• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

ఏం చెప్పారు మోడీజీ వహ్వా ! వహ్వా !!

30 Wednesday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

BJP, Farm prices, Farmers, MSP, Narendra Modi, Narendra Modi Failures, narendra modi namo mantra, Narendra Modi sarkar

యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది

ఎం కోటేశ్వరరావు

     2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయటానికి ఏడు సూత్రాల పధకాన్ని రూపకల్పన చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.గతంలో రైతుల ఆదాయాల గురించి కాకుండా వ్యవసాయ వుత్పత్తులు పెరగటానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను, కేవలం సవాలే కాదు మంచి వ్యూహాన్ని కూడా రచించాను, పకడ్బందీగా రూపొందించిన కార్యక్రమాలు, తగినన్ని వనరులు, అమలులో సుపరిపాలన కారణంగా ఈ లక్ష్యాన్ని సాధించగలం అన్నారు. బ్లూమ్‌బెర్గ్‌ ఇండియా ఆర్ధిక

వేదిక కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాలను చెప్పారు.ఆ ఏడు సూత్రాలు ఏవంటే

1. ఒక చుక్కనీటికి ఎంతో పంట లక్ష్యంగా సాగునీటి పధకాలకు భారీ బడ్జెట్‌

2. ఆహార ప్రక్రియ ద్వారా అదనపు విలువ చేకూర్చటం

3. 585 కేంద్రాలలో ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ ఫారాల ద్వారా ఒకే విధంగా వుండేట్లు చూడటం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు

4. ప్రతి పొలం భూసారాన్ని బట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు

5. భారీ పెట్టుబడులతో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు ద్వారా పంట చేతికి వచ్చిన తరువాత నష్టాల తగ్గింపు

6.చెల్లించగలిగిన ధరలలో కొత్త పంటల బీమా పధకం

7. వ్యవసాయానికి అనుబంధంగా కోళ్లు, తేనెటీగలు, చేపల పెంపకాలకు ప్రోత్సాహం

    ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఎంతో విశ్వాసంతో వున్నట్లు ప్రధాని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలు రైతుల కేంద్రంగా, నూతన ఆదాయ మార్గాలుగా వున్నాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ స్వయంగా తనకు లేఖ రాసినట్లు ప్రధాని చెప్పారు.

     ప్రధాని త్వరలో అధికారానికి వచ్చిన రెండో వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. నిజానికి ఒక చొక్కా విప్పి రెండో చొక్కా తగిలించుకున్నట్లుగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏకంగా ప్రధాని అయ్యారు. ఆందువలన ఆయనకు అనుభవం ప్రత్యేకంగా అవసరం వుందని ఆయనా అనుకోలేదు,జనం కూడా భావించలేదు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలలో రైతులకు వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వుండేట్లు చూస్తామని బిజెపి తన ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నది. అది అమలులోకి రావాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల, ఆ మేరకు అవసరమైతే ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపటం. రైతాంగానికి ఆ మేరకు ధరలు పెంచటానికి పార్లమెంటుతో పని లేదు, ప్రతిపక్షాల మద్దతు అంతకంటే అవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా యాభైశాతం ఒక్కసారిగా పెంచకపోయినా ఐదు సంవత్సరాలలో యాభై శాతం పెరిగేట్లుగా ఏటా పదిశాతం చొప్పున ఎందుకు పెంచలేదు. అంటే ప్రధాని మన్‌కి బాత్‌ వుపన్యాసం వినమని చెప్పటం తప్ప ఎదురు చూస్తున్న కిసానోంకి బాత్‌ గురించి చివరికి దేశానికి దిగివచ్చిన దేవదూత నరేంద్రమోడీ అని స్త్రోత్ర పారాయణం చేసిన మన వెంకయ్యనాయుడు కూడా ఎక్కడా సమాధానం చెప్పినట్లు మనకు తెలియదు.

     ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు వ్యవసాయంపై సలహాదారుగా వున్న అశోక్‌ గులాటీ ‘దేశంలో వున్న పరిస్థితి తీవ్రతను ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిగా గ్రహించినట్లు లేదు, కొన్ని రాష్ట్రాలలో 20శాతం వరకు ఆహార ధాన్యాల వుత్పత్తి పడిపోయింది. ప్రభుత్వం నిరంతరం రైతాంగాన్ని ఆదుకొనే వ్యవస్ధను ఏర్పాటు చేయనట్లయితే 1960 దశకంలో మాదిరి ఆహార కొరత ఏర్పడే అవకాశం వుంది’ అని కొద్ది నెలల క్రితం వ్యాఖ్యానించారు.ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారమే అనేక వ్యవసాయ వుత్పత్తులకు రైతులు తక్కువ ధరలను పొందారు. గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు వ్యవసాయ ఖర్చుల మరియు ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రకారం ఏ ఒక్క వుత్పత్తి ధర యాభైశాతం కాదు కదా ఆ సమీపంలో కూడా లేదు. అనేక రాష్ట్రాలలో ఆ ధరలు అమలు కాని స్ధితి కూడా వుంది. అసలు ఖర్చుల లెక్కింపు విధానమే లోపభూయిష్టం. జిడిపి లెక్కింపు విధానం, దారిద్య్రరేఖ ఎంత వుండాలి వుండకూడదు అని తర్జభర్జనలతో మార్పు గురించి ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే వ్యవసాయ ఖర్చుల లెక్కింపు విధానంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ప్రధాని తన మనసులోని మాటలో గానీ ఇతర చోట్లగానీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపరు ? తాజాగా ఆయన చెప్పిన ఏడు సూత్రాలలో కూడా ముఖ్యమైన ఈ అంశం చోటు చేసుకోలేదు. గతేడాది మన ప్రభుత్వం గోధుమలకు ఇచ్చిన ధర టన్నుకు 226 డాలర్లయితే ఇదే సమయంలో పాకిస్థాన్‌ చెల్లించిన ధర 320 డాలర్లు.

    రైతాంగానికి కనీస మద్దతు ధరలను పెంచకపోవటానికి కారణాలు ఏమిటి ? రైతులకు మద్దతు ధరలు పెంచితే వినియోగదారులకు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది కనుక పెంచవద్దని ప్రభుత్వ ఆర్ధికవేత్తలైన అరవింద్‌ సుబ్రమణ్యం, పంగారియా వంటి వారు జారీచేసిన హెచ్చరికలకు లొంగిపోయింది మోడీ సర్కార్‌.పోనీ ద్రవ్యోల్బణం పెరగ కుండా స్ధిరంగా వుందా అంటే ఆరునెలలకు ఒకసారి వుద్యోగులకు పెంచుతున్న కరువు భత్యమే లేదనేందుకు పక్కా నిదర్శనం. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో 2012-13నుంచి 2017-18 మధ్య కాలంలో సగటున ఏడాదికి నాలుగు శాతం వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇంతవరకు వాస్తవంలో రెండుశాతానికి మించలేదు. కొత్త బడ్జెట్‌లోగానీ, నరేంద్రమోడీ ఎన్నికల సభలు, రైతుల సభలలో గానీ ఎక్కడా తమ ఎన్నికల వాగ్దానం గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా ఆరు సంవత్సరాలలో ఆదాయం రెట్టింపు గురించి చెబుతున్నారు. అసలు విషయం ఏమిటి ?

     గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ప్రభుత్వం వాగ్దానం చేసిన వ్యవసాయ ఖర్చులపై 50శాతం లాభం చేకూర్చేవిగా లేవంటూ రైతు సంఘాల కూటమి గతేడాది సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దానికి వివరణ ఇస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది. అందుకే వ్యవసాయంతో పాటు కోళ్లు,చేపలు, తేనెటీగలు పెంచుకోండని నరేంద్రమోడీ వుచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన పుట్టక ముందునుంచే రైతాంగం ఆ పని చేస్తున్నది.

    రోడ్లు వేసేందుకు విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులు చెల్లించేందుకు లేదా ఆ కంపెనీలు నిర్వహిస్తున్న టోల్‌ టాక్సును ద్రవ్యోల్బణం ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. విదేశీ అప్పులను మన రూపాయల్లో కాకుండా డాలర్లలో చెల్లిస్తున్నారు. వుద్యోగులకు ఆరునెలలకు ఒకసారి ద్రవ్యోల్బణం ప్రాతిపదికన కరువు భత్యం చెల్లిస్తున్నారు. అదే విధంగా అమలు జరిపినా లేకపోయినా పారిశ్రామిక కార్మికులు, ఇతరులకు కూడా ద్రవ్యోల్బణ ప్రాతిపదికన కరువు భత్యం నిర్ణయిస్తున్నారు. రూపాయి విలువ పతనమైతే రైతాంగం కొనే డీజిల్‌, పెట్రోలు, ఎరువులు, పురుగుమందులు ధరలు ఎప్పటికపుడు పెరుగుతాయి. విద్యుత్‌, బొగ్గు, వుక్కు వంటి సంస్ధల వుత్పత్తులకు కనీస లాభాలను నిర్ణయించే విధానం వుంది. కానీ రైతాంగం విషయానికి వచ్చే సరికి అడ్డగోలు వ్యవహారం తప్ప ఒక నిర్ణీత విధానం, ప్రాతిపదిక లేదు. ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పెట్రోలు,డీజిల్‌ ధరలను సవరిస్తున్న కేంద్రం రైతాంగ వుత్పత్తులకు కొన్నింటికి అసలు మద్దతు ధరల నిర్ణయ విధానమే లేదు. వున్నవాటికి కూడా ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు. అవి అమలు జరగనపుడు అమలు జరిపే యంత్రాంగం లేదు.ఎందుకీ పరిస్థితి?

    2015లో వార్షిక ఇంక్రిమెంట్లు గాక వుద్యోగులకు 13శాతం కరువు భత్యం పెరిగింది.అదే ధాన్యం కనీస మద్దతు ధర 3.25శాతం, గోధుమలకు 5.2శాతం పెరిగింది. విజయ మాల్య, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటి వారి కంపెనీలు బకాయిలు చెల్లించకుండా వున్నపుడు ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అనో పరిశ్రమలను ఆదుకొనే పాకేజి పేరుతోనో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఆదుకుంటున్నాయి. మరి వరుసగా కరువుల పాలవుతున్న రైతులకు ఇలాంటి పాకేజీలు ఎందుకు వుండవు?

    పప్పు ధాన్యాల ధరలు పెరిగాయని జనం గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకొనేందుకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీన్నే అప్పు చేసి పప్పుకూడు అంటారు. అదే మన రైతాంగానికి చెల్లిస్తే కావలసినన్ని పప్పులు పండించరా ? విలువైన మన విదేశీమారక ద్రవ్యం మిగులు తుంది, మనరైతుల జేబుల్లో నాలుగు డబ్బులు వుంటాయి. వాటిని ఇతర వస్తువుల కొనుగోలుకు వుపయోగిస్తారు కనుక, పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా పచ్చగా వుంటాయా లేదా ? ఆ పని ఎందుకు చేయరు?

   పన్నెండవ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి లక్షా యాభైవేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు గొప్పగా చెప్పుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయ లావాదేవీలలో లక్షా 62వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్‌ పేర్కొన్నది . అరవై కోట్ల మంది రైతుల కుటుంబాల కంటే కొన్ని లక్షల మంది ప్రయాణించే విమానాశ్రయానికి ప్రాధాన్యత ఎక్కువ వున్నట్లు స్పష్టం కావటం లేదూ ? గత ప్రభుత్వ విధానాలతో పోల్చితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని మార్చిందేమీ లేదు. గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది. మరి తాజాగా నరేంద్రమోడీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఈ సంఖ్యను తగ్గిస్తాయా?పెంచుతాయా? తగ్గించాలనే కోరుకుందాం .

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత మాతపై రెండు ఫత్వాలు

24 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

AIMIM, bharat-mata-ki-jai-row, BJP, Bjp nationalism, MIM, Narendra Modi, RSS, RSS Double game

చిత్రం ఏమంటే ఈ రెండు శక్తులూ విడదీసేవి, విద్వేషాన్ని రెచ్చగొట్టేవి తప్ప మన స్వాతంత్య్ర వుద్యమంతో గానీ, దేశాన్ని, సమాజాన్ని ఐక్య పరిచే కృషిలో భాగస్వాములైనవి కాదు, హిందూ,ముస్లింలకు అధికార లేదా ఏకైక ప్రతినిధులూ కావు.

ఎం కోటేశ్వరరావు

    భారత మాతపై రెండు ఫత్వాలు జారీ అయ్యాయి. మెజారిటీ మతోన్మాదులు, మైనారిటీ మతోన్మాదులు ఎవరు చేసినా ఇవి రెండూ ఇప్పటికే సమాజంలో వున్న చీలికలు, అపోహలను మరింత గట్టిపరుస్తాయి. దేశానికి నష్టదాయకం. ప్రధాని నరేంద్రమోడీ బిజెపి జాతీయ సమావేశంలో వికాస మంత్రాన్ని జపిస్తే అదే సమావేశంలో పార్టీ మాత్రం దాని కంటే భారత మాతకు జై అనని వారు రాజ్యాంగాన్ని గౌరవించనివారిగా పరిగణించబడతారు అంటే దేశద్రోహుల కిందే లెక్క అన్న విడగొట్టే తీర్మానం చేసింది. దీన్నే మరో విధంగా ఆ పార్టీకి తెలిసిన భాషలో చెప్పాలంటే ఫత్వా జారీ చేసింది. దీనంతటికీ కారణం భారత మాతాకీ జై అనే నినాదాన్ని దేశభక్తిగా యువతరానికి బోధించాల్సిన అవసరం వుందని బిజెపి మాతృమూర్తి సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధిపతి మోహన్‌ భగత్‌ చిచ్చు రాజేశారు. దానికి ప్రతిగా మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తాను అలా నినదించను అని ప్రకటించి ఆజ్యం పోశారు. చిత్రం ఏమంటే ఈ రెండు శక్తులూ విడదీసేవి, విద్వేషాన్ని రెచ్చగొట్టేవి తప్ప మన స్వాతంత్య్ర వుద్యమంతో గానీ దేశాన్ని, సమాజాన్ని ఐక్య పరిచే కృషిలో భాగస్వాములైనవి కాదు, హిందూ,ముస్లింలకు అధికార లేదా ఏకైక ప్రతినిధులూ కావు. అధిపతి చెప్పిన తరువాత అనుచర గణం వూరికే ఎలా వుంటుంది? ఏకంగా బిజెపి సమావేశంలో తీర్మానం చేసింది. ఇదే సమయంలో హైదరాబాదుకు చెందిన అల్‌ మహద్‌ అల్‌ అలాలీ అల్‌ ఇస్లామీ, జామియా నిజామియా అనే మత సంస్థలు దీనికి ప్రతిగా భారత మాతకు జై అనటానికి ముస్లింలకు అనుమతి లేదని ఒక ఫత్వా జారీచేశాయి. దేశాన్ని ఒక మాతగా కొలవటానికి లేదని అవి పేర్కొన్నాయి. ప్రతి ముస్లిం తన దేశాన్ని ప్రేమిస్తారు, అందుకోసం ఎంత త్యాగమైనా చేస్తారు, ఇది వేరే విషయం, పూజించాల్సి వచ్చినపుడు అల్లాను తప్ప మరొకరిని ఇస్లాం అంగీకరించదని, రెండింటినీ కలగా పులగం చేయవద్దని ఆ సంస్ధలు చెబుతున్నాయి. భారత్‌కు జై, జై హింద్‌, హిందుస్తాన్‌ జిందాబాద్‌ అనటానికి తమకు ఇబ్బంది లేదని భారత మాత అంటే ఒక దేవతకు ప్రతిరూపంగా వున్నందున తాము జై కొట్టలేమని ముస్లిం నాయకులు ప్రకటించారు. ఇప్పుడు శిరోమణి అకాలీదళ్‌(అమృతసర్‌)కు చెందిన సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ కూడా సిక్కులు ఏ రూపంలోనూ మహిళలను పూజించరని అందువలన తాము భారత మాతాకి జై అనేది లేదని ప్రకటించారు. ‘దీని గురించి నేను వ్యాఖ్యానించాలనుకోవటం లేదు, ఇదొక వృధా వివాదం’ అని బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ విలేకర్లు అడిగిన దానికి బదులిస్తూ బుధవారం నాడు అహమ్మదాబాద్‌లో వ్యాఖ్యానించారు. భారత మాతాకీ జై అని ప్రతి ఒక్కరూ అనే విధంగా, గోవధను రాజ్యాంగంలో చేర్చాలని యధాప్రకారం బాబా రాందేవ్‌ డిమాండ్‌ చేశారు.

