎస్‌పి ఒక కూటమిగా, కాంగ్రెస్‌ విడిగా పోటీ చేసింది.
పార్టీ××××××× 2017×× శాతం×× 2019××శాతం ×× 2022××శాతం
బిజెపి కూటమి×× 325 ×× 40.78× 64 ××× 51.19×× 230-49×× 38.6
ఎస్‌పి కూటమి×× 48 ××× 21.82× 5 ×××18.11 ××137-152×× 34.4
బిఎస్‌పి×××××× 19 ××× 22.23× 10 ××× 19.43 ×× 9-14 ××× 14.4
కాంగ్రెస్‌ ××××× 7 ××× 6.25 × 1 ××× 6.41 ×× 4-7 ×××× 5
ఈ అంకెలను చూసినపుడు బిజెపి ఓటింగ్‌ 2017-2019 మధ్య పదిశాతంపైగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో 2017 కంటే తగ్గవచ్చని సర్వేలు చెబుతున్నాయి. సమాజవాది పార్టీ ఓటింగ్‌ 2017, 2019లో పెద్దగా మారలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుతో పోలిస్తే రెట్టింపు కావచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వే లఖింపూర్‌ ఖేరీ కేసులో చార్జిషీటు దాఖలు చేయక ముందు చేసినది. ప్రధాన సవాలు సమాజవాది నుంచే అనే వాతావరణం వచ్చిన తరువాత బిజెపి వ్యతిరేక ఓటర్లు సహజంగానే కొన్ని ఓట్లు ఎస్‌పికే పడతాయి.బిజెపిని ఓడించాలని కోరుకొనే బిఎస్‌పి, కాంగ్రెస్‌ అభిమానులు కూడా ఎస్‌పి వైపే మొగ్గవచ్చు. ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలవచ్చనే వాతావరణం ఉన్నందున బిజెపి తన మత, కుల అజెండాను మరింతగా ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. కరోనా రెండవ తరంగం నివారణలో వైఫల్యం, శవాలను గంగలోకి నెట్టివేసిన నిర్వాకం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతం, రైతు ఉద్యమ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి రామాలయ నిర్మాణం వంటి అంశాలు తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నమ్ముతోంది.
ఎన్నికల నోటిఫికేషన్‌తో నిమిత్తం లేకుండానే బిజెపి మాదిరి సమాజవాది కూడా జరుపుతున్న సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు.తాము అధికారంలోకి వస్తే 300యునిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని ఎస్‌పి, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించాయి. రైతులకు ఉచితంగా ఇస్తామని ఎస్‌పి పేర్కొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రకాల రేట్లు వసూలు చేస్తున్నారు. గ్రామాలలో వంద యూనిట్లకు రు. 3.35, 101నుంచి 150కి రు.3.85, 151 నుంచి 300కు రు.5, ఆ పైన రు. 6 కాగా పట్టణాల్లో 150 వరకు రు.5.50, 151 నుంచి 300 వరకు రు.6, 301 నుంచి 500వరకు రు.6.50, ఆ పైన రు.7 ఉంది.


పార్టీని బూత్‌ స్ధాయివరకు విస్తరించి ఉంటే వచ్చే ఎన్నికల్లో 325కు మించి గెలుస్తామని సిఎం యోగి ఆదిత్యనాధ్‌ చెబుతున్నారు. సోదరి మాయావతి ఎన్నికలంటే భయపడుతున్న కారణంగానే ప్రచారం ప్రారంభించలేదని,చలిని వదిలించుకోవాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యను ఆమె ఖండించారు. ప్రభుత్వ సొమ్ముతో బిజెపి నేతలు జనాన్ని చలికాలంలో కూడా వెచ్చగా ఉంచుతున్నారని తిప్పికొట్టారు. తాము ఇతర పార్టీలను అనుకరించబోమని, తమ శైలి తమకు ఉందన్నారు. ఎన్నికల ముందు అధికారంలో ఉన్న వారు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల పేరు చెప్పి ప్రభుత్వ సొమ్ముతో సభలు పెడతారని, తమ వంటి వారికి సాధ్యం కాదన్నారు.తమను అపహాస్యం చేసినా తమ వైఖరి మారదని, ఇతర పార్టీలు తమ గురించి ఆందోళన చెందాల్సినపని లేదన్నారు.


కులాల సమీకరణలు,మత ధోరణుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉత్తర ప్రదేశ్‌ ఒకటి. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి చేయని పని లేదు. రామ మందిర సమస్యను ముందుకు తెచ్చి గతంలో లబ్ది పొందిన ఆ పార్టీకి ఒక సర్వే అంశాలు ఆందోళన కలిగించక మానవు. కుల, మత ప్రాతిపదికన ఓటు వేస్తున్నామని 24శాతం మంది చెప్పగా వచ్చే ఎన్నికల్లో రామ మందిరం ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పిన వారు ఒక్కశాతమే అని ఇండియా న్యూస్‌ జన్‌కీ బాత్‌ సర్వే పేర్కొన్నది. బిజెపికి వస్తాయని చెబుతున్న ఓట్లలో యాదవేతర బిసి, బ్రాహ్మణ ఓట్లలో ఎక్కువ భాగం ఉంటాయని, ఎస్‌పికి ముస్లింలు, యాదవుల ఓట్లు గణనీయంగా వస్తాయని చెబుతున్నారు.


గో రక్షణ, గొడ్డుమాంసం పేరుతో బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వట్టిపోయిన వాటిని అమ్ముకొనే వీలు లేకపోవటంతో యజమానులు వాటిని వదలి వేయటంతో పంటలను కాపాడుకొనేందుకు రైతులు కాపలాలు కాయాల్సి వస్తోంది.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చెరకు బకాయిలు పేరుకు పోయాయి. అత్యంత వెనుకబడిన తరగతుల వారిని యాదవులు పైకి రానివ్వటం లేదనే పేరుతో బిజెపి ఇతర వెనుకబడిన తరగతుల వారిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తమకు ఒరిగిందేమీ లేదని యాదవుల బదులు ఠాకూర్ల పెత్తనం కిందికి వచ్చామని వారు ఇప్పుడు భావిస్తున్నారు. మత ప్రాతిపదికన బిజెపి పరివారం జనాన్ని చీల్చితే, రైతు ఉద్యమం ఐక్యం చేసేందుకు బాటలు వేసిందని వార్తలు వచ్చాయి. నామినేషన్లు వేసి, ఎవరెటో తేలిన తరువాత ఎన్నికల తీరు తెన్నులపై మరింత స్పష్టత వస్తుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ : రచ్చకీడ్చిన కేరళ గవర్నర్‌, బిజెపి – కాంగ్రెస్‌లో చిచ్చు !

02 Sunday Jan 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

D.Litt to President row, governor arif mohammad khan, Kerala LDF, Pinarai Vijayan, Ramesh Chennithala


ఎం కోటేశ్వరరావు


రాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్‌ను ఇమ్మని తాను సిఫార్సు చేసినట్లు చెబుతూ కొందరు బాధ్యతారహిత, తెలివితక్కువ ప్రకటనలు చేస్తున్నారని, అవి జాతీయ వ్యవస్ధల గౌరవ, మర్యాదలను దెబ్బతీస్తున్నాయని, ఆందోళనకరమైన ధోరణులను చూస్తున్నానని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదివారం నాడు కోచిలో విలేకర్లతో చెప్పారు.రాష్ట్రపతి, గవర్నర్‌ జాతీయ వ్యవస్ధలని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ ప్రకారం వాటిని గౌరవించాలని అన్నారు.వాటి గురించి ఆషామాషీగా చర్చించకూడదన్నారు.ఒక రాష్ట్రపర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ పట్టా ఇచ్చి సత్కరించాలా ? అలాంటి ప్రోటోకాల్‌ ఉంటే దాన్ని అమలు జరపటం రాష్ట్రాల విధి. లేనపుడు విశ్వవిద్యాలయాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. లేనపుడు రచ్చ చేస్తే రాష్ట్రపతికి అవమానం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేరళలో అదే జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసే కొంత మంది కాంగ్రెస్‌ నేతలు, బిజెపికి అందుకు పూనుకున్నారు. డిసెంబరు 21 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ కేరళ పర్యటన జరిపారు. ఆ సందర్భంగా గౌరవ పట్టాతో సత్కరించకపోవటం అవమానించటమే అని బిజెపి ఆరోపించింది. కాంగ్రెస్‌లోని ఒక ముఠానేత రమేష్‌ చెన్నితల, పరోక్షంగా రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఈ అంశాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు.


రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ పట్టా ఇవ్వాలని గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కేరళ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ను కోరినట్లు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు మీడియాలో కథలు వచ్చాయి. దీని గురించి కాంగ్రెస్‌ సిఎల్‌పి మాజీ నేత రమేష్‌ చెన్నితల తన ఫేస్‌బుక్‌లో ప్రకటన చేస్తూ గవర్నర్‌ సిఫార్సు నిజమేనా, రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరించే హక్కు ఉందా ? దాని సంగతి తేల్చాలని కోరారు.సిఎల్‌పి నేత విడి సతీషన్‌ స్పందిస్తూ చెన్నితల చేసిన ప్రకటన గురించి తనకు తెలియదని, ఏదైనా ఒక అంశం మీద పార్టీ వైఖరి నిర్ణయించేది పిసిసి అధ్యక్షుడు, తాను మాత్రమే అన్నారు. పద్దతికి విరుద్దంగా ఎవరికైనా గౌరవడాక్టరేట్‌ను ఇమ్మని గవర్నర్‌ గనుక సూచించి ఉంటే అది చట్టవిరుద్దమని, గవర్నర్లకు అలాంటి అధికారం లేదని కూడా సతీషన్‌ చెప్పారు. దాంతో ప్రభుత్వానికి వంతపాడుతున్నారంటూ సతీషన్‌ మీద బిజెపి నేత, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ధ్వజమెత్తారు, సిఫార్సు చేసేందుకు గవర్నర్‌కు పూర్తి అధికారం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతిని అగౌరవపరచిందని ఆరోపించారు.


కన్నూరు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా పని చేసిన గోపీనాధ్‌ రవీంద్రన్‌ పునర్నియాకాన్ని గవర్నర్‌ తిరస్కరించి వివాదం రేపారు. ఆమోదిస్తూ సంతకం చేసిన తరువాత నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వివాదంలో ఛాన్సలర్‌గా గవర్నర్‌కు హైకోర్టు ఇచ్చిన నోటీసును తీసుకొనేందుకు తిరస్కరించి తాను ఛాన్సలర్‌గా లేనని, రాష్ట్ర ప్రభుత్వానికే పంపాలని గవర్నర్‌ కోరారు. డిసెంబరు ఎనిమిది నుంచి ఛాన్సలర్‌ బాధ్యతల్లో లేనని చెబుతున్నారు.తనకు వచ్చే ఫైళ్లను ప్రభుత్వానికి తిప్పి పంపుతున్నారు. ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టమైన హామీ ఇస్తేనే తిరిగి బాధ్యతలు స్వీకరిస్తానని చెబుతున్నారు.


రాష్ట్రపతికి గౌరవడాక్టరేట్‌ ఇవ్వాలని తాను కోరిందీ లేనిదీ, ఎప్పుడు కోరిందీ, అసలేం జరిగిందన్నది గవర్నర్‌ చెప్పాలి, కానీ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల సదరు అంశాన్ని ఎందుకు లేవనెత్తారు అన్నది సమస్య. ఒక పౌరుడిగా, ఎంఎల్‌ఏగా తనకు తెలుసుకోవాల్సిన అవకాశం, హక్కు ఉందనుకుంటే గవర్నర్‌, రాష్ట్రప్రభుత్వానికి రాసి తెలుసుకోవచ్చు, బహిరంగ రచ్చ ద్వారా గవర్నర్‌ పదవి, రాష్ట్రపతిని కూడా అవమానించటమే అని విమర్శలు వచ్చాయి.చెన్నితల, బిజెపి నేతల ప్రకటనలతో ఇబ్బంది పడిన గవర్నర్‌ వారిది బాధ్యతా రాహిత్యం, తెలివితక్కువతనమని చెప్పారు. తాను డిసెంబరు ఎనిమిది నుంచే ఛాన్సలర్‌గా తప్పుకున్నట్లు చెబుతున్న గవర్నర్‌ గౌరడాక్టరేట్‌ గురించి ఎప్పుడు సిఫార్సు చేశారు అన్నది ఒక సందేహమైతే, ఛాన్సలర్‌కు అలాంటి అధికారం ఉందా అన్నది ప్రశ్న. ఇంత రచ్చ జరిగిన తరువాత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నరుకు లేదా ? గౌరవ పట్టా గురించి ఏదైనా సమస్య ఉంటే గవర్నర్‌ తప్ప మూడవ పక్షం ఎందుకు మాట్లాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ ప్రశ్నించారు. సిఫార్సు చేసి ఉంటే గవర్నరే స్వయంగా వివరణ ఇవ్వాలి, ఈ సమస్య పార్టీ, ప్రభుత్వం ముందుకు రాలేదు అన్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు స్పందిస్తూ గవర్నర్‌ నుంచి ఈ అంశంలో వచ్చిన సిఫార్సులను తిరస్కరించలేదని స్పష్టం చేశారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ గవర్నర్‌గా కంటే బిజెపి ప్రతినిధిగా పని చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదివేందుకు తిరస్కరించిన అంశం తెలిసిందే. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా జరిపేందుకు అనుమతి నిరాకరించి వివాదం రేపారు. ఎందుకని కూడా ప్రశ్నించారు. పౌరసత్వ చట్ట సవరణ( సిఎఎ)కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినపుడు కూడా గవర్నర్‌ విమర్శలకు దిగారు. రాజ్యాంగ విరుద్దం, పనికిరాదని అన్నారు. కన్నూరు విసి నియామకాన్ని నిరసిస్తూ డిసెంబరు ఎనిమిదిన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒక ఛాన్సలర్‌గా అనుమతించాల్సింది తానేనని, మంచి చెడులను తానే బాగా నిర్ణయించగలని పేర్కొన్నారు. అంతేకాదు, ఆ లేఖను మీడియాకు విడుదల చేసి ఘర్షణకు దిగారు. ఈ వివాదం గురించి ముఖ్యమంత్రి హుందాగా స్పందించారు. మార్గదర్శక సూత్రాల ప్రకారమే విసి ఎంపిక జరిగిందన్నారు.గవర్నర్‌ మనస్సాక్షికి విరుద్దంగా పని చేయాలని తాము కోరటం లేదని, గవర్నర్‌ తన వైఖరిని మార్చుకుంటే అది నియామక ఉత్తరువు మీద సంతకం చేయక ముందు జరగాలని, తరువాత నిరసన వెల్లడించటం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఏదో ” జోక్యం లేదా వత్తిడి ” వచ్చి ఉండాలని అన్నారు.


రాజభవన్‌లను రాజకీయ కేంద్రాలుగా మార్చటంలో బిజెపి ఏలికలు కాంగ్రెస్‌ను తలదన్నారు. బిజెపికి అధికారం వచ్చే అవకాశం ఉంటే సాధనాలుగా మారటం, లేని చోట ఏదో ఒక రచ్చ చేస్తూ గవర్నర్‌ పదవులకు మచ్చ తెస్తున్నారు. వివాదాస్పద గవర్నర్ల జాబితాలో ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ అగ్రభాగాన ఉంటారు. ఒక రాజకీయవేత్తగా ఆయన ప్రస్తానాన్ని చూసినపుడు సంఘపరివార్‌ నమ్మినబంటుగా మనకు కనిపిస్తారు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో 2019 భారత చరిత్ర కారుల(ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) 80వ మహాసభ జరిగింది. దాన్ని ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ముందుగా తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని తరువాత గవర్నర్‌ ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని పేర్కొన్నారు. కన్నూరు సభలో ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు.


షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐదు రాష్ట్రాల ఎన్నికలు : బెట్టింగ్‌ బంగార్రాజులూ జాగ్రత్త !