   హిందువుల అభ్యున్నతి కోసం (అది చెప్పే హిందూ అంటే భారత్‌ , భారత్‌ అంటే హిందూ అనే వ్యాఖ్యానానికి అర్ధం అదే) పని చేస్తున్నట్లు చెప్పుకొనే భారతీయ జనతా పార్టీ విరుద్ధ ముఖాలను ఎందుకు ప్రదర్శిస్తున్నట్లు ? నరేంద్రమోడీ అంటే ‘గుజరాత్‌ మోడల’్‌ తప్ప రాజ్యాంగం గురించి అంతగా తెలిసిన వ్యక్తి కాదనుకోవచ్చు, మరి అరుణ్‌జైట్లీ వంటి సుప్రసిద్ద లాయర్లు వుండి కూడా అలాంటి తీర్మానాలు ఎందుకు చేయిస్తున్నట్లు ? నిద్ర పోయే వారిని లేపవచ్చు తప్ప నటించే వారిని లేపలేము అన్నట్లే ఇదంతా ఒక పధకం ప్రకారమే జరుగుతోందని అనేక మంది భావించటంలో ఆశ్చర్యం లేదు. భారత మాతకు జై అనేందుకు నిరాకరించిన మహారాష్ట్ర శాసనసభలో మజ్లిస్‌ పార్టీ సభ్యుడిని వర్తమాన సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. చట్ట సభలు చేసిన నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించటానికి వీలు లేదనే తీర్పులు వెలువడుతున్న తరుణంలో అది కోర్టు పరిధిలోకి రాదు. కానీ బయట ఎవరైనా భారత మాతకు జై అనను అంటే అలాంటి వారిపై చర్య తీసుకోవటం కుదరదు, ఎవరైనా అలాంటి పిచ్చిపనిచేస్తే అది కోర్టులో చెల్లదు.ఎందుకంటే మన రాజ్యాంగంలో భారత్‌ అనే పదం వుంది తప్ప భారతమాత లేదు.అయినా సరే బిజెపి తన తీర్మానంలో ఇలా పేర్కొన్నది.’మన రాజ్యాంగం ఇండియాను భారత్‌ అని కూడా వర్ణించింది.భారత్‌ విజయం గురించి నినదించకపోవటం మన రాజ్యాంగాన్నే అగౌరవపరచటంతో సమానం’ అని పేర్కొన్నది. భారత స్వాతంత్య్ర వుద్యమంతో గానీ, రాజ్యాంగంతో గాని ఎలాంటి బీరకాయ పీచు సంబంధం కూడా లేని బిజెపి రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్దంగా వ్యవహరించటంలో ఆశ్చర్యం ఏముంది ?

   నినాదాలు చేయటం ద్వారా జాతీయ వాదాన్ని తయారు చేయలేమని వాజ్‌పేయి ప్రధానిగా వున్న కాలంలో అటార్నీ జనరల్‌గా పనిచేసిన సోలీ సోరాబ్జీ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆయనే మరొక విషయాన్ని కూడా తెలిపారు. విజయ్‌ ఇమ్మాన్యుయెల్‌-కేరళ రాష్ట్ర వివాదంలో 1986లో మైలురాయిగా పేర్కొన దగిన తీర్పును సుప్రీం కోర్టు జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి ఇచ్చారు.యెహోవా విట్‌నెస్‌ అనే క్రైస్తవ తెగకు చెందిన వారు జాతీయ గీతం పాడేటపుడు గౌరవసూచకంగా లేచి నిలబడతారు తప్ప దానిని పాడకూడదని అందువలన తాము జాతీయ గీతాన్ని పాడలేదని విద్యార్ధులు చేసిన వాదనపై వివాదం కోర్టుకు ఎక్కింది.ఆ విద్యార్ధుల చర్యను సమర్ధిస్తూ ‘ మన సంప్రదాయం సహనాన్ని బోధిస్తున్నది, మన తత్వశాస్త్రం సహనాన్ని బోధిస్తున్నది, మన రాజ్యాంగం సహనాన్ని ఆచరిస్తున్నది, మనం దాన్ని నీరు గార్చవద్దు’ అని న్యాయమూర్తి చిన్నప రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారంటూ సహనాన్ని స్పష్టంగా నిర్ధారించిన తీర్పు అని సొరాబ్జి వ్యాఖ్యానించారు.

   సీనియర్‌ న్యాయవాది ఆర్యమ సుందరం రాజ్యాంగంపై బిజెపి పూర్తిగా తప్పుడు వైఖరి తీసుకున్నది అని వ్యాఖ్యానించారు. కేరళ విద్యార్ధి కేసునే వుదాహరిస్తూ జాతీయ గీతాన్ని పాడనందుకు విద్యార్ధులను స్కూలు నుంచి బహిష్కరించారు. వారు దేశం లేదా జాతీయ పతాకం పట్ల ఎలాంటి అగౌరవాన్ని ప్రదర్శించలేదని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నారు.అందువలన వర్తమాన వివాద పూర్వరంగంలో ఒక వ్యక్తి ఎవరైనా ఇతర విధాలుగా దేశాన్ని అగౌరవపరిస్తే తప్ప కొన్ని నినాదాలను నేను చేయను అంటే అది మొత్తంగా అగౌరవ పరిచినట్లు కాదని సుందరం చెప్పారు. దేన్నయినా నినదించాలా లేదా అనేది అతనికి లేదా ఆమెకు సంబంధించిన విషయం. రాజ్యాంగం ప్రకారం భారత మాతాకీ జై అని నినదించకపోవటం దేశాన్ని అగౌరవపరచటంగా నేను అంగీకరించను, ఇదంతా పూర్తిగా అనవసరమైన చీలికలను సృష్టిస్తున్నది. ఎవరైనా దేశాన్ని లేదా జాతీయ పతాకాన్ని అగౌరవ పరిస్థే చర్య తీసుకోవాలని నేను కూడా నమ్ముతాను, ప్రస్తుతం అలాంటిదేమీ నాకు కనిపించటంలేదు.అలాంటి చర్యలు చీలికలను మరింత గట్టిపరుస్తాయి అని సుందరం అన్నారు.

   ‘ రాజ్యాంగ ప్రకారం భారత మాతాకు జై అని జనం అనాల్సిన అవసరం లేదు,ఎక్కడా దాని గురించి చర్చించలేదు. బిజెపి తీర్మానం తప్పుడు వ్యాఖ్యానం. ఇండియా అంటే భారత్‌ అని మాత్రమే రాజ్యంగం చెప్పింది.అది భారత మాత గురించి పేర్కొనలేదు. కాబట్టి అలాంటి నినాదం చేయటం ప్రతి పౌరుడి ప్రాధమిక విధి కాదు,మనం అందరం దేశాన్ని ప్రేమిస్తాము, గౌరవిస్తాము, కానీ దానిని మన మీద రాసుకొని తిరగము’ అని మరో సీనియర్‌ న్యాయవాది కామినీ జైస్వాల్‌ అన్నారు.’ బిజెపి వారు అనవసరంగా ఒక వివాదాన్ని సృష్టించారు. ఎవరూ కోరుకోని దానిని వారు సృష్టించబోతున్నారు. వారు జనాన్ని విభజించేందుకు పూనుకున్నారు, ఈ సమస్యలను రేకెత్తించకూడదు’ అని కూడా ఆమె చెప్పారు.మహా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పూర్తిగా తప్పుడు నిర్ణయం, ఎవరైనా దానిని సవాలు చేయాలి’ అని కూడా అన్నారు.

    ముంబైకి చెందిన న్యాయవాది అబ్దుల్‌ మజీద్‌ మెమన్‌ మాట్లాడుతూ ‘ ఈ సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు బిజెపి అలాగే మజ్లిస్‌ రెండూ తప్పు చేస్తున్నాయి. రాజకీయాలు చేస్తున్నారు. నా వరకు భారత మాతాకి జై అనటం ఒక సమస్య కాదు. ఆ నినాదమిస్తే ఏం హాని జరుగుతుంది.అసెంబ్లీ నుంచి వారిస్‌ పఠాన్‌ను సస్పెండ్‌ చేయటం అతి ప్రతిస్పందన అనుకుంటున్నాను. నినదించటం తప్పుకాదని నమ్ముతున్నట్లు నేను అతనితో టీవీ చర్చలో కూడా చెప్పాను, అయితే బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ వత్తిడి చేసిన కారణంగా తానా పనిచేయనని అతను అన్నాడు. దీంతో ఆ సమస్య అక్కడితో ముగిసి వుండాల్సింది’ అన్నారు.

   ‘మజ్లిస్‌ మొత్తం ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహించేది కాదని నేను ప్రతి ఒక్కరికీ గుర్తు చేయదలచాను. వారి చర్యలతో వాతావరణాన్ని కలుషితం కానివ్వరాదు.ఈ సమస్యను అనవసరంగా రేకెత్తించారని నేను కూడా భావిస్తున్నాను. హైదరాబాదుకు చెందిన ఒక మత పెద్ద భారత మాతాకి జై అనటాన్ని అభ్యంతర పెట్టినట్లు నేను చదివాను. గత అరవై సంవత్సరాలుగా వారికి సమస్య లేదు. ఇప్పటికీ వారికి భారత్‌ లేదా జై అనటానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ సమస్య ఎక్కడంటే మాత లేదా తల్లి అని చెప్పటంలోనే. మాతృదేశం అన్న భావనలో ఇప్పుడు తప్పేమిటి ? భారత మాత అంటే మదర్‌ ఇండియా వంటిదే. కానీ ఒక ముస్లిం మెహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన మదర్‌ ఇండియా అవార్డు వచ్చిన సినిమా, దానిలో మరొక ముస్లిం అయిన నర్గీస్‌ దత్‌ ప్రధాన పోత్ర పోషించారు, దానితో ఎవరికీ ఇబ్బంది రాలేదు. కానీ అసలు సమస్య ప్రతిసారీ ముస్లింలు తమ విదేయత, దేశభక్తిని నిరూపించుకోవటంలో అలసి పోయారు. అందుకోసం వారికి ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి నుంచి సర్టిఫికెట్‌ అవసరం లేదు’ అని మెమెన్‌ స్పష్టం చేశారు. మరొక సుప్రీం కోర్టు లాయర్‌ రాజు రామచంద్రన్‌ కూడా జాతీయ గీతాన్ని ఆలపించకపోవటం అనుమతించదగినదే అని కేరళ విద్యార్ధుల కేసు స్పష్టం చేసింది. కొంత మంది డిమాండ్‌ చేసినంత మాత్రాన ఒక నినాదాన్ని పలకనంత మాత్రాన అది రాజ్యాంగాన్ని అగౌరవపరచినట్లు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. ‘తన తీర్మానంలో బిజెపి ఈ విధంగా ప్రస్తావించటం దురదృష్టకరం, ఒక న్యాయవాదిగా నాకు అరుణ్‌ జైట్లీ అంటే గౌరవం వుంది, పార్టీ తీర్మానంలో రాజ్యాంగాన్ని ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యానం చేయటాన్ని నిరోధించేందుకు ఆయన అయినా ప్రయత్నించి వుండాల్సింది’ అని మరో సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వ్యాఖ్యానించారు.

   భారత మాతాకీ జై అన్న నినాదం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కంటే ముందే స్వాతంత్య్ర వుద్యమంతో ముడిపడి వున్నదని, భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌ ఆ నినాదాలతోనే వురి కంబం ఎక్కారు, ఇప్పుడు ఆ నినాదం గురించి చర్చించటమే ఒక విద్రోహం అని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా తన పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యా నించారు. నిజమే ఆంగ్లేయులు మన దేశాన్ని అక్రమించినందున దాస్యవిముక్తి చేయటానికి అనేక మంది దేశ భక్తులు జాతీయ వాదంలో భాగంగా అనేక నినాదాలు ఇచ్చిన మాట వాస్తవం. అదే భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని కూడా అన్నారు. మరి దాన్ని నినదించాలని సంఘపరివార్‌ లేదా బిజెపి ఎందుకు కోరటం లేదు. అన్నింటి కంటే భగత్‌ సింగ్‌ ఆ నినాదం చేస్తున్న తరుణంలో సంఘపరివార్‌ నేత సావర్కర్‌ ఆంగ్లమాతాకు జై అని నినాదాలు ఇస్తామని,తెల్ల దొరలకు సేవలు చేసుకుంటామని, బొలో స్వాతంత్య్ర భారత్‌కు జై అనే నినాదం మా నోట వెంట రానివ్వబోమని జైలు నుంచి బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన పచ్చినిజాన్ని కాదంటారా ? ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనటానికి ఏ మతానికి లేదా మరొకరికి అభ్యంతరం లేదు దాన్ని వదలి పెట్టి వివాదాస్పద అంశాలనే ఎందుకు అమ్ముల పొదిలోంచి బయటకు తీస్తున్నట్లు ?

  వందేమాతరం అన్నందుకు నాడు బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్ర సమర యోధులను జైల్లో పెట్టారు. ఇదే నినాదాన్ని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో అసందర్భంగా చేసినందుకు రాజీవ్‌ యాదవ్‌ అనే లాయర్‌ను న్యాయమూర్తులు మందలించటంతో అతను కోర్టుకు క్షమాపణ చెప్పాడు. అంటే దీని అర్ధం జడ్జీలకు దేశభక్తి లేదనా ? జాతీయ వాదులు కాదనా ? వందేమాతర గీతం, నినాదం ఒక వివాదాస్పద అంశం. స్వాతంత్య్ర వుద్యమ కాలంలోనే ముస్లింలు, సిక్కులు దానిని పాడేందుకు నిరాకరించారు.అంత మాత్రాన స్వాతంత్య్ర వుద్యమం వారిని దేశద్రోహులుగా లేక జాతి వ్యతిరేకులుగా పరిగణించలేదు. అక్కున చేర్చుకుంది. ఎందరో ముస్లింలు, సిక్కులు వందేమాతరం అనకుండానే తమ తమ పద్దతుల్లో స్వాతంత్య్ర వుద్యమంలో ఎన్నో త్యాగాలు చేయలేదా ? వారు దేశభక్తులు కాలేదా ?

   బిజెపి కనుక దేశభక్తి, జాతీయ వాదాలపై చట్టాలను సవరించి వాటిని గతం నుంచి వర్తింపచేయాలని గనుక నిర్ణయిస్తే జనగనమణ గీత రచయిత రవీంద్రనాధ ఠాగూర్‌ కూడా దేశద్రోహి వర్గీకరణకిందికే వస్తారు. ఒక గీతం జాతిని ఐక్య పరచాలి తప్ప విడదీయకూడదంటూ వందేమాతర గీతాన్ని రవీంద్రుడు తిరస్కరించారు. ‘ఈ అంశంపై బెంగాలీ హిందువులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు, కానీ ఇది ఒక్క హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు. రెండు వైపులా బలమైన భావనలు వున్నాయి. సమతుల్యమైన న్యాయం అవసరం. మన రాజకీయ లక్ష్యాల వుద్యమంలో మనం శాంతి, ఐక్యత, మంచితనం కోరుకుంటున్నాం, ఒక వర్గం చేసిన డిమాండ్లకు ప్రతిగా మరొక వర్గం చేసే డిమాండ్లతో అంతంలేని ఎదురుబొదురు బలప్రదర్శనలు తగదు.’అని రవీంద్రుడు సుభాస్‌ చంద్రబోస్‌కు రాసిన లేఖలో సూచించారు. చివరకు కాంగ్రెస్‌ వందేమాతర గీతంలో హిందూ దేవత దుర్గకు సంబంధించిన భాగాలు మినహా మిగతా భాగాన్ని ఆమోదించింది. చివరకు మన రాజ్యాంగసభలో కూడా ఇది వివాదాస్పదమైంది. 1950 జనవరి 24న రాజ్యాంగసభకు అధ్యక్షత వహించిన బాబూ రాజేంద్ర ప్రసాద్‌ జనగన మణను జాతీయ గీతంగానూ , స్వాతంత్య్ర వుద్యమంలో చారిత్రక పాత్ర వహించిన వందేమాతర గీతాన్ని గౌరవిస్తూ దానికి కూడా జాతీయ పాటగా సమాన స్థాయిని కల్పించాలని అంతిమంగా ఆ వివాదానికి స్వస్తి పలికారు.

   తరువాత 2006లో వందేమాతరం 125వ వార్షికోత్సవం సందర్భంగా దానిని విధిగా ఆలపించాలా లేదా అన్న వివాదం ఏర్పడింది.ముస్లింలలోనే భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. సిక్కులు దానిని ఆలపించవద్దని సిక్కు గురుద్వారా ప్రబంధక్‌ కమిటి(ఎస్‌జిపిసి) కోరింది. వందేమాతరం గీతాలాపన స్వచ్చందం తప్ప విధికాదని పార్లమెంట్‌లో 2006 ఆగస్టు 22న ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్బంగా అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వుండగా విధిగా వందేమాతర గీతాన్ని ఆలపించాలని వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను బిజెపి సమర్ధించిందని, అయితే విధిగా చేయనవసరం లేదని నాడు వాజ్‌పేయి స్పష్టత ఇచ్చారని కాంగ్రెస్‌ పార్టీ ఆ నాడు పేర్కొన్నది.

  అందువలన ఇప్పుడు భారత మాతాకి జై అనటమే దేశభక్తికి, జాతీయతకు నిదర్శనం, చిహ్నమని బిజెపి వత్తిడి చేయటం దాని అజెండా ప్రకారం దేశం నడవాలని ఏకపక్షంగా నిర్ణయించటం నిరంకుశ ధోరణులకు నిదర్శనం తప్ప మరొకటి కాదు. తమ ప్రధాని మేకిండియా నినాదమిచ్చి దేశాన్ని ముందుకు తీసుకుపోతానంటుంటే బిజెపి మాత్రం బ్రేకిండియా నినాదాలతో దేశాన్ని విచ్చిన్నం చేయ చూస్తున్నది. ఎవరిది కుహనా జాతీయ వాదం,ఎవరు దేశభక్తులు? ఏది అభివృద్ధి పధం ? ఇదా దేశాన్ని ముందుకు తీసుకుపోయే మార్గం? దీన్నా నరేంద్రమోడీకి ఓటు వేసి జనం కోరుకున్నది ?

గమనిక: ఈ వ్యాసంలోని న్యాయవాదుల అభిప్రాయాలు ది వైర్‌.ఇన్‌లోని గౌరవ్‌ వివేక్‌ భట్నాగర్‌ వ్యాసం నుంచి స్వీకరించబడినవి. రచయితకు కృతజ్ఞతలు

Share this:

  • Tweet
  • More
Like Loading...

దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దులలో

23 Wednesday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Narendra Modi, Narendra Modi Failures, NDA, oil price, world oil prices

ఎంకెఆర్‌

పెట్రోలు ధరల పెరుగుదల ఎక్కడ ఎలా ?

    ప్రపంచ చమురు మార్కెట్‌లో 2015 జూన్‌ నుంచి 2016 జనవరి మధ్యకాలంలో ముడిచమురు ధరలు 48శాతం తగ్గాయి. ఆమేరకు ఎన్ని దేశాలలో చమురు ధరలు తగ్గాయి ? సమాచారం అందుబాటులో వున్న 96 దేశాల వివరాల ప్రకారం ఆ మేరకు ఏ దేశంలోనూ ధరలు తగ్గలేదు. పది దేశాలలో ఒకటి నుంచి 14శాతం మేరకు ధరలు పెరిగాయి. ఏడు దేశాలలో ఎలాంటి మార్పు లేదు. డెబ్బయి తొమ్మిది దేశాలలో ఒకటి నుంచి 29శాతం వరకు మాత్రమే ధరలు తగ్గాయి. మన దేశంలో 12, చైనాలో 15శాతం మేరకు తగ్గాయి.

     ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఒకే విధంగా వుంటాయి. అయితే ఆయా దేశాలలో విధించే పన్నులు, వాటి కరెన్సీల విలువ, ఇచ్చే రాయితీలను బట్టి వినిమయదారులకు వేర్వేరు ధరలు వుంటాయి.గతవారం మన ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలను భారీగా పెంచింది. మరి ఇదే సమయంలో ఇతర దేశాల్లో పెరిగాయా? చూడండి. ధరగా పేర్కొన్న మొత్తాలు స్ధానిక కరెన్సీలో అని, స్థానిక పన్నులతో ప్రతి వారం ఒక నిర్ణీత కేంద్రంలో సేకరించిన వివరాలుగా గమనించాలి. మన దేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ పన్నుల రేటు కారణంగా ధరలలో మార్పు గురించి తెలిసినదే. పెట్రోలు ధర మార్పు శాతాలలో.

దేశం         ప్రస్తుత ధర       వారంలో మార్పు       మూడు నెలల్లో మార్పు

భారత్‌         62.09             4.9                     -2.5

పాకిస్థాన్‌      62.77             0.0                    -17.7

శ్రీలంక       128.0               0.0                     0.0

మలేషియా   1.6                  0.0                    -17.9

చైనా           5.92               0.0                     -2.0

నేపాల్‌        99.00              0.0                      -4.8

సింగపూర్‌       1.8               0.0                     -5.0

   తాము అధికారంలోకి రావటం అంటే మంచి రోజులు వచ్చినట్లే అని నరేంద్రమోడీ చెబుతారు, రాష్ట్రాన్ని సింగపూర్‌, మలేషియా మాదిరి మారుస్తానని చెప్పే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, నరేంద్రమోడీ అడుగుజాడల్లో నడిచే చంద్రబాబు నాయుడు ఈ ధరల గురించి ఏం చెబుతారు? కనీసం పెట్రోలు,డీజిల్‌ విషయాల్లో ఎవరికి మంచి రోజులు వచ్చినట్లు ? మన దేశంలో ప్రపంచ మార్కెట్లకు అనుగుణ్యంగా ధరలు ఎందుకు తగ్గటం లేదు? కర్ణుడి చావుకు కారణాలు అనేక అన్నట్లు పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని గత 22నెలల కాలంలో రెట్టింపునకు పైగా పెంచింది. తెలుగు రాష్ట్రాలలో వ్యాట్‌ను పెంచాయి.. దీనికి తోడు రూపాయి విలువను నిలబెట్టటంలో మోడీ సర్కార్‌ విఫలమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రిజర్వేషన్లపై పిర్రగిల్లి జోలపాట

22 Tuesday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ 1 Comment

Tags

Ambedkar, BR Ambedkar, Narendra Modi, Reservations, RSS, RSS Double game

సత్య

   తెలుగు వారందరికీ సుపరిచితమైన ఒక చక్కటి సామెత ,అదే పిర్ర గిల్లి జోల పాడటం గురించి వేరే చెప్పనవసరం లేదు. ‘దేశ భక్త ‘నరేంద్రమోడీ మనకు మరోసారి దానిని గుర్తు చేశారు.( కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యలో బిజెపి నేతల పేర్లకు ముందు దేశభక్త పదం తగిలించినందుకు మన వూరి దేశ భక్త కొండా వెంకటప్పయ్య కూడా పరివార్‌ బాపతా అని అనుకొనే ప్రమాదంలో పడవేశావని ఒక మిత్రుడు చేసిన మందలింపుతో కూడిన విమర్శ సరైనదే) న్యూఢిల్లీలో సోమవారం నాడు అంబేద్కర్‌ స్మారక వుపన్యాసం చేసిన ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్ల విధానంలో ఎలాంటి మార్పు లేదని, ఒక వేళ అంబేద్కరే తిరిగి వచ్చినా దానిని మార్చలేరని, ఆయన ముందు మనమెంత అని మోడీ ప్రశ్నించారు. తామంటే గిట్టని వారు రిజర్వేషన్లపై తన ప్రభుత్వ విధానాల గురించి ఆవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా వుండగా ఇదే మాదిరి ప్రచారం చేశారని, తమ పార్టీ మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, హర్యానా వంటి రాష్ట్రాలలో అధికారంలో వున్నప్పటికీ ఎన్నడైనా రిజర్వేషన్ల విధానం మార్చేందుకు ప్రయత్నించిందా అని అమాయకంగా అడిగారు. నిజమే ! అనేక సమస్యలపై అడిగినా నోరు విప్పని ప్రధాని తనంతట తానుగా దీని గురించి చెప్పటానికి ఏ పార్టీ ప్రచారం చేసిన అసత్యమేమిటో చెప్పి వుంటే నిజాయితీగా వుండేది.అన్నింటికీ మించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంఘపరివార్‌ అధినేత మోహన్‌ భగవత్‌ మాటలపై ఇంతవరకు మోడీ నోరు విప్పలేదు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పటం సంతోషమే. కానీ వాటిపై పార్టీ వైఖరి ఏమిటి ?

    రిజర్వేషన్ల గురించి తాజాగా వార్తలలోకి ఎక్కింది అపర సాంస్కృతిక సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే. నాగపూర్‌లో జరిగిన సమావేశాల సందర్భంగా ఆ సంస్ధ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషీ విలేకర్ల సమావేశంలో రిజర్వేషన్లపై చేసిన ప్రస్తావనతో స్పందన వచ్చింది తప్ప మరొకటి కాదు.ఒక్క రిజర్వేషన్లే కాదు, అనేక అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యానాలు చేయటం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. గతేడాది బీహార్‌ ఎన్నికలకు ముందు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ తమ పత్రికలైన పాంచజన్య, ఆర్గనైజర్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్లు ఎవరికి, ఎంతకాలం ఇవ్వాలో నిర్ణయించేందుకు రాజకీయేతర కమిటి నిర్ణయించాలని చెప్పారు. ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు సురేష్‌ భయ్యాజీ కూడా మరో రూపంలో దానినే పునరుద్ఘాటించారంటే జనం దానిని ఎలా స్వీకరించాలి. ఫిబ్రవరి నెలలో కొల్‌కతా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశం ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ ‘అనేక మంది రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఎవరు అర్హులో నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయటం అవసరం అని నేను భావిస్తున్నాను.అ కమిటీ రాజకీయ రహితమైనదిగా వుండాలి, తద్వారా స్వప్రయోజనాలకు పాల్పడకుండా చూడవచ్చు, సమాజంలో ఏ తరగతిని ముందుకు తీసుకురావాలి, వారికి ఎంతకాలం రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నదాని గురించి ఒక నిర్ణీత కాల పరిమితి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. ఆ కమిటీకి దానిని అమలు జరిపే అధికారాలు ఇవ్వాలి’ అని మోహన్‌ భగవత్‌ చెప్పారు. ‘అదే సమయంలో కేవలం ఒక కులంలో పుట్టిన కారణంగా అవకాశం దొరకకుండా వుండకూడదు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు వుండాలి. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు వుండాలి. కేవలం పుట్టుక కారణంగానే రిజర్వేషన్‌ పొందేట్లయితే ఆ పరిస్తితి ఎంతకాలం వుంటుందో అంతకాలం రిజర్వేషన్లు వుంటాయి అని కూడా భగవత్‌ చెప్పారు.

    బీహార్‌ ఎన్నికలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగటంతో తమ నేత వర్తమాన రిజర్వేషన్‌ కోటా గురించి మాట్లాడలేదని, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రతిఫలాన్ని పొందాలన్నది వుద్దేశ్యమని ఆర్‌ఎస్‌ఎస్‌ సంజాయిషీ ఇచ్చుకుంది. భగవత్‌ వ్యాఖ్యలతో తమకేమీ సంబంధం లేదని బిజెపి ప్రకటించుకుంది. చిత్రమేమంటే ఆ భగవత్‌ సమక్షంలోనే బిజెపి కేంద్ర మంత్రులందరూ నిక్కర్లు వేసుకొని కేంద్ర ప్రభుత్వం గురించి సమీక్ష జరిపారు.అదే భగవత్‌ ఆ తరువాత అఖిల భారతీయ వాల్మీకి మహాసభలో మాట్లాడుతూ సమాజంలో అన్ని తరగతుల అభ్యున్నతి గురించి తప్ప ఆర్‌ఎస్‌ఎస్‌కు రిజర్వేషన్లు ఒక సమస్య కాదని, తమ సంస్ధ హిందువుల అభ్యున్నతికోసం పాటు పడుతుందని చెప్పారు.(డిఎన్‌ఏ అక్టోబరు 26,2015)

    రాజకీయ ప్రయోజనాల కోసం, మెజారిటీ పౌరుల ఓటు బ్యాంకు ఏర్పాటు, వారిని సంతృప్తి పరచేందుకు రిజర్వేషన్లపై భిన్న స్వరంతో మాట్లాడటం తరువాత అబ్బే అబ్బే లేదనటం పదే పదే జరుగుతోంది.హర్యానాలో జాట్లు రిజర్వేషన్ల కోసం హింసాత్మక ఆందోళనకు పూనుకుంటే వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది బిజెపి. బీహార్‌ ఎన్నికలలో బిజెపి మిత్ర పక్షంగా పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి జితిన్‌ రామ్‌ మాంఝీ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల వాదనను సమర్ధించారు. భవిష్యత్‌ ఎన్నికలలో తాను, తన కుమారుడు జనరల్‌ సీట్లలో పోటీ చేసి ఇతరులకు రిజర్వుడు సీట్లలో అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అటువంటి ప్రకటన బిజెపి, దాని మిత్రపక్షాలలోని నేతలందరూ ఒక వరవడిగా అమలు జరిపి ఇతర పార్టీల నేతలకు మార్గదర్శనం చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంగిట్లో వున్నాయి, బిజెపి సాధారణ సీట్లలో ఎంత మంది దళితులు, గిరిజనులకు అలాగే ముస్లింలకు సీట్లు ఇచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌ స్ఫూర్తిని అమలులోకి తెస్తుందో నిరూపించుకొనే తరుణమిది.

   ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ వ్యాఖ్యలు ఎక్కడ తమ అవకాశాలను దెబ్బతీస్తాయోనన్న భయంతో నరేంద్ర మోడీ అంబేద్కర్‌ స్మారక వుపన్యాస అవకాశాన్ని వుపయోగించుకొని నష్ట నివారణకు ప్రయత్నించారు తప్ప మరొకటి కాదు. రిజర్వేషన్లపై సమీక్ష జరపాలన్నది మోహన్‌ భగవత్‌ ఏదో అనాలోచితంగా చెప్పింది కాదు. 1981, 1985లో రెండు సార్లు అఖిలభారత ప్రతినిధి సభ, కార్యకారీ మండలి సమావేశాలలో రిజర్వేషన్లను సమీక్షించాలని ఏకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ తీర్మానాలు చేసి డిమాండ్‌ చేసింది. వాటిని రద్దు చేసుకున్నట్లు ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు, ఎలాంటి కొత్త తీర్మానాలు చేయలేదు కనుక మోహన భగవత్‌ పాత తీర్మానాల సారాంశాన్ని పునరుద్ఘాటించారు. అందువలన సమీక్ష జరగాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల వైఖరి సరైనదో, ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పూ వుండదని చెబుతున్న మోడీ వైఖరి సరైనదో స్పష్టం చేయాలి. తామంతా పరివార్‌ కుటుంబమేనని సగర్వంగా అందరూ చెప్పుకుంటున్నారు గనుక ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి రెండూ తమ వైఖరిని చెప్పాలి. దాగుడు మూతలకు తెరదించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేశం ఎటు పోతోంది ! ఏం జరుగుతోంది !!

17 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Agriculture, BJP, Bjp nationalism, black money, cbi, INDIA, indirect subsidies, JNU, JNU ROW, lalit modi, Modi, Narendra Modi, subsidies, vijay mallya

 సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది

ఎం కోటేశ్వరరావు

     కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పూర్తి బడ్జెట్లు ప్రవేశ పెట్టింది. వాటి ద్వారా తాము చేసిన వాగ్దానాలపై ఫలానా నిర్ధిష్ట చర్య తీసుకున్నట్లు జనానికి నమ్మకం కలిగించలేకపోయింది. తన ఎన్నికల ప్రణాళికలో ఇతర పార్టీల మాదిరిగానే అనేక మంచి అంశాలు చెప్పింది. గత ప్రభుత్వంతో పోల్చుకొని జనం గణనీయంగా దానికి ఓట్లు వేశారు. మన ఎన్నికల విధానంలో వున్న ఒక తీవ్రలోపం, ప్రతిపక్ష ఓట్లు చీలటం,వివిధ కారణాలతో దానికి వచ్చిన ఓట్ల కంటే సీట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో ఎలాంటి భయం లేకుండా చేసిన వాగ్దానాలను అమలు జరుపుతుందని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చిత్రం ఏమంటే ఎన్నికల ప్రణాళికలోలేని అనేక అంశాలను అది అమలు జరుపుతోంది. ఏ కాంగ్రెస్‌ విధానాలనైతే తెగనాడిందో అవే విధానాలను మరింత ఎక్కువగా అమలు జరుపుతోంది. గత రెండు బడ్జెట్లలో వుద్యోగులు తీవ్ర ఆశాభంగానికి గురైనట్లుగానే సమాజంలోని అన్ని తరగతుల వారిలో రోజు రోజుకూ తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. ఇతర పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే అవకాశం లేకుండా స్వంతంగా మెజారిటీ సీట్లు వున్నప్పటికీ ఒక్క కీలకాంశంపైనా అది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.

    నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ ఎందుకు విముఖత చూపుతోంది? ఎందుకంటే అది ఎవరిదో వారికి తెలుసు కనుక, విదేశాల్లో దాచుకున్న ప్రతి పైసాను ఎన్‌డిఏ వెనక్కు తీసుకు వస్తుంది. దాన్ని పంచితే ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయి అని ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ట్వీట్లు చేసి జనానికి స్వీట్ల ఆశచూపారు. పార్టీ అధ్యక్షుడిగా వున్న రాజనాధ్‌ సింగ్‌ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అమలు జరుపుతామని చెప్పారు.తీరా అధికారానికి వచ్చిన తరువాత బిజెపి అధ్యక్షుడు ఎన్నికల సమయంలో అనేకం చెబుతుంటాం అవి అమలు జరుగుతాయా మీ పిచ్చిగానీ అన్నట్లు మాట్లాడారు.

    నల్లధనాన్ని తీసుకు వస్తామన్న పెద్దమనిషి గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తన పాలనలో ఇప్పుడెవరూ నల్లధనాన్ని బయటకు తీసుకు వెళ్లటానికి సాహసించటం లేదు అని చెప్పారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది ? గతేడాది సెప్టెంబరు వరకు తమ ప్రభుత్వం విధించిన గడువులోగా నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకొనే పధకంలో 6,500 కోట్లు వస్తాయని ప్రధాని చెప్పారు. చివరికి అంది పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరిగా తయారైంది. తమ ప్రభుత్వ పధకం ప్రకారం 638 మంది రు 4,147 కోట్లను వెల్లడించారని రెవెన్యూ కార్యదర్శి చెప్పారు.మరి 6500 కోట్ల సంగతేమిటని అడిగితే అబ్బే అబ్బే ఇది మా పధకం ద్వారా కాదు హెచ్‌ఎస్‌బి దర్యాప్తు ద్వారా స్వాధీనం చేసుకున్న మొత్తం అని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పారు.తీరా ప్రభుత్వ పధకం ద్వారా వెల్లడైంది కేవలం 2,488 కోట్లు మాత్రమే అన్నారు. తరువాత ఇది కూడా జనాన్ని తప్పుదారి పట్టించే సమాచారమే అని తేలింది.

     స్విడ్జర్లాండ్‌ బ్యాంకులలో దాచుకున్న డబ్బు గురించి 2011లోనే 1,195 మంది పేర్లతో 25,420 కోట్ల రూపాయలు వున్నట్లు బయటకు వచ్చింది. అయితే మోడీ సర్కార్‌ ఇంకా 628 పేర్లనే పట్టుకు వేలాడుతోంది.హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో దాచుకున్న సొమ్ము గురించి కూడా తెలిసింది చాలా పరిమితమే.ఆ బ్యాంకులో అక్రమంగా సొమ్ముదాచుకున్నవారి వివరాలు బయటపడటంతో ఫ్రాన్స్‌ 110 కోట్ల డాలర్లు, అమెరికా 190 కోట్లు, స్విడ్జర్లాండ్‌ 4.3 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆ బ్యాంకుకు జరిమానా వేశాయి. మరి మన దేశం ఎంత జరిమానా వేసింది ? అయినా మన జెట్లీ గారు తాజా బడ్జెట్‌ ప్రసంగంలో పెద్ద రంకెలే వేశారు తప్ప ఆచరణ లేదు.