30 Thursday Dec 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

2022 UP polls, AAP, Betting market, BJP, Congress party, five states 2022 elections, Samajwadi Party


ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మాయాబజార్‌ వాగ్దానాలతో పార్టీలు ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురిచేస్తున్నాయో తెలిసిందే. ఎన్నికల ఫలితాలు, కొందరు ప్రముఖుల గెలుపు, మెజారిటీల మీద తిధి, వార, నక్షత్రాల పేరుతో జోశ్యాలు చెప్పేవారు, పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంతో పాటు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే సంఖ్యల మీద కూడా పందాలు ప్రారంభమయ్యాయి.ఒక అంచనా ప్రకారం 2021 మే నెలలో జరిగి ఎన్నికల్లో 25వేల కోట్ల రూపాయల వరకు ఉండగా 2022 ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 50 వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో పోటీ తీవ్రంగా ఉంటే ఇంకా పెరగవచ్చు కూడా. వచ్చే లోక్‌సభ ఎన్నికలు-2024లో రావాల్సినవి- ఎప్పుడు వస్తాయో తెలియదు. వాటిని ముందుకు నెట్టే లేదా గడువు నాటికి జరిగేట్లు ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని భావిస్తున్న తరుణమిది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి ఎవరు పాగావేస్తారన్న ఆసక్తి పెరిగిన నేపధ్యంలో ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్‌కు ఆప్‌ గట్టి సవాలు విసురుతోంది. అకాలీదళ్‌ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంత దుకాణం పెట్టుకున్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ – బిజెపి జట్టుగా రంగంలోకి దిగటంతో చతుర్ముఖ పోటీ జరగనుంది. జూదగాండ్లు ఇప్పటి వరకు ఈ జట్టును లెక్కలోకి తీసుకోలేదు.


క్రికెట్‌ మీద పందాలు కాయటం తెలిసిందే. గడచిన రెండు దశాబ్దాల్లో ఎన్నికల ఫలితాల మీద పందాలు అదీ సంఘటిత ముఠాలు నిర్వహించటం పెరిగింది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల మీద పందాలు మొదలయ్యాయి. వివిధ సర్వే సంస్ధలు వెల్లడించే జోశ్యాల ప్రాతిపదికన జరిగే పందాలు కొన్ని కాగా పందెం ముఠాల వెనుక ఉండే పెద్దలు స్వంతంగా చేయించుకొనే సర్వేల ప్రాతిపదికన కూడా మరికొన్ని జరుగుతున్నాయి. ఎన్నికల సర్వేలు ఎలా బోల్తాపడుతున్నాయో పందెం ముఠాలు కూడా అలాగే బొక్కబోర్లాపడుతున్నాయి. అయితే ఇవన్నీ చట్టవిరుద్దం, చీకట్లో జరిగేవి కావటంతో డబ్బు పొగొట్టుకున్నవారు లేదా గెలిచినవారు గానీ పైకి చెప్పుకోలేరు.పందెగాళ్ల అంచనా ప్రకారం పంజాబ్‌లో ఎవరికీ మెజారిటీ రాదు, ఉత్తర ప్రదేశ్‌లో తిరిగి బిజెపి గద్దెనెక్కనుంది.ఎన్నికల ప్రచారంలో పార్టీల జన సమీకరణ, మీడియా విశ్లేషణలను బట్టి కూడా పోలింగ్‌ తేదీ వరకు పందాల మొత్తాలు పెరగటం లేదా తగ్గటాన్ని గతంలో చూశాము. సాధారణ పరిస్ధితుల్లో ఎన్నికలు జరిగితే పందాలు ఒకరకం- అవి ధరల పెరుగుదల, దారిద్య్రం, నిరుద్యోగం వంటి అంశాల తీవ్రతను బట్టి ఉంటాయి.అదే పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ దాడుల వంటి ఉదంతాలు చోటు చేసుకుంటే మరోరకంగానూ మారతాయి.


ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదికి పైగా మూడు సాగు చట్టాల రద్దు కోసం సాగిన మహత్తర ఉద్యమ ధాటికి దిగివచ్చిన నరేంద్రమోడీ వాటిని రద్దు చేయటమేగాక రైతులకు క్షమాపణలు చెప్పారు. కనీస మద్దతు ధర చట్టబద్దత పరిశీలనకు ఒక కమిటీని వేస్తామని ప్రకటించి వారాలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి కదలికా లేదు. సాగు చట్టాల రద్దుతో దూరమైన రైతులు తిరిగి తమవైపు చేరతారని ఆశించిన బిజెపికి అలాంటి సూచనలేమీ కనిపించటం లేదనే వార్తలు వస్తున్నాయి. రైతాంగం ఎటు మొగ్గుతుందన్నది ఆసక్తికరమైన అంశమే.2017 ఎన్నికల్లో బిజెపి ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలోని 403 స్ధానాలకు గాను 312 సాధించింది. వచ్చే ఎన్నికల్లో 250తో గట్టెక్కవచ్చని ఒకవైపు వార్తలు, రెండంకెలకు మించవనే అంచనాలు మరోవైపు ఉన్నాయి.


ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో రెండు పార్టీల గురించే పందాలు కాస్తున్నారు. బిజెపి 200 స్ధానాలు గెలిస్తే ప్రతి రూపాయికి అదనంగా 20పైసలు, 222 గెలిస్తే రూపాయికి రు.1.15, సమాజవాది110 తెచ్చుకుంటే 35పైసలు, 125 గెలిస్తే రు.1.40 ఇస్తామని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌, బిఎస్‌పికి ఐదు నుంచి పది స్ధానాలకు మించి రావని పందెంరాయుళ్లు చెబుతున్నారు. తరువాత ఈ అంచనాలు, పందాల మొత్తాలు మారిపోవచ్చు. పంజాబ్‌లోని 117 స్ధానాల్లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలకు కనీసంగా 25 గరిష్టంగా 40చొప్పున వస్తాయని, అకాలీదళ్‌, బిజెపిలకు ఐదు నుంచి పదిలోపు రావచ్చని, ఇక్కడ కూడా నామినేషన్ల తరువాత అంచనాలు మారవచ్చని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి.


పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
బిజెపి×× 200×× 0.20 ××ఎస్‌పి×× 110×× 0.35
బిజెపి×× 210×× 0.35 ××ఎస్‌పి×× 115×× 0.60
బిజెపి×× 215×× 0.57 ××ఎస్‌పి×× 120×× 1.05
బిజెపి×× 222×× 1.15 ××ఎస్‌పి×× 125×× 1.40
బిఎస్‌పి×× 5 ×× 0.04 ××కాంగ్రెస్‌ ×× 5×× 0.55
బిఎస్‌పి××10 ×× 0.67 ××కాంగ్రెస్‌ ×× 6×× 0.70
బిఎస్‌పి××15 ×× 1.10 ××కాంగ్రెస్‌ ×× 8×× 1.00
బిఎస్‌పి×× 0 ×× 0.00 ××కాంగ్రెస్‌ ××10×× 2.50
పంజాబ్‌లోని 117కు గాను ప్రస్తుతం వివిధ పార్టీల సీట్ల అంచనా మేరకు వాటిని సాధిస్తే పందెం కాసిన వారికి రూపాయికి ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి
పార్టీ×××సీట్లు×××పైసలు×× పార్టీ×××సీట్లు×××పైసలు
ఆప్‌×× 25 ×× 0.35 ××కాంగ్రెస్‌ ×× 25 ×× 0.45 ××అకాలీదళ్‌ ×× 5 ×× 0.35
ఆప్‌×× 30 ×× 0.40 ××కాంగ్రెస్‌ ×× 30 ×× 0.57 ××అకాలీదళ్‌ ×× 10 ×× 0.57
ఆప్‌×× 35 ×× 0.87 ××కాంగ్రెస్‌ ×× 35 ×× 0.90 ××అకాలీదళ్‌ ×× 15 ×× 0.87
ఆప్‌×× 40 ×× 1.15 ××కాంగ్రెస్‌ ×× 40 ×× 1.35 ××అకాలీదళ్‌ ×× 20 ×× 1.20

2021లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు అన్నాడిఎంకె గెలుస్తుందని, డిఎంకె ఓడిపోతుందని, స్టాలిన్‌కు సిఎం యోగం లేదని జోశ్యాలు చెప్పారు. పశ్చిమబెంగాల్లో మోడీ నాయకత్వంలో బిజెపి గెలుస్తుందన్నారు. బిజెపి పటాటోపం చూసి అక్కడ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారు.బిజెపికి 145 స్దానాలు వస్తాయని, టిఎంసికి 115-120కి మించి రావని పందాలు కాశారు. రూపాయి 22 నుంచి 150పైసల వరకు అవి ఉన్నాయి. ఎవరి తల రాత ఏమిటో ముందే రాసి ఉంటుందని చెప్పేవీరు ఎన్నికల అంశాల్లో నామినేషన్ల నాటి నుంచి ప్రచారం వరకు భిన్నమైన జోశ్యాలు చెబుతున్నారు. వీరందరు చెప్పే గ్రహాలు ఒకటే, అవి అందరికీ ఒకే సందేశాలు ఇవ్వాలి, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పటాన్ని బట్టి ఊహాగానాలు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. అయినా ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ప్రతివారూ జోత్యిష్కులను ఆశ్రయిస్తుండటంతో వారి వ్యాపారం కూడా రెండు చేతులు ఆరు కాసులు అన్నట్లుగా పెరిగిపోతోంది.


2004 ఎన్నికల్లో అతల్‌ బిహారీ వాజ్‌పాయి నాయకత్వంలోని ఎన్‌డిఏకు మరోసారి అవకాశం వస్తుందన్న ఎన్నికల సర్వేలు వాస్తవం కాదని తేలింది. 2009లో హంగ్‌ పార్లమెంట్‌ అన్న అంచనాలు తప్పి యుపిఏ మరింత బలపడింది. 2014లో ఎన్‌డిఏకు స్వల్ప మెజారిటీ అన్న అంచనాలు తారుమారైన సంగతి తెలిసిందే, 2019లో కూడా అదే జరిగి ఎన్‌డిఏ బలం మరింత పెరిగింది.అనేక మంది ప్రముఖ జ్యోతిష్కులు మోడీ అధికారానికి వచ్చినా సీట్లు తగ్గుతాయని చెప్పి నాలుక కరుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మధుర, హత్రాస్‌ వంటివి పందెగాండ్లకు పెద్ద కేంద్రాలు.2019 ఎన్నికలలో మోడీ సర్కార్‌కు తగినంత మెజారిటీ రాకపోతే సమాజవాది పార్టీతో బంధాన్ని తెంచుకొని బిఎస్‌పి నేత మాయావతి ఎన్‌డిఏలో చేరతారని, రాహులు గాంధీ పోటీ చేసిన రెండు స్ధానాల్లో గెలుస్తారని, సమాజవాది పార్టీ స్ధితి మెరుగుపడుతుందని కూడా పందాలు కాశారు.


సర్వే సంస్ధలు, మీడియాను మేనేజ్‌ చేసి అనుకూల సర్వేలు చేయించుకోవటం జగమెరిగిన సత్యం. అందుకే వాటిని జనం పెద్దగా విశ్వసించటం లేదు. ఫలితాలు కూడా అలాగే ఎక్కువ సందర్భాల్లో తారుమారయ్యాయి. సర్వేలతో పాటు ఇప్పుడు రాజకీయ పార్టీలు ముఖ్యంగా బిజెపి పందెగాళ్ల ముఠాలను కూడా ప్రభావితం చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. పందాల వార్తలు మీడియాలో ప్రముఖంగా చోటు చేసుకొంటున్నందున తద్వారా ఓటర్లను ప్రభావితం చేయవచ్చన్న ఎత్తుగడ దీనివెనుక ఉంది. ఫలానా పార్టీ గెలుపు గురించి ఎక్కువ మంది పందెంకాస్తున్నారంటే దానికి మద్దతు ఉండబట్టే కదా అని మొగ్గేవారు కొందరైనా ఉండవచ్చు. ఈ కారణంగానే 2014తో పోల్చితే 2019లో పందాల మార్కెట్‌ రెండు రెట్లు పెరిగిందని, ఇప్పుడు ఇంకా పెరిగిందని అంచనా. కనీస మొత్తాలతో ప్రారంభమై కోట్ల వరకు ఉంటాయి. అనేక మొత్తాలు విదేశాల్లోనే జమ అవుతాయి, దానికి హవాలాతో సహా అనేక మార్గాలను ఎంచుకుంటారు, ఎక్కడా రాతకోతలుండవు.బుకీలు తెలిసి ఉంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా నమ్మకం, దందా మీదనే నడుస్తుంది.


ఎన్నికల ఫలితాలపై పందాలు మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా ఉన్నాయి. మన దేశంలో గుర్రప్పందాలు మాత్రమే చట్టబద్దం. మిగిలినవన్నీ చాటు మాటు దొంగ వ్యవహారాలే. అనేక దేశాల్లో అన్ని రకాల జూదాలు చట్టబద్దంగానే జరుగుతాయి. 2020 అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌, జోబైడెన్‌ మీద కూడా జూదం నిర్వహించారు. ప్రతి అధ్యక్షుడు రెండోసారి ఎన్నిక అవటం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు ట్రంప్‌ ఎన్ని పిచ్చిపనులు చేసినా రెండోసారి గెలుస్తాడంటూ పందెగాళ్లు ఎక్కువ మంది అటువైపే మొగ్గి చేతులు కాల్చుకున్నారు. లెక్కింపులో జో బైడెన్‌ ముందంజలో ఉన్నట్లు వార్తలు వచ్చిన తరువాత కూడా ట్రంప్‌ ఏదో ఒక మాజిక్‌ చేసి గెలుస్తాడని భంగపడినవారు లేకపోలేదు. ట్రంప్‌ గెలుపు గురించి న్యూజిలాండ్‌లో 62 నుంచి 37 , జోబైడెన్‌ మీద 61-44 సెంట్ల వరకు పందాలు నడిచాయి(ఒక డాలరుకు వంద సెంట్లు).స్టాక్‌ ఎక్సేంజ్‌ల మాదిరి బ్రిటన్‌లో బెట్టింగ్‌ ఎక్సేంజ్‌ బెట్‌ఫెయిర్‌ ఉంది. అమెరికా ఎన్నికలు ప్రారంభం కాగానే ట్రంప్‌ రెండోసారి విజయానికి అవకాశాలున్నాయని 39 నుంచి 75శాతానికి బెట్‌ఫెయిర్‌ సూచిక పెరగ్గా బైడెన్‌ అవకాశాలు 61 నుంచి 25శాతానికి తగ్గాయి. స్మార్‌కెట్స్‌ అనే మరో ఎక్సేంజ్‌లో కూడా ఇదే మాదిరి సూచనలు వెలువడినా చివరికి ట్రంప్‌ ఇంటిదారి పట్టాడు. అక్కడ కొన్ని రాష్ట్రాల తీరు తెన్నులను బట్టి పందాలు కాస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పని కోసం యువత రద్దీ – ఉపాధి రహిత దేశ వృద్ధి !

29 Wednesday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

#India jobless growth, #India unemployment, BJP, India economy, India employment, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఉదరపోషణార్ధం బహుకృత వేషం అన్నట్లుగా ఉత్తర ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికల్లో గెలుపుకోసం బిజెపి నేతలు చేయని శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు, చెప్పని మాటలు లేవు. పగలంతా భారీ సంఖ్యలో జనాన్ని సమీకరిస్తున్న సభల్లో మాట్లాడుతూ సాయంత్రానికి కరోనా నిరోధ చర్యల గురించి బోధలు చేస్తున్నారనే విమర్శను ప్రధాని నరేంద్రమోడీ మూటగట్టుకున్నారు.ప్రయాగ సభలో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో యోగి సర్కార్‌ సాధించిన విజయాల్లో మహిళా సాధికారత ఒకటని చెప్పారు. జర్మన్‌ నాజీ మంత్రిగా పని చేసిన గోబెల్స్‌ స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో తెలియదు గానీ ఈ వార్తను చూసి ఎలా స్పందించి ఉంటాడో తెలియదు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజం అవుతుందన్న తన సిద్దాంతాన్ని ముందుకు తీసుకపోతున్నవారు తామర తంపరగా పెరుగుతున్నందుకు కచ్చితంగా సంతోష పడి ఉంటాడు. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2005లో మన దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం 26శాతంగా ఉందని,2019నాటికి అది 20.3శాతంగా ఉంది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో 30.5, శ్రీలంకలో 33.7శాతం మంది ఉన్నారు. కరోనా కారణంగా మన దేశంలో 2020 ఏప్రిల్‌-జూన్‌లో 15.5శాతానికి తగ్గింది. ఇక యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడిలో తొమ్మిదిశాతం, బీహార్‌లో ఐదుశాతం మాత్రమే అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.