    క్రికెట్‌ అసోసియేషన్‌లో వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అభియోగాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేపట్టగానే లలిత్‌ మోడీ బిజెపి ముఖ్యమంత్రిగా వున్న వసుంధరరాజె, సుష్మస్వరాజ్‌ తదితరుల సహకారంతో దేశం వదలి పారిపోయాడు. అతగాడితో కుమ్మక్కు కానట్లయితే భారత్‌కు రప్పించేందుకు మోడీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలేమిటి. ఇది ఇలా వుండగా కింగ్‌ పిషర్‌ విజయ మాల్య తొమ్మిదివేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి, తన వ్యాపారాలను ఇతర కంపెనీలకు అమ్మివేసి లండన్‌కు పారిపోయి ఇప్పుడప్పుడే తాను భారత్‌కు రానని చెప్పేశాడు. చిన్న చేప లలిత్‌మోడీనే పట్టుకోలేనివారు పెద్ద చేప మాల్యను పట్టుకుంటారా అని జనం అడుగుతున్నారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం పేరుతో ప్రవేశ పరీక్షలలో జరిగిన కుంభకోణం నిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణ చేపట్టిన సిబిఐ ఇంతవరకు చేసిందేమీ లేదు. అలాంటిది దేశం వదలి పారిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్న ఆ సంస్ధపై జనానికి విశ్వాసం ఎలా వుంటుంది. తొలుత విదేశాలకు వెళుతుంటే నిర్బంధించమని లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసిన సిబిఐ తరువాత ఒక నెలలోపే దానిని సవరించి వెళుతున్నట్లు తెలియ చేస్తే చాలని ఎందుకు మార్చినట్లు ? ప్రధాని పర్యవేక్షణలోని ఈ సంస్ధ నిర్వాకం గురించి ఇంతవరకు ఎవరూ నోరు విప్పరేం?

     వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలో వుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్న ఆత్మహత్యలే అందుకు తిరుగులేని నిదర్శనం. వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వచ్చేట్లు చూస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళిక చెప్పింది. ఇప్పటికే పరిమితంగా వున్న ఎరువుల సబ్సిడీని కూడా దుర్వినియోగం అవుతోందనే పేరుతో ఇంకా కోత పెట్టేందుకు పూనుకుంది. యాభై శాతం కాదు కదా అందులో సగమైనా దక్కేందుకు ఇంత వరకు నిర్ధిష్ట పధకం ఏమి లేకపోగా స్వాతంత్య్ర దేశ చరిత్రలో తమ ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎవరూ సాయపడలేదని ఇటీవల బిజెపి రైతు సభలలో ప్రధాని చెప్పుకున్నారు.

   ధరల పెరుగుదలను అరికట్టటంలో వైఫల్యం గురించి తమకు పెరుగుతున్న కరువు భత్యమే పెద్ద సాక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు. రెండు నెలలపాటు వుల్లిపాయలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను జనం నుంచి గుంజిన వ్యాపారులపై తీసుకున్న చర్యలేమిటి ? అదే విధంగా కంది పప్పు. దాని కంటే చేపలు, కోడి మాంసం చౌక అయిందా లేదా ? ఇక ధరల తగ్గింపు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రయివేటు వర్తకులు అడ్డగోలు పద్దతుల్లో ధరలు పెంచారంటే అదొక దారి. వాగ్దానాలు చేయని వాటిని అమలు జరుపుతున్నదని ముందే చెప్పుకున్నాం. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు లీటరు పెట్రోలుపై రు.9.48 పైసలు ఎక్సైజ్‌ డ్యూటీ వుండేది. దానిని ప్రస్తుతం రు.21.48 పైసలకు పెంచారు. రూపాయి విలువను డాలరుకు రు.62.12 నుంచి ( ఫిబ్రవరి ఒకటిన సగటు రేటు) రు.67.68కి పతనం గావించారు. దీంతో చమురు వినియోగదారులకు అటు గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లుగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతనమైనా మన దేశంలో వాటి ప్రభావం పెద్దగా లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోల్చితే నా రూటే సపరేటు అని బిజెపి చెప్పుకుంది. నిజమే అనుకున్నారు జనం. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక్క మెతుకు పట్టుకున్నా చాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్‌ విధానాలను అంతకంటే ఎక్కువగా అమలు జరుపుతున్నదనటానికి దిగువ వివరాలు చూడండి.

   సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పత్రాలలో అధికారికంగా రాసినవే. ఇన్ని రాయితీలు ఇచ్చిన కేంద్రం వుద్యోగులకు పన్ను మినహాయింపు విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపుతోంది. పన్ను రాయితీలు అక్కరలేదు, ధరల పెరుగుదలను కూడా స్ధంభింప చేయండి చాలు అని అనేక మంది అంటుంటారు, పోనీ అదైనా చేస్తోందా లేదే. జనం దగ్గర గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ ప్రోత్సాహక పధకాల పేరుతో ఇస్తున్న పరోక్ష రాయితీల మొత్తం పెరుగుతున్నది. అయినా సరే కార్పొరేట్‌, ఇతర బడా కం పెనీలు, పెద్దలు తీసుకున్న రుణాల ఎగవేత కూడా ఏటేటా పెరుగుతున్నది. మరోవైపు మరి ఈ రాయితీల సొమ్మంతా ఎటు పోతున్నట్లు ? గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న రాయితీల మొత్తం ఇలా వుంది. (కోట్ల రూపాయలలో)

2012-13 5,66,234.7

2013-14 5,72,923.3

2014-15 5,54,349.04

2015-16 6,11,128.31

    కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. నిజంగా కాంగ్రెస్‌ విధానాల నుంచి వైదొలిగితే చాయ్‌ వాలా హయాంలో ఈ సబ్సిడీలు తగ్గాలి కదా, చాయ్‌ రేటు కూడా పెరిగిపోయిందా లేదా ? అవే దివాళా కోరు ఆర్ధిక విధానాలు, అంతకంటే ఎక్కువగా అమలు. అందుకే రెండేళ్లలోనే వైఫల్యాల బాట.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్న సామెత తెలిసిందే. అలాగే తమ విధానాలు వైఫల్యం చెందుతాయని నరేంద్రమోడీకి, ఆయనకు మార్గదర్శకంగా వున్న సంఘవపరివార్‌కు తెలియని విషయమేమీ కాదు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నరేంద్రమోడీ మౌన వ్రతం పూనారు. ఏ ఒక్క కీలక సమస్యపైనా మాట్లాడరు. మరోవైపు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక అంశాలను ముందుకు తెస్తున్నారు.

   వాటిలో స్వచ్చభారత్‌ ఒకటి. నిజమే దీనితో విబేధించాల్సిన అవసరం లేదు. దీని గురించి కొండంత రాగం తీశారు.ఎక్కడ చూసినా అశుభ్రం తప్ప మరొకటి కనపడటం లేదు. చరిత్రలో ఔరంగ జేబు అనేక పన్నులు చివరికి తల పన్ను కూడా విధించాడని చదువుకున్నాం. ఈ ఆధునిక ఔరంగజేబు మురికి పన్ను విధించేందుకే ఇంత ప్రచారం చేశారనేది ఇప్పుడు రుజువైంది. రెండవది అనధికారిక ఎజండాగా గో సంరక్షణ అంశాన్ని ముందుకు తెచ్చారు. దీని గురించి ఎవరి నమ్మకాలు వారికి వున్నాయి. రోజూ గోమూత్రం తాగే వారు కూడా వున్నారు. తాగనివ్వండి, అనారోగ్యం పాలు కానివ్వండి, కార్పొరేట్‌ అసుపత్రులకు లక్షల రూపాయలు సమర్పయామి చేసుకోమనండి. అది వేరే విషయం.

   మన దేశంలో ఆస్తికులతో పాటు నాస్తికులు కూడా సహజీవనం చేశారన్నది పదే పదే చెప్పుకోనవసంర లేదు. ఆరేడు వందల సంవత్సరాల నాడే యోగి వేమన గొప్ప హేతువాది, నాస్తికుడు. అంతకు ముందు చార్వాకులు,లోకాయతులు వున్నారు. అలా భిన్నఅభిప్రాయం వుండటమే, సహన భావమే మన భారతీయ సంస్కృతి. లేకుంటే భిన్న ఆచారాలు, ఆలోచనలు,తత్వ శాస్త్రాలు మనుగడలో వుండేవే కావు. ఆ పరంపరలోనే కర్ణాటకలో కలుబుర్గి అనే రచయిత అనేక రచనలు చేశాడు. వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా ఇచ్చింది. ఆయన రచనలు హిందుత్వకు వ్యతిరేకం అంటూ హిందూ తాలిబాన్లుగా పరిగణిస్తున్నవారు ఒక రోజు కాల్చి చంపారు. తన అవార్డు పొందిన ఒక రచయిత దారుణ హత్యకు గురైతే కనీసం ఖండించటం కనీస సంస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ ఆ పని చేయకపోగా తిరస్కరించింది. అనేక మంది అవార్డు గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చి నిరసన తెలిపిన తరవాత గానీ మొక్కుబడిగా ఖండించలేదు. దీని గురించి కూడా కేంద్రం స్పందించలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని హిందూతాలిబాన్లు రెచ్చిపోతున్న స్థితి దేశంలో తలెత్తింది. దీనికి కారణం ఏమిటి కేంద్రంలో తమకు అనుకూలమైన సర్కార్‌ వుందనే ధీమా తప్ప మరొకటి కాదు. ఢిల్లీలో యుమునా నది ఇప్పటికే కాలుష్యమైంది. అలాంటి దానిని మరింత కాలుష్యం చేసే విధంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ 35లక్షల మందిని సమీకరించే ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. అందువలన పర్యావరణానికి మరింత హాని జరుగుతుందని అనేక మంది పర్యావరణ సంరక్షణ కోరుకొనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారి వాదన సబబే అని కోర్టు కూడా ఐదు కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాంటి సభలకు పశ్చిమ దేశాలలో అనుమతి ఇవ్వరని వేరే చెప్పనవసరం లేదు. కానీ దానికి అభ్యంతర పెట్టటమే తప్పు దేశద్రోహం అన్నట్లుగా విమలేందు ఝా అనే కార్యకర్తపై ఓంజీ అనే ఒక స్వామి రెచ్చిపోతూ హేతువాది నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలబర్గిల మాదిరే నిన్ను హత్య చేస్తాం, నువ్వొక సిఐఏ ఏజంట్‌,ద్రోహివి, జాతి వ్యతిరేకివి అంటూ కెమెరాల ముందే బెదిరింపులకు దిగాడు. వీరు స్వాములా ? గూండాలా ? ఏ దమ్ము చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు?

   ఒక ముస్లిం కుటుంబం పండుగ సందర్భంగా గొడ్డు మాంసం తెచ్చుకొని వండుకోవటమేమిటి? అది గో మాంసం అని కొందరు దేవాలయ మైకులో ప్రకటించటం, వందలాది మంది ఆ ఇంటిపై దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేయటం మధ్య యుగాలలోనో అంతకు ముందు ఆటవిక యుగంలో చేసే పని తప్ప మరొకటి కాదు. తీరా అది గోమాంసం కాదని తేలింది. దేశమంతటా దాని గురించి ఆవేశకావేషాలను రెచ్చగొట్టింది ఎవరు ? ఆ సామూహిక హత్యకు పాల్పడిన నేరగాళ్లను అరెస్టు చేస్తే దానికి వ్యతిరేకంగా బిజెపి వారు రంగంలోకి రావటాన్ని బట్టి దీని వెనుక వారి పధకమే వుందని జనం అనుకున్నారు.దేశమంతటా చర్చనీయాంశం అయింది, దాని గురించి మాట్లాడవయ్యా అంటే మోడీ నోరు విప్పరు.

   అప్జల్‌ గురు అనే వుగ్రవాది నాయకత్వంలో పార్లమెంట్‌పై దాడి జరిగిందని కోర్టు తీర్పు చెప్పి వురి శిక్ష విధించింది. అసలు వురిశిక్షలనే వ్యతిరేకిస్తున్నవారు మన దేశంలో వున్నారు. వురి శిక్ష పడిన ఎవరైనా క్షమా భిక్ష కోసం దరఖాస్తు చేసుకోవటానికి చట్టం అవకాశం ఇచ్చింది. వారు వుగ్రవాదులా మరొక దారుణం చేసిన వారా అనేది ఎక్కడా లేదు. ఆ విధంగా చూసినపుడు అప్జల్‌ గురుకు తగిన అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో వురి తీశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అదే అభిప్రాయంతో హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు సభ పెట్టారు. ఆ వురిని ఖండించారు.అలాంటి సభలు కాశ్మీర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక జరిగాయి. ఇష్టం వున్న వారు పాల్గొన్నారు. లేనివారు లేదు. కానీ అలాంటి సభ జరపజరపటం దేశ ద్రోహం, విశ్వవిద్యాలయ దేశ ద్రోహ కార్యకలాపాలకు నిలయంగా మారింది చర్యలు తీసుకోండంటూ ఇద్దరు కేంద్రమంత్రులు లేఖలు రాయటం వారిని మెప్పించేందుకు ఐదుగురు దళిత విద్యార్ధులపై చర్యలు తీసుకోవటం, వారిలో ఒకరైన వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. తీరా అది కేంద్ర ప్రభుత్వం, బిజెపి మెడకు చుట్టుకోవటంతో ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకు అసలు రోహిత్‌ దళితుడు కాదు బిసి అని బిజెపి అనుబంధ ఎబివిపి వారు ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు.

    అప్జల్‌గురు వురితీయటం సరైంది కాదు అన్న అభిప్రాయం వ్యక్తం చేయటమే దేశద్రోహమైతే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమే కాదు, గురు అస్తికలను కాశ్మీర్‌కు అందచేయాలని కోరిన కాశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి)తో కలసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? అది దేశ ద్రోహం కాదా ? కాశ్మీర్‌లో వేర్పాటు వాదానికి గురైన ప్రతి ఒక్కరూ అప్జల్‌ గురు వురిని వ్యతిరేకిస్తారు.అందరినీ దేశద్రోహులు కింద జమకట్టి చర్యలు తీసుకుంటారా ?

   ఈ వుదంతం సద్దుమణగ ముందే ఢిల్లీలోని జెఎన్‌యులో మరో చిచ్చు రేపారు. అక్కడ కూడా అప్జల్‌ గురు వురి మీదే కొంత మంది సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. దానికి విశ్వవిద్యాలయ అధికారులు అనుమతించారు. చివరి నిమిషంలో ఏబివిపి జోక్యం చేసుకొని అ సభ జరగటానికి వీల్లేదు అంటూ అభ్యంతర పెట్టింది. దాని వత్తిడికి లొంగి పోయిన అధికారులు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో సభ నిర్వాహకులు విశ్వవిద్యాలయంలోని ఇతర విద్యార్ధి సంఘాలు, విద్యార్ధి యూనియన్‌ నాయకులను కలసి సభ జరుపుకొనేందుకు తమకు సహకరించాలని సాయం కోరారు. ఈ రోజు ఏబివిపి వత్తిడితో ఈ సభ అనుమతిని రద్దు చేసిన వారు రేపు తమ సభలనైనా అడ్డుకుంటారనే భయంతో అన్ని సంఘాలు ఏకమైన ముందు ఇచ్చిన అనుమతి ప్రకారం సభ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని వత్తిడి తెచ్చాయి. దాంతో లౌడ్‌ స్పీకర్లు లేకుండా సభ జరుపుకోవచ్చని అధికారులు

  షరతులతో అనుమతి ఇచ్చారు. అయితే ఆ సభను అడ్డుకోవాలని ఎబివిపి నిర్ణయించి తమ మద్దతుదార్లను సమీకరించటంతో సభ ప్రాంగణంలో మిగతా విద్యార్ధి సంఘాల కార్యకర్తలు కూడా అక్కడే వున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. జెఎన్‌యు వివిధ భావజాలలను స్వేచ్చగా చర్చించుకొనేందుకు అనువైన వాతావరణం ఒక నిజమైన ప్రజాస్వామిక కేంద్రం. ఇక్కడ వామపక్ష వాదులు, నక్సలైట్లు, వేర్పాటు వాదులు, అరాజకవాదులు, ఇతర అన్ని రకాల భావజాలంతో వుండే విద్యార్ధులు వున్నారు. అలాంటి వారిలో కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్దించే నక్సలైట్లు, ఇతరులు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సభను ఏర్పాటు చేశారు. ఆ విషయం విశ్వవిద్యాలయ అధికారులకూ తెలియందేమీ కాదు. వారి భావజాలాన్ని, కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించే ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఆ సభకు ఎందుకు వెళ్లారని అనేక మంది అడగవచ్చు.వివాదాస్పద అంశాలపై సభలు జరగటం అక్కడ కొత్త కాదు. అసలు అధికారులు లేదా శాంతి భద్రతల సమస్య తలెత్త వచ్చని నిఘావర్గాలు హెచ్చరించినపుడు తొలుత అనుమతి నిరాకరించి వుంటే వుంటే అది నిర్వాహకులు- అధికారుల మధ్య సమస్యగా వుండేది. ఏబివిపి రంగ ప్రవేశంతోనే అసలు సమస్య వచ్చింది. షరతులతో కూడిన సభ జరిగింది. దానిలో చేసిన వుపన్యాసాలు, వాటిలోని అంశాలతో మిగతా విద్యా ర్ధి సంఘాలకు ఎలాంటి ప్రమేయం ఏకీభావం లేదు. దానిని ఎబివిపి అడ్డుకోవటంతో అక్కడ గొడవ జరిగింది. కొంత మంది బయటి నుంచి వచ్చిన వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇదీ జరిగింది. కానీ చివరికి అది ఎలా మారిపోయింది?

     విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర విద్యార్ధి సంఘాల నాయకులు అక్కడ చేరి దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, అందువల వారిపై దేశద్రోహం నేరం కింద పోలీసులు కేసు బనాయించారు. అనేక మంది విద్యా ర్ధులకు నోటీసులు ఇచ్చారు. వారిలో కొందరు సభా నిర్వాహకులు కూడా వున్నారు.ఇక్కడ చిత్రమేమంటే నిజంగా నినాదాలు ఇచ్చిన వారిలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు.వీడియోను మార్ఫింగ్‌ చేసి నినాదాలు చేయని వారు చేసినట్లు తయారు చేసిన నకిలీ వీడియోల ఆధారంగా కేసులు బనాయించి కన్నయ్యను అరెస్టు చేశారు. తీరా అవి నకిలీవి, అతను ఆ నినాదాలు చేయలేదని తేలటంతో ఆరునెలల బెయిలు ఇచ్చారు. కన్నయ్యను కోర్టులో హాజరు పరిచినపుడు బిజెపి ఎంఎల్‌ఏ, లాయర్ల ముసుగులో వున్న కొందరు కన్నయ్య మీద, వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. కన్నయ్య అరెస్టును ఖండించిన వారందరినీ దేశద్రోహులుగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. దాడులను రెచ్చగొట్టారు. మహిళా జర్నలిస్టులను మానభంగం చేస్తామని బెదిరించారు. అన్నింటికంటే దారుణం జెఎన్‌యులో రోజుకు మూడు వేల కండోమ్‌లను వినియోగిస్తారని, మందుతాగుతారని స్వయంగా బిజెపి ఎంఎల్‌ఏ తప్పుడు ప్రచారానికి దిగాడు. అక్కడ చదివే వారిలో ఎబిపివి చెప్పే భారత మాత పుత్రికలు, పుత్రులు కూడా వున్నారని అది వారికి కూడా వర్తిస్తుందనే జ్ఞానం సదరు నేతకు లేకపోయింది. వీటిపై కూడా నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు.అందుకే దేశంలో ఏం జరుగుతోంది, ఎటు పోతోంది అని ప్రతివారూ ఆలోచించాల్సిన తరుణం ఇది. బిజెపి పూర్వీకులు స్వాతంత్య్ర వుద్య మ సమయంలో బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి లొంగిపోయి లేఖలు రాసిన చరిత్ర కలిగిన వారు. అందుకే భగత్‌ సింగ్‌, రాజగురు,సుఖదేవ్‌లను వురితీసినపుడు వారెక్కడ వున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాంటి వారు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువలన ఏది దేశభక్తి, ఏది దేశ ద్రోహం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చర్చించాలి. విదేశీ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇవ్వటం, మన సొమ్మును విదేశాలకు తరలించుకుపోనివ్వటం ప్రభుత్వ విధానంగా వుంది.ఇది దేశద్రోహమా దేశ భక్తా ?ఈ విధానాన్ని ఎవరైనా విమర్శిస్తే ఇప్పుడున్న బ్రిటీష్‌ కాలం నాటి చట్ట ప్రకారం దేశద్రోహ నేరం కింద జైల్లో పెట్ట వచ్చు.జర్మనీలో హిట్లర్‌ కూడా దేశ భక్తి, జాతీయ వాదంతోనే రెెచ్చగొట్టి తనను వ్యతిరేకించిన వారిని మారణకాండకు బలిచేశాడు. ఇప్పుడు మనదేశంలో కూడా నేను చెప్పిందే దేశభక్తి కాదని కాదన్న వారిని ఖతం చేస్తా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు మనకేమీ ముప్పులేదులే అని ఎవరైనా అనుకుంటే మనదాకా వచ్చినపుడు అయ్యో పాపం అనేవారుండరు .

Share this:

  • Tweet
  • More
Like Loading...

విలాసాలకు మాల్యను విదేశాలకు ! సామాన్య రైతును పరలోకానికి !!

12 Saturday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

bankers, cbi, farmer, luxuries, nare, Narendra Modi, Narendra Modi Failures, non-payment of dues, vijay mallya

ఎం కోటేశ్వరరావు

   తొమ్మిదివేల కోట్ల రూపాయలు ఎగవేసిన మాల్యను విలాసాలకోసం సగౌరవంగా విదేశాలకు పంపిన బ్యాంకర్లు, అధికారయంత్రాంగం సామాన్య రైతును మాత్రం పరలోకానికి పంపింది. తమిళనాడులోని ఒక రైతు లక్షా 30వేలు చెల్లించలేకపోయినందుకు పోలీసులు, రికవరీ ఏజంట్లు కలిసి చితకబాదటాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన వుదంతం వెలుగులోకి వచ్చింది. అరయలూరు జిల్లాకు చెందిన బాలన్‌ ఒక ట్రాక్టరు కొనుగోలుకు రు.3.4లక్షల రుణం తీసుకున్న ఆ రైతు వడ్డీతో సహా రు.4.1లక్ష చెల్లించాడు. ఇంకా 1.3లక్షల బకాయి వుంది. పంటలు దెబ్బతిన్న కారణంగా దానిని చెల్లించలేకపోయాడు తప్ప పని గట్టుకొని ఎగవేసిన వ్యక్తి కాదు.బాలన్‌ను కొట్టిన దృశ్యాలు వీడియో చిత్రీకరించినట్లు కూడా వార్తా సంస్ధలు తెలిపాయి.మాల్య మంచి వాడంటూ కొందరు రాజకీయ వేత్తలు బహిరంగంగా ప్రకటించారు. దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నందుకు యావత్‌ జాతి నిజంగా సిగ్గు పడాల్సి వుంది.

   సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సిబిఐ) మన దేశంలో వున్నత దర్యాప్తు సంస్ధ. ప్రతిష్టతో పాటు అప్రతిష్టను కూడా సమపాళ్లలో మూట కట్టుకుంది. తాజాగా విజయ్‌ మాల్యా వుదంతంలో అది వ్యవహరించిన తీరుపై దానిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ స్పందించాలని ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్‌ చేసిన డిమాండ్‌పై మామూలు ప్రకారం మోడీ నోరు విప్పుతారని ఎవరూ అనుకోవటం లేదు నిజంగా నోరు విప్పితే అది మేకిండియా తొలి వుత్పత్తే అవుతుంది.

    విజయ్‌ మాల్యా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వచ్చిన పది రోజుల తరువాత సిబిఐ తన అధికారి తప్పు చేసినట్లు చెప్పిందంటే యధా ప్రధాని తధా సిబిఐ అని చెప్పుకోవాల్సి వుంది. గతేడాది అక్టోబరులో తొలి లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసినపుడు తమ అధికారి తప్పు చేశాడని ఇప్పుడు సిబిఐ చెప్పటం నష్ట నివారణ చర్యలలో భాగంగా కట్టుకధ అంటే తప్పేముంది? ఆ తప్పు చేసింది ఒక గుమస్తా కాదు, ఎస్‌పి స్ధాయి అధికారి.ఒక వేళ నిజంగా పొరపాటే అయి వుంటే వెంటనే గుర్తించి వుండాలి, అదే జరిగి వుంటే మాల్య పరారీ వార్తలు వచ్చిన మరుక్షణమే అది వాస్తవం కాదని ప్రకటించాలి అదేమీ జరగలేదే ? ఎప్పుడు కావాలంటే అప్పుడు మాల్య తమకు అందుబాటులో వుండి సహకరించారని చెప్పిన సిబిఐ లుక్‌అవుట్‌ నోటీస్‌ ఎందుకు జారీ చేశారంటే ఇప్పుడే చెబుతోంది?

   ఐడిబిఐ బ్యాంకుకు 900 కోట్ల రూపాయల చెల్లింపులో విఫలమైన మాల్య గురించి అది చేసిన ఫిర్యాదుతో సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తరువాత అక్టోబరు పదిన జరిపిన సోదాల సందర్భంగా మాల్య ఆచూకీ తెలియలేదు. దాంతో ప్రశ్నించేందుకు అందుబాటులో వుంచేందుకు అతనిని పట్టుకోవాల్సిందిగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు రాసినట్లు సిబిఐ చెబుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారంట్‌ లేని వ్యక్తులను అడ్డగించటం కుదరదని ఆ విషయం తెలియక ఒక అధికారి నోటీసు జారీ చేశారని, తరువాత దానిని గుర్తించి మరుసటి నెలలో అతని గురించి తెలియచేస్తే చాలని మరోనోటీసు జారీ చేసినట్లు ఇప్పుడు చెబుతోంది. ఆ విధంగా చూసినపుడు మాల్య లండన్‌ వెళ్లటం గురించి తమకు తెలుసునని , వెళ్లటంలో తప్పులేదని వెంటనే సిబిఐ ఎందుకు చెప్పలేకపోయింది.

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈనెల 18వ తేదీన హాజరు కావాలని జారీ చేసిన నోటీసుపై ఇంతవరకు మాల్య స్పందన వెల్లడి కాలేదు. ఇదిలా వుండగా మాల్య కర్ణాటక బిడ్డ అని అనేక విమాన సంస్ధలు నష్టాలపాలైనట్లే అనేక కింగ్‌ ఫిషర్‌ కూడా నష్టపోయిందని అలాంటి వారిని అనేక మందిని వదలి కేవలం మాల్యనే ఎందుకు వెంటాడుతున్నారని నిద్రలేచిన మాజీ ప్రధాని దేవెగౌడ శనివారం నాడు ప్రశ్నించారు. బ్యాంకులకు చెల్లించటంలో విఫలమైన వారు 60 మంది వరకు వున్నారని, మాల్య రాజ్యసభ సభ్యుడు గనుకనే ఇలా చేస్తున్నారని గౌడ ఆరోపించారు. మాల్య పెద్దమనిషి అని ఆయన భారత్‌కు తిరిగి వస్తారని జమ్మూ-కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా సినీదర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ ద్వారా మాల్యాకు ఒక సలహా ఇచ్చారు. మాల్య వెంట తిరిగే బికినీ భామలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాంకుకు పంపి రుణం తీర్చుకోవచ్చన్నారు. అయితే బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించవేమోగాని బ్యాంకర్లు సిద్దపడతారని పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఎలాగూ నోరు విప్పరు, భక్తులైనా చెప్పాలి

04 Friday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Others, Prices

≈ Leave a comment

Tags

agrarian policy, Fertilizers, Fertilizers subcidies, kisan budget, MSP, Narendra Modi, NDA, urea

నేతి బీరలో నెయ్యి -మోడీ రైతు బడ్జెట్‌

మోడీ గారి రైతు సంక్షేమం గురించి చెప్పమని పరివారాన్ని అడిగితే మా దొరగారి వూరి మిరియాలు తాటికాయంత వుంటాయి బాబయ్యా అన్నట్లు తస్మదీయ మీడియా వంత సరేసరి.మోడీ భక్తులు ఇంకా మత్తు నుంచి బయటకు రాలేదు. ప్రతి పక్షాల విమర్శలు, మింగా కక్కలేని మిత్ర పక్షాల అవస్తలు, అధికార పార్టీ డబ్బాల సంగతి అలా వుంచుదాం. గత రెండు సంవత్సరాల నుంచి వారిని విస్మరించిన మోడీ సర్కార్‌  2016 బడ్జెట్‌ ద్వారా కేవలం రైతులకు క్షమాపణలు చెప్పిందా అని ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రిక ఒక శీర్షికతో వార్త ప్రచురించింది.

ఎం కోటేశ్వరరావు

       సుప్రసిద్ద లాయర్‌ అయిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అందమైన పదాలతో ఈనెల ఒకటిన ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ గురించి కల్పించిన భ్రమలు లేదా ప్రచారంతో నిజంగానే రైతులు తమ ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఆశపడుతున్నారు. తాను రావటమంటేనే రైతులకు మంచి దినాలు వచ్చినట్లని నరేంద్రమోడీ రెండు సంవత్సరాల క్రితం తెలిపారు. పాపం ఈ విషయం తెలియక లేదా చెడుదినాలు దాపురించి గాని స్వయంగా బిజెపి పాలనలోని మహారాష్ట్రలోనే మోడీ గద్దె నెక్కిన తరువాత 1130 మంది రైతులు బలవన్మరణం చెందారు. అదే రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎంపీ గోపాల్‌ షెట్టి రైతులు ఆత్మ హత్య చేసుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారిందని సెలవిచ్చారు. అది తమ పాలన అని కూడా మర్చిపోయారు పాపం. ఆత్మహత్యలు కొనసాగుతుండటంతో మహారాష్ట్రలోని 28 మంది మంత్రులు ఒకే రోజు పర్యటన జరిపి అసలేం జరుగుతోందో తెలుసుకొమ్మని ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ ఆదేశించారు.ఇదంతా మోడీ రైతు బడ్జెట్‌ ప్రకటించిన తరువాతే సుమా !

    మోడీ గారి రైతు సంక్షేమం గురించి చెప్పమని పరివారాన్ని అడిగితే మా దొరగారి వూరి మిరియాలు తాటికాయంత వుంటాయి బాబయ్యా అన్నట్లు తస్మదీయ మీడియా వంత సరేసరి.మోడీ భక్తులు ఇంకా మత్తు నుంచి బయటకు రాలేదు. ప్రతి పక్షాల విమర్శలు, మింగా కక్కలేని మిత్ర పక్షాల అవస్తలు, అధికార పార్టీ డబ్బాల సంగతి అలా వుంచుదాం. గత రెండు సంవత్సరాల నుంచి వారిని విస్మరించిన మోడీ సర్కార్‌ 2016 బడ్జెట్‌ ద్వారా కేవలం రైతులకు క్షమాపణలు చెప్పిందా అని ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రిక ఒక శీర్షికతో వార్త ప్రచురించింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన సూటూ బూటూ నలగ కుండా అలాంటి వారి మధ్యనే విదేశాలు, స్వదేశంలో తిరిగే ప్రధాని నరేంద్రమోడీ ఈ మధ్య కాలంలో తొలిసారిగా రైతుల గురించి మాట్లాడుతున్నారు. త్వరలో అనేక రాష్ట్రాలలో ఎన్నికలున్నాయి కదా అని ఎవరైనా అంటే వారి గోడు ఎవరు వినిపించుకుంటారు చెప్పండి. ప్రతివారికీ ఒక ప్రత్యేకత వుంటుంది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ ద్వారా తాము చెప్పదలచుకున్నదానిని గోబెల్స్‌ మాదిరి పదే పదే చెప్పటం తప్ప ఎదుటివారి విమర్శలను విననట్లు ప్రవర్తించటం మోడీ గారికి బాగా అబ్బింది. అందుకే మన్‌కీ బాత్‌ పేరుతో నెల నెలా జన్‌కీ బాత్‌తో పని లేకుండా తాను చెప్పదలచుకున్నది చెబుతున్నారు.

    బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు ఒడిషా, కర్ణాటకలోలో బిజెపి నిర్వహించిన రైతుల సభలో ప్రధాని ఒక విషయం చెప్పారు. అది కొందరికి స్వంత డబ్బాలాగా అనిపించవచ్చు, మరి కొందరికి ‘అబ్బ ఎంతబాగా చెప్పిండు’ అన్న పరవశం కూడా కలిగించవచ్చు. తన ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందంటూ చేసిన ఆరోపణల సందర్బంగా తన ప్రభుత్వం యూరియా దుర్వినియోగం కాకుండా దానికి వేపపూత పూస్తున్నందుకు అక్రమార్కులకు మంటగా వుందని, వారు తనను వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్పారు.

   యూరియా మన దేశం నుంచి పక్కనే వున్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు దొంగ రవాణా అవుతోందని చాలా కాలంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే వుంటుంది కనుక దాన్ని అరికట్టటానికి మార్గాలు వెతకాల్సిన బాధ్యత కేంద్రంపై ఎక్కువగా వుంటుంది. ఒక్క యూరియా మాత్రమే ఎందుకు దుర్వినియోగం అవుతోంది, మిగతా ఎరువులు ఎందుకు తరలి పోవటం లేదు? దీని గురించి కూడా ప్రధాని చెప్పి వుంటే నిజాయితీగా వుండేది.

     అసలు విషయం ఏమంటే మన ప్రధాని నరేంద్రమోడీ (ప్రధానిగా) పుట్టక ముందే వేప పూత యూరియా తయారు చేస్తున్నారు. యూరియా నుంచి విడుదలయ్యే నైట్రోజన్‌ సామర్ద్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే దానికి వేప పూత అవసరమని, అలాంటి యూరియా వలన దిగుబడులు పెరిగాయని కనుకొన్న మన శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు గత దశాబ్ది కాలంగా దాని వినియోగం, తయారీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఫలితంగా 2011-12లో 3.62 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు(ఎంఎంటి)గా వున్న వేప పూత యూరియా అమ్మకాలు 2013-14లో 6.34 ఎంఎంటికి పెరిగాయి. గత ప్రభుత్వమే వేప పూత యూరియా తయారీపై వున్న కొన్ని అంక్షలను తొలగించి సబ్సిడీ యూరియాను నూటికి నూరుశాతం వేప పూతతో తయారు చేయాలని స్వదేశీ వుత్పత్తిదారులను ఆదేశించింది. ఇతరంగా కూడా కనీసం 75శాతం వేప పూత యూరియా తయారు చేయాలని ఆదేశించింది.మోడీ అధికారానికి వచ్చిన 2014లో మన దేశంలో టన్ను యూరియా ధర 86.76 డాలర్లు వుండగా పాకిస్ధాన్‌లో 260.19, బంగ్లాదేశ్‌లో206.74, చైనాలో 264.82 డాలర్లుగా వుంది. అందువలన దొంగరవాణాను వేపపూత అడ్డుకుంటుందని చెబితే పిచ్చి బియ్యం పెడతానని బెదిరించే చిన్ననాటి అమ్మమ్మ కబుర్లు తప్ప మరొకటి కాదు.