దేశం సంపద్వంతం కావటానికి ఇప్పుడు అమలు చేస్తున్న సంస్కరణలు ఏమాత్రం చాలవని కార్పొరేట్‌ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. దానికి అనుగుణంగానే రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి పునరుద్దరిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇటీవలనే చెప్పారు. దేశమంతటి నుంచి నిరసన తలెత్తటంతో అబ్బేఅలాంటిదేమీ లేదంటూ ప్రకటించిన అంశం తెలిసిందే.ఏటా రెండు కోట్ల మంది యువతీ,యువకులు మాకు పని కావాలంటూ రోడ్లమీదకు వస్తున్నారు.వారికి పని దొరకటం లేదు. కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో ఏలుబడిలో ఉన్నది బిజెపి, అచ్చేదిన్‌ అని చెప్పినప్పటికీ పరిస్ధితులు రోజురోజుకూ దిగజారుగుతున్నాయి.అచ్చేదిన్‌ పేరుతో నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చినపుడు ఎనిమిది శాతంపైగా వృద్ధి రేటు ఉంది.కరోనాకు ముందు నాలుగుశాతానికి పడిపోయింది. వృద్ధి రేటు ఎంత ఉన్నప్పటికీ అది ఉపాధిరహితంగా ఉండటమే అసలు సమస్య. కార్పొరేట్ల లాభదాహం నానాటికీ పెరుగుతోంది.కరోనాలో జనాల పరిస్ధితి దిగజారితే వారి లాభాలు ఏమాత్రం తగ్గలేదు.అయినా అసంతృప్తి.


కెనడాలోని ఫ్రాసర్‌ సంస్ధ విడుదల చేసిన ప్రపంచ ఆర్ధిక స్వేచ్చ సూచికలో 165దేశాలకు గాను మనదేశం ఇంతకు ముందున్న 103వ స్ధానం నుంచి 2021లో 108వ స్ధానానికి దిగజారింది.దీనికిగాను పరిగణనలోకి తీసుకొనే అంశాలన్నింటా పరిస్ధితి అధ్వాన్నంగా ఉన్నందున ప్రయివేటు రంగం వృద్ది చెందటం లేదట.సంస్కరణల గురించి కబుర్లు చెబుతున్నా పరిస్ధితి ఇలా ఉంది. కీలకమైన సేవా రంగాలను సరళతరం చేయటాన్ని నిలిపివేసినట్లు నివేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది.తక్కువ ధరలకు సరకులను అందచేసేందుకు బహుళజాతి రిటైల్‌ కంపెనీలను అనుమతించటం లేదన్నది ఒకటి. సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్నందున మరింతగా పరిస్ధితి దిగజారుతుందని కెనడా సంస్ద చెప్పిందంటే ఇప్పుడున్న వాటి నుంచి కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గి మొత్తంగా కార్పొరేట్లకు అప్పగించాలని కోరుతున్నారు.


తాజాగా కేంద్ర ప్రభుత్వం అక్వీస్‌(ఆలిండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బేస్డ్‌ ఎంప్లాయిమెంట్‌ సర్వే) తొలి నివేదిక ప్రకారం 2021 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉపాధి తొమ్మిది రంగాలలో 3.08 కోట్లకు పెరిగినట్లు పార్లమెంటుకు తెలిపారు.2013-14లో 2.37 కోట్లతో పోల్చుకుంటే వృద్ది రేటు 29శాతం అని చెప్పారు.వాస్తవం ఏమిటి ? 2021 అక్టోబరులో కార్మికశక్తి భాగస్వామ్య రేటు 40.41(ఎల్‌పిఆర్‌) శాతం ఉండగా నవంబరు నాటికి 40.15కు పడిపోయింది. కరోనాకు ముందు 43శాతం ఉంది, రెండు సంవత్సరాలు రెండు తరంగాల కారణంగా కనిష్టంగా 36శాతానికి పడిపోయి తిరిగి కోలుకున్నప్పటికీ కరోనా ముందు స్ధితికి చేరుకోలేదు. ప్రపంచబాంకు, ఐఎల్‌ఓ గణాంకపద్దతి ప్రకారం 2020లో ప్రపంచ సగటు ఎల్‌పిఆర్‌ 58.6 కాగా మనది 46శాతం మాత్రమే. మనకంటే అధ్వాన్నంగా ఉన్న దేశాలు మరొక 17 మాత్రమే అని ఐఎల్‌ఓ చెప్పింది. చిత్రం ఏమిటంటే వాటిలో చమురు సంపదలున్న ఇరాన్‌, ఇరాక్‌ వంటి దేశాలతో పాటు అంతర్యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న సిరియా, లెెబనాన్‌, ఎమెన్‌ వంటివి ఉన్నాయి. అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంటున్న మనం ఈ రెండు తరగతులకూ చెందం అన్నది స్పష్టం. సిఎంఐఇ అంచనాల ప్రకారం 40శాతానికి అటూ ఇటూ అంటే ఐఎల్‌ఓ కాస్త ఉదారంగా లెక్కించింది తప్ప పరిస్ధితి దారుణంగా ఉందన్నది స్పష్టం.


కరోనాకు ముందు దేశం మొత్తం మీద ఉపాధిలో పట్టణ వాటా 32శాతం కాగా 2021అక్టోబరులో 31.5శాతం ఉండగా నవంబరులో 31.2శాతానికి తగ్గింది. గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాలలో సంఘటిత రంగం ఉంటుంది కనుక కాస్త మెరుగైన వేతనాలుంటాయి. అవే తగ్గాయంటే దాని ప్రభావం మొత్తం మీద ఉంటుంది. మొత్తంగా నవంబరు నెలలో అదనంగా వచ్చిన ఉపాధి 14లక్షలు, పట్టణాల్లో 9లక్షలు తగ్గినా గ్రామాల్లో 23లక్షలు పెరిగినందున ఈ పెరుగుదల ఉంది. నెలవారీ వేతనాలు పొందే వారి సంఖ్య తగ్గుతుండటం ఆందోళనకరం.2019 నవంబరులో నెలవారీ వేతన జీవుల సంఖ్యతో పోలిస్తే 2021లో 9.7శాతం తగ్గారు.ప్రస్తుతం ఒమైక్రాన్‌ కరోనా వైరస్‌ తరంగం ప్రపంచాన్ని, మన దేశాన్ని కూడా భయపెడుతున్నది. ఆర్ధికంగా కోలుకోవటం కష్టమనే అంచనాలు వెలువడతున్నాయి.


గత మూడు దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, పర్యవసానాలను చూస్తే జిడిపి వృద్ది కనిపిస్తుంది, జనాభావృద్ధి రేటు తగ్గుతోంది. కానీ ఉపాధి వృద్ధి రేటు జనాభాకు అనుగుణంగా లేదు. ముఖ్యంగా గత దశాబ్దికాలంలో ఉపాధి రహిత వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితిలో ఆ రంగంలో యంత్రాల వాడకం గణనీయంగా పెరిగి ఉపాధి తగ్గింది. ఆ మేరకు పట్టణాలలో పెరగలేదు. పెరిగింది కూడా అసంఘటిత రంగంలో ఉంది.ప్రపంచీకరణ కారణంగా ఐటి, అనుబంధ రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలు వచ్చిన్పటికీ అవి నైపుణ్యం ఉన్నవారికే పరిమితం అన్నది తెలిసిందే.2005-10 మధ్య సంఘటిత రంగంలో నిఖరంగా పెరిగిన ఉద్యోగాలు పదిలక్షల మాత్రమే కాగా 60లక్షల మంది ఉద్యోగార్ధులు మార్కెట్లో చేరారు. తామర తంపరగా వెలసిన ప్రయివేటు విద్యా సంస్ధల నుంచి ఇంజనీర్లు, ఎంబిఏ,ఎంఎ పట్టాల వారు లక్షల సంఖ్యలో తయారయ్యారు. మన అవసరాలకు మించి వారిని ఉత్పత్తి చేస్తున్నాము. వారిలో కొందరి నైపుణ్యం ప్రశ్నార్ధకం, అంతకంటే తక్కువ విద్య,నైపుణ్యం ఉన్నవారికి తగిన ఉపాధి అవకాశాలు పెరగలేదు.


ఇతర అనేక దేశాలతో పోల్చితే మన దేశంలో యువజనం ఎక్కువగా ఉన్నమాట నిజం. వీరికి కావాల్సింది ఉపాధి తప్ప మాటలు కాదు. సమగ్రమైన సమాచారం అందుబాటులో లేదు. వివిధ సంస్ధల అంచనాల ప్రకారం 2004-12 సంవత్సరాలలో ఏటా 25లక్షల ఉద్యోగ అవకాశాలు పెరిగితే 2012-16 మధ్య 15లక్షలకు తగ్గాయి. ఏదో ఒక సామాజిక భద్రత ఉన్న రెగ్యులర్‌ కార్మికులు 2011-16 కాలంలో 45 నుంచి 38శాతానికి తగ్గారు. సంస్కరణల కాలంలో మనకు వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎక్కువ భాగం సేవా రంగానికే వచ్చాయి. మిగిలినవి కార్మికులు తక్కువగా ఉండే పరిశ్రమలకు వెళ్లాయి. జిడిపిలో సేవారంగం వాటా గణనీయంగా పెరిగింది కానీ ఆ మేరకు ఉపాధి పెరగలేదు. విధానపరమైన లోపాలు, మన పరిస్ధితులకు అనుగుణంగా పధకాలను రూపొందించలేదనే లోపాన్ని అంగీకరించేందుకు ఎవరూ సిద్దం కావటం లేదు. అధికారంలో ఎవరున్నా బడా పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు జరిపారు. ఎంత ఎక్కువ పెట్టుబడులు పెడితే అంత ఎక్కువ రాయితీలు, సదుపాయాలు కల్పించారు తప్ప ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనే వైపు దృష్టి పెట్టలేదు. అందుకు అవకాశం ఉన్న చిన్న, సన్నకారు పరిశ్రమలను ఉపేక్షించారు. చివరకు వారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన వస్తువులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు.

సంఘటిత వస్తూత్పత్తి రంగంలో 25శాతం ఉపాధి తగ్గటానికి పారిశ్రామిక వివాదాల చట్టమే కారణమని ప్రపంచబాంకు మేథావులు సూత్రీకరించారు. కార్మికుల ఉపాధి రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్న కారణంగా యజమానులు కార్మికుల ఖర్చు తగ్గించుకొనేందుకు ఎక్కువ పెట్టుబడి అవసరమైన పద్దతులను ఎంచుకున్నారట.పోనీ అలా ఖర్చు తగ్గించుకొని ఎగుమతులు చేశారా అంటే అదీ లేదు కదా ! ఈ పేరుతో కార్మిక చట్టాలకే ఎసరు పెట్టి బానిసలుగా మార్చేందుకు పూనుకున్నారు.
2017-18లో నాలుగున్నర దశాబ్దాల రికార్డు స్ధాయికి 6.1శాతం నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సర్వే వివరాన్ని 2019 ఎన్నికల ముందు తొక్కిపెట్టారు, అది తప్పుల తడక, ఉపాధి గురించి లెక్కలు సరిగా వేయలేదన్నారు. ఎన్నికలు ముగిశాక గుట్టుచప్పుడు కాకుండా అదే నివేదికను ఆమోదించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నిరుద్యోగం ఉంది.2019-20లో 8.6 కోట్ల మంది నెలసరి వేతన జీవులుండగా 2021 ఆగస్టు నాటికి 6.5కోట్లకు తగ్గారు. వీరికి అదనంగా నిరుద్యోగులు తోడవుతారు.

మనకున్న యువశ్రమశక్తితో ప్రపంచాన్నే మన చెప్పుచేతల్లోకి తెచ్చుకోగలమని చెప్పేవారున్నారు. అది ఒక కోణంలో చూస్తే నిజమే. చైనా అలాంటి ఫలితాన్ని సాధించింది. మంచి ఉద్దేశ్యాలే కాదు, అందుకు తగిన విధానాలు కూడా ఉండాలి. లేనట్లయితే అదే అవకాశం ప్రతికూలంగా కూడా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో 54శాతం మంది పాతికేండ్ల లోపువారే, మరోవిధంగా చూస్తే 62శాతం మంది 15-59 ఏండ్ల మధ్య ఉంటారు. వీరికి తగిన నైపుణ్యాలను సమకూర్చి ఉపాధి చూపకపోతే పక్కదారులు పట్టే అవకాశం ఉంది.సిఎంఐసి సమాచారం ప్రకారం 2016లో ఉపాధిలో ఉన్నవారి సంఖ్య 40.73 కోట్ల మంది, 2018 -19నాటికి 40.09 కోట్ల మందికి తగ్గారు. ఆర్ధికవ్యవస్ధ పెరిగితే ఐదులక్షల కోట్ల డాలర్ల స్ధాయికి జిడిపిని తీసుకుపోతామని చెప్పినా, నిజంగా తీసుకుపోయినా యువతీ, యువకులకు ఒరిగేదేమిటి ? 2030నాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి 44 నుంచి 30శాతానికి తగ్గుతుందని అంచనా, ప్రస్తుత అంచనా ప్రకారం 2030నాటికి 14.5 కోట్ల మందికి వ్యవసాయేతర రంగాల్లో పని కల్పించాల్సి ఉంటుంది.వారందరికీ ఉపాధి కల్పించే విధానాలను అవలంభించకపోతే తలెత్తే పర్యవసానాలకు బాధ్యులెవరు ? అందుకు గాను ఏటా 8-9శాతం చొప్పున వృద్ధి రేటు ఉండాలి. అదీ ఉపాధి సహితమైనది, అది జరగాలంటే విధానాలను అందుకనుగుణంగా మార్చాలి, అదే ఎలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

హరిద్వార్‌ ధర్మ సంసద్‌ : పరస్పర అవగాహనతోనే హిందూ- ముస్లిం మతోన్మాదుల ప్రసంగాలు !

25 Saturday Dec 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

#Haridwar hate speeches, AIMIM, ‘Hate’ speeches at Dharma Sansad, BJP, Haridwar hate speeches, Hinduthwa, RSS


ఎం కోటేశ్వరరావు


ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబరు 17-19 తేదీల్లో ధర్మ సంసద్‌ పేరుతో ధర్మవిరుద్ద, పరమత విద్వేష సభ జరిగింది. హిందూమత నేతలుగా చెప్పుకొనే యోగులు, యోగినులు అక్కడ చేరారు. వారు హిందూమతం మంచి చెడ్డల గురించి ఏమి చర్చించారో తీర్మానించారో తెలియదు. ముస్లింలు, ఇతర మైనారిటీ మతాల వారి మీద మారణకాండ జరపాలని పిలుపు ఇస్తూ చేసిన ప్రసంగాల వీడియోలు సామాజిక మాధ్యమంలో తిరుగుతూ మరింత విద్వేషాన్ని జనాల బుర్రల్లో నింపుతున్నాయి. ఈ సమావేశాల్లో మాట్లాడిన వారు తమను సమర్ధించుకున్నారు, తప్పు చేశామనే భావన ఏ కోశానా కనిపించలేదు. పోలీసులు తమనేమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకొని ఇలా బరితెగించినట్లు ? కొందరి ప్రసంగాంశాలు ఇలా ఉన్నాయి.