     ఎరువుల ధరల విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో డిఎపి ధర 2011 అగస్టు నెలలో 603 డాలర్లు వుండగా 2016 జనవరిలో 385 డాలర్లకు తగ్గింది. అదే మన దేశంలో 2010-11లో సగటున టన్ను ధర రు.10,750 వుండగా ఈ ఏడాది జనవరిలో 26 వేల రూపాయలు వుంది. ఇదే విధంగా ఎంఓపి ఇతర ధరల నియంత్రణ నుంచి తొలగించిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగాయి. యూరియా ధరలో పెద్ద మార్పులేదు. మిగతా దేశాలలో కూడా యూరియాఏతర ఎరువుల ధరలు పెరిగిన కారణంగా దొంగరవాణా లేదు. దీని అర్ధం ఈ కారణంగా మన దేశంలో యూరియా ధర పెంచమని కాదు, పెంచాలన్నా వీలు కాని స్ధితి అన్నది వేరే కధ.

      1997-98 వరకు డిఎపి, ఎంఓపి వంటి ఎరువుల ధరలు యూరియా కంటే కొంచెం తక్కువగానో ఎక్కువగానో వుండేవి. అందువలన రైతులు శాస్త్రవేత్తలు చెప్పినట్లు తగు పాళ్లలో వాటిని వినియోగించారు. తరువాత సబ్సిడీ భారాన్ని తగ్గించుకొనేందుకు నూట్రియంట్‌ ప్రాతిపదిక విధానాన్ని ఎప్పుడైతే అమలులోకి తెచ్చారో ఇతర ఎరువుల ధరలు యూరియా కంటే ఐదు రెట్ల వరకు పెరిగి అందుబాటులో లేకుండా పోయాయి.మన పాలకుల అసమర్ధత కారణంగా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్‌లో డిఏపి, ఎంఓపి ధరలు తగ్గినా మన రైతాంగానికి పెద్దగా తగ్గలేదు.మరోవైపున సబ్సిడీ రద్దయింది.దీంతో రైతులు యూరియాను ఎక్కువగా వినియోగించటంతో రైతులకు నష్టదాయకమైన అనేక కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అందువలన కాంప్లెక్స్‌ ఇతర ఎరువుల ధరలను యూరియా స్ధాయికి తగ్గిస్తేనే రైతాంగానికి అచ్చే దిన్‌ వచ్చినట్లు లేకుంటే పొలాల సారం దెబ్బతిని మరింతగా చచ్చే దినాలు వస్తాయి. గతేడాది ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ నిమిత్తం 72,447 కోట్లను ప్రకటించింది. ఎంత ఇచ్చిందీ తెలియదు. ఈ ఏడాది 70వేల కోట్లని పేర్కొన్నది. ఈ మొత్తంలో 51వేల కోట్ల రూపాయలు కేవలం యూరియాకు మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాటిన్నింటికి కలిపి కేవలం 19వేల కోట్లే. ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీని రైతుల వారీ లెక్కవేస్తే సాగు భూమి 14 కోట్ల హెక్టార్లుగా వున్నందున సగటున ఎకరానికి రెండువేల రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో వేసి ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని మోడీ సర్కార్‌ ఆలోచిస్తున్నది. ఇదే జరిగితే యూరియా ధరకు కూడా రెక్కలు వస్తాయని వేరే చెప్పనవసరం లేదు. దీని వలన కౌలు రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. వారికి ఈ మాత్రం కూడా దక్కే అవకాశం లేదు. పది ఎకరాలు మించి పెద్ద రైతులకు సబ్సిడీ లేదన్నా లేదా తగ్గించి ఇస్తామన్నా వారి పొలాలను సాగు చేసే అరక్షిత కౌలుదార్లు అదనంగా ఖర్చు చేయాల్సిందే. నరేంద్రమోడీ ఈ విధానాలను సవరిస్తారా లేదా అనేదాన్ని బట్టి రైతుల సంక్షేమం వుంటుంది.అలాంటి సూచనేమీ బడ్జెట్‌లో లేదా ఆర్ధిక సర్వేలో లేదు కాబట్టి గత కాంగ్రెస్‌ బూట్లతోనే నడిచేందుకు పూనుకున్నారని అన్న వారిని దేశద్రోహులు అంటే కుదరదు.

     రైతుల నేటి దుస్ధితికి గత పాలకుల విధానాలే కారణమని బిజెపి విమర్శించింది. దానిలో ఎలాంటి తప్పు లేదు. 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక విధానాలు లేదా నయా వుదారవాద విధానాలు దీనికి నూటికి నూరు పాళ్లు కారణం, ఈ కాలంలో వాటిని గతంలో ఐదు సంవత్సరాలు అమలు జరిపిన బిజెపి ఎన్‌డిఏ ప్రభుత్వానికి కూడా వాటా ఇవ్వక తప్పదు. ఇప్పుడు సమస్య ఏమంటే ఆ విధానాలను మార్చ కుండా మోడీ రైతాంగానికి మంచి దినాలను ఎలా తీసుకు వస్తారు? గుజరాత్‌ మోడల్‌ అన్నారు. దాని ప్రకారం పెట్టుబడులైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు మిగతా రాష్ట్రాల కంటే తక్కువకు , మద్దతు ధరలు ఎక్కువ ఇచ్చారా ? లేదు దేశ వ్యాప్తంగా ఒకే ధరలు. మొదటి బడ్జెట్‌లో విధానపరమైన అంశాలేమీ పేర్కొన లేదు. రెండు, మూడవ బడ్జెట్లలో కూడా వాటి ప్రస్తావనే లేదు. గత పాలకుల విధానాలు మార్చకుండా రైతాంగానికి రెట్టింపు ఆదాయం ఎలా కల్పిస్తారు? మంత్రదండం ఏమైనా వుందా ?

      మన వ్యవసాయ రంగం కుదేలవటానికి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవటానికి కారకులు ఎవరు? మహారాష్ట్ర బిజెపి ఎంపీ చెప్పిన ప్రకారమైతే ఆత్మహత్య కూడా ఒక ఫ్యాషన్‌గా మారింది.అంటే తమ ఆత్మహత్యలకు తామే కారకులు. పాలకుల విధానాలు ఎలా దెబ్బతీస్తున్నాయో ఎరువుల గురించి చెప్పుకున్నాము. ప్రకృతి వైపరీత్యాలైన అతి వృష్టి,అనా వృష్టి అందుకు తోడ్పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కడితే వుప్పు సముద్రం పాలవుతున్న గోదావరి జీవ జలాలతో లక్షలాది బీడు భూములు పచ్చపచ్చగా మారతాయని, విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతాయని ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజలు కలలు కంటున్నారు. రైతు బడ్జెట్‌ అని అనేక మంది కీర్తిస్తున్న ఆ ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం గంగ శుద్ధికి రెండున్నర వేల కోట్ల రూపాయలు కేటాయించిన పోలవరానికి కేటాయించిన మొత్తం వంద కోట్ల రూపాయలు. ఈలెక్కన కేటాయింపులు జరిపితే అది పూర్తి కావటానికి మరో 50-60 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.అయినా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తలుపు చెక్కతో కాకపోయినా తమలపాకుతో కూడా అంటించి గట్టిగా మాట్లాడటానికి సాహసించటం లేదు. విరోధంతో కంటే స్నేహంతో సాధించుకోవాలని కబుర్లు చెబుతున్నారు. విరోధం తెచ్చుకోమని, తొడగొట్టమని ఎవరు చెప్పారు. కనీస నిరసన తెలపటం బాధ్యత కాదా? గుడ్డి కన్ను మూస్తే ఏమిటి తెరిస్తే ఏమిటి అన్నట్లుగా స్నేహంగా వుండి, కొంత మందికి కేంద్ర మంత్రి వర్గంలో వుద్యోగాలిప్పించి సాధించింది ఏముంది ? గంగ శుద్ధికి నిధులు ఇవ్వవద్దని చెప్పటం లేదు. అది ఈనాటి సమస్య కాదు, అంత తేలిక కూడా కాదని హైదరాబాదులో మూసీ, హుస్సేన్‌ సాగర్‌ శుద్ధి పధకాలు వెల్లడించాయి. ముందు గంగను కలుషితం చేస్తున్న వారిని అదుపు చేసిన చర్యలున్నాయా ? జనానికి అవసరమైన ఆహారాన్ని పండించే ప్రాజెక్టులకా మొదటి ప్రాధాన్యత లేక మరొకదానికా ?

      వ్యవసాయరంగ పునరుద్దరణ అంటే ఖాయిలా పడినదానిని తిరిగి పనిచేయించటానికి వివిధ పధకాలకు 35,984 కోట్ల కేటాయింపుతో పాటు పన్నులు వేసే అన్ని సేవలపై 0.5శాతం కృషి కల్యాణ్‌ సెస్‌ వసూలు ద్వారా సమకూరే మొత్తాన్ని రైతుల కోసం ఖర్చు చేస్తారు. అంటే జనంపై అదనపు భారాలు మోపుతారు. జనంలో రైతులు కూడా వుంటారు కనుక కొత్త పెన్షన్‌ పధకం ప్రకారం వుద్యోగులు, కార్మికులు తమ పెన్షన్‌కు తామే నిధులు సమకూర్చుకున్నట్లుగా రైతులు కూడా తమ కల్యాణానికి తాము కూడా తమ వంతు నిధులు సమకూర్చుకోవాలి. నూతన పంటల బీమా పధకం గురించి రైతాంగంలో ఎన్నో ఆశలు కల్పించారు.అది అమలులోకి వచ్చిన తరువాత గానీ అసలు విషయం అర్ధం కాదు. ఈ పధకం అమలుకు కేంద్రం-రాష్ట్రాలు చెరి సగం నిధులు భరించాలి. ఏడాదికి 17,600 మేరకు అవసరమౌతాయని అంచనా వేశారు. కానీ బడ్జెట్‌లో రు.5500 కోట్లు మాత్రమే ప్రకటించారు. అంటే ఈ ఏడాది పూర్తిగా అమలు జరగదని అనుకోవాలి.

   మరో ముఖ్య సమస్య కనీస మద్దతు ధరలు. అవి వున్నా రైతాంగానికి పెద్ద వుపయోగం లేకుండా పోతోంది. ఒక్క యూరియా తప్ప మిగతా పెట్టుబడులన్నీ విపరీతంగా పెరిగి పోయాయి. వాటితో పోలిస్తే మద్దతు ధరలు ఏ మూలకు చాలవు. వాటిపై తమ విధానమేమిటో ఇంత వరకు వెల్లడించలేదు.మిగతా అంశాలకు సంబంధించి రైతాంగానికి భారాలు తగ్గించే లేదా ఆదాయాలు పెంచే నిర్దిష్ట పధకాలు, విధానాలేవీ బడ్జెట్‌లో లేవు.ఫలానా సమస్యపై మాది ఫలానా విధానం అంటే దాని గురించి ఒక అభిప్రాయమో అభినందనో చెప్పవచ్చు. అదేమీ లేదు. వాటి గురించి కారణ జన్ముడిగా భావిస్తున్న నరేంద్రమోడీ నోరు విప్పరని తేలిపోయింది. కనీసం ఆయన శిష్య పరమాణువులు లేదా భక్తులైనా చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏం చేయాలి ?

27 Saturday Feb 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

crude oil price, Economic Survey, Indian Railways, Narendra Modi, Narendra Modi Failures, NDA, NPA;s

ఎం కోటేశ్వరరావు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో దేన్నయినా తీసుకోండి, గతేడాది మా పాలన సజావుగా సాగి ఒకటి రెండు రంగాలు మినహా ఎన్నో రంగాలలో పురోగతి సాథించాం, కొన్ని ఇబ్బందులున్నా వచ్చే ఏడాది మరెంతో పురోగమించేందుకు ఒళ్లుదాచుకోకుండా పని చేస్తాం. ప్రజల సంక్షేమానికి కొత్తగా వేల కోట్ల రూపాయలను కొత్తగా కేటాయించనున్నాం. బడ్జెట్లను ప్రవేశపెట్టబోయే ముందు చెప్పే ఈ పోసుకోలు కబుర్లు వినీ వినీ బోరు కొడుతోంది. పార్టీలు మారే వారు కూడా అభివృద్ధి కోసమే అంటూ ఇవే సోది కబుర్లు చెప్పి జనానికి చెవుల్లో పూలు పెడుతున్నారు. ఎక్కడిక్కడ ‘అపరిచితులు’ తయారైతే తప్ప ఇలాంటి వారు నోర్మూసుకోరా అనిపిస్తోంది. ఇలా కబుర్లు చెప్పేవారు ఒక్కొక్కటిగా వున్న పధకాలను నీరుగారుస్తున్నారు. లేదా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. భారాలు మోపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గితే ఆ మేరకు ఎందుకు మనకు తగ్గటం లేదనే ప్రశ్న మరోసారి అడగాలంటే సిగ్గుగా వుంది.మన పాలకులు అంతలా తెగించారు. మన పక్కనే వున్న చిన్న దేశం శ్రీలంక దశాబ్దాల తరబడి అంతరుద్ధ్యంతో లేదా వుగ్రవాదరతో నాశనమైంది. అయినా అక్కడ పెట్రోలు, డీజిల్‌ ధర(ఈనెల 22న) మన కంటే తక్కువగా లీటరు 89,66 సెంట్ల చొప్పున వున్నాయి.( అంతర్జాతీయ కరెన్సీ డాలరు విలువలో సులభంగా వుంటుంది కనుక ఆ ధరలలో చెప్పాల్సి వస్తోంది. ఒక డాలరుకు వంద సెంట్లు) మన కంటే దరిద్రం వున్న పాకిస్తాన్‌లో 68,72 సెంట్ల చొప్పున వుండగా మోడీ గుజరాత్‌ మోడల్‌ పాలనలో మాత్రం 91,69 సెంట్ల చొప్పున చెల్లించాల్సిన దౌర్భాగ్యం మనకు ఎందుకు ? గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న ఈ సొమ్మంతటినీ ఎవరికి చెల్లిస్తున్నారు. చైనా కంటే మన దేశంలోనే అభివృద్ధి రేటు ఎక్కువ అని లెక్కలు చెబుతారు. ఓకే అంగీకరిద్దాం. మరి అభివృద్ధి ఫలితాలు జనానికి ఎందుకు అందటం లేదు. మనది ప్రజాస్వామ్యం అంటారా ?

గడచిన మూడు నెలల్లో మన ఆసియాలోని వియత్నాంలో పెట్రోలు ధరలు 19.4, డీజిలు ధరలు 29.1శాతం తగ్గాయి. ఇంత మొత్తంలో ప్రపంచంలో ఏ దేశంలోనూ తగ్గలేదు. మరి ఇదే సమయంలో మన దగ్గర తగ్గింది 3.1,4.4శాతమే. పాకిస్ధాన్‌లో 6.6,9.5శాతం తగ్గాయి. ఇంత కంటే సిగ్గు చేటైన విషయం ఏముంది?ఈ కాలంలో బ్రెంట్‌ ముడిచమురు ధర పీపా 43 నుంచి 30 డాలర్లకు పడిపోయింది. మన మౌన బాబా మోడీ దీని గురించి తన మన్‌కీ బాత్‌లో ఎందుకు మాట్లాడరు ?నిఖార్సయిన జాతీయ వాదులు ప్రతిరోజూ ప్రతిదాని మీదా మాట్లాడరు అనుకుందాం అసలు మనం ఎందుకు అడగటం లేదు !

గత మూడు సంవత్సరాలు 2012-13, 13-14,14-15 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకు మొండి బకాయిల కింద రద్దు చేసిన మొత్తాలు 1,14,000 కోట్ల రూపాయలు.అంతకు ముందు తొమ్మిది సంవత్సరాలలో రద్దు చేసిన మొత్తం కంటే ఇది ఎక్కువ. అన్నింటి కంటే తాను చాయ్‌ వాలానని ప్రతి పైసాకు జవాబుదారీగా వుండటంతో పాటు బ్లాక్‌మనీ బయటకు లాగి తలకు 15లక్షలు చొప్పున పంచుతానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ తొలి ఏడాది కాలంలో రద్దు చేసిన మొత్తం 53,100 కోట్లు కాగా రెండో ఏడాది ఈ మొత్తం మరో అంత వుంటుందని అంచనా, అంటే లక్ష కోట్ల రూపాయలు రద్దు చేసి మోడీ సర్కార్‌ రికార్డుల మోత మోగిస్తోంది. మంగళగిరి పానకాల స్వామికి ఎంత పానకం పోసినా పైకి కనపడదంటారు, మరి ఇదేమిటి ? బహిరంగంగా అప్పనంగా దొబ్బపెట్టటం కాదా ? చివరికి ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్నట్లుగా జనం పాటలు పాడుకోవటమేనా?