”ముస్లింలను చంపటానికి కత్తులు చాలవు, దిమ్మిసలాంటి ఆయుధాలు కావాలి” అన్న యతి నరసింగానంద, నాగరికత (సంస్కృతి) యుద్దంలో హిందువులను రక్షించేవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనటం, మెరుగైన ఆయుధాలు మాత్రమే అని కూడా సెలవిచ్చారు. ఎవరైనా హిందూ ప్రభాకరన్‌(శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారితే వారికి ఒక కోటి రూపాయల అవార్డు ఇస్తామని ప్రకటించారు.బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక వక్త మాట్లాడుతుండగా నరసింగానంద జోక్యం చేసుకొని ” మనకు అవసరమైనపుడు హిందూ సమాజం సాయం చేయదు, ఎవరైనా యువకార్యకర్త ముందుకు వచ్చి హిందూ ప్రభాకరన్‌ (శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారేందుకు సిద్దమైతే నేను కోటి రూపాయలు ఇస్తాను, ఒక ఏడాది కొనసాగితే కనీసం వంద కోట్లు సేకరిస్తానని” చెప్పారు.


స్వామి సాగర్‌ సింధు మహరాజ్‌ మాట్లాడుతూ హిందువులు కనీసంగా కత్తులను కలిగి ఉండాలి అన్నారు. మనం ఉపయోగించే సెల్‌ఫోన్‌ విలువ ఐదువేల రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ హిందువులు ప్రతి ఒక్కరు కనీసం ఒక లక్ష రూపాయల విలువగల ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో ప్రవేశిస్తే సజీవంగా బయటకు పోలేరు అన్నారు. స్వామి ధర్మదాస్‌ మహరాజ్‌ మాట్లాడుతూ తన దగ్గర గనుక తుపాకి ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేగా మారి ఉండేవాడిని.మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే తొలి హక్కు ఉండేది, నేను గనుక పార్లమెంటులో ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేను అనుసరించి తుపాకితో ఆరుసార్లు మన్మోహన్‌ సింగ్‌ గుండెల మీద కాల్చివుండేవాడిని అన్నారు. స్వామి ప్రబోధానంద మాట్లాడుతూ మయన్మార్‌లో మాదిరి మన పోలీసు, మన రాజకీయవేత్తలు, మన మిలిటరీ, ప్రతి హిందువు ఆయుధాలు తీసుకొని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలి, అంతకు మించి మరొక మార్గం లేదు అన్నారు. (ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి(బిజెపి) వేరే సందర్భంగా ఈ స్వామీజీ కాళ్లకు మొక్కిన చిత్రాలు ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి.)


ప్రతి మతానికి చెందిన వారు తమ మంచి చెడ్డల గురించి సభలు జరుపుకోవచ్చు, ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ ఈ విద్వేషం, రెచ్చగొట్టే పనులేమిటి ? ఐతే ఇలా రెచ్చగొట్టే ఇతర మతాలవారి సంగతేమిటని వెంటనే కొందరు ప్రశ్నిస్తారు. ఎవరు రెచ్చగొట్టినా అది మైనారిటీ-మెజారిటీ ఎవరైనా కావచ్చు. అలాంటి వారిని నోరెత్తకుండా జైళ్లలో పెట్టాల్సిందే. వారి ఉపన్యాసాల వలన విద్వేషం తప్ప ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ లేదా మేడిన్‌ ఇండియా పధకాల్లో ఒక్క వస్తువైనా ఉత్పత్తి అవుతుందా ? మనం మతంపేరుతో కుత్తుకలు ఉత్తరించిన మధ్యయుగాల్లో ఉన్నామా నాగరిక సమాజంలో బతుకుతున్నామా ?


విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, రెచ్చగొట్టటంలో మజ్లిస్‌ లేదా కొందరు ఇతర పార్టీల ముస్లిం నేతలు, మత పెద్దలు కూడా తక్కువేమీ కాదు.వారి రెచ్చగొట్టే మాటలు, నమోదైన కేసుల గురించి చూద్దాం. కొద్ది నెలల క్రితం 2021లో ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీలో మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ విద్వేష ప్రసంగంతో పాటు నరేంద్రమోడీ మీద అనుచిత భాషను ఉపయోగించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు.2020లో కర్ణాటకలో సిఎఎ వ్యతిరేక సభలో ముంబై మజ్లిస్‌ పార్టీ నేత వార్సి పఠాన్‌ విద్వేష పూరిత ప్రచారం చేశారని కేసు పెట్టారు. పదిహేను కోట్ల మంది ముస్లింలకు వందకోట్ల మంది హిందువులు సరితూగరంటూ రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు.సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మా ఆడవారు ముందుకు వస్తేనే చెమటలు పడుతున్నాయి, అదే పురుషులు వస్తే అంటూ రెచ్చగొట్టినట్లు ఆరోపణ.తన మాటలను వక్రీకరించారని, ఎవరినైనా బాధిస్తే వెనక్కు తీసుకుంటానని అతగాడు తరువాత చెప్పినట్లు వార్తలు వచ్చాయి.అతని ప్రసంగ తీరుతెన్నులను తాము సమర్ధించటం లేదని మజ్లిస్‌ నేత ఒవైసీ, మహారాష్ట్ర మజ్లిస్‌ అధ్యక్షుడు, ఔరంగాబాద్‌ ఎంపీ జలీల్‌ ప్రకటించారు. మజ్లిస్‌ నేతల మాదిరి హిందూత్వశక్తులు లేరు. దీని అర్ధం మజ్లిస్‌ నేతలు నిజాయితీతో ఆ ప్రకటనలు చేశారని కాదు.


టైమ్స్‌ నౌ టీవీ ఛానల్‌ చర్చలో ఇరవైలక్షల మందిని హతమార్చాలని పిలుపు ఇవ్వటం మతాలు చేసే పనేనా అన్న యాంకర్‌ ప్రశ్నకు అవును ఇది మా విధి అని సాధ్వి అన్నపూర్ణ చెప్పారు.మా మతాన్ని వ్యతిరేకించే వారిని ఎవరినైనా హతమారుస్తాం అన్నారు. అన్నపూర్ణ మాతగా పిలిపించుకొనే ఈమె హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగానూ, నిరంజనీ అఖారా మహామండలేశ్వర్‌గానూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈమె నోటి వెంట వెలువడిందేమిటి ? ” మీరు వారిని(ముస్లింలను) అంతం చేయ దలచుకొంటే వారిని హతమార్చండి.వారిలో ఒక ఇరవై లక్షల మందిని చంపటానికి మనకు వంద మంది సైనికులు చాలు ” అన్నారు. హరిద్వార్‌లో తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉన్నామని స్వామి ఆనంద స్వరూప్‌ తదితరులు పునరుద్ఘాటించారు, సమర్దించుకున్నారు.
ప్రబోధానంద ఎన్‌డిటివీతో మాట్లాడుతూ నేను చెప్పిన మాటలకు సిగ్గుపడటం లేదు, పోలీసులను చూసి భయ పడటమూలేదు. చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీ ఆలోచనకు నాకూ తేడా ఉంది. రాజ్యాంగాన్ని చదవండి, నా మాటలు ఏ విధంగానూ రెచ్చగొట్టేవి కాదు. ఎవరైనా నన్ను చంపేందుకు పూనుకుంటే నేను పోరాడతాను. నేను చట్టానికి భయ పడటం లేదు. ” అన్నారు. ప్రబోధానంద ముస్లిం వ్యతిరేకత కొత్తదేమీ కాదు.హిందూత్వను, సమాజాన్ని రక్షించుకొనేందుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది మంది పిల్లల్ని కనాలని 2017లో పిలుపిచ్చారు. ముస్లింలు మాత్రమే హిందూ మహిళల మీద అత్యాచారాలు చేస్తారని రెచ్చగొట్టారు. జీహాదీలను తుడిచిపెట్టాలని 2021జూన్‌లో ఇతరులతో కలసి రెచ్చగొట్టారు. అన్నపూర్ణ మాత ఎన్‌డిటీవితో మాట్లాడుతూ తన మాటలను మరింతగా సమర్ధించుకున్నారు.” భారత రాజ్యాంగం తప్పు, భారతీయులు నాధూరామ్‌ గాడ్సే(మహాత్మాగాంధీ హంతకుడు) కోసం ప్రార్ధనలు జరపాలి, నేను పోలీసుల గురించి భయపడను ” అన్నారు.


ముస్లిం వ్యతిరేక, బిజెపి అనుకూల ప్రచారానికి పేరు మోసిన సుదర్శన ఛానల్‌తో మాట్లాడుతూ దేశం వేగంగా ముస్లిం రాజ్యంగా మారుతోంది దాన్ని నిరోధించి సనాతన వేద దేశంగా మార్చాలని నరసింగానంద చెప్పారు. అదే ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వామి దర్శన భారతి ఉత్తరాఖండ్‌లో ముస్లింలు భూమి కొనుగోలు చేయ కుండా లాండ్‌ జీహాద్‌ను పాటించాలని సెలవిచ్చారు.( ఇలాంటి వారంతా కాశ్మీరులో స్ధానికేతరులు భూముల కొనుగోలుకు వీలు కల్పించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని ముందుకు తెచ్చారు) నరసింగానంద మాట్లాడుతూ స్వామి దర్శన భారతి గొప్పతనం అంటూ గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌లో మసీదు, మదార్సాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, అలాంటి యోధుడికి మనం మద్దతు ఇవ్వాలన్నారు. ధర్మ సంసద్‌లో హఠ యోగి మహరాజ్‌ మనకు ఒక ప్రభాకరన్‌ కావాలని చెప్పారు.నేను అన్నాను ఒక ప్రభాకరన్‌, ఒక భింద్రన్‌వాలే( పంజాబ్‌ తీవ్రవాది), ఒక జనరల్‌ సాహెబ్‌ సింగ్‌ (భింద్రన్‌వాలేకు సలహదారు, శిక్షకుడు) కావాలి. ప్రతి హిందూ దేవాలయానికి అలాంటి ఒకరు కావాలి, లేనట్లైతే హిందూమతానికి రక్షణ ఉండదు, రక్షించేవారు ఎవరూ ఉండరు.” అన్నారు. సత్యమేవ జయతే (సత్యమే ఎప్పటికీ జయిస్తుంది) అన్న సూక్తిని ఈ పెద్దమనిషి శస్త్రమేవ జయతే (ఆయుధమే జయిస్తుంది) అంటూ ముస్లింల మీద దాడులకు పురికొల్పారు.


తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే (కల్లు కోసం అని చెప్పకుండా ) దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని ఎవరో చెప్పారట. స్వామీజీలకు బిజెపికి ఉన్న బంధం కొత్తదేమీ కాదు. హరిద్వార్‌ సభకు మీరెందుకు వెళ్లారు అన్న ప్రశ్నకు వారికి హిందీలో దేశ రాజ్యాంగ ప్రతులను సేకరించటం కష్టం కనుక వారికి వాటిని అందచేసేందుకు, వివరించేందుకు తాను పాల్గొన్నట్లు బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ చెప్పారు. ” అది మూడు రోజుల సభ, నేను ఒక రోజు ఉన్నాను.నేను అక్కడ ఉన్న సమయంలో 30నిమిషాలు వేదిక మీద ఉన్నాను. రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకంటే ముందు, తరువాత ఇతరులు మాట్లాడినదానికి నేను బాధ్యుడిని కాదు” అని కూడా అన్నారు. తరువాత తానే ఒక వీడియో ప్రకటన చేస్తూ తాను హరిద్వార్‌ సభలో చివరి రోజు పదినిమిషాలు ఉన్నానని, రాజ్యాంగంలో అసంపూర్ణంగా ఉన్న జనాభా అదుపు, అక్రమ వలసదార్ల అదుపు, మతమార్పిడుల అదుపు వంటి గురించి ప్రసంగించానని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ ప్రతులు పంచటం, దాని గురించి మాట్లాడటం నేరమే అయితే నేను ఆ నేరం చేశాను అని చెప్పుకున్నారు. రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చాడన్నట్లుగా ఇవన్నీ ముస్లింల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు.అశ్వనీ ఉపాధ్యాయ విద్వేష పూరిత ప్రసంగం చేసిన ఒక కేసులో ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. బిజెపి మహిళానేత ఉదితా త్యాగి మరికొందరు పార్టీనేతలు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సభలో పాల్గొన్న అనేక మందికి బిజెపి నేతలతో సంబంధాలున్నాయి.2029 నాటికి ఈ దేశానికి ఒక ముస్లిం ప్రధాని కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాకు పోటీగా హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని యోగులు, సాధ్వులు చేస్తున్న ప్రసంగాలు తెలిసిందే.


మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ 2014లో ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా అక్కడి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.దాని మీద మరింతగా దర్యాప్దు జరపాలని ఢిల్లీలోని కరకార్‌దూమా కోర్టు 2019జనవరిలో ఉత్తరువులు జారీ చేసింది. ఈ కేసులో ఏమీ దొరకనందున కేసును మూసివేయాలని 2018లో పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు.కేసు దాఖలు చేసిన అజయ గౌతమ్‌ దీన్ని సవాలు చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏ పోలీసూ తన వివరణ కోరలేదని, విచారణా జరపలేదని, దీనికి ఉన్నత స్ధాయిలో ఉన్న రాజకీయ పలుకుబడే కారణమని కూడా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా మరింతగా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.2015లో ఇదే పోలీసులు కోర్డు ఆదేశాలతోనే ఒవైసీ మీద కేసు దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే బిజెపి నేతలు పొద్దున లేస్తే మజ్లిస్‌నేత అసదుద్దీన్‌ ఒవైసీ పారాయణం చేస్తారు. ఢిల్లీ పోలీసులు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ -అదీ అమిత్‌ షా-ఆధీనంలో పని చేస్తారు. వారి మీద రాజకీీయ పలుకుబడి లేదా వత్తిడి తేగలిగింది బిజెపి తప్ప మరొక పార్టీకి లేదు. అందుకే అనేక మంది బిజెపి-మజ్లిస్‌ పార్టీల మధ్య పరస్పర ప్రయోజనదాయకమైన మౌఖిక ఒప్పందం ఉందని అనుమానిస్తున్నారు.లేనట్లైతే నిజంగా ఢిల్లీ పోలీసులు తలచుకుంటే ఆధారాలు సంపాదించటం అసాధ్యమా ?బిజెపి బి టీమ్‌గా మజ్లిస్‌ పని చేస్తున్నట్లు వచ్చిన విమర్శల సంగతి తెలిసిందే. రెండు పార్టీలకు చెందిన వారు పరస్పరం అవగాహనతో విద్వేషాన్ని రెచ్చగొట్టి తమ ఓటు బాంకును ఏర్పాటు చేసుకుంటున్నారనే భావన నానాటికీ బలపడుతోంది.


హరిద్వార్‌ సభలో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలు చేశారు. ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేయని పక్షంలో జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఆ మేరకు విధిలేక కేసు దాఖలు చేశారు. హరిద్వార్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ వాటి కారణంగా ఎలాంటి హింసాకాండ జరగనందున ఉగ్రవాద చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయలేదని ఉత్తరాఖండ్‌ డిజిపి అశోక్‌ కుమార్‌ చెప్పారు. ఇది తప్పించుకోవటం తప్ప వేరు కాదు. నరసింగానంద నాయకత్వంలో 2020 జనవరిలో ధర్మ సంసద్‌ జరిగింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగ్గా మరుసటి నెలలోనే ఈశాన్య ఢిల్లీలో మతఘర్షణలు జరిగాయి. ఇప్పుడు హరిద్వార్‌ సమావేశం ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందే జరిగింది. అక్కడ చేసిన ప్రతిజ్ఞలేమిటి ?


డిసెంబరు 19న సభ చివరి రోజు నరసింగానంద సభకు వచ్చిన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. …. అను నేను నా కుటుంబ సనాతన ధర్మం కోసం, నా సోదరీమణులు, కుమార్తెల రక్షణ కోసం గంగానది తీరాన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మతం, నా కుటుంబం, నా పిల్లలు, మహిళలకు ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ వ్యక్తి హాని తలపెట్టినా అతన్ని ప్రాణాలతో వదలను. మా మతం కోసం మేము జీవిస్తాము. మా మతం కోసం మేము మరణిస్తాము. ఇస్లామ్‌ జీహాద్‌ను అంతం చేస్తాను. సనాతన ధర్మం చిరకాలం ఉండాలి. సనాతన శత్రువులనందరినీ నాశనం చేయాలి. ” హిందూమతానికి ముప్పు వచ్చినట్లు గోబెల్స్‌ ప్రచారం చేయటం, దేశం ముస్లిం రాజ్యంగా మారుతుందనే ప్రచారంతో జనాల బుర్రలను ఖరారు చేస్తున్నారు. వందల సంవత్సరాలు ముస్లిం పాలకులు, బ్రిటీష్‌ వారు పాలించినప్పటికీ 80శాతం మంది జనం హిందువులుగానే ఉన్నారు. ఆ పాలకులకే సాధ్యం కానిది ఇప్పుడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాల్లో హిందూత్వ బిజెపి అధికారంలో ఉండగా ఎవరో మతమార్పిడి చేసి జనాన్ని హిందూమతానికి దూరం చేస్తున్నారనే ప్రచారం చిన్న మెదడు చితికిన వారు చేసేది తప్ప మరొకటి కాదు. గత ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిన మార్పేమిటో చెప్పమనండి అసలు సంగతి బయటపడుతుంది.


సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో జరిపిన ఈ సమావేశంలో చేసిన విద్వేష పూరిత ప్రసంగాలు ఓట్ల రాజకీయంలో భాగం కాదని ఎవరైనా చెప్పగలరా ? మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడితే అది వెంటనే దిగదు. హిందూత్వ శక్తులుగా ఛాతీవిరుచుకొని చెప్పే బిజెపికి ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెట్టటమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ. అది నెరవేరుతుందా ? గతంలో కూడా ఇలాంటి పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిపొందారు. సరిగ్గా ఎన్నికల ముందే ఉగ్రవాద చర్యలు జరగటం వాటిని ప్రచార అస్త్రాలుగా చేసుకోవటాన్ని గమనిస్తున్న జనం క్రమంగా వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొందరిని కొంతకాలం మభ్యపెట్టవచ్చు, మోసం చేయవచ్చు. అందరినీ ఎల్లకాలం అలా చేయలేరు.జనాలు వెర్రివాళ్లు కాదు, బుర్రలను వాట్సాప్‌ పండితుల ప్రచారానికి తాకట్టు పెట్టలేదు.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సాగు చట్టాల పునరుద్దరణకు కొత్త ఎత్తుగడ – ఆందోళన పేరుతో బికెఎస్‌ను దించిన ఆర్‌ఎస్‌ఎస్‌ !

24 Friday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Bharatiya Kisan Sangh (BKS), BJP, farm laws, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


అనేక మంది ఊహించినట్లుగానే సాగు చట్టాల పునరుద్దరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ తనదైన శైలిలో రంగంలోకి దిగింది. రద్దు చేసిన మూడు సాగు చట్టాలను కొన్ని మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలంటూ దాని అనుబంధ భారతీయ కిసాన్‌ సంఫ్‌ు(బికెఎస్‌) జనవరిలో ఆందోళన చేస్తామని ప్రకటించింది. రద్దు చేసిన చట్టాలు 90శాతం రైతులకు లబ్ది చేకూర్చుతాయని, ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోవాలని కోరుకున్న వారికి సంతోషం కలగటం తప్ప రద్దు తరువాత రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నది. అందువలన కొన్ని మార్పులతో తిరిగి వాటిని ప్రవేశపెట్టాలని కోరుతూ తాము దేశవ్యాపిత ఆందోళన చేస్తామని సంఘ ప్రధాన కార్యదర్శి బదరీ నారాయణ చౌదరి ప్రకటించారు. జై జవాన్‌-జైకిసాన్‌ పిలుపు ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి వర్ధంతి రోజైన జనవరి 11న దేశమంతటా తహసీల్దారు కార్యాలయాల ముందు నిరసన, బహిరంగ సభలు జరుపుతామని వెల్లడించారు. అంతకు ముందు ఒకటవ తేదీ నుంచి పది వరకు గ్రామగ్రామాన రైతులను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సాగు చట్టాల రద్దు కోసం సాగించామని చెబుతున్న ఉద్యమం సాధించిందేమీ లేదని, తొలుత తాము కూడా దానికి మద్దతు ఇచ్చామని తరువాత హింసా కాండ, దేశ. సంఘ వ్యతిరేక చర్యల కారణంగా ఉపసంహరించుకున్నామని చెప్పారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతూ గతంలో 20వేల గ్రామాల నుంచి వినతులు పంపామని, 513 జిల్లాల్లో సెప్టెంబరు ఎనిమిదిన ధర్నాలు చేసినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


మూడు సాగు చట్టాల్లో మార్పుల్లో భాగంగా కనీస మద్దతు ధరలకు హామీతో సహా కొనుగోలు దార్ల నమోదుకు ఒక పోర్టల్‌, రైతుల ఫిర్యాదుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తూ సవరించాలని కోరుతున్నామన్నారు. తమ సంఘం సన్న, చిన్నకారు రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని రద్దైన చట్టాలు 90శాతం మంది రైతులకు మేలు చేసేవన్నారు. వాటి రద్దు తమకు ఆశ్చర్యం, ఆశాభంగం కలిగించిందని,విచ్చిన్నం, హింసను సృష్టించిన వారి మాటలనే ప్రభుత్వం వినటం, తమ వంటి శాంతియుత, ప్రజాస్వామికంగా ఉండే వారు చెప్పేవాటిని పట్టించుకోకపోవటం విచారకరమని చెప్పారు. ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం దేశమంతటా రైతులకు తోడ్పడేదిగా లేదన్నారు. ఎంఎస్‌పిగా ఇస్తున్న మొత్తాలు నైపుణ్యం లేని కార్మికులకు సైతం చాలదని గిట్టుబాటు ధర ఇవ్వాలని సంఫ్‌ు జాతీయ కార్యదర్శి కె.శాయిరెడ్డి చెప్పారు.రైతులకు గిట్టుబాటు కావాలంటే సహజ వ్యవసాయ పద్దతులు అనుసరించాలని రసాయన ఎరువుల బదులు ఆవు పేడ వంటి వాటిని వాడాలన్నారు.


బికెఎస్‌ నేతలు గత ఏడాది కాలంగా ఉద్యమించిన రైతుల మీద బిజెపి మోపిన నిందలనే మరోసారి పునశ్చరణ కావించించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. ఆందోళన ప్రారంభమైన నాటి నుంచి బిజెపి, కేంద్ర మంత్రులు చేసిన ఆరోపణలు, నిందలకు తందాన తాను అంటూ వాటినే బికెఎస్‌ వల్లె వేసింది. ఆ సంస్ధ ఇప్పుడు చెబుతున్న అంశాల మీదనే వేరు దుకాణం పెట్టి ఆందోళన చేసి ఉంటే అదొక తీరు. మొక్కుబడిగా ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. పోనీ వారు చేసిన పోరాటం లేదా ఆరాటం నిజంగా జరిగి ఉంటే మోడీ సర్కార్‌ సదరు అంశాలకు సానుకూలంగా ఎందుకు మాట్లాడలేదు ? ఎంఎస్‌పికి చట్టబద్దతకు ఇప్పటికీ కేంద్రం ఆమోదం చెప్పకుండా కమిటీ వేసి పరిశీలిస్తామని అంటోంది. కొన్ని మార్పులతో పాత వాటినే పునరుద్దరించాలని బికెఎస్‌ చెప్పటం వెనుక ఉన్న ఎత్తుగడ, ప్రభుత్వ హస్తం గురించి తెలియనంత అమాయకంగా ఇప్పుడు రైతులు లేరు. ఏడాది పాటు ఉద్యమం సాగిన సమయంలో బికెఎస్‌ వ్యవహరించిన తీరు, ప్రభుత్వానికి అనుకూలంగా రైతులను సమీకరించేందుకు చేసిన విఫల యత్నాలు ఎవరికి తెలియనివి. అవన్నీ విఫలం అయిన కారణంగానే తప్పనిసరై మోడీ వెనక్కు తగ్గారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు బికెఎస్‌ చెబుతున్నవి కొత్త ప్రతిపాదనలేమీ కాదు, ఎంఎస్‌పికి చట్టబద్దత కుదరదంటే కుదరదని ఏడాది పాటు మొండికేసిన మోడీ ఇప్పుడు సానుకూలంగా ఉండేట్లయితే కమిటీ పేరుతో కాలయాపన ఎందుకు ? బికెఎస్‌ను ఏర్పాటు చేసిందే ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది బహిరంగ రహస్యం. మరణించేంత వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న దత్తోపంత్‌ టేంగిడీ 1979లో దీన్ని ఏర్పాటు చేశారు.

ఢిల్లీ శివార్లలో రైతుల నిరవధిక ఆందోళనకు పోటీగా బిజెపి రైతు సంపర్క యాత్రల పేరుతో తన మద్దతుదార్లను సమీకరించేందుకు అనేక చోట్ల విఫల యత్నం చేసింది. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్‌లో రైతులను ప్రసన్నం చేసుకొనేందుకు పడని పాట్లు లేవు.డిసెంబరు 23వ తేదీ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ జన్మదినం సందర్భంగా బిజెపి ఎక్కడలేని శ్రద్ద చూపింది. చరణ్‌ సింగ్‌ కుటుంబ, రాజకీయ వారసులు ఆర్‌ఎల్‌డి పార్టీలో ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీని గద్దె దించేందుకు సమాజవాది పార్టీతో జతకట్టారు. చరణ్‌ సింగ్‌ జన్మదినాన్ని రైతుదినోత్సవంగా బిజెపి పాటించింది.లఖింపూర్‌ ఖేరీలో కేంద్రమంత్రి అజయ మిశ్రా తనయుడు, అనుచరులు చేసిన దుర్మార్గంతో అవన్నీ కొట్టుకపోయాయి. బిజెపి నేతలు గ్రామాలకు వెళ్లలేని స్ధితి కొన్ని చోట్ల ఏర్పడింది. దాని సెగ ఎంతగా ఉందంటే ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన బిజెపి ఎంపీలతో జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బికెఎస్‌ను రంగంలోకి దించారు.


లఖింపూర్‌ ఖేరీలో పధకం ప్రకారమే రైతుల మీదకు మోటారు వాహనాలను నడిపి హత్యచేసినట్లు విధిలేని పరిస్ధితిలో దర్యాప్తు సంస్ధ కూడా నివేదిక ఇచ్చింది. ఆ ఉదంతం గురించి బికెఎస్‌ నేతలు చెప్పిందేమిటి ? తమ మీదకు వాహనాలు నడిపి తోటి వారిని చంపి దొరికిన హంతకులను రైతులు రాచమర్యాదలలో సాగనంపుతారా ? వారు రైతులు కాదు, హత్యలే రోజువారీ పనిగా ఉన్న వారని, వామపక్ష పద్దతుల్లో చేశారని, గుమికూడిన వారు రాజకీయ పార్టీల మద్దతుదారులు తప్ప రైతులు కాదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని నిందిస్తూనేే జరిగిన సంఘటనలు దురదృష్టకరం అని సన్నాయి నొక్కులు నొక్కింది. పధకం ప్రకారం జరిపిన హత్యాకాండను ఘర్షణలు అని వర్ణించింది. రైతుల మీదకు కార్లను తోలి చంపిన బిజెపి మద్దతుదారులు అమాయకులన్నట్లు, రైతులు హంతకులైనట్లు చిత్రించటం రైతు సంఘం పేరుతో ఊరేగుతున్నవారికి తగినపనేనా ? ఇంతగా నిందించిన వారు చట్టాలను పునరుద్దరించాలని రోడ్లెక్కుతామనటంలో ఆశ్చర్యం ఏముంది ! బిజెపికి కార్పొరేట్లు అందచేస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులతో రైతుల ముసుగులో తన మద్దతుదార్లను సమీకరించి కృత్రిమ ఆందోళనలు చేయించినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బీహార్‌ ప్రత్యేక హోదాపై బిజెపి, జెడియు రాజకీయం !

19 Sunday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Bihar, Bihar Special status politics, JDU vs BJP, Narendra Modi, Nitish Kumar


ఎం కోటేశ్వరరావు


మధ్యలో 278 రోజులు మినహా పదిహేను సంవత్సరాలకు పైగా వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న జనతాదళ్‌(యు)-జెడియు నేత నితీష్‌ కుమార్‌ పదిహేనేండ్ల నాటి బీహార్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోసారి ముందుకు తెచ్చారు. అలాంటి హోదాను వర్తింప చేసే అధికారం నీతి అయోగ్‌కు లేనప్పటికీ ఆ డిమాండ్‌ను పరిశీలిస్తాం అన్నట్లుగా ఆ సంస్ధ అధికారి చెప్పటం, మీడియా ప్రముఖంగా ప్రచారంలోకి తేవటంతో సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోణాల్లో (ఒక చోట నిజంగానే ఇస్తే -మరో చోట వత్తిడి చేస్తే ఇస్తారేమో అన్నట్లుగా) ఆసక్తి రేపింది.బీహార్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌ను తాము మరింత లోతుగా, దగ్గరగా పరిశీలిస్తామని నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. మూడు సాగు రైతు చట్టాలను వెనక్కు తీసుకొనేది లేదంటూ ఏడాదికి పైగా భీష్మించుకు కూర్చున్న నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్న తీరు చూసిన తరువాత కాస్త వత్తిడి చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు దాన్ని వర్తింపచేసే చర్యలు తీసుకోవచ్చేమో అని ఆశపడిన వారు కూడా లేకపోలేదు. మా మోడీ కారణంగా అటు సూర్యుడు ఇటు పొడిస్తే పొడవవచ్చు గాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మాత్రం ఇచ్చేది కల్ల అన్నట్లుగా బిజెపి వ్యవహరించిన తీరు, పార్లమెంటులో కూడా ప్రకటించటాన్ని చూసిన తరువాత కూడా నితీష్‌ కుమార్‌ ఎందుకు ముందుకు తెచ్చారు అన్నది ఆసక్తి కలిగించే అంశం. నీతిఅయోగ్‌ తాజాగా ప్రకటించిన నివేదిక ప్రకారం దరిద్రంలో బీహార్‌ అగ్రస్ధానంలో ఉంది.