ఈ ఏడాది రైల్వేబడ్జెట్‌ను చూస్తే ఎప్పుడూ వచ్చే రైలు వచ్చిందీ, పోయింది అన్నట్లుగా వుంది. పరిస్ధితులన్నీ బాగుంటే ఈ ఏడాది రైల్వే మంత్రి కొత్త పధకాలను ఎందుకు ప్రకటించలేదు? డబ్బు లేకుండానే గతంలో ఎన్నో పధకాలు ప్రారంభించారు, వాటిని పూర్తి చేయటం ప్రధమ కర్తవ్యం కనుక వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం అని అందమైన కబుర్లు చెప్పారు. పోనీ గతం కంటే మెరుగ్గా కేటాయింపులేమైనా చేశారా అంటే అదీ లేదు. కాగితాల మీద వున్న పధకాల ఫైళ్లు కొనసాగించటానికి సరిపడా నిధులు కేటాయించారు తప్ప ఒక్కటంటే ఒక్క పధకమూ సకాలంలో ముగిసే విధంగా కేటాయింపులు లేవు. ప్రయాణీకులపై భారం పెంచలేదని మీడియాలో కొన్ని సంస్ధలు బాకాలు వూదాయి.గతంలో పెంచిన ఛార్జీలు, వివిధ సందర్భాలలో తత్కాల్‌, టిక్కెట్ల రద్దు పేరుతో భారీగా వసూలు చేస్తున్న విషయాన్ని దాచి పెట్టారు.కొన్ని తరగతుల టిక్కెట్ల ధరలు పెంచితే అవి విమాన ఛార్జీలకు దగ్గరగా చేరి ఆ బోగీలు ఖాళీగా వుండే ప్రమాదం పొంచి వుండబట్టి తప్ప ప్రయాణీకుల మీద ప్రేమతో కాదని గమనించాలి. సరకు రవాణా చార్జీలు పెంచితే ఇప్పటికే పెరుగుతున్న ధరలు మరింతగా పెరుగుతాయి, ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. రెండవది ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచకుండా కేవలం చార్జీలు పెంచితే జనంలో వ్యతిరేకత కూడా వస్తుందన్న విషయం తెలిసిందే.

నరేంద్రమోడీ సర్కార్‌ గతేడాది కాలంగా రైల్వేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచిందేమీ లేదు. దేశ ఆర్ధిక వ్యవస్ధలో అల్లావుద్దీన్‌ అద్భుత దీపంతో దేశ ఆర్ధిక వ్యవస్థ రూపు రేఖలను మార్చివేస్తామని చెప్పిన పెద్దలు దీపం అరిపోయే విధానాలు అనుసరిస్తున్నారు. సరకు రవాణా, ప్రయాణీకుల నుంచి వస్తుందని అంచనా వేసిన మొత్తానికి వచ్చిన మొత్తానికి 17వేల కోట్ల రూపాయల లోటు ఏర్పడింది.ఇవిగాక ఏడవ వేతన కమిషన్‌ సిఫార్సులు అమలు జరిపితే రైల్వేలపై మరో 32వేల కోట్ల రూపాయల ఖర్చు మొత్తం 50వేల కోట్ల రూపాయల వరకు లోటు ఏర్పడ నుంది. ఈ లోటును పూడ్చుకొనేందుకు రైల్వే ఆస్ధులను అమ్మటం, ప్రయివేటీకరణ చేయటానికి పూనుకోవటం తప్ప చార్డర్డ్‌ ఎకౌంటెంట్‌ సురేష్‌ ప్రభుగారి బడ్జెట్‌ మరొకటి ఏమైనా వుందా ?

సాధారణ బడ్జెట్‌కు ముందు విడుదల చేసే ఆర్ధిక సర్వేలోనే బడ్జెట్‌ ఎలా వుండబోతోందో స్ధూలంగా తెలియ చేస్తారు. తాజా ఆర్ధిక సర్వేలో చెప్పిన అంశాలు సబ్సిడీలన్నీ ధనికులకే దక్కుతున్నాయన్న ప్రచార దాడి చూస్తే మిగిలిన వాటికి కూడా త్వరలో మంగళం పాడటం ఖాయంగా కనిపిస్తోంది. ఐరోపాలో ముందు సబ్సిడీలను రద్దు చేశారు.పోయింది సబ్సిడీలే కదా అని జనం పెద్దగా పట్టించుకోలేదు. తరువాత వేతన స్ధంభన, అది తాత్కాలికమే అనుకున్నారు, ఆ తరువాత పెన్సన్లలో కోత ,మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూశారు. అన్న వస్త్రాలను అడిగితే వున్న వస్త్రాలనే లాగి వేసినట్లుగా ఒక్కొక్కదానిని లాగి వేసిన తరువాతే జనానికి తత్వం తలకెక్కి వీధులకు ఎక్కుతున్నారు. మరి మనం ఏం చేద్దాం ? ఏం చేయాలి? ఎలా చేయాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ భక్తులారా నిగ్రహించండి !

23 Tuesday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Narendra Modi, Narendra Modi Failures, Narendra Modi sarkar, NDA

ఎం కోటేశ్వరరావు

     మూఢ భక్తి, భక్తులతో ఇదే సమస్య . దేవుడు నిజంగా ప్రత్యక్షమైనా తట్టుకోలేరు, నమ్మిన దేవుడిపై విశ్వాసం సన్నగిల్లుతున్నా భరించలేరు. ఏం మాట్లాడతారో తెలియని వున్మాదంలోకి వెళ్లిపోతారు. కొత్తా దేవుడండీ, కొంగొత్తా దేవుడండీ అన్నట్లు పెద్ద ఎత్తున ప్రచార పటాటోపంతో ముందుకు తెచ్చిన నరేంద్రమోడీ మామూలు మనిషేనని ఆయన దగ్గర మంత్రదండం లేదని హనుమంతుని వంటి వెంకయ్య నాయుడితో సహా అనేక మంత్రులు, ఇతర పెద్దలు ముందు జాగ్రత్త చర్యగా పదే పదే మొత్తుకుంటున్నారు. మోడీ దగ్గర మంత్రదండం వుందని ప్రతిపక్షాలు ఎప్పుడైనా చెప్పాయా ? మహామాంత్రికుడని గుజరాత్‌ను మాయా మహలుగా నిర్మించాడని, దేశమంతటికి దానిని వర్తింప చేస్తారని చెప్పింది ఎవరు ? నరేంద్రమోడీ పాచి పాటనే పాడి బోర్‌ కొట్టిస్తున్నారని రాసినందుకు కొందరు భక్తులకు కోపం వచ్చింది. అంతా వ్యతిరేక దృక్పధమే తప్ప బి పాజిటివ్‌గా వుండటంలేదని, అన్నింటినీ తీసుకుని వచ్చి మన కంచాల్లో వడ్డించాలన్నట్లు కొందరు భావిస్తున్నారని, అసలు పౌరులుగా మన బాధ్యతలను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదని వాపోతున్నారు.

     దేశం మనకేమిచ్చిందని కాదు మనం దేశానికేమిచ్చామని ఆలోచించటమే దేశభక్తి అన్నట్లుగా గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది కూడా బి పాజిటివ్‌లో భాగమే. మంగళవారం నాడు పార్లమెంట్‌ వుభయ సభలను వుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం అంటే ప్రభుత్వం రాసి ఇచ్చిన వుపన్యాసాన్ని చదివి వినిపించటం తప్ప వేరు కాదన్నది తెలిసిందే. దాన్ని పూర్తిగా విన్నవారికి లేదా చదివిన వారికి దేశంలో ఇంక పరిష్కరించాల్సిన పెద్ద సమస్యలేవీ లేవనే భ్రమ కలుగుతుంది. ప్రధాన మంత్రి జన ధన యోజన పధకం కింద తెరిచిన 21 కోట్ల ఖాతాలలో 15 కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయని, 32వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వాటిలో వున్నట్లు చెప్పటానికి గర్వపడుతున్నట్లు రాష్ట్రపతి చెప్పారు.

     ‘జన ధన యోజన,ముద్రా బ్యాంక్‌, సామాన్యుడికి ఆరోగ్యబీమా వంటి పధకాల వంటి పెద్ద ప్రకటనల ప్రభావం ఆచరణలో కనపడాలంటే అనేక దశాబ్దాలు పడుతుంది’ ఈ మాటలు చెప్పింది నేను కాదు, ‘ఒక భక్తుడి అపరాధ అంగీకారం ‘ పేరుతో తనను తాను మోడీ ‘భక్తుడి’గా ప్రకటించుకున్న రేటింగ్‌ సంస్ధ క్రిసిల్‌ మాజీ డైరెక్టర్‌ ముత్తురామన్‌ స్వరాజ్య అనే పత్రికలో తాజాగా రాసిన వ్యాసంలో పేర్కొన్నఅంశమిది.గ్యాస్‌ సబ్సిడీని వదులు కోవాల్సిన అవసరం గురించి ప్రభుత్వం చేసిన ప్రచారఖర్చుకు సరిపడా కూడా స్వచ్చందంగా గ్యాస్‌ సబ్సిడీని వదులు కున్నారో లేదో అనుమానమే. పదహారు కోట్ల కనెక్షన్లకు గాను సబ్సిడీ వదులుకుంది కేవలం 62 లక్షల మందేనని రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారు. ప్రపంచంలో తమదే అతి పెద్ద పార్టీ అని పది కోట్ల మంది సభ్యులున్నారని ప్రకటించుకున్న అధికార పార్టీ సభ్యులు కూడా గ్యాస్‌ సబ్సిడీని వదులుకోలేదన్నది స్పష్టం.సభ్యులు కాని మోడీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలోనే వున్నారన్నది గమనించాలి.

      హైదరాబాద్‌ కేంద్రీయ విద్యాలయంలో దళితుడైన ఒక యువశాస్త్రవేత్తను ఆత్మహత్యకు పురికొల్పిన పార్టీ పార్లమెంట్‌లో సుభాషితాలు చెబుతోంది. దీన్ని కూడా బి పాజిటివ్‌గా తీసుకోవటం సాధ్యం కాదని జెఎన్‌యులోని ముగ్గురు ఎబివిపి విద్యార్ధి నాయకులే ప్రకటించిన తరువాత కూడా ‘సామాజిక ప్రజాస్వామ్యపునాది లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనలేదని అంబేద్కర్‌ చెప్పిన అంశాన్ని రాష్ట్రపతి వుటంకించారు.

      రైతుల సంక్షేమం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సమయంలోనే మహారాష్ట్ర బిజెపి ఎంపీ రైతులు ఆత్మహత్య చేసుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారిందని, అలాంటి ఫ్యాషన్‌ రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వటంలో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చేసిన వ్యాఖ్యను కూడా రైతులు ‘సహించారు.’ఇలాంటి విషయాలలో బిజెపి నేతలు పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు మాట్లాడకూడని సమయంలో మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, తగు సమయంలో స్పందించటం లేదని మోడీ భక్తుడు ముత్తురామన్‌ మొత్తుకున్నాడు. ‘ టాంజానియా యువతిపై మూకదాడి సందర్భంగా బెంగలూరులో జాత్యంహంకారం గురించి మాట్లాడటానికి మీడియా అత్యుత్సాహం చూపుతున్న సమయంలో విదేశీ విద్యార్ధులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బిజెపి నేత సదానంద గౌడ వ్యాఖ్యానించటం ఏమిటంటూ దాని బదులు శాంతి భద్రతలు దిగజారాయాని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శించవచ్చు. చర్చిలపై దాడులు లేదా దాద్రి వుదంతాలను గట్టిగా ఖండిస్తూ ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తే వాటి భారం ముఖ్యమంత్రులపై పడేది, దానికి బదులు బిజెపి నేతలు మౌనం వహిస్తున్నారు,అలాగే బీఫ్‌ గురించి మాట్లాడకూడని సమయంలో మాట్లాడారు ‘అని కూడా ముత్తురామన్‌ తల మీద కొట్టుకున్నాడు. వీటన్నింటినీ కూడా పౌరులు తమ బాధ్యతగా సహించారా లేదా భక్తులారా ?

     గతేడాది కాలంగా ఎగుమతులు పడిపోయి, పారిశ్రామిక వుత్పత్తి తగ్గిపోయినట్లు అధికారికంగా ఒకవైపు ప్రభుత్వమే ప్రకటించినా జనానికి మతిమరపు ఎక్కువ అనే ధృడాభిప్రాయంతో కిందపడ్డా విజయం సాధించామన్నట్లుగా ప్రభుత్వం తీసుకున్న సరికొత్త చొరవల కారణంగా సులభంగా వ్యాపారం చేసే దేశాల ప్రపంచబ్యాంకు జాబితాలో మన దేశం పన్నెండు ర్యాంకులు ఎగువకు పోయిందని ప్రభుత్వం ప్రకటించుకుంది.అయితే పెట్టుబడిదారులకు మోడీ పదే పదే వాగ్దానం చేసినట్లుగా పన్ను సంస్కరణలు చేయలేదని మోడీ భక్తుడు నిష్టూరాలాడుతున్నాడు. అందుకే మోడీ పాచి పాట పాడి బోరు కొట్టిస్తున్నారన్న వ్యాసంలో కనీసం భక్తులకు కూడా విశ్వాసం కలిగించలేకపోతున్నారని వ్యాఖ్యానించాను.

      పౌరులు డిమాండ్లు చేయటం తప్ప తమ బాధ్యతలను గుర్తెరగటం లేదని శుద్దులు చెప్పేవారు మరి వీటినేమంటారో. మోడీ భక్తుడు ముత్తురామన్‌ చెప్పిన ప్రకారం (సామాన్యులు తిరిగే) విమానాలకు లీటరు పెట్రోలు రు.37 రూపాయలకు పోస్తుంటే విలాసంగా ద్విచక్ర వాహనాలు, కార్లు,బస్సులు ఎక్కే వారికి పెట్రోలు 60 రూపాయలకు పోస్తున్నారు. దీన్ని నోరు మూసుకొని అధిక చెల్లింపు బాధ్యతగా జనం భావిస్తున్నారా లేదా ? పెట్రోలు అసలు ఖరీదు 20 అయితే పన్నులు 40 చెల్లిస్తున్నారా లేదా ? ప్రపంచ మార్కెట్‌లో చమురు ధర తగ్గినా ద్రవ్యలోటు తగ్గించుకోవటానికి ఎప్పటికపుడు పెట్రోలుపై ఎక్సయిజ్‌ పన్ను, వ్యాట్‌ పెంచుతుంటే దేశభక్తులుగా, రాష్ట్ర భక్తులుగా భరిస్తున్నారా లేదా ? దాని వలన ధరలు పెరిగితే నోర్మూసుకొని వస్తువులు కొంటున్నారా లేదా ? వెంటనే పెట్రోలుపై లీటరుకు పది రూపాయలు, డీజిల్‌పై ఆరు రూపాయలు తగ్గించే విషయం పరిశీలించమని ముత్తురామన్‌ కూడా కోరుతున్నాడు. ఆయనను కూడా కమ్యూనిస్టుగా జమకడతారా ?

      పెద్ద ఎత్తున జరిగిన 2జి, కోల్‌గేట్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ తదితర అవినీతి చర్యల పూర్వరంగంలో అనేక మంది తటస్తంగా వున్నవారు మోడీకి ఓట్లు వేశారని రెండు సంవత్సరాల తరువాత కనీసం ఒక గుమస్తాను కూడా శిక్షించలేకపోయారని మోడీ భక్తుడు ఆక్షేపించారు.సోనియా, మన్మోహన్‌సింగ్‌ వంటివారిపై చర్య తీసుకుంటే వేధింపులకు పాల్పడుతున్నారని అంటారు కనుక వారి జోలికి పోవటంలేదు అని ఎవరైనా అర్ధం చేసుకుంటారు. కానీ కోడా, బన్సాల్‌, మారన్‌, రాజా, కనిమొళి, కల్మాడీ వంటివారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. నిర్బయ అత్యాచార కేసును పదినెలల్లో ముగించగలిగినపుడు రోజు వారీ ప్రాతిపదికన అవినీతి కేసులను ఎందుకు విచారించటం లేదు, కొద్ది మందినైనా రాజకీయ నేతలను, అధికారులను అదే మాదిరి జైలుకు ఎందుకు పంపలేదు. దీనికి సంబంధించినదే నల్లధనానికి సంబంధించి అశాభంగం కలిగించారు, ప్రభుత్వం ఏమి చేస్తున్నదో లేదో పట్టుకున్నవారి జాబితా, ఎంత మొత్తం స్వాధీనం చేసుకున్నది స్పష్టంగా తెలియచేయాల్సిన అవసరం లేదా అని అని ముత్తురామన్‌ ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్‌ అంటే నిజంగానే రోడ్లు శుభ్రపడతాయనుకున్నారు అమాయక పౌరులు. అనేక మంది తొలి రోజుల్లో చీపుర్లు పట్టుకొని నిజంగానే వూడ్చారు. తీరా చెత్త పన్ను పేరుతో జనంపై అదనపు భారం మోపుతున్నా కడుతున్నారే. పన్ను సంస్కరణలంటే సామాన్యులపై భారం తగ్గిస్తారేమోనని అందరూ నిజంగానే నమ్మారు. చివరికి సంస్కరణ అంటే సేవాపన్ను 12.36 శాతం నుంచి 14కు రాబోయే రోజుల్లో 16శాతానికి పెంచబోతున్నా నిబద్దతగల ఏ పౌరుడూ ఇదేమి అన్యాయం అనటం లేదే ఇంతకంటే పౌరులు తమ విధులను ఏమి నిర్వర్తించాలి?అందువలన కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు మోడీ సంజాయిషీ ఇవ్వకపోతే మానే కనీసం తన భక్తులకైనా చెప్పకపోతే ఏం జరుగుతుందో వారే రాబోయే రోజుల్లో వారే చెబుతారు. ముత్తురామన్‌ కార్పొరేట్‌ వర్గాల ప్రతినిధి, మతవాది, మితవాది అని కూడా అతని వ్యాసం చదివితే అర్ధం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలు అమ్ముతామని చెప్పి అమ్మలేదని విమర్శించటంతో పాటు మతపరమైన చర్యలు తీసుకోని కారణంగా తాను అపరాధాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంటే పచ్చిమితవాదుల నుంచి కూడా రానున్న రోజుల్లో మోడీకి కష్టాలు తప్పేట్లు లేవు. ఒకసారి మతోన్మాద పులిని తామెక్కినా జనాన్ని ఎక్కించినా దాన్ని అదుపు చేయాలి లేదా దానికి బలి కావాల్సి వుంటుంది. ఏది జరిగినా దేశం, సామాన్యజనం ఎంతో మూల్యం చెల్లించాల్సి వుంటుంది. రానున్న రోజుల్లో కనిపిస్తున్న ముప్పు అదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీగారూ పాచి పాటతో బోర్‌ కొట్టిస్తున్నారు !

22 Monday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, ANTI NATIONAL, BJP, Bjp nationalism, JNU, JNU ROW, Media, Narendra Modi, RSS

ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

ఎం కోటేశ్వరరావు

       ప్చ్‌ ! నరేంద్రమోడీ కూడా నిరాశపరుస్తున్నారు. ఆదివారం నాడు ఒడిషాలో మోడీ పాడిన పాచి పాత పాట జనానికి బోర్‌ కొట్టింది. ప్రతివారికీ పదిహేను లక్షల నల్లధన సొమ్ము పంపిణీ, దేశమంతటా గుజరాత్‌ నమూనా విస్తరణ మాదిరి కిక్కిచ్చే కొత్త అంశాలు ఇంకా తమ మహా మౌనబాబా నోటి నుంచి వెలువడతాయని అభిమానులు ఎదురు చూస్తుంటే తన అంబుల పొదిలోంచి పాతపడిన, పదునులేని బాణాలు బయటకు తీస్తున్నారు.అదేదో సినిమాలో డైలాగు మాదిరి ఇదేం చాలా బాగోలేదు, వ్యతిరేకులను ఎలాగూ ఎదుర్కోలేరు, కనీసం భక్తులకు అయినా నమ్మకం కలిగించాలి కదా. ఇందిరా గాంధీ తన పాలన ఇబ్బందుల్లో పడినపుడు, ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకున్నపుడల్లా తన ప్రభుత్వానికి విదేశీ హస్తం నుంచి ముప్పు వుందని చెప్పేవారు, ముఖ్యంగా 1975లో అత్యవసర పరిస్ధితి విధించబోయే ముందు ఈ మాటలు ఎక్కువగా చెప్పారు. నాడు జనసంఘం ముసుగులో వున్న నేటి బిజెపి నాయకులు దాన్ని ఎద్దేవా చేశారు, ఆ హస్తాన్ని బయట పెట్టమని అడిగేవారు. ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ ఒడిషాలో జరిగిన రైతు సభలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని, ఒక చాయ్‌వాలా ప్రధాని అయ్యారన్న వాస్తవాన్ని కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని చేసిన ఆరోపణ నరేంద్రమోడీకి అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకయ్య నాయుడి మూస ప్రాసలో చెప్పాలంటే రుచీపచీ లేని పాత చింతకాయ పచ్చడిలా మరోసారి ఇందిరా గాంధీని జ్ఞప్తికి తెచ్చింది. ఇలా అయితే మనం గతంలో కాంగ్రెస్‌ను ఏడిపించినట్లుగా ఇప్పుడు వారు మనల్ని కూడా ఆడుకుంటారు సార్‌ అని మోడీ అభిమానులు లోలోపలే మధన పడుతున్నారు. మంత్రసానితనానికి అంగీకరించిన తరువాత ఏదొచ్చినా పట్టక తప్పదు మరి. దేశంలో అత్యవసర పరిస్ధితి పునరావృతమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయని గతేడాది జూన్‌లో బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అది కచ్చితంగా నరేంద్రమోడీని వుద్దేశించే చేశారని లోకం కోడై కూసింది. మోడీ ఆరోపణ దానిలో భాగమేనా ? ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

      గత ఇరవై నెలల పాలనా కాలంలో నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైంది. రానున్న రోజులలో మరింత తిరోగమనం తప్ప పురోగమన దాఖలాలు కనిపించటం లేదు. పెట్టబోయే బడ్జెట్‌ కూడా అంత ఆకర్షణీయంగా వుండబోదని ముందే వార్తలు వెలువడుతున్నాయి. వేతన సంఘసిఫార్సులను వుద్యోగులు అంగీకరించటం లేదు. ఈ స్ధితిలో కాషాయ మార్కు జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి కొంతకాలం జనం దృష్టిని మరల్చాలి. అందుకు తగిన అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యులో జరిగిన సభలు, వాటి పర్యవసానాలు మంచి అవకాశాన్ని ఇచ్చాయి. వాటిని వుపయోగించుకోకుండా ఏ విఫల అధికారపక్షమైనా ఎలా వుంటుంది. అయితే బిజెపి ఈ బస్సు కూడా మిస్సయినట్లే. కానీ ఒకందుకు మాత్రం బిజెపి మేథోచెరువులో ఈదులాడుతున్న వారిని అభినందించాలి. తిను,తాగు, తిరుగు అనేవి తప్ప దేశంలో వేరే ఇజాలేవీ లేవు అన్న వాతావరణం పెరిగిపోయి యువత అనేక విధాలుగా క్షీణ సంస్కృతి ప్రభావానికి లోనవుతున్న దశలో వారికి తెలియకుండానే ఒక సైద్ధాంతిక చర్చకు దోహదం చేశారు. ఢిల్లీ జెఎన్‌యులోని ఎబివిపి నాయకుల నుంచే తమకు ఎదురు దెబ్బ తగులుతుందని వారు కలలో కూడా వూహించి వుండరు. మేకతోలు కప్పుకున్న పులి వంటి సంఘపరివార్‌ సంస్ధల నైజం తెలియక లేదా వారే అసలైన దేశభక్తులనే ప్రచారం నిజమే అని నమ్మిగాని లేదా కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో గాని అనేక మంది దాని అనుబంధ సంస్ధలలో చేరుతున్నారు, మద్దతతు ఇస్తున్నారు. అయితే వారందరూ శాశ్వతంగా వాటితోనే వుండిపోతారనుకుంటే భ్రమే. ‘జెఎన్‌యులో ప్రస్తుత సంఘటన, మనుస్మృతిపై పార్టీలో కొనసాగుతున్న దీర్ఘకాల విబేధాలతో పాటు రోహిత్‌ వేముల ఘటన.ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విశ్వవిద్యాలయంలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాలు దురదృష్టకరం.అవి గుండెలు పగిలేలా వున్నాయి.వాటికి కారణమైన వారిని చట్టప్రకారం తప్పనిసరిగా శిక్షించాల్సిందే……విద్యార్ధి లోకంపై అణచివేతకు దిగిన ప్రభుత్వానికి మేం బాకాలుగా వుండలేం. ప్రభుత్వానికి చెందిన ఓపి శర్మ వంటి శాసనసభ్యుడు పాటియాలా కోర్టులో గానీ, జెఎన్‌యు వుత్తర గేటు వద్దగానీ చేసిన దాడులు మితవాద ఫాసిస్టు చర్యకు నిదర్శనం…..’ అని నిరసన తెలిపిన ఏబివిపి విద్యార్ధి నాయకులు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ముగ్గురే కావచ్చు కానీ వారి ప్రకటన సంఘపరివార్‌కు తగలరాని చోట తగిలిన దెబ్బ.

     ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ పోలీసులు కొన్ని టీవీ ఛానల్స్‌ తప్పుడు వార్తల ఆధారంగా తప్పుడు కేసులతో 1975 నాటి అత్యవసర పరిస్థితి మాదిరి వ్యవహరించటం, సంఘపరివార్‌ శక్తులు పాటియాలో కోర్టులో విద్యార్ధులు, జర్నలిస్టులపై అమానుషంగా దాడి చేసినా, సుప్రీంకోర్టు స్పందించినా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు. గతంలో కూడా పలు వుదంతాలలో ప్రధాని బిజెపికి జరిగే నష్ట నివారణ చర్యలలో భాగంగా నోరు విప్పారే తప్ప సకాలంలో ఎన్నడూ స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బిజెపి నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరుతో ప్రతిష్టను కోల్పోయిన బిజెపిని ఇప్పుడు జెఎన్‌యు వుదంతాలు మరింతగా దెబ్బతీశాయి. అయినా ఎదురుదాడులతో జనం నోరు మూయించాలని చూస్తున్నారు. తమ ప్రభుత్వ చర్యను తాము సమర్ధించుకొనే ధైర్యం లేక తమ కనుసన్నలలో మెలిగే మాజీ సైనికులను ఢిల్లీ వీధులలో ప్రదర్శనలు చేయించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు మరిన్ని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు, పార్లమెంట్‌ సమావేశాలలో ఎదురుదాడికి దిగేందుకు బిజెపి నిర్ణయించినట్లుగా ఒడిషాలో మోడీ ఆరోపణలు వున్నాయి. కొన్ని స్వచ్చంద సంస్ధలకు విదేశీ నిధులు వస్తున్నాయని తమ ప్రభుత్వం దానిని తప్పుపట్టకపోయినా లెక్కల్ని అడగటం ప్రారంభించేసరికి వారంతా కలసి మోడీని కొట్టండి, మోడీని కొట్టండి అని నినదిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.

     స్వచ్చంద సంస్ధలకు విదేశాల నుంచి వస్తున్న నిధుల గురించి ఒక శ్వేత పత్రం సమర్పించటానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలూ వున్నాయి. అసలెన్ని సంస్ధలున్నాయి, వాటికి ఎంతెంత నిధులు వస్తున్నాయి? వాటికి లెక్కలు చెప్పమని ఎన్నింటిని కేంద్రం అడిగిందీ, ఎన్ని జవాబిచ్చాయి. ఏవేవి ప్రధానిని కొట్టమని చెబుతున్నాయో ప్రకటిస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి. నిధులు రావటాన్ని తప్పు పట్టవద్దని అసలు ఎవరు అడిగారు, అడిగితే వూరుకుంటారా ? ఇరవై నెలలు గడిచినా ఏ చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? ఇప్పుడెందుకు తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని చీకట్లో బాణాలు వేస్తున్నట్లు ? ఇంత పెద్ద దేశంలో లెక్కలు చెప్పని కొన్ని స్వచ్చంద సంస్ధలు కుట్రలు చేస్తే పడిపోయేంత బలహీనంగా మోడీ సర్కార్‌ వుందా ? ఒక బూచిని చూపి ప్రజల దృష్టిని మళ్లించటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.

      ఆర్ధిక, పాలనా రంగాలలో తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి రానున్న పార్లమెంట్‌ సమావేశాలలో తప్పించుకోవాలని చూస్తున్నది.ఒకవేళ నిజంగా అదే జరిగితే దీనిలో కూడా బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయం. జనసంఘం నుంచి జనతా తరువాత భారతీయ జనతా ఏ పేరు పెట్టినా అది సంఘపరివార్‌ రాజకీయ ప్రతినిధిగానే పని చేసింది. జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో హిట్లర్‌,ముస్సోలినీ వంటి ఫాసిస్టులు కూడా జాతీయ వాదం పేరుతో జనాన్ని రెచ్చగొట్టారు.జాతీయోద్యమాలు పరాయిపాలకులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా వుద్యమాలు. అవి దేశ స్వాతంతంత్య్రాలకు దారితీశాయి. కానీ నియంతల జాతీయ వాదాలు ప్రభుత్వ వ్యతిరేకుల అణచివేతలకు, ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. హిట్లర్‌ తన జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీపై రుద్దిన ఒప్పందాలతో పాటు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. అందుకే ఈనాడు ఐరోపాలో ఎవరైనా జాతీయవాదాన్ని ముందుకు తెస్తే దానిని ఫాసిజంగా భావించి జనం ఛీకొడుతున్నారు. ఐరోపాలో జాతీయ వాదం అంటే బూతుపదం కన్నా నీచంగా చూస్తారు. దేశంలో వువ్వెత్తున జాతీయోద్యమం జరిగినపుడు సంఘపరివార్‌ శక్తులు దూరంగా లేదా వ్యతిరేకంగా, చివరికి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపాయి. అందుకు సావర్కర్‌ లేఖ తిరుగులేని నిదర్శనం. ఇప్పుడు జాతీయ వాదం పేరుతో ఎక్కడలేని దేశభక్తిని తామే కలిగి వున్నట్లు ఫోజు పెడుతున్నాయి.ఈ జాతీయ వాదం ఏ వలస దేశానికి వ్యతిరేకం? సంఘపరివార్‌ ఆదిపురుషులు జాతీయవాదం ఏమిటంటే హిందూయిజమే జాతీయ వాదం,జాతీయ వాదమంటే హిందూయిజం అని ఎప్పుడో నిర్ధారించారు. హిట్లర్‌ యూదు , కమ్యూనిస్టు వ్యతిరేకత మాదిరి భారత్‌లో ఇస్లాం, క్రైస్తవ, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ పరివార్‌ పూనుకుంది. అందువలన ఏది సిసలైన జాతీయత? ఇప్పుడు కావాల్సింది ఏమిటి అనే చర్చ జరగటం అనివార్యం, ఆరోగ్యకరం కూడా. ఎవరి రంగు ఏమిటో తెలిసి పోతుంది.ముస్లింలను వ్యతిరేకించటం, పాకిస్తాన్‌ను తిట్టిన వారే జాతీయ వాదులుగానూ కానటువంటి మిగతా వారందరినీ జాతి వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తున్నారు. అందువల్లనే కమ్యూనిస్టులు కానటువంటి రాజదీప్‌ సర్దేశాయ్‌, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులు తాము జాతీయ వాదులం కామని స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మీడియాలో జాతీయత, బిజెపి కుహనా జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.

      మీడియాలో సంఘపరివార్‌కు తోడ్పడే శక్తుల బండారం గూడా ఈ సందర్బంగా బయట పడింది. తాము నిష్పాక్షికం అని చెప్పుకున్నంత మాత్రాన ఆచరణలో అలా వుండరని అనేక ఛానళ్లు, పత్రికలు జెఎన్‌యు వంటి వుదంతాల సందర్భంగా తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాయి. స్థూలంగా కాషాయపరివార్‌ జాతీయ వాదాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా రెచ్చగొట్టే శక్తులు, బిజెపి జాతీయవాదాన్ని అంగీకరించకుండా వాస్తవాలను, వాస్తవాలుగా పాఠకులు ముందుంచే వారిగా రెండు శిబిరాలుగా చీలిపోయాయి. రానున్న రోజులలో ఇది మరింత స్పష్టం కానుంది.సంఘపరివార్‌ చర్యలు,అజెండాతో మీడియాలో ఇంకే మాత్రం కాషాయ పులులు మేకతోళ్లు కప్పుకొని వుండలేని పరిస్ధితి.తమ ఛానల్‌ జెఎన్‌యు వుదంతంలో వ్యవహరించిన తీరును నిరసిస్తూ జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ రాజీనామా చేయటం మీడియాలోని పరిస్ధితికి దర్పణం.వార్తలపై ఎవరైనా ఎటువంటి అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు. కానీ వృత్తికే కళంకం తెచ్చేలా వీడియోలను తారు మారు చేయటం దుర్మార్గం. పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని కొందరు జెఎన్‌యు విద్యార్ధులు నినదించినట్లు చూపిన వీడియోలో మార్పులు జరిగాయి.దురభిమానాల కారణంగా భారతీయ కోర్టు జిందా బాద్‌ అన్న నినాదం కాస్తా పాకిస్తాన్‌ జిందాబాద్‌గా మారిపోయిందని విశ్వదీపక్‌ పేర్కొన్నారు.ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా కొందరి జీవితాలు, వారి ఆశలు, కుటుంబాలను ప్రమాదపుటంచులలోకి నెట్టారని ఆయన వాపోయారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులా లేక కిరాయి హంతకులా అనే అభిప్రాయం ఎవరికైనా కలిగితే అసలు మనం జర్నలిస్టులమేనా అన్న ఆశ్చర్యానికి తాను లోనుకావటం ప్రారంభమైందని కూడా ఆవేదన చెందారు. ‘ హింసాకాండను రెచ్చగొట్టటానికి, మరియు జనాన్ని దేశద్రోహులు, లేదా జాతి వ్యతిరేకులు అని పిలవటానికి ,మాట్లాడటానికి గాక బెదిరించటానికి మనం టీవీని అనుమతించాలా అని ఎన్‌డిటివి చెందిన రవీష్‌ కుమార్‌ ప్రశ్నిస్తున్నారు. పాటియాల కోర్టుల భవనం వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా కొందరు జర్నలిస్టులు ప్రదర్శన చేస్తే దానికి సంబంధించిన వార్తల విషయంలో అత్యవసర పరిస్ధితి నాటి స్పందన కనిపించింది. ఆరోజులలో కొన్ని మీడియా సంస్ధలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కొన్ని అనుకూలబాకాలుగా వ్యవహరించాయి. అనేక మంది జర్నలిస్టులు దేశానికి విధేయులుగా వుండాలా ఒక రాజకీయ వైఖరి, వ్యవస్దకు విధేయులుగా వుండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. కొన్ని యాజమాన్యాల కారణంగా జర్నలిస్టులు కూడా ఏ సంస్ధలో వుంటే అది అభిమానించే పార్టీల ప్రతినిధుల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎటు అన్నది తేల్చుకొనే విధంగా సంఘపరివార్‌ ఎగదోస్తున్నది. ఆ విభజన తమకు లాభం అనుకుంటున్నది. జర్మనీ, ఫాసిస్టు హిట్లర్‌ పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరైనా మూర్ఖంగా, మొరటుగా నిప్పును చేత్తో పట్టుకుంటామంటే చేసేదేముంది, పట్టుకొని చూడమని చెప్పటమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d