2020 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బిజెపిని బీహార్‌లో ఇరకాటంలో పెట్టాయి. రెండువందల నలభై మూడు స్దానాలున్న సభలో ఎన్‌డిఏ కూటమిలో 74 స్ధానాలతో బిజెపి పెద్ద పార్టీగా జెడియు 43 స్దానాలతో సరిపెట్టుకుంది. మరో రెండు పార్టీలతో కలుపుకొని కూటమికి వచ్చిన వచ్చిన మొత్తం సీట్లు 125కావటం, సంపూర్ణ మెజారిటీకి కేవలం మూడు సీట్లే ఎక్కువ. దాంతో బిజెపి అనివార్యంగా నితీష్‌ కుమార్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా అంగీకరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి అది పెద్దన్నగా మారింది. తాము చెప్పినట్లు వినాలని మాటి మాటికీ గుర్తు చేస్తోంది. రాష్ట్ర పేదరికం, వెనుకబాటుతనంతో ఉందనే పేరుతో ప్రత్యేక హోదా డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చినట్లు పైకి చెప్పుకోవచ్చుగానీ అది అతికే వాదన కాదు. బీహార్‌కు ఆ స్ధితి ఇవాళ కొత్తగా వచ్చిందేమీ కాదు. ప్రత్యేక హోదా డిమాండ్‌ అసంబద్దం అని బిజెపికి చెందిన ఉప ముఖ్యమంత్రి రేణు దేవి అన్నారు. హోదాను ఎవరైనా వ్యతిరేకిస్తే వారికి సమస్య అర్ధంగాక పోయి ఉండాలి అని నితీష్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా అర్హతల గురించి ఒకసారి చూద్దాం.జమ్ము-కాశ్మీర్‌, హిమచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కింతో సహా ఎనిమిది ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించి నిధుల కేటాయింపు, రాయితీలు వర్తింప చేస్తున్నారు. పద్నాలుగవ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు నిధుల వాటాను 32 నుంచి 42శాతానికి పెంచినందున ఏ రాష్ట్రానికి అలాంటి హోదాను కల్పించాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతున్నది. నిబంధనలతో నిమిత్తం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించినప్పటికీ 14వ ఆర్ధిక సంఘాన్ని సాకుగా చూపి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తిరస్కరించిన అంశం తెలిసిందే. కొండ ప్రాంతాలు, జనాభా సాంద్రత తక్కువగా ఉండటం, వచ్చే ఆదాయం రాష్ట్రాలకు చాలని స్ధితి, విదేశీ సరిహద్దుల్లో ఉన్న పరిస్ధితి,ఆర్ధిక వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.విదేశీ సరిహద్దుల్లో ఉన్న స్ధితి అంటే వ్యూహాత్మకంగా కీలకంగా ఉందా లేదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కేవలం విదేశీ సరిహద్దును మాత్రమే తీసుకుంటే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌కు నేపాల్‌తో సరిహద్దు ఉన్నప్పటికీ గతంలో హోదాను వర్తింప చేయలేదు. అలాంటి జాబితాలో ఉన్న రాష్ట్రాలకు కలిగే లబ్దిని చూద్దాం. విదేశీ సాయంతో, కేంద్ర ప్రత్యేక సాయం, సాగునీటి సంబంధిత ఏఐబిపి ప్రాజెక్టులకు 90శాతం, కేంద్ర ప్రత్యేక పధకాలకు నూరుశాతం నిధులు కేటాయిస్తారు.ఆ పదిశాతం నిధులు కూడా వడ్డీ లేని అప్పుల రూపంలో కేంద్రం ఇవ్వవచ్చు.ఇవిగాక కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఉంటాయి.అయితే నిధుల బదలాయింపు 42శాతానికి పెరిగిన తరువాత అన్ని రాష్ట్రాలకు అనేక కేంద్ర సహాయ పధకాలను రద్దు చేశారు.విదేశీ పధకాలను కూడా పరిమితం చేశారు. ఏఐబిపి పధకాలకు 2014-15లో రు.8,992 కోట్లు ఉన్న బడ్జెట్‌ను మరుసటి ఏడాది కేవలం వెయ్యికోట్లకు పరిమితం చేశారు. అసలు మొత్తంగానే అనేక పధకాలను రాష్ట్రాలకు బదలాయించటం, కేంద్రవాటా తగ్గించటం వంటి పనులతో ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో తీసుకున్నట్లయింది. ఇన్ని చేసినా పరిశ్రమలకు రాయితీల వంటివి ఉన్నందున ప్రత్యేక హోదా ఇంకా ఆకర్షణీయంగానే ఉంది. కొత్తగా ఇవ్వకపోయినా పాతవాటిని కొనసాగిస్తున్నారు.రాజ్యాంగపరంగా అలాంటి హౌదా కలిగిన రాష్ట్రాలు లేకున్నా గతంలో జాతీయ అభివృద్ధి మండలికి మంజూరు అధికారం ఉండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలచుకుంటే ఇప్పటికైనా వర్తింప చేయవచ్చు.


నితీష్‌ కుమార్‌ ఎందుకు ఈ డిమాండ్‌ను ఇప్పుడు ముందుకు తెచ్చారనే ప్రశ్నపై భిన్న కోణాలలో చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల లబ్దికోసమే రైతుల డిమాండ్‌కు నరేంద్రమోడీ తలొగ్గి సాగు చట్టాలను రద్దు చేశారు. వచ్చే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను బీహార్‌లో బిజెపి ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు కనుక ప్రత్యేక హౌదా కోరితే కనీసం కొంత మేరకు నిధులైనా రాకపోతాయా అన్న ఆలోచన కావచ్చు. ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీకి కొన్ని సీట్లలో మద్దతు కోసం వత్తిడి కావచ్చు.ఇన్నేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అధ్వాన్నంగా ఎందుకుంచారో సంజాయిషి ఇవ్వాల్సిన పెద్దమనిషి (బిజెపికి సైతం వాటా ఉంది) ఆ ప్రశ్నను పక్కదారి పట్టించేందుకా లేక బిజెపితో సంబంధాలను తెంపుకోవాల్సి వస్తే ఏదో ఒక అంశం కావాలి గనుక ఆ జాబితాలో దీన్ని కూడా చేర్చారా అన్నది చెప్పలేము.గతేడాది అధికారానికి వచ్చినప్పటి నుంచి కలసి కాపురమే గానీ ఎవరి గది వారిదే అన్నట్లుగా బిజెపి-జెడియు మధ్య సంబంధాలున్నాయి.


అనేక అంశాలపై రెండు పార్టీల మధ్య విబేధాలు బహిరంగంగానే వెల్లడయ్యాయి. వెనుకబడిన తరగతుల కుల గణన చేపట్టాలంటూ రెండు సార్లు చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని బిజెపి కూడా బలపరిచనప్పటికీ కేంద్రంలోని బిజెపి తిరస్కరించింది. అవసరమైతే తమ ఖర్చుతో రాష్ట్రంలో కులగణన చేస్తామని నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. 2011లో నాటి కేంద్ర ప్రభుత్వం చేసిన కులగణన వివరాలను రాజకీయ కారణాలతో బయట పెట్టలేదు. బీహార్‌కు ప్రత్యేక హోదా అర్ధం లేదు, అవసరంలేదు అన్న బిజెపి ఉపముఖ్యమంత్రి రేణు దేవీకి ఏమీ తెల్వదు, ఆమెకు తరువాత నేను చెబుతా అని నితీష్‌ మాట్లాడారు. ప్రతి సంకీర్ణ కూటమిలో చిన్న చిన్న విభేదాలుంటాయి, అవి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయవని ఒక బిజెపి మంత్రి అన్నారు. 2009లో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ చేసిన డిమాండ్‌ను మౌఖికంగా సమర్దించిన బిజెపి నేడు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నది.నాడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, నేడున్నది తమ నరేంద్రమోడీ, అప్పుడు సంకీర్ణ కూటమిలో బిజెపి తోకపక్షం ఇప్పుడు జెడియు ఆ స్ధానంలో ఉంది కనుక ఈ వైఖరి అన్నది స్పష్టం.


హర్యానాలో మాదిరి బహిరంగ స్ధలాల్లో నమాజును నిషేధించాలని బిజెపి మంత్రులు, ఎంఎల్‌ఏలు నితీషకుమార్‌ను డిమాండ్‌ చేశారు. అలాంటి పని చేస్తే బిజెపికి కొత్తగా పోయేదేమీ లేదు, తమ మీద ఆ ప్రభావం పడుతుందని జెడియు నేతలు మండిపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసిన వారిలో ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. బిజెపి నేతలు తాము అసలు సిసలు దేశభక్తులమని జనం ముందు కనిపించేందుకు తాపత్రయపడుతున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే బిజెపికి చెందిన బీహార్‌ అసెంబ్లీ స్పీకర్‌ జెడియుతో సంప్రదించకుండానే ఇటీవలి శీతాకాల సమావేశాల్లో జాతీయ గీతం ఆలపించాలని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధిశాఖకు జెడియు మంత్రి ఉన్నారు. ఆ శాఖలో ఒక ఇంజనీరు అవినీతి గురించి విచారణ జరపాలంటూ స్పీకర్‌ ఒక సభాసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక కొత్త సంప్రదాయం కాగా ఆ కమిటీకి నితీష్‌ కుమార్‌ మీద ఒంటికాలుతో లేచే బిజెపి ఎంఎల్‌ఏ, మాజీ మంత్రి నితీష్‌ మిశ్రాను నేతగా చేశారు.పార్లమెంట్‌లో బిజెపి బీహార్‌ ఎంపీ ఒకరు తమ రాష్ట్రంలో ప్రధాన మంత్రి గ్రామ రోడ్ల నిర్మాణ పధకం సక్రమంగా జరగటం లేదంటూ విమర్శకు దిగితే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ నిజమే అంటూ లెక్కలను ప్రకటించారు. బీహార్‌లోనూ కేంద్రంలోనూ ఉన్నది ఎన్‌డిఏ ప్రభుత్వమే అని బిజెపి నేతలకు గుర్తున్నట్లు లేదంటూ జెడియు నేతలు ఎద్దేవా చేశారు. మగధ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ మీద నిధుల దుర్వినియోగ విచారణ నేపధ్యంలో విసిని తొలగించాలన్న ముఖ్యమంత్రి నితీష్‌ వినతిని గవర్నర్‌ ఫగు చౌహాన్‌ ఖాతరు చేయకపోవటంతో నితీష్‌ పరువు పోయింది.


నితీష్‌ కుమార్‌కు గతంలో ఉన్న పేరు ప్రతిష్టలు ఇప్పుడు లేవని గతేడాది ఎన్నికల్లో తేలిపోయింది. అందువలన నితీష్‌ను బలపరచటం తమకు లాభం కంటే నష్టమే ఎక్కువని బిజెపి నేతలు లెక్కలు వేసుకున్న కారణంగానే మంత్రులు, నేతలు తరచూ బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. కేంద్ర నాయకత్వం అదేమీ తెలియనట్లు అమాయకత్వం నటిస్తోంది. రెండు పార్టీల నేతలూ అబ్బే మాలో విబేధాలేమీ లేవంటూ సమాధానాలిస్తున్నారు. తాజా అంశానికి వస్తే రాష్ట్రానికి కేంద్రం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులిస్తోందని బిజెపి మంత్రి జివేష్‌ మిశ్రా అంటే నిబంధనల ప్రకారమే ఇస్తోందని ఎక్కువ ఎలా ఇచ్చారో చూపాలని జెడియు మంత్రి బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ సవాలు విసిరారు.


ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు పిల్లల విధానాన్ని ముందుకు తెచ్చిన బిజెపి సర్కార్‌ తీరును, లౌ జీహాద్‌ ప్రచారాన్ని జెడియు విమర్శించింది. 2020 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తేడా తెలియని స్ధితి ఏర్పడిందని ఎన్నికలు ముగిసిన తరువాత 2021జనవరి పార్టీ సమావేశంలో నితీష్‌ కుమార్‌ పరోక్షంగా బిజెపిని తప్పుపట్టారు. మొత్తం ప్రచారంలో బిజెపి-ఎల్‌జెపి భాయి భాయి అని కేంద్రీకరించారని, తమ మీద పోటీ చేసిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్‌జిపి కంటే బిజెపి వల్లనే ఎక్కువ సీట్లను కోల్పోయినట్లు జెడియు నేతలు వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపికి చెందిన 15 మంది ఎల్‌జెపి తరఫున పోటీకి దిగిన అంశం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జలజీవన్‌ పధకం కింద బీహార్‌లో కోటీ 46లక్షల గ్రామీణ మంచినీటి సరఫరా కనెక్షన్లను అందచేసినట్లు బిజెపి చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కల్పించినవి 87శాతం ఉన్నందున ఆ ఖ్యాతి నితీష్‌ కుమార్‌కు దక్కాలని జెడియు తిప్పికొట్టింది.


బిజెపి తన సైద్దాంతిక అంశాలలో భాగంగా అది రామాలయ నిర్మాణం లేదా ఆర్టికల్‌ 370 రద్దు వంటివి చేపట్టి తన మద్దతుదార్లను కాపాడుకుంటోందని, తమది ప్రత్యేక పార్టీ తప్ప బిజెపి అనుబంధ సంస్ద కాదని జెడియు ప్రతి సందర్భంలోనూ స్పష్టం చేస్తోంది.
సంకీర్ణ కూటమిలో నాలుగేసి స్ధానాలున్న హిందుస్తానీ అవామీ పార్టీ(హామ్‌), వికాస్‌షీల్‌ ఇన్సాన్‌ పార్టీ (విఐపి)కూడా బిజెపి మీద విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఒక ప్రయివేటు మదర్సాలో జరిగిన పేలుడును అవకాశంగా తీసుకొని మదర్సాలు ఉగ్రవాదుల తయారీ కేంద్రాలుగా మారాయంటూ, అన్ని మదర్సాలను మూసివేయాలని బిజెపి నేతలు చేసిన ప్రకటనలను హామ్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి జితిన్‌ రామ్‌ మాంఝీ ఖండించారు. దళితులు విద్యావంతులైతే నక్సలైట్లు, ముస్లింలు చదువుకుంటే ఉగ్రవాదులని చిత్రిస్తున్నారని అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతుల వారి మద్దతు పొందే ఎత్తుగడలో భాగం, ముస్లింలపై వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ఓటుబాంకును ఏర్పాటు చేసుకొనేందుకు కూడా బిజెపి పావులు కదుపుతోంది. దశాబ్దాల తరబడి ఏదో విధంగా అధికారంలో కొనసాగినప్పటికీ తాము పెద్దపార్టీగా ఎదగలేకపోయామని, ఇప్పటికైనా అందుకు పూనుకోవాలని వారు చెబుతున్నారు.దళితులు, బిసిలపై ముస్లింలు దాడులు చేస్తుంటే నితీష్‌ కుమార్‌ సర్కార్‌ తగిన చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వంలో కొనసాగుతూనే బిజెపి నేతలు విమర్శలకు దిగుతున్నారు.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో జెడియును చీల్చి ఆరుగురు ఎంఎల్‌ఏలను బిజెపి తనలో చేర్చుకున్నది. దానిపైజెడియునేతలు మండి పడ్డారు. తమ నేతను స్పీకర్‌గా, ఇద్దరిని ఉపముఖ్యమంత్రులుగా చేయాలని బిజెపి ఆదేశించినట్లుగా చెప్పటం తప్ప ముందుగా నితీష్‌ కుమార్‌తో కనీసం సంప్రదించలేదని అప్పుడే వార్తలు వచ్చాయి.హౌంమంత్రిత్వశాఖను కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.బీహార్‌ రాజకీయాల్లో నితీష్‌ కుమార్‌ వేసినన్ని పిల్లి మొగ్గలు మరొకరు వేసి ఉండరేమో ! అటు ఆర్‌జెడి-ఇటు బిజెపిని రెండింటినీ ఉపయోగించుకొని పదవులు పొందారు. వాటికోసం నితీష్‌ కుమార్‌ ఏమైనా చేయగలరు అనే పేరు తెచ్చుకున్నారు. నరేంద్రమోడీని 2014లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తేనున్నారని గ్రహించి 2013లో బిజెపితో 17 సంవత్సరాల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. మొరటు లేదా విభజించే లక్షణాలు లేని ఉన్నతమైన లౌకిక భావాలు కలిగిన వారే తమకు ఆమోదయోగ్యమని జెడియు అప్పుడు చేసిన తీర్మానంలో పేర్కొన్నది. తరువాత జరిగిన పరిణామాలేమిటో తెలిసిందే. అదే నరేంద్రమోడీతో కలసి పని చేస్తున్నారు. బిజెపితో కలసి ఉంటే కలదు సుఖం అనుకున్నన్ని రోజులు ఉంటారు. లేదనుకుంటే బయటకు వస్తారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బలాబలాల ప్రకారం ఇష్టం ఉన్నా లేకున్నా బిజెపి దయాదాక్షిణ్యంతో అధికారంతో కొనసాగటం లేదా బయటకు వచ్చి ఆర్‌జెడి సర్కార్‌కు మద్దతు ఇవ్వటం మినహా మరొక మార్గం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమికి 40కి గాను 39 స్ధానాలు వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని సెప్టెంబరులోనే ప్రతిపక్ష ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ ప్రకటించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఇండియా : 2014 నుంచి రోజుకు 200 స్వదేశీ, ఒక విదేశీ కంపెనీ మూత !

17 Friday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

‘Make In India’progamme, BJP, Make In India, Modi 7 years rule, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు
మేకిన్‌ ఇండియా పధకాన్ని ప్రకటించి ఏడు సంవత్సరాలు గడచింది. ఈ కాలంలో అంటే 2014 సెప్టెంబరు 25 నుంచి 2021 డిసెంబరు ఒకటవ తేదీ వరకు 8,42,710 కొత్త కంపెనీలు నమోదైనట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ ఇటీవల రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో చెప్పారు. పెట్టుబడులు, తయారీ, రూపకల్పన, నవకల్పన వంటి వాటికి నిలయంగా, ప్రపంచ ఎగుమతి ఎగుమతి కేంద్రంగా మారి చైనాను పక్కకు నెట్టాలన్నది ప్రకటిత లక్ష్యం. పోటీ పడాల్సిందే, ఉపాధి కల్పించాల్సిందే, అంతకంటే కావాల్సింది ఏముంది.పైన పేర్కొన్న కంపెనీలలో పని చేస్తున్నవి 7,82,026 అని కూడా మంత్రి వెల్లడించారు. సులభతర వాణిజ్యానికి అనువైనదిగా గుర్తించటమే అత్యంత ప్రధాన కారణం అని కూడా చెప్పారు.


చిత్రం ఏమిటంటే బిజెపి లేదా నరేంద్రమోడీ విజయ గాధల్లో ఈ కార్యక్రమం లేదా చొరవ లేదు. కొండంత రాగంతో ప్రారంభించి కీచుగొంతుతో ముగిస్తున్నారు. గుజరాత్‌ ఆదర్శ నమూనాను దేశమంతటా అమలు జరుపుతానన్నది నరేంద్రమోడీ 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. తరువాత మోడీ నోట ఆ మాటను ఎవరైనా విన్నారా ? ప్రపంచమంతటికీ నేను ఒక వినతి చేయదలచాను. రండి భారత్‌లో తయారు చేయండి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా అమ్ముకోండి గానీ తయారీ మాత్రం మాదగ్గరే జరగాలి అని నరేంద్రమోడీ చెప్పారు. తరువాత జరిగిందేమిటో చూశాము. ఇంతచేసినా 2019లో దేశ జిడిపిలో వస్తుతయారీ రంగ వాటా 20 ఏండ్ల నాటికంటే తక్కువగా నమోదైంది.తరువాత స్వయం సమృద్ధి గురించి చెప్పటం ప్రారంభించారు, కరోనా వచ్చిన తరువాత ఆత్మనిర్భరత గానాలాపాన తెలిసిందే. సంస్కరణల పేరుతో మూడు దశాబ్దాల క్రితం తీసుకున్న చర్యల్లో భాగంగా లైసన్సులు ఎత్తివేశారు,కార్పొరేట్‌ పన్ను భారీగా తగ్గించారు. అనేక దిగుమతి పన్నులు తగ్గించారు. కార్పొరేట్లకు అనేక సబ్సిడీలు, రాయితీలు ఇచ్చారు. ప్రణాళికా సంఘం అవసరం లేదంటూ దాన్ని ఎత్తివేశారు. ఉత్పత్తి, ఎగుమతులకు లంకెపెట్టి మరికొన్ని సబ్సిడీలను ప్రకటించారు. వాటికీ సడలింపులు ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఎవరూ వ్యతిరేకించలేదు. కనుకనే వేగంగా అమలు జరిపేందుకు పూనుకున్నారు. సంస్కరణల పేరుతో మొదటికే మోసం తెస్తున్నారని జనానికి మూడు దశాబ్దాల తరువాత అర్ధం కావటం ప్రారంభమైంది. కరోనా కాలంలో జనానికి ఖర్చు పెట్టేందుకు చేతులు రాలేదుగానీ కార్పొరేట్లకు దాదాపు రెండు లక్షల కోట్ల మేరకు కట్టపెట్టారు. మేడిన్‌ ఇండియాలు కార్యక్రమం జయప్రదం కావాలంటే సులభతర వాణిజ్య సూచికను మెరుగుపరిచేందుకు కేంద్రీకరించారు. ఐదు సంవత్సరాల్లో 79 పాయింట్లను మెరుగుపడినట్లు ప్రకటించారు.వీటితో ప్రపంచబాంకును సంతృప్తి పరచారు తప్ప పెట్టుబడిపెట్టేవారికి విశ్వాసం కల్పించలేకపోయారు.


మరోవైపు జరిగిందేమిటి ? 2021 మార్చి 31 నాటికి దేశంలో నమోదైన కంపెనీలు 21,51,349, వీటికి గాను మూతపడినవి 7,58,350, ఇవిగాక నిద్రావస్ధలో 2,266, రద్దు ప్రక్రియలో 6,893, దానికి ముందు దశలో 38,983 ఉన్నాయి. సాంకేతికంగా ఏ పేరు పెట్టినా ఇవన్నీ మూతపడేవే గనుక మొత్తంగా లెక్కిస్తే 8,06,809 ఉంటాయి. పార్లమెంటులో ప్రకటించిన మేరకు ఏడున్నర సంవత్సరాల్లో కొత్తగా వచ్చినవి 8,42,710, ఏతావాతా వచ్చినవాటికి సమానంగా మూతపడినవీ ఉన్నాయి. ఇవన్నీ మోడీ ఏలుబడిలోనే మూతపడలేదు, సంస్కరణల మాదిరే మూతల వేగం పెరిగింది.


తొలిసారి గద్దె నెక్కినపుడు దేశం కంటే విదేశాల్లోనే ఎక్కువ కాలం గడిపారు నరేంద్రమోడీ. ఎందుకంటే విదేశీ పెట్టుబడుల సాధన, పోయిన ప్రతిష్టను పునరుద్దరించేందుకు అని చెప్పారు. నిజమే కామోసు అనుకున్నారు జనం. ఆ ఊసుల మేరకు విదేశీ కంపెనీలేమైనా ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయా ? ప్రస్తుతం నమోదైనవి 4,979 వాటిలో పని చేస్తున్నవి 3,334. సులభతర వాణిజ్య సూచికలు మెరుగుపడిన తరువాత 2018 -2021 మధ్య దేశంలో కొత్తగా నమోదైన విదేశీ కంపెనీలు 320 అని 2021జూలైలో కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ పార్లమెంటులో చెప్పారు. 2014 నుంచి 2021నవంబరు వరకు 2,783 విదేశీ కంపెనీలు మన దేశం నుంచి వెళ్లిపోయినట్లు వాణిజ, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పారు. మన దేశంలో పర్యవేక్షక లేదా బ్రాంచిఆఫీసులు లేదా ప్రాజెక్టు ఆఫీసులు కలిగిన విదేశీ కంపెనీల సంఖ్య 10,756. కొన్ని కంపెనీల ప్రాజక్టులు ముగిసిన తరువాత వెళ్లినవి, కొన్ని విలీనాలతో మూతపడినవి రకరకాల కారణాలు వెళ్లిపోయిన వాటి వెనుక ఉన్నాయి. ఆఫీసులు కలిగిన కంపెనీలన్నీ ఉత్పాదక లేక సేవలు అందిస్తున్నవి కాదు.


2013 డిసెంబరు 31నాటికి దేశంలో నమోదైన 13,69,362 కంపెనీల్లో 19శాతం 2,67,639 మూతపడినట్లు నాటి కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి సచిన్‌ పైలట్‌ లోక్‌సభలో చెప్పారు. పైన పేర్కొన్న వివరాల ప్రకారం 2021మార్చి 31 నాటికి అది 37.6శాతానికి పెరిగాయి. కొన్ని కంపెనీలు ప్రభుత్వం వద్ద నమోదైనప్పటికీ పన్నుల ఎగవేత, లాభాల తరలింపు వంటి అక్రమాలకు మాత్రమే పరిమితమైనవి ఉన్న అంశం అందరికీ తెలిసిందే. వాటిని షెల్‌ లేదా సూట్‌కేస్‌ కంపెనీలని పిలుస్తున్నాము. నిజానికి చట్టంలో కంపెనీ అంటే కంపెనీ తప్ప సూట్‌కేస్‌ అని ఉండదు. పాలకులు తమ హయాంలో సాధించిన గొప్పల గురించి చెప్పుకోవాల్సి వచ్చినపుడు వీటిని కూడా కలుపుకొనే చెబుతారు. అనేక అక్రమాలు బయట పడిన తరువాత అలాంటి వాటిని గుర్తించి కంపెనీల జాబితా నుంచి తొలగిస్తామని మోడీ సర్కార్‌ హడావుడి చేసింది. ఆ మేరకు 2018-21కాలంలో 2,38,223 సంస్ధలను గుర్తించినట్లు పార్లమెంటుకు తెలిపారు. వాటన్నింటినీ రద్దు చేశారా లేదా అన్నది స్పష్టత లేదు. ఇంకా అనేక కంపెనీలు ఉన్నాయి.యునిటెక్‌ గ్రూపు కంపెనీ 52 సూట్‌కేస్‌ కంపెనీలను సృష్టించినట్లు తాజాగా ఇడి వెల్లడించింది. వాటిలో డైరెక్టర్లుగా ఉన్న వారికి నెలకు పది, ఇరవై వేలు చెల్లిస్తూ అవసరమైనపుడు సంతకాల కోసమే పిలిపిస్తుంటారని కూడా తెలిపింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి వందల కోట్ల నిధులను సూట్‌కేసు కంపెనీల పేరుతో దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న కార్వి కంపెనీ సూట్‌కేస్‌ కంపెనీలను ఏర్పాటు చేసి పాల్పడిన అక్రమాలపై విచారణ, అరెస్టుల గురించి తెలిసినదే. ఇంకా ఇలాంటివి ఎన్నోఉన్నాయి. తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేసేందుకు వాటిని దారి మళ్లించి, విదేశాలకు తరలించి కంపెనీలను దివాలా తీయించి మూతవేసేవి కూడా ఉన్నాయి. పాతవాటిని మూసివేసి కొత్త పరిశ్రమల పేరుతో రాయితీలు పొందేందుకు కొత్త కంపెనీల సృష్టి, ఒకేచోట జరిపే ఉత్పత్తిని వేర్వేరు కంపెనీల పేరుతో లెక్కలు చూపే సంగతి తెలిసిందే. తప్పుడు మార్గాల్లో విదేశాలకు నిధులు తరలించి మారిషస్‌ మరొక దేశం పేరుతో తిరిగి వాటినే పెట్టుబడులుగా పెడుతూ లబ్దిపొందేవారు కూడా ఉన్నారు.


ఏడున్నర సంవత్సరాల పాలనలో ఎగుమతులేమన్నా పెరిగాయా ? ప్రపంచబాంకు సమాచారం మేరకు 2013లో గరిష్టంగా మన జిడిపిలో వస్తు, సేవల ఎగుమతులు 25.43శాతం ఉండగా 2020నాటికి 18.07శాతానికి తగ్గాయి. 2013-14 కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం మన జిడిపిలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల వాటా వర్తమాన ధరల్లో 18.2 -24.77-57.03 శాతాల చొప్పున ఉంది. అదే కరోనాకు ముందు 2019-20లో 20.19-25.92-53.89శాతాల చొప్పున ఉంది. ఈ అంకెలు వెల్లడిస్తున్నదేమిటి ? విదేశీ పెట్టుబడులు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పేరుతో ఆర్భాటం తప్ప పెను మార్పులేదన్నది స్పష్టం. ఎగుమతి రంగంలో చూస్తే 2014లో 468-2018లో 538, 2020లో 474 బిలియన్‌ డాలర్ల మధ్య ఉన్నాయి.ఈ ఏడాది 400 బి.డాలర్లు అంటున్నారు.నరేంద్రమోడీ గారు చెప్పిన అచ్చేదిన్‌ కనుచూపుమేరలో కనిపించటం లేదు. అభివృద్ధి రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి దిగజారిన తరువాత కరోనా వచ్చింది. తిరిగి ఎంత మేరకు వృద్ధి ఉంటుందో చెప్పలేము. ఏడేండ్లలో జరిగిందేమిటి ?


2013 డిసెంబరు 31నాటికి దేశంలో మూతపడిన కంపెనీలు 2,67,639 కాగా 2021 మార్చి 31నాటికి మూతపడినవి 7,81,987. అంటే ఏడు సంవత్సరాల మూడునెలల్లో కొత్తగా మూతపడినవి 5,14,348. సులభంగా అర్ధం కావాలంటే రోజుకు రెండువందల కంపెనీలు మూతపడ్డాయి. మేక్‌ ఇండియా ప్రకటన తేదీ నుంచి 2021డిసెంబరు ఒకటి వరకు అంటే ఏడు సంవత్సరాల రెండు నెలల ఆరు రోజుల్లో నమోదైన కొత్త కంపెనీలు 8,42,710. అంటే రోజుకు 321 కొత్త కంపెనీలు నమోదు, మూతపడిన వాటిని తీసుకుంటే నిఖరంగా పెరిగినవి రోజుకు 121. మూతపడుతున్నవాటి కంటే కొత్త కంపెనీలే ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పవచ్చు. ప్రపంచంలో దేశంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. చైనా వంటి వర్ధమాన దేశాల్లో వస్తూత్పత్తి రంగం ప్రధాన ఉపాధి కల్పన వనరుగా ఉంది. అందుకే మన పాలకులు చైనా స్ధానాన్ని ఆక్రమించి వస్తూత్పత్తి చేస్తామని చెప్పారు. ఆశయం మంచిదేగానీ ఆచరణేలేదు. సేవారంగం మీద ఆధారపడ్డారు. వస్తూత్పత్తి రంగంలో ఆటోమేషన్‌, రోబోలు ఎలా వచ్చాయో, సేవారంగాన్ని కూడా ఆటోమేషన్‌ ఆవరిస్తున్నది. బాంకులకు వెళ్లి డబ్బు తీసుకోనవసరం లేకుండా ఎటిఎం మెషీన్లే మనకు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్‌, కంప్యూటర్ల ద్వారా నిధుల బదిలీ, ఇతర లావాదేవీలు జరుపుకోవచ్చు, సేవలకు చెల్లింపులు జరపవచ్చు. ఇవన్నీ ఉపాధిని హరించేవే. అందువలన మన అవసరాలకు అనుగుణంగా వృద్ధి లేదు. జనానికి ఆదాయం లేనపుడు వస్తు, సేవల వినియోగం తగ్గుతుంది. పంటలకు తగిన గిట్టుబాటు ధరలను సమకూర్చలేని పాలకులు నాటు, కోత, ఇతర యంత్రాలను ప్రోత్సహిస్తున్నారు, ఫలితంగా గ్రామాల్లో ఉపాధి తగ్గుతోంది. చేతి వృత్తుల్లో కూడా యాంత్రీకరణ పెరిగిపోతోంది. అసలు మొత్తంగానే వృద్ది రేటు తగ్గింది. ఉన్నమేరకు చూసినా అది ఉపాధి రహిత వృద్ధి. మోడీ సర్కార్‌ డిజిటైజేషన్‌ గురించి తాజాగా కబుర్లు చెబుతోంది. అది పెరిగే కొద్దీ ఉపాధి అవకాశాలు తరుగుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముడి చమురు 15 డాలర్లు తగ్గింది – పైసా కూడా తగ్గని పెట్రోలు, చమురు ధర !

04 Saturday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures, sharp fall in global oil rates


ఎం కోటేశ్వరరావు


2021నవంబరు నాలుగవ తేదీ నుంచి డిసెంబరు నాలుగవ తేదీన ఇది రాస్తున్న సమయం వరకు దేశంలో ప్రభుత్వం (చమురు సంస్ధలు) పెట్రోలు,డీజిలు ధరలను పెంచలేదు. నెల రోజులైనా జేబులు కొల్లగొట్టనందుకు నరేంద్రమోడీ సర్కార్‌ను మెచ్చుకోవాలనే వారితో కాసేపు ఏకీభవిద్దాం. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ముగిసేవరకు ఇదే స్ధితిని కొనసాగించినా ఆశ్చర్యం లేదు. ఆవిధంగా ముందుకు పోయి జనం మీద ప్రేమను పొంగి పొర్లించి మురికి గంగను చేర్చి ప్రక్షాళన జరిపించినా ముక్కు మీద వేలేసుకోవద్దు. ఇది తెరముందు మనకు కనిపిస్తున్నదృశ్యం. తెరవెనుక ఏం జరుగుతోందో ముందు చూద్దాం. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. పాలకుల ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్న రకం పీపా ధర నెల సగటు 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగింది. ఐనా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర రు.91.17, ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గిన మొత్తం 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు కదా ! మోడీ మాయాజాలం అన్నది అంగీకరించాల్సిందే. బవిరి గడ్డాలను చూసి నీతి నిజాయితీలు ఉంటాయని నమ్మే రోజులు కావివి !


ఇక వచ్చే ఏడాది జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. చాలా రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని గతంలో ఆ పెద్దమనిషి మాదిరి పన్నులు పెంచకపోయినా వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. ఆ తరువాత జరుగుతున్నదేమిటి ? అదే జనాలు తెలుసుకోవలసింది. అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో చమురు ధరలను 28 సార్లు సవరించారు. ఆ నెలలో ముడిచమురు సగటు ధర 82.11 డాలర్లు, నవంబరు నెలలో అది 80.64డాలర్లకు తగ్గింది.దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నెల రోజులుగా తమ ధరలను ఒక్క పైసా కూడా ఎందుకు తగ్గించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం అక్టోబరులో పక్కాగా అమలు చేశారు, నవంబరులో ఏమైంది ? విశ్వగురువు నరేంద్రమోడీని అడిగేందుకు విలేకర్లకు అవకాశం ఇవ్వరు, ఆ పెద్దమనిషి నోరు విప్పరు ? అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది.


అక్టోబరు 25న గరిష్టంగా మన కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.నవంబరు 10న 84.07 డాలర్ల తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.మొత్తం మీద పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. చంబల్‌ బందిపోట్లు ఆప్రాంత ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోలు కొనే సర్‌ గోచిపాత రాయుడి మొదలు అత్యంత పేదలైన అంబానీ, అదానీల వరకు అందరినీ సమంగా చూస్తోంది. చంబల్‌ దోపిడీ పెద్దదా ఇది పెద్దదా ? ప్రకటిత ధరల విధానం ఏమైంది ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే, రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ? మరో విధంగా, అదే ఓట్ల రూపంలో బిజెపికి లబ్ది కలిగించేందుకు చూస్తున్నాయి. ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా పాలక పార్టీకి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేస్తోంది.రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు అవి వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. అసలు భారీ మొత్తాల్లో సెస్‌లు పెంచిన కేంద్రాన్ని వదలి బిజెపి రాష్ట్రాల్లో రాజకీయం చేస్తోంది.


ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు అమ్ముకొనే వారు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెస్తారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది.


వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో తీసుకుంటున్నట్లుగా ముడి చమురు ధరలు తగ్గిన మేరకు జనాలకు తగ్గించకుండా కేంద్రం ధరల రూపంలో దండుకుంటోంది. వచ్చే రోజుల్లో రెండు మూడు పరిణామాలు జరగవచ్చు. ఒకటి ముడి చమురు ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి. ఇంకా తగ్గినా గత నెల రోజుల మాదిరి ధరలను తగ్గించకపోవచ్చు.పెరిగితే ఇప్పుడు వచ్చిన లాభాలు కంపెనీల వద్ద ఉంటాయి గనుక ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు ఇదే ధరలను కొనసాగించవచ్చు. మొత్తంగా నవంబరు-ఏప్రిల్‌ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఎక్కువ ఉందనుకోండి, ఎన్నికలు ముగిసిన తరువాత ఆమేరకు అసలు ఫాయిదాలను వడ్డీతో సహా వసూలు చేసినట్లు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. మొత్తం మీద రాజకీయ-వాణిజ్య లాభనష్టాలను చూసుకుంటే ధరలను అదుపులో ఉంచితే కొందరినైనా మోసపుచ్చితే పాలకపార్టీకి ఎంతో కొంత రాజకీయ లబ్ది కలుగుతుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. జనాల జేబు గుల్ల మామూలుగానే ఉంటుంది. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు ఇతర కారణాలతో బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాలో కూలుతున్న జఫర్సన్‌ ,రష్యాలో పెరుగుతున్న స్టాలిన్‌ విగ్రహాలు !

28 Sunday Nov 2021

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

History, Joseph v Stalin, Russia's Communist Party, statues of Stalin, Thomas Jefferson


ఎం కోటేశ్వరరావు

అమెరికాలో కూలుతున్న జఫర్సన్‌ ,రష్యాలో పెరుగుతున్న స్టాలిన్‌ విగ్రహాలు అనే శీర్షికతో అమెరికాలోని అగ్రపత్రికల్లో ఒకటైన లాస్‌ ఏంజల్స్‌టైమ్స్‌ నవంబరు 20న ఒక విశ్లేషణను ప్రచురించింది. ఇదే సమయంలో ఒక స్మారక చిహ్నానికి ఉన్న చట్టబద్దతను రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటీషన్‌పై రష్యా సుప్రీం కోర్టు విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది. పూర్వపు సోవియట్‌లో జరిగినట్లు చెప్పే మానవహక్కుల ఉల్లంఘనకు బలైన వారి పేరుతో స్టాలిన్‌, కమ్యూనిస్టు పార్టీ మీద బురద చల్లేందుకు ఏర్పాటు చేసినదే సదరు స్మారక చిహ్నం. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌ ప్రభుత్వానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల మీద ప్రేమ పుట్టుకువచ్చి ఈ కేసు దాఖలు చేశారా ?
చరిత్ర నిర్మాతలు జనం, వారికి మద్దతుగా నిలిచిన నేతలు అన్నది తిరుగులేని సత్యం.బ్రిటన్‌ మాజీ ప్రధాని వినస్టన్‌ చర్చిల్‌ చరిత్రను రాసేది విజేతలు అని చెప్పారు. అంతకు ముందు కారల్‌ మార్క్స్‌ చరిత్ర గురించి చెబుతూ చరిత్ర పునరావృతం అవుతుంది, తొలుత అది విషాదకరంగా తరువాత ప్రహసనంగా అన్నారు. చర్చిల్‌ చెప్పినట్లు దేశంలో పూర్తి అధికారాన్ని సాధించిన విజేతగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) తనకు అనుకూలంగా చరిత్రను తిరగరాసేందుకు పూనుకుంది.కారల్‌మార్క్స్‌ చెప్పినట్లు అది విషాదకరమే, రెండవది ఆ పరివారంతో ప్రభావితమై దేశానికి 1947వచ్చింది భిక్ష తప్ప నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్‌ చెప్పటం ప్రహసన ప్రాయమే.( కారల్‌ మార్క్స్‌ ఏ సందర్భంలో,ఏ అంశాల ప్రాతిపదికన అలా చెప్పారని విశ్లేషకులు తలలు బద్దలు కొట్టుకుంటూనే ఉన్నారు)


అనేక దేశాల్లో చరిత్ర గురించి చర్చలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి.అమెరికాలో కూడా అదే జరుగుతోంది. లాస్‌ఏంజల్స్‌టైమ్స్‌ విశ్లేషణ రచయిత నికోలస్‌ గోల్డ్‌బెర్గ్‌ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను రాశారు. మరోసారి అమెరికన్లు చరిత్ర గురించి పోట్లాడుకుంటున్నారు అనే వాక్యంతో ప్రారంభించారు. తాజమహల్‌ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవరని మహాకవి శ్రీశ్రీ ప్రశ్నించినట్లే అమెరికా నిర్మాతలెవరు, ఏ పునాదులమీద నిర్మించారనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యాన్ని ప్రస్తావిస్తూ అమెరికా నిర్మాతగా పరిగణించే థామస్‌ జఫర్సన్‌ – నాజీల పీచమణచిన కమ్యూనిస్టు నేత స్టాలిన్ల గురించి రాశారు. స్టాలిన్ను నియంతగా వర్ణిస్తూ మే నెలలో జరిగిన సర్వేలో 56శాతం మంది రష్యన్లు స్టాలిన్ను గొప్పనేతగా పరిగణించటం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ తన రాజకీయ అవసరాల కోసం స్టాలిన్‌కు పునరావాసం కల్పిస్తున్నారని, గత తరాలు ధ్వంసం చేసిన విగ్రహాల స్ధానంలో కొన్ని పట్టణాలలో తిరిగి ప్రతిష్ఠిస్తున్నారని రచయిత వాపోయాడు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ప్రధాన రచయిత ధామస్‌ జఫర్సన్‌ ఆరువందల మంది బానిసలను కూడా కలిగి ఉన్నాడని, అలాంటి వ్యక్తి విగ్రహం తమ సిటీ హాల్‌లో ఉండటం అవమానకరమంటూ దాన్ని తొలగించాలని న్యూయార్క్‌ నగరపాలక సంస్ధ ఏకగ్రీవంగా తీర్మానించటం గురించి గగ్గోలు పెట్టాడు. అందుకే జఫర్సన్‌ విగ్రహాలను తొలగిస్తుంటే స్టాలిన్‌ విగ్రహాలను కొత్తగా పెడుతున్నారంటూ విశ్లేషణ చేశాడు.


సోవియట్‌ను కూల్చిన తొలి రోజుల్లోనే స్టాలిన్‌ మీద తప్పుడు ప్రచారం చేసేందుకు స్మారకాన్ని ఏర్పాటు చేశారు.2016లో దాన్ని విదేశీ ఏజంట్‌గా ప్రకటించారు.దాని ప్రకారం మానవహక్కుల సంస్దల పేరుతో దాన్ని నిర్వహిస్తున్నవారి మీద చర్య తీసుకోవచ్చు. రాజకీయంగా తమను అణచివేసేందుకే పుతిన్‌ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసేందుకు పూనుకుందని వారు ఇప్పుడు విమర్శిస్తున్నారు. దానిలో వాస్తవం ఉన్నప్పటికీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా స్టాలిన్‌ మీద జనంలో పెరుగుతున్న సదభిప్రాయం కారణంగానే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు పుతిన్‌ కూడా ఎత్తులు వేస్తున్నాడన్నది స్పష్టం. రష్యాకోర్టులో తమ కేసు వీగిపోతే ఐరోపా కోర్టుకు వెళతామని నిర్వాహకులు చెబుతున్నారు. విదేశీ ఏజంట్లనే ముద్రవేసి పుతిన్‌ తన రాజకీయ ప్రత్యర్దులను దెబ్బతీస్తున్నాడు. కమ్యూనిస్టు ఎంపీ మీద కూడా తప్పుడు కేసు పెట్టించాడు.


2010లో స్టాలిన్‌ విగ్రహాలకు మద్దతు ఇచ్చిన వారు 25శాతం, వద్దన్నవారు 36శాతం కాగా ఈ ఏడాది ఆగస్టులో అవి 48 – 20శాతాలుగా ఉన్నట్లు లెవడా కేంద్రం సర్వే వెల్లడించింది.2005-21 మధ్యకాలంలో 18-24 ఏండ్ల వయసులో ఉన్న వారిలో స్టాలిన్‌ పట్ల అభిమానం ఐదు రెట్లు పెరిగింది. స్టాలిన్‌ గొప్పనేత అని చెప్పిన వారు ఈ ఏడాది మేనెల సర్వేలో 56శాతం మంది ఉన్నట్లు, 2016తో పోల్చితే రెట్టింపు అని లెవడా తెలిపింది. ద్వితీయ ప్రపంచ యుద్దంలో సోవియట్ల చర్యలను నాజీలతో పోల్చటాన్ని నిషేధిసూపార్లమెంట్‌ చేసిన తీర్మానానికి ఈ ఏడాది జూలైలో పుతిన్‌ ఆమోద ముద్రవేశాడు.యుద్దంలో పౌరుల నిర్ణయాత్మక పాత్రను తోసిపుచ్చటాన్ని కూడా నిషేధించారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ పతనంలో స్టాలిన్‌ పాత్ర చెరిపితే చెరిగేది కాదు. స్టాలిన్‌ మరణం తరువాత నాటి పార్టీనేతలు చేయని తప్పుడు ప్రచారం లేదు, మసోలియం నుంచి భౌతిక కాయాన్ని తొలగించి క్రెమ్లిన్‌లో సమాధి చేశారు. సోవియట్‌ పతనం ముందు తరువాత కూడా తప్పుడు ప్రచారం సాగినా ఇటీవలి కాలంలో స్టాలిన్‌ పట్ల రోజు రోజుకూ జనంలో అభిమానం పెరుగుతోంది. స్టాలిన్‌ గురించి ఇతర దేశాల్లో సాగించిన తప్పుడు ప్రచార నేపధ్యంలో అనేక మందికి ఈ పరిణామం మింగుడు పడటం లేదు గానీ రష్యన్లు ఆ విధంగా భావించటం లేదు. తమ దేశ ఔన్నత్యం నిలిపిన నేతగా పరిగణిస్తున్నారు.


స్టాలిన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా నాజీలు ఆకస్మికంగా దాడి చేసినపుడు ఎర్రసైన్యం పసిగట్టలేకపోయిందంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఆ కారణంగా 2005 సర్వేలో స్టాలిన్‌ తగిన సన్నాహాలు చేయలేదనే అభిప్రాయం 40శాతం కలిగి ఉండగా 2021లో 17శాతానికి తగ్గింది. స్టాలిన్‌ గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలిపేందుకు ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని మాస్కోకు 450 కిలోమీటర్ల దూరంలోని నోవోగోర్డ్‌ కమ్యూనిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ అధినేత జుగనోవ్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సోషలిస్టు సమాజాన్ని కుప్పకూల్చి జన సంపదలను దోచుకున్న వారు ఎల్సిన్‌ పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినపుడు స్టాలిన్‌ పేరుతో ఏర్పాటు గురించి ఎందుకు ఆలోచించకూడదని జుగనోవ్‌ సహాయకుడు అలెగ్జాండర్‌ యుషి చెంకో అన్నారు. గతంలో ఎలాంటి అభిప్రాయం వెల్లడించలేదని, సోవియట్‌ పతనం తరువాత పుట్టిన, పెరిగిన యువతరం ఇప్పుడు సానుకూల వైఖరితో ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి.


వివిధ సర్వేలలో స్టాలిన్‌ పట్ల సానుకూల వైఖరి వెల్లడి కావటం అంటే నూతన తరంలో సోషలిజం, కమ్యూనిజం పట్ల ఆసక్తి పెరగటం, కూల్చివేసిన సోషలిస్టు సమాజంతో ప్రస్తుత పరిస్ధితులను పోల్చుకోవటం సహజంగానే జరుగుతుంది. అది ఇప్పుడున్న పుతిన్‌ లేదా ఇతర అధికార బూర్జువా పార్టీలకు అంగీకారం కాదు. రెండవది రోజు రోజుకూ పుతిన్ను సమర్ధించేవారు తగ్గుతున్నారు. సర్వేల ఫలితాలు జనంలో చర్చకు దారి తీస్తున్నాయి. దీంతో సర్వేలు రష్యా సమాజాన్ని ప్రతిబింబించటం లేదని ధ్వజమెత్తుతున్నారు.కొందరైతే సర్వేల్లో అసలు స్టాలిన్‌ గురించి అడగాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. రష్యన్‌ చరిత్రలో స్టాలిన్‌ పాత్ర గురించి జనం 70శాతం మంది సానుకూలంగా స్పందిస్తున్నపుడు పండితులు దాన్ని ఎలా కాదో చెప్పలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు, లెవడా సర్వేలు అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి, స్టాలిన్‌ యుద్ధ విజేత, తెలివిగల నేత అని భావిస్తున్నారు. స్టాలిన్ను అభిమానించే వారు పెరగటం అంటే పాలకపార్టీ పట్ల అసంతృప్తి పెరగటంగా భావించవచ్చని కొందరు సూత్రీకరిస్తున్నారు. గతంలో స్టాలిన్ను ఒక నియంత, బూచిగా ఒక పధకం ప్రకారం చూపారు, చరిత్రను చూస్తే మహత్తర పోరాటం సాగించిన స్టాలిన్‌ మీద ఎల్లకాలం బురదచల్లటం కొనసాగించలేని స్ధితిలో జనాలు నిజాలు తెలుసుకుంటున్నారు. వాటిని పుతిన్‌ సహిస్తాడా ? చరిత్రలో వ్యక్తుల పాత్ర తక్కువేమీ కాదు. కానీ చరిత్ర అంటే వ్యక్తులు కాదు. వ్యక్తి ఆరాధనలకు పురోగామి వాదులు, కమ్యూనిస్టులు వ్యతిరేకం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d